గ్రహాంతర వాసి – రాణి శివశంకరశర్మ

వ్యాసకర్త: Halley
*********
ఈ మధ్యన రాణి శివ శంకర శర్మ గారి “గ్రహాంతర వాసి” చదివాను. ఆ పుస్తకం గురించే ఈ పరిచయం. ఏది ఏమైనా ఈయన పుస్తకాలు నేడు సాహిత్యం పేరుతో చెలామణీ అవుతున్న తక్కిన వాటితో పోలిస్తే చాలా భిన్నమైనవి ఆ శైలీ ఆ కథా వస్తువూ ఆ వాద ప్రతివాదాలూ అన్నీనూ. అక్కడక్కడా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినా నా విక్టోరియన్ మొరాలిటీకి అక్కడక్కడా కొన్ని విషయాలు అడ్డు వచ్చినా కూడా ఇది తప్పక చదవాల్సిన పుస్తకం అని అనిపించింది. జంకు బొంకు లేకుండా రాస్తారు శర్మ గారు. నా వరకు నేను ఏదో ఒక మోస్తరు అవీ ఇవీ బాగానే చదువుతాను (అని అనుకుంటాను) కానీ ఇలా సూటిగా సహేతుకంగా సమకాలీన సమాజాన్ని సమగ్రంగా విమర్శిస్తూ విశ్లేషిస్తూ రాసిన గ్రంథాలు నేను తెలుగులో పెద్దగా చదివింది లేదు. అసలు సమకాలీన తెలుగు సాహిత్యం నేను చదివింది కూడా తక్కువేననుకోండి. నిజానికి ఇలాంటిది ఏదో వచ్చి ఉంటే ఎవరో ఒకరు రెకమేండ్ చేసి ఉండాలి కదా కనీసం. నాకు తెలిసి రాలేదు. అయితే ఈ తరహా భావాలు మొన్న చదివిన ఒక నవలలో కనపడ్డాయి. అది Ngugi Wa Thiong’o రాసిన “I will marry when i want” అనే పుస్తకం . ఇలాంటి అంశాల గురించి రాసిన ఇతర పుస్తకాలు కొన్ని నేను ఇక్కడ చదివాను (మరియు ఇక్కడ.). ఇవన్నీ కొద్దో గొప్పో చదివినందుకు ఈ పుస్తకం తాలూకా భావాలు నాకు సులభంగా అర్థం అయ్యాయి. లేదంటే కష్ట పడేవాడిని ఏమో చాలా ప్రౌఢమైన భావాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. వారు రాసిన “ది లాస్ట్ బ్రాహ్మిన్” కు మల్లే. కొన్ని కొన్ని పాత్రల చిత్రీకరణ అమోఘం. ఇవి క్రూడ్ గా అనిపిస్తాయి అక్కడక్కడా కాని దానికి కారణం మనలో కూడా ఆయా పాత్రలు కొద్దో గొప్పో బతికి ఉన్నాయి కాబట్టి మనకి అలా అనిపిస్తాయి అంతే.

తెలుగులో ఎందుకనో ఈ తరహా సాహిత్యం తక్కువ వచ్చింది అనిపిస్తుంది నాకు. నాకు తెల్సినంతలో శ్రీపాద వారి జీవిత చరిత్రలో, విశ్వనాథ వారి నవలలో కనపడినంతగా భావదాస్యం గురించి రాసిన రచయితలు పెద్దగా లేరనుకుంటాను. ఇటువంటి పరిస్థితిలో రాణి శివశంకరశర్మ గారి రచనలు నా వరకు నాకు ఈ లోటుని తీర్చినట్టే అనుకోవాలి. తెల్ల దొరల కింద నలిగిన దేశాల భావ దాస్యం గురించి చదవాలన్నా కూడా ఆంగ్లంలోనే చదవాలి అంటే దానిని మించిన దౌర్భాగ్యం ఇంకొకటి లేదనుకుంటాను. నేను నా గికియు భాషలోనే రాసుకుంటాను అన్న Ngugi Wa Thiong’o లాగా శర్మగారు ఎంచక్కా తెలుగులోనే రాసుకుంటారు. అయన మిత్రులు శ్రేయోభిలాషులు ఎవరన్నా తిరిగి దానిని అనువందించి ఆంగ్లంలో ప్రచురిస్తారు. మంచి పద్ధతి! ఇండియన్ ఇంగ్లీష్ అని జబ్బలు చరుచుకొనే రచయితలంతా వారి వారి మాతృభాషలని ఇలా ఉద్ధరిస్తే మా బొటోల్లు తెలుగు చదువుతారు. అసలు ఈ ఇండియన్ ఇంగ్లీష్ రచయితలు సగం మందికి మాతృభాష ఇంగ్లీషే అయ్యుండచ్చు లెండి, అది వేరే సంగతి. ఈ పుస్తకాన్ని జీ.కె.సుబ్బారాయుడు గారు “Vagrant’s tale” అన్న పేరున ఇంగ్లీషు లోకి అనువదించారు. దాని గురించి రాస్తూ ఆయన “This book is a genre-defying work.It combines fiction, discursive prose, autobiography and cultural history into a semi-fictional narrative in which the characters are, by their very names, allegories of types abundantly available in our society. We encounter them every day. Yet we do not recognize them as distinct from each other since they merge into a complex we can not easily distinguish from ourselves” అని అన్నారు. ఇంతకంటే బాగా ఈ పుస్తకం గురించి చెప్పటం నా వల్ల కాదేమో. అదిగో చూసారా! మళ్లీ ఇంగ్లీషు ప్రమాణం వచ్చేసింది. ఎట్టా వేగేది ఈ భావదాస్యంతో!

