పరమహంస యోగానంద ఆత్మకథతో నా కథ

స్వామి పరమహంస యోగానంద ఆత్మకథ “ఒక యోగి ఆత్మకథ” అని తెలుగులోనూ, “Autobiography of a Yogi” అని ఇంగ్లీషులోనూ, ఇంకా ఇతర పేర్లతో ప్రపంచంలోని అనేక భాషల్లోనూ పేరుపొందింది. ఈ వ్యాసం ఆ పుస్తకం గురించి కన్నా ఆ పుస్తకంతో నా interactions గురించిన ఆత్మకథ అనుకోవాలేమో. పుస్తకం గురించిన సంక్షిప్త పరిచయాన్ని ఆశించేవారు ఇక్కడే ఆపేస్తే నయం అనుకుంటాను!

నాకు ఊహ తెలిసిన నాటి నుండి, పుస్తకాల పైన ఉన్న పేర్లను చదవగలిగే నాటి నుండి, మా ఇంట్లో నేను రెండు భాషల్లోనూ చూస్తూ వచ్చిన పుస్తకం ఈ “Autobiography of a Yogi”. ఇంకా అలాంటివన్నీ అర్థం కాని వయసులో సైతం ఏదో ఒకటీ అరా పేజీలు చదివాను ఇందులోంచి. అయితే, కొంచెం ఊహ తెలిశాక ఇందులో చదివిన కొన్ని కథలు భలే ఆకట్టుకున్నాయి నన్ను. మా‌ఇంట్లో ఉన్న పుస్తకంలో “చనిపోవడానికి మూడు రోజుల ముందు” అంటూ ఒక యోగానంద ఫొటో ఉండేది. ఆ ఫొటోలో ఆయన నవ్వు అలా నా మనసులో నాటుకు పోయింది. కొన్నాళ్ళు భయపెట్టేది కూడా! ఏళ్ళు గడిచాక, ఆ పుస్తకాన్ని ఎప్పుడూ శ్రద్ధగా చదవకపోయినా, ఇలా ఒకటీ అరా కథలు చదవడం మానలేదు. మా నాన్న ఆ పుస్తకం ఆయన్ని చాలా ప్రభావితం చేసిందని చెప్పేవారు – అదో కారణం దాని గురించి నా sustained curiosityకి.

సరే, నా కథలో కాస్త ముందుకెళితే, ఇంజనీరింగ్ చదువులో నా సీనియర్ ఒకతను ఈ పుస్తకం గురించి ఒకటే తెగ చెప్పేవాడు – అయితే, అతని కారణం వేరు. “ఆ పుస్తకంలో ఇంగ్లీషు గొప్పగా ఉంటుంది. సంక్లిష్టమైన ఆధ్యాత్మిక అనుభవాల గురించి కూడా చక్కటి భాషలో స్పష్టంగా రాస్తాడు ఆయన. భాష మెరుగుపరుచుకోడానికి నాకది చాలా పనికొచ్చింది” అనేవాడు. నేనప్పటికి పేజీలు తిరగేసినది తెలుగు అనువాదం మాత్రమే. ఇదిలా ఉండగా, మరొక సంఘటన ఆ పుస్తకాన్ని కొంచెం సీరియస్ గా చదివేలా పురికొల్పింది. అది రజనీకాంత్ “బాబా” సినిమా చూడ్డం. మొదటి సగాన్ని సినిమా రిలీజైన చాన్నాళ్ళకి టీవీలో చూడగానే, “అరె, ఇందులో కొన్ని కథలు అచ్చు ఆ పుస్తకంలో లాగానే ఉన్నాయే!” అనుకుని, మళ్ళీ‌ ఆ పుస్తకం చదవడం మొదలుపెట్టాను. మళ్ళీ అవీ ఇవీ కొన్ని అధ్యాయాలు చదివి ఆపేశాను. అడపాదడపా బుక్ ఫెయిర్లలో “Yogada Satsanga Society” వారి స్టాల్ చూసి ఈ పుస్తకాన్ని తల్చుకోడం మినహా మళ్ళీ కొన్నాళ్ళ పాటు దాన్ని తాకలేదు. ఇలా ఇన్నిసార్లు మొదలుపెట్టి ఆపడానికి కారణాలు ఏవైనా, పుస్తకం ఆసక్తికరంగా లేకపోవడం మట్టుకు కాదు.

