The Collected Stories of Lydia Davis

Proust రాసిన “Swann’s Way”ను, దాని గురించిన విశేషాలను చదవటం మొదలెట్టినప్పుడు, ఆ రచనకు గల అనువాదకులలో ప్రముఖంగా వినిపించిన పేరు లిడియా డేవిస్. Flaubert రాసిన Madame Bovary కూడా ఈవిడ అనువదించారట. ఈ రెండు రచనలకు నేను వేరే అనువాదకులు అనువదించిన పుస్తకాలు కొనేసున్నాను కాబట్టి, ఈవిడ కథల పుస్తకం తీసుకుందామనుకున్నాను. అమెజాన్ ప్రివ్యూలోనో మరెక్కడో ఒక కథ చదివాను. కొద్దిగా డొరతీ పార్కర్ ఛాయలు కనిపించాయి. పుస్తకం ఇంటికి చేరి ఓ రెండు మూడు నెలలు అవుతుంది. అప్పటినుండి ఆ కథలు చదువుతున్నాను. ఇప్పుడు దానికో పరిచయం రాస్తున్నా కూడా, వాటిని చదువుతూనే ఉంటాను.

కథలకన్నా నవలలు చదువుకోడమే తేలిగ్గా ఉంటుంది నాకు. అవైతే కవర్ టు కవర్ చదవాలి. ఓ వరుసను పాటిస్తూ, క్రమబద్ధంగా చదవాలి. అసలైతే ఇవ్వన్నీ constraints ఏమోగానీ, పద్ధతిలేని లేని నాకు, ఇలాంటి external constraints బా సాయంచేస్తాయి. కథల సంపుటాలలో ఏ కథతో అయినా మొదలెట్టచ్చు. ఏదాని తర్వాత ఏదైనా చదువుకోవచ్చు. నచ్చినది మాత్రమే చదువుకుంటూ, తక్కినవి వదిలేయచ్చు. నవల్లో అయితే ఒకటే continuous form of story. ఇంతకు ముందెప్పుడూ వెళ్ళని ఊరికో, దగ్గరదగ్గర ఊర్లకో ఓ రెండు మూడు వారాల పాటు వేసే లాంగ్ ట్రిప్ లా ఉంటుంది నవల చదువుకోవడం. అదే కథల సంపుటిలో అయితే బోలెడన్ని short trips వేయాల్సి వస్తుంది. ఒక్కో కథా ఒక్కో ఊరికి వెళ్ళొచ్చినంత పని. వెళ్ళాలి. తిరిగిరావాలి. మళ్ళీ వెళ్ళాలి. కొన్నిసార్లేమో కథలు ఎంతగా నచ్చేస్తాయంటే తిరిగిరావాలనిపించదు. అలాంటప్పుడు ఆ కథలన్నింటినీ సమగ్రంగా పరిచయం చేస్తూ రాయడం సాధ్యమయ్యే పనేనా? అన్న అనుమానం లేదు నాకు. అయ్యే పని కాదని తెల్సు కాబట్టి. రాసేటప్పుడు ఏవో రెండు, మూడు కథలు మెదడులో ఆక్టివ్‍గా ఉంటాయి. వాటినే గురించే రాయడమవుతుంది.

లిడియా డేవిస్ కథలు భలేగా ఉన్నాయి. ఆ “భలే” అంటే ఏమిటో చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను కొన్న “The Collected Short Stories of Lydia Davis” లోని కథలు మూడు భాగాలుగా విభజించారు. దీనికి Foreword లాంటివేం లేవు. బహుశా, ఇంతకు ముందు ప్రచురితమైన కథల సంపుటాలను ఇందులో కలిపారేమో. కథలు పది-పదిహేను పదాల (అవును, పదాలు!) అంత చిన్నవీ ఉన్నాయి. ఓ పదిపేజీల నిడివి ఉండే కథలూ ఉన్నాయి. ఈవిడ ఇంగ్లీషు ప్రొఫెసర్. ఇంగ్లీషు ఎంత చక్కగా ఉంటుందుంటే పైపైన చదువుకోడానికి వీలుగానూ, లోలోతుగా ఆలోచించుకోడానికి స్కోప్ ఉండే విధంగానూ ఉంటుంది.

