అశ్వమేధము – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక
*******
ఇది పురాణవైరగ్రంథమాల లో ఆరవ నవల.

“మౌర్యవంశపు చివరి రాజు బృహద్రథుడు. అతడు స్త్రీలోలుడై రాజ్యంలో శాంతి లేకుండా చేస్తే, అతని సేనాపతి పుష్యమిత్రుడు – సామవేదీయ బ్రాహ్మణుడు – అతనిని వధించి రాజ్యాన్ని గ్రహించాడు. ఈయన యశ్వమేథము జేసి సర్వ భారతదేశమును తన అదుపులోనికి తెచ్చి మరలా వైదికమతాన్ని ప్రతిష్టించాడు. అంతకు నాలుగు వందల ఏళ్ళ క్రితం నందుడు సర్వక్షత్రియ రాజవంశాలనీ నిర్మూలించి దేశము శూద్రరాజ్యము చేయగా, బౌద్ధమతం వృద్ధి పొందింది. పుష్యమిత్రుడు ఆ స్థితిని తొలగించి వేదమతాన్ని స్థాపించాడు.” ఇవి ఈ నవల పీఠిక లో ఇచ్చిన వివరాలు. ఇంతవరకు చరిత్రాంశమనీ మిగిలినది కల్పన అనీ చెప్తారు రచయిత.

నవల పేరు “అశ్వమేథము” కదా! అందుకేనేమో ఈ నవల ‘అది మహా బలిష్టమయిన అశ్వరాజము’ అన్న వర్ణన తోనూ, ఆ అశ్వాన్ని వధించడంతోనూ మొదలవుతుంది.

నవల మొదలయ్యేసరికి ఒక అశ్వాన్నీ, దాని యజమానినీ కూడా కొందరు బంధించి హింసిస్తూ వుంటారు. ఆ అశ్వాన్ని వారు పెడుతున్న హింసని చూస్తూ, తన దెబ్బలకి మరొక ప్రక్కన బాధపడుతూ ఆ బంధితుడు చేసే ఆలోచనతో నవల మొదలవుతుంది.

బాధపడుతూ బంధితుడు యిలా అనుకుంటాడు. “మానవుని యొక్క బాధ – శారీరక మయిన దధికమయినదా? మానసికమయిన దధికమయినదా? మానసికమయిన దెంతయైన నోర్చికొనవచ్చునేమో! శారీరకమైన దింతయైన నోర్చికొనుటకు సాధ్యము కానట్లున్నది.” అని.

ఇది ఈ నవల చదవక ముందు ఎన్నోసార్లు నాకు కూడా కలిగిన భావన కావడం వల్లనేమో నవల మొదలు పెట్టగానే కనబడిన ఈ వాక్యాలు నన్ను చాలా ఆకర్షించాయి.

మానసిక మయిన బాధలో ఉన్న ఒక సహ్యత శారీరకమయిన బాధలో లేదన్న విషయాన్ని రచయిత వివరించిన తీరు సమంజసంగా అనిపించింది.

ఇంతకీ ఆ బంధితుడు ఎవరంటే- మౌర్యవంశంలో చివరివాడైన బృహద్రధుడి వద్ద మహాసేనాపతిగా వున్న పుష్యమిత్రుడికి మేనల్లుడు. పుష్యమిత్రుడు బ్రాహ్మణుడు. వైదిక మతాభిమానం వున్నవాడు. ఇపుడు హింసించబడుతున్న ఉత్తమాశ్వం నిజానికి పుష్యమిత్రునిది. అతని వద్ద అటువంటి అశ్వములు రెండు వుంటాయి. అవి కవలలు. వాటిలో ఒకదానిని పుష్యమిత్రుడు కూడా ఎపుడూ అధిరోహించడు. రెండవ అశ్వమిది.

