ధూమరేఖ- కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక
****
పురాణవైర గ్రంథమాలలో ఇది మూడవ నవల. రెండవ నవల నాస్తికధూమములో మగధరాజ్యం ప్రద్యోత వంశం వారి చేతిలోకి వెళ్ళడం చెప్పబడింది. ఈ మూడవ నవలలో శిశునాగ వంశం రాజ్యానికి రావడం చెప్పబడుతుంది.

ప్రద్యోత వంశము కలియుగమున పదకొండువందల నలభై నాలుగేళ్ళ వరకు రాజ్యం చేసింది. ప్రద్యోతులు అయిదుగురు. ప్రద్యోతులలో చివరివాడు నందివర్ధనుడు. అతని తర్వాత కలిలో పదకొండువందల నలభై నాలుగేళ్ళ నుంచి పదిహేనువందల నాలుగు వరకు గిరివ్రజపురం రాజధానిగా శిశునాగ వంశం రాజ్యం చేసింది. శిశునాగ వంశంలో చివరివాడు మహానంది. మొదటివాడు శిశునాగుడు.

ఈ నవల మొదట్లో ఇద్దరు యువతుల మనఃప్రవృత్తి వర్ణింపబడుతుంది. వారిలో మాయ అన్న ఆమె బుద్ధుని తల్లి. ఈ నవలలో బుద్ధుని కథ లేదు. దానికి సూచన వుంది. దానికి పునాదిగా ఈ నవలలోని కథ వ్రాయబడింది అంటారు విశ్వనాథ పీఠికలో. పురాణవైర గ్రంథమాల లోని మొదటి మూడునవలలలో అభౌమకత (super natural) విషయము వర్ణింప బడింది. తక్కిన నవలలో ఆ ప్రసక్తి వుండదు అని చెప్తారు.

కథలోకి వెళ్తే …

శిశునాగుడు కాశీరాజు కుమారుడు. ప్రద్యోత వంశములోని అయిదవరాజైన నందివర్ధనుడు, శిశునాగుడు పినతల్లి పెదతల్లి బిడ్డలు. నందివర్ధనునకు పురుష సంతానం లేదు. ఒక్కతే కూతురు. ఆమె పేరు వేదమరీచి. ఆమె పుట్టినపుడే ఆమె తల్లి చనిపోయింది. తల్లిదుఃఖమును మరచిపోవడానికి కాశీరాజు ఆమెని కాశీ నగరానికి తీసుకెళ్ళాడు.. (ఇక్కడ ఒకచోట కాశీరాజు భార్య నందివర్ధనుడికి వదినగారని వ్రాశారు. కాశీరాజు భార్య అంటే శిశునాగుడి తల్లే కదా! శిశునాగుడి తల్లి నందివర్ధనునికి వదినగారు కాదు, పెదతల్లి. నవలలో అన్ని చోట్ల అలాగే చెప్పారు. ఇక్కడ ఒక్క చోట వదినగారు అని వ్రాయడం పొరపాటు కావచ్చు.) అప్పటికి శిశునాగుడు కొంత చిన్నవాడు. శిశునాగుడు, వేదమరీచి కలిసి ఆడుకునేవారు. ఒకరంటే ఒకరు ఇష్టంగా వుంటారు. మొదట అది పినతండ్రి, కూతుళ్ళ బంధం గానే వున్నా తర్వాత పక్కదోవ పడుతుంది.

యుగపురుషులు నిత్యులు. ఎవనికి వీలైనప్పుడు వాడు విజృంభించును. కలిపురుషుడు మొదట జయద్రథుని యందు తాను కొంత సంక్రమించెను. కానీ తాను విస్తరించటానికి నాడు కాలం అనుకూలంగా లేదు. శిశునాగుని నాటికి కలిపురుషునికి కొంత బలం వచ్చింది. జయద్రథుడు తన శరీరాన్ని దగ్ధం చేసుకోగా (రెండవ నవల నాస్తిక ధూమము ముగింపులో చెప్పబడిన విషయం) వ్యాపించిన ధూమరేఖల నుండి కలి కూడా వ్యాపించింది. (పురాణవైర గ్రంథమాలలోని మొదటి పుస్తకం – భగవంతుని మీది పగ – లో జయద్రథుని గురించీ, ఆ వంశం వారి పగ గురించీ చెప్పబడింది.)

