నాగసేనుడు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక
********
‘నాగసేనుడు’ పురాణవైర గ్రంథమాలలోని తొమ్మిదవ నవల.

ఎప్పుడూ కథ ముందు చెప్పి, ఆ తర్వాత పుస్తకంలో నన్ను ఆకర్షించిన విషయాలేమిటో చెప్తున్నాను కదా! ఈ సారి కొంచెం మార్పు కోసం మొదట ఈ పుస్తకంలో నన్ను ఆకట్టుకున్న విషయాలు చెప్తాను. ఈ నవలలో కథ పెద్దగా లేదు కానీ మనుషుల ఆలోచనలు, ప్రవర్తనలు, బలహీనతలు,శక్తియుక్తులు, రాగద్వేషాలు – వీటికి సంబంధించిన కొన్ని సూక్ష్మమైన విషయాలని రచయిత చక్కగా వివరించారు. ప్రధాన పాత్రలైన ముగ్గురు అన్న దమ్ములవే మూడు విభిన్న వ్యక్త్విత్వాలు. అవి కాక ఇతర చిన్నా, పెద్దా పాత్రల ఆధారంగా కూడా కొన్ని చక్కటి విశ్లేషణలు చేశారు. ఒకటి రెండు మాత్రం ఇక్కడ వివరిస్తాను.

చాలామందికి MBTI గురించి తెలిసే వుంటుంది. దాని ప్రకారం మనుషులని వారి మానసికమైన ప్రాధాన్యాల ఆధారంగా 16 రకాలుగా విభజించవచ్చు. ఉదాహరణకి అంతర్ముఖత్వం, బహిర్ముఖత్వం అనే రెండు లక్షణాలు. అందరూ కొన్ని సమయాలలో అంతర్ముఖంగా, మరి కొన్ని సమయాలలో బహిర్ముఖంగా ఉన్నప్పటికీ (అలా ఉండగలిగే సామర్ధ్యమూ, ఉండవలసిన అవసరమూ అందరికీ ఉన్నప్పటికీ) ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక లక్షణం మరొక దానికంటే ఎక్కువగా వుంటుంది. అంటే ఒకరకంగా వుండడం మరొక రకంగా వుండడం కంటే వారికి ఎక్కువ సౌకర్యంగా అనిపిస్తుంది. కొందరిలో ఆ తేడా మరీ స్పష్టంగా కనిపిస్తుంది.

ఒక విషయాన్ని అర్థం చేసుకోవడం, నేర్చుకోవడం, తోటి మనుషులతో దానిని పంచుకోవడం మొదలైన పనులని ఈ రెండు రకాల మనుషులలో ఎవరు ఎలా చేస్తారో తెలుసుకోవడం ఆసక్తికరంగా వుంటుంది. అది తెలిస్తే ఒక్కొక్కసారి మనకి విడ్డూరంగా అనిపించే అవతలి వారి ప్రవర్తనని అసహనం లేకుండా అర్థం చేసుకోగలుగుతాము.

ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేను పదేళ్ళ క్రితం మేనేజ్మెంట్ ట్రెయినింగ్ లో నేర్చుకుని, తోటి మనుషులని గమనించడానికీ, అర్థం చేసుకోవడానికీ ఉపయోగించుకున్న ఈ విషయాన్ని గురించి విశ్వనాథ ఈ పుస్తకంలో వ్రాశారు కనుక. అది గమనించి నిజంగా ఆశ్చర్యపోయాను నేను.

“కొందరు సర్వమైన భావనయు సర్వమైన యూహయు తమలోనే చేసికొందురు. కొందరి యూహ విషయములు పరులతో చెప్పుచున్నపుడు సాగుచుండును. వారు మాటాడుటయే తర్కము చేసినట్లుండును. ఆ తర్క సోపాన పరంపర మీద కొత్త యూహలు స్పురించుచుండును.”

ఇది మనుషులలో ఒక ప్రధానమైన తేడా. శౌరి అనేపాత్ర గురించి చెప్తూ ఈ వ్యాఖ్యలు చేస్తారు విశ్వనాథ ఈ నవలలో.