అతని మేనల్లుడికి ఆ అశ్వం పై మోజు వుంటుంది. యవన రాజులకు రాయబారం పంపాలని పుష్యమిత్రుడు అన్నపుడు, రాయబారిగా తానే వెళ్తానని బయల్దేరతాడు అతని మేనల్లుడు. పుష్యమిత్రునికి తెలియకుండా అతని గుర్రాన్ని తీసుకు వెళ్తాడు. ఆ గుర్రం అక్కడ అలా యవనులతో హింసించబడి మరణించడంతో మేనమామకు మొహం చూపలేక ఇక వెనక్కి రాడు. ఈ అశ్వం యొక్క జాతకం ఇలా ఉంటుందనీ, అది ఇలా యవనుల చేతిలో మరణిస్తుందనీ నారాయణభట్టు అనే జ్యోతిర్విద్యావేత్త మొదటే చెప్తాడు పుష్యమిత్రునితో.

ఈ కథ ఇక్కడ ఆపి కొంచెం ప్రక్కకి వెళ్తే…

అభిసార దేశంలో పశ్చిమాన పర్వతాల మధ్యలో జనం సులభంగా వెళ్ళలేని చోట వున్న ఒక పర్వత గుహలో ఒక పండితుడు వుంటాడు. ఆటవికమయిన, పశుప్రాయమైన కౄర మృగాలవంటి అక్కడి జనులలో కొన్ని విద్యలు వున్నాయి. ఒకటి ఖద్గ విద్య. రెండవది వైద్యం. మూడవది జ్యోతిషం.

ఒక వేయి సంవత్సరములకు పూర్వ మాజాతి భారత దేశీయులే. వారు ఆర్యమత విరోధులై వర్ణాశ్రమ వ్యవస్థా సంరక్షకులయిన రాజులచే వెడలగొట్టబడి, కుటుంబములతో లేచి వచ్చి – తృణకాష్ఠ జలసమృద్ధికి మిక్కిలిగా లోపము లేని యవనరాజ్యముల వారు కూడ వారిని నిలువనీయక పోవుటచేత, ఈ దేశమునకు వచ్చి నివాసమేర్పరచి కొనిరి. వారిలో కొందరు పూర్వము జ్యోతిర్వేత్తలు.

అలాంటి ఒక వంశానికి చెందిన పండితుడు ఆ కొండ గుహలోనున్నవాడు. ఆ వంశము యొక్క మూలపురుషుని పేరు విలయైనసుడు. అది వాడి అసలు పేరు కాదు. వానిని బహిష్కరించిన కురువంశరాజు వాని కాపేరు పెట్టాడు. విలయమనగా ప్రళయకాలము. ఏనస్సనగా పాపము. విలయకాలమునందెట్టి పాపముండునో అట్టి పాపము వానియందున్నదని ఆ కౌరవరాజు వానికా పేరు పెట్టాడు. ఆ పేరు కొన్నాళ్ళకు మారిపోయి వెలియోనస్ అయింది.

ఈ వెలియోనసుల వంశము వారు మొదట ఉత్తరజ్యోతిష ప్రాంతంలో నివసించే వారు. భారతయుద్ధమైన తరువాత వేయి యేండ్లు జరిగిన తర్వాత ఆప్పటి వెలియోనసు వంశస్థుడు ఉత్తరజ్యోతిష రాజుకు ఒక జోస్యం చెప్పాడు. ఆ రాజుకు లేక లేక పుట్టిన కొడుకు భవిష్యత్తు చెప్పమంటే అతడు రెండేళ్ళకే చనిపోతాడని చెప్తాడు. అది నిజంగానే జరిగినపుడు ఆ రాజు కోపించి వెలియోనసును వధించమని ఆజ్ఞాపిస్తాడు. అయితే వెలియోనసు అక్కడి సేనాపతికి కూడా అలాగే మరొక జోస్యం చెప్తాడు. అది మంచి విషయం కనుక సేనాపతికి సంతోషం. వెలియోనసుపై అనుగ్రహం. కనుక రాజు చంపమని ఆజ్ఞాపించినా సేనాపతి వెలియోనసును చంపకుండా తప్పిస్తాడు.

