The Lady Chatterly’s Lover: D. H. Lawrence

వ్యాసకర్త: చైతన్య
D. H. Lawrence…David Herbert Lawrence(1885-1930)…

ఈయన రచనలు నేను మా మామగారి లైబ్రరీలో చూస్తూ ఉండేవాడిని. ఆయన ఇంటికి వెళ్ళినప్పుడల్లా కొన్నేళ్లపాటు చూశాను. కానీ చదవలేదు. అప్రయత్నంగా చదవడం మొదలుపెడితే ఏమో గానీ, గొప్ప రచయితలు రాసిన రచనలు ప్రయత్నపూర్వకంగా చదవడానికి నేను సందేహిస్తాను. జంకుతాను. కారణం మరేమీ కాదు. గొప్ప రచనలు ప్రయత్నపూర్వకంగా చదవడానికి మానసికంగా నేను ఎంతో సిద్ధం కావాలి. అందుకు తగిన వాతావరణంతో సహా ఎన్నో అనుకూలించాలి. ముఖ్యంగా కొన్ని రోజులపాటు ఉద్యోగమూ, కుటుంబ బాధ్యతలూ వగైరా అన్నీ మరచిపోయి పుస్తక పఠనాన్ని ఒక తపస్సులా చేస్తూ నాలో నేను జీవించేందుకు కావలసినంత తీరిక ఉండాలి.

గొప్ప రచన చదవడం ఒక న్యూస్ పేపర్ చదవడం, కాలక్షేపం సాహిత్యం చదవడం లాంటిది కాదు. నూరేళ్ళ జీవితాన్ని కొన్ని రోజుల్లో అనుభవించడం. నూరేళ్ళ జీవితాన్ని కొన్ని రోజుల్లో అనుభవించడానికి ఎన్ని వందలు, వేల నిమిషాల తీరిక ఉండాలి?

మా మామగారు చనిపోయిన తర్వాత ఆయన లైబ్రరీలో పుస్తకాలు కొన్ని నా లైబ్రరీకి చేరాయి. వాటిలో డి. హెచ్. లారెన్స్ పుస్తకాలు కూడా ఉన్నాయి. అది కూడా కొన్నేళ్లయింది.

దూరప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం నేను తప్పనిసరిగా కొన్ని పుస్తకాలు తీసుకుని వెడతాను. కొన్ని గంటలపాటు ప్రయాణం చేయడంలో ఉండే విసుగును జయించడం అనే కారణం ఎలాగూ ఉంటుంది. అంతకంటే ముఖ్య కారణం, ప్రయాణాలు నాలో నేను జీవించడానికి, పుస్తక పఠనాన్ని అనుభవించడానికి కావలసిన తీరికను, వాతావరణాన్ని ఇస్తాయి. ప్రయాణాలలోనే కాక, మూడు నాలుగురోజులు పూర్తిగా తీరికగా గడిపే అవకాశం ఎప్పుడొచ్చినా నా వెంట పుస్తకాలు ఉండి తీరతాయి. ప్రయాణాలు చేసేటప్పుడు తీసుకు వెళ్లవలసిన పుస్తకాల ఎంపిక నాకు ఓ సమస్యగా తయారవుతుంది. సమయం తీసుకుంటూ ఉంటుంది. నా ఉద్దేశంలో ఒక రచన చేయడం ఎంతో, ఒక గొప్ప రచన చదవడం కూడా అంతే!

ఈమధ్య దూరప్రయాణం చేయబోతూ పుస్తకాల వేటలో పడ్డాను. డి. హెచ్. లారెన్స్ రాసిన రెండు పుస్తకాల మీద నా దృష్టి పడింది. 1. The Lady Chatterly’s Lover(Second Version) 2. Sons and Lovers. వాటిని తీసుకున్నాను. ఎంతో కాలంగా నా చేతికి అందేటంత దగ్గరలోనే ఉన్న పుస్తకాలను మొదటిసారి చదవడం ప్రారంభించినప్పుడు నాకు వింతగా అనిపిస్తూ ఉంటుంది. ఆ పుస్తకం మనకు పరిచితంగా ఉంటుంది. అందులోని విషయం అపరిచితంగా ఉంటుంది. మన చేతికి అందే దూరంలో మన చుట్టూ మనకు తెలియని ఎన్ని అద్భుత ప్రపంచాలు, జీవితాలు ఉన్నాయో తెలిసినప్పుడు కలిగే ఒక వింత అనుభూతి అది.

‘ది లేడీ చాటర్లీస్ లవర్’ చదువుతూ ఉన్నప్పుడు అది చదవడంలో నేను చేసిన ఆలస్యం ఒక జీవిత కాలం ఆలస్యం అనిపించింది. బహుశా సాహిత్యపరంగా నేను చాలా నష్టపోయాననిపించింది. నేను ఎప్పుడో అది చదివి ఉంటే లారెన్స్ రచనలు అన్నీ వరసపెట్టి చదివేసి ఉండేవాడిని. లారెన్స్ నాకు అత్యంత ఆరాధ్య రచయిత అయ్యుండేవాడేమో కూడా. లారెన్స్ మీద నేను ఎంతో రాసి ఉండేవాడినేమో. బహుశా నా సాహిత్యజీవితం అప్పుడు చాలా భిన్నంగా ఉండేదేమో. కానీ చాలా ఆలశ్యమైపోయింది. మిగిలి ఉన్న నా జీవితం చాలదు.

లారెన్స్ తన జీవితకాలంలో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించాడు. ప్రతి ఆనందాన్నీ ప్రతి అనుభూతినీ లక్షల అక్షరాలుగా మార్చి అందించాడు. వాటిని చదవడానికి తీరిక లేకపోవడం ఎంత శాపం?

‘లేడీ చాటర్లీస్ లవర్’ చదవడం ప్రారంభించే ముందు రచయిత పరిచయం చదివాను. లారెన్స్ 44 ఏళ్ళు మాత్రమే జీవించాడు. పుస్తకం చదువుతున్నప్పుడు ఈ సంగతి నాకు మాటి మాటికీ గుర్తు రావడం ప్రారంభించింది. గుర్తొచ్చినప్పుడల్లా ఆశ్చర్యం కలుగుతూ వచ్చింది. 44 ఏళ్ళు మాత్రమే భౌతికంగా జీవించిన లారెన్స్ మానసికంగా ఆత్మికంగా నిండు నూరేళ్ళు కాదు, వెయ్యేళ్లు జీవించాడనిపించింది. అతను ‘జీవితం’ గురించి ఈ రచనలో చాలా రాశాడు. జీవించడంలో ఉండే ఆనందాన్ని తనివితీరా రాశాడు. కానీ అతని జీవిత కాలం 44 ఏళ్ళు మాత్రమే. ఎంత విచిత్రం! నేటి ప్రమాణాలతో చూసినప్పుడు అంత తక్కువ జీవితంలోనే ఎంతో రాసిన లారెన్స్ ఇంకో 40 ఏళ్ళు జీవిస్తే ఇంకెంత రాసి ఉండేవాడో! బహుశా రాసి ఉండేవాడు కాదేమో కూడా. నూరేళ్ళ జీవిత కాలానికి సరిపోయేంత అప్పటికే అతను రాసేశాడు.

