అమెరికామెడీ నాటికలు

వ్యాసం రాసి పంపినవారు: రానారె

8838_front_coverగత వారాంతం రెండ్రోజులూ వంగూరి చిట్టెన్ రాజు గారి ‘అమెరికామెడీ నాటికలు’ చదువుతూవున్నాను. వీటిలో కొన్నిటికి మూప్పై నలభైయేళ్ల వయసుంది. కొన్ని మొన్నీమధ్యనే రాసినవి. ప్రచురించేటప్పుడు వేసుకొమ్మని 1980లో ఈ నాటికలకు ఒక ఉపోద్ఘాతం రాసిచ్చారట శ్రీశ్రీ. ఆ ఉపోద్ఘాతంలో “నవలలుగాని, కథానికా సంపుటాన్నిగాని మనం చదువుకొని సొరుగులో పెట్టేస్తాం. నాటకము, నాటిక అలా కాదు. వాటికి రంగస్థలం మీదే ప్రాణం రావాలి. ప్రదర్శనం పండిందా లేదా? అదీ మొదటి టెస్లు” అన్నాడు. ‘ఈ పరీక్షలో చిట్టెన్ రాజు ఫస్టుగా పాసయ్యాడు’ అనీ అన్నాడు.  ఈ నాటికల్లో ఒక్కటి తప్ప అన్నీ ప్రదర్శించబడినవే. అమెరికాలో ప్రదర్శించబడిన మొదటి తెలుగు నాటికలు బహుశా ఇవే కావచ్చునంటారు రచయిత.

ఈ నాటికలు చదువుతూ వుంటే కొన్నికొన్ని చోట్ల చార్లీచాప్లిన్ సినిమాల్లోలా గుబులూ నవ్వూ ఒకేసారి కలుగుతాయి.

“చిలకాగోరింకల్లా కాపురం కొన్నాళ్లు చేసి, బరువూ బాధ్యతలూ మీద పడగానే, పైవాళ్లను తిట్టడం మానేసి, ఒకళ్ల మీద ఇంకొకరు అరుచుకోవడం మొదలుపెడతారు. దాన్నే జీవితంలో సెటిల్ అవడం అంటారు —“అని ఒక డయలాగుంది. ‘భలే నిర్వచనం’ అనుకొని ఒక ముసినవ్వు నవ్వాను. ఈ డయలాగు అంతటితో ముగియలేదు. ” — అన్నాడొక నాస్తికుడు” అని ముగుస్తుంది. ఆ ముగింపుతో ముసినవ్వు ఫక్కున పేలి పెద్దనవ్వు అయింది. ఇది ‘సిల్వర్ జూబిలీ’ అనే నాటికలోనిది.

‘భార్యా బాధితుల సంఘం’ అనే నాటికొకటుంది. కొత్తగా ఇల్లు కొన్న కొంతమంది ఉద్యోగస్తుల పరిస్థితి ఎలా వుంటుందంటే, ‘జీవితంలోని సుఖాలన్నీ EMIల రూపంలో గృహరుణదాత అయిన బ్యాంకుకు చేరిపోతుంటాయి నెలనెలా’. ఆ ఇల్లు ఎప్పుడు సొంతమౌనో, అందులో అనుభవించే సుఖమేమిటో ఇప్పుడే తెలీదుగానీ, “ఇల్లు కొందాం” అని పెళ్లాం తన మొగుడితో అన్నదంటే మాత్రం దేవుడొచ్చినా కొనకుండా ఆపలేడంటాడు ఈ నాటికలో ఒక సీనియర్ భార్యాబాధితుడు. ఇలాంటి సంఘటనతో, ‘నా కొంప మునిగిందిల బాబోయ్’ అని మొత్తుకొంటాడు ఆయన శిష్యసమానుడైన జూనియర్ భా.బా. “మునగడానికైనా ఒక కొంప అంటూ ఉండాలి కదుటోయ్, కంగ్రాచ్యులేషన్స్” అని సీనియర్ భా.బా (played by చిట్టెన్ రాజు) చెప్పే ఒక డయలాగుంది. క్యా డైలాగ్ హై అనుకున్నాను.