మరొక చోట పండితుడైన వాడి అహంకారం ఎలా ఉంటుందో, దాని లక్షణాలేమిటో చెప్పే ఈ వాక్యాలు కూడా నాకు నచ్చాయి.
“మానవునిలో నహంకారము ప్రధానముగా నుండును. పండితులయందు అపండితులయందు ఈ అహంకారము భాసించుచునే యుండును. అహంకారమే మనుజుని బ్రతుకునట్లు చేయుచున్నది. అహంకారము లేనివాడు మూల కూర్చుండును. వానికి లోకముతో పనిలేదు. పండితునియందీ అహంకారము చాల చచ్చిపోవును. సామాన్య జీవితమునందు వాని యహంకారము తక్కువ. ఈ అహంకారము గూడు కట్టి వానియందు విద్యావిషయమున నది పదింతలుగా నుండును. అందుచేతనే అది యందరకు గన్పించును. వాడహంకారి యనిపించును. విద్యాహంకార మొక వైలక్షణ్యము గలది. దానికి లోకముతో పనిలేదు. ఆ యహంకారమంతయు నా పండితుడు తన నేర్చిన విద్య యందలి రహస్యమును భాసింపచేయుటకు, ఆ రహస్యమును ప్రతారించుటకు బ్రయత్నము చేయును. ఇతరుల యందు వెలయించుటకును వెలికివచ్చును. ఆ పండితుడు తన విద్యాహంకారమును పురస్కరించుకొని పరుల కపకారము చేయడు. పరుల కడుపుల మీద కొట్టడు. ద్వేషములను పెంచికొనడు. ఇతరుని ప్రతిష్ట భంగ పరచుటకు ప్రయత్నించడు. విద్యకు వెలి అయిన సర్వ విషయములయందు తన విద్యాశత్రువుతో కూడ స్నేహమునే పాటించును. వలసినచో తనకు చేతనైనచో వాని కుపకారము గూడ చేయును. ఇది పండితుడైనవాని యహంకార లక్షణము.”

అలాగే అపండితుడైన వాడి అహంకారం గురించి కూడా చెప్తారు. అపండితుడైన వాడు వాదించలేడు. వాడి విమర్శ అంతా పరోక్షమే. పండితుడు విద్యాసంబంధమైన అహంకారం చూపిస్తే ‘వాడికంత అహంకారమెందుకు?’ అంటాడు అపండితుడు. పండితుడితో విరోధము పెట్టుకుంటాడు. ఆ విరోధము, కోపము – అవి కూడా అహంకారం నుండే పుట్టాయి కదా! ఆ విషయం గమనించుకోడు. ‘పండితుడి అహంకారం విద్యాసంబంధి. వీని యహంకారము యత్సంబంధి? వట్టి అహంకార సంబంధి కదా!’ అది ఆలోచించుకోడు. పైగా ‘నేనెలాగైనా పామరుడినే, నాకహంకారం ఉండవచ్చు. కానీ వాడు పండితుడు కదా! వాడికి అహంకారమెందుకు?’ అంటాడట.

ఇలాంటి ఎన్నో విశ్లేషణలు, పరిశీలనలు రచయిత వ్యాఖ్యలుగానే కాక కథలోనూ, సంఘటనలలోను, సంభాషణలలోను ఇమిడిపోయి కూడా మనకి కనబడతాయి ఈ నవలలో. ఇక అసలు ఈ పుస్తకంలో రాయబడిన కథ ఏమిటో చూద్దాం. దానికంటె ముందు ఈ నవల పీఠిక లో రచయిత వివరించిన కొన్ని విషయాలు చెప్పుకుందాం.

“భారత యుద్ధమైన తర్వాత ఈ నవలలోని కథాభాగం జరిగేనాటికి 2700 సంవత్సరాలు గడిచాయి. ఆ లెక్క ఈ నవలలో చూపించబడినది. అప్పటికి మగధదేశంలో అంధ్ర రాజులలో 24 వ వాడయిన శివస్కంధ వర్మ (అంటే గౌతమీ పుత్ర శ్రీ శాతకర్ణికి తండ్రి) రాజ్యం చేస్తున్నాడు.

ఈ నవలలో చెప్పబడిన నాగసేనుడు ‘మిళిందపన్హా’ అనే గ్రంథాన్ని రచించాడు. మిళిందపన్హా అనేది గొప్ప బౌద్ధమత వేదాంత గ్రంథం. దానిని వ్రాసిన నాగసేనుడు శోణోత్తరుడనే బ్రాహ్మణుని కుమారుడు.

వాళ్ళది హిమవత్పర్వత ప్రాంతంలోని “కుజంగాల” గ్రామం. ఇది చరిత్ర విషయం.

