విశ్వనాథతో సంభాషణ

వ్యాసకర్త: Halley
********
ఆ పెద్దాయనః స్వరాజ్యము తేవలసినది దేశములో మానసికమైన కూలివానితనమును నిర్మూలించడానికి.

నేనుః మరి స్వరాజ్యము వచ్చింది కదా. అది వచ్చాక ఇన్ని ఏళ్ళు గడిచిపొయాయి కదా. మనము ఆ కూలివానితనము నుంచి బయట పడ్డామంటారా?

ఆ.పెః పడలేదనే చెప్పాలి. ఇంకా లోతుగా కూరుకుపోయాము అని కూడా చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే మనము మన తొలి నాటి సంస్కృతిని గురించి గొప్పలు చెప్పుకుంటాము కానీ దానిని అనుసరింపము. ఎందుకంటే మనకు అసలు మన సంస్కృతి యొక్క సంపూర్ణ స్వరూపము అన్నది అర్థమై చస్తే కదా!

నేనుః ఎందుకని అర్థం కాదు?

ఆ.పెః మనము దానిని చదవలేదు కనుక! దానిని చదివించట్లేదు కనుక. చదువుటకు వీలు లేదు కనుక. అసలు మనము పరభాషాభిమానుల చేత, పరదేశ నాగరకతా వ్యామోహవంతులచేత పాలింపబడుచున్నాము ఇప్పటికినీ.

నేనుః అవును మొన్న హైదరాబాదులో ఒక స్కూలు పేరు చూసి ఖంగుతిన్నాను. “అమెరికిడ్స్” అట. వీళ్ళ దుంపతెగ! ఇదేమి దౌర్భాగ్యమో ఏమో!

ఆ.పెః మన పాలకులకు కూడా మన పూర్వనాగరకతా సంపూర్ణ జ్ఞానము లేదు. దాని విషయము తెలియదు కనుక దాని మీద అభిమానము లేదు. అభిమానము అనేది పరిచయము పెరిగే కొద్దీ పెరుగుతుంది.

నేనుః అది మాత్రము నూటికి నూరుపాళ్ళు నిజము మీరన్నట్టు.

ఆ.పెః ఈ రహస్యమే ఆంగ్లేయ రాజనీతివేత్తలకు తెలుసు. వారు మన మీద ప్రయోగించినది అదే. మనము ఎలా అవ్వాలని వారు అనుకున్నారో మనము అలాగే తయారయ్యాము. ఎంతవరకు మారామంటే మనమొకరమున్నామని తెలియనంతవరకు మారాము. మనలో ఒకడు ఇలా అంటే ఇంకొకరు వాడికి విరోధిగా పాటించేదాకా వచ్చాము. ఆహా! ఆంగ్లేయుల రాజనీతివేతృ నిర్మాణ చాతుర్యము!

నేను: ఇందులో ఈ పరిణామవాదము బ్యాచి ఒకటి బయలుదేరింది కదా ఈ దేశములో కొన్ని దశాబ్దాలుగా. పదవ తరగతి హిందీ పుస్తకములో కూడా డార్విన్ కథ చెప్పించారు మాకు స్కూలు రోజులలో. దాని గురించి ఏమంటారు?

ఆ.పె: వేదాలలో కూడా ఒక విధమైన పరిణామవాదము ఉంది.

నేను: నిజమా?

ఆ.పె: ప్రజాపతి మొదట పాములను సృష్టించాడట. తర్వాత పక్షులను సృష్టించాడట. తర్వాత దీక్షిత వాదమును సృష్టించాడట. తర్వాత ప్రజలను సృష్టించాడట.

నేను: ఇది ఇంచు మించు డార్విను పరిణామవాదము లాగానే ఉన్నదే.

ఆ.పె: ఇందులోని విశేషము దీక్షిత వాదము సృష్టించిన తర్వాత ప్రజాసృష్టి జరుగుట. ఇదే ప్రధాన తేడా-భారతీయ వాదానికీ, పాశ్చాత్య వాదానికీ. మనిషి ముందు పశువై తర్వాత మెల్లగా వృద్ధి పొందుతూ నాగరకుడయ్యాడు అన్నది వారి వాదన. జ్ఞానము సనాతనము అన్నది మన వాదన. కాబట్టి వారికీ మనకీ చాలానే భేదాలు ఉన్నాయి.

