పుస్తకం
All about booksపుస్తకభాష

August 1, 2009

అందరినీ ఆకట్టుకునే కళ

Written by: తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
Tags:

How to win friends and influence people అనే పుస్తకం గుఱించి విననివాళ్ళుండరుcarnegies1. కీ.శే.డేల్ కార్నెగీ యొక్క బంగారుపాళీ నుంచి జాలువాఱిన ఆ ఉద్గ్రంథం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందిని ప్రభావితం చేసింది, బహుశా వారి వ్యాపారాల్నీ, జీవితాల్ని కూడా ! ఈ గ్రంథాన్ని ఇటీవల ఆర్. శాంతాసుందరిగారు “అందరినీ ఆకట్టుకునే కళ” పేరుతో తెలుగులోకి అనువదించగా సైమన్ & షస్టర్ ఇన్క్.(అమెరికా) వారి అనుమతితో న్యూఢిల్లీకి చెందిన మంజుల్ పబ్లిషింగ్ హౌస్ వారు ప్రచురించారు. అయితే ఇప్పటిదాకా ఈ పుస్తకం గుఱించి కర్ణాకర్ణీగా వినడం మాత్రమే చేసినవారు కూడా చాలామంది ఉంటారు. అటువంటివారు ఈ కాలంలో కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్న వ్యక్తిత్వ వికాసగ్రంథాల వంటిదే ఇది కూడా అని అపోహపడే అవకాశం జాస్తి. “How to win…” అలాంటి పుస్తకాల శ్రేణికి బాటలు వేసిన ఆదిగ్రంథం. కానీ దాని ఆశయం పూర్తిగా అలాంటిది కాదు. అది ఈనాటి పుస్తకమూ కాదు. రెండో ప్రపంచయుద్ధం కంటే ముందు రచించబడింది. ఈ పుస్తకం ప్రసిద్ధిలోకి రాకముందు రెండు ప్రపంచయుద్ధాలు జఱిగాయంటే బహుశా సహజమే. కానీ ఇది వెలుగులోకి వచ్చి ప్రపంచపు నలుమూలలా చొచ్చుకుపోయాక – అంటే గత 64 సంవత్సరాలుగా మూడో ప్రపంచయుద్ధం లాంటివేవీ జఱగలేదంటే అందులో “How to win…” కి తప్పసరిగా ఒక పాత్ర ఉందనుకోవడంలో అతిశయోక్తి లేదేమో ! అంతకుముందు అలాంటి పుస్తకాలే ఉండేవి కావు. అసలది ఒక చర్చాస్పదమైన ప్రస్తావన అని అంతకుముందెవరూ అనుకొని ఉండలేదు కూడా.

నిజానికి ఇది పుస్తకంగా ప్రారంభించబడింది కూడా కాదట. అంతిమంగా ఒక పుస్తకరూపాన్ని సంతరించుకొని వెలువడిందంతే ! రచయిత డేల్ కార్నెగీ మాటల్లోనే చెప్పాలంటే – “నేను 1912 నుంచి న్యూయార్క్ లో వ్యాపారవృత్తిరంగాల్లో పనిచేసే మగవారి కోసం, ఆడవాళ్ళ కోసం కొన్ని కోర్సులు నడుపుతున్నాను. మొదట్లో నేను బహిరంగ ఉపన్యాసాలివ్వటం (public speaking) లో మాత్రమే కోర్సులు నడిపేవాణ్ణి….కానీ క్రమక్రమంగా… రోజువారీ జీవితంలోను, సాంఘిక సంబంధాల్లోను ఎదుటివారితో ఎలా వ్యవహరించాలనే నేర్పు కూడా వాళ్ళకి శిక్షణ ద్వారా అందజేయటం ఎంతో అవసరమని నేను గ్రహించాను. అంతేకాదు ఈ క్రమంలో నాకు కూడా ఇటువంటి శిక్షణ అవసరమని నేను అర్థం చేసుకున్నాను…మానవసంబంధాలని అర్థం చేసుకునేందుకు పనికివచ్చే పుస్తకం కోసం నేను ఎన్నో ఏళ్ళుగా వెతుకుతున్నాను. అలాంటి పుస్తకం ఏదీ లేనందువల్ల…ఒకటి రాయటానికి నేనే స్వయంగా ప్రయత్నించాను….సంగ్రహించిన సమాచారాన్నంతా అధ్యయనం చేసి ఒక చిన్న ఉపన్యాసం తయారుచేశాను. దానికి How to win friends and influence people అని పేరుపెట్టాను… ఉపన్యాసం ఇచ్చాక శ్రోతలని నేను చెప్పిన సిద్ధాంతాలని వాళ్ళ జీవితంలోను, సాంఘిక సంబంధాలలోను అమలుచేసి చూడమని మఱీమఱీ చెప్పాను….ఈ పుస్తకాన్ని మామూలుగా పుస్తకాలు రాసే పద్ధతిలో నేను రాయలేదు. ఒక పసివాడు పెద్దవాడుగా ఎదిగిన రీతిలో క్రమక్రమంగా పెఱిగింది….కొన్నివేలమంది వయోజనుల అనుభవాలే దీని మూలం.”

