పులుల సత్యాగ్రహం

వ్యాసకర్త: Halley
******
ఈ మధ్యన ఎలాగూ విశ్వనాథ వారి రచనల గురించి నాకు తోచింది రాయటం అనే ఒక వ్యసనం అలవడింది కాబట్టి ఆ పరంపరలో ఇది మరొకటి . ఈ “పులుల సత్యాగ్రహం” అనేటిది ఒక వ్యంగ్య రచన. సత్యాగ్రహం అనెడి ప్రొటెస్టు పద్ధతి పైన విశ్వనాథ వారు ఎక్కువెట్టిన వ్యంగ్య బాణం అనుకోవచ్చు . సత్యాగ్రహం పైననే కాదు డెమోక్రసీ పైన కూడా అనుకోవచ్చు. డెమోక్రసీ పైన మాత్రమే కాదు ఇంకా ఎన్నిటి మీదనో అని కూడా అనుకోవచ్చు. అనుకున్న వాళ్ళకి అనుకున్నంత!

తక్కిన రచనలంత loaded రచన కాదు. అయినప్పటికిని అంతే ఆలోచింపజేస్తుంది. విశ్వనాథ వారి creativity కి మరో మచ్చుతునక. వారి భావాలను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారి creativity విషయం లో దెబ్బలాడే వాళ్ళు తక్కువే అనుకుంటాను! అరుంధతి రాయి వ్యాసాలు నాకు ఇలానే అనిపిస్తాయి. ఏమి చెప్పాలని అనుకుందో చాలా బాగా చెప్తుంది ఆవిడ. విషయంతో మనం ఏకీభావిస్తామా లేదా అన్నది పక్కన పెడితే!

ఇంక నవలలోకి వస్తే. ఈ నవల రచనాకాలం 1948. ఒకానొక ఊరిలో పులుల బాధ పడలేక వాటికి ప్రతిగా సత్యాగ్రహం చేస్తారు అనమాట అక్కడి ప్రజలు. ఆ సత్యాగ్రహం గురించిన కథ ఇది. ఈ వ్యంగ్య రచనలో నాకు నచ్చిన కొన్ని చిన్న చిన్న వ్యంగ్యాస్త్రాల గురించి ఈ పరిచయం.

ఇంగ్లీషు నాగరకత యొక్క సర్వ కళ్యాణ గుణసనాధుడై ఉన్నాడట ఒక చరిత్ర కారుడు ఆ ఊరిలో. ఆ కళ్యాణ గుణాల్లో మొదటిది “చరిత్ర” అట. అతడు కల్పాలనీ యుగాలనీ ఒప్పుకోడట. సృష్టి అంతా నాలుగు మూడు వేల సంవత్సరాలలోపుగా సరిపెట్టుకోవాలని అంటాడట అతను. మొదట్లో పెద్దగా అర్థం అయ్యేది కాదు కానీ ఈ చరిత్ర పాఠాల విషయం పెద్దదే. మనమందరూనూ ఆలోచించాల్సిందే దీని గురించి. ఒక జాతిని విజాతీయం చేయాలంటే అసలు ఇక్కడే మొదలు పెట్టాలి అనిపిస్తోంది ఇప్పుడు నాకు. ఇదేదో కేవలం మన దేశం తాలూకా సమస్య అయితే మాత్రం కాదు. “history textbook controversy” అని గూగుల్ లో కొట్టండి అసలు ఎన్ని కథలొస్తాయో! ఇదొక ఫేమస్ పద్ధతి లాగా ఉంది చూడబోతే. George Orwell “The most effective way to destroy people is to deny and obliterate their own understanding of their history” అని ఊరకనే అనలేదు కదా మరి!

