రాజకీయ కథలు – ఓల్గా

వ్యాసకర్త: రాగమంజరి
************
ఓల్గా రచించిన రాజకీయ కథలు రెండు సంపుటాలు. మొదటి సంపుటిలోని కథలు కొన్ని రెండో సంపుటిలో కూడా వున్నాయి.

మొదటి పుస్తకానికి రాసిన ముందుమాటలో రచయిత్రి కథల నేపథ్యాన్నీ, రాజకీయ కథలు అన్న పేరు పెట్టడానికి కారణాన్నీ వివరించారు. “ఈసంకలనంలో కథలు స్త్రీల శరీరాల చుట్టూ, స్త్రీలకు తోటి స్త్రీలతో, సమాజంతో, తమ పురుషులతో వుండే సంబంధాల చుట్టూ పురుషాధిక్య సమాజం ఎన్ని “మిత్” లను బలంగా అల్లిందో చెప్పడానికి ప్రయత్నించిన కథలు.” అన్నారు. పురాణాలలో ప్రబంధాలలో కావ్యనాటకాలలో స్త్రీల శరీరాన్ని ఒక్క అంగుళం కూడా విడిచి పెట్టకుండా వర్ణించారనీ, ఆ వర్ణనలలోని అసభ్యత గురించీ, అతిశయోక్తుల గురించీ చెప్పే పనే లేదనీ అన్నారు. నిజంగా ఈ కథలు రాయటం వల్ల తాను చాలా నేర్చుకున్నాననీ, తన మిగిలిన రచనలు చేయటానికి పడనంత ఎక్కువ కష్టం ఈ కథలు రాయటంలో పడ్డాననీ చెప్పారు. “మనల్ని గురించి మనం తెలుసుకోవటానికి ఒక పద్ధతిని ఈ కథల ద్వారా యివ్వగాలిగానని యిపుడు తృప్తి పడుతున్నాను.” అన్నారు కథాసంపుటిపై తన వివరణ ముగిస్తూ.

అయితే ఈ కథలు చదివితే స్త్రీలు తమని తాము “సరిగా” అర్థం చేసుకోవడానికి అవకాశమిచ్చే అలాంటి ఒక స్పష్టమైన పద్ధతి ఏదీ నాకు కనబడలేదు. పురాణాలలో ప్రబంధాలలోని స్త్రీల వర్ణన అతిశయోక్తులతో నిండినదని ఆరోపించిన రచయిత్రి వాటిని ఖండించే ప్రయత్నంలో తానూ ఎన్నో అసహజమైన కల్పనలే చేశారనిపించింది. సంభాషణలు మాత్రం సహజంగా వున్నాయి. కథలు చక్కగా చదివించేలాగానూ వున్నాయి. కానీ స్త్రీల జుట్టు, కళ్ళు, ముక్కు, రొమ్ములు – ఇలా ఒక్కొక్క అవయవం గురించీ రాసిన కథలలో తన వాదనకి అనుగుణంగా(?) నిర్మించిన సంఘటనలు, సన్నివేశాలు అసంబద్ధంగా వున్నాయి. ఆ సన్నివేశాల నుంచి చేసిన విశ్లేషణలు, అన్వయాలు కూడా ఒకదానితో ఒకటి ముడిపడనట్లుగా వున్నాయి. చాలా చోట్ల అవి ఒకదానినొకటి ఖండించుకుంటున్నాయి కూడా.

మొదటి కథ సీతజడలో సీత చాలా అందమైన పొడుగైన జుట్టు వున్న ఆమ్మాయి. ఆ జుట్టుతో సమస్యలూ, ప్రశంసలు, లాభాలు, నష్టాలు – ఆ నేపథ్యంలో నుంచి పొడుగైన జుట్టు గురించి సమాజంలో వున్న రకరకాల భావాలను చర్చిస్తారు రచయిత్రి. భర్త చనిపోతే జుట్టు తీసేయడం అనే ఆచారం గురించీ విశ్లేషిస్తారు. మిషనరీ స్కూల్లో చేరిన సీత అక్కడ జుట్టు లేని నన్ లను చూసి ఆశ్చర్యపోవడం గురించి చెప్తారు. ఇదంతా సమాచారం. ఇంకా తర్వాత కూడా చాలా సమాచారం వుంటుంది కథలో. షాంపూలు, బ్యూటీ పార్లర్లు మొదలైన వాటి గురించి కూడా. ఈ సమాచారం అంతా బానేవుంది. మరి కథ ఏమిటి? సంఘటనలేమిటి? పాత్రల చిత్రణ ఏమిటి? అవి మనకు ఏం చెప్పాయి? అని చూస్తే కథలో మొదటి కల్పన – “సీత జుట్టు గురించే ఆలోచిస్తూ స్కూల్ ఫైనల్ తప్పి పెళ్ళి చేసుకుంది.” అన్నది. జుట్టు బాగాలేని వారు దాని గురించి ఆలోచించి దిగులుపడి పరీక్ష తప్పారంటే అందులో కొంత సహజత్వమూ వుంటుంది. రచయిత్రి చెప్పదలచుకున్న విషయానికి అది ఉపయుక్తమూ అవుతుంది. కానీ మంచి జుట్టు వున్న సీత జుట్టు గురించే ఆలోచించి స్కూల్ ఫైనల్ తప్పిందనడం అసహజమే కాదు కథలో చెప్పదలచుకున్న విషయానికి వైఫల్యాన్ని కలిగించేది కూడా. ఇక మిగిలిన కల్పనలు – పెళ్ళయ్యాక కొన్నాళ్ళు ఆ జుట్టుని మురిపెంగా చూసిన సీతభర్త ఆ తర్వాత దానిని పట్టించుకోక పోగా విసుక్కోవడం, చిన్నవయసులోనే అతడు మరణించడం, సీత వదినలు సీత పొడుగైన జుట్టుని చూసి ఈర్ష్య పడడం – యిటువంటివి.

ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే భర్త నిర్లక్ష్యం, తోటి స్త్రీల ఈర్ష్యలు, అసూయలు యివన్నీ ఒక విషయం. రచయిత్రి ప్రస్తావించదలచిన స్త్రీల శరీరాల మీద రాజకీయం మరొక విషయం. ఆ రెండిటికీ ముడిపెట్టడం కుదరదు. ఎందుకంటే భర్త నిర్లక్ష్యం, ఇతర స్త్రీల అసూయ – ఇవి శారీరకమైన విషయాలకే పరిమితమయినవి కావు. అందం ఒక్కటే కాదు తెలివితేటలు, మంచితనము, సమర్థత ఇలాంటి లక్షణాలు వున్న స్త్రీకి కూడా నిర్లక్ష్యాలు, అసూయలు ఎదురవుతాయి, ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువ మోతాదులో. వాటికి బాధపడకుండా ఉండడానికి కావలసినది బలమైన వ్యక్తిత్వం కానీ ఆయా లక్షణాల పట్ల విముఖత కాదు. అలాంటి వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికీ, శారీరక సౌందర్యానికీ సంబంధం లేదు. ఒకవేళ “సంబంధం వుంది” అన్న విషయమే రచయిత్రి చెప్పదలచుకుని ఉంటే అది కథలో వ్యక్తమవలేదు. పాత్ర చిత్రణా, సంఘటనల కల్పనా అందుకు దోహదం చేయలేదు.

