పుస్తకం
All about booksపుస్తకభాష

May 1, 2014

చంద్రగుప్తుని స్వప్నము – కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక
******
ఈ నవల పీఠిక లో ఇచ్చిన వివరాల ప్రకారం ఇది అయిదవ నవల. దీనికి ముందరిదైన “నందోరాజా భవిష్యతి” లో రాక్షసుడు అనే బ్రాహ్మణుడు నందునికి రాజ్యాన్ని సంపాదించి పెట్టడం, సర్వ భారత దేశాన్ని అతనికి వశం చేసి పెట్టడం వుటుంది. నందవంశం 100 ఏండ్లు పాలించిన తర్వాత మౌర్య చంద్రగుప్తుడు రాజ్యానికి వస్తాడు క్రీ.పూ 1534 లో. ఆయన మంత్రి చాణుక్యుడు. ఈ నవలలో చాణుక్యుడు నందవంశాన్ని ఎలా నిర్మూలించాడో చెప్పబడింది.

పాశ్చాత్య చరిత్రలో గ్రీకు రాజైన అలెగ్జాండరు, మౌర్య చంద్రగుప్తుడు రాజ్యము చేస్తుండగా భారతదేశం మీదకి దండెత్తి వచ్చాడని వ్రాయబడి ఉంటుంది. అది అభూతకల్పన! అలెగ్జాండరు భారతదేశం మీదికి దండెత్తి వచ్చినది క్రీ.పూ 327 ప్రాంతాలలో. మౌర్య చంద్రగుప్తుడు మగధ రాజ్యాన్ని పాలించినది క్రీ.పూ 1534 నుండి 1500 వరకు. అతని కొడుకు బిందుసారుడు. ఆ బిందుసారునికి శిశునాగ వంశము లోని బింబిసారునికి సంబధము లేదు.

ఈ చంద్రగుప్తుడు ఆ చంద్రగుప్తుడు కాడు. ఇది చంద్రగుప్తుడన్న పేరు చూసి పాశ్చాత్యులు చేసిన కల్పన! ఈ సంగతి స్పురింపచేయడానికి ఈ నవల చివర్లో మౌర్య చంద్రగుప్తుడు తన తరువాత 1300 ఏండ్లకు జరుగబోవు అలెగ్జాండరు దండయాత్రని స్వప్నం లో చూశాడన్న కల్పన వుంటుంది.

ఈ కాలములో ధృడముగా నమ్మబడుతున్న ఈ విషయం నిరాలంబమైన కాలంలో వెనుకగా తట్టి, చంద్రగుప్తునికి కలగా వచ్చిందని కల్పన. పైన చెప్పినవన్నీ ఈ నవల పీఠిక లోని విషయాలే. ఈ విషయాన్ని అచ్చంగా విశ్వనాథవారి మాటల్లో చెప్పాలంటే.. “కాలము నిత్యమైనది, ప్రవాహమువంటిదని అర్ధము. సముద్రము పోటు పొడిచినచో, అది కొన్ని మైళ్ళ దూరము ఉప్పునీరగును కదా! ఆ రీతిగా చంద్రగుప్తునకు స్వప్నము వచ్చెను.”

ఈ నవలలో కథ తక్కువే. నందుడికీ ముర అనే శూద్ర స్త్రీకి పుట్టినవాడు చంద్రగుప్తుడు. అతను కాక నందుడికి మరొక ఎనిమిది మంది పుత్రులు.. ఎనిమిది మంది క్షత్రియ స్త్రీల ద్వారా పుట్టినవారు వుంటారు. పెద్దవాడు సుమాల్యుడు. అయితే అతని తల్లి పట్టమహిషి కాదు. ఏ రాణికీ పట్టమహిషి హోదా వుండదు.

నందుడికి ముర మీద, చంద్రగుప్తుని మీద ప్రేమ వున్నప్పటికీ, క్షత్రియ స్త్రీల ద్వారా పుట్టిన అతని ఇతర సంతానానికి చంద్రగుప్తుడితో శత్రుత్వం వుంటుంది. అందువల్ల దుర్భేద్యమైన కారాగారంలో చంద్రగుప్తుడిని పద్నాలుగేళ్ళపాటు బంధించి పెడతారు.