అప్పుడు అతను అక్కడక్కడా తిరిగి చివరికి అభిసారదేశం లోని ఈ పర్వతంలో సూర్యకిరణ పాతము రేఖలుగా సహజముగా విభజింపబడి కాలపునడకను నిరూపించి చూపిస్తోందనీ ఇక్కడ తమ విద్య యొక్క పరంపర చెడిపోకుండా ఉండటానికి వీలుగా ఉందనీ గుర్తించి ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు.

అది జరిగి ఆరువందల ఏళ్ళయింది. అప్పుడు వచ్చిన వెలియోనసు భార్యతో ఒక కొడుకుతో వచ్చాడు. కొన్ని గ్రంథాలు కూడా తీసుకువచ్చాడు తనతో. ఆ గ్రంథములు తొలినాడు సంస్కృత భాషలో కలవు. ఆ భాషోచ్చారణము తరతరములుగా వికారము పొంది, యుత్తర జ్యోతిష ప్రభువు చేత వెలియోనసు వధింపబడుట కాజ్ఞాపించుటకు నేబది యేండ్లకు పూర్వము క్రొత్త భాష వలె సిద్ధపడి, కంఠస్థములైన ఆ గ్రంథములు రాగిరేకుల మీద వ్రాయబడెను. ఆ వ్రాసిన వ్రాత చదివినచో ఆ అక్షరములు బ్రాహ్మీలిపి కాదు, మరి ఏ లిపియు కాదు. అనేక శబ్దములకు ధాతువులకు సంస్కృత భాషారూపము జెడిపోయి యవనభాషాకృతి వచ్చెను.

ఆ వంశం వారు ఎక్కడ వున్నా తమ ఉనికి యవన రాజ్యాధికారులకి తెలియచేస్తూ వుంటారు. వెలియోనసును బహిష్కరించిన కురురాజు పేరు నిచఖ్నుడు. ఆయన యుదిష్టరుని నుండి ఏడవవాడు. జనమేజయ మహారాజు కుమారుడు శతానీకుడు. ఆయన కొడుకు అశ్వమేధ దత్తుడు. ఆయన కొడుకు అథిసీమ కృష్ణుడు. ఆయన కొడుకు నిచఖ్నుడు.

మహాజ్యోతిర్వేత్త అయిన వెలియోనసుకు భారతదేశముపై, వైదికమతముపై వున్న పగ తరాలు మారినా ఇంకా కొనసాగుతూనే వుంది. అతని విద్య కూడా అతని వంశంలోని తర్వాతి తరాల వారికి అలాగే అందించబడుతోంది. వారికి భారతదేశ జాతకం క్షుణ్ణంగా తెలుసు కనుక భారతదేశ గ్రహస్థితి ఎపుడెపుడు బాగాలేదో అపుడపుడు యవనరాజులచే దండెత్తింప చేసి వైదిక మత నిర్మూలనకు ప్రయత్నం చేయాలని వారి ప్రతిజ్ఞ.

ఈ గుహలో ఇలాంటి కుటుంబం ఉందన్న విషయం ఎవరికీ తెలియదు. వెలియోనసు పథకము ప్రకారము యవన రాజులందరూ ఒక పరిషత్తుగా ఏర్పడ్డారు. దానికొక కార్యదర్శి వుంటాడు. వాడొక్కడే రహస్యముగా వెలియోనసు దగ్గరికి రాకపోకలు జరుపుతూ వుంటాడు.

అతను ఠింఠాకరాళుడు. వెలియోనసు కొడుకు పేరు మళ్ళీ వెలియోనసే. అలాగే ఠింఠాకరాళుని కొడుకు ఠింఠాకరాళుడే. చిన్న వెలియోనసు తండ్రి దగ్గర విద్య నేర్చుకుని వివాహవయసుకు వచ్చినపుడు అతని కోసం రహస్యంగా ఒక పిల్లను దొంగిలించి ఈ గుహకి చేర్చడం ఠింఠాకరాళుని కర్తవ్యాలలో ఒకటి. ఆ పిల్లని వివాహమాడి వెలియోనసు కొడుకును కంటాడు. ఇది ఇలా కొనసాగుతుంది.