ఇంకొక విషయం చెప్పుకోవాలి ఇక్కడ. మొన్నామధ్యన Hyderabad Literary Festival జరిగినపుడు ఈ పుస్తకం తాలుకా ఆంగ్లానువాదం రిలీజు చేసారు. నేను అక్కడ ఉండటం మూలాన యాధృచ్ఛికంగా రచయితను అనువాదకుడిని ఇద్దరినీ కలవటం జరిగింది. అయితే అక్కడ తెలుగు పుస్తకం కొనాలి అని అనుకున్న వారికి నిరాశే మిగిలింది. ఈ కినిగే అన్నది ఒకటి ఉంది కదా అని నా మట్టి బుర్రకి అప్పటి నుంచి ఇప్పటి దాకా తట్టలేదు. ఈ పుస్తకం కినిగేలో దొరుకుతుంది. Rs.67.5/- ఓన్లీ! నేను ఆ ఈ-కాపీనే చదివాను. లేదంటే వెయ్యి ముద్రణల బ్యాచీ వారీ ప్రింటు కాపీలు ఎప్పటికి వచ్చేను! నాబోటోళ్ళు ఎప్పుడు చదివేను!

ఈ పుస్తకం గురించి పరిచయం రాయటం కూడా కష్టమే. ఇది linear పుస్తకం కాదు. ఎన్నో పొరలు ఉన్నాయి. మొదటి సారి చదివినపుడు confusing గా కూడా అనిపించచ్చు. అసలేం చెప్దామని అనుకుంటునట్టు శర్మ గారు అని అనిపించచ్చు. కాని చదవగా చదవగా కొంతలో కొంత అర్థం అవుతుంది. కాబట్టి నన్ను ఆకట్టుకున్న కొన్ని పాత్రలు కొన్ని విషయ విశ్లేషణలను మాత్రం ప్రస్తావిస్తాను ఈ పరిచయంలో.

“మంత్రం స్థానాన్ని యంత్రం ఆక్రమించింది” అంటుంది ఒక పాత్ర ఒక చోట. నాకు చాలా నచ్చింది. అప్పుడప్పుడు ఒక చిన్న వాక్యంతో గొప్ప గొప్ప భావాలను పలికించచ్చును కదా అని అనిపించింది.

“సర్వసం” అని ఒక పాత్ర. చాలా కొత్తగా అనిపించింది ఈ పాత్ర తీరు పుస్తకం పరంగా చూస్తే. సమాజం పరంగా చూస్తే ఇలాంటి వాళ్ళని చాలానే చూసి ఉంటాం. ఇంగ్లీషు కొటేషన్ లేకుండా ఉటంకింపు లేకుండా సర్వసం మాట్లాడడు అంట. నాకు ఆకలేస్తోంది అని చెప్పడట ఆయన. ఆకలి జీవ సహజం అని ఫ్రెంచి తత్త్వవేత్త రాబర్ట్ అన్నాడు అందుకే నాకు ఆకలి వేస్తోంది అని అంటాడట. ఇంకొక పాత్ర పేరు బిర్సా ముండా. అతడు జన్మతః బ్రహ్మణుడట పేరు హనుమంతరావట. కులనిర్ములనావాదం కమ్యునిజం వంటబట్టటం వల్ల పేరు మార్చుకున్నాడట. ముకుంద్ రెడ్డి అని ఒక పాత్ర. ప్రగతినేని అని మరొకటి. డాక్టర్ భగవంతం అని ఇంకొకటి. సువర్ణం అని ఒక దళిత రచయిత పాత్ర. భూలోకం అని ఒక ఆర్టిస్టు. భూమి అతిక్రమించదగినది దాని నుంచి రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలనేదే అతని తీవ్ర కాంక్ష అట. చాలా ధైర్యం కావాలి ప్రతి విషయాన్నీ రాజకీయం చేసే రోజుల్లో ఇలాంటి పాత్రలను సృష్టించాలంటే!