నేనుః మీరన్నదానిలో నిజము లేక పోలేదు. వివేకానంద స్వాముల వారి ఇన్వల్యుషన్ ఎవల్యూషన్ ఉపన్యాసము గుర్తుకు వస్తోంది. అయినా ఈ ప్రాక్పశ్చిమ భేదాలది ఏముంది? మనమంతా ఒకటే అందరమూ మనుషులమే అని ఒక వాదన బయలుదేరింది కదా.

ఆ.పెః మనుషులందరికీ కాళ్ళూ చేతులూ సమానమే. నిజానికి మనసు కూడా సమనమే. కానీ మనస్స్వభావమూ మనోలక్షణమూ సమానము కావు. మనసు గుర్రము. శరీరము బండి. గుర్రమెటులాగితే బండి అటు పోతుంది. వాడి బండి వంటి బండిని మనము చేయించుకొనవచ్చును కానీ వాడి గుర్రము వంటి గుర్రము దొరకదు. ప్రాణము ప్రధానము ఇక్కడ. ప్రాణగత లక్షణాలు సర్వతః సమానములెప్పుడూ కాలేవు. అవి సమానము అయిపొయినప్పుడు సృష్టే లేదు. సృష్టి ప్రధాన లక్షణము వైవిధ్యము.

నేనుః వెధవది ఈల వేయటము రాదు కానీ! లేదంటేనా! ఏం చెప్పారండీ!

ఆ.పెః ఏడిశావు!

నేనుః ఈ పాశ్చాత్యుల చరిత్రకాల నిర్ణయము గురించి ఏమంటారు?

ఆ.పెః అప్పటి పాశ్చాత్య పండితులూ వారి ప్రభావానికి లోనైన మన చరిత్రకారులు అందరూ కలిసి, వారి బహిస్సాక్ష్య నిర్ణయానికి సరిపోలేదని పురాణకాల నిర్ణయమంతా తారుమారు చేసి పాఠ్య పుస్తకాలలో వారి నిర్ణయాలను వ్రాసి దేశములో పురాణములవిశ్వసనీయములన్న ఒక జాతీయాపకార భావము పెంచారు.

నేనుః ఆ బహిస్సాక్ష్య నిర్ణయము అన్నది చాలా పెద్ద విషయమే మీరు అన్నట్టు. దాని ప్రభావము ఇంతా అంతా కాదు మన జీవన విధానము పైన. అసలు మాకు చరిత్ర పాఠము హరప్పాతో ప్రారంభం అవుతుంది పాఠశాలలో లేదా ఆదిమ మానవుడు రెండు రాళ్ళు! ఇలాగు! మా పాఠాలలో యుగాలు లేవు పురాణాలు లేవు. ఇతిహాసాలు మా చరిత్ర పుస్తకాలలోకి ఎక్కవు ఎలాగూ.

ఆ.పెః పాశ్చాత్యులు మనలో మనకి పరస్పర విరోధ భావములు పెంచుటకు పన్నిన వ్యూహాలన్నీ కూడా నేటికీ నిర్భేద్యముగా ఉన్నాయి. వీటిన్నన్నిటినీ మూలచ్చేధము చెస్తేనే మన విశ్వవిద్యాలయములు బాగుపడేది. అప్పుడు కానీ తిరిగి మన జాతీయతా భావము తిరిగి ఉద్ధరింపబడదు.

నేనుః ఇదంతా సరే. రోజువారీ వ్యవహారాలకి వారి భాష వాడటము తప్పట్లేదే మరి? వారి భాష చదవాల్సిందే కదా మరి.

ఆ.పెః వారి భాష చదవటం వేరు.వారి విశ్వాసాలు స్వీకరించటం వేరు. పసితనము నుండీ వారి చదువే చదివితే వారి విశ్వాసములందు అధిక పరిచితి కలిగి తిరిగి దాన్నే ప్రేమిస్తారు. దానియందే అభిమానము కలిగి ఉంటారు.

నేనుః అవునవును.

