రేగడి విత్తులు – చంద్రలత

వ్యాసకర్త: రాగమంజరి
*******
ఈ ప్రసిద్ధ నవల 1997 లో ప్రచురించబడింది. 420 పేజీల ఈ నవల తానా నవలల పోటీలలో లక్షా ఇరవై వేల రూపాయల బహుమతి అందుకుంది. ఆ విశేషణం లేకపోతే ఇంత పెద్ద నవలని కొని ఓపికగా చదవడం జరిగేది కాదేమో!

ఈ నవల చివరి పేజీలలో డా. జంపాల చౌదరి గారు ‘ఈ రచనలో లోపాలేమీ లేవని కాదు’ అంటూ ఒక పేరా నిండా బోలెడు విషయాలని ఉదహరించారు. కొన్ని ముఖ్యపాత్రలు నవలలో నుంచి అకస్మాత్తుగా అదృశ్యమైపోతాయనీ, కొన్ని మామూలు సంఘటనలని విపులంగా రాసిన రచయిత్రి కొన్ని ముఖ్యమైన సంఘటనలని మాత్రం సంభాషణల రూపంలో తేల్చేశారనీ, దేశంలో వచ్చిన అర్థికమార్పుల్ని చిత్రీకరించిన రచయిత్రి రాజకీయ మార్పుల్ని నిర్లక్ష్యం చేశారనీ, అక్కడక్కడా ఎదురయ్యే ఉపన్యాసాలు నవల నడకని చెడకొట్టాయనీ, పతాక సన్నివేశం నాటకీయంగా వుందనీ – ఇలా ఇన్ని విషయాలూ రాసి తర్వాతి పేరాలో వస్తువు, విస్తృతి, పాత్ర చిత్రీకరణ, నిశిత పరిశీలన, కథన శక్తి, భాష మొదలైన అన్ని విషయాలలోనూ ఉత్తమస్థాయిలో ఉన్న నవల రేగడివిత్తులు అన్నారు. అన్ని విషయాలలో అన్ని లోపాలున్నా అవే విషయాలలో అది ఉత్తమ నవల ఎలా అవుతుందో అర్థం కాకపోయినా మొదటే చెప్పినట్లూ ఈ నవలకు వున్న విపరీత ప్రచారం వలన దీనిని కొని కష్టపడి చదవడం జరిగింది.

చదివితే చాలా అరుదుగా ఎక్కడో ఒకటి రెండు అంశాలు కొంత బాగున్నాయని అనిపించినా ఎక్కువ భాగం చిరాకునే కలిగించిందని చెప్పాలి. చిరాకు ఎందుకంటే రచనలోని వైరుధ్యాల వలన. రచన, కథనం ఒక విషయాన్ని చెప్తుంటే దానికి కథకుడి లేదా కథకురాలి వ్యాఖ్యానం మాత్రం పూర్తి విరుద్ధంగా వుంటుంది. అటువంటి కొన్నిటిని క్లుప్తంగా క్రిందనున్న జాబితాలో వివరించే ప్రయత్నం చేస్తాను.

1) ఈ నవలలో రేపల్లె ప్రాంతం నుంచి వచ్చిన రామనాథం మహబూబ్ నగర్ లోని నడిగడ్డకు వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన రామనాథం వలన, అతను వ్యవసాయంలో చేసే ప్రయోగాల వలన తెలంగాణా ప్రజలు ఏదో లబ్ధి పొందారన్నది నవలలోని స్వరం. కానీ నవలలో మనకి కనబడేది మాత్రం రామనాథం ఒక పిచ్చిపని చేసినపుడల్లా బాలయ్య (తెలంగాణా రైతు) ఆయనకి సలహా చెప్పీ, సహాయం చేసీ గట్టెక్కించడం. మొదటిసారి రామనాథం వరి పంట దెబ్బ తిన్నపుడు ధైర్యం చెప్పేదీ బాలయ్యే, తర్వాత పత్తి మొత్తం కాలిపోయినపుడు పూరిగుడిసెలో పత్తి పెట్టుకోవడం సరైన పని కాదని చెప్పి సున్నం మిద్దె కట్టించి పెట్టేదీ బాలయ్యే. ఆర్థిక సహాయం చేసేది ఆ బాలయ్య కొడుకు మల్లేశే.

రామనాథం కొత్త ప్రదేశానికి వలస వచ్చినపుడు మొదట్లో తెలంగాణా వాళ్ళేదో వాళ్ళకు చేతనయిన సహాయం చేశారు, ఆ తర్వాత మాత్రం తన తెలివితేటలతో రామనాథం వాళ్ళని వుద్ధరించాడు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ రెండో సంఘటన అంటే పత్తి కాలిపోయి రామనాథం నష్టపోవడం నవలలో 293 వ పేజీలో జరుగుతుంది. అంటే అప్పటికి నవల మూడు వంతులు పూర్తయిపోయింది.