‘లేడీ చాటర్లీస్ లవర్’ లో నాలుగక్షరాల (ఇంగ్లీష్ లో)మాటతో సహా సెక్స్ చాలా ఉన్నట్టు నాకు ముందే తెలుసు. ఈ పుస్తకాన్ని ఇంగ్లండ్ లో నిషేధించారని కూడా విన్నాను. పుస్తకం చదివాక దాని గురించి వివరాలు చూశాను. ముందుగా ఈ పుస్తకం లారెన్స్ స్వదేశమైన ఇంగ్లండ్ లో కాకుండా 1928లో ఇటలీలో రహస్యంగా ప్రచురితమైంది. 30 ఏళ్ల తర్వాత మాత్రమే ఇంగ్లండ్, అమెరికన్ పాఠకులకు అందింది. పెంగ్విన్ ఈ రచన ప్రచురించగానే ఇంగ్లండులో దానిని నిషేధించారు. పెంగ్విన్ ఆ నిషేధాన్ని సవాలు చేసింది. విచారణ జరిగింది. 1960లో కోర్టు నిషేధాన్ని కొట్టి వేసింది. కొట్టి వేసిన తర్వాత పదిహేను రోజుల్లో రెండు లక్షల కాపీలు అమ్ముడు పోయాయి. ఈ పుస్తకం కొనుక్కోడానికి బుక్ స్టాల్స్ దగ్గర జనం బారులు తీరారు. లారెన్స్ పుస్తకంపై నిషేధం ఎత్తివేయడం సాహిత్య చరిత్రలో ఒక గొప్ప మలుపుగా అభివర్ణించారు.

ప్రపంచ సాహిత్యంలో లారెన్స్ స్థానం ఏమిటో, ఆయన కాంట్రిబ్యూషన్ ఏమిటో చెప్పగలిగినంత అధ్యయనం నాకు లేదు. లారెన్స్ రచనలు రెండు చదివిన తర్వాత మొదటిసారి నేనొక నిర్ణయం తీసుకున్నాను. నేను ఆనందించిన రచనల్లోని కథను చెప్పకూడదనే ఆ నిర్ణయం. మొదటిసారి ఆ రచనలను చదివే పాఠకుల కుతూహలానికి అన్యాయం చేసే హక్కు నాకు లేదు. అయితే, ప్రతి రచన విషయం లోనూ ఈ సూత్రాన్ని పాటించడం ఎంతవరకు సాధ్యమవుతుందో నేను ఇప్పుడే చెప్పలేను.

లారెన్స్ రచనలు చదవనప్పుడు ఆయన సెక్స్ గురించి రాశాడని స్థూలంగా అందరూ అనుకుంటారు. సెక్స్ ను నిషిద్ధ వస్తువుగా భావిస్తాం కనుక సెక్స్ గురించి రాసిన సంగతే మన దృష్టిలో ప్రముఖంగా ఉండిపోతుంది కాబోలు. కానీ లారెన్స్ భావవ్యాప్తి చాలా విస్తృతమైనది. అందులో ప్రాపంచికమైనవి అన్నీ ఉంటాయి. ఉదాహరణకు యుద్ధాలు, రాజకీయ సిద్ధాంతాలు, వ్యాపారాలు, పరిశ్రమలు, పారిశ్రామికీకరణ, మానవ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, డబ్బు మొదలైనవి. ప్రపంచంలోనూ మనుషుల మధ్యా ఉన్నట్టు కనిపిస్తూనే లారెన్స్ ప్రపంచాన్ని ప్రకృతి కింద, మనుషుల్ని స్త్రీ-పురుషుల కింద సంక్షేపించి ప్రపంచ, ప్రకృతులు రెండింటినీ సమాంతరంగా నడిపిస్తాడు. బాహ్య, ఆంతరిక లోకాలను కూడా అంతే సమాంతరంగా ప్రదర్శిస్తాడు. లారెన్స్ రచన చదువుతున్నప్పుడు; ప్రకృతిలో భాగంగా జీవించడం మీదా, జీవించడాన్ని ప్రేమించడం మీదా అంత ఇంటెన్సిటీని, అంత దాహాన్ని చూపించిన రచయితలు మరొకరు నాకు వెంటనే తట్టలేదు. మనిషిలోని సుసూక్ష్మ స్పందనలను అంత గొప్పగా వ్యక్తీకరించిన రచయితలు కూడా స్ఫురించలేదు. అయితే నేను చదివిన రచయితలూ పెద్ద సంఖ్యలో ఏమీలేరు.

44 ఏళ్ళు మాత్రమే జీవించిన ఈ రచయిత తన జీవితంలోని ప్రతిక్షణాన్ని, ప్రతి అనుభవాన్ని ఒక పువ్వును హృదయానికి హత్తుకున్నట్టుగా హత్తుకున్నాడు. ఒక నిరంతర సజీవ జీవన ప్రవాహం ఇతడు.

‘లేడీ చాటర్లీస్ లవర్’ చదువుతూ అలవాటుగా నేను గుర్తుపెట్టుకున్న వాక్యాలను కొన్నింటిని ఇక్కడ యథాతథంగా ఇస్తాను. అనువాదం ఇచ్చే పని పెట్టుకోలేదు.

“Life! They talked about life! But what was life, except experiencing the beautiful experience of works of art, or works of nature, or acquiring the never-ending gleaming bits of knowledge that came to one? What was life, besides that?”
…….
“I consider society the most dangerous madman alive. The mass is much more insane than the individual, though he’s bad enough.”
…….
“A flow of life, and contact! We’ve never had proper human contact- we’ve never been civilized enough. We’re not civilized enough even now, to be able to touch one another. We start away, like suspicious hairy animals. The next civilization will be based on the inspiration of touch; believe me.”
……….
“There will be a civilization based on the mystery of touch, and all that means; a field of consciousness which hasn’t yet opened into existence. We’re too much afraid of it-oh, stiff as wood, with fear! We paw things- but probably we’ve never truly touched anybody in all our lives, nor any living thing. –Oh, there’ll be a democracy- the democracy of touch.”
……….
“And perhaps they would never ascend really into life…They lived and walked and spoke, but theirs was still the old, tortured body that could not be touched.
There was no hope, in them, of a new body: that did not wince with the memory of death. And between the old bodies, there was no possibility of contact…The new body could not touch the old.”
……….
‘He was gradually coming to the old position, of those who did not believe in the resurrection of the body. He talked a great deal about immortality. The subject obsessed him. But it was the immortality of the spirit he insisted on. The resurrection of the body- the bodies of living men, even if not one’s own private body- this did not interest him. It was the private and egoistic resurrection of his own spirit, into the ideal eternity, that obsessed him.”

నేను గుర్తు పెట్టుకున్న వాక్యాలు ఇంకా ఎన్నో ఉన్నా మొదటిసారి చదివే పాఠకులను దృష్టిలో పెట్టుకుని ఇక్కడితో ఆపేస్తాను.

జీవితంతో, జీవించడంతో, ప్రకృతితో లారెన్స్ పొందిన తాదాత్మ్యం, తన్మయత్వం ఇంకా అనేక చోట్ల ఆశ్చర్యకరంగా అభివ్యక్తమవుతుంది. అది, మనకు బాగా తెలిసిన భక్తి సంప్రదాయంలో, భక్తుడు భగవంతునితో పొందే తాదాత్మ్యం లాంటిది. అంతకన్నా ఆశ్చర్యచకితం చేసేది, లారెన్స్ తాత్విక వైశాల్యం. లేడీ చాటర్లీస్ లవర్ లో అతను అమరత్వం గురించి, ఆత్మ గురించి చెప్పే సాంప్రదాయిక తాత్వికతను నిరాకరిస్తాడు. అమరత్వం స్థానంలో ఇహలోకంలో సంపూర్ణంగా సజీవంగా జీవించడాన్ని; ఆత్మ స్థానంలో దేహాన్ని ప్రతిష్టిస్తాడు. అక్షరాలా ఆత్మ-దేహాల ప్రాధాన్యాన్ని తలకిందులు చేస్తాడు. తన దేహ సిద్ధాంతాన్ని ఆత్మ సిద్ధాంతానికి పోటీ సిద్ధాంతంగా, ఒక సంపూర్ణ తాత్విక ప్రతిపాదనగా ముందుకు తెస్తాడు.