ఇంతకీ How to win…లో ఏముంది ? ఎక్కువమంది ఆశిస్తున్నట్లుగా ఇదొక పచ్చిలౌక్యాన్ని బోధించే కుటిల చాణక్యగ్రంథం కాదు. ఇది నిజమైన, నిజాయితీ గలిగిన, సహానుభూతితో కూడుకొన్న సహజీవనం కోసం మఱీమఱీ తపించే రచన. అయితే రచయిత కేవలం నీతులు చెప్పలేదు. తనకున్న వేలాదిమంది విద్యార్థుల జీవితాల్లో తన సూత్రాలు తెచ్చిన సానుకూల మార్పుని చక్కని, చిక్కని హత్తుకునేలాంటి శైలిలో సోదాహరణంగా వర్ణించాడు. “ఇతరుల్ని విమర్శించకండి, నిందించకండి, వారిపై ఫిర్యాదు చెయ్యకండి” ఇది ఈ పుస్తకపు తొలి అధ్యాయంలోనే రచయిత చెప్పినది. “ఎటువంటి మూర్ఖుడైనా విమర్శించవచ్చు. నిందించవచ్చు. ఫిర్యాదు చేయవచ్చు. చాలామంది మూర్ఖులు చేసే పని అదే. కాని అర్థం చేసుకోవటానికి, క్షమించటానికి మంచి శీలం, ఆత్మనిగ్రహం ఉందాలి” అంటాడు రచయిత. అలాగే “ఇతరుల్ని మనస్ఫూర్తిగా నిజాయితీగా పొగడండి” అంటాడు రెండో అధ్యాయంలో ! “రోజువారీ జీవితంలో చిన్నచిన్న కృతజ్ఞతల్ని దారి పొడుగునా స్నేహభావంతో వదిలి పెడుతూ ఉండండి. అవి స్నేహమనే చిన్నచిన్న దీపాలని వెలిగించి, మీరు మళ్ళీ ఆ వ్యక్తుల్ని కలిసినప్పుడు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఆశ్చర్యపడేలా చేస్తాయి” అని హామీ ఇస్తాడు.

ఈ గ్రంథాన్ని రెండుమూడుసార్లు చదివాక కూడా ఎవరైనా తమ మానవసంబంధాల్ని మెఱుగుపఱచుకోవడంలో ఇంకా విఫలమవుతున్నారంటే మాత్రం అది ఎనిమిదో ప్రపంచవింతలా విస్తుపోవాల్సిన విషయమే అవుతుంది.

అందరినీ ఆకట్టుకునే కళ (How to win friends and influence people) : మూల ఆంగ్ల రచన – కీ.శే. డేల్ కార్నెగీ ; ఆంధ్రీకరణం – ఆర్. శాంతాసుందరి ; 290 పుటలు (క్రౌన్ సైజు) ; ప్రచురణ : మంజుల్ పబ్లిషింగ్ హౌస్ ప్రైవేట్ లిమిటెడ్, న్యూఢిల్లీ ; వెల : రు.150 ; లభ్యత : అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.About the Author(s)

తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం2 Comments


  1. నన్ను బాగా ప్రభావితం చేసి నా వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దిన పుస్తకం ఇది.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

తెలుగు సాహిత్య విమర్శలో ఖాళీలు

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ (యాకూబ్ ఆధునిక తెలుగు సాహిత్య విమర్శ పుస్తకానికి ముందుమాట) హ...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 

 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

“నల్లమల ఎర్రమల దారులలో… యాత్ర” పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************** ఒక రచన మరికొన్ని రచనలకి కారణమవుతుందని మనం వింటూం...
by అతిథి
0