ఆ.పెః ఇది కాక ఇంకొకటి ఉంది. మన పూర్వ నాగరికత లౌకిక విషయముల యందు అశ్రద్ధ వహించినదని కొందరి ఊహ. అది యెప్పుడును కాదు. ఇంకొకటి. మన వాళ్ళు మా పూర్వీకులు ఇంత గొప్పవారు అని చెప్పుకోవటమే కానీ నిష్క్రియులు అని ఒక అపవాదు ఉంది. క్రియాచరణము అన్నది జరగాలి అంటే రాజ్యము మనదై పాలించే వాడు జాతీయతాపునరుద్ధరణభావనిష్టుడై ఉండాలి. విద్యాపద్ధతి జాతీయతాభావ ప్రోద్భలకమై జాతీయ ప్రతిభా ప్రోత్సాహజనకమై ఉండాలి. తిండి లేక మాడుతూ ఎవ్వడూ మహాకార్యము సాధించలేడు.

నేనుః అదీ నిజమే! ఇందాక విద్యాపద్ధతుల గురించి ఏదో అంటూ ఉన్నారు?

ఆ.పెః నేటి విద్యాపద్ధతి దేశాభ్యుదయమునకు కొంచము కూడా సహాయకారి కాదు. మన పరభాషా వ్యామొహము గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఒక స్నేహితుడు తాను చదివిన ఇంగ్లీషు నవలలో “they had a te-te over cocktail” అన్న వాక్యము చెప్పి ఎంత రమ్యముగా ఉన్నదో చూడమనెను. ఆ వాక్యములో రమ్యార్థము ఏమీ లేకపొయినా అతనికి ఎందుకు అలా అనిపించింది. Te-te అన్న మాటా cocktail అన్న మాటా కొత్తవి అవి అతని మనసుకు చక్కిలిగింతలు పెట్టాయి. ఇలాంటివి మన దగ్గర లేకనా! “ఓ పికవాణి నాకు గల యోపిక వాణికి లేదు” వంటివి మన భాషలోనూ ఉన్నవి కానీ అస్వాదించే శక్తి పోయింది.

నేను : భాష విషయము సరేసరి. ఇందాక మాట్లాడిన కాలనిర్ణయ పద్దతుల దగ్గరికి వస్తే మనమేమో అపౌరుషేయం అంటున్నాము వేదాన్ని. వారేమో ఏ 1500 బీ.సీనో ఏదో అంట గడతారే దానికి కూడా. నాకు స్కూలులో అలానే చెప్పినట్టు జ్ఞాపకం.

ఆ.పె: సంస్కృత భాష యందలి సంస్కృతీ తక్కిన భాషల యందలి సంస్కృతీ వేరే. ఆ సంస్కృతి పరమేశ్వర కల్పితము. వేదకాలమెప్పుడు అని అనవసరంగా తర్జన భర్జన పడే ఈ పాశ్చాత్య మేధావుల సిద్దాంతములు మారుతూ ఉంటాయి. ఒకప్పుడు భూమి తిరుగుట లేదు మరొకప్పుడు తిరుగుతూ ఉంటుంది. సంస్కృత సంస్కృతి అలా కాదు. అందు మూలభూత సిద్ధాంతాలు మారవు. ఒక జాతియొక్క సాంఘిక రాజకీయాది జీవన పరిణామము ఈ మూల విషయములననుసరించి ఉంటుంది. భిన్న జాతుల సంఘర్షణ జరిగినప్పుడు రెంటి కలయిక పొసగదు. ఆ కలయిక దుష్ట ఫలదాయి అగును.

నేనుః మీరన్నట్టు ఈ కలయిక చేయాలన్న ప్రయత్నమే మన కొంపలు ముంచుతోంది అనిపిస్తుంది. ఎలాగో ఒక లాగా కలయిక చేసేద్దాము అన్న తొందరలో మూల సూత్రాలనే మర్చిపొయే స్థితిని చేరుకుంటున్నాము. మీరు చెప్పిన ఈ కలయిక, అదే Synthesis గురించి ఒక వ్యాసము చదివాను అప్పట్లో.