సర్వస్వం గురించి చెబుతూ ఇంగ్లీషు భాష సామ్రాజ్యవాద భాష అనీ, అదొక ఆధునిక మత విశ్వాసం అనీ, ఆ భాష ఉచ్చరించటంతోటే మాంత్రిక శక్తి వచ్చినట్లు ఉత్తేజితులవుతారనీ, పాశ్చాత్య ఇంగ్లీషు గ్రంథాల్లో ఉటంకింపబడితేనే సత్యం అవుతుందనీ, అనుకుంటారట సర్వస్వం లాంటి మేధావులు. దేశంలో పేరెన్నిక గల ఎన్నో విశ్వవిద్యాలయాలలో రాజ్యం ఏలుతున్న మేధావులలో ఇటువంటి వారు కోకోల్లల్లు!

ఆంగ్లం నుంచి గ్రహించిన దాన్ని వెనువెంటనే యధాతథంగా కక్కేయడమే తెలుగు సాహిత్యం అని అంటారు ఒక చోట. ఇది కొంచెం sweeping generalization గా అనిపించినా, భావదాస్యం లేకుండా తెలుగుతనం తో రాసే రచనలు మహా గొప్పగా వచ్చేసి భారీగా పాపులర్ ఐపొతున్న దాఖలాలు అయితే ఏమీ లేవు. ఏదైనా బస్టాండ్ బుక్ షాపుకి వెళ్ళండి మీకే అర్థం అవుతుంది పాపులర్ తెలుగు పాఠకుడు ఎంత వరకు తెలుగు సాహిత్యం చదువుతున్నాడు అని. మొత్తానికి మొత్తం అనువాదాలే !

కంచినాథం అన్నది ఈ పుస్తకంలో ప్రధాన పాత్ర. “భూగోళం బోరు కొడుతోంది” అంటుంది ఆ పాత్ర. ఈ పాత్ర ఒక చోట “కాలం” గురించి చేసిన ప్రస్తావనలు నాకు చాలా నచ్చాయి. ఇది చదువుతున్నప్పుడు శేషేంద్ర శర్మ ఈ విషయం పైన రాసిన రెండు మాటలు గుర్తొచ్చాయి “గడియారపు చేతులు ఇచ్చే ఆజ్ఞలకు లొంగి/ జీవన పందెంలో పరుగులెత్తే మనుషులు/ ఋషులు కారు/ కాలం బంగారు గడియారంలో పెట్టినా/ మనిషిని కాటువేయక మానదు” అని. Lewis Mumford అని ఒక పెద్దాయన “The clock, not the steam-engine, is the key-machine of the modern industrial age” అని అన్నారు ఒక పుస్తకంలో. ఈ పుస్తకంలో రాణి శివ శంకర్ శర్మ గారు కూడా వారి తరహాలో ఇలాంటి విశ్లేషణే చేసారు. చూసారా మళ్ళీ ఆంగ్ల ఉటంకింపు వచ్చేసింది! “నేడు భూమి కన్నా వెలయాలు మరేముంది? మనిషి గంటకు ఇంత అనే లెక్క చొప్పున భూమిని అనుభవిస్తున్నాడు” అని అంటారు మరో చోట. సత్యం!