2) తెలంగాణా అత్తగారైన నారాయణమ్మ అంధ్రా కోడలైన అనూరాధ ప్రవర్తనని సరిగా అర్థం చేసుకోలేదన్నట్లు, ఆ అత్తా కోడళ్ళ మధ్య సయోధ్య కుదిర్చేందుకు రామనాథం ఏదో గొప్ప పరిష్కారం చూపినట్లు చెప్తారు రచయిత్రి. అనూరాధ తనని తాను నిరూపించుకోనంత కాలం నారాయణమ్మ ఆమెని చులకనగా చూసిందనీ, ఎప్పుడైతే ఆమె తనని తాను నిరూపించుకుందో అప్పుడు నారాయణమ్మ ఆమెని గౌరవించడం మొదలు పెట్టిందనీ చెప్తారు.

కానీ నవల చదువుతుంటే ఇది చాలా అసంబద్ధంగా, అసహజంగా అనిపిస్తుంది. మనుషుల మధ్య వుండే గౌరవాగౌరవాలకి సంబధించిన సంస్కారాలు వేరు. అత్తాకోడళ్ళ మధ్య వుండే ఆశలు, అసంతృప్తులు, అపార్థాలు, వాటి కారణాలు వేరు. నారాయణమ్మకు మనుషులను గౌరవించే లక్షణం, అవతలి వారిలోని మంచిని అర్థం చేసుకునే లక్షణం మొదటి నుంచీ వుంటాయి. పెళ్ళికి ముందు రామనాథం ఇంటికి వెళ్ళినపుడు శారదమ్మని ఆమె అర్థం చేసుకోవడంలోనే ఆ విషయం మనకి తెలుస్తుంది. బండి దిగి వియ్యపురాలి ఇంట్లోకి వెళ్ళీ వెళ్ళడంతోనే ఆవిడని అర్థం చేసుకోగలుగుతుంది నారాయణమ్మ. అటువంటపుడు అనూరాధ తనని తాను నిరూపించుకుని తద్వారా నారాయణమ్మ చేత ‘నా కోడలు నాకన్నా గొప్ప వ్యవసాయం చేస్తోంది’ అనిపించుకుందని అనుకోవడం, దాని వల్లనే వారి మధ్య ద్వేషం మాయమయిందని అనుకోవడం అసంబద్ధంగా వుంది. కోడలికి పిల్లలు పుట్టలేదన్నది నారాయణమ్మ బాధ, అందుకోసం తాను చేసే ప్రయత్నాలకి, పూజలకీ కోడలు సహకరించకపోవడం వల్ల కలిగినది కోడలి పట్ల ఆమె అసంతృప్తి. ఇవన్నీ కోడలు కడుపుతో ఉందని తెలియగానే సమసిపోతాయి. కోడలిపై ఆమె ప్రేమ మళ్ళీ ఏ అవధులు, అడ్డంకులూ లేకుండా ప్రసరిస్తుంది. అది స్పష్టంగా నవలలో కనిపిస్తుంటే దానిని ప్రక్కన పెట్టి అనూరాధ తన ప్రయోజకత్వాన్ని చూపించుకోవడం వల్లే నారాయణమ్మ ద్వేషం పోయిందని రాయడం హాస్యాస్పదం. అది అనురాధకీ, రామనాథానికీ గొప్పదనాన్ని కట్టబెదదామనే వ్యర్థ ప్రయత్నం తప్ప మరేమీ కాదు. నవలలోని పాత్రలు మనకి అర్థమయినంత మాత్రంగా కూడా రచయిత్రికి అర్థం కాకపోవడం, కొన్ని పాత్రల స్వచ్ఛత, నిర్మలత్వం, మంచితనం, సమర్థత స్పష్టంగా కనిపిస్తున్నా, అర్థమయిపోతున్నా వాటిని పక్కకి పెట్టి కథకురాలు మరికొన్ని పాత్రలని గొప్పగా చూపే ప్రయత్నం చేయడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

3) రామనాథాన్ని, అనురాధనీ గొప్పగా, ఆదర్శవంతమైన వ్యక్తిత్వమున్న వారిగా చూడమన్న స్వరం వుంటుంది నవలలో. కానీ నవల నడిచే పద్ధతి వల్ల వారి కన్నా మిగతాపాత్రలే ఎక్కువగా ఆకర్షిస్తాయి.