డొరతి పార్కర్ తరహాలోనే ఈవిడ కథలు ఉంటాయనుకున్నాను. అలా లేవు. డొరతి ప్రతి పదంలోనూ ఒక బిటర్నెస్ తీసుకొస్తుంది. She’s never in a forgiving mood – not anybody, definitely not herself. డేవిస్ కథాంశాలు అలా extreme of the spectrum దగ్గర లేకుండా, see-sawకి మధ్యలో ఉండే pivotలా ఉన్నాయి. ఆమె కథల్లో ఒక్కోసారి “అతడి”ది పైచేయి అయితే, ఇంకోసారి “ఆమె”ది అవుతుంది. చాలా వరకూ కథలు ఈ he-she ల మధ్యే జరుగుతుంది. వాళ్ళ పేర్లు తెలీవు. వాళ్ళే ఊరువాళ్ళో తెలీదు. అయినా ఆ he-she కథలు వినదగ్గవిగా, ఆలోచింపదగ్గవిగా ఉంటాయి. యాభై, వంద పదాలలో కథల్లో abstractness ఎక్కువ ఉంటుంది. అయినా కథలు అంతే నిండుగా ఉంటాయి. ఆ కథాంశాలను తీసుకొని ఓ నవల రాసుకున్నా, డేవిస్ వాటిల్లో pack చేసిన punch రాదనుకుంటాను.

ఇలాంటి చిట్టిపొట్టి కథలను flash fiction అంటారట. అవంటే నాకు ఎప్పుడూ ఇష్టమే. నేను ఫాలో అయ్యే కొన్ని ఇంగ్లీషు బ్లాగుల్లో ముందునుండి ఇలాంటి చిట్టికథలను చదవటం నాకు అలవాటు. (బ్లాగులంటే sub-standard stuff అన్న భావన ఉంటుంది కొందరికి. అచ్చువేయాల్సినంత సరుకున్న బ్లాగులూ ఉన్నాయి.) అయితే, ఈవిడ ఇంగ్లీషు భాషతో ఆడుకున్న విధానం నన్ను బాగా ఆకట్టుకుంది. ఒకటే వాక్యాన్ని తీసుకొని, దానిలోనే కొన్ని పదాలను తీస్తూ, వేస్తూ, ఇంకొన్ని వాక్యాలు రాస్తూ ఒక కథ చెప్పేస్తుంది. మొదటసారిగా చదువుకున్నప్పుడు తికమకగా ఉంటుందిగానీ, ఒకటికి రెండు సార్లు చదువుకున్నాక అందులో అర్థం తెలిసాక భలే అనిపిస్తాయి.

ఒక ఉదాహరణగా:

Suddenly Afraid

because she couldn’t write the name of what she was: a wa wam owm owamn womn

కొంచెం పెద్దగా ఉండే కథలు కూడా చాలా unconventionalగా ఉంటాయి. Fragmentedగా. డైరిలో రాసుకున్నట్టుగా. ఎక్కడోగానీ కథ కథలా మొదలై కథలా పూర్తి అవదు. అయినా కూడా చెప్పాల్సినవన్నీ చెప్పేస్తుంది. నోట్లో వలచిన అరటిపండు పెట్టటం లేదు కాబట్టి, పాఠకుని బుర్ర కూడా అలర్ట్ గా ఉంటుంది, ఈ కథలు చదివేటప్పుడు. ఇందులో కొన్ని కథలు నాకు ఎక్కనివి, అర్థంకానివి ఉన్నాయి. అయితే వాటివల్ల ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమీ లేదు. ఎప్పటికో అవే అర్థమవుతాయి.