అయితే ఇలా జరుగుతోందన్న రహస్యం ఠింఠాకరాళుడు ఎవరికీ తెలియనీయకూడదు. వెలియోనసు వుంటున్న పెద్ద గుహలోనుండి మరో నాలుగయిదు గుహలలోనికి త్రోవలు వున్నాయి. అతని గ్రంథములు చివరి గుహలో దాచబడి వుంటాయి. భార్యాపుత్రులూ అందులోనే వుంటారు. మొదటి గుహలో నుంచి మరోగుహ లోకి మార్గం ఉందన్న విషయమే ఎవరికీ తెలియదు.

ఈ వెలియోనసులందరూ జటాధారులు. తండ్రి చనిపోయి కొడుకు మరల వెలియోనసు అవుతుండగా, యవనరాజ్య పరిషత్తు నుండి ఎవరైనా వస్తే వారికి ఒక్క వెలియోనసే కనబడతాడు. ఇంతమంది వెలియోనసులు వున్నారని తెలియదు.

కనుక వెలియోనసు నిత్యజీవి. అతను వేయియేండ్ల నుండి బ్రతుకుతున్నాడు. అతను ఆహారాన్ని భుజించడు. నిదురపోడు. వానికి జరామరణాలు లేవు. అతనికి కాలజ్ఞానము జ్యోతిర్విద్యా ప్రభావం చేత కలగలేదు. అతను మహాయోగి. అతనికి ఆ జ్ఞానం సహజంగా వుంది. ఇలాంటి ప్రథ పుట్టించి యవనరాజ్య పరిషత్తును స్వాధీనం చేసుకోవడానికి ఠింఠాకరాళుడితో కలిసి ఏర్పాటు చేసుకున్నాడు వెలియోనసు.

ఎవరికి దర్శనం కావాలన్నా ఠింఠాకరాళుడే చేయిస్తాడు కాబట్టి రహస్యం బయటపడదు. ఇపుడు మళ్ళీ మొదటి కథకి వద్దాం.

పుష్యమిత్రుని మేనల్లుడు యవనులచే బంధింపబడినాడు కదా! అపుడు వారి నాయకుడైన ఠింఠాకరాళుడు మొదట అతడిని చంపమని ఆజ్ఞాపిస్తాడు. అయితే అతను తన జ్యోతిర్విద్య ప్రతిభతో ఠింఠాకరాళుడిని ఆశ్చర్యపరుస్తాడు. అతన్ని ఆకర్షించి చావు తప్పించుకుని అతని ఇంటిలోనే ఆశ్రయం సంపాదిస్తాడు. విశ్వాస పాత్రుడు అవుతాడు.

ఠింఠాకరాళుడికి ఇద్దరు పిల్లలు. భార్య చనిపోయింది. ముసలి తల్లి వుంది. తను పెళ్ళాడాలనుకున్న ఒక యువతి మరొకరికి భార్య అయితే ఆమె భర్తపై అబద్ధపు నేరం చూపించి రాజాజ్ఞతో అతనిని చంపించి ఆమెను తన రెండవ భార్యగా చేసుకుంటాడు ఠింఠాకరాళుడు. ఆమె పేరు ఆయేషా. ఆమెను వదిలిపెట్టి వుండడం యిష్టం లేక వెలియోనసు దగ్గరికి వెళ్ళవలసి వచ్చినపుడు తన బదులుగా పుష్యమిత్రుని మేనల్లుడిని పంపుతాడు ఠింఠాకరాళుడు.

పుష్యమిత్రుని మేనల్లుడు పూర్తిగా యవనులలో కలిసిపోతాడు. యవనులలో కలిసిపోయాక అతని పేరు పుస్-మిరత్-ఫా-కినోజ్ అవుతుంది. కినోజ్ శబ్దాన్ని అపుడపుడూ ఖోంజి అని కూడా ఉచ్ఛరిస్తారు. అది పుష్యమిత్ర భాగినేయ అన్న శబ్దమునకు మార్పు. పుష్య శబ్దము “పుస్” అయినది. మిత్రభా “మిరత్ ఫా” అయింది. మిగిలిన అక్షరములు ఖోంజి అయ్యాయి.

