వేదవతి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక
********
‘వేదవతి’ పురాణవైర గ్రంథమాలలోని పదకొండవ నవల.

విక్రమార్క చక్రవర్తి కథ ఇది. ఈయన శకకర్త. ఈయన మునిమనుమడు శాలివాహనుడు మరొక శకకర్త.

ఇందులో కథ చాలా చిన్నది. విక్రమార్కుడు ఉజ్జయినిని పరిపాలిస్తూ ఉంటాడు. ఆయన దర్శనానికి ఒక బ్రాహ్మణుడు రావడంతో నవల మొదలవుతుంది. ఆయన సింహపుర దేశం నుండి వచ్చాడు. అది ఉరగ కటక దేశాల మధ్యలో వుంది. ఉరగ దేశానికి తూర్పున అభిసార కాంభోజ త్రిగర్త దేశాలున్నాయి. ఆ దేశాలు, అలాగే ఉత్తరజ్యోతిష, శక, కిరాత, దరద దేశాలు చక్రవర్తికి వశం అయ్యాయి. ఒక్క బాహ్లిక దేశమే కాలేదు. ఆ దేశాలన్నీ యవనమయమయిన దేశాలు. అక్కడి బ్రాహ్మణులు కూడా యవనాచారాలే అవలంబిస్తూ వున్నారు. అలా అవలంబించని కొందరు వేదమతానుసారులయిన బ్రాహ్మణులు యవనుల వలన ఇబ్బందులకు గురవుతూ వున్నారు.

ఇప్పుడు చక్రవర్తి దర్శనం కోసం వచ్చిన బ్రాహ్మణుని కుమార్తెను యవనులు అపహరించారు. ఆమె పేరే వేదవతి. ఆయన “మహారాజా! ఎక్కడి సింహపురి? ఎక్కడి అంబావతీ నగరము? నేను విడువని ప్రయాణంతో పంచనదులను దాటి సరస్వతీ దృషద్వతులను దాటి గంగా యమునలను దాటి తమ దర్శనార్థము వచ్చితిని. నన్ను పాలింతురని యాశించుచున్నాను.” అంటాడు.
(ఉజ్జయినీ నగరం తొలుతటి పేరు అంబావతి)

చక్రవర్తి ఆయన పట్ల ఎంతో గౌరవం చూపిస్తాడు. కానీ ‘ఆమెని వారు దొంగిలించుకొని పోయి చాలా కాలమయింది కదా, ఇప్పటికే ఆమెని ఎవరికయినా ఇచ్చి పెళ్ళి చేసి వుంటారు కదా!’ అన్న సందేహం వెలిబుచ్చుతాడు. అపుడు ఆ వృద్ధుడు ఆమె ఒక ప్రత్యేకమైన స్త్రీ అని, ఆమెని ఎవరూ వివాహమాడలేరనీ వివరిస్తాడు. ఆమె దేవీ భక్తురాలు. చిన్నప్పుడే మంత్రోపదేశం పొందినది. నాలుగేళ్ళు నిద్రాహారాలు మాని ఆ మంత్రానుస్ఠానం చేసి దేవిని ప్రత్యక్షం చేసుకుంది. ఆమె యిష్టానికి వ్యతిరేకంగా ఎవరూ వివాహం చేయలేరు కానీ ఆమెని హింసిస్తూ వుండి ఉండవచ్చునని చెప్పి బాధపడతాడు. అప్పటికి ఆయన ఆ వివరాలే చెప్తాడు కానీ తర్వాత ఆమెని గురించి కథ నడుస్తూ వుండగా మనకు మరికొన్ని వివరాలు తెలుస్తాయి.