మరొక కథ అయోని. ఇది వ్యభిచార కూపంలో చిక్కుకుపోయిన ఒక చిన్నపిల్ల కథ. పన్నెండేళ్ళ వయసున్న పిల్ల గొంతులో నుంచి వినబడే కథ. అయితే, ఈ కథలో ఆలోచనలు, మాటలు పన్నెండేళ్ళ పిల్ల స్థాయిలో వుండవు. నిజానికి మరి ఆ పిల్ల వున్న పరిస్థితులూ పన్నెండేళ్ళ పిల్ల ఉండవలసిన పరిస్థితులు కావు కదా అని అనుకోవచ్చు. ఆ పరిస్థితుల వలన పెద్దరికం వచ్చిందనో, రాటు దేలిపోయిందనో భావించవచ్చు. కానీ కథనం అలా సమర్థించుకునేందుకు అవకాశం యివ్వదు. పిల్ల మీద సానుభూతి కలగాలన్న ఉద్దేశ్యంతో పిల్లలో అమాయకత్వాన్ని చూపాలనే ప్రయత్నం ఒక ప్రక్కన, దానికి పొసగని మాటలూ, ఆలోచనలూ మరోప్రక్కన వుండడం వలన కథ చాలా కృతకంగా తయారయింది.

విషయమేమిటంటే, ఆ పిల్ల పరిస్థితికి తగ్గట్లు మోటుమాటలు, మొరటు మాటలు వాడుతూ కూడా ఆ అమ్మాయిపై సానుభూతి తెప్పించవచ్చు. అంత చిన్న పిల్ల అలా మాట్లాడే దుస్థితి రావడంలోని విషాదాన్ని పాఠకుడికి తెలియచేయచ్చు. లేదా పెద్ద మాటలు వాడకుండా చిన్నపిల్లల మాటల్లో ఆ పిల్ల బాధని చెప్పే ప్రయత్నమూ చేయచ్చు – ఆ పిల్ల ఇంకా బాల్యాన్ని దాటలేదనీ, ఆ పరిస్థితులకి అలవాటుపడలేదనీ తెలియచేస్తూ. ఈ కథలో ఆ రెండూ జరగలేదు.
తొమ్మిదో ఏట తానొక కథ వ్రాసి చందమామకు పంపిందట ఆ పాప. ఇప్పుడు మూడేళ్ళ తర్వాత పన్నెండో ఏట దాని గురించి మనకి ఇలా చెప్తుంది. “ఆ కథ ఎంత మంచి కథ. ఆ కథలో మనుషులు ఎంత మంచివాళ్ళు. అందమైన తెల్లని రెక్కలతో తమ మధ్యకు దిగివచ్చిన పక్షి రాజకుమార్తెను ఎంత అపురూపంగా చూసుకున్నారు? ఆమెకు కావలసినవి అన్నీ యిచ్చారు. … అమాయకమైన సంతోషంతో వెలిగే ఆ పక్షిపాప కళ్ళనూ, మెత్తని ఆ పాప పాదాలనూ, బుల్లి బుల్లి అరచేతులనూ ఎంత ఇష్టపడ్డారు. ఆ పాపకు హంసతూలికా తల్పం చేయించారు. పారిజాతం పూలతో దండలు గుచ్చి వేశారు. తియ్యని కర్పూర పాయసాలు వండి పెట్టారు. ఇన్ని చేసినా ఆ పాపకు వాళ్ళ అమ్మ నాన్న ల మీద దిగులేసింది….” ఈ మాటల్లో పన్నెండేళ్ళ పాప అమాయకత్వం ఖచ్చితంగా లేదు. ఇలా ఆ పాపని ఇన్ని పెద్ద పెద్ద మాటలు రాయగల రచయిత్రిని చేశాక పాఠకులకి ఆ పిల్ల పై కలిగే సానుభూతి తగ్గుతుంది.

ఈ కథావస్తువుకి సంబంధించినంత వరకు ఆ పాపపై సానుభూతి కలగాలంటే ఆ పాపకి భావుకత్వం ఉండాల్సిన అవసరం లేదు. ఆ పిల్లకి భావుకత్వం అనే మాటకి అర్థం కూడా తెలియకపోయినా, అల్లరిచిల్లరిగా గారాబంగా తిరిగే పిల్ల అయినా కూడా ఆ అమ్మాయి పరిస్థితికి మనకి సానుభూతి కలుగుతుంది. కలిగితీరాలి. అయితే గొప్ప భావుకత ఉన్నట్లుగా వ్రాయడం వలన, ఒకింత ఆరిందాతనాన్ని ఆపాదించడం వలన ఆ సానుభూతి తగ్గుతుంది. కథని ఇలా రాయడం ఈ కథావస్తువుకి తీవ్ర ద్రోహం చేసింది. ఉదాహరణకి ఒక కొత్త పెళ్ళికూతురు, చాలా భావుకత వున్న అమ్మాయి కాపురానికి వచ్చింది. అక్కడ మొగుడి ప్రవర్తనా, అత్తగారింట్లో పరిస్థితులూ మొరటైనవి. ఆ పిల్ల భావుకతని చంపేసేంత తీవ్రమయినవి. అలాంటి ఒక కథలో ఆ అమ్మాయి భావుకతని ఎంత అందంగా రాస్తే, ఎంత ఎక్కువగా రాస్తే, అంతగా అక్కడ విషాదం పండుతుందేమో!

కానీ ఇక్కడ పరిస్థితి అది కాదు. అంత చిన్న పాప పెద్దవాళ్ళు మాట్లాడినంత భావుకతతో, ఆరిందాతనంతో మాట్లాడేస్తే అది చెప్పాల్సిన విషయానికి చెడే చేస్తుంది కానీ మంచి చేయదు. ఆ పాప ఒక మామూలు పాపగా మాట్లాడుతూ తన పరిస్థితుల గురించి చెప్పడం వేరు. ఒక రచయిత్రిగా మాట్లాడుతూ తన కథలోని పాత్ర గురించి “అమాయకమైన సంతోషంతో వెలిగే పక్షి పాప కళ్ళు.. “ అని వర్ణించే స్థాయిలో ఉండడం వేరు. అంతటితో ఆగిపోకుండా కథ చివర్లో ఆ పాప చేత ఇలా చెప్పిస్తారు రచయిత్రి. “అంత మంచి కథ రాశాక ఈ కథ రాయడానికి నాకు సిగ్గుగా వుంది. బాధగా వుంది. ఆ కథ నా కల. ఈ కథ నా కథే. తొమ్మిదేళ్ళ వయసులో అంత అందమైన కలగన్న నేను… మూడేళ్ళ తర్వాత ఎట్లా మారిపోయానో – నా బతుకు పీడకలగా ఎట్లా మారిపోయిందో! నేను అంటే యివాళ అర్థం ఏమిటో అందరికీ చెప్పాలని వుంది. అట్లా చెప్పటం వల్ల నా చుట్టూ వున్న వాళ్ళు అర్థం చేసుకునే నేను నిజం కాదనీ – ఈ కథ రాయగలిగిన నేను నిజమైన నేననీ నిరూపించుకోవాలి. అదీ నా కోరిక. ఆ కోరిక నన్ను ఎంత వేధిస్తున్నదంటే సంవత్సరం నుంచీ నేనీ కథ రాయడం కోసమే బతికున్నాను. ఈ కథ రాసి చచ్చిపోతాను.” అది చదివితే ఈ వాక్యాలతో ఏం చెప్తున్నారు రచయిత్రి? అనిపించింది. “నా చుట్టూ వున్న వాళ్ళు అర్థం చేసుకునే నేను నిజం కాదనీ – ఈ కథ రాయగలిగిన నేను నిజమైన నేననీ నిరూపించుకోవాలి.” అంటే అర్థం ఏమిటి? అందరూ ఆ పాపని అర్థం చేసుకునేది పన్నెండేళ్ళ పసికూనగా. ఆ పాప తాను అది కాననడం, “ఈ కథ రాయగలిగిన నేను నిజమైన నేను” అనడం – కథకీ కథలో చెప్పదలచుకున్న విషయానికీ ఎలా మేలు చేస్తుంది?