పులులని ఎలా నిర్మూలించాలి అన్న విషయం పైన జాతీయ సభా పక్షం వాళ్ళు సామ్యవాద పక్షం వాళ్ళు చెప్పిన అభిప్రాయాల మీద సెటైరులు నన్ను గిలిగింతలు పెట్టాయి. మనుషులలో పులుల పార్టీ వాళ్ళ గురించి రాసిన విషయాలూ, పటేలు, పట్వారి, రెవిన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూటీ కలెక్టర్, కలెక్టర్ అనే bureaucratic hierarchy పైన చేసిన విమర్శలూ, కలెక్టరు పాతిక మంది సిబ్బంది తో అడివికి వస్తే ఎలా ఉంటుందో చెప్పిన విధానమూ -అబ్బో ఒకటని కాదు ఆద్యంతం నవ్విస్తూ కవ్విస్తూ సటైరులు వేసారు. ఉదాహరణకి కలెక్టరు గురించీ, గుమస్తా గురించీ చెబుతూ “అసలు కలెక్టరు ఆ గుమస్తా ఏగా” అని అంటారు. “వాడు ఏది వ్రాస్తే దాని మీద దస్కతు పెట్టటమే ఈయన పని” అని అంటారు.

మనుషులేమో పులుల గురించి ఏమి చేయాలా అని సభలూ కమిటీలు పెట్టుకొని తర్జన భర్జనలు పడుతూ ఉంటే, పులుల విషయం దగ్గరికి వచ్చే సరికి “అసలా సభలంటే వాటికి వొళ్ళుమంట. వాటి సిద్ధాంతం ఎంత సేపటికీ నమిలిన వాడికన్నా మ్రింగిన వాడు దొడ్డవాడని. ముందర దెబ్బ తియ్యి, తర్వాత చూద్దాం” అని పులుల philosophy గురించి ఒక మాట అంటారు.

ఇంకొక చోట భాష గురించి ఇలా రాసారు. భాష విషయంలో ఇదొక భారీ సటైరు. మన కాలంలో తెలుగు దౌర్భాగ్య స్థితికి ఇదొక కారణం.
“ఏ భాష అయినా పూర్తిగా నశిస్తుంది అంటారా”
“ఆ భాష చదివితే అన్నోదకాలు లేవనుకోండి; ఆ భాష ఎవరు చదువుతారు? పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలసిన వాళ్ళూ; మంత్రి పదవులు అవీ కావాల్సిన వాళ్ళూ చదవరు”
“శాసన సభలలో సభ్యులుగా ఉండే వాళ్లయినా చదవవచ్చుగా అంటారా?”
“వాళ్ళకి చదువెందుకు? పలుకుబడి కావాలి”

ఇక సత్యాగ్రహం గురించి 1948లో నే విశ్వనాథ వారు రాసిన మాటలు చూస్తే .. మనం నేడు చూస్తున్న సత్యాగ్రహాలు ఎందుకు ఇలా తగలడ్డయో మనకి చక్కగా అర్థం అవుతుంది. సత్యాగ్రహి అంటే ఎలా ఉండాలి? సత్యాగ్రహం అంటే ఏమిటి? అని చాలా చక్కని విషయాలు చెప్పారు ఈభాగంలో. అయితే మాస్ మూవ్మెంట్స్ అన్నవి మొదలయ్యాక సత్యాగ్రహం అన్నది ఎలా తయారయ్యిందో చెబుతూ, “మంది సత్యాగ్రహం” అన్నది మొదలయ్యాక నిజమైన సత్యాగ్రహి ఎవడూ లేడు. అందరూ బాధ సహించలేని వాళ్ళే. అందరూ కాములే. అందరూ క్రోధులే. అది సత్యాగ్రహం అన్న మాట పోయి “వేలం వెర్రి” అయ్యింది అని అంటారు.

ఇక సత్యాగ్రహం అనే ప్రహసనం ఎలా ఉంటుందో చెబుతూ సత్యాగ్రహం ప్రారంభించటం అంటే ఆషామాషీ వ్యవహారం కాదనీ దానికి చాలా పనులు జరపాలనీ, పత్రిక వాళ్ళని పిలవటమూ, ప్రకటనలు ఇవ్వటమూ, హెడ్లైన్స్కుకెక్కటమూ, సత్యాగ్రహ తేదీలు ప్రకటించుకోవటమూ వగైరాల గురించి రాసారు. ఇది 1948లో అన్నారు .. మీడియాలో లైవ్ టెలికాస్ట్ సత్యాగ్రహాలనూ వాటి తాలూకా సత్యగ్రాహులను మనము చూస్తూనే ఉన్నాం కదా నేడు. ఎలక్షన్ సీసన్ పుణ్యమా అని!