ఇంతకీ ఆ వృద్ధ బ్రాహ్మణుడు సాధారణ వ్యక్తి కాదు. ఆయన “వరాహమిహిరుడు”. ఆ విషయం ముందు చెప్పడు ఆయన. వేదవతి విషయం మాట్లాడాక చక్రవర్తి ఆయనతో తన మనసులోని కోరిక ఒకటి చెప్తాడు.
“సూర్యుని యొక్క అయనాది గమనము గణితమాత్రా నుమేయమే కాక, పూర్వము మహర్షుల చేత దృశ్యమానముగా కూడ చేయబడుచుండెడిదని విద్వదుపదిష్టమైన విషయము. ఒక రాతి కట్టడమును కట్టి, గగనము యొక్క పరిమాణమును విభజించి, సూర్యకిరణ ప్రసారమును దైనందినముగా రేఖల చేత చూపించు కట్టడములు, తొల్లి హస్తినాపురము నందు కలవని వృద్ధోక్తి కలదు. మహాకవి కాళిదాసు పేరు తమరు వినియుందురు. ఆయన మా యాస్థానమునందున్నాడు. ఆయన గొప్ప జ్యోతిష్కుడు. ఆయన మొదట జ్యోతిష్కుడు. తర్వాత కవి. ఆయన చెప్పగా విన్నాము. అట్టి కట్టడము సాధ్యమనియు, దానికి వట్టి జ్యోతిష్కుడే కాక వాస్తు శాస్త్ర పరిజ్ఞాత కూడ కావలయుననియు, అట్టివాడు మీ సింహపురి రాజ్యమునందున్నాడనియు కాళిదాస మహాకవి చెప్పినాడు.” అంటాడు.
చక్రవర్తి ఆమాట చెప్పాక, ఆ వృద్ధుడు మీరు వెతుకుతున్న ఆ పండితుడు ఎవరని అడుగుతాడు. చక్రవర్తి వరాహమిహిరుడు అన్న పేరు చెప్పాక, అప్పుడు “నేనే ఆ వరాహమిహిరుడిని” అంటూ బయటపడతాడు.

ఆయనే వరాహమిహిరుడు అని తెలియగానే చక్రవర్తి లేచి నిలుచుని చేతులు జోడించి కాళిదాసాదులతో పాటు తన ఆస్థానంలో ఉండమని ప్రార్థిస్తాడు. అలాగే అంతకు ముందు తాను చెప్పినటువంటి కట్టడాన్ని ఉజ్జయినీ నగరంలో కట్టించమని అడుగుతాడు. “ఉజ్జయినీ నగరము జ్యోతిశ్శాస్త్ర భూమి కావలయును. సూర్య కిరణ ప్రసారము యొక్క గణన ముజ్జయినీ నగరాంశ నుండి ప్రారంభింప బడవలయును.” అని అభ్యర్థిస్తాడు.
ఇక చక్రవర్తి తన గూఢచారులను పంపి వేదవతిని వెతికించడము, వాయువ్య దిశలో వున్న రాజ్యాలను జయించి యవనుల వలన అక్కడి ప్రజలకు కలిగే బాధలను తప్పించడము మిగతా కథ.

నిజానికి ఒక్క ఉత్తర బాహ్లిక (రూమ్యక) దేశం తప్ప మిగతా దేశాలన్నీ అంతకు ముందు చక్రవర్తి జయించి వచ్చినవే. అయితే అప్పుడు వారు ఒక చిత్రమైన వంచన చేస్తారు. ఉత్తర బాహ్లికములకు చక్రవర్తి సైన్యాలు పోలేదు. మిగతా దేశాల వారందరూ లొంగిపోతారు. ఎవరో ఒకడిని రూమ్యకాధిపతిగా చూపించి వాడి చేత కూడా చక్రవర్తికి జోహారు చేయించి రూమ్యక దేశం కూడా లొంగిపోయినదన్నట్లుగా చేస్తారు. ఆ రహస్యం చక్రవర్తికి తర్వాత తెలుస్తుంది.

మిగతా దేశాలన్నీ చక్రవర్తికి లొంగిపోయి కప్పాలు కడుతూ వుంటాయి. చక్రవర్తి సైన్యాలు వచ్చినా ఆ దేశాలలో యుద్ధం జరగదు. కానీ ఆ దేశాల నుంచి పెద్ద ఎత్తున జనం వెళ్ళి రూమ్యకాధిపతి సైన్యంలో చేరుతూ వుంటారు. చక్రవర్తికి వ్యతిరేకంగా సైన్య సమీకరణ అంతా అక్కడ జరుగుతూ వుంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్రవర్తి గూఢచారులు ఎలా చక్కబెడతారనేదే ఈ నవల లోని కథ. ఒకటీ రెండూ కాదు బోలెడన్ని పాత్రలు. వాళ్ళు ఆయా దేశాల మధ్య అనుమానింప బడకుండా తిరిగేందుకు, ఒకరికొకరు సమాచారం అందించుకునేందుకు ఉపయోగించే రకరకాల పద్ధతులు, వ్యూహాలు.