ఇంకా కొన్ని మాటలున్నాయి. “నేను తింటున్నది అన్నమో రక్తమో తెలియని స్థితి.” “బాధ తోనే ప్రపంచం వుందా? హింస తోనే ప్రపంచం ఉందా?” – ఇలాంటి మాటలన్నీ అటువంటి పరిస్థితులలో ఉన్నప్పటికీ పన్నెండేళ్ళ పిల్ల మాట్లాడగలిగే మాటలు కావు అనిపించింది. ఇక కథ ముగిస్తూ ఆ పాప “కథ రాశాను గదా – ఇక వెంటనే చచ్చిపోవచ్చు. చచ్చిపోతున్నాను.” అంటుంది. చచ్చిపోవడం ఆ పిల్ల చేతుల్లో ఉంటుందా! అక్కడ చిక్కుకున్న పిల్లలు అంత సులభంగా అనుకున్నపుడు చనిపోగలరా! తొమ్మిదేళ్ళకి ఆ ఊబిలోకి వెళ్ళిన పిల్ల రెండేళ్ళ తర్వాత అంటే పదకొండు ఏళ్ళప్పుడు ఇలాంటి కథ ఒకటి రాసి చచ్చిపోదామని నిర్ణయించుకుని, దానికి సరైన టైటిల్ దొరకనందువల్ల ఒక సంవత్సరం ఆగి “అయోని” అన్న శీర్షిక దొరకగానే కథ రాసేసి ఇక చచ్చిపోవచ్చు అనుకుని చచ్చిపోతుందా! ఇంత విషాదకరమైన కథా వస్తువుని రచయిత్రి ఇంత తేలికగా రాయకపోతే బాగుండేదనిపించింది.

వెలుతురులోకి – ఈ కథలో తీసుకున్న విషయం పెద్దదే. బాగా చదువుకుని అధికారంలో వున్న సరస్వతి అనే ఒక స్త్రీ, భర్త చెప్పిన ఫైళ్ళ మీద సంతకాలు చేస్తూ అతని వత్తిడి వల్ల అన్యాయాలకి కారణమవుతూ వుండడం, అలా చేయడం యిష్టం లేక బాధపడడం – ఇది కథావస్తువు. అయితే రచయిత్రి దీనిని “పాతివ్రత్యం” తో ముడి పెట్టకుండా రాసివుంటే బాగుండేది. పాతివ్రత్యం అనేది బలం అనీ, భర్త దౌర్జన్యానికి లొంగిపోయే బలహీనత కాదనీ తెలుసుకునే విచక్షణ, స్పష్టత స్త్రీవాద రచనలలో ఉంటాయని ఊహించలేదు కానీ ఒక వర్గం వారు ఇటువంటి పని చేస్తారు అని ఆరోపణ చేయాలంటే, ఒక లక్షణాన్ని ఒక వర్గానికి ఆపాదించాలంటే ఆ వర్గంలో అటువంటి పని చేసినవారు కనీసం ఒక్కరైనా వుండాలి కదా అని సందేహపడ్డాను.

భర్త మాట విని అధికార దుర్వినియోగం చేసిన, ఒకరికి అన్యాయం చేసిన, లేదా ఆ భర్త మరొకరికి అన్యాయం చేస్తుంటే సమర్థించిన పతివ్రతలు ఎవరైనా వున్నారా అని చాలాసేపు ఆలోచించాను. ఎవరూ కనబడలేదు. మరి రచయిత్రి ఇలా చేయడం “పాతివ్రత్యం” అని ఎందుకు అన్నారో అర్ధం కాలేదు.
అంతేకాదు. సరస్వతికి పెళ్ళయ్యింది అని చెప్తూ “తన నోముల ఫలం. తన ముత్తయిదుతనం, తన పాతివ్రత్య పరాకాష్ఠ మంగళసూత్రం మెడలో పడింది.” అని రాస్తారు రచయిత్రి. పాతివ్రత్య పరాకాష్ఠ ఏమిటి? మంగళసూత్రం పాతివ్రత్య పరాకాష్ఠ ఎలా అవుతుంది? అర్థం కాలేదు.

మరొక కథ స్నేహం. ఆడవాళ్ళకి నచ్చిన వాళ్ళతో స్నేహం చేసే అవకాశం ఉండదనీ, దాని మీద ఇతరుల పెత్తనాలు ఉంటాయనీ చెప్తుంది ఈ కథ. అందుకు మూడు నాలుగు ఉదాహరణలు చెప్తారు రచయిత్రి. కథలోని ముఖ్య పాత్ర పేరు జయ. చిన్నప్పుడు, ఆరో తరగతిలో వుండగా మరియమ్మ అనే పిల్లతో ఆమెకి స్నేహం ఏర్పడుతుంది. తక్కువ కులం పిల్లతో స్నేహం చేయడం, వాళ్ళ యింటికి వెళ్ళి భోజనం చేయడం ఏమిటని తండ్రి చావబాదడంతో ఆ స్నేహం ఆగిపోతుంది. తర్వాత మరో స్నేహితురాలు సుగుణ. ఆ పిల్ల పెద్దమనిషి అవడంతో చదువు మానిపిస్తారు. అలా ఆ స్నేహం ఆగిపోతుంది! తర్వాత తొమ్మిదో క్లాసు నుంచీ సరితతో స్నేహం. అది చాలా రోజులు నడుస్తుంది. అయితే కాలేజ్ లో చేరాక సరిత కృష్ణ అనే అబ్బాయిని ప్రేమించి అతనితో చనువుగా మసలుతూ వుంటుంది. అది గమనించిన జయ అన్నయ్య ఆ పిల్ల పధ్ధతి బాలేదు, తనతో స్నేహం మానేయి అని కట్టడి చేస్తాడు. ఈలోపు కృష్ణ వేరే పెళ్ళి చేసుకోవడం, సరిత నిద్రమాత్రలు మింగి చచ్చిపోవడం జరుగుతుంది. ఇక పెళ్ళయ్యాక భర్త స్నేహితుడి భార్య అయిన మాలతితో స్నేహం ఏర్పడుతుంది. ప్రక్క ప్రక్క ఇళ్ళలో కాపురం. మాలతితో స్నేహాన్ని ఆనందిస్తున్న సమయంలో మగవాళ్ళిద్దరి స్నేహమూ చెడుతుంది. భర్త ఇల్లు మారదామని నిర్ణయించడంతో మాలతితో స్నేహమూ నిలిచిపోతుంది. – ఇదీ కథ.