లారెన్స్ తాత్విక వైశాల్యంలో భారతీయ తాత్వికత, ముఖ్యంగా అద్వైత తాత్వికత కూడా పరోక్షంగా చర్చకు రావడం ఆశ్చర్యం కలిగించే మరో విషయం. అతను దేహ ప్రాధాన్యాన్ని ప్రతిపాదించడం ద్వారా భారతీయ అద్వైత తాత్వికతలో ఉన్న ఆత్మ ప్రాధాన్యాన్ని కూడా నిరాకరిస్తాడు. నాకు ఆత్మ, అమరత్వాలకు చెందిన తాత్విక సిద్ధాంతాలతో అంత లోతైన పరిచయం ఉందని చెప్పలేను కానీ, నాకు అర్థమైనంతవరకు పరమార్థ సత్యం, వ్యవహారసత్యం అనే రెండు సత్యాలను గుర్తించడం అద్వైత సిద్ధాంతంలో ఒక భాగం. పరమార్థ సత్యాన్ని, దానితోపాటు పరలోకాన్ని ఎప్పుడైతే గుర్తిస్తామో; అప్పుడు వ్యవహారసత్యానికి ఉనికి ఉండదు. అది రద్దైపోతుంది. అయితే, మనకు ఇహలోకమూ, దేహమూ ఉన్నాయి కనుక దానిని పూర్తిగా రద్దు చేయడమూ కుదరదు. ఈ విధంగా పరమార్థ సత్యం గురించిన స్పృహలో ఉన్నప్పుడు వ్యవహారసత్యంతో; వ్యవహారసత్యం గురించిన స్పృహలో ఉన్నప్పుడు పరమార్థ సత్యంతో సంబంధం తెగిపోతుంది. ఈ రెండు సత్యాల మధ్యలో అయోమయానికి, బహుశా ఆత్మవంచనకు, పరవంచనకు కావలసినంత ప్రదేశం ఉంది. అది ఒక సిద్ధాంతంగా అద్వైతసిద్ధాంతం తప్పు కాకపోవచ్చు. కానీ ఆచరణలో అది అలాంటి ఫలితానికి దారి తీయచ్చు.

లేడీ చాటర్లీస్ లవర్ నుంచి పైన పేర్కొన్న వాక్యాలలో చివరిది, క్లిఫర్డ్ అనే పాత్ర గురించి చెబుతోంది. అతనే లేడీ చాటర్లీ భర్త. అతను సంపన్న అరిస్టోక్రాట్ కుటుంబానికి చెందినవాడు. గనుల యజమాని. వ్యవహార సత్యం నుంచి చెప్పుకుంటే, అతను కులీన వ్యవస్థను పూర్తిగా సమర్థించే వ్యక్తి. ఆ వ్యవస్థలో ఉండే ఆధిక్యతాభావమూ, ఆభిజాత్యమూ పూర్తిగా మూర్తీభవించినవాడు. యజమాని-సేవక సంబంధాలను పూర్తిగా పాటించేవాడు. అతను తన యాజమాన్యంలోని గనుల అభివృద్ధికి, లాభాలకూ పాటుపడుతూ ఉంటాడు కూడా. అదే సమయంలో పరమార్థ స్థాయిలో అమరత్వాన్ని, ఆత్మను నమ్ముతాడు. పారమార్థిక ప్రవర్తన, వ్యావహారిక ప్రవర్తన ఎలా వేర్వేరుగా ఉండిపోతాయో, రెండింటి మధ్యా లింకు ఎలా తెగిపోతుందో ఇతని ప్రవర్తన చెబుతుంది.

క్లిఫర్డ్ సైన్యంలో పనిచేశాడు. పెళ్ళైన తర్వాత, అతని నడుమునుంచి కింది భాగం చచ్చుబడిపోయింది. రెండేళ్ళు డాక్టర్ల చేతుల్లో ఉన్నాడు. తను బతుకుతాననుకోలేదు. కానీ బతికాడు! తను బతకడం అతనికి పెద్ద అద్భుతం, ఆశ్చర్యం. బతుకు మీద ఉండే తీపి అతనికి అప్పుడే అర్థమైంది. తను బతికి ఉన్నానన్న సంగతి గుర్తొచ్చినప్పుడల్లా అతను పులకించిపోయేవాడు. శరీరస్పృహ అతని మనస్సును పూర్తిగా ఆక్రమించుకుని శరీరపోషణకు అవసరమైన తిండి విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకునేవాడు. అది అతనికి శరీర పునరుజ్జీవన లేదా పునరుత్థాన దశ. అయితే కాలం గడిచిన కొద్దీ అతనికి ఆ జీవితం పట్ల విసుగుపుట్టడం మొదలైంది. తను బతికి ఉండడంలో ఉన్న పులకింత, బతికి ఉన్నానన్న స్పృహ అతనిలో అడుగంటడం ప్రారంభించింది. క్రమంగా అమరత్వం గురించి, ఆత్మ గురించి తన వెనకటి వైఖరిలోకి మళ్లిపోయాడు.

క్లిఫర్డ్ శరీరంలో కింది భాగం చచ్చుబడడంతో అతను దాంపత్యానికి పనికిరాకుండా పోయాడు. అంటే, అది అతని భార్యకు జీవన్మృతదశ. క్లిఫర్డ్ భౌతికంగా బతికాడు కానీ అతని భార్య మానసికంగా చచ్చిపోయింది. క్లిఫర్డ్ ఆత్మ, అమరత్వాల వైపు మళ్లుతున్న క్రమంలోనే భార్యలో శారీరక స్పృహ పెరుగుతూ వచ్చింది. ఆవిధంగా వారి దాంపత్యం ఆత్మ-దేహాల మధ్య; అమరత్వం-జీవించడాల మధ్య ఘర్షణగా పరిణమించింది.

జీవితం మీద విసుగుపుట్టిన నిరాసక్త స్థితిలో క్లిఫర్డ్ తన యాజమాన్యంలోని గనుల బాగోగులను పట్టించుకోవడం మానేశాడు. అంతలో అతనికి ఉపచర్యలు చేయడానికి కొత్తగా నియమితురాలైన ఒక నర్సు సాంగత్యం అతనిలో మళ్ళీ జీవనోత్సాహాన్ని నింపి గనుల బాగోగులను చూసుకోవడంతో సహా పూర్తిగా లౌకిక వ్యవహారాలవైపు మళ్లించింది. అతను లేచి నిలబడి ఇంకొకరి సాయంతో అడుగులు వేయగలిగే స్థితికి వచ్చాడు. జీవించడం, జీవింపజేయడం అనే మానవీయ స్పృహ మాత్రమే ఉన్న ఒక సాధారణ నర్సు అతనిలో తిరిగి శారీరక, లౌకిక స్పృహను నింపగలిగింది.

అలా అతనిది దేహమూ, ఆత్మల మధ్యా; పరమార్థసత్యమూ, వ్యవహార సత్యాల మధ్యా డోలాయమానస్థితి. అలాంటివారిని ఉద్దేశించే రచయత ఒక పాత్ర చేత ఇలా అనిపిస్తున్నాడు:

“And perhaps they would never ascend really into life…They lived and walked and spoke, but theirs was still the old, tortured body that could not be touched.
There was no hope, in them, of a new body: that did not wince with the memory of death. And between the old bodies, there was no possibility of contact…The new body could not touch the old.”

స్పర్శకు యోగ్యం కాని పాత, హింసిత శరీరం క్లిఫర్డ్. మృత్యువునే గుర్తుపెట్టుకుంటూ ఈలోకంలో మృతజీవులుగా గడిపే ఈ పాతదేహులనుంచి, మృత్యువుకు జంకకుండా ఈ లోకంలో సజీవంగా జీవించగల కొత్త దేహాలను పుట్టించడం కష్టమని ఆ పాత్ర అంటాడు. ఈ పాతదేహులకు, కొత్త దేహులకు మధ్య స్పర్శ కూడా అసాధ్యమని అంటాడు. నిగూఢమైన ఒక స్పర్శ మీద ఆధారపడిన సరికొత్త నాగరికత అవతరించాలనీ, ఇంతవరకు అస్తిత్వంలోకి తెరచుకోని ఒక చైతన్యక్షేత్రం ఏర్పడాలనీ లారెన్స్ ఆ పాత్రతో అనిపిస్తాడు. మనం ఆ పరిస్థితిని ఊహించుకుని విపరీతంగా భయపడతామనీ, భయంతో ఒక చెట్టులా బిగుసుకుపోతామనీ అంటాడతను. లారెన్స్ స్పర్శ సిద్ధాంతం ఆసక్తికరంగా ఉంటుంది. మన జీవిత కాలంలో మనం ఏ వస్తువునూ, ఏ సజీవ వస్తువునూ నిజంగా స్పర్శించమనీ, వస్తువులపై మనం పంజా విసురుతామనీ, వచ్చే నాగరికత స్పర్శనుంచి ఉత్తేజం పొందేది కావాలనీ, స్పర్శ ప్రజాస్వామ్యం ఏర్పడాలనీ అంటాడు.

