పుస్తకం
All about booksఅనువాదాలు

May 28, 2014

An Enemy of the People – Henrik Ibsen

More articles by »
Written by: అసూర్యంపశ్య
Tags: ,
“Enemy of the People” నార్వే కు చెందిన రచయిత Henrik Ibsen రాసిన ఒక నాటకం. నేను మొదటిసారి చదివేటప్పటికి నాకు తెలియదు కానీ, తరువాత్తరువాత తెలిసింది అది అంతర్జాతీయంగా‌ ఎంత పేరున్నదో. నాకు తెలిసిన ఇద్దరు (మన దేశంలో సాహిత్యం అభ్యసించినవారు) కూడా యూనివర్సిటీలో తమకి ఈ నాటకం ఆంగ్లానువాదం పాఠ్యాంశాలలో ఒకటిగా ఉండేదని తల్చుకున్నారు. ఒక రెండున్నరేళ్ళ క్రితం ఇంగ్మర్ బెర్గ్మన్ ద్వారా ఇబ్సెన్ దగ్గరకొచ్చి వరుసగా అతని నాటకాలు కొన్ని చదివాను -అప్పట్లోనే ఇది తొలిసారి నాకంటబడింది. ఆ తరువాత అనేకమార్లు ఈ నాటకాన్నీ, ఇందులోని ప్రధాన పాత్రలనూ తల్చుకున్నాను. కొన్ని కొన్ని సంభాషణలు చాలాసార్లు తిరిగి చదువుకున్నాను. అనుకోకుండా ఒకానొక ఖండాంతర విమానయానంలో ఏమీ తోచక ఇది తెరిచాను. అంతే, మళ్ళీ మొదటిసారంత ఉత్సుకతతో సాంతం చదివాను. ఈ నాటకం గురించి నా మాటలు కొన్ని..

కథ విషయానికొస్తే – ఇందులో ప్రధానపాత్రలు – డాక్టర్ థామస్ స్టోక్మాన్, ఊరి పెద్దల్లో ఒకడైన అతని అన్న పీటర్ స్టోక్మాన్, థామస్ భార్యా పిల్లలు, “పీపుల్స్ మెసెంజర్” పత్రికకు సంబంధం ఉన్న పాత్రలు Hovstad, Billing, Aslaksen. కథ జరిగే ప్రదేశం దక్షిణ నార్వేలోని ఓ తీరప్రాంతంలో గల చిన్న పట్టణం. థామస్ స్టోక్మన్ ఇంట్లో అతని ఆహ్వానంమీద వచ్చిన వ్యక్తుల మధ్య సంభాషణలతో కథ మొదలవుతుంది. తమ ఊళ్ళోకి పర్యాటకులను ఆకర్షిస్తూ పేరు తెస్తున్న baths తాము అనుకుంటున్నట్లు ఆరోగ్యకరమైనవి కావనీ, నిజానికి హానికారకాలను ఉత్పత్తి చేస్తున్నాయనీ డాక్టర్ గారు బయటపెట్టడంతో కథ రసకందాయంలో పడుతుంది.

డాక్టర్ ని సమర్థిస్తామని ముందుకొస్తారు “పీపుల్స్ మెసెంజర్” పత్రిక వారు. ఇప్పుడు ఆ baths వద్ద మరమ్మత్తులు చేయాలంటే అయ్యే ఖర్చు భరించలేమనీ, ఒక రెండేళ్ళయినా వాటి వల్ల వచ్చే ఆదాయానికి గండి పడినట్లే ననీ, కనుక ఇలాంటివి చెప్పి ఊరు పేరు చెడగొట్టకనీ అతని అన్న అతన్ని హెచ్చరిస్తాడు. డాక్టర్ గారు అది వినరు – ఈ విషయాలన్నీ చెబుతూ వ్యాసాలు రాసి జనానికి అవగాహన కలిగిస్తాననీ, జనమే అర్థం చేసుకుంటారనీ ధీమాగా ఉంటారు. మరి ఆ తరువాత డాక్టర్ గారు ఏం చేశారు? అతని ప్రత్యర్థులు ఏం చేశారు? ఇలాంటివన్నీ మామూలు భాషలోనే రాసినా గొప్ప ప్రభావవంతంగా రాసిన వైనం నాటకం చదివి తెలుసుకోవాల్సిందే.

కథ అంతా చదువుతూంటే మీకు సమకాలీన సంఘటనలు ఏవైనా గుర్తుకువచ్చినా, గతంలో జరిగిన పరిణామాలు తల్చుకున్నా ఆశ్చర్యం లేదు. ఆ వస్తువు ఇంకా సమకాలీనంగానే అనిపిస్తుంది నాకు…ఇది ఎప్పుడో ౧౮౮౦లలో రాయబడినపటికీ! “Majority is not always right” అన్న కాంసెప్ట్ నే భరించలేకపోతే మట్టుకు బహుశా నాటకం అంత గొప్పగా అనిపించకపోవచ్చు.