గత ఏడాది ఒక కాంఫరెంసుకని 2013లో బల్గేరియా దేశ రాజధాని సోఫియా వెళ్ళాను. మన అబిడ్స్ లాగా అక్కడా ఓ సెకండ్ హ్యాండ్ పుస్తకాల వీథి ఉంది. అక్కడ తిరుగుతున్నప్పుడు ఈ పుస్తకం తాలూకా బల్గేరియన్ అనువాదం కనబడ్డది! అది చూశాక, ఆ సమయంలో నాకున్న ఆసక్తుల మూలాన, ఈ పుస్తకాన్ని చదువుతున్న ఓ స్నేహితుడు పదే పదే ప్రస్తావిస్తున్నందువల్ల కూడా, ఈసారి ఆంగ్లంలో ఈ పుస్తకం చదవడం మొదలుపెట్టి దాదాపు పూర్తి చేసేసాను. చదివినంతలో బాగా ఆకట్టుకుంది. నాకాట్టే‌మతవిశ్వాసాలూ అవీ లేకపోయినా, నేను ఊహించుకోలేనంత అద్భుతమైన అనుభవాలను ఆ పుస్తకంలో వివరించినా, ఆట్టే పక్కన పెట్టేయబుద్ధి కాలేదు. గత ఏడాది కాలంలో మళ్ళీ అప్పుడప్పుడూ ఓ పేజీ, ఓ‌ ఛాప్టర్ అనుకుంటూ చదువుతూ ఉండగా, మొన్నీమధ్యే మరో ప్రయాణంలో ఆ పుస్తకం తెరిచి, ఈసారి పూర్తిగా చదివేశాను ! అలా, ఈ పుస్తకంతో నా అనుబంధం దాదాపు నా వయసంత ఉందన్నమాట ఇపుడు!!

అన్నిసార్లు దాని వైపుకి పోవడానికి కారణమేమిటి? అంటే ఈ పుస్తకంలో నన్ను ఆకట్టుకున్న విషయాలు:
౧. రచయిత ఇక్కడ వర్ణించిన అనుభవాలు, తాను కలిసిన భారతీయ, పాశ్చాత్య యోగుల గురించిన కథలు. ఆయన సొంత కథకన్నా ఇవి నన్ను చాలా ఆకట్టుకున్నాయి. నమ్మశక్యం కానంత అద్భుతంగా అనిపించాయి వీటిలో చాలా సంగతులు. కానీ, సృష్టిలోని అనేక అనుభవాలలో నేను చూసిందెంతని? అనుకున్నాను. నాకు తెలియని, అర్థంకానివన్నీ ట్రాష్ అనేసుకోలేక.
౨. వాళ్ళ గురు-శిష్య పరంపర గురించిన కథలు కూడా నాలో కుతూహలాన్ని రేకెత్తించాయి ఆ సంప్రదాయాలపై. అలాగే దేశీ,విదేశీ యోగుల జీవితాలు, వాటి గురించిన కథల గురించి ఆసక్తి కలిగింది. ఈసారి దేశం వెళ్ళినపుడు మా నాన్న పుస్తకాల అరను తవ్వాలని నిర్ణయించుకున్నాను.
౩. నా సీనియర్ ఇదివరలో అన్నట్లు – ఇందులో వాడిన భాష. కొన్ని చోట్ల అయితే, ఇలాంటి వైయక్తికమైన ఆధ్యాత్మిక అనుభవాల గురించి ఇంత స్పష్టమైన భాషలో రాయొచ్చా! అని ఆశ్చర్యపోయాను నేను. (నాకు మామూలు వలపు,వగపు,నవ్వు,ఏడుపు వంటి భావాలకే “ఏమైంది?” అంటే చెప్పడానికి మాటలు రావు లెండి చాలా సందర్భాల్లో!!). భాషా పరంగా ఈ ఆధ్యాత్మికఅంశాలపైన నేను చదివిన కొద్దిపాటి పుస్తకాలతో పోలిస్తే ఈ పుస్తకం చాలా బాగుంది.
౪. ఆ క్రియాయోగ ప్రక్రియ గురించి, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి వర్ణించిన విధానంలో కనబడ్డ passion.
౫. ఇవన్నీ అటు పెట్టినా కూడా, బోరు కొట్టకుండా సాగుతుంది పుస్తకం చివరి దాకా. కథనం లో ఆ పట్టు ఉంది.