లారెన్స్ అభివ్యక్తి అత్యంత సాంద్రంగా, మనిషి అస్తిత్వపు సుసూక్ష్మమైన లోతులనుంచి అనాయాసంగా ఉబికి వస్తున్నట్టు ఉంటుంది. అతని వాక్యాలు అసాధారణమైన జవసత్త్వాలను నింపుకుంటాయి. జీవితాన్ని గెలుచుకోవడానికి అస్తిమితంగా, అవిరామంగా, అంతులేని తమకంతో అతను జరిపిన పోరాటం అతని రచనల్లో కనిపిస్తుంది.

***
ప్రపంచ సాహిత్యంలో కానీ, ఆంగ్ల సాహిత్యంలో కానీ ఇప్పుడు లారెన్స్ కు ఎలాంటి స్థానం ఉందో, అనంతర రచయితలపై అతని ప్రభావం ఎలాంటిదో, అతని రచనలపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరుగుతోందో, ఈరోజున అతని ప్రాసంగికత(రెలెవెన్స్) ఏమిటో నేను పరిశీలించలేదు. కానీ లారెన్స్ రచనల వెలుగులో, ఇంచుమించు అతని కాలానికే చెందిన ఇద్దరు ప్రముఖ తెలుగు రచయితల గురించి చెప్పుకోవడం ఆసక్తికరంగా ఉంటుందనిపించింది. వారు, విశ్వనాథ సత్యనారాయణ, గుడిపాటి వెంకట చలం.

విశ్వనాథ సత్యనారాయణ(1895-1975) డి. హెచ్. లారెన్స్ కన్నా పదేళ్ళు చిన్న. గుడిపాటి వెంకటచలం(1894-1979) తొమ్మిదేళ్లు చిన్న. విశ్వనాథ, చలం రచనలతో ఎంతో కొంత పరిచయం, వారి తాత్వికతల గురించి స్థూలమైన అవగాహన ఉంది కానీ; అది లారెన్స్ ను చదవక ముందు సంగతి. లారెన్స్ వెలుగులో వారిని మరింత సమగ్రంగా చదవవలసిన అవసరం కనిపించింది. అది ముందు ముందు చేస్తానేమో చెప్పలేను. ఈ లోపల లారెన్స్ ను చదివిన నా అనుభూతిని వెంటనే రికార్డ్ చేయాలనే తహతహలో ఈ ఇద్దరు తెలుగు రచయితలనూ ఆయనతో పోల్చే ఈ ప్రయత్నాన్ని పైపైన మాత్రమే చేస్తున్నాను. ఇందులో అసమగ్రత కనిపిస్తే మన్నించమని కోరుతున్నాను.

స్థూలంగా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ దేహప్రాధాన్యవాది కాదు, ఆత్మ ప్రాధాన్యవాది. ఆవిధంగా అద్వైత సిద్ధాంత వాది కూడా. సామాజికంగా, వర్ణవ్యవస్థా సమర్థన రూపంలో అరిష్టోక్రసీని లేదా కులీనతను సమర్థించేవారుగా కనిపిస్తారు. లేడీ చాటర్లీస్ లవర్ నవలలో పైన చెప్పుకున్న క్లిఫర్డ్ అనే పాత్ర విశ్వనాథవారి భావజాలానికి దగ్గరగా ఉంటాడు. లారెన్స్ ఒక పాత్ర ద్వారా క్లిఫర్డ్ అభిప్రాయాలను ఖండింపజేస్తాడు. లారెన్స్ లానే విశ్వనాథ కూడా చాలా రచనలలో స్త్రీ-పురుష సంబంధాలను చర్చిస్తారు. అవి లారెన్స్ చర్చించిన స్త్రీ-పురుష సంబంధాలకు భిన్నంగా ఉండడం సహజమే. అయితే, ఇక్కడ ఒక విషయం చెప్పు కోవాలి. సన్స్ అండ్ లవర్స్ రచనలో లారెన్స్ కూడా విశ్వనాథవారు విశ్వసించే స్త్రీ-పురుష సంబంధాలకు దగ్గరగా వస్తాడు. తేడా ఏమిటంటే, ఆ రావడం అతను ప్రయోగాత్మకంగా వస్తాడు. ఆ రచన గురించి చెప్పుకునేటప్పుడు దాని గురించి మరింత వివరంగా చెప్పుకునే అవకాశం రావచ్చు.

విశ్వనాథవారు తన కాలం నాటి ఆంగ్ల సాహిత్యాన్ని చదివినవారే. ఆ విధంగా ఆయన లారెన్స్ ను కూడా చదివారేమో తెలియదు. చలం రచనలకు సమాధానంగా ఆయన వివిధ రచనలు చేశారనే అభిప్రాయం మాత్రం ఉంది. లారెన్స్-విశ్వనాథల గురించి ఈ నాలుగు మాటలూ చెప్పుకునేటప్పుడు బ్రిటిష్-భారతీయ సమాజాల స్థితిగతులు, వాటి మధ్య తేడాలు నా కళ్ళముందు కదులుతున్నాయి. లారెన్స్ కాలం నాటికి ఇంగ్లండులో పారిశ్రామికీకరణకు రెండు శతాబ్దాలకు పైబడిన గతం ఉంది. అంతటి గతం నుంచి, అనుభవం నుంచి లారెన్స్ పలుకుతున్నాడు. అతను కొత్త సృష్టి గురించి, నాగరికత గురించి, సరికొత్త చైతన్య క్షేత్రం గురించి కన్న కలలకు మూలాలు అన్నేళ్ళ లోతుల్లో ఉన్నాయి.

లారెన్స్ లో మరో రెండు ఆసక్తికరమైన కోణాలు ఉన్నాయి. మొదటిది, దేహ ప్రాధాన్యం గురించి చెప్పినా మనకు తెలిసిన మూస అర్థంలో అతడు నిరీశ్వరవాది కాదు. అలాగే, తను వ్యక్తి వాది అయినా సమూహాన్ని, శ్రామికవర్గ చైతన్యాన్ని సిద్ధాంతపరమైన విజిగీషదృష్టితో ఖండించినవాడు కూడా కాదు. అతను శ్రామికవర్గం గురించి ఇలా అంటాడు:

“The world was one vast proletariat. Everything else had gone. The true working class was gone, as much as the honorable bourgeoisie, or the proud aristocracy. Bolshevist or Fascist, the world was proletarian, a vast homogeneous proletariat made up the whole of the humanity.”
“She had held back from him with a certain grudge, because he was lower class. Now the barrier broke, and her soul flooded free. Class is anachronism. It finished in 1914. Nothing remains but a vast proletariat, including kings, aristocrats, squires, millionaires and working-people, men and women alike. And then a few individuals who have not been proletarianised.”