అయితే నాగసేనుడు బ్రాహ్మణుడని తెలుసు, అతను మహా బౌద్ధ మత గ్రంథాన్ని వ్రాశాడని తెలుసు, కానీ తక్కిన విషయాలేమీ తెలియవు. అవి, అంటే అతడు బౌద్ధుడెట్లా అయ్యాడు, ఆ గ్రంథమెందుకు వ్రాశాడు మొదలైన విషయాలు కల్పించబడి వ్రాయబడిన నవల ఇది.” అని చెప్పారు రచయిత పీఠికలో.

ఇక కథ లోకి వెళ్తే… శోణోత్తరుడు వేదపండితుడు. ఆయనకి ముగ్గురు కొడుకులు. వారు నివసించేది గిరివ్రజపురం లోని ఒక గ్రామం. అది మగధని శివస్కంద వర్మ పరిపాలిస్తున్న కాలం. శివస్కంద వర్మ భార్య గౌతమి. ఆయన పుత్రుడు శ్రీశాతకర్ణి. శోణోత్తరుడు నివసించే గ్రామంలో అందరూ బౌద్ధులు. శోణోత్తరుడు తర్క వ్యాకరణాలలో నిష్ణాతుడు. ఆయన తన కుమారులు ముగ్గురికీ తనకు వచ్చిన విద్య అంతా నేర్పాడు. వారు ధూర్జటి, నాగసేనుడు, శౌరి.

ధూర్జటికి వివాహమయింది. సంతానముంది. ఆయనకి ఉన్నంతలో సంసారాన్ని నడుపుకుపోయే ఆలోచనే కానీ పాండిత్యాన్ని ప్రదర్శించి పేరు తెచ్చుకోవాలన్న తపన కానీ ఇంకా పైకి ఎదగాలన్న తాపత్రయం కానీ లేవు.

నాగసేనుడికి పాండిత్యాన్ని ప్రదర్శించడం, చర్చలలో పాల్గొనడం, విజయాలు సాధించడం వంటి వాటి పట్ల ఆసక్తి వుంది. పండితుని అహంకారం గురించి ఇంతకు మునుపు వివరించిన విషయాలు నాగసేనుడి గురించి చెప్పే సందర్భంలోనే చెప్తారు రచయిత. అయితే అతనికి విద్యాసంబంధమైన అహంకారమే వుంటుంది కానీ విద్యకు సంబంధం లేని సామాన్య విషయాలలో అహంకారం వుండదు.

శౌరి అలా కాదు. అతనికి పాండిత్యం విషయం లోనే కాక సామాన్య విషయాలలోనూ అహంకారం వుంది. నాగసేనుడు సభలలో పాల్గొని విజయాలు సాధించి శాలువలు, సత్కారాలు అందుకుని రావడం పట్ల కొంత అసూయ, ఆ ధనాన్నంతా పెద్దన్నగారికి మాత్రమే యివ్వడం పట్ల అసంతృప్తీ వుంటాయి. కొన్ని దుర్వ్యసనాలు, దుస్సాంగత్యాలు వుంటాయి. అంతేకాదు బ్రాహ్మణుడే అయినప్పటికీ కర్రసాము, కత్తిసాము వంటి వాటిలో ఆసక్తీ, ప్రవేశమూ వుంటాయి.
నాగసేనుడు వివాహం పట్ల విముఖుడు అవడం వలన అతనికన్నా చిన్నవాడైన శౌరికీ వివాహం కాదు. తానూ అన్నగారంతటి పాండిత్యం వున్నవాడినేనన్న అహంకారమూ, అయినా ఆయనకు వస్తున్నంత గౌరవం తనకు రావడం లేదన్న అక్కసూ వున్న శౌరి ఒకానొక సందర్భంలో ఒక ధనవంతుడి దర్శనానికి వెళ్ళేందుకు అవసరమైన మంచి దుస్తులూ, శాలువ వంటి వాటి కోసం తమ యింటికే దొంగలతో కన్నం వేయించి నాగసేనుని పెట్టెను దొంగిలింప చేస్తాడు.

ఆ సమయంలో నాగసేనుడు ఊర్లో ఉండడు. ఊరునుంచి వచ్చిన నాగసేనుడు తమ్ముడి దుర్మార్గాన్ని గ్రహించినా గ్రహించనట్లే వుండిపోతాడు. అంతేకాదు, దొంగలెవరో కనిపెట్టి వాళ్ళ నుంచి తన సొమ్మునూ స్వాధీనం చేసుకుంటాడు. దొంగతనానికి తానే పురమాయించినా వారు తనని మోసం చేసి సొమ్మంతా కాజేయడంతో ఏమీ చేయలేక తేలు కుట్టిన దొంగలా వుండిపోయిన శౌరి అన్నగారి ప్రతిభకి ఆశ్చర్యపోతాడు.