ఆ.పెః అందుకనే మానసికమైన కూలివానితనము గురించి ప్రస్తావించాను ఈ చర్చ మొదట్లో. ఒక జాతి తాను స్వాతంత్ర్యము గడించుకున్నప్పుడు తన సంస్కృతిని నిలబెట్టుకొనవలెను. పరజాతిని ఆర్థిక రాజకీయ విషయాలలో తప్పక అనుకరించాల్సి వస్తే తప్పులేదు కానీ సాంస్కృతిక స్వాతంత్యాన్ని మాత్రము త్యజించకూడదు. అది పారతంత్ర్యము అవుతుంది అప్పుడు. అది పరధర్మము. “స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః”.

నేనుః ఆ మాట వెనుక ఇంత అర్థము ఉన్నదా! మరి దీని గురించి ఏమి చేయాలంటారు?

ఆ.పెః ఈ సంస్కృతిని రక్షించవలయునన్నచో సంస్కృత భాషను రక్షింపవలెను. మన సంస్కృతి ఏమో తెలియక పరసంస్కృతి బద్ధ వ్యామోహులై అల్పభావములచే ఈ సంస్కృత సంస్కృతే వద్దు అనే వారికి ఒకటే నేను చెప్పాలని అనుకోనేది. ఇంటిలో చీమల బాధ ఎక్కువని ఎవరూ ఇల్లు తగులబెట్టుకోరు.

నేనుః మా బాగా చెప్పారు. ఈ మధ్యన ఇంకొక ఇబ్బంది వచ్చింది. మీ రచనలు ఎవైనా చదవటం మొదలు పెట్టగానే, ఓహో ఆయన పుస్తకాలా ఆయన వైదిక ధర్మ ప్రచారము చేసేవాడు కదా ఆయన రచనలలో, ఆ ధర్మమూ అదంతా ఎందుకు నీకూ? అని అడగటం మొదలు పెట్టారు.

ఆ.పెః షేక్స్పియరు నాటకాలలో “మర్చెంటు ఆఫ్ వెనిస్” లో ఒక యూదు పాత్రను ప్రవేశపెట్టి క్రైస్తవ మత ప్రచారం చేశాడు. మిల్టన్ రాసిన పారడైజు లాస్టులో క్రైస్తవ మతము మినహా మరొకటి లేదు. వాళ్ళందరినీ మెచ్చుకుంటూనే ఉన్నారే.

నేనుః అవునవును. మాకు స్కూలులో మిల్టన్ గురించి చెప్పినప్పుడు అసలు ఇవంతా చెప్పరు కూడాను. ఆయన గొప్ప కవి అని చెప్తారు అంతే.

ఆ.పెః అయినా గొప్ప గొప్ప వారంతా ఏదో ఒక విధంగా తమ మతాన్ని ధర్మాన్ని ప్రచారం చేసిన వాళ్ళే. నేను నా రచనలో నా దేశాన్నీ, సంస్కృతినీ, మతాన్,నీ సంప్రదాయాన్నీ, పుట్టు పూర్వోత్తరాలనీ మర్చిపోయి ఎలా రాసేది? అన్ని దేశాలలో అందరు కవులూ ఎలా చేసారో నేనూ అలాగే చేసాను.

నేనుః అంతా ఆ మానసికమైన కూలివానితనము వల్లనే లాగుంది. స్కూలు పుస్తకాలలో చరిత్ర కాల నిర్ణయము చేసే వాడు మార్క్సిస్టు కావచ్చు, క్రైస్తవుడు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కానీ వైదిక ధర్మాభిమాని కాకూడదు. ఇంకా చెప్పాలంటే నువ్వు ఏదైనా పర్లేదు కానీ, ముందైతే వైదిక ధర్మ విరోధివి అయ్యి ఉండాలి.

ఆ.పెః ఉన్న మాట ముఖం మీద అనేవాడు ఈ రోజులలో దోషి. సహపంక్తి భోజనము చేసి ఒకడిని పొగిడి అవతలకు వెళ్ళి వాడొట్టి లంజకొడుకు అని తిట్టే వాడు మంచివాడు. నాకూ నీ కాలములో రచనలు చేసే వారికీ ఒక భేధము చెబుతాను. నేను సంప్రదాయము చావకముందే పుట్టిన వాణ్ణి వాళ్ళు సంప్రదాయం చచ్చిన తర్వాత పుట్టిన వాళ్ళు.

నేనుః తర్వాతి తరాలు భాష చచ్చాక పుట్టిన తరాలు అవుతాయో ఏమో. అసలు తెలుగెందుకు అని అడుగుతారు మా మహానగరపు పాఠశాలల్లో నేడు.