రష్యన్ విప్లవ ప్రభావాల నడి మధ్యలో ఉండి, దాని గురించి తన రచనలో చర్చిస్తున్నా లారెన్స్ దానిపట్ల ఒకవిధమైన తటస్థ వైఖరిని కనబరచడం చెప్పుకోదగిన విశేషం. కారణం ఒకటే కనిపిస్తుంది. అతను జీవించడాన్ని తన ఉన్నతోన్నత సిద్ధాంతంగా ముందుకు తెస్తున్నాడు. రాబోయే ప్రపంచం (రష్యన్ విప్లవ సందర్భంలో) మరింత భయంకరంగా ఉంటుందని అతను అంటూనే, క్లిఫర్డ్ లాంటి వాళ్ళు జీవించే ప్రపంచమూ భయానకమే నంటాడు. అయితే, రాబోయే మరింత భయానక ప్రపంచంలోనే మరింత జీవితం, అందులో మరింత ఉన్మత్త మోహం ఉండచ్చు నంటాడు. రూపం ఎంత ఉన్మత్తంగా ఉన్నాసరే, ఏకైక, శాశ్వత విజేత జీవితం మాత్రమే నంటాడు.:

“The world of the Cliffords and the Winters was doomed. Another, more awful world was coming. Yet perhaps the more awful world had more life, more weird passion in it; and life, no matter how weird the form, is the only eternal conqueror.”

లేడీ చాటర్లీతో ఈ కింది మాటలు అనిపించడంలో కూడా సిద్ధాంతాల పట్ల తటస్థభావం, జీవితం మీద మొగ్గు కనిపిస్తాయి:

“I can imagine a world where nobody cared terribly about money, or owning things, or bossing other people. Personally, I wouldn’t care a bit if the land and the mines and all those things belonged to everybody. I only want to live.”

భారతదేశానికి వస్తే, ఇంగ్లండు పారిశ్రామికీకరణ అనుభవాన్ని ఇక్కడ యథాతథంగా సూపర్ ఇంపోజ్ చేసే అవకాశం లేదు. ఇప్పటికీ భారతదేశం పూర్తిగా పారిశ్రామికం కాలేదు. ఫ్యూడలిజం విశ్వనాథ వారి రోజుల్లో మరింత బలంగానూ, ఇప్పుడు కొంత పలచబారీ ఉంటే ఉండచ్చు. ఈ దేశంలో పాశ్చాత్య ప్రపంచానికి భిన్నంగా ఆయా సిద్ధాంతాలు, లేదా ప్రాపంచిక దృక్పథాలు క్షేత్రస్థాయిలో ఎలాంటి క్రియారూపానికీ చేరకుండా శూన్యంలో వేలాడుతున్నాయి. సిద్ధాంతానికీ, ఆచరణకూ మధ్య పెద్ద శూన్యం నిండడం మన అనుభవం. అద్వైత సిద్ధాంతం ఒక ఉదాహరణగా పైన చెప్పుకున్నాం. కాకపోతే బాహ్య సిద్ధాంతాల గాలులు మన దేశంలోకి ప్రసరిస్తూ ఉండడం కొంత అలజడిని, అయోమయాన్ని, ఒక శూన్యస్థితిని రూపు కట్టి ఉండచ్చు. ఆవిధంగా విశ్వనాథవారు ఫ్యూడల్ సంబంధాలలో శాంతిని, విశ్రాంతిని వెతుక్కుని ఉండచ్చు. లారెన్స్ కన్నా విశ్వనాథ పదేళ్ళు చిన్న అయినా నూతన నాగరికత గురించి, సృష్టి గురించి లారెన్స్ లో ఉన్న తపన ఆయనలో లేకపోవడానికి ఈ ఇరువురి దేశాల స్థితిగతుల తేడాయే కారణం కావచ్చు.

లారెన్స్ కీ, విశ్వనాథకీ ఇంకో తేడా కూడా ఉంది. జీవించడాన్నే ఉన్నతోన్నత విలువగా నొక్కి చెబుతున్న లారెన్స్ సిద్ధాంతాలపట్ల తటస్థ వైఖరిని తీసుకుంటే, అందుకు భిన్నంగా విశ్వనాథ వామపక్షభావజాలం, నాస్తికత్వం మొదలైన వాటిపట్ల సిద్ధాంతపరంగా వ్యతిరేకవైఖరి తీసుకున్నారు.

ఇప్పుడు ఇంకొక పరిణామాన్ని కూడా చూస్తున్నాం. వామపక్షవాదులు అనే ‘పునరుద్ధరణవాదం’ అనే మాట తిట్టు పదంగా భావించి పక్కన పెట్టి చెప్పుకున్నా నేటి తరం విశ్వనాథను పునర్దర్శించడం కనిపిస్తోంది. కారణం ఈ దేశానికి గల ప్రత్యేకస్వభావమే కావచ్చు. ఇక్కడ ఏదీ క్రియారూపం చెందడం కష్టం. మనం ఒక వలయంలో పరిభ్రమిస్తూ బయలుదేరిన చోటికే మళ్ళీ మళ్ళీ వస్తుంటాం. ఇక్కడ కాలం సరళరేఖలో కాకుండా చక్రంలో పయనిస్తూ ఉంటుంది. సిద్ధాంతాలు విజయం సాధించడం ఇక్కడ కష్టం. ఇక్కడ సిద్ధాంతాలు ఎలాంటివంటే, పండుగరోజునో, జాతీయదినోత్సవాల రోజునో మన రోజువారీ పనులు మనం చేసుకుంటుంటే వీథిలో లౌడ్ స్పీకర్లలోంచి రణగొణధ్వనిగా వినిపించే దేశభక్తి గీతాలు, భక్తి పాటల లాంటివి.

గుడిపాటి వెంకట చలం విషయానికి వస్తే, ఆయనపై లారెన్స్ ప్రభావం ఉందని చెబుతారు. వాస్తవంగా ఆ ప్రభావం ఎంత ఉందో, ఇద్దరి మధ్యా పోలికలతోపాటు తేడాలు ఏమేరకు ఉన్నాయో లారెన్స్ వెలుగులో చలాన్ని మళ్ళీ చదివితే తప్ప నికరంగా చెప్పలేం. కాకపోతే లారెన్స్-విశ్వనాథల మధ్య దేశాల నేపథ్యంలో ఉన్న తేడాలే లారెన్స్-చలం మధ్య కూడా ఉండచ్చు. ఒకటి రెండు పోలికలు చెప్పుకుంటే, లారెన్స్ లానే చలం నిరీశ్వరవాది కాదు; పైగా ఈశ్వరవాదిగా కూడా ఆయనను చెప్పుకోవచ్చు. అలాగే, ఆయన కూడా లారెన్స్ లానే సిద్ధాంతాలపట్ల తటస్థంగా ఉన్నట్టే కనిపిస్తుంది. అయితే, జీవించడం పట్ల లారెన్స్ లో ఉన్నంత తమకమూ, మోహమూ; అతని రచనల్లో ఉన్నంత ఇంటెన్సిటీ, అంత ఉరవడి, సంఘర్షణ, విరివి చలంలో ఉన్నాయా?…ప్రస్తుతానికి వీటిని ప్రశ్నలుగానే ఉంచేస్తున్నాను.

అలాగే జీవించడం గురించి లారెన్స్ అంత గాఢంగా చెప్పిన తెలుగు రచయితలు ఎవరున్నారో కూడా ఇక వెతకాలి. ‘సన్స్ అండ్ లవర్స్’ గురించి మరోసారి.

