పులిమ్రుగ్గు – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

ఇది పురాణవైర గ్రంథమాలలో ఎనిమిదవ నవల. ఏడవ నవల ‘అమృతవల్లి’ కాణ్వాయన వంశీయుడైన వాసుదేవుడు మగధ రాజ్యాధిపతి అవడంతో ముగుస్తుంది. ఆ వాసుదేవుడి మునిమనుమడైన సుశర్మ ప్రస్తుతం మగధ రాజ్యానికి రాజు. (వాసుదేవుడి కొడుకు భూమిమిత్రుడు, అతని కొడుకు నారాయణుడు, అతని కొడుకు సుశర్మ.)
ఈ నవల శ్రీముఖుడు అనే క్షత్రియుడూ, తోహారు అనే కిరాతుడూ అడవిలో చేసే ఒక అన్వేషణ తో మొదలవుతుంది. అన్వేషణ దేనికోసం? ఒక పులిమానిసి కోసం. అవును, ముందుభాగం పులిగాను, వెనుక భాగం మనిషిగాను వున్న వ్యక్తి కోసం వాళ్ళిద్దరూ అన్వేషిస్తూ వుంటారు. తోహారు ఆ అడవిలో అణువణువూ తెలిసినవాడు. అందువలన రాజులు అడవిలో వేటకు వచ్చినపుడు అతని సహాయం తీసుకుంటూ వుంటారు. ఇక శ్రీముఖుడు మగధ రాజ సేనాధిపతి.

నిజానికి ఆ అడవిలో అసలు పులులే లేవు. అటువంటి చోట పులి అడుగులు గుర్తించిన తోహారు, అది కూడా ముందు భాగంలో మాత్రం పులి పాదాల గుర్తులు వుండి, వెనుక భాగంలో, అంటే సరిగా పులి వెనుక కాలి గుర్తులు ఉండవలసినంత దూరంలో మనిషి పాదాల గుర్తులు కనబడడంతో ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని శ్రీముఖునితో చెప్తాడు. అపుడు వాళ్ళు ఇద్దరూ దానిని కనిపెట్టేందుకు ప్రయత్నిస్తారు. మొదటి పదిహేను పేజీలూ అడవిని గురించిన వర్ణనా, వివరాలూ, వాళ్ళిద్దరి ప్రయాణం – అదంతా చదువుతుంటే చాలా బాగుంటుంది.

ఇద్దరూ అడవిలో చాలా లోపలికి ప్రయాణించి పులిమనిషి కాలి గుర్తులు కనబడిన ఒక చెరువు దగ్గరకి చేరి, దాని ఒడ్డున వున్న చెట్టు మీద మాటు వేస్తారు. అర్ధరాత్రి ప్రాంతంలో పులి వస్తుంది. చీకట్లో స్పష్టంగా కనబడదు కానీ అక్కడ రెండు చెట్ల మధ్యలో దాచి ఉంచుకున్న ఒక మొద్దు మీదికి ఎక్కి దానిని నీళ్ళలోకి తోయడం, ముందు చేతులతో పడవని తోసినట్లుగా ఆ మొద్దుని తోసుకుంటూ నీళ్ళలో వెళ్ళడం కనిపిస్తుంది. శ్రీముఖుడు సాహసించి నీళ్ళల్లోకి దిగుతాడు. తోహారుని అక్కడే వేచివుండమని చెప్పి ఆ పులికి తెలియకుండా పూర్తిగా నీళ్ళలో వుండి ఈదుతూ దానికి కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ రాత్రంతా దానిని అనుసరిస్తాడు.

తెలతెలవారుతూన్న సమయంలో పులికి అనుమానం వచ్చిందేమోననిపిస్తుంది. ముందురోజంతా అడవిలో పులి కోసం తిరిగి, రాత్రంతా నీళ్ళలో మునిగి వుండి ఈదుకుంటూ వచ్చిన శ్రీముఖుడు అలసిపోయి చెరువు మధ్యలో నున్న ఒక రాయి మీద కొంచెం విశ్రమిస్తాడు. అది పులి గమనించిందేమోననిపిస్తుంది. అతడు చిన్న మాయ చేసి ఆ రాయి మీది నుంచి నీళ్ళ లోకి జారి మళ్ళీ కొంచెం చీకటిగా వున్న చోటికి తప్పుకుంటాడు. పులి వెనక్కి వచ్చి ఆ రాయిచుట్టూ తిరుగుతూ పరిశీలించడం దూరం నుంచి కనిపిస్తుంది. అది.. అలా చేయడం.. పులి ప్రవర్తన కాదు! మనిషి ప్రవర్తన!! శ్రీముఖుడు ఆశ్చర్యపోతాడు. చివరికి పులి ఒక ఒడ్డు చేరి ఆ పడవ కొయ్యను రెండు రాళ్ళ మధ్యకు తోసి గట్టెక్కుతుంది. ఒక రాయి చాటు చేసుకుని శ్రీముఖుడు దూరం నుంచి గమనిస్తాడు.

అప్పటికి కొంత వెలుతురు వస్తుంది కనుక, పులి పడవకొయ్య దిగి గట్టు మీదికి చేరగానే శ్రీముఖుడికి అర్ధం అవుతుంది. దానికి ముందు భాగం కంటే వెనుక భాగం ఎత్తుగా వుంది. వెనుకవి పులి కాళ్ళు కావు. అది పూర్తిగా పులి కాదు! అది ఒక గుహలో ప్రవేశిస్తుంది. శ్రీముఖుడు సాహసించి గుహ దగ్గరికి చేరతాడు. లోపలినుంచి “ఎవరు నీవు?” అన్న ప్రశ్న వినిపిస్తుంది. కొద్దిగా చీకటిగా వున్న ఆ గుహలోకి చూస్తే రకరకాల రంగులతో వేసి వున్న ఒక ముగ్గు, దానిపై పడుకుని వున్న ఒక పురుషుడు కనిపిస్తారు. అతనితో శ్రీముఖుడు వివరంగా కథ అంతా చెప్తాడు.