ప్రతిమనిషికీ పుట్టుకతోనే ఒక సంస్కారం వుంటుంది. అది ధర్మం కావచ్చు. అధర్మమూ కావచ్చు. శిశునాగునిలో అలాంటి అధర్మమైన సంస్కారం వుంది. వేదమరీచి పందొనిమిదేళ్ళు వచ్చేవరకు కాశీనగరం లోనే వుంది. అప్పుడప్పుడు గిరివ్రజపురానికి వచ్చి పోతూ వుంది. భార్యని అమితంగా ప్రేమించిన నందివర్ధనుడు మళ్ళీ వివాహం చేసుకోలేదు. వేదమరీచి తమ మహారాణి అనీ, ఆమె మగధకు వచ్చి రాజ్యపాలన చేపట్టాలనీ మగధ ప్రజలు ఆశిస్తుంటారు.

ఈ నేపథ్యంలో మగధ రాజ్య మంత్రులలో వృద్ధులైన ఇద్దరు కాశీనగరానికి వచ్చి “నీవు రాక తప్పదు” అని బతిమాలి బలవంతము చేసి వేదమరీచిని ఒప్పిస్తారు. వేదమరీచికి కూడా వెళ్ళి తన రాజ్యం తాను సంబాళించుకోవాలని వుంటుంది. అది శిశునాగుడికి యిష్టం లేదనీ ఆమె గ్రహిస్తుంది. అయినా వెళ్ళిపోతుంది. వేదమరీచి వెళ్ళిపోయాక శిశునాగుడు బాధతో, కోపంతో ఆ రాత్రి కోట నుంచి కాలినడకన బయటికి వెళ్ళిపోతాడు. ఎటు వెళ్తున్నాడో గమనించుకోకుండా చాలా దూరం నడుస్తూ వెళ్ళాక చీకట్లో దూరంగా ఏదో నిప్పు వెలుగుతూ ఆరుతూ వుండడం గమనించి అటు వైపు వెళ్తాడు. అక్కడ ఒక వ్యక్తిని చూస్తాడు… పిశాచం లా ఉన్నవాడిని. వాడు ఒక కర్ర లోనుంచి వస్తూన్న పొగని ఒక గొట్టముతో పీలుస్తూ వుంటాడు. శిశునాగుడు వెళ్ళి వాడి ఎదురుగా నిల్చుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలోకి ఒక బలిష్టమైన నక్క వచ్చి ఆ వ్యక్తిని చూసి బెదిరి పారిపోతుంది.

శిశునాగుడు ఆ వ్యక్తి పట్ల ఆకర్షితుడై ‘నేను నీదగ్గరే వుండి పోతాను’ అంటాడు. అతను ‘వద్దు, నువ్వు కోటకి వెళ్ళు. నేనే నిన్ను చూడటానికి కోటకి వస్తాను. నువ్వు వుండమంటే అక్కడే వుండిపోతాను.’ అంటాడు. శిశునాగుడి చేత ‘నేను నీ శిష్యుడిని’ అనిపిస్తాడు. తన చేతిలో వున్న కట్టెని శిశునాగుడికి యిచ్చి అతని చేత కూడా ధూమపానం చేయిస్తాడు. ఆ ధూమపానం చేయగానే శిశునాగుడిలో ఒక మార్పు వస్తుంది. వేదమరీచితో తనకున్న సంబంధం పాపము అనిపించదు. అది సహజమైనదేననిపిస్తుంది.

తెల్లవారేసరికి రాజభటులు శిశునాగుడిని వెతుకుతూ వచ్చి కోటకు తీసుకువెళ్తారు. తల్లి చంద్రమతీ దేవి అతనిలోని మార్పుని గుర్తిస్తుంది. శిశునాగుడిని తీసుకువచ్చిన పరిచారకులలో ఒకడిని పిల్చి రాత్రి శిశునాగుడు ఎక్కడికి వెళ్ళాడని ఆరా తీస్తుంది. ఆ పరిచారకుడి పేరు చిత్రశిఖండి. అతను అది మహానగరానికి దూరంగా నాలుగు స్మశానాల మధ్యలో వున్న ప్రదేశమనీ అక్కడ పది పొదలున్నాయనీ, అవేమిటో తనకి అర్థం కాలేదనీ, పగటివేళ వెళ్ళి మళ్ళీ పరీక్షించాలనుకుంటున్నాననీ చెప్తాడు. నిజానికి అవి పొదలు కావనీ, దుబ్బులు అనీ, వృక్షాల గురించి బాగా తెలిసిన తనకే అవి ఏమిటో అర్థం కాలేదనీ అంటాడు. అలాగే అక్కడ యువరాజువి కాక మరొక మనిషి కాలిగుర్తులు, నక్క కాలిగుర్తులు కూడా కనిపించాయని చెప్తాడు. అవి నక్క కాలిగుర్తులన్న విషయం అందరూ గుర్తించలేరనీ ఏదో భయంకర జంతువు కాలిగుర్తుల్లా ఉన్నాయనీ అంటాడు.