The Lady Chatterly’s Lover
D. H. Lawrence
Fiction
Penguin

You Might Also Like

13 Comments

  1. Satish

    ఇది చాల ఆచర్య కరమైన విషయం. ఈ పుస్తకం 1960 లో ఇండియా లో బాన్ చేయబడింది. వెర్షన్ 2 ఆమితో తెలియదు కాని, దాన్ని సంపతించి దొంగచాటుగా ఆంధ్ర యూనివర్సిటీ లో చదవటం జరిగింది. లారెన్స్ కూడా చలం గారి లాగా సోషల్ ఫిలాసఫర్ మరియు రేఫోర్మేర్. మీరు వాటర్ సినిమా చూచార?
    1954 వరకు స్ట్రీలకు రైట్స్ లేవు. అంత మేల్ దొమినతెద్ సొసైటీ. లారెన్స్ టైం కి ఎప్పటికి ముడిపెట్టవద్దు.
    అలాగే విశ్వనాథ గారికి, చలం గారికి, ముప్పల గారికి ఉన్న సిద్దాంతాలను కూడా ముడిపెట్టవద్దు. ఇండియా లో నే కాకా ఇక్కడ అమెరికా లో కూడా స్త్రేలకు ఫ్రీడమ్ తక్కువే. మీరు శరత్ బాబు చదివుంట రానుకుంటాను. ఆ సాహిత్యం లో కూడా స్త్రీ స్వాతంత్ర్యం గురించే ఉంటుంది. ఇత్ ఇస్ టైం అండ్ రెలతివె సోషల్ థింకింగ్.
    సతీష్

  2. pavan santhosh surampudi

    చైతన్య గారి పఠనాసక్తులు, జీవితంలో పఠనసమయానికి ఆయన కేటాయించుకున్న సమయం, భవిష్యత్తులో చదవనున్న పుస్తకాలు వంటివేమీ తెలియకుండానే కొంత చొరవతో ఒక విషయం సూచిస్తున్నాను. ఎట్లాగూ విశ్వనాథ వారి పేరు ఎత్తారు కనుక మీరు ఇప్పటివరకూ చదివి ఉండకపోతే తెఱచిరాజు నవల చదివి చూడండి. మరీ ముఖ్యంగా “విశ్వనాథ దేహప్రాధాన్య వాది కాదు ఆత్మప్రాధాన్య వాది” అనడంలో మీకున్న అవగాహన తారుమారు చేస్తుందో లేదో కానీ ఆ నవల మీకు కచ్చితంగా ఆసక్తికరంగా, మీ అధ్యయనానికి అత్యంత ఉపయుక్తంగా ఉంటుందని చెప్పగలను.
    \\చలం రచనలకు సమాధానంగా ఆయన వివిధ రచనలు చేశారనే అభిప్రాయం మాత్రం ఉంది.\\
    చలం రచనలకు సమాధానం “వివిధ రచనలు” చేయడం పాక్షిక సత్యం. నిజానికి చలం “మైదానం” నవలకు సమాధానంగా “చెలియలికట్ట” రచించారు. ఇక మరే రచననూ నేరుగా చలానికి సమాధానం చెప్పే ఉద్దేశంతో రాయలేదు. ఇక చెలియలికట్ట పూర్తిగా ఆయన “సృష్టించిన” పాత్రలతో మైదానాన్ని సైద్ధాంతికంగా ఖండించే రచన.
    \\లారెన్స్-విశ్వనాథల గురించి ఈ నాలుగు మాటలూ చెప్పుకునేటప్పుడు బ్రిటిష్-భారతీయ సమాజాల స్థితిగతులు, వాటి మధ్య తేడాలు నా కళ్ళముందు కదులుతున్నాయి. లారెన్స్ కాలం నాటికి ఇంగ్లండులో పారిశ్రామికీకరణకు రెండు శతాబ్దాలకు పైబడిన గతం ఉంది. అంతటి గతం నుంచి, అనుభవం నుంచి లారెన్స్ పలుకుతున్నాడు. అతను కొత్త సృష్టి గురించి, నాగరికత గురించి, సరికొత్త చైతన్య క్షేత్రం గురించి కన్న కలలకు మూలాలు అన్నేళ్ళ లోతుల్లో ఉన్నాయి.\\
    బావుంది. విశ్వనాథ నిజానికి, మీ వ్యాఖ్యను సమర్థిస్తూ, బ్రిటీష్ సామ్రాజ్యవాదంలో భాగమైన సాంస్కృతిక దాస్యాన్ని వ్యతిరేకించే రచయిత. ఆయన అన్ని విధాలైన మానసిక దాస్యాలనూ ఖండించారు. ఆ క్రమంలోనే ఇవన్నీ వచ్చాయి. ముఖ్యంగా ఆయనకు “సంస్కరణలు” బ్రిటీష్ సాంఘిక, మత వ్యవస్థలకు అనుకరణలుగా వండివడ్డించబడడం ఏ విధంగానూ ఒప్పలేదు. ఐతే ఇంత స్పష్టంగా ఆయన సమకాలికులకు విశ్వనాథ సాహిత్యం కనబడలేదు. బహుశా సెట్టుగా కొనుక్కునే సౌలభ్యం, చదువుకునే వీలు మనకుండడం, సమకాలీనుకు విడివిడిగా చదివి సంచలనాలు చవిచూడడం తేడా కావచ్చు.

    1. చైతన్య

      తప్పకుండా నండీ. విశ్వనాథను కొత్తగా అంచనా వేయాల్సిన అవసరం ఉన్నట్టు మీ అభిప్రాయంగా తెలుస్తోంది. ఆయన రచనల్ని బాగా చదివిన మీలాంటివాళ్ళు ఆ పని చేస్తే బాగుంటుంది. నాది కూడా ఒక సూచన ఉంది. సిద్ధాంతం, సాంస్కృతిక దాస్యం, మానసిక దాస్యం మొదలైన మాటలు వాడుతున్నప్పుడు వాటిపై మొదట కొంచెం క్లారిటీ ఇవ్వాలి. వాటిని డిఫైన్ చేయాలి. బ్రిటిష్, భారత్ సంస్కృతుల్లో ఎక్కడెక్కడ తేడా ఉంది, బ్రిటిష్ మన మీద తన సంస్కృతిని ఎంత రుద్దింది, మనం దానిని ఎంత తీసుకున్నాం లాంటి ప్రశ్నలు చాలా వస్తాయి. ఇలాంటి వాటికి సమాధానాలు విశ్వనాథను అంచనా వేయడానికి తోడ్పడతాయనుకుంటున్నాను. తప్పక ఆ పని చేయండి.

    2. pavan santhosh surampudi

      మీ సూచనలు బావున్నాయి. తప్పకుండా ప్రయత్నిస్తాను.

  3. మంజరి లక్ష్మి

    “విశ్వనాథ, రంగనాయకమ్మ భిన్న ధృవాలుగా కనిపించవచ్చు కానీ వారి మధ్య ఒక పోలిక ఉంది. వారిద్దరూ సిద్ధాంతవాదులు. లారెన్స్, చలం సిద్ధాంతవాదులు కారు. వారి రచనలు పరిశీలించడంలో సిద్ధాంతాల కొలబద్ద ఎంతవరకు పనికొస్తుందో ఆలోచించాలి.”
    చలం సాంప్రదాయ వాదాన్ని ఎదిరించాడు అంటే అతను దానికి వ్యతిరేక వాదాన్ని చెపుతున్నట్లే కదా అదే వాళ్ళ సిద్ధాంతం. లారెన్స్, చలం చెప్పేది కూడా సిద్ధాంతమే. వాళ్ళ పుస్తకాల ద్వారా వాళ్ళు చెప్పే స్వేచ్చా వాదం బూర్జువా ఉదారవాద సిద్ధాంతం(వాళ్లకది తెలిసినా తెలియకపోయినా) క్రిందకే వస్తుంది. రంగనాయకమ్మ గారు చలాన్ని ఉదారవాద బూర్జువా అనే అంటారు. వీళ్ళు సాంఘికంగా అందరు సమానంగా స్వేచ్చగా ఉండాలని చెప్తారు కానీ బూర్జువా కున్న దోపిడీ స్వేచ్చను(కౌళ్ళు, లాభాలు వడ్డీలు లాగే స్వేచ్చను) మాత్రం వ్యతిరేకించరు. బూర్జువాలకు ఆ స్వేచ్చ ఉన్నంత వరకు శ్రామికులకు తమ శ్రమ విలువ మొత్తాన్ని తీసుకునే స్వేచ్చ ఉండదని, ఆ విధంగా వాళ్ళ స్వేచ్చ అణిచి పెట్టబడటం వల్లే సాంఘిక, రాజకీయ స్వేచ్చలు కూడా అంతంత మాత్రంగా ఉంటాయనే మూల విషయాన్ని ఈ బూర్జువా ఉదార వాదులు ఒప్పుకోరు, లేదా వాళ్ళకు తెలియదు లేదా వాళ్ళు తెలుసుకోవటానికిష్ట పడరు. మీరు చెప్పినట్టు వీళ్ళు ఎంత హేతుబద్ధంగా రాసినా/పోరాడినా చివరికి రమణ మహర్షి దగ్గరకో, రజనీష్ దగ్గరకో, జిడ్డు కృష్ణమూర్తి దగ్గరకో, సాయిబాబా దగ్గరకో వెళ్ళక తప్పదు.