ఇక సత్యాగ్రహం చేసే బ్యాచ్ గురించి చెప్పుకొస్తూ “నాయకులూ, ప్రదర్శకులు, అనూయాయీలు, వాలంటీర్లు” ఇదీ చాతుర్వర్ణ్యం అని అన్నారు. సత్యగ్రహాలు చేసే వారిలో కూడా ఒక వర్ణ వ్యవస్థ ఉందనమాట.

ఇక నెక్స్టు వచ్చేది అసలు సిసలు విశ్వనాథ ప్రోస్ అనమా . రజనీకాంత్ సినిమా రజనీ మార్కు స్టైలు కోసం పంచు డైలాగు కోసం చూసినట్టు నేను విశ్వనాథ వారి నవలలు ఇలాంటి ప్రోస్ కోసం చదువుతాను.

“విద్య వ్యక్తిని మనసులో పెట్టుకొని చెప్పాలి. సమూహాన్ని మనసులో పెట్టుకొని చెప్పకూడదు” అని అంటారు ఒక చోట.
ఇక ధర్మం నీతి గురించి కొన్ని చక్కని మాటలు రాసారు ఈ పుస్తకంలో. వాటిలో కొన్ని ఇక్కడ:

“ప్రతి వ్యక్తీ తన ధర్మమేమిటో తన నీతి ఏమిటో తెలుసుకోవాలి. వాడు నీతిమంతుడవుతాడా కాడా? వాడు ధర్మ బుద్ధి ఔతాడా? కాడా? అన్న విషయం విచారించకుండా వాడెలా బతుకుతాడు? వాడికి పెళ్లి ఎలా అవుతుంది! వాడెంత సంపాదిస్తాడు – అన్న ప్రశ్నలేమిటి. వాడు నీతిమంతుడు కాకపోతే వాడు ధర్మబుద్ధి కాకపోతే వాడు బతికినా ఒకటే చచ్చినా ఒకటే” బాబోయి! ఆ చివరాఖరున అంత మాట అనేసారేంటి అసలు!

ఇక ఈ విషయం గురించి చెబుతూ నెక్స్టు ఒక మాట అన్నారు చూసారూ! అద్భుతంగా ఉంది ఈ ఘట్టం ఈ నవలలో!

తోటలో మొక్కకి నీరు పోసి ఎరువు వేసి పెంచినట్టు మనషికి నీతి ధర్మాలు నేర్పాలి అని అంటారు. మరి అడవిలో ఇవేవి లేకుండానే చెట్లు పెరుగుతున్నాయి కదా అంటే, “లోకం తోట వంటిది. సర్వ దోషాలు ఈ రహస్యం గ్రహించలేకపోవటం మూలాన్నే వచ్చినవి” అని అంటారు. ఒక్క చిన్న మాటలో ఎన్ని భావాలో. ఇంక నేను ఇది ఫ్రీగా ఎక్కడ పడితే అక్కడ వాడేసుకుంటాను అంతే! .. “లోకం తోట వంటిది”.. ఒకటో సారి.. “లోకం తోట వంటిది”.. రెండో సారి, అలా అనమాట. ఇదే విషయం చెబుతూ “ఈ రహస్యం భారత దేశంలో ఉన్న పూర్వ ఋషులకే తెలుసు. తక్కువ వాళ్ళకెవ్వళ్ళకి తెలియదు -వాడు పరమాధికారపు కోపిరి మీద కూర్చున్నా సరే, వాడు పూర్వ భారత ఋషుల యొక్క విజ్ఞానం తెలియని వాడైతే లక్ష విధాలుగా లోకాన్ని బాగు చేద్దామనుకున్నా సరే కోటి విధాలుగా వాని చుట్టూ ఆపదలు మూగుతుంటవి – ఊడిన సీల వేస్తే యంత్రం సరిగ్గా నడిచే దానికి ఒక చోట నూనె పోసి, మరొక చోట దుమ్ము తుడిచి, మరి బండి అంతకూ కొత్త రంగు వేస్తె ఏం లాభం?” అని అంటారు . ఇదే విషయం పైన ఠాగురు ఒక చోట అంటారు ఇలా “Our educated men are eager to serve the country. Nursing the sick, feeding the hungry and giving alms to the poor— these are some of the ways. That is like trying to put out a fire by blowing on it, when it has enveloped the whole village. Our ills cannot be cured by treatment of the symptoms. The causes have to be removed” అని . ఆదనమాట! ఇప్పటికీ దుమ్ము తుడిచి రంగులు వేసే వాళ్ళు వస్తూనే ఉన్నారు మరి మన దేశంలో. ఇంకా కొత్త కొత్త రంగుల డబ్బాలు తెచ్చుకుంటూ!