ఇందులో ఒక్క సంఘటన కూడా కథావస్తువుని బలపరిచేది కాదు. మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకి స్నేహం నిలుపుకునే అవకాశాలు తక్కువ అయితే కావచ్చు. అయితే ఆ విషయాన్ని ఇంకా చక్కగా సరళంగా చెప్పి ఉండవచ్చు. ఇంత సాగదీసి రాయడం వల్ల ఆపాదించిన కారణాల లోని డొల్లతనం ఇంకా స్పష్టంగా బయటపడింది. కులం సమస్య స్త్రీలకి మాత్రమే వున్నది కాదు. పరిస్థితుల ప్రభావంతో కొంతమంది స్కూలు మానేయడం, మరో స్కూలుకో మరో ఊరికో వెళ్ళిపోవడం వంటివీ ఆడపిల్లలకే పరిమితం కాదు. అసలు ఆ చిన్నప్పటి స్నేహాలని పెద్ద స్నేహంగా చెప్పడమే సరికాదు. ఆ వయసులో అందరూ అందరితోనూ స్నేహంగానే వుంటారు. అవి భావాలు కలిసి తమ విచక్షణతో ఏర్పరచుకున్న స్నేహాలు కాదు కదా! ఒక్క మాలతితో స్నేహమే (కొంతవరకూ) ‘స్నేహం’ అని చెప్పదగినది. స్కూల్లో తనతో పాటు చదివే మరియమ్మ, సుగుణలతో కలిసిమెలిసి ఉండడాన్ని పూర్తి అర్థంలో స్నేహం అనలేము. ఇక సరితతో స్నేహం విషయంలో – వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకునే రకం కాదు, అంత పెళ్ళి చేసుకుంటే అపుడు మళ్ళీ స్నేహం చేద్దుగానివిలే, ఇపుడు మానేసేయి అన్న అన్నయ్యతో ‘ఏం కాదు, వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారు’ అని వాదిస్తుంది జయ. అయితే చివరికి ఆ అన్నగారు చెప్పినట్లే అయిందని రాయడం ద్వారా మనుషులని అర్థం చేసుకోవడంలో జయ పొరబడిందనీ, అన్నగారే సరిగా అంచనా వేశాడనీ చెప్పినట్లు అయింది కదా! అలాంటపుడు అతను చెల్లెలికి సలహా యివ్వడం తప్పు కాదేమోననిపిస్తుంది కదా!

మాలతితో స్నేహం నిలుపుకోలేక పోవడానికి కారణమూ సరిగా లేదు. ఇల్లు మారడానికి చెప్పిన కారణమూ కల్పించినట్లే వుంది కానీ సహజంగా లేదు. ఈ వాదనకి ఊతంగా మరోవిషయం చెప్తారు రచయిత్రి. ఇరుగుపొరుగు ఇళ్ళల్లో వుండే ఆడవాళ్ళు గొడవ పడితే మగవాళ్ళు “ఆ ఏదో ఆడముండలు గొడవపడుతూ వుంటారు ఆ మాత్రానికి ఇల్లు మారతామా” అనుకుంటారట. అదే తమ మధ్య గొడవలు వస్తే మాత్రం వెంటనే ఇల్లు మార్చేస్తారట. ఇదీ ఒప్పుకోదగిన విషయం అనిపించలేదు. వాస్తవం ఇందుకు వ్యతిరేకంగా ఉంటుందనిపించింది.

ఇంతా చేసి ‘ఇదంతా ఆడవాళ్ళ మీద కుట్ర, మగవాళ్ళు మాత్రం వాళ్ళ స్నేహాలు బాగా నిలుపుకుంటారు’ అని చెప్తోందా ఈ కథ అంటే అదీ కాదు. ఎందుకంటే, ఈ కథలోనే అసలు మగవాళ్లకి స్నేహం విలువే తెలియదు, వాళ్ళు ప్రాణస్నేహం అని చెప్పుకునేది అసలు స్నేహమే కాదు అనిపించేలా వుంటుంది కథనం – జయ భర్త కీ మాలతి భర్తకీ వున్న స్నేహం విషయంలో.

శత్రువులెవరు? : ఈ కథలో ఒక అత్తా, కోడలు చాలా అన్యోన్యంగా వుంటారు, పదేళ్ళ పాటు. ఆ తర్వాత వాళ్ళ మధ్య గొడవలు వస్తాయి. కోడలు అనూరాధ అత్తగారిని ద్వేషించడం మొదలుపెడుతుంది. దానికి కారణం అనూరాధ భర్త చేసిన కుట్ర అని ఆమె చెల్లెలు అనూరాధకి వివరించడం కథ.

ఈ కథలో శైలీ, సంభాషణలు, కొంతవరకూ బానే వున్నాయి కానీ ఇక్కడా అసలు కథా వస్తువులోను, దానిని కథగా మలచడం లోనూ దోషం వుందనిపించింది.
పదేళ్ళ పాటు అన్యోన్యంగా వున్న తర్వాత తల్లి ఏదో ఒక విషయంలో – అదికూడా కొడుక్కీ, మనవలకీ మంచి చేద్దామనే ఉద్దేశ్యంతోనే- మంకు పట్టు పట్టడం, దానికి ఓ పదివేలు ఖర్చవుతాయి కనుక కొడుకు యిష్టపడకపోవడం, అపుడు భర్త తరపున అనూరాధ అత్తగారితో పోట్లాడటం, అలా వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం మొదలవడం జరుగుతుంది. చివరికి తల్లీ, కొడుకూ బానేవుంటారు. మధ్యలో అత్తకీ, కోడలికీ పడకుండా అవుతుంది. అదంతా అనూరాధ భర్త యొక్క “కుట్ర” అని కనిపెడుతుంది అనూరాధ చెల్లెలు. “ఈ మగాళ్ళు ఆడవాళ్ళని అమానుషంగా తయారు చేయడంలో, వాళ్ళలో సున్నితత్వాన్ని చంపి బండగా తయారు చేయడంలో బహు నేర్పరులు.” అంటుంది.

“వాళ్ళిద్దరూ (తల్లీ కొడుకులు) ఒక మాట అనుకున్నా సర్దుకునే వాళ్ళేమో, మధ్యలో నువ్వు ఎందుకు జోక్యం చేసుకున్నావు? నువ్వు ఆమెని మీ ఆయన అడగమన్న మాటలన్నీ అడిగి ఆక్రమంలో ఆమెని ద్వేషించావు.” అని వివరిస్తుంది. అటు ఆవిడతో పోట్లాడటము, ఇటు ఆవిడకి సేవ చేయడమూ రెండూ కూడా అనూరాధ భర్త నేరుగా చేయడనీ, మధ్యలో అనూరాధతో చేయిస్తున్నాడనీ అలా ఆమెని ఒక స్థితిలో పడేశాడనీ కనీసం దాన్నుంచి ఆమెని బయటకి తెచ్చే ప్రయత్నమూ చేయడం లేదనీ – ఇలా అదంతా అనూరాధ భర్త చేసిన కుట్ర అన్న ధోరణిలో అసలు శత్రువు అతనేనన్న ధ్వనితో విశ్లేషిస్తుంది ఆమె చెల్లెలు.