    1. చైతన్య

      ప్రతి రచయితకీ ఒక దృక్పథం ఉంటుందనీ, తన రచనలో దానినే వ్యక్తపరుస్తాడనీ, అది కూడా సిద్ధాంతమే ననీ బ్రాడ్ గా అనుకుంటే లారెన్స్ కీ, చలానికీ కూడా సిద్ధాంతం ఉందని అనుకోవచ్చు. కానీ ఇక్కడ కొంచెం తేడా ఉందండీ. సిద్ధాంతం అన్నప్పుడు, లేదా నేను ఇక్కడ సిద్ధాంతం అనే మాటను ఉపయోగించిన అర్థంలో తీసుకుంటే సిద్ధాంతంలో థియరీయే కాకుండా దానికి ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఇది ఇంతే అనే ఒక కచ్చితత్వం ఉంటుంది. అది రాజకీయాలు, సంస్కృతి, సమాజం, ఆర్ధికత మొదలైన వాటిని అన్నింటినీ చుట్టబెడుతుంది. విశ్వనాథ, రంగనాయకమ్మ మొదలైనవారు అలాంటి సిద్ధాంతం కోవకు వస్తారు. లారెన్స్, చలం లాంటివారు ఇందులో లోపించేది ఏమిటో, దీని కింద అణగారి పోయేది ఏమిటో చెప్పడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళకు అదే ప్రధానం. అధ్యాత్మిక రంగంలో రమణ మహర్షి ఇందుకు ఒక ఉదాహరణ. వ్యవస్థీకృత మతాలను దృష్టిలో పెట్టుకుని చూస్తే రమణమహర్షి ప్రత్యేకత కనిపిస్తుంది. వ్యవస్థీకృత మతాలు ఒక యాక్షన్ ప్లాన్ ను ఇస్తాయి. ఒక వ్యవస్థను ఇస్తాయి. వాటిని కాపాడడానికి ప్రయత్నిస్తాయి. రమణమహర్షి అలాంటివేవీ ఇవ్వలేదు. ఆయన మానాన ఆయన ఉన్నారు. వ్యవస్థీకృత మతాలతో ఆయన ఏమీ పోరాడలేదు. ఆయన ఎవరికీ ఎలాంటి సిలబస్సూ ఇవ్వలేదు. ఇలాంటివారు వ్యవస్థలో ఫిల్ అప్ ది బ్లాంక్స్ లాంటివారు. పైకి అన్నీ ఒకలానే కనిపిస్తాయి కానీ సూక్ష్మమైన తేడాలు ఉంటాయని చెప్పడమే నా ఉద్దేశం.

    2. pavan santhosh surampudi

      అదే ఆయన అనేది సిద్ధాంతాలకు లొంగని జీవితమూ ఉంటుంది. అది ఎంతటి గోప్ప సిద్ధాంతమైనా-దానికి కూడా లొంగనిది జీవితం. అలా అని ఒప్పుకోనివారిని, ఒప్పుకోగలిగినవారిని విడదీస్తున్నారు. మీరు కూడా అటువైపు నిలబడతారు ఈ లెక్కల్లో.
      ఐతే ఈ వ్యాసకర్త అర్థం చేసుకోని విషయమేమిటంటే-“విశ్వనాథ పిచ్చిగా సిద్ధాంతాన్ని పట్టుకుని వలాడరు”. జీవితాన్ని ఒక కొలత వేసి సిద్ధాంతమనే చొక్కా కుట్టి సరిపోయినా, పోకపోయినా వేసుకొమ్మనేంత ఏమీ లేదాయనకు. విశ్వనాథ సాహిత్యాన్ని చదివిన వారికి అది అర్థమవుతుంది. చదవాలి.

  4. మంజరి లక్ష్మి

    ఇంగ్లీష్ నవల చదవ లేదు కానీ ఈ‌ కథను తెలుగులో చదివాను. బహుశా మాలతీ చందూర్ గారి పరిచయం చదివానేమో! అయితే చివరికి ఏమవుతుంది? లేడి చాటర్లీ తన ప్రియుడితో(అతడు కార్మికుడు, మొరటు మనిషి అని గుర్తు) వెళ్లిపోతుందా, భర్తతోనే ఉంటుందా? గుర్తులేదు. మీరు కథ చెప్పనంటున్నారు కాబట్టి గట్టిగా అడగలేను కానీ తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం బాగా ఉంది.

    దీనికి అనుబంధంగా మీరు విశ్వనాధ సత్యనారాయణ గారిని, చలాన్ని కూడా ప్రస్తావించటం బాగుంది. చలం మీద ఈ డి.హెచ్. లారెన్స్ ప్రభావం గురించి మీరు రాయటంతో దీని గురించి చదివిన జ్ఞాపకం వచ్చి అది రంగనాయకమ్మ గారి “నిశిత పరిశీలన దగాకోరు పరిశీలన” అనే దాంట్లో ఉండటం గుర్తొచ్చి అది మళ్ళా చదివాను. ఆ పుస్తకం నిమ్మగడ్డ వేంకటేశ్వర రావు అనే ఆయన రాసిన “చలం శ్మశాన సాహిత్యం” అనే దాని మీద విమర్శగా వచ్చింది. దానిలో 9వ చాప్టర్ “చలం లారెన్సా, లారెన్స్ చలమా” (పేజీ 76 నుంచి 82 వరకు) అనే శీర్షికతో రంగనాయకమ్మ గారు రాశారు. అందులో రంగనాయకమ్మ గారు రాసిన మాటలు మీరు చలం, విశ్వనాధల (భారతదేశానికి వస్తే, ఇంగ్లండు పారిశ్రామికీకరణ అనుభవాన్ని ఇక్కడ యథాతథంగా సూపర్ ఇంపోజ్ చేసే అవకాశం లేదు. ఇప్పటికీ భారతదేశం పూర్తిగా పారిశ్రామికం కాలేదు. ఫ్యూడలిజం విశ్వనాథ వారి రోజుల్లో మరింత బలంగానూ, ఇప్పుడు కొంత పలచబారీ ఉంటే ఉండచ్చు– లారెన్స్-విశ్వనాథల మధ్య దేశాల నేపథ్యంలో ఉన్న తేడాలే లారెన్స్-చలం మధ్య కూడా ఉండచ్చు) గురించి చెప్పిన దానికి దగ్గరగా ఉన్నాయి. ఆమె లారెన్స్ నీ చలాన్నీ ఒకే దృష్టితో పరిశీలించ వచ్చునా(వాళ్ళున్న సమాజాలు ఒకే రకమైన చారిత్రక దశల్లో ఉన్నాయా) అనే దాని మీద రాస్తూ “బూర్జువా ఇంగ్లాండు సామ్రాజ్య వాద దశకు కూడా చేరి వలసలను ఆక్రమించి పరిపాలన చేస్తోంది. అటువంటి సమాజంలో స్త్రీలు బూర్జువా స్వేచ్చ, బూర్జువా హక్కులు అనుభవిస్తూ వుంటారు. బూర్జువా సమాజం అతి చవకబారు సెక్స్ తో మునిగి తేలుతూ ఉంటుంది. అటువంటి సమాజ పరిస్థితుల్లో రచనలు చేశాడు లారెన్స్. మరి చలం? ఫ్యూడలిజమే పునాదిగా, వలస పాలకులు ప్రవేశ పెట్టిన కేపిటలిజంతో కలిసిన సమాజంలో, స్త్రీల స్వేచ్చ స్వతంత్రాల మాటైనా ఎత్తలేని వెనకబడ్డ సమాజ పరిస్థితుల్లో రచనలు చేశాడు. …. లారెన్సూ చలము ఇద్దరు సెక్సే ప్రధాన విషయంగా తీసుకొని రచనలు చేసినా …… స్త్రీలకు చదువులూ, ఉద్యోగాలూ, విడాకులూ అందుబాటులో వున్న బూర్జువా సమాజంలో స్త్రీల స్వేచ్చ గురించి మాట్లాడడమూ; ఫ్యూడల్ సాంప్రదాయాల మధ్య, పదేళ్ళ పి‌ల్లకి అరవై యేళ్ళ భర్తని చేసి, ఆ భర్త పోతే గుండు చేసి, ఆ పసి పిల్లని జీవితాంతం ఓ మూల కూర్చోపెట్టే సమాజంలో స్త్రీల స్వేచ్చ గురించి మాట్లాడటమూ – రొండూ ఒకటేనా? – ఏ విషయాన్నైనా దాని చారిత్రక పరిధిల్లోనే పరిశీలించాలనే సూత్రం ఏమైపోయిందీ?” అంటారు. అయితే ఆశ్చర్యంగా విశ్వనాధ సత్యన్నారాయణా, చలం ఒకే సామాజిక పరిస్థితుల్లో ఉండి కూడా విశ్వనాధ గారు తన రచనల ద్వారా స్త్రీలను నీచమైన ఫ్యూడల్ సాంప్రదాయాలకే కట్టుబడి ఉండాలని చెప్పటం, చలం దానికి వ్యతిరేకంగా ఆ శృంఖలాలను తెంచుకొని బయటపడమని చెప్పటం ఆశ్చర్యంగానే ఉంటుంది.