నాగసేనుడు పురాణాలను ఖండిస్తున్న బౌద్ధులను గెలవాలంటే ఆ విషయాలను మరింత బాగా అధ్యయనం చేయాలనుకుంటాడు. ఈ నవలా కాలం నాటికి ఒక వంద సంవత్సరాలకు ముందు శంకర భగవత్పాదులు సర్వ భారత దేశ పర్యటన చేసి అద్వైత మతాన్ని స్థాపించారు. అయితే ఆయన మగధలో ప్రవేశించలేదు. అందుకే వారణాసి వంటి ప్రాంతాలలో వైదిక మతము మగధలో ఉన్నంత బలహీనంగా లేదు. ఈ విషయాలన్నీ తండ్రితో చర్చిస్తాడు. అంతకు ముందే తాను కాలంజర మనే గ్రామంలో చంద్రశేఖర కులోపాధ్యాయుడన్న పండితుని దగ్గర ఒక తర్క శాస్త్ర గ్రంథాన్ని చదివాననీ, దాని సాయంతో విశాలా నగరంలోని బౌద్ధ పండితులని గెలిచాననీ చెప్తాడు. అధ్యయనం కోసం ఇల్లు వదిలి పెడుతున్న నాగసేనుడికి కాలంజరి గ్రామంలోనే వున్న మరో పండితుడు నందన భట్టోపాధ్యాయుడిని కలుసుకుని ఖగోళ, జ్యోతిశ్శాస్త్రాలను అధ్యయనం చేయమని సలహా యిస్తాడు శోణోత్తరుడు.

అలా నాగసేనుడు ఇల్లు వదిలాక శౌరి దశ తిరుగుతుంది. మొదట అతను కొంత ప్రయత్నం చేస్తాడు. తమ గ్రామంలో వుండే శివనాగుడు అనే బౌద్ధ మతాభిమాని అయిన ధనవంతుడి సహాయంతో ఎదగాలని అనుకుంటాడు. శివనాగుడికి నిజానికి ఈ బ్రాహ్మణ కుటుంబం మీద అభిమానమేమీ వుండదు. వెనుక నుంచి వారిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూనే ఆ కుటుంబంలో కొంత భ్రష్టుడైన శౌరితో మంచిగా వున్నట్లు నటిస్తాడు. శౌరి కూడా ఆ విషయాన్ని కొంత గ్రహించకపోడు. శివనాగుడికి అజీవకుడు అనే రాజ్యాధికారితో స్నేహం వుంటుంది. అతనిని పరిచయం చేస్తే ఉద్యోగం సంపాదించుకుంటానని శౌరి కోరడంతో అజీవకుడు వచ్చినపుడు శౌరికి కబురు చేస్తాడు శివనాగుడు. కానీ అజీవకుడితో శౌరి గురించి చెడుగా చెప్పి అతనికి సహాయం అందకుండా చూడాలనే ఉద్దేశ్యంతోనే ఉంటాడు.

అయితే అజీవకుడు శౌరిని చూస్తూనే ఒక ఆలోచన చేయడం, అతన్ని తనతో పాటూ తీసుకువెళ్ళి ఉద్యోగం ఇవ్వడం, తన కూతురు గౌతమిని యిచ్చి వివాహం చేయడం – యివన్నీ జరుగుతాయి, శివనాగుడికి అడ్డుకునే అవకాశమే దొరకనంత వేగంగా.

అజీవకుడు బౌద్ధుడిగా మారిన బ్రాహ్మణుడు. అతనికి అల్లుడయిన శౌరికి తన ఉద్యోగానికి మించిన అధికారాన్ని చూపే అవకాశం వుంటుంది. తనతో మంచిగా వున్నట్లు నటిస్తూనే శివనాగుడు తమ కుటుంబం పట్ల కుట్ర చేశాడనీ గ్రామంలోని తమ యింటిని తప్పుడు సాక్ష్యాలతో మల్లయ్య అనే వాడికి కట్టబెట్టాలనుకున్నాడనీ గ్రహించిన శౌరి అతని దుర్మార్గాలన్నీ వెలికి తీసి శిక్ష వేయించే ప్రయత్నం చేస్తాడు. దానితో కక్ష పెంచుకున్న శివనాగుడు చుట్టుప్రక్కల గ్రామాలలోని సంపన్నుల సహకారంతో చిన్న రహస్య సైన్యాన్ని తయారు చేసి విప్లవం తెచ్చే ప్రయత్నం చేస్తాడు.