ఆ కారాగారం నుంచి చంద్రగుప్తుడు తప్పించుకోవడంతో కథ మొదలవుతుంది. రాజుకి శత్రువు కనుక ఆ క్షణంలో అతనికి రాజ్యంలో వున్నవారంతా శత్రువులే. అయితే చంద్రగుప్తుడు తన చిన్ననాటి స్నేహితుడయిన వసుమిత్రుడు తనకి సహాయం చేయవచ్చునని వూహించి ఎవరి కంటా పడకుండా అతని యింటికి చేరతాడు. అతను వూహించినట్లే వసుమిత్రుడతనిని ఆదరించి, ఆశ్రయమిస్తాడు. కలాలి అనే మరో చిన్ననాటి స్నేహితుడినీ కలుపుతాడు. రాజ్యంలోని పరిస్థితులన్నీ వివరించి చంద్రగుప్తుడిని రాజుని చేయగలవాడు విష్ణుగుప్తుడు (చాణుక్యుడు) ఒక్కడేనని చెప్పి అతని దగ్గరకి తీసుకువెళ్తాడు.

విష్ణుగుప్తుడు బ్రాహ్మణుడు. ఆ రోజులలో ఇంకే బ్రాహ్మణుడూ చదవని పాణినీయం అనే వ్యాకరణ శాస్త్రాన్ని ఆయన చదివాడు. ఆయన దృష్టిలో పాణినీయం చదివినవాడే పండితుడు. పాణిని అనే మహర్షి తాను రచించిన ఆ గ్రంధంలో అనంతమైన సంస్కృత భాషా శబ్దాల స్వరూపాన్ని ఎనిమిది అధ్యాయాలలో బిగించి పట్టాడట. విష్ణుగుప్తుడు పాణినీయం లోనే కాక జైమినీయ సూత్రాలలోనూ పారంగతుడు. వ్యాసుడు వ్రాసిన బ్రహ్మసూత్రములందూ నిష్ణాతుడట.

దేశంలో అందరూ పండితులే కానీ వికృతమై భ్రష్టములైన పాళీ భాష లోని శబ్దాలు ఆనాటి బ్రాహ్మణులు వాడుతూ వుండేవారు. విష్ణుగుప్తుడు వాళ్ళందరినీ పరిహసించే వాడు. ఆయన ముందు ఎవరూ నిలవలేక పోయేవారు.

రాజ్యంలోని పరిస్థితుల గురించి, నందుడి గురించి వసుమిత్రుడు చంద్రగుప్తుడికి వివరంగా చెప్తాడు.

పూర్వం మగధ రాజ్యాన్ని పాలించిన శిశునాగ వంశం వాళ్ళు బౌద్ధులు. అంటే మొదటినుండీ కాదు. వాళ్ళలో బింబిసారుడు అనే రాజు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. ఆనాటినుండీ. ఆ బింబిసారుడి కొడుకు అజాతశత్రువు- బౌద్ధుడు కాని వాడికి మగధ దేశ రాజ్యార్హత లేదని – ఒక నియమం చేసి పోయాడంటారు. నందుడి తండ్రి అయిన మహానంది నాటికి దేశం అంతా బౌద్ధం వ్యాపించి వుంటుంది. ఆ సమయంలో బ్రాహ్మణుడైన రాక్షసుడు తన ప్రతిభతో నందుడిని రాజును చేస్తాడు. నందుడి కాలంలో బౌద్ధం కన్నా ఒకరకంగా వేదమతమే ఎక్కువ ప్రాచుర్యంలో వుంటుంది. అయితే అటు బౌద్దులనీ ఆయన పూర్తిగా కాదనడు.

నిజానికి నందుడికి అటు బౌద్ధం, ఇటు వేదమతం ఏదైనా నష్టం లేదు. ఆయనకి కావలసింది ధనం. ఆయన దృష్టంతా దానిమీదే. కాబట్టి నందుడు పాలించిన వంద ఏళ్ళు గిరివ్రజపురము బౌద్దబిక్షుకులకు, బ్రాహ్మణులకు వివాదాస్పదమైన ఆశ్రయ భూమిగా వుంటూ వుండేది. నందుడు అటు బ్రాహ్మణులని ఇటు అర్హతులనీ కూడా అవమానించలేదు. రాజ్యం యిద్దరికీ ధనం యిస్తూ వుండేది. ఎవరి పండుగలు, వ్రతాలు వాళ్ళు చేసుకునేవారు.

