హెలీనా – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక
********
‘హెలీనా’ పురాణవైర గ్రంథమాలలోని పదవ నవల.

ఈ నవల లోని కథానాయిక హెలీనా. ఆమె తండ్రి మధ్య ఆసియాలోని కొన్ని ప్రాంతాలకు రాజు. పూర్వం అతడు ఒక మహావీరుని సేనా నాయకులలో ఒకడు. అంటే ప్రసిద్ధ సేనానాయకులలో ఒకడు కాదు. మామూలు సేనానాయకుడే. ఆ మహావీరుడు తన ముప్పది మూడవ యేటనే చనిపోయాడు. అతడు గ్రీసు దేశస్థుడు. ఎన్నో దేశాలని గెలిచాడు. హెలీనా తండ్రి కూడా గ్రీసు దేశస్థుడే. ఆ మహావీరుడు చనిపోయిన తరువాత, అతడు గెలిచిన రాజ్యాలన్నీ ఛిన్నాభిన్నములైపోయాయి. గ్రీసు దేశం యొక్క ప్రశస్తి పోయింది. హెలీనా తండ్రి మధ్య ఆసియాలోని కొన్ని భాగాలకి రాజయ్యాడు.

ఈ పరిచయం చదవగానే అర్థమయింది కదా, ఆ మహావీరుడి పేరు అలెగ్జాండర్. అతని సేనానాయకుడు, హెలీనా తండ్రి అయిన వాడి పేరు సెల్యూకస్.
ఈ సెల్యూకస్ “ఒరాన్ టీజ్” నది మీద “ఆంటియోషియా” అనే నగరాన్ని నిర్మించాడు. ఆ నగరంలోని మాహారాజ సౌధంలో వుంటుంది హెలీనా. ఆమెకి భారతదేశం మీద చాలా ఆసక్తి. భారతదేశం గురించిన విషయాలు తెలుసుకోవాలని, సంస్కృతం నేర్చుకుని ఆ భాషలో వ్రాయబడిన మహాగ్రంథాలు చదవాలని కోరిక. తండ్రి అనుమతి తీసుకుని పినాకి అనే భారతీయుడిని సంస్కృతం నేర్పేందుకు ఏర్పాటు చేసుకుంటుంది. పినాకి భార్య పేరు రోహిణి.
పినాకి కుటుంబం ఆ ప్రాంతాలకు వచ్చి నాలుగయిదేళ్ళయింది. ఒక వర్తకుల గుంపుతో పాటు వచ్చారు వాళ్ళు. ఆరోజుల్లో వర్తకులు గుంపులుగా ప్రయాణించి, పరిమళ ద్రవ్యాలు, రత్నాలు, మణులు, సన్నని దువ్వలువలు మొదలైన వాటిని తీసుకు వెళ్ళి, పారశీక దేశంలో, అస్సీరియా దేశంలో, అరబ్బుల దేశంలో, ఈజిప్టు దేశంలో, మధ్యధరా సముద్రం చుట్టూ వెలసిన ప్రధాన నగరాల్లో, గ్రీసు మహానగరములలో, రోమ్ రాజ్యం లోని మహానగరాలలో అమ్ముతూ వుండేవారు.

అప్పుడు పరదేశాలకు వెళ్ళే భారతీయ పండితులు ఎక్కువ మంది వుండేవారు కాదు కాని ఎవరో పినాకి వంటి ఒకరిద్దరు మాత్రం ధనం మీద ఆశతోనో, భారతీయ విజ్ఞానాన్ని పరదేశాలలో వ్యాపింప చేయాలనే వ్యర్థమైన అహంకార భావంతోనో అలా వెళ్ళి అక్కడ నివాసం ఏర్పరచుకుంటూ వుండేవారు. విదేశాలకు వెళ్ళి నివసించడం చాలా సాధారణమై పోయిన ఈ రోజుల్లో కూడా ఒక కుటుంబం కొత్తగా పరదేశానికి వెళ్ళి నివసించాలనుకున్నప్పటి అనుభవాలు, అందుకోసం వారు చేసుకునే ఏర్పాట్లు ఆసక్తికరంగా వుంటాయి కదా, అలాంటిది ఇది క్రీ.పూ. మూడు వందల పన్నెండు నాటి కథ. అప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి వుండడం, పసుపు, కుంకం, కాటుక, తిరుగమోత గింజలు వంటి బోలెడు సామాను మోసుకెళ్ళవలసి రావడం ఇలాంటివన్నీ చదవడం మరింత ఆసక్తికరంగా వుంటుంది.