అయితే కథ నడిచిన పధ్ధతి ప్రకారం, ఇది ఒక పరిస్థితిని సరిగా సమన్వయించుకో లేని భర్త అసమర్థతే తప్ప “కుట్ర” అని అనుకోవడం సబబు కాదని అనిపిస్తుంది. అలా అనుకోవడం అమాయకత్వం అని అనిపిస్తుంది. ఆ రకంగా కథా వస్తువులో దోషం వుందని అనిపిస్తుంది. కుట్ర అనుకోవడం అమాయకత్వం కాదు. కుట్ర అని తెలుసుకోకపోవడమే అమాయకత్వం. స్త్రీ సమస్యలకి మూలం ఏమిటో తెలియని వారికి ఆ విషయం అర్థంకాదు అని కొన్ని సాంకేతికమైన మాటలు ఉపయోగించి స్త్రీవాదులు ఆ విషయానికి సమర్థనలు చూపించవచ్చు. అపుడు కొన్ని ప్రశ్నలు వస్తాయి. భర్త రజనీకాంతరావు ఒక కుట్రగా ఇదంతా చేస్తే మొదటి పదేళ్ళు మాత్రం అత్తా కోడళ్ళు అన్యోన్యంగా ఎలా ఉండగలిగారు? ఒకవేళ అతను తల్లి మంకుపట్టు పట్ల తన అభ్యంతరాన్నీ, వాదనలనీ భార్య చేత చెప్పించకుండా తనే నేరుగా చెప్తే అపుడు అత్తగారి మీద అనురాధకి ద్వేషం కలిగేది కాదా! ఇలాంటి ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి సమాధానాలు కథా వస్తువుకి వ్యతిరేకంగానే వస్తాయి. కథా వస్తువులో లోపం వున్న విషయం కథనమే తెలియచెప్తుంది. అనూరాధ ద్వేషానికి ముఖ్య కారణం తల్లీకొడుకుల మధ్య తను జోక్యం చేసుకోవడమూ, భర్త తరపున పోట్లాడటమే కాదు. అత్తగారు రజనీకాంతరావు యిబ్బందులు అర్థం చేసుకోకుండా అతన్ని బాధ పెడుతోందన్నది కూడా.

రజనీకాంతరావు బాధ అబద్ధం కాదు. నాటకం కాదు. నిజమే. కాబట్టి ఆ బాధని అతను భార్యతో పంచుకోవడాన్ని “కుట్ర” అనుకోలేము. భర్త తన బాధని భార్యతో పంచుకోకూడదు, అలా పంచుకోవడం కుట్ర అని ఎలా అంటాం? దానికి బదులుగా “అతని బాధ నిజమే అయినా అతను దాన్ని నీతో పంచుకున్నా, నువ్వు విని ఊరుకో. తల్లీ కొడుకుల మధ్య జోక్యం చేసుకోకు.” అని చెప్తే అది ఒకవేళ సమస్యకి అత్యుత్తమ పరిష్కారం అయినా కాకపోయినా కనీసం తర్కానికి నిలబడేది. కానీ రచయిత్రి అలా చెప్పలేదు. అసలు అతను ఆ బాధని భార్యతో పంచుకోవడమే కుట్రలో భాగం అన్నారు. అదే ఈ కథలో, కథనంలో లోపం.

అన్వేషి : ఏం చెప్పాలో స్పష్టంగా తెలియకపోయినా అసలు సమస్యా దానికి పరిష్కారమూ కూడా పూర్తిగా అర్థంకాక పోయినా క్రొత్తగా ఏదన్నా రాసేయాలి అన్న ఆరాటం కనిపిస్తుంది ఈ కథలో. చదువుకునే రోజుల్లోనే తీవ్రవాద విద్యార్థి ఉద్యమాలలో పాల్గొని, పెళ్ళయిన కొత్తల్లో యిబ్బందులు పడి, రహస్య జీవితాన్ని గడిపి, ఆ తర్వాత మెల్లగా ఉద్యోగాలలో స్థిరపడి ఒక్కగానొక్క కూతురు క్రాంతిని బాగా చదివించుకుని ఆ అమ్మాయి బాగా వృద్ధిలోకి రావాలని కలలు కంటూ వుండే తల్లిదండ్రులు గిరిజా, ముకుందరావు. అయితే క్రాంతి మాత్రం “చదువూ ఉద్యోగం, పెళ్ళీ పార్టీ లేదా సంఘం – ఈ మూడూ కాకుండా వుండే జీవితం కోసం వెతుకుతున్నానమ్మా .. నేను వ్యవస్థలకి లొంగదల్చుకోలేదు. అన్ని వ్యవస్థలకీ బయటే వుండదల్చుకున్నాను. .. మీరు నాకు సహాయపడద్దు. అడ్డు రావద్దు. నా దారిన నన్ను పోనివ్వండి.” అంటుంది. తల్లిదండ్రులకి ఆ ధోరణి మింగుడుపడదు. ఇది ఒక ఆలోచించ వలసిన విషయం అయితే అవునేమో కానీ దానిని కథగా మలచడంలో మాత్రం వైఫల్యమే కనిపించింది.

వామపక్ష పార్టీలలో పని చేసిన వారు కూడా కులం లేదంటూనే తమ కులానికి చెందినవారితో ఎక్కువ సన్నిహితంగా వుండడం, వారి పిల్లలు కూడా అమెరికా వెళ్ళడం – ఇలాంటి కొన్ని విషయాలు కథలో ప్రస్తావించబడతాయి. అయితే వాటికీ, క్రాంతి చేయాలనుకునే – వ్యవస్థలకి బయట వుండడం అనే – అన్వేషణకీ లంకె సరిగా పడలేదు కథలో. సమాజంలో అందరూ వింతగానో, విమర్శగానో చెప్పుకుంటున్న కొన్ని విషయాలని కథలో అక్కడక్కడా రాసేసి ఊరుకుంటే, వాటన్నిటినీ కలిపే ఒక సూత్రం ఏమీ లేకపోతే ఆ విషయాలన్నీ ఎత్తుకు రావడం వలన ప్రయోజనం ఏముంది?