పూర్వం యయాతి సంతానంలో ఒకడైన బలి మహారాజు తన ఆరుగురు కొడుకులకూ రాజ్యాన్ని పంచి యిచ్చాడు. అవే ఆయా రాజ కుమారుల పేర్లతో ఏర్పడిన అంగవంగాంధ్రాది రాజ్యాలు. మగధ మాత్రం బలి అధికారంలో వుండి వుంటుంది. బహుశా అపుడు అతనికి రాజధానిగా వుండిన ప్రాంతం బలిమఠం. అక్కడ ఒక పర్వతం, శిథిలమైన కోట వున్నాయి. ఆ బలిమఠ పర్వతం దగ్గర తన స్నేహితుడైన తోహారుకి పులిమనిషి కాలి గుర్తులు కనిపించాయనీ, దానిని వెతికేందుకు తామిద్దరమూ బలిమఠ పర్వతం దగ్గరికి బయలుదేరామనీ, అయితే ఎందుకో గాని తన కాళ్ళు కొంచెం ప్రక్కకి దారి తీశాయనీ, అక్కడ ఒక చెరువు దగ్గర పులిమనిషి గుర్తులు కనిపిస్తే మాటు వేశామనీ, ఆ పులిని వెంబడించి ఇక్కడి వరకూ వచ్చాననీ చెప్తాడు. ఆ పులి ఏమయిందో మీకు తెలుసా అని అడుగుతాడు.

ఇదంతా కట్టుకథ అంటూ ఆ పురుషుడు కొట్టి పారేస్తాడు. “నాకు ఆకలిగా వుంది, తినడానికి ఏమైనా పెట్ట”మని శ్రీముఖుడు అడిగితే, “అక్కడ పళ్ళు వున్నాయి తీసుకో”మని చెప్తాడు ఆ పురుషుడు. అయితే ఆ పళ్ళు తింటే తనకు శిష్యుడై పోవలసి ఉంటుందనీ, స్వాతంత్ర్యాన్ని కోల్పోయి తానేం చెప్తే అది చేయవలసి వస్తుందనీ హెచ్చరిస్తాడు. అయితే ఫలాలు ఆరగించినంత మాత్రాన అలా అయిపోతుందన్న భయం తనకేమీ లేదంటూ శ్రీముఖుడు ఆ ఫలాలు ఆరగిస్తాడు.

వాళ్ళిద్దరి మధ్యా సుదీర్ఘమైన సంభాషణ జరుగుతుంది. ఆ మాటల్లో పతంజలి మహర్షి ప్రస్తావన కూడా వస్తుంది. పతంజలి మహర్షి అప్పటికి మూడు వందల ఎనభై ఏళ్ళకి పూర్వపు వాడనీ, ఆయన ఎప్పుడు పుట్టాడో తెలియకపోయినా శుంగ వంశపు రాజులలో ప్రధముడైన పుష్యమిత్రుని కాలంలో జీవించి ఉన్నాడన్న మాట నిజమనీ, ఆయన వ్యాకరణానికి మహాభాష్యం వ్రాశాడనీ, యోగశాస్త్రానికి సూత్రాలు నిర్మించాడనీ అంటాడు శ్రీముఖుడు. సరే, ఇంతకీ ఎంత మాట్లాడినా పులి ఏమయిందో, ఈ పురుషుడు ఎవరో మాత్రం శ్రీముఖుడికి అర్థం కాదు. ఆతర్వాత కాసేపటికి ఆ పురుషుడు స్నానం చేసి వస్తానంటూ వాగు వద్దకు వెళ్ళగానే శ్రీముఖుడు గుహని క్షుణ్ణంగా పరిశీలించడానికి పూనుకుంటాడు. తనకు అలా పరీక్షించే అవకాశం ఇచ్చేందుకే ఆ పురుషుడు అలా వెళ్ళాడని కూడా శ్రీముఖుడు అర్థం చేసుకుంటాడు.

అంతకు మునుపు ఆ పురుషుడు పడుకుని వున్న ముగ్గులో కనబడిన రంగు రంగుల పొడులు ఆ గుహలో ఇంకా కనిపిస్తాయి. ఆ ముగ్గు మీద కాలు పడినపుడు, ఆ పొడులని చేతులతో తాకినపుడు తన శరీరం జలదరించడం, జివ్వుమన్నట్లుగా అనిపించడం, ఏదో మార్పు జరుగుతున్నట్లు తోచడం – వీటన్నిటి తోనూ అతనికి అర్ధం అవుతుంది – పులి ఎక్కడికీ పోలేదు. ఈ పురుషుడే పులి. ఆ రంగు రంగుల పొడులన్నిటినీ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ముగ్గులా వేసి దానిలో పడుకుని అతడు పులి అవుతున్నాడనీ, తర్వాత ఆ ముగ్గునంతటినీ కలగలిపి అందులో పడి దొర్లితే తిరిగి మనిషి అవుతున్నాడనీ అర్ధమవుతుంది.

అంతేకాదు. ఆ గుహలో ఆ రంగు పొడులే కాక అయిదు కత్తులు కూడా కనిపిస్తాయి. అవి అక్కడ ఎందుకున్నాయో అర్థం కాదు. సరే, ఆ పురుషుడు వెనక్కి రాగానే వాడిని శిక్షించి, భయపెట్టి విషయాలన్నీ తెలుసు కోవాలనుకుని ఆ గుహలోనే కూర్చుంటాడు శ్రీముఖుడు. ఆ సమయంలో రకరకాల ఆలోచనలు చేస్తాడు. మనిషి పులి అవడం ఏమిటి? దీన్ని ఎలా నమ్మడం అన్న విషయం దగ్గర మొదలయ్యి రకరకాలుగా సాగే ఆ ఆలోచనలు ఆసక్తికరంగా వుంటాయి.
వాటిలో కొన్ని:

“.. విశ్వసించెడి వారి హృదయములో, మనస్సులో విశ్వసించుట యన్న ఒక సనాతన పదార్థముండును. విశ్వసించని వాని గుండెలో, మనస్సులో ఆ సనాతన పదార్థముండదు. విశ్వసించుట అనునది ఆలోచనా జనితమైన బహుపూర్వ పరమేశ్వర భావనిష్ఠమైన యొక సంస్కార విశేషము! ఎవడు తన వెనుకటి జన్మల యందు బహు పశు జన్మలెత్తునో వాని హృదయములో, వాని మనస్సులో విశ్వాసమన్నది ఉదయించదు. విశ్వాసమనగా పండిన తర్కభావము. తర్కమనగా సామంజస్యము కల ఇతర పరిస్థితులను సంయోజన పరచి వాని నుండి ఒక మహార్థమును బుద్ధికి భాసింప చేసికొనుట! విశ్వాస రహితుడు విషయములను వినును, చూచును, పొసగించుకొనలేడు. ఒకనికి పాము కరచినది. అది విషము. విషము ద్రవ్యము. దానికి విరుగుడై ఇంకొక పృథివీ పదార్థము చేతనే అది పరిహరింపబడ వలయును కాని, మరి ఇంకొక దాని చేత పరిహిరింప బడరాదనుట ఈ సృష్టి యందున్న భిన్న పదార్థములయు, భిన్న భావములయు నైక్యము నెరుగలేకుండుట!