భాష, దానితో ప్రయోగాలు ఎంత బాగున్నాయో, పాత్రలూ, వాటితో ప్రయోగాలూ కూడా అంతే బాగున్నాయి కథల్లో. అన్నింటిలోకి నాకు బాగా నచ్చిన కథ “Kafka cooks dinner.” ఇందులో కాఫ్కా (అవును, ఆ కాఫ్కానే) మెలిన్‍ను ఇంటికి పిలుస్తాడు, భోజనానికి. ఆమెకు ఏం వండి పెట్టాలా అని ఆలోచిస్తూ, చివరకు ఏదో వండి పెట్టి, దాన్ని ఆమెతో పాటు కలిపి తిని, ఏదో గొడవ వచ్చి ఆమె వెళ్ళిపోతే, నిట్టూరిస్తాడు. కాఫ్కా అంతటివాడికి third person narration అనవసరం కదా? అందుకేనేమో ఈ కథను కాఫ్కా (పాత్ర) చెప్పుకొస్తాడు. కాఫ్కా బతికున్నంతకాలం ఒకలాంటి shellలో బతికాడు. ఆయన పోయి, ఆయన రాసినవేవో బయటకొచ్చాక, జనాలంతా కలిసి ఈ రచనలలోని కాఫ్కానూ ఒక shellలోకి తోసేయడానికి చూస్తుంటారు, “crushed soul” లాంటి లేబల్స్ తగిలిస్తుంటారు. నిజానికి, కాఫ్కా ఏమంత specimen కాదు. బతికున్నంతకాలం ఆయన చుట్టూ ఉన్న గోడలను ఎవరూ కూల్చలేకపోయారు. బాగా రాయడం చేతనైన ఆయన కూలని గోడల మధ్య చిక్కబడిన ఒంటరితనాన్ని, అభద్రతనూ మాటల్లోనూ అంతే చిక్కగా వచనంలోనూ తీసుకురాగలిగాడు. ఈ కథ ఓ రకంగా, ఆ గోడలే కూలుంటే, కాఫ్కా ఎంతటి మామూలు మనిషి అయ్యుండేవాడో చూపిస్తుంది.

తెలుగులో కూడా ఇట్లాంటి కథలు వస్తే బాగుండు. ఎట్గర్ కెరట్, ఈవిడ రాసిన కథలు చదివాక, మనవీ ఇలాంటి కథలు చదవాలని కోరిగ్గా ఉంది. ఎందుకంటే మన భాషలో మాత్రమే సాధ్యమయ్యే మాజిక్కులూ, మన బతుకుల్లో మాత్రమే ఉండే జిమ్మిక్కులూ మనమే చెప్పుకోవాలిగా. Short storyతో చాలా ఇంటరెస్టింగ్ ప్రయోగాలు జరుగుతున్నాయి. కథ ఎన్నో కొత్త అర్థాలను సంతరించుకుంటుంది. ఒకచోట మొదలై, అలా పారి, ఇలా సముద్రంలో కలిసే నదిలానే కాకుండా, కథ అనేది చెరువులో విసిరిన రాయి వల్ల కలిగే చిన్ననీటి అలల్లా కూడా ఉండచ్చు. పాత్రలు పుట్టి, నామకారణాలు, ఉపనయనాలు చేసుకోనవసరం లేదు. సర్వనామాలతోనే బోలెడు కథ సాగించచ్చు. ఇవి రాయటం అంత తేలికకాదు. చదువుకోవటం మాత్రం ఒక గొప్ప అనుభూతి. ఒక మంచి exercise. కథలు రాసే ఆలోచన ఉన్నవాళ్ళు ఎవరికైనా తప్పక చదవమని చెబుతాను. నచ్చకపోయినా భాషను ఎలా ఉపయోగించుకోవచ్చో నేర్చుకునే అవకాశం ఉంటుంది. ఇహ, కథలను ఇష్టంగా చదువుకునేవాళ్ళకు ఓ మంచి పుస్తకం, నన్ను అడిగితే!

డేవిస్‍తో ఒక ఇంటర్వ్యూ.

The Collected Stories of Lydia Davis
Lydia Davis
Fiction
Penguin Group
Paperback
733

You Might Also Like

2 Comments

  1. Vijaya Karra

    మీ రివ్యూ చదివాక కొన్నాను. లైట్ వెయిట్ – చదువుతున్నాను – త్యాంక్స్

  2. సౌమ్య

    ఇవ్వాళే‌ లిడియా డేవిస్ మరొక కథల సంకలనం గురించి అంతర్జాలంలో ఓ వ్యాసం కనబడ్డది –
    http://www.theguardian.com/books/2014/apr/04/cant-wont-stories-lydia-davis-review

Leave a Reply