సరే, పినాకి హెలీనాకు సంస్కృత పాఠాలు చెప్తూ ఉంటాడు. రోహిణి కూడా అపుడపుడూ ఆమె దగ్గరకు వచ్చి కూర్చుని భారతదేశాన్ని గురించిన కబుర్లు చెప్తూ వుంటుంది. అప్పటికి కాళిదాసు పుట్టలేదు. మాఘ, భారవులు పుట్టలేదు. సంస్కృతం నేర్చుకునేవారికి రామాయణమే మొదటి పాఠ్యగ్రంథం. ఆ రామాయణ కథ చెప్తుంటే హెలీనా ఆసక్తిగానే వింటుంది కానీ ఆమెకి అందులో బోలెడు సందేహాలు. ఆ రాజసౌధంలో వెలియోనస్ అని పిలువబడే రాజోద్యోగి ఒకడు వుంటాడు. అతను అక్కడి పరిచారకులపై పర్యవేక్షకుడు. అరవై ఏళ్ళ వాడు. ఎన్నో దేశాలు చూసినవాడు. అలెగ్జాండర్ తో పాటు యౌన దేశం దాకా వెళ్ళి వచ్చిన వాడు. అక్కడినుంచి వెనక్కి వచ్చేసినా, భారతదేశం కూడా వెళ్ళాననీ, అక్కడి విషయాలన్నీ తనకు తెలుసుననీ చెప్పుకుంటూ ఉంటాడు.
వాడికి హెలీనా పినాకి దగ్గర సంస్కృతం నేర్చుకోవడం యిష్టం వుండదు. కోతి సముద్రాన్ని దాటడం ఏమిటి? దాని తోకకి మంట పెడితే దానికేమీ కాకపోవడం ఏమిటి? కోతిని దేవుడంటూ పూజ చేయడం ఏమిటి? – ఇలాంటి ప్రశ్నలు వేస్తుంటాడు.

ఇక వీళ్ళ మధ్యలోకి వచ్చే మరో పాత్ర నీపాలి. ఆమెది కూడా ఆ దేశమే. ఆమె అసలు పేరు నెమ్ఫిస్. యూఫ్రటీస్ నది ఒడ్డున వున్న బాబిలాన్ నగరం నుంచి కొంచెం తూర్పుగా వెళ్ళి టైగ్రిస్ నదిని దాటి ముందుకు వెళ్తే సామర్దార్ అనే ప్రదేశం వస్తుందనీ, దానికి పైన కీర్కుక్ అనే నగరం వుందనీ, తమ వూరు దానికి దగ్గరలో వుందనీ చెప్తుంది ఆమె.

ఆమె అందమైనది కనుక చాలామంది ఆమెను పెళ్ళాడాలని రావడం, ఆమె తండ్రి ఆమెని వాళ్ళకి ఈయకపోవడంతో వాళ్ళందరూ అమె తండ్రికి విరోధులు కావడం, అందువలన ఆమెకు పదిహేనేళ్ళప్పుడు ఆమె తండ్రి ఆమెను తీసుకుని పారిపోవడం, మొదట కెర్మన్ నగరం చేరి ఆ తర్వాత అక్కడినుండి భారత దేశ వాయువ్య ప్రాంతం లో వున్న బాహ్లిక, శక, యవన, తుషార దేశాలలో ఒక పదేళ్ళు గడపడం, ఆ తర్వాత ఆమె తండ్రి చనిపోగా ఆమె భారతదేశం లోని గిరివ్రజపురం చేరి అక్కడ చంద్రగుప్త మహారాజుకి చామరగ్రాహిణిగా కొన్నాళ్ళు వుద్యోగం చేయడం – ఇదీ ఆమె కథ. భారతదేశంలో ఆమె తన పేరు నీపాలిగా మార్చుకుంటుంది.