‘మనస్సులో నున్న భావము శబ్దముగా నెట్లు వచ్చినది?’ ఈ యొక్క దానికి చక్కగా నాస్తికులమనుకొనువారు సమాధానము చెప్పినచో, వాని యందు నాస్తికత మిగలదు. నాభి నుండి శబ్దోదయము కలుగుట ఏమి? అది – గాలి హృదయము వరకు, కంఠము వరకు వచ్చుట ఏమి? నాలుక, దవడలు, అంగిలి, దంతములు, పెదవులు, వీనిచేత నాపబడి, కొట్టబడి శబ్దము వెలివరచబడుట ఏమి? ఆ భావమీ శబ్దముగా నవతరించుటకు, ఈ జంతువుల యొక్క శరీరము లోని యవయవముల యొక్క సన్నివేశక్రమము హేతువగుట ఏమి? భావమునకు శబ్దమునకు సంబంధము లేదు. అది ఇదిగా మార్పు పొందినది. మార్పు పొందుటకీ జంతు శరీర యంత్రము నిర్మింప బడినది.

ఇట్లే – అదృశ్యము లైనవి సమాహితములైనవియు నైనవానిని, యంత్రముల ద్వారా మరియొక రూపమునకు మరలింపవచ్చును.”

సరే, శ్రీముఖుడు ఇలా ఆలోచించుకుంటూ వుండగా ఆ పురుషుడు మళ్ళీ గుహలోకి వస్తాడు. అప్పుడు విషయాలన్నీ చెప్తాడు. శ్రీముఖుడి మనసులోని ఆలోచనలని, ఉద్దేశ్యాలని కూడా చెప్పి శ్రీముఖుడిని ఆశ్చర్యపరుస్తాడు. ముందు అతని పూర్వుల చరిత్ర చెప్తాడు. “నీవు శాతకర్ణివి. అనగా ఆంధ్రుడివి. మీ పూర్వులలో ఒకనికి సంతానములేదు. ఒకనాడతనికి స్వప్నములో ఒక దేవత తోచి యిట్లనెను. ‘రేపుదయమున నీవు అడవికి పొమ్ము. అచట నొక సింహము మీద నొక బాలుడు కనిపించును. ఆ సింహమును చంపి యా బాలుని తెచ్చి పెంచుకొనుము. నీ వంశము తామరతంపరగా వృద్ధి పొందు’నని. అతడు మరునాడు కాంతారమున కేగగా కలలోనన్నట్లే కనిపించెను. ఆ సింహమునతడు బాణముతో కొట్టెను. ఆ సింహమొక గంధర్వుడై “రాజా! నా పేరు శాతుడు. నేనొక గంధర్వుడను. నా భార్య పేరు శుక్తిమతి. ఆమె చనిపోయెను. ఈ పిల్లవానిని నీకోసమే తెచ్చుచుంటినని చెప్పి అంతర్హితుడయ్యెను. నాటి నుండి మీ ఆంధ్రులు సింహధ్వజులు.” అని.

చెప్పి “ఇది కాణ్వాయనుల రాజ్యం నశించే కాలం, మీ పూర్వుడికి సింహం కనబడి కొడుకుని ఇస్తే, నీకు పులి కనబడి రాజ్యాన్ని ఇస్తోంది.” అంటాడు.
ఇక ఆ తర్వాత శ్రీముఖుని చరిత్రనీ, భవిష్యత్తునీ కూడా చెప్తాడు. “ప్రతిష్టాన నగరమున, ధాన్యకటకమున మీ ఆంధ్ర రాజులు వున్నారు. వారు భోగపరాయణులై, బలహీనులై వున్నారు. అసమర్ధమైన వైదిక మార్గంలో వున్నారు. వారికీ, నీకూ పడలేదు. నీవూ రాజవంశం వాడివే. నీకూ, ఇప్పుడు రాజుగా వున్నవాడికీ తాతల కాలం నుండీ రాజ్యం మీది అధికారం గురించి వివాదం వుంది. మీ తాత సాధువు అవడం వలన అప్పుడు వాళ్ళది పైచేయి అయింది. నువ్వు వాళ్ళతో పేచీ పడి నగరం విడిచి మగధ చేరావు. ఇక్కడ సైన్యంలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మహాసేనానివీ, మంత్రివీ కూడా అయ్యావు. ఇపుడు రాజు సుశర్మకి నువ్వు ఎంత చెప్తే అంత. అతనికి నలుగురు రాణులు. ఆ నలుగురూ అతని నాల్గు ప్రాణాలు తీస్తున్నారు. మిగిలిన ఒక్క ప్రాణాన్నీ తీయడానికి నువ్వు సంకోచిస్తున్నావు. నీ చేతి మీదగా కాకుండా ఇంకెలాగయినా ఆ ప్రాణం పోతే ఇక నీకు తిరుగులేదు. సదానీరా నదీ ప్రదేశము నుండి భారతమున కొసవరకు ప్రాచ్యక దేశమనబడే ప్రాంతమంతా నీ అధీనంలోకి తెచ్చుకుని తర్వాత మళ్ళీ మగధములకు వచ్చి పశ్చిమ దిశకు విజృంభించవచ్చు. నిన్ను భారతదేశ చక్రవర్తిగా మన్నించని వాడుండడు.”