నందుడు లోభి. అంటే ఖర్చులన్నీ పోగా మిగతా ధనాన్ని దాచుకునేవాడు, ఇతర రాజుల నుంచి కప్పాలు ఎక్కువగా తీసుకునేవాడు. అయితే రాజ్యాన్ని మాడ్చేవాడు కాదు. నందుడికి ఏ మతమూ లేకపోయినా అతని కొడుకులు మాత్రం బౌద్ధులు. అధికారం ఇపుడు వారి చేతులలోకి వచ్చింది.

లోభి అయిన నందుడు ధనమంతా దాచుకోవడమేగాని ఏనాడూ భార్యలను కూడా సంతోష పెట్టలేదు. వాళ్ళు అడిగినవి ఇవ్వలేదు. ఒక్క భార్య తృప్తి పడలేదు. తృప్తి పడని భార్య దగ్గర నుంచి తృప్తి ఎలా వస్తుంది? కొడుకులు పెద్దవాళ్ళయ్యాక వాళ్ళూ ధనం అడగడం మొదలు పెట్టారు. అయితే నందుడు నా దగ్గర ధనం లేదు, మీరే సంవత్సరానికొకరు చొప్పున రాజ్యం పాలించండి. మీరే సంపాదించుకోండి. అనుభవించండి అన్నాడు. అలా మొదలయింది వాళ్ళ అధికారం.

అధికారం లోకి వచ్చిన నందుడి కొడుకులు బ్రాహ్మణులని అవమానించడం మొదలు పెడతారు. ఒక సందర్భంలో విష్ణుగుప్తుడు నందుడి కొడుకుల చేతిలో అవమానానికి గురవుతాడు.

ఈ వివరాలన్నీ వసుమిత్రుడు చంద్రగుప్తుడితో చెప్తాడు.

వసుమిత్రుడు చంద్రగుప్తుడిని తన దగ్గరకు తీసుకురాగానే విష్ణుగుప్తుడు అతనిని తన శిష్యునిగా స్వీకరిస్తాడు. రాజును చేస్తానంటాడు. వెంటనే చంద్రగుప్తుడికి పట్టాభిషేకం కూడా చేస్తాడు. ఆ సందర్భంగా శిష్యుడిని కొన్ని ప్రమిదలు తెచ్చి దీపాలు వెలిగించమంటాడు. శిష్యుడు “ఇరువది ప్రమిదలే దొరికెను. క్రింద ప్రమిద లేకుండ పైన ప్రమిద వెలిగించుటకు పనికి రాదు. అందుచేత పది దీపములే వచ్చెను.” అంటాడు.

దానికి చాణుక్యుడు “కానీవోయి! ఎన్ని దీపములు వెలుగవలయునో అన్నియే వెలుగును. ఎన్ని వెలుగవలసి యున్నవో అన్ని ప్రమిదలే దొరకును.” అంటాడు.

ఆ ప్రమిదల అర్ధాన్ని కౌశికుడనే శిష్యుడు చంద్రగుప్తునికి తర్వాత ఇలా వివరిస్తాడు. “పది ప్రమిదలనగా మీ వంశమునందు పదిమంది రాజులు వెలయుదురట! ఒక్కొక్క వత్తికి పదియేండ్ల చొప్పున ముప్పది వత్తులకు మూడు వందల ఏండ్లు మీ మౌర్య వంశము మగధ రాజ్యమును పాలించునట! నేటికి కలియుగము ప్రారంభించి పదునారువందల యేండ్లైనది. పందొమ్మిది వందల యిరువదవ యేడు వచ్చువరకు మీ మౌర్య వంశము మగధములను బాలించును.”

పట్టాభిషేకం చేశాక విష్ణుగుప్తుడు చంద్రగుప్తుడితో యిలా అంటాడు. “నీ తండ్రి శూద్రుడు. నీ తల్లి శూద్ర. నీ శరీరములో అచ్చమైన రక్తము ప్రవహిస్తోంది. సుమాల్యాదులు విలోమ సంతానము (తక్కువ వర్ణము వానికి అధిక వర్ణ స్త్రీ యందు కలిగిన సంతానము) కనుక వారు రాజ్యము చేయుట కర్హులు కారు.”