డాక్టర్ గారు వ్యాసం రాసింది మొదలు క్రమంగా అతన్ని గౌరవించే ఊరి ప్రజలంతా అతనికి వ్యతిరేకంగా మారి (మార్చబడి) అతన్ని enemy of the people అనడం, దానికి డాక్టర్ ప్రతిస్పందన – ఊరొదిలి, దేశం వదిలి వెళ్ళిపోవాలి అనుకునేదాక వెళ్ళి మళ్ళీ ఒక్కడినే అయినా ఒక్కడినున్నాను కదా పోరాటం కొనసాగించడానికి – అనుకునేంత స్పూర్తిని తిరిగి పొందడం – ఇదంతా చదువుతూంటే చాలా ఉద్వేగానికి లోనయాను.

నాటకం ఆద్యంతమూ నన్ను కట్టిపడేసినా, ముగింపు విషయంలో నాకు కొంత అసంతృప్తి ఉంది. “the strongest man in the world is he who stands most alone.” అన్న డాక్టర్ గారి వాక్యంతో ఈ నాటకం ముగుస్తుంది. ఆశాజనకమైన ముగింపే కానీ, అక్కడ అన్ని దిశలలోనూ నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లో మరి ఆయన ఏం చేశాడు? చివరకు జనాన్ని నమ్మించగలిగాడా? ఇలాంటి ప్రశ్నలు ఉదయించకమానవు మనకు. ఇబ్సెన్ రాసిన Ghosts నాటకానికి వచ్చిన స్పందనకు అతని ఆవేశపూరితమైన ప్రతిస్పందనే ఈ నాటకం అంటారు. ఆ నాటకంకూడా అప్పట్లో నేను చదివాను- ఆ కాలానికి సంచలనం సృష్టించి ఉండాలి. మరి ప్రతిస్పందన సగంలో ఆపేస్తే ఎలా? అనుకున్నాను ముగింపు వాక్యం ఆ తరువాత అనేకసార్లు గుర్తు వచ్చినా కూడా.

En_folkefiende_originalcoverనాటకం మరీ ఆదర్శభావాలతో, ఒక్కోచోట వాస్తవిక జీవితంలో అమలుపరచి నెగ్గుకురాలేని విధంగా అనిపిస్తుంది నాకైతే. కొన్ని చోట్ల చాలా arrogant గా కూడా అనిపించింది (డాక్టర్ ప్రజల మీద కోపంతో విరుచుకుపడే దృశ్యాల్లో). అయితే, కథలో లీనమయి ఇవన్నీ పట్టించుకోకపోతే మట్టుకు గొప్ప డ్రామా ఉంది ఇందులో. ప్రదర్శన ఏదైనా ఎప్పటికైనా చూడగలిగితే బాగుండు. ఈ నాటకం ఆధారంగా సత్యజిత్ రాయ్ “Ganashatru” అన్న బంగ్లా చిత్రం తీశాడు. మూల కథకు నేరుగా విధేయత చూపకపోయినా, కథలోని సారాన్ని ఆ సినిమా సరిగ్గా పట్టుకుందనిపించింది నాకు. అది అటుపెట్టినా కూడా భారతీయ జీవితానుభవాలకి అనుగుణంగా చాలా గొప్పగా మార్పులు చేశారు అని నా అభిప్రాయం. నాకళ్ళకి అది ఇబ్సెన్ నాటకానికి గొప్ప అనుసరణగా కనబడ్డది. ఎవరికైనా ఆసక్తి ఉంటే, ఆ సినిమా యూట్యూబులో దొరుకుతుంది. ఆంగ్ల ఉపశీర్షికలు కూడా దొరుకుతాయి కాస్త శ్రమ పడితే.
(పక్కన కనిపిస్తున్న బొమ్మ 1882నాటి ఒరిజినల్ కవర్ అట, వికీసోర్స్ ప్రకారం)

నాటకం ప్రాజెక్ట్ గూటెన్బర్గ్ వారి జాలగూటిలో ఉచితంగా చదివేందుకు ఈ-బుక్ గా లభ్యం. LibriVox ద్వారా ఆడియోగా కూడా లభ్యం. మరిన్ని వివరాలకు వికీపేజీ చూడండి. పుస్తకం గురించి వివిధ పాఠకులు వెలిబుచ్చిన అభిప్రాయాలను గుడ్రీడ్స్.కాం లోని ఈ పుస్తకం పేజీలో చూడండి.
An Enemy of the People

Henrik Ibsen, R. Farquharson Sharp (Translator)

Play
http://www.gutenberg.org/files/2446/2446-h/2446-h.htm

About the Author(s)

అసూర్యంపశ్య0 Comments


Be the first to comment!


  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

A Doll’s House: Henrik Ibsen

ముళ్ళపూడిగారికి ఇష్టమైన రచయితలు తెల్సుకోడానికి ప్రయత్నించినప్పుడు తెల్సిన రచయిత...
by Purnima
3