ఇదంతా చెప్పి ఇక్కడ ఆంధ్రుల గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తాడు. ఆంధ్రుల గురించి కాబట్టి అవి మనం చెప్పుకోవాలి. తప్పదు.
“ఆంధ్రులు కుత్సితులు! న్యాయమైన యూహ చేయని వారు! వారి వివేకము గొప్పదే కాని, వారి మనస్సు కుటిలమైనది! వారు పరాక్రమవంతులే కాని, తమ పరాక్రమము నుపయోగించు కొనుట వారికి తెలియదు! .. ఆంధ్రులు ఆత్మద్రోహులు! సంఘ ద్రోహులు! వేద ధర్మద్రోహులు! అని నారాయణుని (అంటే సుశర్మ తండ్రి) యూహ! అతని యూహయే కాదు. భారతదేశమునందలి సర్వప్రాంతముల వారు మీ యాంధ్రులను గురించి యట్లే యనుకొనెదరు. దానికి తగినట్లు మీరు ప్రవర్తింతురు. ఏ ఇతర దేశములో నైనను వట్టి ఎడారిలో నొక దర్భమోడు లేచినచో అది మహావృక్షమని మన్నింతురు. మీ ఆంధ్రులు మహావృక్షములను దర్భమోడులని చెప్పుదురు. మీ జాతి లక్షణమది! మీ జాతి యన్నచో నాకెంతయో అభిమానము! మీది నాకిష్టమైన జాతి! నా కభిమతమైన జాతి!”
ఇంతకీ ఇదంతా చెప్పిన ఆ పురుషుడు ఎవరు? అది కూడా చెప్తాడు. అతను “జయద్రధుడు”. అతనే శ్రీముఖుని చిన్నతనంలో అతనికి ఖడ్గవిద్య నేర్పిన గురువు. ఆ విషయం అతను గుర్తు చేశాక శ్రీముఖుడు కూడా అతనిని గుర్తుపడతాడు. సుశర్మని చంపి శ్రీముఖుడిని చక్రవర్తిని చేస్తానని జయద్రథుడు అతనికి చెప్తాడు.

ఇక్కడ కొంచెం ఆగి కొంతకాలం క్రితం ఆంధ్రదేశం లో జరిగిన కథ చెప్పుకోవాలి. ఆంధ్ర రాజు చంద్రశేఖర శాతకర్ణికి ఒకసారి వేటకి వెళ్ళినపుడు ఒక కల వస్తుంది. ఆ కలలో ఎవరో “రేపు నీకు వేటకు వెళ్ళినపుడు ఒక యోధుడు కనబడతాడు. అతన్ని జయించ లేవు. బ్రతిమాలుకుని బయటపడతావు.” అని చెప్తారు. ఆ మర్నాడు అతను వేటకు వెళ్ళినపుడు అలాగే జరుగుతుంది.

అడవిలో ఒంటరిగా చిక్కిన రాజుని ఒక యోధుడు జయించి “మీ ఆంధ్రుల ధనుర్విద్యా పాండిత్యము జగద్విదితం. కాని తుముల యుద్ధం వచ్చినపుడు మీరు వెనుకబడి పోతున్నారు. అందుకని మీ జాతిని నేను ఖడ్గావిద్యా నిపుణమును చేయుదును. మీరు చక్రవర్తులగుదురు. నేను నిన్నిప్పుడు వదిలిపెట్టెదను. నీవు పోయి నీ సైన్యముతో కలుసుకొనుము. నేను కొన్నాళ్ళకు ధాన్యకటకమునకు వత్తును. నీవు నన్ను నీ రాజ్యములో ఖడ్గవిద్యా గురువుగా చేయవలయును. ఆ వాగ్దానము చేసినచో నిన్ను వదిలిపెట్టెదను.” అంటాడు.

మా ఆంధ్రజాతి మీద నీకెందుకు ఇంత అభిమానం! అని రాజు అడిగితే, “అవి సుగుణములని నేను చెప్పను. భారతదేశమున నితరజాతులలో లేని యొక లక్షణము మీ యందున్నది. మీ జాతి వివక్ష లేని జాతి. దేని వెంటబడిన దాని వెంట పోయెడు జాతి. సృష్టిలో సర్వమైన వివేకము మీ జాతియందున్నది. సర్వమైన అవివేకమును మీ జాతియందే వున్నది. మరియొక జాతి, ఐనచో వివేకమైనది లేనిచో అవివేకమైనది. అదియో, ఇదియో, ఏ జాతిలోనైన నెక్కువ పాళ్ళుగా నుండును. మీ జాతిలో రెండును సరిసమానముగా నుండును. మీ జాతిలో నింకొక లక్షణ మున్నది. ఇంతటి వివేకము కలిగి, ఆ యవివేకము ఈవివేకమును భాసించనీయదు. ఇది మీలోనున్న విశిష్టత.” అంటాడు.

సరే ఆ లక్షణం వలన అతనికేం ప్రయోజనమో రాజుకి అర్థం కాదు. ఆమాటా అడుగుతాడు. దానికి “నేనొక కాలాకృతిని. అవివేకమును భాసింప జేయుటయే నాకు పరమ మైన యిష్టము. మీ జాతి ద్వారా దానిని భారతదేశమునం దంతటను వ్యాపింప జేయవలయునని నా యుద్దేశ్యము.” అని చెప్తాడు ఆ యోధుడు.
ఈసరికి మీకు అర్థమయ్యే వుంటుంది కదా, అలా మాట్లాడుతున్న యోధుడు జయద్రథుడు. అలా అతను ధాన్యకటకం చేరతాడు. శ్రీముఖుడు అప్పటికి చిన్నవాడు. ఆ సమయంలోనే జయద్రథుడు శ్రీముఖునికి ఖడ్గవిద్య నేర్పుతాడు. అలాగే ధాన్యకటకంలో వుండే మరో రాజవంశీయుడు నీలాంబర శాతకర్ణి యొక్క కూతురు జయద్రథికీ నేర్పుతాడు. ఆమె తల్లి లేని పిల్ల. శ్రీముఖుడి ఈడుదే. తండ్రి సరిగా గమనించుకోక పోవడంతో జయద్రథుడు, జయద్రథిల మధ్య వున్న గురు శిష్య సంబంధం పెడ త్రోవ పట్టి ఆమె ఒక పిల్లాడికి తల్లి అవుతుంది. ఊరి వాళ్ళు ఆ కుటుంబాన్ని వెలివేస్తారు.