మరో చోట వలస జ్ఞానం గురించి డాక్టర్ భగవంతనికి సర్వస్వానికి జరిగిన సంభాషణ నాకు నచ్చింది. శృంగారం పాపమనే వలస జ్ఞానం గురించీ వలస ప్రమాణాలతో ప్రతీ దానిని తూకంవేసి తిరస్కరించటం గురించీ రాసారు. ఆది శంకరాచార్యులు కూడా అనుభవపూర్వకంగా శృంగార కళను అభ్యసించటం గురించీ ప్రస్తావించారు. వలస విద్య, సంస్కారం వల్ల సంస్కర్తలూ మేధావులూ కామాన్ని ఆదిమంగా అనాగరికంగా భావించారని అన్నారు. ముద్దుపళని రాధిక సాంత్వనం గురించి ప్రస్తావించారు. అప్పటి సంస్కర్తలకు ఎంత కోపం తెప్పించిందో ఈ పుస్తకం! ఆ కాలపు గొప్ప సంస్కర్తను ఒకాయనను “వలస క్రైస్తవానికి స్థానికతను చేకూర్చిన హిందూ మేధావి” అని అంటాడు డాక్టర్ భగవంతం ఒక చోట. గుడిపాటి వెంకటాచలం శృంగారం పాపమనే క్రైస్తవ భావాన్ని సనాతన ఖడ్గంతో ఎదుర్కొన్నారు అనీ అంటాడు భగవంతం. “దేవతల నగ్న చిత్రాలను హిందువులెందుకు ధ్వంసం చేసారు” అని సర్వస్వం అడిగితే భగవంతం ఇలా అంటాడు “హిందువులంటే వలస క్రైస్తవుల వృశ్చిక సంతానం. అందువల్లే దేవతల నగ్న చిత్రాలపై దాడి సనాతన ధర్మంపై దాడి తప్ప మరేమీ కాదు” (మీరు కరెక్టు గానే చదివారు. పొరబడలేదు! నేటి హిందూయిజం అనెడి మతం వేరే సనాతన ధర్మం వేరే, హిందూయిజం అన్నది ప్రచ్ఛన క్రైస్తవం అని అంటారు శర్మ గారు లాస్ట్ బ్రాహ్మిన్ లో). ఇంకో చోట “భారతీయుల సాహిత్య దృక్పథాన్ని కూడా స్థానికంగానే పరిశీలించాలి. అంతే కాని దిగుమతి చేసుకున్న వలసవాద ప్రమాణాలతో కాదు” అని అంటాడు భగవంతం. “ప్రతీదానికి వేరుగా నిలబడి, ద్రష్ట గా తన ప్రత్యేక స్థితిని నిలుపుకుంటూ, తీర్పరిగా ఉంటూ విశ్లేషించటం వలసవాద పద్ధతి” అని కూడా అంటాడు. ఆంగ్ల ఉటంకింపు భాషలో ఈ మెథడాలజీలను గురించి చెప్పాలంటే “a state of affairs in which one part of mankind treated the other as an object” అని అనాలి. మన దేశంలో నేడు చరిత్రగా చలామణి అవుతున్న ప్రతీ పాఠ్య పుస్తకం ఇలా రాసినదే అంటే అతిశయోక్తి కాదేమో!

“ప్రతీదీ పూర్తి విరుద్ధమైనది గా రూపంతరీకరిస్తుంది విరుద్ధమైన దానిలో లయమైపోతుంది” అన్న ఒక థీమ్ పుస్తకం అంతా సాగుతూ ఉంటుంది. మావో గురించి మాట్లాడుతూ కంచినాథం ఆయనది స్వదేశీ తత్త్వం అంటాడు. మావోయిజం సనాతన సారం అంటాడు.

మరొక చోట లింగ నిర్ధారణ పరీక్షల విషయం ప్రస్తావిస్తూ హాస్పిటల్ శిశు మరణాల గురించి చెబుతూ అత్యాధునిక విజ్ఞాన శాస్త్రం నిశ్శబ్ద హింసనీ సూక్ష్మ హింసనీ ప్రవేశ పెట్టిందంటారు. హతులూ కనపడరు. హంతకులూ కనపడరు అని అంటారు.

