Madame Bovary: Flaubert

ప్లాబెర్ రాసిన నవలల్లో ఒకటి, Madame Bovary. నేను దీన్ని ఏదో ఫిలాసఫీ క్లాసుకోసం చదివాను పోయినేడాది. ఎప్పటికప్పుడు ఫిలాసఫర్లందరూ చెప్పినవి తెల్సుకొని, వాటిని గుర్తు పెట్టుకొని, వాటిని గురించి అనర్గళంగా మాట్లాడాలనుకుంటాను గానీ, చదివిన ఒక గంటకే అన్నీ మర్చిపోతాను. మేడమ్ బొవరీలో ఫిలాసఫీ ఎంతో ఇప్పుడేం గుర్తు లేదు, Art for art’s sake అన్న వాక్యం తప్ప.

మేడమ్ బొవరీ  “ఎమ్మా” అనే ఆమె కథ. అయితే కథ ఆమె నుండి మొదలవ్వకుండా, ఆమెను పెళ్ళి చేసుకోబోయే వాడి, చార్లెస్ , బడికి వెళ్ళే రోజుల నుండి మొదలవుతుంది. చార్లెస్‍ బోటాబొటిగా చదివి ఏదోలా డాక్టరీ పూర్తి చేసి, అంతగా పేరులేని డాక్టరు అవుతాడు. వాళ్ళ అమ్మ ఓ ధనికురాలైన వితంతువుకిచ్చి అతడి పెళ్ళి జరిపిస్తుంది. ఆమె కొన్నాళ్ళకే పోయినా, పెద్దగా ఆస్తి ఏమీ కల్సిరాదు. ఆ తర్వాత, ఒకానొక రోగిని పరీక్షించడానికి వెళ్ళినప్పుడు, అతడి కూతురైన ఎమ్మాను చూస్తాడు. మనసు పారేసుకుంటాడు. పెళ్ళి చేసుకుంటాడు.

పెళ్ళి, దాని తరువాత జీవితం గురించి ఎమ్మా ఎన్నెన్నో కలలు కంటుంది. అవేవీ నిజమైయేట్టు లేవని ఆమెకు త్వరగా అర్థమవుతుంది. సంతానమూ ఆమె boredomకు పరిష్కారం చూపలేకపోతుంది. తన భర్త ద్వారా పొందలేని ఆనందాన్ని బయట మనుషుల్లో వెతుక్కుంటుంది. అక్రమ సంబంధాలు ఏర్పర్చుకుంటుంది. అలవాటు చేసుకున్న వ్యసనాలకు అప్పులు చేయటం మొదలెడుతుంది. ఆ తర్వాత వాటిలో కూరుకుపోతుంది. సంబంధాలూ, అలవాట్లూ కూడా ఆమె కోరుకున్న జీవితాన్ని ఇవ్వలేకపోతాయి. అప్పుల బాధ పడలేక ఆత్మహత్య చేసుకుంటుంది. ఆమెను ఆరాధించే చార్లెస్‍కు, ఆమె చనిపోయాక, ఆమెను గురించిన నిజాలను తెలుస్తాయి. కొన్నాళ్ళకు అతడూ చనిపోతాడు. వాళ్ళ ఏకైక సంతానం అనాధైపోతుంది.

గుల్జార్ రాసిన ఒకానొక పాటలో, “ఒకసారేమో, పంజరంలో చందమామను తెచ్చి ఇవ్వమని జీవితాన్ని అడిగాను. ఇంకోసారేమో, లాంతరునిచ్చి ఆకాశంలో వేలాడదీయమన్నాను.” అన్న అర్థంలో ఉంటుంది. ఎమ్మా దాదాపు అలా అడిగే మనిషే. ఓ మధ్యతరగతి మనిషిని పెళ్ళి చేసుకొని, అతడితో సంతోషంగా ఉండచ్చునేమో. కానీ, ఆమెకు అంతకు మించిన అందలాలు కావాలి. వాటి కోసం ఆమె వెంపర్లాడుతుంది. బోర్లా పడుతుంది. ప్లాబెర్ ఏదో సందర్భంలో “ఎమ్మా, నేనూ ఒకటే” అని అన్నాడు అట. దాని సారాంశం ఇదే అనుకుంటాను, ఉన్న చోటున ఉండకుండా, ఇంక దేని కోసమో నిరంతరంగా అన్వేషించడం. అది దొరకబుచ్చుకున్నాక, దానితోనూ సుఖంగా ఉండలేక, మరోదాని వెంటపడడం.