భారతదేశంలో ఆమెకొక ప్రేమకథ కూడా వుంటుంది. దుష్యంతుడు అనే క్షత్రియ యువకుడు ఆమెని ప్రేమిస్తాడు. అయితే అతని బంధువులకి అది యిష్టం లేనందువల్ల ఆమె మళ్ళీ అపాయంలో పడుతుంది. నీలాంబరధర్మి అనే వర్తకుడి సాయంతో, తన దేశానికి వెళ్ళేందుకు బయల్దేరుతుంది. అయితే అక్కడా ఆమెకు పాత శత్రువులతో ప్రమాదముండే అవకాశముంది కనుక అక్కడికి ఎవరినైనా పంపి పరిస్థితులు ఎలా వున్నాయో తెలుసుకుంటానని చెప్తాడు నీలాంబరధర్మి. వర్తకుల గుంపుతో ఒంటరి స్త్రీ ప్రయాణించడం ప్రమాదం కనుక ఆంటియోషియా నగరం దాకా ఆమె పురుష వేషంతో ప్రయాణిస్తుంది.

అక్కడనుంచి ఆ వర్తకుల గుంపు పశ్చిమానికి పోతూ వుంది కనుకా, ఆమె గ్రామం ఉత్తరాన వుంది కనుకా, అక్కడి పరిస్థితుల గురించి ఇంకా తెలుసుకొనవలసి ఉంది కనుకా అంతవరకు ఆమెని తనకు పరిచయస్థుడయిన పినాకి ఇంట్లో వుంచుతానంటాడు నీలాంబరధర్మి. నిజానికి అతనికీ ఆమెని తన భార్యగా చేసుకోవాలన్న ఆలోచన వుంటుంది. అందుకే ఆమె పారిపోకుండా ఒక వ్యక్తిని కాపలా వుంచి మరీ వెళ్తాడు. నీపాలికి అతని దురుద్దేశ్యం తెలుసు. కానీ అంతకన్నా గత్యంతరం లేక అతనితో బయల్దేరి వస్తుంది.

నీపాలి అక్కడ వున్న సమయంలో ఆమెకీ రోహిణి, పినాకి దంపతులకి ఒకరిపట్ల మరొకరికి అభిమానం కలగడం, రోహిణి ద్వారా నీపాలి హెలీనాని కలవడం జరుగుతుంది. నీపాలికి మాగధి భాష వచ్చునని తెలుసుకున్న హెలీనా, ఆమెని తనకు మాగధి భాష నేర్పమని అడుగుతుంది. తనకు అక్కడ ఆశ్రయం దొరికితే మాగధి భాషే కాక తనకు వచ్చిన ఖడ్గవిద్యనీ నేర్పుతానంటుంది నీపాలి. నీపాలికి భారతదేశపు రాజకీయ వ్యవహారాలు కూడా తెలుసునని గ్రహించిన హెలీనా తండ్రితో చెప్పి ఆమెకు తన ఉపాధ్యాయురాలిగా ఉద్యోగమిచ్చి రాజసౌధం లో వుండే అవకాశం కల్పిస్తుంది. అలా నీపాలి నీలాంబరధర్మి నుంచి తప్పించుకుని స్థిమిత పడుతుంది.

రోహిణి, పినాకి, నీపాలి, హెలీనా – వీళ్ళ నలుగురి మధ్యా సయోధ్య వెలియోనస్ కి నచ్చదు. అతను చేసే కొన్ని కుట్రలు, రాజు సెల్యూకస్ ఆజ్ఞపై పినాకికి, వెలియోనస్ కి మధ్య ఏర్పాటు చేయబడే శాస్త్ర చర్చ, నీపాలికి, వెలియోనస్ కి మధ్య ఏర్పాటు చేయబడే ఖడ్గ విద్యా పరీక్ష – యివన్నీ ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా సాగుతాయి, ముఖ్యంగా రెండుసార్లు జరిగే నీపాలి, వెలియోనస్ ల ఖడ్గ విద్యా ప్రదర్శన. పేరుకి విద్యాప్రదర్శనే అయినా ప్రాణాపాయం వున్న ఆ పరీక్షలో నీపాలి ఎలా గట్టెక్కుతుందన్నది ఆసక్తికరంగా చెప్తారు రచయిత.

(అసలీ నవలలన్నిటిలోనూ రచయిత కత్తియుద్ధాన్ని ఎంత బాగా వర్ణించారంటే ఒక కత్తి చేతికిస్తే నేనూ యుద్ధం చేసేయగలనేమోనని అనుమానం వస్తోంది ఇవన్నీ వరుసగా చదివాక 🙂 )

ఈ సంఘటనలన్నిటి నేపథ్యంలో రోహిణి, పినాకి, నీపాలి, హెలీనాల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. సెల్యూకస్ కి కూడా నీపాలి మీదా పినాకి మీదా కొంత గురి కుదురుతుంది. సరే వెలియోనస్ అయితే మొదటి నుండీ ఆయన అండలో వున్నవాడే.