    అలాగే చలాన్ని మార్క్సిష్టు దృక్పధంతో పరిశీలించటం ఎలా గురించి కూడా ఈ పుస్తకంలో 13వ చాప్టర్(పేజీ 100 నుంచి 103 వరకు) లో రాశారు రంగనాయకమ్మ గారు.

    1. చైతన్య

      చాటర్లీ భర్తతోనే ఉండిపోయిందా, ప్రియుడితో వెళ్లిపోయిందా అనేది స్పష్టంగా చెప్పకుండానే నవల ముగుస్తుందండీ. ప్రియుడితో ఆమె సంబంధం కొనసాగుతుందనే ముగింపు చెబుతుంది.

      మీరు ప్రస్తావించిన రంగనాయకమ్మగారి వాక్యాలు చూశాక, వాటిపై కొంత క్లారిటీ అవసరమనిపించింది. ఆమె సిద్ధాంతం నుంచి మాట్లాడుతున్నారు. లారెన్స్ రోజులనాటి సమాజాన్ని ముమ్మూర్తులా బూర్జువా సమాజంగా భావించడం ఎంతవరకు సమంజసమో నాకు సందేహం. లారెన్స్ రోజుల్ని స్త్రీలకు చదువూ, ఉద్యోగాలు, విడాకులు అందుబాటులో ఉన్న పూర్తి స్థాయి బూర్జువా సమాజం అనలేము. ఇంగ్లాండుకు అప్పటికే తగినంత పారిశ్రామిక చరిత్ర ఉన్నా స్త్రీ పురుష సంబంధాలలో ఫ్యూడలిజం, క్రైస్తవనైతిక దృష్టి ప్రబలంగానే ఉన్నాయి. మన దగ్గర నాలుగు వర్ణాల వ్యవస్థ ఉన్నట్టే, ఇంగ్లాండులో కూడా కులీనవ్యవస్థ ఉంది. మరోవైపు రష్యన్ విప్లవ ప్రభావాలు కూడా చర్చలోకి వస్తున్నాయి. సమకాలీన సామాజిక స్థితిగతులు, సిద్ధాంతాల పట్ల లారెన్స్ తటస్థవైఖరి చూపుతూ వాటి కింద అణగారి పోతున్న జీవితాన్ని ఉద్ధరించడాన్ని తన రచనల్లో వస్తువుగా చేసుకున్నాడు. అయితే దానిని స్త్రీ ముఖంగా చేశాడు. దాదాపు చలం చేసింది కూడా అదే. ఆధ్యాత్మిక రంగంలోకి వెడితే వ్యవస్థీకృత మతాలు, పంథాలకు అతీతంగా శుద్ధ ఆధ్యాత్మికతను అనుసరించిన రమణమహర్షి ఇక్కడ గుర్తొస్తారు. చలం రమణమహర్షివైపు ఆకర్షితులు కావడానికి బహుశా అదే కారణమయుంటుంది. లారెన్స్ కూడా చలం లానే నిరీశ్వరవాది కాడు. ఆయన మరికొంత కాలం జీవించి ఉంటే చలం లానే అయ్యేవాడేమో.
      రంగనాయకమ్మగారు అన్నట్టు లారెన్స్, చలం సమాజాలు భిన్న చారిత్రక దశలలో ఉండడం నిజమే కానీ గీత గీసినట్టు ఆ దశలను విడదీసే పరిస్తితి లారెన్స్ రోజులనాటికి లేదు. వారి సామాజిక నేపథ్యాలలో ముందు నుంచీ ఉన్న కొన్ని మౌలికమైన తేడాలు వాళ్ళ రచనల్లో కనిపించవచ్చు.
      విశ్వనాథ, రంగనాయకమ్మ భిన్న ధృవాలుగా కనిపించవచ్చు కానీ వారి మధ్య ఒక పోలిక ఉంది. వారిద్దరూ సిద్ధాంతవాదులు. లారెన్స్, చలం సిద్ధాంతవాదులు కారు. వారి రచనలు పరిశీలించడంలో సిద్ధాంతాల కొలబద్ద ఎంతవరకు పనికొస్తుందో ఆలోచించాలి.

    2. pavan santhosh surampudi

      విశ్వనాథ, చలం ఒకే సామాజిక వ్యవస్థల్లో, ఒకే సమయంలో రచనలు చేస్తూ ఒకరినొకరు ఖండించుకునే లాంటివి చేయడం ఎందుకు అంత ఆశ్చర్యం కలిగిస్తోంది మీకు? ఒక రకమైన ఉత్పత్తి సమాజంలో, ఒక విధమైన వర్గం నుంచి ఒకే రకమైన సాహిత్యం వస్తుందని చెప్పడమెలా కుదురుతుంది?. మీ ఆశ్చర్యం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది.

  5. mohan

    బ్రిలియంట్ ఎనాలిసిస్ చైతన్య గారూ.

    1. చైతన్య

      థాంక్స్ మోహన్ గారు

  6. చైతన్య

    రెండు సవరణలు…

    1.”జీవితంతో, జీవించడంతో…” అని ప్రారంభమయిన వాక్యాన్ని ఇలా చదువుకోగలరు:

    “జీవితంతో, జీవించడంతో, ప్రకృతితో, స్త్రీతో లారెన్స్ పొందిన తాదాత్మ్యం, తన్మయత్వం ఇంకా అనేకచోట్ల ఆశ్చర్యకరంగా అభివ్యక్తమవుతుంది.”

    2. “స్పర్శకు యోగ్యం కాని…” అని ప్రారంభమయిన పేరాలో…

    “మనం ఆ పరిస్థితిని ఊహించుకుని విపరీతంగా భయపడతామనీ, భయంతో ఒక చెట్టులా బిగుసుకు పోతామనీ అంటాడతను.” అనే వాక్యాన్ని,

    “మనం ఆ పరిస్థితిని ఊహించుకుని విపరీతంగా భయపడతామనీ, భయంతో కొయ్యబారిపోతామనీ అంటాడతను.” అని చదువుకోగలరు.

Leave a Reply