ఆ రాయడంలో కూడా కొన్ని పదాలు చాలా అసందర్భంగా అనిపిస్తాయి. క్రాంతిని తప్పకుండా డొనేషన్ కట్టి అయినా సరే డాక్టర్ ని చేయాలనీ, ఆమె డాక్టరయ్యి యింకో దాక్టర్ని పెళ్ళిచేసుకుంటుందనీ, ఇద్దరూ అమెరికా వెళ్తారనీ, వాళ్ళని చూడటానికి తామూ వెళ్తామనీ కలలు కంటూ వుంటారట గిరిజా, ముకుందరావు. ఆ సందర్భంలో వాక్యాలు ఇలా వుంటాయి. “…ఇట్లాంటి కలలేవో కంటుండేవారు. ఆ కలలు పూర్తిగా నిరాధారమైనవి కావు. తమలాగే గతంలో తీవ్రవాద ఉద్యమంలో, వామపక్ష పార్టీల్లో పని చేసిన వారి పిల్లలు చాలా మంది అమెరికా వెళ్ళారు….” ఇక్కడ “ఆ కలలు పూర్తిగా నిరాధారమైనవి కావు.” అనేమాట చాలా అసంబద్ధంగా వుంది. వాక్యంలో “తమలాగే” అని వాడారు కనుక ఆమాటలు, ఆభావం గిరిజ, ముకుందరావులవి అనుకోవాలి. అయితే ఆ భావం గిరిజ, ముకుందరావులది అయినపుడు వారు “నిరాధారం” అనే మాట అనుకోరు కదా! ఎవరూ తమ కల గురించి తాము “మా ఈ కల నిరాధారమైనది కాదు, మాలాంటి వాళ్ళ పిల్లలు కొంతమంది వెళ్ళారు కాబట్టి మా కలకి ఆధారం వుంది” అనుకోరు కదా! కాదు, ఆ మాటలు రచయిత్రివి అనుకుందామా అంటే అది మరీ అసంబద్ధం. “నా కథలోని పాత్ర అలా కలగనడానికి ఒక ఆధారం వుంది. ఎందుకంటే సమాజంలో కొందరు అలా చేస్తున్నారు.” అని చెప్పడం అసంబద్ధమే కదా! పైగా ఒకవేళ అవి రచయిత్రి మాటలు అయితే “తమలాగే” అని కాక “వాళ్ళలాగే” అని వుండాలి. ఆలోచిస్తే యిది – వామపక్షపార్టీలలో పనిచేసిన వారి గురించీ, వారి పిల్లల గురించీ తాను చేస్తున్న వ్యాఖ్యలు నిరాధారం కాదంటూ రచయిత్రి వారికి యిస్తున్న వివరణ (సంజాయిషీ!) కాదు కదా అనిపిస్తుంది. అలా అనిపించడం నా ఊహే కావచ్చు. కానీ ఆ ఊహ నిరాధారం కాదు. దానికి ఆ ‘నిరాధారం’ అనే అసంబద్ధమైన మాట ఆధారం.

చివరిగా ఆర్తి అనే కథ. ఏం చెప్పాలనుకున్నారో సరిగ్గా దానికి వ్యతిరేకంగా కథ మొదలుపెట్టి చివరివరకూ వ్యతిరేకంగానే రాసుకుంటూ పోవడం ఈ రచయిత్రి ప్రత్యేకత ఏమో అన్న అనుమానం ఈ కథ చదివినపుడు ధృవపడింది. “నేను ఆడదానిగా పుట్టినందుకు ఎన్నడూ విచారించలేదు” అంటూ మొదలవుతుంది ఈ కథ. ఈ వాక్యం చదవితే ఏం అనిపిస్తుంది. ఆడవాళ్ళందరూ తాము ఆడవాళ్ళుగా పుట్టినందుకు విచారించడం సాధారణం. ఈమె, అంటే ఈ కథ చెప్తూన్న పాత్ర (సీత) మాత్రం ప్రత్యేకం అని కదా! ఇందులో మొదటి వాక్యం కూడా పూర్తి నిజం కాదు. పోనీ అందులో కొంత నిజం ఉందనుకుని, కొంతమంది ఆడవాళ్ళన్నా కొన్ని సందర్భాలలోనన్నా తాము ఆడవాళ్ళమయినందుకు బాధపడతారన్న విషయాన్ని ఒప్పుకుని రెండో వాక్యం వైపు దృష్టి సారిస్తే రెండు ప్రశ్నలు వస్తాయి.

అందరు ఆడవాళ్ళలా కాక సీత ప్రత్యేకంగా ఉండడానికి కారణమేమిటి? ఆమెకి వున్న చక్కటి, ఆరోగ్యకరమైన పరిస్థితులా? లేక గొప్ప ఆత్మస్థైర్యమూ, ఆత్మవిశ్వాసమూ ఆమెకు వ్యక్తిగతంగా వున్న/ఏర్పరచుకున్న లక్షణాలా! ఈ రెండు ప్రశ్నలకీ కథనం ఇచ్చే సమాధానాలు చూద్దాం. మొదటిది పరిస్థితులు కదా, ఆ పరిస్థితులు చక్కగా, ఆరోగ్యకరంగా ఏం వుండవు. తండ్రి, తల్లి, అత్త అందరూ ‘ఆడముండ’ అన్న మాట పదే పదే వాడతారు తప్ప ఎప్పుడూ ‘మహాలక్ష్మి’ అంటూ ముద్దు చేయడాలూ అవీ వుండవు. సమాజంలో సాధారణ పరిస్థితుల గురించి మాట్లాడితే ఆడపిల్లలకయినా మగపిల్లలకయినా ఒకప్పుడు తిట్లు, మరొకప్పుడు మురిపాలు ఆయా సందర్భాలను బట్టి జరుగుతుంటాయి. అమాయకులైన వాళ్ళు తిట్టినపుడు అవమానపడి మెచ్చుకున్నపుడు గర్వపడతారు. బలమైన వ్యక్తిత్వం వున్న వాళ్ళు తామేమిటో తాము స్పష్టంగా తెలుసుకుని అవతలివారి మెచ్చుకోళ్ళని బట్టీ, తిట్లని బట్టీ కాక తమ ఆత్మవిశ్వాసాన్ని బట్టి తాము గర్వంగా, గంభీరంగా మసలుతూ వుంటారు.

ఆడపిల్లగా సీత పరిస్థితులు సమాజంలోని సాధారణ స్థితి క్న్నా హీనం (బిలో ఏవరేజ్). కనుక ఆమె గర్వపడడానికి కారణం ఆమె పరిస్థితులు కాదు. మరి కారణం ఆమె ప్రత్యేక వ్యక్తిత్వమా! ఆత్మవిశ్వాసమా! అదీ కాదనిపిస్తుంది కథలో ఆమె ప్రవర్తన చూస్తే. ఒక్క సంఘటన చెప్పుకుందాం. పెళ్ళయ్యి కడుపుతో వుండి ప్రసవం కోసం ఆసుపత్రికి వెళ్తుంది సీత. అక్కడ ఆమె భయమూ, ఆలోచనలూ చూస్తే అర్థం అవుతుంది ఆవిడ ధైర్యం కూడా బిలో ఏవరేజేనని.
అక్కడ సీత ‘నాకు భయమేస్తోంది’ అని నర్సుతో చెప్తే, నర్సు నవ్వుతూ అంటుంది కూడా. “భయమెందుకు? నువ్వొక్క దానివే కాదుగా. అందరూ కంటూనే వున్నారు.” అని. అప్పుడయినా ‘నిజమేకదా! అందరూ కంటూనే వున్నారు కదా! అందరికంటే ప్రత్యేకమైన నేను భయపడటమేమిటి! నాన్సెన్స్.’ అని ధైర్యం తెచ్చుకోదు.

పైగా భర్తకి కనీసం తను ఆసుపత్రికి వచ్చిన విషయమైనా తెలియదనీ, పుట్టింటినుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకొచ్చారనీ, ఈ రాత్రి పూట కంగారెందుకూ అంటూ అతనికి కబురు చేయలేదనీ ఉక్రోషపడుతుంది. “నేనొక్కదాన్నే మాట సాయం కూడా లేకుండా ఆ పెద్ద పనికి సమాయత్తమయ్యాను.” అంటుంది.
అది చదివితే అయ్యో పాపం! ఎంత ఆత్మన్యూనతా భావంతో బాధ పడుతోందీ పిల్ల అని జాలి వేస్తుంది. ప్రసవం సంగతి భర్తకి చెప్పకపోతే ఇక మాట సాయం కూడా లేనట్లేనా! శుభ్రంగా ఆసుపత్రిలో పురుడు పోసుకుంటూ!! భర్త ప్రక్కన లేకపోతే పిల్లని కూడా కనలేని అసమర్థతా! కథ మొదలు నుంచీ చివరి వరకూ నేను ఆడపిల్లనయినందుకు బాధపడలేదు. గర్వపడ్డాను అని పదే పదే చెప్పే ఈ పాత్రనీ, ఆమె మాటలనీ ఇంక ఎలా నమ్మడం!

