పుస్తకం
All about booksపుస్తకాలు

May 17, 2014

యాభై ఏళ్ల వాన – కొప్పర్తి

More articles by »
Written by: అతిథి
Tags: ,
వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక
********
ఈ కవితా సంకలనంలో దాదాపు అన్ని కవితలూ నాకు నచ్చాయి. అందుకు మొదటి కారణం బహుశా నిర్మాణం. కేవలం భావతీవ్రతతో ఎక్కడో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయే కవితలు నన్ను అసహనానికి గురిచేస్తాయి. ఎంత గొప్ప భావం వున్నా, ఎన్ని మంచి పోలికలు వున్నా అలాంటి కవితలని నేను చదవలేను. అలా కాకుండా ప్రతి కవితా ఒక పద్ధతిలో సాగడం ఈ పుస్తకంలో నాకు నచ్చిన విషయం. అదేమిటి? ఇంత పెద్ద కవి విషయంలో అది అసలు ఒక చెప్పవలసిన విషయమా! పద్దతి లేకుండా ఎవరు మాత్రం వ్రాస్తారు అంటారా! ఏమో చాలా ప్రసిద్ధమైన కవితలలో కూడా నాకు అపుడపుడూ ఈ ఇబ్బంది ఎదురయింది మరి! అందుకనే ఇది అంత సాధారణమయిన విషయం కాదనుకుంటున్నాను.

ఇక రెండవ విషయం బహుశా భావసారూప్యం. చాలా చోట్ల “ఇది నాకూ కలిగే భావమే కదా!”, “నేనూ అనుకునే మాటే కదా!” అనుకుంటూ చదివాను ఈ పుస్తకాన్ని.

32 కవితలున్నాయి ఈ సంపుటిలో. మొట్ట మొదట నన్ను ఆకట్టుకున్నది “లెక్కలేనితనం” అనే కవిత. అందులో కవి ఇలా అంటారు:

డబ్బులెప్పుడు లెక్కపెట్టినా
ఎదురుగాలికి పడవ నడిపినట్టుంటుంది
ఎక్కుతున్న పర్వతం ఎదుగుతున్నట్టుంటుంది
…..
డబ్బులు తీసుకుంటే లెక్క పెట్టుకు తీరాలి
ఎవరికైనా మనం డబ్బులిస్తే
వాళ్ళు లెక్క పెట్టుకుని మన నిర్దోషిత్వం రుజువయ్యేదాకా
సిగ్గుతో చావాలి

అందుకని
డబ్బులు చేతిలో పడగానే
జేబులో వేసుకోవడానికో
ఇంకొకరికివ్వడానికో బదులు
ఏట్లో వెయ్యాలనుంటుంది
ఏట్లో వేసేటప్పుడైనా సరే లెక్క పెట్టే వెయ్యమన్నాడు తాతయ్య
లెక్క కుదిరితే వెయ్యాలనే ఉంది
లెక్కే కుదరడం లేదు

అవును. కొందరికి డబ్బుల్ని చేత్తో పట్టుకునే అవసరం, లెక్కపెట్టే అవసరం రాకూడదు. అదొక పెద్ద ఇబ్బంది వారికి. ఎందుకంటే కవి చెప్పినట్లూ డబ్బులు చేతిలో ఉన్నంతసేపూ, వాటిని లెక్కపెడుతున్నంత సేపూ జాగ్రత్తగా వుండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. శరీరాన్ని అధిగమించాలనుకునే వారికి అది సరిపడదు.

తర్వాత రక్తాన్నీ, కన్నీళ్ళనూ పోలుస్తూ చెప్పిన “కెమిస్ట్రీ ఆఫ్ టియర్స్” అనే ఒక కవిత వుంది. ఆసక్తికరంగా అనిపించే పరిశీలనలున్నాయి అందులో.

మంచి రక్తం చెడు రక్తం అంటూ ఉంటాయి కానీ
మహామనిషి రక్తం మామూలు మనిషి రక్తం అంటూ ఉంటాయా
అందుకే
రక్తం కన్నా కన్నీళ్ళే గొప్పవి
లోలోపలి మనిషితనానికి
బాహ్యరూపం కన్నీళ్లు
ఆరడుగుల మనిషికి ప్రాగ్రూపం కన్నీళ్లు
…..