ధర్మబోధ గురించే చెబుతూ ఇలా అంటారు- కొడుకు తండ్రి మాట వినకపోతే వాడి మనసులో తండ్రి దైవం వంటి వాడనీ, ఈ శరీరము అతని మూలంగా ఉన్నదనీ, అతని మాట వినకపోతే ధర్మం భ్రంశమవుతుందనే విషయం వానికి నచ్చచెప్పాలి కానీ, నా మాట వింటే నీకు యాబది రూపాయలు ఇస్తాను లేదా బుష్ కోటు కుట్టించి పెడతాను అనీ, నీవు నా మాట వినకపోతే నీకీ పూటకి అన్నం పెట్టను – నీ వీపు పెట్ల కొట్టుతాను అనీ చెప్పకూడదు అని అంటూ, వాడి మనస్సును బాగు చేయాలి వాడికి ధర్మ బోధ చెయ్యాలి అని అంటారు.

నీతి ధర్మలెట్లా ఉండాలో చెప్పుకొస్తూ అవి కేవలం ఈ లోకాన్ని బట్టే సాగాలి అని అనటం తప్పని అంటూ పరలోకం ప్రస్తావన తెస్తారు. “పరలోకం అనగానే అలా మొహం ముడుస్తారేమోయి” అని అంటూ, “గణిత శాస్త్రం లో ఒక నియమితమైన వస్తువు యొక్క వెల కనుక్కోవాల్సి వస్తే, ఒక లేని అంకమును సంకల్పించుకొని దాని మీద గణితం చేసి ఈ యదార్థమైన దానిని తెలుసుకుంటారు. అందుచేత నీవు ఊహింప దగినది అయిన పరలోకం ఉంది అనుకో అప్పుడు ఈ లోకం యొక్క నిజమైన వెల నీవు కట్ట గెలవు” అని అంటారు. నిజమే కదా. గణితంలో మనకి ఏదన్న సమస్య వస్తే ఒక “X” ను తెస్తాము కదా. ఆల్జీబ్రా మొత్తం ఇదేనాయే. ఈ “X” ఎవడు నాకు చూపించు అని అడగం కదా. అక్కడేమో ఓపికగా “X” తో కుస్తీలు పడి చివరాఖరున దానికి లెక్క కడతాం. Proof by mathematical induction లో కూడా రకరకాల ఊహలు చేస్తాం. ఇక్కడేమో ఈ పరలోకం ఊహలు నేను చేయను బాబోయి అంటాం!

అసలు ఈ పరలోకం గురించి ఈ మధ్యన నేను Czechoslovakia చివరి అధ్యక్షుడు అవటమే కాకుండా Czech Republicకి ఒక దశాబ్దం పైగా నాయకత్వం వహించిన Václav Havel గురించి చదవటం ప్రారంభించాను. ఈయనేమో గొప్ప రచయిత మరియు సాహితీవేత్త మాత్రమే కాకుండా దేశాధ్యక్షుడు కూడానూ. ఆయనేమో ధైర్యంగా ప్రపంచ దేశాలని ఉద్దేశించి “The Need for Transcendence in the Postmodern World” అని గొప్ప ఉపన్యాసం ఇస్తే ప్రపంచం అంతా వినింది. ఇప్పటికి కూడా ఆ ఉపన్యాసం గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. లేకపోతే నాకెలా తెలుస్తుంది! అయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి పోయి “If democracy is not only to survive but to expand and resolve those conflicts of cultures, then in my opinion it must rediscover and renew its own transcendental origins. It must renew its respect for that nonmaterial order which is not only above us but also in us and among us, and which is the only possible and reliable source of man’s respect for himself, for others, for the order of nature, for the order of humanity, and thus for secular authority as well” అని అంటే బుద్ధిగా విన్నారే. అంతేకానీ ఎవడ్రా వీడు మానవాతీత విషయాలన్నీ మాట్లాడుతున్నాడు అని అనలేదు. ఒకటి అరా ఎవడో అనే ఉంటాడు లెండి అది వేరే విషయం! మరి ఈ విషయం మీద విశ్వనాథ వారు రాసిన ఆలోచనలని మనం పట్టించుకున్నామా? ఏమో నాకు డౌటే! అసలు ఎవరో ఎందుకు ఇంకొక రష్యన్ పెద్దాయన ఉన్నాడు Aleksandr Solzhenitsyn అని. ఆయన అయితే ఏకంగా నోబెల్ సాహిత్యం ప్రైజు తెచ్చుకున్న వ్యక్తి. ఆయనేమో హార్వర్డ్ దాకా పోయి అక్కడ ఇచ్చిన స్పీచులో అటు క్యాపిటలిస్టు అమెరికాని, ఇటు కమ్యునిస్టు రషియానీ తిట్టేసి “No one on earth has any other way left but — upward” అని చెప్పాడు. అది కూడా బాగా పాపులర్ ఉపన్యాసం. మరి ఇదే విషయాలు చెప్పిన విశ్వనాథని ఏమో revivalist, obscurantist, conservative అని ట్యాగులు వేసేసి పెట్టెలో వేసేశాం.