దాని సంగతలా వుంచితే, ‘ఏడవలేక నవ్విన సన్యాసి’ అనే నాటిక అమెరికా తెలుగుమహాసభల్లో కులాలు తెచ్చిన తంటా నేపథ్యంలో రాసింది. ఎవరినీ నొప్పించని సున్నిత హాస్యంతో కూడిన మేలుకొలుపు. ‘ఇచట ఆపరేషను లేకుండా కులమత భేదములు పోగొట్టబడును’ అనే బోర్డు కనిపిస్తుంది తెరతీయగనే. ఈ నేపథ్యం నాక్కొంత తెలిసినా, నాటిక రాసే నాటికి నేను ఐదోతరగతి చదువుతూ వుండటంవల్లనేమో ఇప్పుడు అంతగా కనెక్ట్ కాలేకపోయాను.

‘మగపాత్ర లేని నాటిక’ చదివాక రచయిత చాతుర్యానికి ఆశ్చర్యపోకతప్పదు. ఎందుకంటే ఆ థీమ్ అలా వుంది. మగపాత్ర లేకుంటే ‘ఆడాళ్లంతా కలిసి నాటిక వేసినట్టే!’ అన్నట్టున్న వ్యగ్యం ఒకటి, ఆ మగపాత్ర తెరమీద లేకపోయినా ఎలివేట్ కావడం రెండోది. నాటిక చదివాక వహ్వా అనుకున్నాను.

“అమెరికాలో రోడ్డుమీద ఇద్దరు ఇండియన్సు ఇంగ్లీషులో మాట్లాడుకుంటూ కనబడితే, వాళ్లు ఖచ్చితంగా తెలుగువాళ్లే అని గ్యారంటీ”, అసలు సమాధానం అనే నాటికలోని డయలాగ్. ఇందులోనే ఇంకొకటి, “మీ సంగతి దేవుడెరుగు, మా డాక్టర్ల సంగతి చూడు. ఫోన్ తియ్యాలంటే భయం, ఏ తెలుగు సంఘం వాడు ఎంత డొనేషన్ అడుగుతాడో నని”.

దక్షిణాసియాకు (ముఖ్యంగా భారతదేశానికి) చెందిన తల్లిదండ్రులకు, అమెరికాలో పుట్టి పెరుగుతున్న సంతానాన్ని ఉద్దేశించి ABCDలు లేదా American Born Confused Desiలు అనే మాట వాడుకలో వుంది. వీళ్లు చాలా రకాలుగా సమర్థులే అయినా, సంస్కృతికి సంబంధించిన వీళ్ల Confusionకు గల కారణాల్లో ఒక దాన్ని చక్కగా ఎత్తిచూపే నాటిక ‘అసలు ప్రశ్న’. కారణాన్ని చూపడమేకాదు పరిష్కారాన్ని సూచిస్తూ ఆ యువతను ముందుకునడిపుతుందీ నాటిక. ఈ నాటికకొక ప్రత్యేకతుంది. ఇది దూరదర్శన్ ఢిల్లీ కేంద్రం నుండి దేశమంతా ప్రసారితమట!

ఇక చివరి నాటిక ‘అసలు అవమానం’. తానా ఆటా లాంటి మహాసభ లేవి జరిగినా వార్తాపత్రికల్లో మనకు ప్రధానంగా కనిపించేది ఆంధ్రదేశం నుంచి వచ్చిన సినీకళాకారుల ఫోటోలూ కథనాలూ. అమెరికాలో వుంటూన్న స్థానిక కళాకారుల సంగతేమిటి? కార్యకర్తలూ కళాకారులూ సాధించేది ఏమిటి? ప్రేక్షకుల మాటేమిటి? ఆటలో అరటి పండ్లూ, చారులో కరివేపాకులూ …

కొత్త కథలతో పోల్చితే, కొత్త నాటికలు అరుదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో … ఇలాంటి పుస్తకాలు వర్ధమాన రచయితలకు మార్గదర్శకం కాగలవని నా ఆశ.