ఆ తర్వాత రాజ్యంలో కూడా శూద్రుడికి క్షత్రియ స్త్రీ యందు జన్మించిన వాడు మనుధర్మ శాస్త్రం ప్రకారం కిరాతుడనీ, కనుక నందుని కొడుకులకి రాజ్యార్హత లేదనీ, అంతే కాకుండా చంద్రగుప్తుడికి శక కిరాత బర్బర మల్ల దేశాల సహాయం వుందనీ, పాంచాల కేకయ హైహయ కౌరవ శూరసేన విదేహ భల్లట రాజులందరూ చంద్రగుప్తుడి ఆధిపత్యాన్ని అంగీకరించి కప్పములు కూడా కడుతున్నారనీ, ముందే పదేళ్ళ కప్పములు పంపించారనీ ఆ ధనాన్నంతటినీ మహాదాత అయిన చంద్రగుప్తుడు విరివిగా పంచిపెడుతున్నాడనీ – యిలాంటి వార్తలు వ్యాపించి పోతాయి.

వసుమిత్రుడికే తెలియని అతని ధనాన్ని చాణక్యుడు కనిపెట్టి దానిని వసుమిత్రుని అనుమతితో చంద్రగుప్తుడి పరం చేస్తాడు. ఆ ధనంతోనే ఈ దానాలు చేస్తాడు చంద్రగుప్తుడు.

గురువుగా విష్ణుగుప్తుడు ఏమైనా చెప్పడం, చంద్రగుప్తుడు అది చేయడం ఇదంతా నవలలో అన్ని చోట్లా మనకి ప్రత్యక్షంగా కనబడదు. ఎందుకంటే చాణక్యుడి ప్రణాళిక అంతా ఎలా జరుగుతోందో మనకి చివరి నిమిషం వరకూ తెలియకూడదు కదా!

అయితే ఒకసారి తన శిష్యుడిగా స్వీకరించాక ఒక గురువుగా ఆయన ఎంత శ్రద్ధగా అతన్ని తీర్చి దిద్దాడు, తప్పు చేస్తే తెలియచెప్పడం, దాన్ని దిద్దుకుంటే మెచ్చుకోవడం ఎంత చక్కగా చేశాడు – అన్న విషయాన్ని ఒక్క సంఘటనలోనే నేర్పుగా చెప్పేస్తారు విశ్వనాథ.

“మీరు తప్పించుకోవడానికి కారణం మీ తల్లి గారే. కానీ కారాగారం నుంచి తప్పించుకున్నాక మీరు మీ తల్లిని దర్శించలేదు, ఆవిడ దిగులు తీర్చలేదు.” అని చంద్రగుప్తుని పొరపాటును అతనికి తెలియచేయడం, చంద్రగుప్తుడు కదిలిపోయి, పశ్చాత్తాప పడి, తనని తాను ‘మౌర్య చంద్రగుప్తుడి’ గా పిలుచుకుని రాజముద్ర మీద కూడా వెంటనే తల్లి పేరు చెక్కించడం, దానికి మళ్ళీ గురువు విష్ణుగుప్తుడు మెచ్చుకోవడం – ఇదీ సంఘటన. అయితే ఈ సంఘటనలో కూడా గురువుగారు నేరుగా చంద్రగుప్తుడితో మాట్లాడరు. తప్పు తెలియ చెప్పడం, ప్రశంసించడం – రెండూ కూడా మధ్యలో మరో శిష్యుడు కౌశికుని ద్వారా జరుగుతాయి.

ఇక “నందో రాజా భవిష్యతి” లో రాక్షసుని ప్రణాళిక తో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క క్షత్రియ రాజ వంశం నిర్మూలింప బడడం, నందుడికి మార్గం సుగమం అవడం ఎలా జరుగుతుందో అలాగే ఈ నవలలోనూ నందుడి కొడుకులు ఒక్కొక్కరూ చిత్రమైన పరిస్థితులలో హత్య చేయబడతారు. ఎవరి వలన జరిగిందో ఎలా జరిగిందో అర్ధం కానంత అద్భుతమైన పథక రచన ఉంటుంది ప్రతి హత్య వెనుకా.