ప్రతి పాత్రా ప్రవేశించాక ఒకటి రెండు వాక్యాల లోనే మనం అది మరో కొత్త పాత్ర అని మర్చిపోయి దాని వెనుక పడి ఆ అడవుల వెంటా గుట్టల వెంటా రాత్రీ పగలూ తేడా తెలీకుండా తిరుగుతాం కానీ కొంచెం అలసిపోతామనే చెప్పాలి. ఈ నవలల వరుసలో కొంచెం శ్రమపడి చదవాల్సి వచ్చిన మొదటి నవల ఇదే. ఎక్కువ కథ లేకపోవడం వలన, పాత్రలు మరీ ఎక్కువ అవడం వలన ఒక దశలో కొంచెం విసుగనిపించే అవకాశం వుంది.

టికటిక అనే ఒక విలక్షణమయిన పాత్ర వుంది ఇందులో. వాడు మిత్రగుప్తుడనే గూఢచారికి తమ్ముడి వరుస. రామఠ దేశంలో ఉంటాడు. వారిరువురి ముత్తాతలు అన్నదమ్ములు. తర్వాత ఆ కుటుంబం దూరంగా వెళ్ళిపోయి రామఠ దేశంలో స్థిరపడినా, మిత్రగుప్తుడు తన ఉద్యోగ బాధ్యతలలో భాగంగా ఆ కుటుంబాన్ని వెతుక్కుంటూ ఆ దేశం వెళ్తాడు. ఆ టికటిక మొదట పరమ అనాగరికుడు. ఒక జంతువు వంటి వాడు. ఎవరైనా తనకి యిష్టం లేని మాట మాట్లాడితే వాళ్ళ మొహం మీద ఉమ్మి వేసేంత పశుప్రాయుడు. కానీ తర్వాత వాడే చక్రవర్తి కార్యాన్ని సాధించి పెట్టడంలో, వేదవతిని కనిపెట్టడంలో గూఢచారులందరినీ మించిన కీలక పాత్ర పోషిస్తాడు.

వేదవతికి చిన్ననాటినుండి ఆరోగ్యం సరిగా వుండదు. అయితే ఒక సందర్భంలో విపరీతమైన దగ్గుతో బాధపడుతున్న ఆమె మలహరి రాగం వినిపించినపుడు ఆ బాధ నుంచి విముక్తి పొందుతూ ఉందనీ, ఆ రాగం వింటున్నంత సేపూ దగ్గుతెర రావడం లేదనీ గమనిస్తారు. ఆ తర్వాత ఆ రాగం వినిపించిన గాయకుడికి గురువైన ఒక మహాయోగి ద్వారా ఆమెకు త్రిసంధ్యల లోనూ వేదము వినిపిస్తూ వుండాలనీ, అలా ఒక పదేళ్ళు నిర్విఘ్నంగా వినిపిస్తే ఇక ఆమెని వ్యాధి తాకదని తెలుసుకుని అలా ఆమెకు వేదం వినిపించే ఏర్పాటు చేస్తారు. కానీ ఈలోపే ఒకనాడు వరాహమిహిరుడు గ్రామంలో లేని సమయంలో ఒక భిక్షుకుడి వంటి వాడు తన సంగీతంతో ఆకర్షించి ఆమెను అపహరిస్తాడు.