రాజు జయద్రథుడిని దేశం నుంచి బహిష్కరించ వలసి వస్తుంది. అతడు భార్యనీ, పిల్లాడినీ కూడా వదిలేసి వెళ్ళిపోతాడు. గురువుగారిని బహిష్కరించినందుకు రాజధానిలో విప్లవం లేవదీసిన శ్రీముఖుడూ బహిష్కృతుడవుతాడు. అలా అతడు మగధ చేరి అంచెలంచెలుగా ఎదిగి మహాసేనానీ, మంత్రీ అయ్యాడు. ఇదంతా జరిగి దాదాపుగా ఇరవై ఏళ్ళు. ఇప్పుడు పెరిగి పెద్దవాడైన ఆ జయద్రథుడి కొడుకు (అతని పేరు కూడా జయద్రథుడే) తండ్రిని వెదికేందుకు బయల్దేరాడు.
ధాన్యకటకానికి సంబంధించిన మరో కుటుంబం గురించి కూడా చెప్పుకోవాలి. గంగాధర శాతకర్ణి కుటుంబం. ఆ కుటుంబానికీ గోముఖ శాతకర్ణి (అంటే శ్రీముఖుని తండ్రి) కుటుంబానికీ సరిపడదు. రాజయిన చంద్రశేఖర శాతకర్ణికి సంతానం లేదు. మగధ రాజ మహాసేనానిగా ఎదిగిన శ్రీముఖ శాతకర్ణి రేపు ఆంధ్ర రాజ్యాన్ని వశం చేసుకుంటే అది గంగాధర శాతకర్ణి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతుంది. దానిని నివారించడం ఎలా?

ఆ గంగాధర శాతకర్ణికి మగ సంతానం లేదు. పద్మరాణి అనే కూతురు వుంది. మహా ధానుష్కుడు, ఖడ్గవిద్యా నిపుణుడు అయిన గంగాధరుడు కొడుకు వుంటే అతన్ని మహావీరుడ్ని చేసి శ్రీముఖుడికి ఎదురుగా నిలిపేవాడే. లేడు కనుక, కూతురు పద్మరాణిని సుశర్మకి భార్యని చేయడం ద్వారా శ్రీముఖుడిని ఎదుర్కోవాలని అనుకుంటాడు. సుశర్మ బ్రాహ్మణుడు, తాము క్షత్రియులు – అయినప్పటికీ ప్రయత్నించాలనుకుని పద్మరాణి ని గిరివ్రజపురం పంపుతాడు. అలా పద్మరాణి సుశర్మకి ప్రియురాలు, మగధకి రాణి అవుతుంది.

పద్మరాణికి పాండిత్యము, సౌందర్యము రెండూ వున్నాయి. ఆ విషయం చెప్పే సందర్భంలో లోకమునకు సౌందర్యము కావలయునా, పాండిత్యము కావలయునా? అని ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకి జవాబు ఇలా చెప్తారు విశ్వనాథ. “సౌందర్యమే కావలయును. అపుడపుడు వినోదమున కయ్యెడిది పాండిత్యము. అనుభూతి కయ్యెడిది సౌందర్యము. లోకము మాట యట్లుంచి వైయక్తికముగా పురుషుడు గాని స్త్రీ గాని తమ సౌందర్యమును మన్నించుకొన్నట్లు పాండిత్యమును మన్నించుకొనరు. ఇది జీవుని యొక్క లక్షణము.” దానికి ఇంకొంత వివరణ కూడా ఇచ్చారు. నాకు వెంటనే ‘నిజమే’ అని అనిపించలేదు. ఆయన ఇచ్చిన వివరణ యవ్వనం వరకూ సరిపోతుంది కానీ జీవితం మొత్తానికీ సరిపోతుందా అని సందేహం వచ్చింది. ఆయన చెప్పిన విషయాన్ని తేలికగా తీసేయలేము కనుక ‘ఇంకొంచెం ఆలోచించాలి. పరిశీలించాలి’ అనుకున్నాను.

ఇక సుశర్మ గురించి చెప్పాలంటే అతడు గొప్ప పండితుడు కానీ స్త్రీలోలత్వం అనే ఒక బలహీనత వుంటుంది. ఒక అధ్యాయం మొత్తం అంటే తొమ్మిది పేజీలు  కేవలం అతని ఆలోచనలు వ్రాస్తారు రచయిత. వాటిలో ఒకటి చెప్పుకుందాం.

“.. ఈ ఆకాశమేమి? ఈ సముద్రమేమి? ఈ దిక్కులేమి? ఈ దేశములేమి? ఈ జనమందరు నిట్లు పుట్టుచుండుట యేమి? ఎవనికి వాడీ సృష్టి నంతయు యేదో తలక్రిందులు చేయుచున్నాననుకొనుట యేమి? వాడు తలక్రిందులు సేయుట యంతయు కలిపి ముప్పది నలుబది ఏండ్లు, కాదా యరువది ఏండ్లు. ఇంకను వీలు మిగిలినచో వంద ఏండ్లు. అంతకంటే మించి లేదు కదా! దాని కొరకు వాని యారాటమెంత? ఈ అనంత కాలములో వందేండ్లే సూక్ష్మాతి సూక్ష్మమైన కాలము. పాతికేండ్లు, పరక ఏండ్లు లోకము నానిపట్టికొని సంతోషించెడి వారి సంగతి నింక నేమి చెప్పవలయును? అందరును లోకమున కుపకారము చేయవలయుననెడి వారే. ఎవ్వడును తాను తరించెడి వాడు లేడు. ఇతరులను తరింప చేయవలయుననెడి వాడే. పెద్దలు లోక మజ్ఞాన దూషితమని చెప్పుదురు. ఆ యజ్ఞానము వేయివిధములుగా నుండవచ్చును. సర్వ విధములైన యజ్ఞానములలో మకుటాయమానమైన యజ్ఞానము పరులను తరింపజేయువలయునన్నది. అది నిజముగా లోకోపకార బుద్ధి కాదు. స్వోపకార బుద్ధి!”