అతను గొప్ప జ్యోతిర్విద్యావేత్త కనుక తన ప్రతిభతో మిగిలిన యవనరాజులని కూడా ఆకర్షిస్తాడు. అయేషాకీ అతనిపై ఆకర్షణ. అటు వెలియోనసు భార్యకీ ఆకర్షణ. ఠింఠాకరాళుని పిల్లలకీ, వెలియోనసు కొడుక్కీ కూడా అతనంటే యిష్టం.

అతడు ఇక్కడ ఠింఠాకరాళుని ఇంటిలో వున్నపుడు ఆ యింటిలో ఒక సభ్యుడిలా, అటు వెలియోనసు వుండే గుహకి వెళ్ళినపుడు వాళ్ళలో ఒకడిలా కలిసిపోతాడు. అందరికీ ప్రీతిపాత్రుడవుతాడు.

ఠింఠాకరాళుడు దాచిన వెలియోనసు రహస్యం బయటపడినపుడు ఒక యవన సేనాపతి ఠింఠాకరాళుని తల నరికేస్తాడు. ఠింఠాకరాళుని ఆస్తి, పదవి మిరత్ఫాఖోజ్ కి రావడం… ఆస్తితో పాటు ఠింఠాకరాళుని భార్య ఆయేషా కూడా ఇతని భార్య అవడం జరుగుతాయి. ఆమెకి కొన్ని మ్లేచ్ఛ మంత్రాలు తెలుసు. చాలా శక్తివంతమైన స్త్రీ. పదిమంది అన్నదమ్ములు. ఆమె మిరత్ఫాఖోజ్ ను పంచ యవన రాజ్యాలకు రాజును చేయాలనుకుంటుంది. చేస్తుంది! అది ఎలా జరుగుతుందన్నది ఒక ఉత్కంఠ భరితమైన కథ.

ఈ కథ అంతా నేరుగా చెప్పబడదు. మిరత్ఫాఖోజ్ పుష్యమిత్రునికి, నారాయణభట్టుకి, మరొకరిద్దరికి లేఖలు వ్రాస్తాడు. ఒక్కొక్కరికి వ్రాసిన లేఖలో కొంత కొంత కథ చెప్తాడు.

తన లేఖలలో మిరత్ఫాఖోజ్ తన జీవితానికి సంబంధించిన విషయాలే కాక ఇక్కడ బృహద్రధుడి రాజ్యంలో ఏం జరగబోతోందో కూడా తన జ్యోతిర్విద్యా ప్రభావంతో ముందే చెప్తాడు. అ కథ చూద్దాం.

బృహద్రధుడు వృద్ధుడు, స్త్రీలోలుడు. అతని పినతల్లి కుమారుడు సింహకేతనుడు, మేనత్త కుమారుడు శ్వేతాశ్వుండు. వాళ్ళిద్దరూ దుష్టులు. వాళ్ళు అన్ని రాజకార్యములలో జోక్యం చేసుకుంటూ వుంటారు. వాళ్ళ దౌర్జన్యం రాజ్యంలో బలిసిపోతూ వుంటుంది.