రక్తంలా కన్నీళ్లు అనుక్షణం తయారు కావు
రక్తంలా కన్నీళ్లు అణువణువూ ప్రవహించవు
మనిషికి ఇన్ని కన్నీళ్ళుంటాయనీ
ఉండాలనీ ఎవరు చెప్పగలరు
రక్తం చిందడానికి భౌతిక చర్య సరిపోతుంది
కళ్ళు చిప్పిల్లాలంటే
రసాయనిక చర్య జరగాల్సిందే

….
యుద్ధ బీభత్స ప్రతీక రక్తం
యుద్ధ విధ్వంస స్మృతి – కన్నీళ్ళు
…..

రక్తహీనత ఉన్నట్టే
దుఃఖలేమి కూడా ఉంటుంది
రక్తాన్ని ఎక్కించగలరు కానీ
కన్నీళ్ళ నెవరైనా ఎక్కించగలరా

ఇలా ముగుస్తుంది ఆ కవిత. ఎంత నిజం! అనిపించేలా.

జెండర్ పాలిటిక్స్” అనే కవిత రాజకీయాల గురించే కానీ స్త్రీత్వం గురించిన నిర్వచనాలూ, పరిశీలనలూ వున్నాయి అందులో. వాటిని రాజకీయాలతో ముడిపెట్టడంతో ఒక క్రొత్త అందం వచ్చినా ఆ అందాన్ని, అలంకారాన్ని ప్రక్కన పెట్టి వాటిని వాటిగా గుర్తించాల్సిన పరిశీలనలవి. ఇలా వుంటాయి అవి:

“శత్రువెంత దెబ్బ తీసినా తాను శత్రువులా మారకపోవడం స్త్రీత్వం”

“పోరాటంలో ఎదుటి పక్షాన్ని
శత్రువుగా గుర్తించడానికే నిరాకరించినవాడు
అతను పురుషుడు కాదు స్త్రీ”

కొన్ని కొన్ని ప్రయోగాలూ వ్యక్తీకరణలూ నాకు బాగా నచ్చాయి. ప్రయోగాలంటే గుర్తొచ్చింది. “ఒకేచోట రెండు సార్లు ఉండకపోవడం” అన్న వ్యక్తీకరణ కవికి యిష్టం కాబోలు! ఆ వ్యక్తీకరణ ఒకే సంపుటిలో రెండు చోట్ల కనిపిస్తుంది. “చలనం” కవితలో మానసికమైన చురుకుదనాన్ని చెప్పేందుకు “ఒక్కచోట నన్ను రెండు సార్లు చూడలేవు” అంటే “సుశీల” కవితలో శారీరకమైన చురుకుదనాన్ని చెప్పేందుకు “ఇంట్లో ఒకేచోట ఆమెని రెండుసార్లు చూడలేం” అంటారు.

నాకు నచ్చిన కొన్ని వ్యక్తీకరణలు:
ముందు వెనుకల మధ్య” :

“వాళ్లెవరైనా సరే
నా తర్వాత పుట్టినవాళ్ళయితే చాలు నేను ఇష్టపడడానికి
వాళ్ళందరి కంటే ముందు
ఈ భూమిని పొందినవాడిగా వాళ్ళ పట్ల వాత్సల్యం ఉంటుంది నాకు”

అంతిమ సత్యం” :

భగవంతుణ్ణి ఎవరైనా చూశారా
సత్యాన్ని ఎవరైనా చూశారా
చూశాం అని చెబితే నమ్ముతామా
చూపించమంటాం కదూ
అప్పుడు కదూ తేలిపోతుంది
భగవంతుడు లేడనీ
సత్యమూ లేదనీ

భగవంతుడు లేకపోవడం తెలుస్తుంది కానీ
ఉండడం తెలీదు కదా
అసత్యం కనిపిస్తూ వుంటుంది కాబట్టి
తెలుస్తుంది కానీ
సత్యమంటే ఏమిటో ఎట్లా తెలుస్తుందీ