ముందే చెప్పినట్లు, ఈ వ్యాసం పుస్తకం గురించి కాదు, నా గురించే. నా దృష్టిలో నేను చదివిన గొప్ప పుస్తకాల్లో ఇదీ ఒకటి. పైగా, పుస్తకం నన్ను తన దగ్గరికి మళ్ళీ మళ్ళీ రప్పించి మరీ చదివించిందాయె!! భారతీయ యోగుల దైనందిన జీవితం గురించి, వాళ్ళకి కలిగే అనుభవాల గురించి కుతూహలం ఉంటే, ఈ పుస్తకం ఆసక్తికరంగా అనిపించవచ్చు అని నా అభిప్రాయం. మత విశ్వాసాలతో, వాటి లేమితో సంబంధంలేకుండా కొంచెం open-mind ఉంటే కూడా పుస్తకం చదవ ప్రయత్నించవచ్చని కూడా నా అభిప్రాయం. ఈ పుస్తకం గురించిన ప్రశంసలు, అలాగే విమర్శలు అంతర్జాలంలో విరివిగా లభ్యం. “Stripping the Gurus” అన్న ఈ-పుస్తకంలో ఈ పుస్తకంపై/యోగానందపై వచ్చిన విమర్శ ఒక్కటి మటుకు నేను కొంచెం ఆసక్తితో చదివాను. ఇంతకుమించి ఈ పుస్తకం నేపథ్యం గురించి, యోగానంద జీవితం గురించి, ఇతరత్రా లోగుట్టుల గురించి నాకేమీ తెలియదు.

ఈ పుస్తకం ప్రాజెక్ట్ గూటెంబర్గ్ లో ఉచితంగా చదివేందుకు లభ్యం.

Autobiography of a Yogi
Paramahamsa Yogananda

You Might Also Like

5 Comments

  1. kameswari yaddanapudi

    ఈ పుస్తకంతో నా అనుబంధాన్ని ఏమని చెప్పాలి. నేను నాజీవితం వ్యర్థమైపోతోదని మథనపడుతూ భగవతిని ప్రార్థిస్తూ సంవత్సరంపైగా గడిపాక, జీవితాన్ని సార్థకం చేసే పనికోసం తపించిఫొయాక, నాకోసం సముద్రాలు దాటి అనువదించమని ఆజ్ఞ వచ్చింది. నామొదటి పశ్న నాపేరు వే స్తారా. జైకో వారు వేస్తామన్నారు. నీలిరంగు పుస్తకం. కాషాయ వర్ణం కాదు. 1946 నాటి ముద్రణ ఎనుగేక్కాను రెండు సంవత్సరాలకు 2007లో ప్రచురణ జరిగింది. 6000 కాపీ లు బయటకు వచాయి. జైకో వారికి, వైఎసెస్ వారికి తగాదా. ఈ పుస్తకాన్ని మార్కట్ చేస్తే , మా ఇతరపుస్తాకాలు ఏవీ వారికి ఇవ్వమన్నా రట వైఎసెస్ వారు. జైకో వారు ముద్రించటమ్ మానుకునారు. ఎక్కడైనా నీలిరంగు తెలుగు అనువాదం ఒకయోగిఆత్మకథ దొరికితే చూడండి అది నా తపః ఫలమ్ . ఒకమాట వారికి చెప్పి జైకో వారు ఈ ప్రయత్నం చేసినా , ఆపుస్తకం ఏదో ఆస్తితగాదాలో మరొక ఆశ్రమానికి చెన్దకపోయినా నా ప్రయత్నం ఇలా సగం ఫలించేది కాదు.. నాకు తెలియనిఏశక్తి ఈ పనిని నాకు పంపినదో, అదేశక్తి ఈ సమస్యను పరిష్కరించాలి.