ఉదాహరణకి రామనాథాన్ని ప్రయోగశీలిగా చిత్రించే ప్రయత్నం కనిపిస్తుంది నవలలో. విత్తనాలు తయారు చేయడం, ఆంధ్ర ప్రాంతం అమ్మాయి అయిన అనూరాధ పెళ్ళి తెలంగాణ ప్రాంతం వాడైన మల్లేశ్ తో చేయడం వంటివి ఆయన ప్రయోగాలు. అయితే ఈ ప్రయోగాలు ఎంతవరకూ అవసరం? ఎంతవరకూ సమర్థనీయం అన్న ప్రశ్న వస్తుంది నవల చదివితే. అలాంటి ప్రయోగాలు చేసినందువల్ల నవలలోని మిగతా వారి కంటే ఆయన అధికుడు, తెలివైన వాడు, ఆదర్శమూర్తి అవుతాడా అన్న సందేహం కలుగుతుంది.

అలాగే అనురాధది గొప్ప వ్యక్తిత్వంగా చూపాలన్న ప్రయత్నం. కానీ ఆమె తన అత్తగారిని గురించి చేసే ఆలోచనలు, ఆవిడని ఒక కుసంస్కారిగా భావించడం – ఇవన్నీ అనూరాధపై గౌరవాన్ని కలిగించవు సరికదా చిరాకు పుట్టిస్తాయి. నారాయణమ్మ స్వచ్ఛత ముందు అనూరాధ పాత్ర తేలిపోతుంది. పిల్లలు కలగకుండా జాగ్రత్త పడుతున్నానన్న విషయాన్ని అత్తగారికి చెప్పకుండా దాచి, ఆవిడ అమాయకంగా చేసే ప్రయత్నాలకి చిరాకుపడే అనూరాధ, కూలి వాళ్ళను ఉద్ధరిస్తున్నాననుకుంటూనే రజియా తల్లిని ‘బోడిముండ’ అని తిట్టుకునే అనూరాధ నిజంగా చాలా చిరాకు కలిగిస్తుంది.

4) ఇక ఈ నవలకి ఎ.బి.కె ప్రసాద్ గారు రాసిన మరొక వెనుక మాటలో ‘ఈ నవలలో స్త్రీవాదం అంతర్వాహినిగా సాగింది’ అన్న వాక్యం వుంది. నిజమే స్త్రీవాదాన్ని సమర్థించాలన్న ఒక ప్రయత్నం వుంది ఈ నవలలో. కానీ ఆ ప్రయత్నం చాలాచోట్ల స్త్రీలని అవమానించడం గానే మిగిలింది. ఉదాహరణకి ఒక సందర్భంలో అనురాధకి పిల్లలు కలగకపోవడం పై నారాయణమ్మతో చర్చ పెట్టిన రాజమ్మ “నీ కోడాలు మాచికమ్మ గిట్టనేమో కన్కుంటివా?” అంటుంది.
అక్కడ ఆ వాక్యం తర్వాతి వాక్యాలు ఇలా వుంటాయి.

నారాయణమ్మ గుండె జారిపోయింది. అలా అయ్యుండే అవకాశం ఉందేమోనని ఒక్క క్షణం ఆలోచించింది. ఏ మాటకామాట చెప్పుకోవాలి. అనూరాధని చూసినవాళ్ళు ఆమెలో లోపాన్ని చూడలేరు. అట్లాంటి కోడలంటే ఎంత కోపమున్నా నారాయణమ్మ అలా ఊహించుకోలేక పోయింది. “నా కోడలు గొడ్రాలే కానీ మాచికమ్మ గిట్ల అయ్యుండదు.

చూపులకి బాగుండేవారిలో అటువంటి శారీరకమయిన లోపం వుంటుందని ఊహించలేమనీ, బాగుండనివారి విషయంలోనే అటువంటి ఊహలు చేయగలమనీ – ఇలా అనుకోవడం సబబు కాదు కదా! ఇక్కడ గమనించవలసినది ఏమిటంటే ఈ భావం ఒక పాత్ర ద్వారా వెలిబుచ్చబడలేదు నవలలో. రచయిత్రి వ్యాఖ్యగా రాయబడింది. ఇలాంటి భావాలని, అహంకారాలని ప్రతిబింబించే నవలని వెనుక మాటలలో చెప్పినట్లు ప్రగతి శీలమనీ, హేతు బద్ధమనీ నేను అనుకోలేక పోయాను.

*****

Regadi Vittulu
Chandra Latha

You Might Also Like

Leave a Reply