వీళ్ళని మించినవాడు శతానీకుడు. అతని చెల్లెలు కుముద్వతి. ఇరవై ఏండ్ల పిల్ల. ఆమెను నూరేండ్ల వయసున్న రాజు పెళ్ళాడి దివారాత్రాలు ఆమెతోనే వుంటూ వుంటాడు. శతానీకుడు, కుముద్వతి – వీరిద్దరి తల్లి ఒక కల్లు అమ్మే స్త్రీ. ఆమెని ఒక బ్రాహ్మణుడు పెళ్ళి చేసుకుంటాడు. సురాపాక విద్యలో అతను నిష్ణాతుడు. తల్లిదండ్రులు చాలా ధనం సంపాదిస్తారు కానీ శతానీకుడు వ్యర్దుడిగా తయారవుతాడు. బృహద్రధుడికి సంతానం లేదు. కనుక కుముద్వతి అతని భార్య అయితే ఆమె సంతానం కానీ, లేకపోతే శతానీకుడు కానీ రాజ్యానికి వారసులవుతారన్న ఊహతో కుముద్వతిని రాజు కంట పడేలా చేస్తాడు ఆమె తండ్రి. ఆమెని చూచినంతనే మోహించి రాజు పెళ్ళి చేసుకుంటాడు. రాజుకి పుష్యమిత్రుడంటే అభిమానం వుంటుంది. పుష్యమిత్రుడికీ రాజంటే అభిమానం వుంటుంది.

తన చేతిలో రాజు మరణిస్తాడనీ, తాను రాజవుతాడనీ – ఇది తన జాతకంలో ఉందనీ తెలుసుకున్న పుష్యమిత్రుడు మొదట నవ్వుకుంటాడు, అలా ఎలా జరుగుతుందని. కానీ కొన్ని చిత్రమైన సంఘటనల తర్వాత అదే జరుగుతుంది.

కుముద్వతికి కూడా కుట్రలో భాగం వుందని అనుకుంటారు మొదట దేశ ప్రజలంతా. పుష్యమిత్రుడు కూడా. కానీ ఆమె అమాయకురాలనీ, సౌశీల్యవతి అనీ, తననీ రాజుని రక్షించాలని ప్రయత్నిస్తోందనీ తెలుస్తుంది పుష్యమిత్రుడికి.

రాజు, శతానీకుడు మరణించే సన్నివేశం చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఆ తర్వాత ఆమె తన మనసులోని భావాలన్నీ చెప్పడం, తనని రాజ్యకాంక్షతో తన స్వంత తల్లిదండ్రులే ఎంత దారుణంగా హింసిస్తారో చూపడం – అదంతా అక్కడి జనులతో పాటు పాఠకుల హృదయాలనీ ద్రవింప చేస్తుంది.

ఇదంతా ఇలా జరుగుతుందని మిరత్ఫాఖోజ్ తిథి వివరాలతో సహా తన లేఖలలో ముందే చెప్తాడు. రాజుని చంపిన దోషం పోగొట్టుకోవడానికి పుష్యమిత్రుడు అశ్వమేథ యాగం చేయాలని సూచిస్తాడు. యాగం చేయించడానికి మేథావిభట్టు అనే కాశ్మీర దేశ పండితుడిని తానే పంపుతాడు.

అశ్వంతో పాటు పుష్యమిత్రుడి కుమారుడు అగ్నిమిత్రుని పంపమని చెప్తాడు. అగ్నిమిత్రునిది చాలా గొప్ప జాతకమనీ, ఉదయన మహారాజు జాతకం అంత గొప్పగా ఉందనీ, సంస్కృత సాహిత్యంలో అతని పేరు శాశ్వతంగా నిలిచిపోయే యోగం ఉందనీ చెప్తాడు పుష్యమిత్రునికి వ్రాసిన లేఖలో మిర్తఫా.
అన్నిటికన్నా ముఖ్యమైన దేమిటంటే అశ్వమేథయాగంలో నవల మొదట్లో చనిపోయిన గుర్రానికి కవల గుర్రమైన రెండవ గుర్రం వాడబడుతుంది.

ఆ అశ్వం యవనరాజ్యంలో ప్రవేశించడం, ఎవరైతే మొదటి గుర్రాన్ని చంపారో వాళ్ళందరినీ ఈ రెండవ అశ్వం ద్వారా చంపించి మిర్తఫా ప్రతీకారం తీర్చడం జరుగుతుంది.