  2. సౌమ్య

    తృష్ణ గారు: చాలా ఆలస్యంగా స్పందిస్తున్నందుకు మన్నించండి. మీరు ఇచ్చిన లంకెలకి ధన్యవాదాలు. పాల్ బ్రన్తాన్ పుస్తకం కూడా ఈ పుస్తకం లాగానే నేను అడపాదడపా కొన్ని అధ్యాయాలు చదువుతూ వచ్చాను. డిటో విత్ స్వామీ రామా పుస్తకం. ఈ రెండోది స్కూల్లో చదువుకునేటప్పుడు తెలుగులోనే చదివాను. వీటి గురించి కూడా దాదాపు ఈ వ్యాసంలో వ్యక్తపరచిన అభిప్రాయమే నాది ఇప్పుడు. అప్పట్లో మట్టుకు కథలు భలే ఉన్నాయే! అనుకుంటూ మట్టుకే చదివాను 🙂 ఆ వయసులో అంతకంటే ఆలోచించడం కష్టం అనుకుంటాను 🙂 వీలును బట్టి మీరు సూచించిన పుస్తకాలు చదువుతానేమో.

    మధు గారు: ఈ వ్యాసం మిమ్మల్ని పుస్తకం చదివేలా చేస్తే అంతకంటే కావాల్సింది ఏముంది? మీరు చదివాక మీ అభిప్రాయాలు కూడా రాయగలరు!

  3. Madhu

    సౌమ్య గారు చక్కటి వ్యాసం రాసారు. నేను ఇప్పటికి 10 కి ఫై గానే కాపీలను కొన్నాను, చదవాలని, కాని చదవ లేదు. కొంత మంది స్నేహితులకు ఇవ్వటం, వారు చదివానని చెప్పి చాల బాగుందని చెప్పటం. ఈ 2014 లో తప్పక, మీరిచ్చిన ఇన్స్పిరేషన్ తో చదవాలి. నన్ను చదివే టట్లుగా ఈ వ్యాసం రాసినందుకు ధన్యవాదాలు.

  4. తృష్ష్ణ

    సౌమ్య గారు, నాకు పుస్తక ప్రదర్శన లో దొరికింది..”హిమాలయ పరమ గుర్వులతో జీవనము” అన్న అనువాదం. కూర్పు స్వామి అజయ, అనువాదం భాగవతుల వేంకట శ్రీనివాసరావు గారు. పబ్లిషర్స్ : వైజాగ్ ఫై.వి.ఏజన్సీస్.

  5. తృష్ణ

    సౌమ్య గారూ, ఈ పుస్తకం నేను కూడా నాన్న బుక్స్ లో చిన్నప్పటి నుండీ చూస్తూ చూస్తూ, అలానే కాస్త కాస్త పేజీలు తిప్పి వదిలేస్తూ.. పిజీ అయిపోయాకా పూర్తిగా చదివాను. కొన్నాళ్ళు శ్రధ్ధగా కొన్ని పధ్దతులు పాటించాను కూడా 🙂 చాలా గొప్ప పుస్తకం! తర్వాత అదృష్టవశాత్తు ఈమధ్యన ఇలాంటి నేపథ్యం ఉన్న మరికొన్ని మంచి పుస్తకాలు కొనుక్కోగలిగాను. పాల్ బ్రంటన్ ది ‘ఎ సర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా’ కు అనువాదం “రహస్య భారతంలో నా ఆధ్యాత్మిక అన్వేషణ”(http://trishnaventa.blogspot.in/2013/12/blog-post_24.html).
    ఈ పుస్తకం నాకు చాలా నచ్చింది.
    ఆ తర్వాత చాలా రోజులుగా వెతుకుతున్న స్వామి రామ రాసిన “లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్” తెలుగు , ఇంగ్లీష్(సంక్షిప్తం) రెండూ కొన్నా.
    http://www.goodreads.com/book/show/112519.Living_with_the_Himalayan_Masters
    ఇది సగం చదివాను. పూర్తి చెయ్యాలి.
    ఇటీవల మరో మంచి పుస్తకం దొరికింది. “ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏన్ అమెరికన్ స్వామి” అనే అసలు పుస్తకానికి “అమ్మ ఒడిలోకి పయనం” అని తెలుగు అనువాదం దొరికింది. బావుంది పుస్తకం. అదయ్యాకా ఇది మొదలెట్టాలి. ఆసక్తి ఉంటే కొనుక్కొండి. బాగుంది పుస్తకం.
    బుక్ వివరాలు క్రింద లింక్లో ఉన్నాయి:
    http://en.wikipedia.org/wiki/The_Journey_Home:_Autobiography_of_an_American_Swami

    ఎవరైనా ఆసక్తిగలవారు చూస్తారని లింక్స్ ఇస్తున్నాను.

Leave a Reply to తృష్ణ Cancel