కొన్ని మలుపుల తర్వాత సెల్యూకస్ భారతదేశ దండయాత్రకి బయల్దేరడం, ఆ సైన్యమంతా ఆంటియోషియా నగరం నుండి బయలేదేరి వరుసగా మజిలీలు చేసుకుంటూ భారతదేశం చేరడం, చక్రవర్తి సముద్రగుప్తుడి సేనకీ, సెల్యూకస్ సేనకీ మధ్య యుద్ధం జరగడం, సెల్యూకస్ సంధి కోరడం, హెలీనా సముద్రగుప్త చక్రవర్తికి భార్య కావడం జరుగుతాయి.

సైన్యం ఏమార్గంలో ప్రయాణించాలి, ఎలా ప్రయాణించాలి అనే నిర్ణయమంతా పినాకి చేస్తాడు. సైన్యం చేసే ఆ ప్రయాణం, నవలలో చెప్పబడిన మధ్య ఆసియా ప్రాంతంలోని వివిధ దేశాల, ప్రదేశాల గురించిన వివరాలు ఆసక్తికరంగా వుంటాయి.

ఇంకా గ్రీకు సైన్యం యుద్ధం చేసే పద్ధతులు, భారతీయులు యుద్ధం చేసే పద్ధతులు, అశ్వ సైన్యాన్ని, గజ సైన్యాన్ని ఉపయోగించుకునే విధానాలు – ఇలాంటివన్నీ ఆసక్తికరంగా వర్ణింపబడినాయి.

ఇక ముఖ్యంగా ఈ నవలలో రచయిత చెప్ప దలచుకున్న విషయాలలో మొదటిది అలెగ్జాండర్ భారతదేశాన్ని జయించలేదన్నది.
“సముద్రగుప్త చక్రవర్తి నాటికి, పది యేండ్ల పూర్వము వచ్చిన యలెగ్జాండరు, అప్పటికి యువరాజు, మహాసేనాపతి అయిన సముద్రగుప్తుని చేతిలో ఓడి పోయి, పారిపోయి, గుండె పగిలి బాబిలాను నగరమున చనిపోయెను. ఇది మన పురాణ కథ. సముద్రగుప్తచక్రవర్తి యొక్క ఆస్థాన కవి అయిన హీరసేనుడు వ్రాసిన వ్రాత. దీనికంటె మెగాస్తనీసు మొదలైన గ్రీకులు వ్రాసిన వ్రాతలు ప్రమాణమైనచో, అవి ప్రమాణమైన మానవుల బుద్ధి విశేషమే విచార్యమగును.” అంటారు. ఈ విషయాన్ని పినాకి మాటలలో చర్చకు పెడతారు. అలగ్జాండర్ భారతదేశాన్ని జయించాడనే విషయం ఎందుకు తర్కదూరమో, ఎందుకు నమ్మశక్యం కాదో పినాకి సెల్యూకస్, వెలియోనస్ , హెలీనాలతో మాట్లాడినపుడు వివరిస్తాడు.

ఇంకా సెల్యూకస్ ఆలోచనలను వివరించే ఒక సందర్భంలో ఈ క్రింది వాక్యాలు వుంటాయి. “కాండియా దేశస్థుడైన యూమినీస్ అన్నవాడు అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క దైనందిన చర్య వ్రాసెను. ఆ చర్యకు ప్రతులు తీసి పంచిపెట్టిరి. భారతదేశములోని చర్యకు మాత్రమే ప్రతులెందుకు తీయవలెను? సేనాపతుల కందరికి మాత్రమే యేల పంచిపెట్టవలెను? భారతదేశము నుండి వచ్చిన తరువాత యలెగ్జాండరు చక్రవర్తి యుత్సాహముగా లేడు. కొలది దినములలో మాత్రమే చనిపోయెను. ఇది యంతయు నొక రహస్యముగా నుండెను.