మిర్తఫా పుష్యమిత్రునికి వ్రాసే ఒక లేఖతోనే నవల పూర్తవుతుంది. ఆ లేఖకీ, నవలకీ కూడా చివరి వాక్యాలు ఇలా ఉంటాయి. “…నా జీవుని భవిష్యత్తు నాకు తెలియదు. అచ్చముగ నేననుకొనుట లేదు కాని, మహారాజా! నాలో నొక విచిత్రమయిన కదలిక కల్గుచున్నది. ఏదో మార్పు కలుగుచున్నట్లున్నది. నన్నింతటితో భగవంతుడు వదిలిపెట్టినట్లు తోచుట లేదు. వెలియోనసుల జీవులు వచ్చి నన్నావహించినట్లున్నది. నేను మరల వారు చేసిన పనిని చేయవలసినయట్లు భగవంతుని యభిప్రాయమేమో! ఆ పని ఏమైనను అది తెలిసి చేసెడి వైదిక ద్వేషము, తెలిసి సాధింప బూనెడు పురాణవైరము….”

ఈ నవలలో ఆసక్తికరంగానూ, ఆలోచనాత్మకంగానూ అనిపించిన విషయాలు చాలా వున్నాయి. మేథావిభట్టు, నారాయణభట్టు అనే యిద్దరు పండితుల చేత రచయిత సంభాషణల రూపంలో చాలా విషయాలు చెప్పిస్తారు.

భారతదేశం లోని శాస్త్రములలో కొన్ని ఈశ్వరుని అంగీకరించవని, వానిలో ప్రధానములయినవి సాంఖ్యము, న్యాయము. జ్యోతిశ్శాస్త్రము అని చెప్తూ వాటిని వివరిస్తారు. సాంఖ్యము ప్రధానముగా నిరీశ్వరమయినది. న్యాయము పదార్ధ ప్రతిపాదకమయి పరమేశ్వరుని బహిష్కరించినది. జ్యోతిశ్శాస్త్రము గ్రహచారవశమయి ఈశ్వరుని గాదన్నది. ఈ మూడు శాస్త్రములయందు నిష్ణాతులైన వారిలో నాస్తికులు బయలుదేరుట చేత, వారును వారి యనుయాయులును వేదధర్మ వ్యతిరేకులగుట చేత, వారిని క్షత్రియ రాజులు బహిష్కరిస్తూ వచ్చారు.

మరొక చోట అసలు శాస్త్రం అంటే ఏమిటో చాలా గొప్పగా చెప్తారు. “శాస్త్రమనగా విశేష పరిజ్ఞానముతో గూడిన లౌకికమే. లౌకిక మన్నచో నేమియో తెలియని మూఢులు శాస్త్రజ్ఞానమును నిందింతురు. శాస్త్రము లెచట నుండి వచ్చినవి? ప్రధానముగా లోకమునుండి వచ్చినవి. అలౌకిక పరిజ్ఞానము లౌకిక జ్ఞానముతో సంబంధింప జేయుటయే శాస్త్రము….. ఆలోచన గాఢముగ నయిన కొలది శాస్త్ర మగుచున్నది. స్థూలముగా నయినకొలది లోకమగు చున్నది. లోకము స్థూల సూక్ష్మాంశల చేత విభక్తమయి యున్నది. సూక్ష్మమయినది లోకము కాకపోలేదు. జడులు (ఆలోచన లేని వారు) స్థూల విషయ నిమగ్న బద్ధులగుట చేత శాస్త్రము వారియందవహేళనము నందుచున్నది.”

ఎప్పటికీ గుర్తుపెట్టుకోదగిన వాక్యం ఒకటుంది. – “శాస్త్రజ్ఞానము లోకమునకు బాహిరమైనది కాదు. లోకజ్ఞానములోని మేలిమియే శాస్త్ర జ్ఞానము.”