సరే అది అలా వదిలేద్దాం. తిరిగి పుస్తకంలోకి వస్తే పరలోకం లేదు.. పూర్వ జన్మలు లేవు అనే లోకం గురించి చెబుతూ.. “నీవు ఎన్ని విచిత్రపు సిద్ధాంతాలు పెట్టినా సర్వ లోకంలో ఆర్థిక సమానత్వం కానీ తదితర విషయాల్లో సమానత్వం కానీ ఏమి చేయలేవు” అని అంటారు. ఈ ఆర్థిక సమానత్వం గురించి మాట్లాడుతూ కొన్ని కటువైన ప్రశ్నలు వేస్తారు. “ఇన్నాళ్ళు నీవు చాలా భోగాలు అనుభవించావు కనుక నిన్ను చంపేస్తున్నాను అంటే సామ్యం వచ్చిందా?” అని. ఇరవయ్యో శతాబ్దపు కమ్యునిస్టు దేశాలలో ఇలాంటి ఊచకోతలు చాలానే జరిగాయి అని చరిత్ర చదువుకున్న వారందరికీ తెలిసే ఉంటుంది. దాని వాళ్ళ ఎంత సామ్యం వచ్చిందో కూడా తెలిసే ఉంటుంది. అంతేగాక “నీవనుకున్న రాజ్యాంగం పెడతావు. ఆ రాజ్యాంగానికి ఒక నియంత ఉంటాడు. మిల్లులో పని చేసే వాడికి ఏ కూలి ఇస్తావో నియంతకు కూడా అంతే ఇస్తావా? వాళ్ళు వాళ్ళు చేసే పనిని బట్టి ఇస్తానంటావు. అంటే నీ సామ్యం ఏమైంది? చేసే పనులలో ఉన్న ఎగుడు దిగుడు లను సరిపుచ్చలేవు కదా!” అని ప్రశ్నిస్తారు. ఇక ఎలక్షన్స్ విషయానికి వస్తే “వాడి శక్తి చేత వాడిని నియంతను కమ్మనంటావు. నియంతను కావటానికి నలుగురైదుగురు సమానమైన శక్తివంతులై ఉంటారు. ఈ నలుగురిలో ఒక్కడికే ఎక్కువ వోట్లు వస్తవి . ఆ ఎక్కువ వోట్లు రావటమే వాడి అధిక శక్తి అంటావా? అది ప్రచారంలో సొగసు. ఆ గెలిచిన వాడికి ప్రచారంలో ఎక్కువ శక్తి ఉంది దేశాన్ని పాలించటంలో తక్కువ శక్తి ఉంది. ఎల్లా కుదురుస్తావు బాబా ఈ కథ” అంటారు. మన దగ్గర వీటికి సరైన సమాధానాలు ఇంకా ఉన్నాయో లేవో నాకు అనుమానమే.