అన్నిటికన్న సెల్యూకసున కాశ్చర్యమేమనగా తాను భారతదేశమునకు పోలేదు. తాను కూడ పోయినట్లు ఆ దైనందిన చర్యలో వ్రాయబడెను. సింధునదీ ప్రాంతమున నొక చోట నలెగ్జాండరు గెలిచి, అచట సెల్యూకసును తత్ప్రాంతమున కధికారిగా నుంచెనని వ్రాయబడి యున్నది. సెల్యూకసున కర్థము కాలేదు. అచ్చటకు వెళ్ళని తాను వెళ్ళినట్లెందుకు వ్రాయబడియుండెను?”

అదీ సంగతి. అలాగే ఈ నవలలో రచయిత ముఖ్యంగా చెప్పాలనుకున్న మరో విషయం అలెగ్జాండర్ భారతదేశానికి వచ్చినది మౌర్య చంద్రగుప్తుని కాలంలో కాదనీ, పాటలీపుత్రాన్ని పాలిస్తున్న గుప్త చంద్రగుప్తుని కాలంలోననీ. అది కథలో ఎలాగూ చెప్పబడుతుంది. అయితే చరిత్ర ఎలా, ఎవరిచేత మార్చబడిందనేది కూడా కథలో కల్పనగా చెప్పబడుతుంది. సెల్యూకస్ సంధి చేసుకున్నా వెలియోనస్, మెగాస్తనీసులు ఇద్దరూ కలిసి చరిత్రను మార్చి వ్రాయడం, దానిని నీపాలి, పినాకి గుర్తించినప్పటికీ ఆపలేకపోవడం, ఆ వ్రాతప్రతులు వారికి చిక్కకుండా వెలియోనసు వాటిని దాటించడం, పినాకి సముద్రగుప్తుడికి చెప్పినా ఆయన ఆ విషయంలో నిర్లక్ష్యం వహించడం కథలో వుంటుంది. “ఈ యనంతకాలములో నెవడో, యెచ్చటనో, యే కృత్రిమమునో చేయును. దానికొక చోట ప్రాచుర్యము వచ్చును. నష్టమేమి?” అన్న యూహ సముద్రగుప్తునిది.

ఈ నవలలో కథ ఎక్కువగా లేకున్నా వివిధప్రాంతాల గురించి చదవడం బాగుంటుంది. భారతీయుల ఆలోచనలకీ పద్ధతులకీ, విదేశీయుల ఆలోచనలకీ పద్దతులకీ వుండే తేడాలను గురించిన కొన్ని పరిశీలనలూ ఆసక్తికరంగా వుంటాయి. ఒకటి రెండు ఉదాహరణలతో పరిచయాన్ని ముగిస్తాను.

ఒక సందర్భంలో తనకు కలిగే ఆలోచనలను పినాకితో, నీపాలితో పంచుకుంటూ హెలీనా ఇలా అంటుంది. “ఈ సంస్కృతపు చదువునకు ఫలితము – చదివిన వాని మనస్సు, యిట్లు విషయములందభివ్యాప్తమై, గుండెలో నున్న యభిప్రాయములను తఱచి చూచుకొనగలుగుట యేమో! ఆ భాషలో ఆశక్తి యున్నది కాబోలు!”

మరో సందర్భంలో హెలీనా నీపాలిల మధ్య జరిగే ఒక సంభాషణ ఇలా వుంటుంది.
హెలీనా: నీపాలీ! నీవీ దేశములందు జన్మించితివి కాని, నీవు నిజముగా భారతీయ స్త్రీవి. రోహిణి మాటాడుచున్నట్లు మాటాడుచున్నావు. ఆమె మాటి మాటికిని మానవ స్వభావమును గూర్చి మాటాడును. మేమెప్పుడు నట్లు మాటాడము. మా యిష్టానిష్టముల గూర్చియే మాటాడుదుము. నీవు మాటాడు లక్షణము తత్త్వవేత్తల లక్షణము.
నీపాలి: భారత దేశము నందున్న సర్వమానవులు కొద్దియో గొప్పయో తత్త్వవేత్తలే.

*****
విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

Helena
Purana Vaira Granthamala
Viswanatha Satyanarayana

You Might Also Like

One Comment

  1. ramireddy gogula

    చాలా భాగుంది, నవల చదవక పోయిన అందలి గూఢ అర్ధం చక్కగా విశిధీకరించారు . మీ కృషి కి అభినందనములు.

Leave a Reply