ఆ రహస్యాన్నీ కనిపెట్టిన శౌరి చాకచక్యంగా ఆ విప్లవాన్నీ అణచివేస్తాడు. దానితో విషయాధిపతి, సేనాధిపతి అనే రెండు పదవులు వెంటనే వరిస్తాయి. ఆపైన రెండేళ్ళకి రాష్ట్రాధిపతీ అవుతాడు. అయితే శౌరికి అది చాలదు. ఆ తర్వాత మహాసేనాధిపతి అవాలన్న కోరిక పుడుతుంది. మహాసేనాధిపతి పదవి బౌద్ధులు కాని వారికి యివ్వరు. అజీవకుని అల్లుడయ్యాక శౌరి తాను దాదాపుగా బౌద్ధుడే అయ్యాడు. కానీ గ్రామంలో వున్న తన కుటుంబం!

శౌరి తన కుటుంబాన్ని కూడా బౌద్ధులని చేసేందుకు ప్రయత్నించడం, అందుకు ఒకప్పటి శత్రువు అయిన శివనాగుడి సహాయాన్నే కోరడం, అతను గ్రామంలోని శౌరి కుటుంబాన్ని బెదిరించి, భయపెట్టే సందర్భంలో శౌరి తల్లి మరణించడం – ఇదంతా ఒక కథ.

తల్లి కర్మకాండల సందర్భంలో అన్నదమ్ములు ముగ్గురూ కలుసుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్న నాగసేనుడు, శౌరి – ఇద్దరూ కర్మ చేసిన పది రోజులూ ఏమీ మాట్లాడుకోరు. కానీ శౌరి తిరిగి బయల్దేరుతున్నపుడు నాగసేనుడు ఒక ప్రస్తావన చేస్తాడు.

ఆ కుటుంబం బౌద్ధులుగా మారినా మారకున్నా దానివలన బౌద్ధానికి వచ్చే ప్రయోజనమేమీ లేదనీ, ఊరూరూ తిరిగి బౌద్ధ పండితుల వాదనలన్నీ ఖండిస్తున్న తనలాంటి వాడు మారితే దానికేమైనా విలువ వుంటుందనీ, మహారాణితో చెప్పి శౌరి అలాంటి చర్చ ఏర్పాటు చేస్తే అక్కడ వాదించేందుకు తాను సిద్ధమనీ చెప్తాడు. ఓడిపోతే తాను బౌద్ధమతం స్వీకరిస్తాడు. ఒకవేళ తాను గెలిస్తే కుటుంబం ప్రసక్తి లేకుండా శౌరికి మహాసేనాధిపతి పదవి యివ్వాలి. అదీ నియమం.
శౌరి తిరిగి వచ్చి అందుకు తగ్గ ప్రయత్నాలు మొదలు పెడతాడు. అపుడు వచ్చే కొన్ని అడ్డంకులు, వాటిని అధిగమించేందుకు శౌరి వేసే పథకాలు, అదే సమయంలో అతని ఇంట్లో కబంధుడు అనే వికృత స్వరూపుడు ప్రవేశించడం – ఇదంతా మరో కథ.

ఆ కబంధుడు, అతని వాలకం, అతని మాయలూ, మహిమలూ, అతని ఖడ్గ విద్యా ప్రావీణ్యం, శౌరికి అతను ఖడ్గవిద్యలోని మెళకువలు నేర్పడం.. ఈ వర్ణనలతో అతను జయద్రథుడని (పురాణ వైర గ్రంథమాలలోని మొదటి నవల నుండీ వున్న పాత్ర) మనకు తెలిసిపోతుంది. అతను శౌరికి సహాయం చేయడంలోని ఆంతర్యమూ అర్థమవుతుంది.

కానీ చర్చకు వచ్చిన నాగసేనుడు- అతన్ని ప్రేరేపించిన శక్తి ఏమిటి? చివరకు చర్చతో నిమిత్తమే లేకుండా అతను ఓటమిని ఒప్పుకుని ఉపనిషద్వేదాంతమును బౌద్ధమత పరమార్ధంగా నిరూపిస్తూ “మిలిందపన్హా” అనే గ్రంథం వ్రాయాలనుకోవడానికి కారణమేమిటి? – ఈ ప్రశ్నలకి సమాధానం ముగింపులో తళుక్కుమనే చిన్న మెలిక.
*****
విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

Naagasenudu
Purana Vaira Granthamala
Viswanatha Satyanarayana

You Might Also Like

Leave a Reply