ప్రతులకు:
ఆన్‌లైన్‌ దుకాణం: అమెరికామెడీ నాటికలు
దూరవాణి 001-281-277-0445
ISBN : 1-892408-26-0

You Might Also Like

3 Comments

  1. Vanguri Chitten Raju

    అసలు నా “అమెరికామెడీ నాటికలు” అనే సంకలనం మీకు ఎక్కడ దొరికిందో అనేది నాకు ఆశ్చర్యం గా ఉంది. ఎందుకంటే ఆ పుస్తకం ఇంకా “మార్కెట్” లో లేదు. నేనే కొద్దిమంది ప్రముఖులకి పంపించాను. అందులో మీరొకరు అయిఉండాలి.

    ఇక మీరు ప్రస్తావించిన రెండు నాటకాలు….సిల్వర్ జూబిలీ మరియు భార్యాబాధితుల సంఘం….నేను పూర్తిగా సొంత బుర్ర ఉపయోగించి రాసినవి కాదు. సిల్వర్ జూబిలీ ఒరిగినల్ చింతపల్లి గిరిజా శంకర్ (టెంపుల్, టెక్సస్) …అలాగే భా.భా సంఘం నాటకానికి ఒరిజినల్ రచయిత చంద్ర కన్నెగంటి (డాలస్, టెక్సస్)……నేను ఆ నాటకాలకి మూలం అని వారి పేర్లు పుస్తకంలో ప్రచురించి నేను అవి “కాపీ” కొట్టి స్టేజికి అన్వయించానని స్పష్టంగానే ప్రకటించాను. వారిద్దరి అనుమతీ ముందు తీసుకునే ఆ పని చేశాను. మీరు “కోట్” చేసిన సంభాషణలు నేను రాశానో, వారిద్దరి ఒరిజినల్స్ లోనే ఉన్నాయో చెప్పలేను. అందు వలన వాటికి సరి అయిన క్రెడిట్ వారికే చెందాలి. …కాపీ కొట్టిన క్రెడిట్ నాదే కదా!

    ఇక మిగిలిన నాటకాలూ, సంభాషణాలూ, సన్నివేశాలూ, చాలా మటుకు నా పైత్యమే..I am “guilty” as charged !

    If anyone is interested in receivng a copy of live recordings of my two most “famous” plays (Asalu Prasna and EdavalEka navvina sanyasi)…mentioned in your review, please contact me at rvanguri@wt.net or call me on 832 594 9054 and I will be happy to send a DVD……at no cost…

    భవదీయుడు..

    వంగూరి చిట్టెన్ రాజు
    Houston, Texas

    1. రానారె

      రాజుగారూ,

      దీన్ని ఇప్పుడే చూస్తున్నాను – నాలుగేళ్లు కావస్తోంది మీ రీ వ్యాఖ్య చేసి – మన్నించండి. ‘ప్రముఖులకు’ అన్నారు నన్నూ కలిపి. బహుశా అందుకే నేను నాలుగేళ్లు నా (ప్ర)ముఖం చాటేశాను (జ్యోకు). క్రెడిట్ల సంగతి మీరు దిద్దారు. ఏమైనా, మంచి నాటికలు. థాంక్సు.

  2. sunita

    నేను ఈకధలు కొన్ని నెలల కిందటే చదివానండి. మీ అంత తులనాత్మకంగా చదవలేదు కాని చిట్టెన్ రాజు గారి కధే 1998 తానా సంచిక అన్నట్లు గుర్తు “ఒక తల్లిగోడు” లేక “స్వగతం” అంటూ ఒక హాస్య కధ, సన్మానాల గురుంచి ఒక కధ చదివాను అవి నన్ను అమితంగా నవ్వించాయి.

Leave a Reply