ఇక ఒక్కసారి కథలో ఆ గర్వం ఎలా వర్ణించబడిందో కూడా పరిశీలిస్తే, కథ లోని కథనం లోని అస్పష్టత మరింత స్పష్టంగా అర్థమవుతుంది. ఎంతసేపూ మగపిల్లల్లా కర్రా, బిల్లా ఆడాలనీ, క్రికెట్ ఆడాలనీ, అవేవీ కుదరకపోతే ఇంటిదగ్గరే తన వయసున్న మగపిల్లలతో గోలీలాడాలనీ – ఇవీ సీత ఇష్టాలు. తనతోటి ఆడపిల్లలలా వుండడం, వాళ్ళతో కలవడం ఆమెకి యిష్టం వుండదు. మరి ఆమె గర్వం దేని గురించి? ‘ఆడపిల్లనయినందుకు గర్వం’ అంటే ఆడపిల్ల అనేమాటకి చిన్నారి సీత నిర్వచనం ఏమిటి? బాహ్యంగా, ఆచారాలూ అలవాట్లపరంగా ఆడపిల్లలు చేసేవేవీ ఆమెకి నచ్చవు. అవి కాకుండా అసలు స్త్రీ అంటే ఏమిటి? స్త్రీ శరీరం యొక్క శక్తి ఏమిటి? ప్రత్యేకత ఏమిటి? అని తెలిసే వయసూ ఆమెది కాదు. మరి అ వయసులో ఆమెకి గర్వం ఎందుకు? తెలియదు.

“వయసు పెరుగుతూన్న కొద్దీ నా శరీరంలో మార్పులు జరుగుతున్నాయి. శరీరం సాగుతోంది. కంఠం మృదువవుతోంది. వక్షం ఉబుకుతోంది. నడుము సన్నబడుతోంది. నా శరీరం చూసుకుని నేనే ముచ్చటపడ్డాను.” అంటుంది పన్నెండేళ్ళ సీత. “నేను ఒంటరిగా వున్నప్పుడో, స్నానం చేస్తున్నప్పుడో నా శరీరం చూసుకుని గర్వించేదాన్ని.” అంటుంది. పన్నెండేళ్ళ పిల్లకి ఇంకా పెద్దమనిషి కూడా కాని పిల్లకి శరీరంలో మార్పు చూసుకుని గర్వం ఎందుకు?
“ఆడవాళ్ళందరికీ జరిగే సంగతికి నేను సిగ్గుపడదల్చుకోలేదు. బాధ కూడా అనిపించలేదు. కొందరు నాతోటి పిల్లలు ఏడ్చినట్లు నేను ఏడవలేదు. నా చుట్టూ ఉన్నవారికి నా ప్రవర్తన వింతగా కనిపించింది.” అంటుంది పెద్దమనిషయిన సందర్భంలో. ఈ సందర్భంలో ‘వెచ్చగా ఎర్రగా స్రవించే రక్తం నేను స్త్రీనని నొక్కి చెప్పినట్లయింది.’ అన్న వాక్యం రాశారు రచయిత్రి. ‘అలా అనుకోవడానికి ఒక అమ్మాయి ఎలాంటి తిరుగుబాటు యుద్ధం చేయాలో ఆ వాక్యం రాయటానికి నేను అప్పుడంత యుద్ధం చేయాల్సివచ్చింది.’ అంటారు రచయిత్రి ఈ వాక్యం గురించి ముందుమాటలో.

అదే నిజమయితే మరి ఒక స్త్రీవాద రచయిత్రి తిరుగుబాటు చేసి కానీ, యుద్ధం చేసి కానీ రాయలేని వాక్యాన్ని పన్నెండేళ్ళ పిల్ల మొట్టమొదటిసారి రజస్వల అయినపుడే అనుకునే అవకాశం అసలు ఉంటుందా! అలాంటి పాత్ర అసహజాలకే అసహజం కాదా! నిజానికి ఆడపిల్లలెవరూ ఆ సంఘటనకి శోకాలు పెట్టి ఏడవరు. అది ఒక సంబర పడవలసిన విషయం అనీ, సాధారణమైన విషయమనీ ఈ కథలో నాయిక అంత హుషారు, తెలివితేటలూ లేని సాధారణమైన ఆడపిల్లలకి కూడా తెలుస్తుంది. ఎక్కడన్నా ఒకరిద్దరు భయపడినా పెద్దవాళ్ళు ఇందులో భయపడాల్సింది, ఏడవ వలసిందీ లేదని నచ్చచెప్తారే కానీ భయపెట్టరు. సంతోషంగా ఉన్నవాళ్ళకి కూడా పని గట్టుకుని ఏడవమని చెప్పరు.

‘ఇలా రాయటం ద్వారా ఈ సంస్కృతిపై తిరుగుబాటు చేస్తున్నాను అని నమ్మి నేనీ కథలు రాశాను.’ అన్నారు ముందుమాటలో రచయిత్రి. కానీ నిజానికి దీన్నొక ఆనందకరమైన విషయంగా భావించి ఇలాంటి సందర్భాలలో సంబరం చేయడమూ, నలుగురికీ చెప్పడమే సంస్కృతి కదా. ఆధునిక మహిళే ఈ విషయాన్ని సిగ్గుపడవలసిన విషయంగా, దాచిపెట్టవలసిన వ్యక్తిగత విషయంగా భావిస్తోంది కదా! మరి ఎందుకిలా ప్రతి విషయాన్నీ తిరగేసి చెప్తారు స్త్రీవాద కథలలో!! ఆలోచించాలి.

Rajakeeya Kathalu
Volga

You Might Also Like

5 Comments

  1. madhavi

    రాగ మంజరి గారు వోల్గా గారి రాజకీయ కధల పైన వ్రాసిన విశ్లేషణ చదివాక నేను కూడా కామెంట్ చేయకుండా ఉండలేక వ్రాస్తున్నాను . మంచి పాఠకులే మంచి విమర్శకులు.రాగమంజరి గారు మంచి పాఠకులు అని ఒప్పుకోవాలి.
    నేను వోల్గా గారి సీత జడ చదివాక నాలో కలిగిన భావాలు వ్రాస్తున్నాను . సీత తనజుట్టుకి వచ్చిన గుర్తింపు ఆధారంగా తన గుర్తింపు ఏర్పరచుకుంది .(లేదా సమాజం ఏర్పరచింది )తన జడే తను అనుకుంది. కాని ఈ గుర్తింపు తన చుట్టూ వున్నసమాజం తను పురుషుడుని ఆకర్షించే సమర్ధత యొక్క కొలమానంగా ఇచ్చినదని అర్ధం చేసుకోలేక పోయింది.ఆమె తన జుట్టు కాక తనదైన వ్యక్తిత్వము , ఆలోచన ఎర్పరచుకోనలేకపోయింది కనుకనే ఆమె భర్త జుట్టును విసుక్కుంటే బాధపడింది.తరువాత తనకు జీవితములో ఎదురయిన ఒడిదుడుకులలో ఎక్కడా తనకు అక్కరకు రాని,ఎంతోకొంత ఇబ్బంది మాత్రమె కలిగించిన ఈ జుట్టుకి నిజంగా అంత ప్రాధాన్యత ఇచ్చేలాగా చేసినది ఈ సమాజమే అని ఆలోచన,వివేకము కలిగేనాటికి ఆమె జీవితం చివరి దశ లోకి ప్రవేశిస్తుంది.
    ఈ కథలు బహుశా వోల్గా గారి రచనా ప్రస్థానంలో తొలి రచనలై ఉండవచ్చు. ఆవిడ కథనం పటిష్టంగా లేని మాట నిజమేగాని ,ఆ విషయం కధ యొక్క మూల ఉద్దేశ్యాన్ని ఏ మాత్రమూ భంగపరచలెదని నిస్సందేహంగా చెప్పవచ్చు. ,