భగవంతుణ్ణి సాధించుకున్న వాళ్ళంతా
అతన్ని సృష్టించుకున్న వాళ్ళేనని
సత్యం కోసం నిలబడ్డవాళ్ళంతా
దాన్ని నిర్మించుకున్న వాళ్ళెనని
సృష్టించుకునే శక్తిని బట్టి ఊహని బట్టీ
భగవంతుడు రూపొందినట్టు
అసత్యాన్ని ఖండించే విధానాన్ని బట్టీ
ఆయుధాన్ని బట్టీ
సత్యం రూపొందుతుందని
ఎవరు ఎవరికి చెబుతారు

“ఒక యుద్ధం – ఒక ప్రత్యామ్నాయం” :

ఎవరు గెలిచారు
ఎవరు ఓడారు
యుద్ధం ముగిశాక
నిలబడి వున్నవాడు గెలిచినట్టూ
వొరిగిపోయినవాడు ఓడినట్టూనా
….
ఇది
యుద్దాల్నీ
గెలుపు ఓటముల్నీ
కొత్తగా నిర్వచించిన నేల
హింస పిరికివాడి ఆయుధం అనీ
అత్యంత శక్తివంతుడు మాత్రమే
అహింసను ఆయుధంగా ధరించగలడనీ
సమరోత్సాహంతో పలికిన నేల

ప్రశ్న” :

దేవుణ్ణి నమ్ముతున్నానో లేదో
ఖచ్చితంగా చెప్పాలా
అసలట్లా చెప్పగలగడం
ఉంటుందా

“చందమామ రావే!” అన్న కవితలో చాలా పంక్తులు నచ్చాయి. అయితే కవిత్వం తనకు దూరమవడానికి కవి మొదటి పేజీలో చెప్పిన కారణానికి తరువాతి పేజీలోని పరిష్కారాలకు పొసగలేదేమోననిపించింది.

మధ్యతరగతి మాండలీకం” అనే కవిత బహుశా చాలామంది తమదిగా గుర్తించగలిగే భావన.
ఏమైనా
గుర్తింపు తెచ్చి పెట్టిన భాషే
గుర్తింపు రద్దు చేసింది
నిలబెట్టి నిట్రాడైన భాషే
నిలువునా నీరు కార్చింది

ఈ కవిత మొత్తం తోనూ నేను ఏకీభవించ లేకపోయినా, ఇలాంటి కొన్ని పంక్తులు, చెప్పిన విధానం వల్ల ఆకట్టుకున్నాయి. ఏకీభవించలేకపోవడం ఎందుకంటారా! అది వ్యక్ర్తిగత అహంకారం లెండి. ఎప్పటికప్పుడు ప్రస్తుతపు స్థితిని, అది ఎలాంటిదయినా సరే “ఏం దీనికేమయింది! బానేవుందిగా!” అనుకునే నా మనస్తత్వం – అది గతాన్ని మార్చాలని అనుకోదు. ఇంకెవరైనా అనుకున్నా అంత తొందరగా ఏకీభవించదు.

ఒక నిరాకరణ” అనే కవితలోనూ వ్యక్తీకరణ నచ్చినా భావంతో చిన్న ఇబ్బంది కలిగింది నాకు. ఇందులో గౌరవాన్ని బరువుగా భావించి నిరాకరిస్తాడు కవి. అయితే నాకేమనిపించిందంటే – ‘బరువును ఆశించకూడదు నిజమే. కానీ భయపడకూడదు కదా! ఎందుకంటే బరువు నిరాకరించకూడని బాధ్యత కదా!’ అని.

ఇంకా మిగిలిన కవితలన్నిటిలో కూడా నచ్చిన పంక్తులు ఎన్నో కొన్ని వున్నాయి. “శత్రువు శత్రువు” కవితలోని

అవును
సద్దాంకు మరణశిక్ష విధించి
అమలు జరిపి
తననెట్లా అంతమొదించవచ్చో
బుష్ ప్రపంచానికి
టీ వీ లో చూపించాడు

అన్న పంక్తులు చదివి “కదా!” అనుకున్నాను.
మరతనం” లాంటి కవితలలోని సున్నితత్వానికి, “తల్లి” వంటి కవితలలోని చమత్కారానికి తల పంకించడం, ఒక చిరునవ్వు నవ్వుకోవడం చేశాను.

భాష-ప్రజలు” లాంటి బుజ్జి కవితలు చదివి “అవును” అని నిట్టూర్చాను.