(ఇలాంటివి చదివినపుడు.. అరే, చిన్నప్పుడే ఈయన రచనలు చదవకుండా ఈ విషయాలన్నీ మనం జీవితంలో బోలెడంత సమయం వృథా చేసి కష్టపడి నేర్చుకున్నాం కదా అని దిగులేస్తుంటుంది నాకు. 🙂 )

శిశునాగ వంశంలో ఎనిమిదో రాజైన ఉదయనుడు భాగీరథికి దక్షిణ తీరంలో కుసుమపురం అనే పట్టణాన్ని నిర్మించాడు. అదే తర్వాత పాటలీపుత్రం అయింది. శిశునాగ వంశంతో మొదలుపెట్టి ఇప్పటి కాణ్వాయన వంశం దాకా మగధ రాజులందరికీ గిరివ్రజపురమే రాజధాని. కానీ ప్రతి వంశంలోనూ చివరికొచ్చేసరికి రాజులు భోగపరాయణులు అవడం, అలాంటి వారు విలాసార్థం రాజధానిని వదిలిపెట్టి పోయి పాటలీపుత్రం చేరడం వుంది. ఇప్పుడు కాణ్వాయన వంశంలో చివరివాడైన సుశర్మ కూడా అలా పాటలీపుత్రంలో విలాసాలలో మునిగి వుంటే శ్రీముఖుడు రాజధాని గిరివ్రజపురంలో వుండి వ్యవహారాలన్నీ చూసుకుంటున్నాడు.
సరే ఇప్పుడు శ్రీముఖుడు తనకి రాజ్యం మీద ఆశ వున్నా తనంతట తాను రాజయిన సుశర్మని చంపే ఆలోచన చేయడు. ఏదో ఒక విధంగా అది జరిగి రాజ్యం తన చేతికి వస్తే మాత్రం అతనికి సంతోషమే. ఇది తెలిసిన జయద్రథుడు సుశర్మని చంపడం అనే పని తానే నిర్వహించి శ్రీముఖుడిని చక్రవర్తిని చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసమే అతడు ఇరవై సంవత్సరాలు శ్రమపడి “పులిమ్రుగ్గు” అనే విద్యలో నేర్పు సాధించాడు. ఆంధ్ర దేశ అడవులలో వున్న శబరుల దగ్గర, ఇంకా ఇతర దేశాలలో వున్న ఆటవికుల దగ్గర ఎన్నో విషయాలు సేకరించి మొత్తానికి ఆ విద్యని సాధించాడు.

ఇక పథకం అమలు చేయదలచి పాటలీపుత్రం వచ్చి పద్మరాణిని కలుసుకుంటాడు. ఆమెకి అతనంటే సదభిప్రాయం కలగకపోయినా అతనితో గొడవెందుకులే అనుకుని, అంత పండితుడైన సుశర్మని ఇతనే విధంగా ప్రలోభ పెట్టగలడులే అనుకుని రాజదర్శనం చేయిస్తుంది. అక్కడే ఆమె పొరబడుతుంది. అంతటి పండితుడు అయిన రాజూ జయద్రథుడి మాయలో పడతాడు.

అందమైన పద్మరాణి పులిగా మారితే ఎలా ఉంటుందో చూడాలని ఉందన్న విపరీతమైన కోరిక కోరతాడు. పద్మరాణి వారించినా ఇందులో ప్రమాదమేమీ ఉండదనీ, పులిగా మారినా ఆ కాస్త సమయంలో అంటే మళ్ళీ మనిషిగా మారే లోపల ఆమె తన పుర్వజ్ఞానాన్నేమీ మరచి పోదనీ, ఎవరికీ హాని చేయదనీ నచ్చచెప్పి రాజు ఆమెని ఒప్పిస్తాడు.

అప్పుడు జయద్రథుడు రాజునీ, రాణినీ బలిమఠం దగ్గరి అడవులకి తరలిస్తాడు. అంటే మొదట జయద్రథుడు, శ్రీముఖుడు కలుసుకున్న చోటు. తోహారు, శ్రీముఖుడు కలిసి పులిమనిషి కోసం వెతికిన చోటు.

అక్కడ ఆ అడవిలో ఒక చిన్న భవనం నిర్మించబడుతుంది. రాజు తన భార్య తోనూ, కొంత పరివారం తోనూ వేట కోసం వస్తున్నాడని, ఆ భవనంలో కొన్నాళ్ళు నివాసం చేస్తాడని ప్రచారం జరుగుతుంది. భవననిర్మాణం పూర్తవగానే రాజు వస్తాడు.

మరొక ప్రక్కన జయద్రథుడిని వెతుకుతూ బయల్దేరిన అతని కొడుకు (చిన్న జయద్రథుడు) కూడా ఈ అడవులకే చేరతాడు. అతను ధాన్యకటకంలో తమ కుటుంబాన్ని వెలివేసినప్పటికీ మాతామహుడి శిక్షణతో బుద్ధిమంతుడిగా తయారయ్యి, తన సద్గుణాలతో ఊర్లో మంచి పేరు తెచ్చుకుంటాడు. రాజు మంచి ఉద్యోగం కూడా యిస్తానంటాడు. అయితే అతడు ఉద్యోగం కన్నా తండ్రిని వెతకడం ముఖ్యంగా భావించి ఇల్లు వదిలి బయల్దేరతాడు. తన తండ్రిని గురించిన వివరాలు ఒక ఆటవికుడైన వృద్ధుడికి తెలిసివుంటాయని ఊహించి మొదట అతని దగ్గరకి వెళ్ళి అతన్ని ప్రశ్నిస్తాడు. అతను కొంత బెట్టు చేసి ఆ తర్వాత ‘తండ్రి కనబడినపుడు ఆయన ఏం చెప్తే అది చేస్తాను’ అని వాగ్దానం చేస్తే చెప్తానంటాడు.

వాగ్దానం అంటే అది మామూలు వాగ్దానం కాదు. ఎముకలు, ఎర్రనీళ్ళు, రకరకాల వస్తువులు, వికారపు బొమ్మలు మొదలైన వాటన్నిటి మధ్యా కూర్చోపెట్టి చేయించిన ఒక ఆటవిక ప్రతిజ్ఞ. అది తప్పిన వాడిని అడవి కుక్కలు బ్రతికుండగానే పీక్కుని తింటాయి!