చచ్చి పిశాచం అయిన సర్వసం “మార్క్సు అంటే నాకు చాలా గౌరవం ఎందుకంటే ఆయన యునివర్సిటీలో పీహెచ్డీ చేసాడు. అందులోనూ యురోపియ విశ్వవిద్యాలయంలో రిసెర్చి పూర్తి చేసాడు”, “మావోకేం తెలుసు మావో అసలు పీహెచ్డీ చేసాడా” అని అంటాడు. “ప్రజల్ని అర్థం చేసుకోడానికి విశ్లేషించడానికి మోడరన్ మెథడాలజీ తెలియాలి. అది విశ్వవిద్యాలయాల్లోనే దొరుకుతుంది. ప్రధానంగా యురోపీయ విశ్వవిద్యాలయాలలోనే దొరుకుతుంది.” అని అంటుంది సర్వసం పిశాచం. ఇటువంటి పీహెచ్డీ ప్రేమికులు ఎంత మంది లేరు నేటి మేధావి వర్గంలో. పీహెచ్డీ ఉంటేనే కాని మాట్లాడకూడదు, రాయకూడదు వారి ప్రకారం. ఏ విషయం పైన అయినా సరే! అందునా వారు ఆమోద ముద్ర వేసిన విశ్వవిద్యాలయపు పీహెచ్డీ నే ఉండాలి!

ప్రతీదీ తనకి పూర్తి విరుద్ధమైనది గా మారిపోతుంది అంటూ విగ్రహారాధనని వ్యతిరేకించిన బుద్ధుడు విగ్రహంగా మారిపోవటం గురించీ, జాతక కథల్లో అవతార పురుషుడిగా మారడం గురించీ కొన్ని మాటలంటాడు కంచీనాథం. సనాతనంలో నిర్లిప్తత ఎక్కువనీ అందుకనే దేవతలకీ ఆచార్యులకీ స్పష్టమైన రూపం ఏర్పడలేదనీ అంతా సంకేతమయం, అంతా మార్మికం అనీ, అటువంటి నిర్లిప్తతలో వలస క్రైస్తవ చిత్ర కళ రాకతో మౌలికమైన మార్పులు సంభవించాయని అంటారు. రాజ రవి వర్మ క్రైస్తవ చిత్ర కళ నుంచి స్ఫూర్తి పొందాడని అంటాడు. ఈ విషయం పైన ఒక ఆంగ్ల ఉటంకింపు (“Western Influence and Iconography in Ravi Varma’s Paintings“). మరి అది లేనిదే మనకి అనుమానం వచ్చెయదూ! మనలోని “సర్వస్వం” ఘోషిస్తాడు “ఛా! ఈ కంచి నాథం కట్టు కథ చెబుతున్నాడు” అని. ఆంగ్లంలో ఏదో జర్నల్లో కనపడితే, ఓహో నిజమనేమో అని అనుకుంటాం! కమ్యునిస్టులు ఒక్కరే నిజమైన విగ్రహ ధ్వంసకులు అంటాడు ఆర్టిస్టు భూలోకం. వాళ్ళకి జరిగినంత విగ్రహారాధన మరెవరికి జరగలేదు అంటాడు కంచినాథం. వారు ఈ విషయంలో బౌద్దుల్ని క్రైస్తవులని కూడా మించిపోయారంటారు. వారు వారి మహోపాధ్యాయుల కళేబరాలను రసాయనాల్లో భద్రపరచి ప్రదర్శనకి పెట్టారు అని అంటారు. ఆ విధంగా కమ్యునిస్టులు అన్ని మతాల వారికన్నా గొప్ప రూపారాధకులుగా మారారు అంటూ, ప్రతీదీ విరుద్ధమైనదిగా రూపంతరీకరిస్తుంది అని మళ్ళీ తీర్మానిస్తాడు కంచినాథం!

నేను ఇంకొక రెండు మూడు సార్లు చదువుతాను ఈ పుస్తకాన్ని. అప్పుడు కాని నాకు సరిగ్గా అర్థమైన ఫీలింగు రాదు అనుకుంటాను. పూర్తిగా అర్థం కాకుండా పరిచయాలు ఎందుకు రాస్తున్నావు అంటారేమో. నా బాధల్లా ఏమిటయ్యా అంటే 2006లో వచ్చిన ఈ పుస్తకం గురించి తెల్సుకోటానికి ఎనిమిదేళ్ళు పట్టిందే అని. మన తెలుగులో వచ్చే విలక్షణ సాహిత్యం గురించి మనం కూడా మాట్లాడకపోతే ఎలా? అని ఏదో నాకు తోచిన నాలుగు మాటలు రాయాల్సిందే అని రాసాను అనమాట. ఇదేమో చేతన్ భగత్ పుస్తకం కాదు సరదాగా చదివి పక్కన పడేయటానికి. చిన్న చిన్న తుఫానులు రేకెత్తించే పుస్తకం ఇది లాస్ట్ బ్రాహ్మిన్ కు మల్లే. ఆ తుఫానులు రేగలేదంటే మీకు పుస్తకం పావు శాతం కూడా అర్థం కానట్టే! నిజం!