ఇక చివరిగా ఈ పుస్తకానికి శీర్షిక అయిన “యాభై ఏళ్ల వాన” కవితలో నాకు నచ్చిన పంక్తులు, వాటి గురించి నాలుగు మాటలు.

ఎప్పటికైనా
నన్ను తడిపే వాన ఒకటి కురుస్తుందా
వాన రాకడను ముందే పసిగట్టి పరుగెట్టి
ఇంట్లో గువ్వలా వొదిగిపోయే
ఈ దొంగను దొరికించుకుంటుందా

దారి మధ్యలో దాడి చెయ్యగానే
అరుగుల మీదకో వాకిళ్ళలోకో జారిపోయే
ఈ తుంటరిని కట్టడి చేస్తుందా
ఎప్పటికైనా
కనుచూపు మేర ఏ చూరూ లేని
నిర్జన మైదానం మధ్య
గుర్తుపట్టి
ఒక్కణ్ణీ చేసి
నలుదిక్కుల నుంచి ఒకేసారి ముట్టడిస్తుందా
నిర్మల నితాంతాపార జలధిలో
నిలువునా నను ముంచెత్తుతుందా

కురిసీ కురిసీ
నన్ను
ఎక్కడ కురిసినా ఎడదను పరిచే పుడమిని చేస్తుందా
ఎంత కురిసినా అచటే నిలిచే కడిమిని చేస్తుందా

ఇది చదివితే నాకిలా అనిపించింది. “మనందరికీ నిజమైన ఆనందం ఎక్కడుందో చూచాయగానైనా తెలుస్తుంది. కానీ దానిని సాధించేందుకు ఎటువంటి సాధన చేయాలో తెలియని వారు కొందరైతే, తెలిసి కూడా ఆ సాధనని మొదలు పెట్టలేనివారు మరికొందరు. అందుకు మన బలహీనతలు, బిడియాలు, నిర్లక్ష్యాలు, సందేహాలు – ఇలా ఎన్నో కారణాలు. అయితే జీవితంలో ఏదో ఒక దశలో వాటన్నిటినీ అధిగమించేందుకు, మన “ప్రయత్నం” లేకుండానే మనల్ని సాధనకు సన్నద్ధం చేసేందుకు, ఆ సాధనని సంపన్నం చేసేందుకు ఒకానొక అదృశ్య హస్తం చేసే సాయం కావాలనిపిస్తుంది. మనం తప్పుకుపోతున్నా, అది తన కరుణని బలవంతంగానైనా మనపై వర్షించాలనిపిస్తుంది.”

వివరాలు:
వెల: రూ 60/-
ప్రతులకు : విశాలాంధ్ర, నవోదయ
*****
Yabhai Ella Vaana

Kopparthi
About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


  1. Bollojubaba

    Wonderful review


  2. రాధిక గారి విశ్లేషణ చాలా బావుంది. తప్పక చదవాలనిపిస్తోంది ఈ యాభయ్యేళ్ళ వాన.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర – డా. సంగనభట్ల నరసయ్య

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** శ్రీ ధర్మపురి క్షేత్ర చరిత్ర అనే ఈ పుస్తకాన్ని శ్ర...
by అతిథి
4

 
 

నివేదిత – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘నివేదిత’ పురాణవైర గ్రంథమాలలోని పన్నెండవ (చివరి) న...
by అతిథి
2

 
 

వేదవతి – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘వేదవతి’ పురాణవైర గ్రంథమాలలోని పదకొండవ నవల. విక్రమ...
by అతిథి
5

 

 

హెలీనా – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘హెలీనా’ పురాణవైర గ్రంథమాలలోని పదవ నవల. ఈ నవల లోని క...
by అతిథి
1

 
 

నాగసేనుడు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీరాధిక ******** ‘నాగసేనుడు’ పురాణవైర గ్రంథమాలలోని తొమ్మిదవ నవల. ఎప...
by అతిథి
0

 
 

పులిమ్రుగ్గు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

ఇది పురాణవైర గ్రంథమాలలో ఎనిమిదవ నవల. ఏడవ నవల ‘అమృతవల్లి’ కాణ్వాయన వంశీయుడైన వాసుదేవ...
by అతిథి
2