అలాంటి ప్రతిజ్ఞ చేయించాక “నువ్వు మళ్ళీ వెనక్కి తిరిగి ధాన్యకటకం వెళ్ళకూడదు. అడవుల్లోనే తిరుగుతూ వుండాలి. మూడేళ్ళ తర్వాత బలిమఠం దగ్గర వున్న అడవులలో నీ తండ్రి నీకు కనిపిస్తాడు. అయితే అతను మనిషి రూపంతో కాక పులి రూపంతో కనిపిస్తాడు.” అని చెప్తాడు. ఇలా వాగ్దానం చేయించుకోమనీ, ఆతర్వాత ఈ విధంగా చెప్పమనీ – యిదంతా కూడా జయద్రథుడే తనకు చెప్పాడని కూడా ఆ వృద్ధుడు చెప్తాడు.

చిన్న జయద్రథుడి వాలకం గమనించిన ఆ వృద్ధుడు – ‘బహుశా నీకూ నీ తండ్రికి పొసగదు. ఈ ప్రతిజ్ఞ నీకు ప్రమాదకారి అవుతుందేమో’ అని కూడా అంటాడు. చిన్న జయద్రథుడు ‘ఈ శబర మంత్రాలు నన్నేమీ చేయలేవు. నాకు భయం లేదు.’ అంటాడు. ఎందుకంటే అతను కృష్ణ భక్తుడు! తన తాతగారు ఉపదేశించిన మంత్రాన్ని నిష్టగా జపిస్తున్న వాడు. అడవిలో వున్నప్పుడు కూడా సూర్యోదయానికి ముందే స్నానం చేసి, సంధ్యావందనం చేస్తాడు. అడవిలో మరోపని లేదు కాబట్టి రోజంతా మంత్రాన్ని జపిస్తూనే వుంటాడు.

సరే అతని ధైర్యం అతనిది కానీ చదువుతున్న మనకి భయమే కదా! కోటి జపం చేస్తే ఆ మంత్రం అతనికి సిద్ధిస్తుందనీ, ఆలోపల తండ్రి కనిపించక పోతే మంచిదనీ చూచాయగా ఒకచోట చెప్పి, ఇక అక్కడినుంచీ ఇంకా లక్ష చేయాలి, యాభైవేలు చేయాలి అంటూ మధ్య మధ్యలో లెక్కలు చెప్పి మనల్ని భయపెడుతుంటారు రచయిత.

సరే, అలా బలిమఠం చేరిన చిన్న జయద్రథుడు తోహారుని కలుసుకుని తండ్రిని (పులిమనిషిని) వెతకడంలో తనకి సహాయం చేయమని అడుగుతాడు. తోహారు సహాయం చేసేందుకు అంగీకరిస్తాడు కానీ అంతకుముందే తాను పులిమనిషిని చూసానన్న విషయం చెప్పడు. ఇద్దరూ కలిసి వెతుకుతుంటారు.

ఇక్కడ్నుంచి కథ రాజు, రాణి, పెద్ద జయద్రథుడు, చిన్న జయద్రథుడు, తోహారు – వీళ్ళతో ఆ బలిమఠం అడవిలో నడుస్తుంది. అప్పటివరకు ప్రాధాన్యత లేని చంద్రరేఖ అనే మరో పాత్ర కథ నడిచేందుకు కారణమవుతుంది.

కొడుకు తండ్రిని కనిపెడతాడా? ఆయనకి సహాయపడతాడా? పద్మరాణి పులి అవుతుందా? ఎవరినైనా చంపేస్తుందా? జయద్రథుడు రాజుని చంపగలుగుతాడా? చంపి తప్పించుకోగలుగుతాడా?

ఈ ప్రశ్నలకి సమాధానాలు దొరికే చివరి నలభై పేజీలూ ఉత్కంఠగా నడుస్తాయి. ఈ భాగంలో తోహారు, చిన్న జయద్రథుడు – వీళ్ళిద్దరి మధ్యా స్నేహాన్ని రచయిత చెప్పిన తీరు నన్ను ఆకట్టుకుంది. చెప్పడం అంటే పెద్ద ప్రత్యేకించి ఏమీ చెప్పరు. కానీ చెప్పకుండానే ఏదో చెప్తారు. స్వచ్ఛమైన మనసులు గల ఇద్దరు మనుషుల గురించి ఏం చెప్పారో తెలియకుండానే ఎంతో చెప్తారు.

నాగరికులు, జానపదులు, ఆటవికులు – కథలో భాగంగా వీళ్ళ ముగ్గురి గురించీ చెప్పిన ఒకటి రెండు విషయాలు కూడా ఆకట్టుకున్నాయి.
1) రాజకులములో నున్నవారికి నచ్చెరువు తక్కువ. జానపదుల కంతకంటె తక్కువ. ఆటవికులకు మరియు తక్కువ.
2) కొందరి ప్రకృతిలో ఒకపని చేయవలయునని అనుకున్నచో అది ఆరు నూరయినను, యిట్లుదయించెడి సూర్యుడట్లుదయించినను వారు మానివేయుట యుండదు. ఇట్టి ప్రకృతి నాగరకుల యందు తక్కువగా, జానపదులయందు కొంత యెక్కువగా, ఆటవికులయందు సమృద్ధిగా ఉండును.

ఈ విషయాలు ఊరికే కథకి సంబంధం లేకుండా చెప్పే పరిశీలనలు కావు. కథలో ఒకడు ఒక విధంగా ప్రవర్తించడం వుంటుంది. వాడు అలాగే ప్రవర్తించడం కథా గమనానికి అవసరమయి వుంటుంది. అటువంటి సందర్భంలో ఆ ప్రవర్తనకి సమర్ధనగా వచ్చే ఇలాంటి పరిశీలనలు పాఠకుడికి కథనీ, సమాజాన్నీ కూడా సందేహాలు లేకుండా అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తాయి.

ఈ నవలలోని కథ, కల్పనలు – స్థూలశరీరం గురించీ, సూక్ష్మ శరీరం గురించీ నాకు కొన్ని సందేహాలను కలిగించాయి – సూక్ష్మశరీరం స్థూలశరీరాన్ని ఏర్పర్చుకోవడంలో వుండే నియమాలు, అవకాశాలు, శక్తులు, వాటి పరిమితులు మొదలైన విషయాల గురించి. ఆ సందేహాలను తీర్చుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలు ఆ విషయాల పట్ల నా స్పష్టతని పెంచాయి. అంతకుముందు విన్న, చదివిన విషయాలను ఈ కథ ఆధారంగా విశ్లేషించుకోవడం వలన అవన్నీ ఇంకొంచెం బాగా అర్థమయాయనిపించింది.