అలా ఆమెను తీసుకువెళ్ళినవాడి పేరు నిమేషధారి. తీసుకువచ్చేందుకు పురమాయించిన వాడు కటకటయోగి. ఈ నవలలో ఈ కటకట యోగియే జయద్రథుడు. పురాణవైర గ్రంధమాల మొదటి నవల నుంచీ కొనసాగుతున్నవాడు. మూడు వేల ఏళ్ళ నుంచి తన జన్మ హేతువును మరిచిపోకుండా రక్షించుకుంటూ వస్తున్న వాడు. వాడిలో విశేషమేమిటంటే వాడు ఈ మూడు వేల ఏళ్ళలో పది పదిహేను జన్మలెత్తి ఆయా జన్మల లోని సర్వ సంస్కారాలు, విద్యలు తనవెంట తెచ్చుకుంటున్నాడు.

వాడు తన యోగశక్తి చేత, వేదాత్మ వరాహమిహిరుని ఇంట్లో వేదవతిగా పుట్టిందని తెలుసుకుంటాడు. ఆమెని అపహరింప చేస్తాడు. తన ప్రయత్నాలన్నీ పూర్తయ్యేవరకు చక్రవర్తి ఆ ప్రాంతాలపై దండెత్తకూడదు. అంతవరకు వేదవతి మరణించకూడదు. అందుకని ఆమెను పూర్తిగా చావనివ్వడు. ఒక అడవిలో, సులభంగా ఎవరూ వెళ్ళలేని ఒక గుహలో బంధించి వుంచి ఆమెకు నిమేషధారి సంగీతం వినిపిస్తూ ఉంటాడు. అదొక వికృతమైన సంగీతం. అది వింటే నాదరూపిణి అయిన వేదవతి కృశించి పోతుంది. మరణానికి చేరువవుతుంది. అపుడు మళ్ళీ మధుగుంజ అనే యువతి యొక్క సంగీతం వినిపించడం ద్వారా వేదవతిని కుదుటపరుస్తూ ఉంటాడు. మధుగుంజ సంగీతం కృశించిన ఆమె శరీరానికి పుష్టిని యిస్తుంది.

మధుగుంజ ఎవరంటారా? ఆమె ఉరగదేశపు మంత్రి వీరదత్తుని కూతురు. ఉరగదేశపు రాజు పేరు సౌమ్యుడు. అయన మొదట వేదమతాభిమానే. అయితే అనారోగ్యంతో వున్న అతని ఏకైక పుత్రుడిని తన మహిమలతో ఆరోగ్యవంతుడిని చేయడం ద్వారా ఆరాజుని తన వశం చేసుకుంటాడు కటకటయోగి. మంత్రి కూతుర్ని తీసుకెళ్ళి తన పని కోసం (వేదవతి కోసం) ఉపయోగించుకుంటాడు. చక్రవర్తిని ఎదుర్కునేందుకు తన అధీనంలో వున్న ఈ ఉరగదేశపు రాజు, యువరాజు, మంత్రి కీలకం అని అనుకుంటాడు కానీ చివరికి చక్రవర్తి గూఢచారుల చాకచక్యం వల్ల అతని పథకం అక్కడి నుండే భగ్నం అవడం జరుగుతుంది.
ఈ నవలలో చక్రవర్తిని చాలా గొప్పగా పరిచయం చేస్తారు రచయిత మనకి.

విక్రమార్క చక్రవర్తి ధృవుడి లాగా అయిదేళ్ళ వయసులోనే తపస్సు చేసేందుకు వెళ్ళాడట. పన్నెండేళ్ళు తపస్సు చేశాడట. దానివలన ఆయనకి అనంతశక్తులు కలిగాయి. వరాహమిహిరుడు ఆయన దర్శనం కోసం వచ్చినపుడే చక్రవర్తితో “మీరు వేదవతి విషయమును తెలిసికొనవలయునన్న తాత్పర్యము ననుసంధించి ధ్యాననిష్ఠులైనచో నా యా విషయములు తమకు గోచరింపగలవు.” అంటాడు.

తర్వాత మిత్రగుప్తుడు తన విధినిర్వహణ లో భాగంగా తిరుగుతున్నపుడు అతనికి ఒక కల వస్తుంది. ఆ కలలో అతనికి చక్రవర్తి, తనకి తమ్ముడి వరస అయిన టికటిక, అంతకు మునుపు అతనికి పరిచయం లేని మరో వ్యక్తీ కనపడతారు. నిద్ర లేచాక మిత్రగుప్తుడు ఆ కలని విశ్లేషించుకునే సందర్భంలో ఈ క్రింది వాక్యాలు వుంటాయి.