ఆ.పెః దోషము విద్యా విధానములోనే ఉన్నది. విద్యామంత్రులు, విద్యాసంస్థలు అన్నీనూ పాశ్చాత్య విద్యా భోధనా పరిజ్ఞానము మాత్రమే కలిగి ఉండి, అది లేకపోతే చచ్చిపోతాము అని అనుకునే పరిస్థితి. అంతెందుకు అణువు అన్న శబ్దం ఉన్నా ఆటం అనే కదా వాడతావు. లక్ష్యం అన్న పదము ఉంది. అయినా ఐడియల్ అన్న పదమెందుకు వాడతావు. అసలు మన పాలకులు మన చదువులు దేశభాషలలోకి మార్చాలి అని అనుకుంటే పదేళ్ళలో ఒక్క ఇంగ్లీషు శబ్దం ఉండదు. మెకాలే ప్రభృతులు మన చేత ఇంగ్లీషు చదివించటానికి మీన మేషాలు లెక్కపెట్టలేదు. మనము మీన మేషాలే కాదు, వృషభ మిథునాలను కూడా లెక్కపెడుతున్నాము.

విశ్వనాథ అసంకలిత సాహిత్యం – 3 (వార్తాంశాలు)” (కినిగె లో కొన్నాను) అన్న పుస్తకములో విశ్వనాథ గారు చేసిన ప్రసంగాలూ రాసిన వ్యాసాలూ చదువుతున్నప్పుడు నన్ను అలా ఆలోచనలో పడేసిన కొన్ని విషయాల గురించిన పరిచయం ఇది. ఇందులో కొన్ని కొన్ని విషయాలను పుస్తకములో ఉన్న వరుసలో కాకుండా, పైనా కిందా తారుమారు చేసి భాషను అటూ ఇటూ మార్చి కొంత సొంత తెలివి చొప్పించి నేను ఏదో చేసి ఉండవచ్చును. దాని వెనుక ఏ దురుద్ధేశమూ లేదు. ఈ పుస్తకమును నేను గుర్తు పెట్టుకునే విధానము అయితే ఇదే. వారి రచనలు కావచ్చును, ఇట్టి అసంకలిత సాహిత్యము కావచ్చును ఇటువంటివి చదువుతున్నప్పుడంతానూ ఆయనేదో అలా కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే, నేను చేతులు కట్టుకొని కింద కూర్చొని వింటునట్టు అనిపిస్తుంది నాకు. ఆ భావనకు ప్రతిరూపమే ఈ పరిచయం. అంతకు మించి వేరే యే ఉద్దేశము లేదు. అసలు తెలుగులో ఇన్ని విషయాలను రాసిన ఈయనను పక్కన పెట్టుకొని ఎందుకా ఇన్ని సంవత్సరాలు ఎవేవో చదువుకుంటూ కాలయాపన చేసాను అని ఒక బాధ అంతే! ఇటువంటి పరిచయాలు చదువుకొని ఎవరైనా పుస్తకము కొనుక్కొని చదువుకుంటారేమో అని చిన్న ఆశ. అసలే ఈ పుస్తకాల గురించి రాసేవారు కరువయి పోయారు!

Viswanatha Asamkalita Sahityam, Vol. 3
Viswanatha Satyanarayana

You Might Also Like

4 Comments

  1. pantula jogarao

    పరి శుభ్రమైన శైలిలో చాలా బాగా రాసారండీ … అభినందనలు,

  2. S. Narayaaswamy

    చాలా బాగా రాశారు.

  3. mohan

    ‘అసలే ఈ పుస్తకాల గురించి రాసేవారు కరువయి పోయారు!’
    పుస్తకం.నెట్ ఉంది కదా! కీప్ ఇట్ అప్!!

  4. pavan santhosh surampudi

    సూపర్. భలే రాశారు. రోజురోజుకీ మీ రచనా నైపుణ్యాలు పెరుగుతున్నాయి. చెప్పిన విశేషాలు విశ్వనాథ సాహిత్యంలో చదువుతున్నవే. కానీ మీ అనుసరణ, అనుకరణ బావున్నాయ్.

Leave a Reply to S. Narayaaswamy Cancel