ఇక సత్యాగ్రహం గురించి చెబుతూ. ఎక్కడ బడితే అక్కడ ఎవడు బడితే వాడు సత్యాగ్రహం చేయటం గురించి చెబుతూ ఇలా అంటారు – “ఈ రాతిని నేను ఎత్తబోతే అది లేవలేదు. అందుచేత అది లేచే వరకు నేను అన్నోదకాలు మాని ఇక్కడ సత్యాగ్రహం చేస్తాను. దీనికి ఏమి అర్థం లేదు” అని.

ఇదిలా ఉండగా ఈ పులుల సత్యాగ్రహంలో వేల మంది వాలంటీర్లు చావటం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సమస్య పరిష్కారానికి పూనుకోవటం. కొన్ని రోజులు పరిస్థితి సద్దుమనగటం మళ్ళీ పులుల చర్య మొదలు అవటం వగైరాలు జరుగుతాయి. ఈ సారి భారీ స్థాయిలో పులుల తదితర జంతువుల ఊచకోత అనే సైనిక చర్య జరగటం, అటు తర్వాత పులులు మీసాలు కత్తిరించుకొని జన జీవన స్రవంతిలో కలిసి పోవటం శాంతి ఏర్పడటం గురించి చెబుతారు. ఇంతా చెప్పాక, “శాంతి అంటే శాంతి కాదు. మేము రాజ్యం చేస్తూ ఉంటాం ఒక పరిస్థితిని శాంతి అని అంటాం. అంటే అందరూ పరిస్థితి శాంతి పడ్డదని అనుకోవాలి. అంతే” అని నవల ముగుస్తుంది చివరన “ఓం శాంతిః” అన్న పదాలతో!

నాకైతే చాలా నచ్చింది ఈ పుస్తకం. ఎవరికన్నా ఈ పరిచయం చదివాక పుస్తకం చదవాలనిపిస్తే చదవండి మీకు కూడా నచ్చుతుంది అని నా నమ్మకం. ఈ పరిచయం చదివాక పుస్తకం చదవాలని అనిపించకపోయినా చదవండి. పరిచయాలని చూసి మోసపోకండి!

***
విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

Pulula Satyagraham
Viswanatha Satyanarayana

You Might Also Like

10 Comments

  1. kv ramana

    రమణి గారూ. ధన్యవాదాలు, ఎప్పుడో చదివాను, అందుకుని గుర్తు లేదు. మీరు చదివి ఉంటారు కనుక మీరు చెప్పింది కరెక్టే అయుంటుంది. .

  2. Admin

    వ్యాఖ్యాతలకి విన్నపం: దయచేసి వ్యాసానికి సంబంధంలేని వ్యాఖ్యలు రాయకండి. మీకూ మీకూ ఉన్న వ్యక్తిగత సంబంధాలను దృష్టిలో ఉంచుకుని వ్యాసానికి సంబంధం లేకుండా చేసిన వ్యాఖ్యలు ఇకపై ఆమోదించబడవు.

  3. kv ramana

    విశ్వనాథవారి శైలిలో చెబితే,

    “లోకములో ఇదొక చిత్రము. ఒకే విధమైన యూనీఫారమూ, మెడకు ఉరితాడు వంటి ఒక గుడ్డపీలిక, పాదములకు గాలి చొరడానికి వీలులేని మేజోళ్ళు, బూటులు, బుజములను కుంగదీసెడు పుస్తకముల బ్యాగు, ఇంకనూ అనేక నిర్బంధముల మధ్య విసుగుచెందేడి కాన్వెంటు బాలునికి, అటువంటివి ఏవియునూలేని పల్లెటూరునందలి వీథిబడుల పిల్లలు ఆకర్షణ గొలుపును. ఆ బాలురది ఎంత భాగ్యమూ అనిపించును. వీథిబడి వానికి కాన్వెంటు బడులు ముచ్చట గొలుపును. అటులనే సంప్రదాయమునకునూ, సంప్రదాయవిద్యలకునూ దూరమైనవారికి అవి విశేషముగా హత్తుకొనుచుండును. సంప్రదాయమునందునూ, సంప్రదాయ విద్యలయందునూ మునిగితేలువారికి తద్భిన్నమైన విద్యలు ఆకర్షించును. వాస్తవము ఈ రెండింటి మధ్యనూ ఉండును. కనుకనే అతి సర్వత్ర వర్జయేత్తని పెద్దలు చెప్పిరి. టాగూరు గోరా అను ఒక నవల రాసెను. అందులోని గోరా అను యువకుడు హైందవమతాభిమాని. అంతయే కాక పరమతద్వేషియును. కానీ అంతిమముగా ఒక సత్యము తెలియును. అతను నిజమునకు ఒక ముస్లిము సంతానము. దానితో అతడు హతాశుడగును. లోకరీతి ఇటులే యుండును. ఇది తెలిసికొనుటయే వివేకము”