అద్భుతమనిపించే ఒక వివరణా వుంది. – “వాని కీర్తి దశదిశల యందు వ్యాపించినది యన్న వాక్యమున కర్ధమేమి? ఏ యూరు పోయినను వానిని గూర్చి ప్రశంసించు మానవులున్నారనియే యర్ధమా? కీర్తి యను యొక పదార్థము గగనము నందు వ్యాపించి యున్నదని అర్ధమా? వాడు మర్యాద కలవాడనగా మర్యాదాలక్షణము ప్రదర్శించు నవసరము వచ్చినపుడు వాడట్లు ప్రవర్తించునని అర్ధము. ప్రవర్తించిన సమయమునందు సరే. తదితర సమయముల, మరియొక గుణము వలె దానికొక స్థితియున్నట్లు లోకము భాషించుచున్నది. ఈ భాషణము యొక్క అర్ధము పూర్వమందతడు ప్రవర్తించిన ప్రవర్తన యొక్క స్మరణ మని చెప్పుటయునా? లేనిచో నా మర్యాద యన్న గుణమొకటి యున్నదని చెప్పవలయునా? స్మరణ మని మాత్రమే చెప్పుదము. స్మరణ మనగా నేమి? ఒకప్పుడొక పని జరిగినది. అనంతర కాలమున, జరిగినపని జరిగినప్పుడు చూచిన వాడు దానిని స్మరించును. ఈ నడిమి కాలమునందు దత్కార్య మెట్లున్నది? వాని మనస్సు నందున్నదా? కాలమునందున్నదా? వాయువు నందున్నదా? ఆ స్మరణ ఎట్లు జరుగుచున్నది? మనస్సున కట్టి శక్తి యున్నదందము. ఆ శక్తిని గురించియే యిప్పుడు విచారించుచున్నది. ఆ శక్తియే కాలమునం దిమిడియున్నది. గగనమునం దిమిడియున్నది. అన్నాదులయందిమిడియున్నది. వాడన్నము తినుచుండిన గదా వాడు బ్రదికియుండుటయు, వాని మనస్సున కా శక్తి యుండుటయు. అందుచేత అన్నాదుల యందు గూడ నీ శక్తి లేదనుటకు వీలు లేదు. గగనము నందు లేదనుటకు వీలు లేదు. కాలమునందు లేదనుటకు వీలు లేదు. అనగా నేమగుచున్నది? ఆ మర్యాద యన్న గుణమునకు స్వతంత్ర మయిన స్థితి యున్నదని చెప్పవలసి వచ్చును. ఆ స్థితి ఎచ్చట నున్నది? ఆకాశమునందు దిక్కులయందు గాలమునందు అన్నాదులయందు నున్నది. మరియాద అన్న గుణమునకు, కీర్తి యన్న భావమునకు ఇట్టి స్థితి నిరూపింప బడుచుండగా, పాప పుణ్యములకు కర్మఫలితములకు పరమేశ్వర భావమునకు పరలోకములకు స్థితి లేదా? ఆలోచనా శక్తి యని యొకటున్నచో నన్నియు నున్నవి. అది లేనిచో నేమియు లేదు. ఇది యెంత యైన విచారణీయమైన విషయము. మానవుడు విచారించుట కొరకు జన్మించినాడు. ఆలోచనా హీనుని యందు మానవత్వము లేదు. ..”

****

తెలుగు వికీపీడియా పేజీ
, ఈ పుస్తకంపై గతంలో పుస్తకం.నెట్లో వచ్చిన హేలీ వ్యాసం.

విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

Aswamedhamu
Purana Vaira Granthamala
Viswanatha Satyanarayana

You Might Also Like

2 Comments

  1. ramireddy gogula

    అన్ని పుస్తకములు లోని మేలిమియే విశ్వనాథ వారి పుస్తకములు

  2. Radha

    “మానవుని యొక్క బాధ – శారీరక మయిన దధికమయినదా? మానసికమయిన దధికమయినదా?” “మానవుడు విచారించుట కొరకు జన్మించినాడు. ఆలోచనా హీనుని యందు మానవత్వము లేదు ..”
    “లోకజ్ఞానములోని మేలిమియే శాస్త్ర జ్ఞానము.” – చాలా మంచి వాక్యాలు. తప్పకుండా కొని జాగ్రత్తగా, నిదానంగా చదువుకోవలసిన నవలలు. పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదాలు.

Leave a Reply