ఇక నవల చదువుతున్నపుడు ఈ పులిమ్రుగ్గులోని కొన్ని గీతలను రచయిత కలపకుండా వదిలేశారని అనిపించింది.

కొడుకు తన దగ్గరికి వచ్చేందుకు అంత పటిష్టమైన ప్రణాళిక రచించిన జయద్రథుడు, తాను చెప్పిన పని చేసేందుకు తీవ్రమైన ప్రమాణం చేయించడం ద్వారా అతన్ని తన పథకానికి సిద్ధం చేసిన జయద్రథుడు, ఆ కొడుకుతో ఏమి చేయించాలనుకున్నాడో చెప్పడు. అతని సహాయం తీసుకోడు. అలాగే శ్రీముఖుడిని కూడా తన పథకానికి తోడ్పడేలా సన్నద్ధం చేస్తాడు కానీ, తర్వాత అతని సహాయమేమీ తీసుకోడు.

అలాగే చిన్న జయద్రథుడి మంత్రజపం. అది పూర్తవడం కథకి ఉపయోగపడుతుందేమో, అప్పుడేదయినా విచిత్రం జరుగుతుందేమో అనుకున్నాను కానీ అదేమీ లేదు. ఆ మంత్ర జపం ఇంకొక పాతికవేలు చేయవలసి ఉండగానే నవల పూర్తయి పోయింది.

అయితే, ఇవన్నీ ఉత్కంఠ పెంచేందుకు వాడుకున్న అంశాలని అనుకోవచ్చు. అలాగే, కొడుకు తనకు ఉపయోగపడేవాడిలా లేడని గ్రహించి, జయద్రథుడు అతని సహాయం తీసుకోలేదనీ, అయినా తాను అనుకున్న పని ఎలాగూ మరోరకంగా నెరవేరుతోంది కనుక అతన్ని ఉపయోగించుకోలేదనీ అనుకోవచ్చు. ఎందుకైనా మంచిదని రెండు మూడు పథకాలు రచించి పెట్టుకున్నాడు, వాటిలో ఒకటే ఉపయోగించుకున్నాడు అని అర్థం చేసుకోవచ్చు.

ఇకపోతే ఒక చిన్న పొరపాటు గమనించాను ఈ నవలలో. మొదటి అధ్యాయము చివర్లో జయద్రథుడు, శ్రీముఖుడు గుహలో మాట్లాడుకున్నాక జయద్రథుడు అతనిని ‘పడవకొయ్య మీద తీసుకొనిపోయి తోహారు వద్ద దించెను’ అని వుంటుంది. అయితే ఏడవ అధ్యాయం చివర్లో తోహారు పులిమనిషి వ్యవహారాన్ని రహస్యంగా భావించినందువల్లా, అసలు విషయమేమిటో తనకే స్పష్టంగా తెలియనందువల్లా తనలోనే దాచుకున్నాడనీ, చిన్నజయద్రథుడికి వెంటనే చెప్పలేదనీ వివరించిన సందర్భంలో “మహాసేనాని (అంటే శ్రీముఖుడు) తరువాత తన్ను కలిసికొనలేదు. తనకు వార్త పెట్టలేదు. తనంతట తాను పోయి మహాసేనానితో ఈ విషయము మాటాడుటకు వీలు లేదు. అది సాధ్యమగు విషయము కాదు. ఆనాడు సేనాని వెంట తానుకూడ దిగి ఈదికొని పోయినచో నేమయ్యెడిదో తెలియదు. సేనాని నివారించెడి వాడు. ఆ సేనాని యెచ్చటికి పోయెను? తిరిగి ఎప్పుడు వచ్చెను? గిరివ్రజ పుర మెప్పుడు చేరెను? ఈ సంగతు లేమియు తోహారునకు తెలియవు.” అని వుంటుంది. చాలా చిన్న పొరపాటే కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి రచనలలో ఇలాంటి పొరపాట్లు సాధారణంగా దొరకవు కాబట్టి దొరికినపుడు కొంచెం ఆశ్చర్యం కలుగుతుంది.

*****

విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

Pulimruggu
Viswanatha Satyanarayana

You Might Also Like

2 Comments

  1. Amarnath

    శ్రీవల్లి రాధిక గారు ఈ నవలలన్నిటికీ ఓపిక గా పరిచయాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.

    విశ్వనాథగారి నవలా సాహిత్యం లో వుండే కథా కల్పన, పాత్రల చిత్రణ, సన్నివేశాల-సంభాషణల కల్పన, పాత్రల గురించి పాత్రల తోనే చేయించే విశ్లేషణ, అంతే కాకుండా అక్కడక్క వుండే వర్ణనలు ఇవన్నీ ఒకే చోట ఇతరమైన తెలుగు నవలా రచయితలలో కనిపించలేదు నాకు.

    వీటన్నిటితోపాటుగా ఆయన నమ్మిన సిద్ధాంతాలని అంతర్లీనంగా చెప్పే తీరు అనన్య గోచరం.

    ఏదైనా ఒక సిద్ధాంతాన్ని సమర్థిస్తూ కథా రాసే కొందరు రచయితలు సాధారణంగా ప్రతినాయక పాత్రల ఔన్నత్యాన్ని తగ్గించి అవివేకులనుగా చిత్రించటం చేస్తుంటారు. కాని విశ్వనాథ పాత్రలలో ప్రతినాయక పాత్రలు అసాధారణమైన వివేకం, తెలివితేటలతో వుంటాయి. దాని మూలంగా నాయక పాత్రల ఔన్నత్యం మరింత పెరుగుతుంది.

    ఈయన సాహిత్యాన్ని చదవకపోవటం నిస్సంశయంగా తెలుగు పాఠకులకి అన్యధా పూరించలేని ఒక లోటు.

  2. Halley

    చదవలేదు ఇంకా . చదవాలి. ఈయన ఊహాశక్తి మాత్రం అమోఘం . సాంఘికాల కంటే కూడా పురాణ వైర గ్రంథమాల లోనే అది ఎక్కువగా కనపడుతునట్టుగా ఉంది . నవల పేరులోనే వెరైటీ ! ఓపికగా అన్నిటికీ పరిచయాలు రాసారు . హ్యాపీ!

Leave a Reply to Halley Cancel