“ఉజ్జయినీ నగరము నందొక ప్రథ యుండెను. చక్రవర్తి మహాతపస్వి. ఆయన నిష్కారణముగా యెవ్వరికిని స్వప్నములో కనిపించడు. ఏదో ప్రయోజనముండ వలెను. ఇద్దరు ముగ్గురికి చక్రవర్తి స్వప్నములో కనిపించిన తర్వాత గొప్ప లాభములు కల్గెను. ఒకనికి ధనాగమమయ్యెను. ఒకనికి మహావ్యాధి నెమ్మదించెను. తనకే లాభము కలుగబోవుచున్నదో!”

అలా ఆలోచించుకున్న మిత్రగుప్తుడు కేవలం ఆ కల ఆధారంగా తను టికటికని కలవడం వలన ప్రయోజనం ఉంటుందని భావించి అతని కోసం వెతకడం మొదలుపెడతాడు.

చిత్రమేమిటంటే టికటికకి కూడా అలాంటి కల వస్తుంది. అందులో చక్రవర్తి, మిత్రగుప్తుడు కనిపిస్తారు వాడికి. ఆ విషయం తెలిశాక మిత్రగుప్తుడు టికటికతో తన మాట నెగ్గించుకునే ప్రతివాడు రాజు కాదనీ, ప్రజల సంతోషం కోసం తన పరిమిత జ్ఞానానికి యేమి తోచిందో అది చేసేవాడు కూడా రాజు కాదనీ అంటూ ఒక గొప్ప విషయం చెప్తాడు. “ఎవడు సర్వజీవముల యందనుస్యూతముగా నుండునో, యందరు జీవులయందు తాను ప్రత్యక్షము కాగలడో, వాడు రాజు కావలయును. శ్రీ విక్రమార్క చక్రవర్తి అటువంటి వాడు. స్వప్నమన్న పేరుతో ఆయన నా జీవునిలో వున్నాడు. నీ జీవునిలో వున్నాడు. ఇది యొక యాశ్చర్యము. చక్రవర్తి యనగా చక్రము నందు వర్తించు వాడు. ఆయన జీవచక్రము నందు వర్తించుచున్నాడు.” అంటాడు.

ఇలాంటి వాక్యాలతో చక్రవర్తి పట్ల బోలెడంత ఆరాధన కలుగుతుంది. చివరికి అంత అనాగరికుడయిన టికటిక కూడా తనకి కలలో కనబడింది చక్రవర్తి అని అర్ధం కాగానే “మీ చక్రవర్తి యెంత అందగాడు!” అంటాడు తనకు వచ్చిన కలని గుర్తు చేసుకుని.

చక్రవర్తి అందాన్ని గొప్ప గొప్ప మాటలతో, సమాసాలతో తాను పూనుకుని వర్ణించకుండా ఇలా ఒక అమాయకుడి నోటి నుంచి పలికించిన ఈ చిన్న మాటతో రచయిత మన మనసులో మరింత గాఢంగా నిలబెడతారు.

చెప్పాను కదా మిగతా నవలలా కాకుండా ఈ నవలని కొంచెం శ్రమపడి, కొద్దిగా ఓపికతో చదవాలి. కానీ చదివితే అక్కడక్కడా ఈ క్రింది వాక్యం లాంటి రత్నాలు దొరుకుతాయి. “కొన్ని విషయములు వాని యంతట నవి బుద్ధికి భాసించును. అశిక్షితమైన విషయము శిక్షిత మైనట్లు భాసించును. ఇది వివేకమను గుణము యొక్క పరాకాష్ఠ.”

*****
విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

Vedavathi
Purana Vaira Granthamala
Viswanatha Satyanarayana

You Might Also Like

5 Comments

  1. a jagadeeswara rao

    చాల బాగుంది

  2. జాజిశర్మ

    చాలా మంచి నవల

  3. జాజిశర్మ

    అద్భుత:

  4. ramireddy gogula

    అద్బుతం

Leave a Reply to జాజిశర్మ Cancel