Grahantaravaasi
Rani Sivasankarasarma

You Might Also Like

6 Comments

  1. Yrnr

    I read this prose and was just awestruck. Felt very happy that we still have some people who can write in mesmerizing and original Telugu. From this article, I got to know a few more details of this writing and author. Thanks to Halley. And to Analpa publishers.

  2. Halley

    ఈ కినిగే లింకులో http://kinige.com/book/amerikanijaM “అమెరికనిజం” ఉంటుంది. అది చదవండి . మీకు నచ్చుతుందేమో . అది కూడా మీరనట్టు విభిన్నమైన పుస్తకమే

    1. Amarnath

      థాంక్స్.
      డౌన్లోడ్ చేసాను. యింక చదవాలి.

  3. Amarnath

    “ది లాస్ట్ బ్రాహ్మిన్” పుస్తకం ఎప్పుడో ఏడెనిమిదేళ్ళ క్రితం చదివాను. మొదలు పెడితే ఆపకుండా చదివించిన పుస్తకం అది. ఆ తరువాత సుమారు మూడేళ్ళ క్రితం అనుకుంటా హైదరాబాద్ లో నేషనల్ బుక్ ఫెయిర్ లో ఈ “గ్రహాంతర వాసి” కనపడింది. వేరే ఆలోచన లేకుండా కొనేశాను.

    పుస్తకం చాల వరకు గుర్తులేదుగాని మీ వ్యాసం చూసాక మళ్ళీ ఒకసారి చదవాలనిపిస్తోంది
    మీరు చెప్పినట్టే చాలా విషయాల గురించి విభిన్న దృక్కోణం లో వుండే భావాలు ఇందులో కనిపిస్తాయి.
    అది చదివాక ఆ పుస్తకం లో రచయిత అడ్రస్ కనిపించింది. ఒకసారి వెళ్లి ఆయన్ని చూసి మాట్లాడాలనిపించింది 🙂 ఇటువంటి పుస్తకాలు రాయగలిగిన మనిషి ఎలా ఉంటాడో చూడాలనిపించింది. వెళ్ళలేదనుకోండి … 🙂 ఆయన ఒక స్కూల్ టీచర్ అని మాత్రంఎక్కడో చదివినట్టు గుర్తు.

    మొత్తానికి ఒక మంచి విభిన్న మైన పుస్తకం.

    1. Amarnath

      మీ ఈ పుస్తక పరిచయం పుణ్యమా అని ఈ రచయిత ఇతర రచనలగురించి వెతకటం మొదలు పెట్టాను. ఇంకొక మంచి పుస్తకం దొరికితే బాగుండు 🙂

    2. G.K.Subbarayudu

      రాణి శివశంకర శర్మ, గుంటూరు దగ్గర సత్తెనపల్లి లో వుంటారు. కారంపూడి సోషల్ వెల్ఫేర్ స్కూల్ లో టీచరు గా వున్నారు. హైదరాబాదు వచ్చినప్పుడు నాతొ వుంటారు.
      తెలుగే కాదు భారతీయ సమకాలీన సాహిత్యం లో పెద్ద పీత వెయ్యడానికి అర్హులు. కాని మన దగ్గర బాగా ప్రచారం చెయ్యడమే ఎక్కువ ముఖ్యం… ప్రచురిస్తే సరిపోదే! హైదరాబాదు లిటరరీ ఫెస్టివల్ లో ఏదో నేను చెయ్యగలిగిన పని చేసాను… కాని నా ఇంగ్లీష్ అనుసరణ (adaptation ) ఒక్క ప్రతి కూడా ఎవ్వరూ కొన్న దాఖాలా లేదు ( ఒక లా విద్యార్ధి తప్ప ). తెలుగు కాపీలు నా దగ్గర కూడా రెండో మూడో ఉంటాయి తప్ప , కినిగే నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సిందే.
      Halley అర్థం అవలేదు అంటూనే చక్కగా విశ్లేషించాడు
      సరే… ఒకరికి నచ్చింది కదా! శర్మ గారికీ, నాకూ ఆనందమే! రచన అన్నది ఒకరి భావాలు ఇంకొకరితో పంచుకోవడమే. ఇంకొందరు కూడా పంచుకుంటే సంతోషమే.
      — జి.కే.సుబ్బారాయుడు

Leave a Reply