    1. Halley

      లోకరీతీ తెలిసిపోయింది … వాస్తవమూ తెల్సిపోయింది అనమాట మీకు . సంతోషం . ఎంతో వివేకం కల వారి లాగా ఉన్నారు . మీ కామెంటుకి ధన్యవాదాలు .

    2. కౌటిల్య

      రమణ గారూ!
      అద్భుతంగా చెప్పారు! లోకరీతిని కొత్తగా భలే ఆవిష్కరించారు. మీ అనుభవాన్ని, విజ్ఞానాన్ని జోడించి చెప్పిన ఈ విధానం… ఆహా! నాకు మాటలు రావట్లా! అసలు ఇంత కొత్తగా పోలిక చెప్తూ ఎవరూ చెప్పలేదేమో,అసలు చెప్పనేలేరేమో! మీలాంటి వివేకం అందరికీ ఉంటే లోకం ఎంతబాగుపడేదో కదా!

      ఇంతకీ ఒక విషయం అర్థంకాలా! ఈ కామెంటు ఇక్కడెందుకు పెట్టినట్టూ! మీ ఫేస్బుక్కు వాల్ మీద పెట్టుంటే, బోలెడు లైకులూ, షేర్లూ, అభిమానులూ! మిస్సయ్యారు మాస్టారూ! ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి పెట్టండి! ధన్యవాదాలు

    3. రమణి

      అయ్యా, గోరా యను నవలను తమరు చదివి వ్యాఖ్యానించియున్నచో మరియు సొగసుగానుండెడిది. గోరా ఒక ఐరిష్ వనితకు జన్మించెనని అందు పేర్కొనబడినది , ముసల్మాను తండ్రియని చెప్పబడలేదు

  4. Nitya

    పులుల సత్యాగ్రహం …మంచి రచనని పరిచయం చేసారు, ధన్యవాదాలు. అంత కంటే అభినందనీయమైన విషయం ..ఆర్టికల్ అంతా quotations తో నింపి విశ్వనాథ గారి బంగారం లాంటి వాక్యాలని చదిన్చేలా చేసారు. ఈ ఆర్టికల్ చదువుతుంటే కొన్ని రాళ్ళు పంటికింద తగిలి ఇబ్బంది కలిగింది. Czechoslovakia , రజని కాంత్, పంచ్ డైలాగ్స్ వంటివి. 🙁

  5. pavan santhosh surampudi

    //నాకైతే చాలా నచ్చింది ఈ పుస్తకం. ఎవరికన్నా ఈ పరిచయం చదివాక పుస్తకం చదవాలనిపిస్తే చదవండి మీకు కూడా నచ్చుతుంది అని నా నమ్మకం. ఈ పరిచయం చదివాక పుస్తకం చదవాలని అనిపించకపోయినా చదవండి. పరిచయాలని చూసి మోసపోకండి!//
    కామెడీ నవల చదివిన మూడ్ లో మీరు జోకులు వేస్తున్నారంటే. అది బావున్నట్టే. చదవాలన్న మాటే.

  6. pavan santhosh surampudi

    // విశ్వనాథ వారి creativity కి మరో మచ్చుతునక. వారి భావాలను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వారి creativity విషయం లో దెబ్బలాడే వాళ్ళు తక్కువే అనుకుంటాను! అరుంధతి రాయి వ్యాసాలు నాకు ఇలానే అనిపిస్తాయి. ఏమి చెప్పాలని అనుకుందో చాలా బాగా చెప్తుంది ఆవిడ. విషయంతో మనం ఏకీభావిస్తామా లేదా అన్నది పక్కన పెడితే! //
    ఇలా అంటే పెద్ద గొడవ కదండీ మరి.

Leave a Reply