సుమాల్యుడు, శతానీకుడు, బృహధ్రదుడు, సుగంధ్యుడు, సహదేవుడు, భూమిమిత్రుడు, రాహులుడు, దండపాణి వీరు ఎనిమిది మంది రాకుమారులు. సుమాల్యుని భార్య యశోధర శ్రావస్తి నగరాధిపతి కూతురు. రాహులుని భార్య మాయ వైశాలీ నగరాధిపతి కూతురు. యశోధర, ఆమ్రపాలి, మాయ – వీరు ముగ్గురూ బౌద్ధులు. మాయ బౌద్ధ స్త్రీ కనుక స్త్రీ పురుష సమానత్వం గురించి మాట్లాడుతూ వుంటుంది. సహదేవుని భార్య మహేశ్వరి ఏకలింగ క్షత్రియ వంశ సంజాత. ఆమె మెడలో రహస్యముగా సన్నని లింగమును ధరించును. దండపాణి భార్య నీల వైదిక మతాన్ని అనుసరిస్తుంది.

“నందో రాజా భవిష్యతి” కీ దీనికీ తేడా ఏమిటంటే అక్కడ బయటివారెవరో వచ్చి హత్య చేస్తారు. కొన్ని సందర్భాలలోనైనా కనీసం తమని ఎవరు చంపుతున్నారో చంపబడేవారికి తెలుస్తుంది. అయితే అది చివరి నిమిషంలో, పరిస్థితి వారి చేతులు దాటిపోయాక.

ఈ నవలలో దానిని మించిన చమత్కారం వుంటుంది. చంపే వాళ్ళు బయటినుంచి రారు. కొన్ని హత్యలలోనయితే చనిపోతూన్న వారు తామెందుకు చనిపోతున్నామో, ఎలా చనిపోతున్నామో చివరి క్షణంలో కూడా తెలుసుకోలేరు.

మొదటి హత్య చంద్రగుప్తుడు కారాగారం నుంచి బయటికి వచ్చేనాటికి మహారాజుగా వ్యవహరిస్తున్న సుగంధ్యుడిది. అతడిని అతని సైన్యమే వధిస్తుంది చంద్రగుప్తుడనుకుని! ఆ తర్వాత ఎనిమిది మందిలో చివరివాడైన దండపాణి హత్య జరుగుతుంది. అతను కూడా తానెలా చనిపోతున్నాడో తనకే తెలియకుండా చనిపోతాడు.

ఆ తర్వాత తెలివి తెచ్చుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకోబోయినా, అవేవీ పని చేయవు. మిగిలిన రాకుమారులూ, మహారాజు నందుడూ వధించ బడతారు. రాజ్యం చంద్రగుప్తుడికి దక్కుతుంది.

****
తెలుగు వికీపీడియా పేజీ

విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.One Comment


  1. భలే ఉంది. డిటెక్టివ్ నవల లాగా. ఎలా చనిపోయారో తెలుసుకోవాలంటే నవల కొని చదవక తప్పదుగా. బావుంది రాధిక గారూ సస్పెన్స్ క్రియేట్ చేసి వదిలేశారు. అభినందనలు.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 
 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1

 
 

తెలుగు సాహిత్యంలో బలమైన స్త్రీ పాత్రలు-మొదటి భాగం:విశ్వనాథ నాయికలు

వ్యాసకర్త: సూరంపూడి మీనాగాయత్రి ***************** ఏ సాహితీ ప్రక్రియలోనైనా కథ, కథనంతో పాటు బలమైన...
by అతిథి
2

 

 

తెఱచిరాజు – ఒక పరిశీలనా ప్రయత్నము

వ్యాసకర్త: శ్రీకాంత్ గడ్డిపాటి (విశ్వనాథ గారి తెఱచిరాజు నవలపై బెంగుళూరులో జరిగిన సా...
by అతిథి
7

 
 

స్వర్గానికి నిచ్చెనలు – అస్తి నాస్తి ల గంభీర చర్చ

వ్యాసకర్త: బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి ************ భారతీయ భాషల్లో ఆలోచనాత్మకమైన రచనలకు ఏ క...
by అతిథి
0

 
 

విశ్వనాథలోని ‘నేను’ – మూడవభాగం

రచయిత: పేరాల భరతశర్మ టైప్ చేసి పంపినవారు: పవన్ సంతోష్ సూరంపూడి మొదటి భాగం ఇక్కడ. రెండ...
by అతిథి
1