ఎమ్మా ఇలా చేయడానికి ఆమె చదివిన ఒకప్పటి సాహిత్య ప్రభావమని అనుకోవచ్చు. 19వ శతాబ్దంలో వచ్చిన రొమాంటిక్ సాహిత్యం చదివి, జీవితం అలానే ఉంటుందనుకొన్న ఎమ్మా, వాటిని సాధించడానికే ప్రయత్నిస్తూ ఉంటుంది. చిన్నప్పుడే అమ్మ చనిపోయినప్పుడు కూడా సహజంగా పొంగుకొచ్చే దుఃఖం కాకుండా, సంతాపంలోనూ అత్యున్నతమైనదాని కోసం రిహార్సెల్స్ వేస్తూ ఉంటుంది. అది ఆమె అలవాటు. అయితే, ఇలాంటి రొమాంటికి నోషన్స్ తో ఆమెకు త్వరగా మొహం మొత్తేస్తుంది. ఆమె తల్లి వియోగానికి భరించలేనంత బాధపడిపోవాలనుకుంటుంది. కానీ పడలేదు. కొన్నాళ్ళకి ఆ ప్రయత్నం విరమించుకుంటుంది. చార్లెస్‍ను ప్రేమించానన్న భావన కూడా కొన్నాళ్ళు ఆమెకు అమితమైన సంతోషాన్ని కలిగిస్తుంది. పెళ్ళి గురించి ఎన్నెన్నో కలలు కంటుంది. కానీ పెళ్ళయ్యాక, అవ్వన్నీ మెల్లిమెల్లిగా చెదిరిపోతాయి. ఆఖరకు ఆమెకు sensational, ఒక sense of achievement ఇచ్చిన సంబంధాల గాలి మేడలు కూడా కూలిపోతాయి. దీన్ని ప్లాబెర్ రచనా చాతుర్యం అనుకోవచ్చు. తనకి గిట్టని రొమాంటిసిజం victimగా ఎమ్మాను చిత్రీకరించి, ఒక రకంగా, she’s suffering from romanticism అని establish చేసి, దాని వల్ల కలిగే దుష్ప్రయోజనాలని ఎమ్మా పతనం ద్వారా పాఠకులకు తెలియజెప్పటం.

పెళ్ళికి ముందైనా, పెళ్ళి అయిన తర్వాత అయినా, అక్రమ సంబంధం పెట్టుకోవడం తగని పని, ఆడదానికైనా, మగవాడికైనా, ఈ నవలలోని సమాజం, కాలం ప్రకారం. అయినా, అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఎమ్మా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఆమెతో శారీరక సంబంధాలు పెట్టుకున్న ఇద్దరూ ఏవో కొన్ని ఇక్కట్లను ఎదురుకున్నా, చివరకు బాగానే ఉంటారు. ఆమె చేతల వల్ల ఎక్కువగా నష్టపోయింది, ఆమె భర్త! అది కూడా అతడు ఏదీ తన కంట్రోల్‍లో ఉంచుకోడానికి ప్రయత్నించినట్టు కనిపించడు. గాలి ఎటు వీస్తే అటు వంగే కొమ్మలా ఉంటాడంతే! బహుశా, అతడిలోనూ కాస్త చాకచక్యం ఉంటే, అతడూ ఆమె నష్టపోయినంతగా నష్టపోయుండేవాడు కాడేమో.