  2. Kalyani S J

    చాలా చక్కగా విశ్లేషించారు. కానీ ఒక కథ విషయంలో మీరు అవసరమైన దానికంటే కాస్త ఎక్కువ విమర్శ చేసారనిపించింది. కథ ఎప్పుడో చదివాను. సరిగ్గా గుర్తులేదు. వ్యాసం లో మీరు రాసిన దాని మీదే ఆధారపడి ఇలాటి అభిప్రాయం కలిగింది.
    ఆర్తి కథలో…”పైగా భర్తకి కనీసం తను ఆసుపత్రికి వచ్చిన విషయమైనా తెలియదనీ, పుట్టింటినుంచి నేరుగా ఆసుపత్రికి తీసుకొచ్చారనీ, ఈ రాత్రి పూట కంగారెందుకూ అంటూ అతనికి కబురు చేయలేదనీ ఉక్రోషపడుతుంది. “నేనొక్కదాన్నే మాట సాయం కూడా లేకుండా ఆ పెద్ద పనికి సమాయత్తమయ్యాను.” అంటుంది.
    అది చదివితే అయ్యో పాపం! ఎంత ఆత్మన్యూనతా భావంతో బాధ పడుతోందీ పిల్ల అని జాలి వేస్తుంది. ప్రసవం సంగతి భర్తకి చెప్పకపోతే ఇక మాట సాయం కూడా లేనట్లేనా! శుభ్రంగా ఆసుపత్రిలో పురుడు పోసుకుంటూ!! భర్త ప్రక్కన లేకపోతే పిల్లని కూడా కనలేని అసమర్థతా!” అని రాసారు కదా… దానిలో మీరన్న ఆత్మన్యూనత నాకు కనిపించలేదు.

  3. మంజరి లక్ష్మి

    ” స్త్రీలు జీవితంలో ఇబ్బందులు పడుతున్నవిషయం వాస్తవమే.కానీ వీరుచెప్పినట్లుకాదు. జీవితం సిద్ధాతం ప్రకారం ఉండదు అన్నీతిరగేసి చెప్పటం వెనుక ఉన్నకారణం ఇదే.”
    రచయిత్రి తను చూసిన వాస్తవాలను(స్త్రీలు జీవితంలో ఇబ్బందులు పడుతున్నవిషయం) అర్ధం చేసుకొని దాన్ని సాహిత్యంలోకి ఎక్కించారనుకున్నా, వాటిని తన భావాలకనుగుణంగా, తన కోణంలోనే కదా చెప్తారు. రచయిత్రి తన ముందు మాటలో కూడా అదే కదా చెప్పింది. అంటే వాస్తవాలను సాహిత్యంగా మార్చినప్పుడు ఆ రచయిత్రి తెలిసి రాసిన తెలియక రాసిన వాటి వెనక తప్పకుండా ఒక సిధాంతం ఉండే ఉంటుంది. వాస్తవంగా మనకు తెలిసిన విషయాలను రచయిత్రి ఎలా తిరగేసి చెప్పారో రాగమంజరిగారు సోదాహరణం గానే వివరించారు.
    “భాష వ్యాకరణానుసారం ఉండనట్లు” – వ్యాకరణ శాస్త్రం చదివినా చదవకపోయినా కూడా మనం మాట్లాడే భాష వెనుక వ్యాకరణం ఉండే తీరుతుంది. చదువురాని తల్లి కూడా తన పిల్లవాడు “సీత అన్నం తిన్నాడు” అంటే వెంటనే దాన్ని సరిదిద్ది”సీత అన్నం తిన్నది” అనాలిరా అని తన కుర్ర వాడికి చెపుతుంది. ఆ తల్లి తనకి తెలియకుండానే భాషలో ఉన్న వ్యాకరణాన్ని కుర్రవాడికి చెప్పినట్లే కదా.

  4. kameswari yaddanapudi

    రాగమంజరిగారికి ఓపికగా ప్రతికథను ఎందుకు బాగోలేదో తర్కించి చెప్పినందుకు అభినందనలు. స్త్రీలు జీవితంలో ఇబ్బందులు పడుతున్నవిషయం వాస్తవమే.కానీ వీరుచెప్పినట్లుకాదు. జీవితం సిద్ధాతం ప్రకారం ఉండదు. భాష వ్యాకరణానుసారం ఉండనట్లు. అన్నీతిరగేసి చెప్పటం వెనుక ఉన్నకారణం ఇదే.

  5. మంజరి లక్ష్మి

    చాలా బాగా రాశారు రాగ మంజరి గారు. ఈ కధలన్నీ నేను చదివాను. ఏమిటో అసహజంగా ఉన్నాయనిపించాయి కానీ ఇంత ఇదిగా విశ్లేషణ చేసుకోవటం నా వల్ల కాలేదు. మీరు చాల బాగా తార్కికంగా విశ్లేషణ చేశారు. అన్నిటికన్నా చివరి వాక్యం ” మరి ఎందుకిలా ప్రతి విషయాన్నీ తిరగేసి చెప్తారు స్త్రీవాద కథలలో!! ఆలోచించాలి” అనేది నిజం. పాత్రలన్నిటినీ గాలిలో నించోపెట్టి రాసినట్లుగా ఉంటాయి తప్ప అటు పూర్వపు వాటిని వ్యతిరేకించినట్లు ఉండదు(అవే అవయవాల వర్ణనలు ఈమె రాశారు), కొత్తగా ఎలా ఉండాలి అనేది చెప్పినట్లు ఉండదు. ఈ స్త్రీవాదులతో అదే తలనొప్పి. అందుకనే రంగనాయకమ్మ గారు వీళ్ళని బూర్జువా స్త్రీ వాదులంటుంటారు. పాతివ్రత్యం గురించి మీరు రాసిన తర్కం నా కంతగా అర్ధం కాలేదు. వెలుతురులోకి కధలో ఆమె ఇంకొకనితో సంబంధం పెట్టుకోవటంతో ఆమె భర్తని ఎదిరించే ధైర్యం వచ్చిందని రాశారన్నట్లు గుర్తు. అక్రమ సంబంధం ఉంటేనే భర్తను ఎదిరించగలరనుకోవటం పొరపాటే అయినా, పాతివ్రత్యం అనే మాట వాడేవాళ్లు సహజంగా `భర్త మాట ప్రకారం నడుచుకునే వాళ్ళు’ అనే అర్ధంలో వాడతారు కదా! ఈమె నవీన యువతి, ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఇది నవీన కాలం పాతివ్రత్యం అవచ్చుకదా!

Leave a Reply