ఎమ్మాకు సంతానం కలిగినప్పుడు, ఆమె అంతరంగం:

She hoped for a son; he would be strong and dark; she would call him George; and this idea of having a male child was like an expected revenge for all her impotence in the past. A man, at least, is free; he may travel over passions and over countries, overcome obstacles, taste of the most far-away pleasures. But a woman is always hampered. At once inert and flexible, she has against her the weakness of the flesh and legal dependence. Her will, like the veil of her bonnet, held by a string, flutters in every wind; there is always some desire that draws her, some conventionality that restrains.

బహుశా, ఆమె బదులు ఈ నవల ప్రధాన పాత్ర మగవాడు అయ్యుంటే, కథ మరీ ఇంత విషాదాంతంగా ఉండేది కాదేమో.

“మాయా మేమ్‍సాబ్” అనే హింది చిత్రం ఒకటి, ఈ నవల ఆధారంగానే తీశామని చెప్పుకుంటారు. ముందా సినిమా చూసి, తర్వాత ఈ నవల చదివాను. సినిమాను విస్మరించటం ఉత్తమం. నవల మాత్రం తప్పని సరిగా చదవాల్సిన పుస్తకం. ఎమ్మా ఎప్పటికీ మర్చిపోలేని పాత్రల్లో ఒకటి.

Full text of the novel, available online, for free.

 

Madame Bovary
Flaubert
Novel
ebook

You Might Also Like

3 Comments

  1. Vishy

    రివ్యు చాలా బావుంది పూర్ణిమ. చిన్నప్పుడు పుస్తకాలు బాగా చదివేదాన్ని కాని ఇల్లు, కరియర్ manage చేసేసరికి పుస్తకం తీసి చదివే ఓపిక, తీరిక రెండూ లేకపోయాయి. ఈ మధ్యనే మళ్ళీ చదవడం, రాయడం కాస్త మొదలుపెట్టాను. Hope to contribute something to pustakam.net as well..!
    Please feel free to visit my blog at: vishalinaren.wordpress.com 🙂

  2. Meher

    ఈ రచన కన్నా, ఈ రచన చేస్తూ Flaubert ప్రతిష్టాపించిన ఒక కళాకారుని వ్యక్తిత్వం (Artist Persona) ఇప్పుడు ముఖ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రచనలో అతను తెచ్చిన ఇనొవేషన్స్ ఇప్పుడు రియలిస్టిక్ నవలో ఒక నార్మ్ అయిపోయాయి. అందుకే “Flaubert and His Exemplary Destiny” అనే వ్యాసంలో బోర్హెస్ అంటాడు. “మేడం బొవారీ” నవల కన్నా ఫ్లాబర్ట్ ముఖ్యం, కాఫ్కా అన్ని రచనల కన్నా కూడా కాఫ్కాయే ముఖమైనట్టు:

    […] to think of Flaubert’s work is to think of Flaubert, of the anxious, painstaking workman and his lengthy deliberations and impenetrable drafts. Quixote and Sancho are more real than the Spanish soldier who invented them, but none of Flaubert’s creatures is as real as Flaubert. Those who claim that his Correspondence is his masterpiece can argue that those virile volumes contain the face of his destiny.

    >> బహుశా, ఆమె బదులు ఈ నవల ప్రధాన పాత్ర మగవాడు అయ్యుంటే, కథ మరీ ఇంత విషాదాంతంగా ఉండేది కాదేమో.

    జీవితాన్ని రొమాంటిక్ ఐడియల్స్ తో ఎదుర్కొని ఒక మగవాడు ఎలా మిగిలాడో చదవాలంటే “Sentimental Education” ఉందిగా. ఇంత విషాదాంతం కాదు, ఇక్కడ మనిషి చచ్చిపోతుంది, అందులో మనిషి ఆత్మ చచ్చిపోతుంది. అది నాకు చాలా నచ్చిన పుస్తకాల్లో ఒకటి. నీకూ నచ్చుతుంది.

  3. viplove

    పుస్తకం పూర్తిగా చదవలేదు కానీ
    రెండు సిన్మా అడాప్టేషన్శ్ చూసా.
    ఒకటి బ్లాక్ అండ్ వైట్
    మరోటి చేబ్రోల్ వెర్షన్ ..
    రెండూ చాలా మంచి సిన్మాలు

Leave a Reply to Vishy Cancel