వృద్ధరాజు, అంటే శిశునాగుడి తండ్రి ఆరోజునుంచీ మంచాన పడతాడు. తండ్రి దగ్గరకు వెళ్ళి పలకరించమనీ, మాట్లాడమనీ చంద్రమతీ దేవి వత్తిడి చేస్తే శిశునాగుడు ఆయన దగ్గరగా వెళ్ళి మొహంలో మొహం పెట్టి మాట్లాడతాడు. అపుడు రాజు మొహం లోకి కొత్త ప్రకాశం వస్తుంది. శిశునాగుడి మాటలని ఆయన ముక్కుతో పీలుస్తున్నాడా అనిపిస్తుంది. ఒక్కసారిగా ఏదో శక్తి వచ్చినట్లుగా కనిపిస్తాడు “యువరాజా, నా పని అయిపోయింది. నీ రాజ్యం నువ్వు స్వీకరించు. నీ శత్రువులని దండించు. ప్రతీకారం తీర్చుకో.” అంటాడు.

రాణి ఆశ్చర్యపోతుంది. ప్రతీకారం ఎవరిమీదో ఆమెకు అర్థం కాదు. వేదమరీచి మీదా! మగధ రాజ్యం మీదా? ఎందుకు? ఆమె ఇలా అనుకుంటుంది. “ఈ కాశీ మహాక్షేత్రము యొక్క పవిత్రత వల్ల, శక్తి వల్ల వేదమరీచి యొక్క జీవుడు పరిశుద్ధుడవుతాడనీ, మగధ రాజ్య పాలనాపటిష్టుడవుతాడనీ వేదధర్మ ్రతిష్టాపనాచార్యుడవుతాడనీ అనుకుని వేదమరీచిని ఇక్కడికి తెచ్చాను. ఈ మగధ రాజ్యం కర్మమేమిటో! వాళ్ళెప్పుడూ శ్రీకృష్ణ విరోధులే. ప్రద్యోతనుడి కూతురు పద్మావతిని పాండవుల వంశంలోని ఉదయనుడికి యిచ్చినా ఆ సంబంధం అక్కడితోనే అయిపోయింది. ఆ తర్వాత ఈ నూట ముప్పై ఆరేళ్ళ నుంచీ శ్రీకృష్ణ విరోధమే నడుస్తోంది. బార్హద్రథవంశం వున్నన్నాళ్ళు చండీ పూజ పరంపరగా సాగింది. ప్రద్యోతనులు అది కూడా మానేశారు. నందివర్ధనుడు శూన్యవాది. ఇక ముందు ఏమవుతుంది? నందివర్ధనుడి తర్వాత ప్రద్యోత వంశం అంతరించి మరొక వంశం మగధని ఆక్రమిస్తుందని వదంతి వుంది. కానీ మగధ మీద దండెత్త గలిగినంత పెద్ద రాజ్యం ఇంకొకటి లేదు. తర్వాత ఏమవుతుంది? శిశునాగుడికి ప్రతీకారం ఎందుకు? దాన్ని అతను ఎలా తీర్చుకుంటాడు?” ఇలాంటి సందేహాలన్నీ కలిగి రాణి రాజు దగ్గరకు వెళ్ళి ఆయన్ని మాట్లాడించే ప్రయత్నం చేస్తుంది. “శిశునాగుడు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలో చెప్తారా?” అని అడుగుతుంది.

“అతడు రాజైన తర్వాత నేను ఆ ప్రతీకార మార్గాన్ని బోధిస్తాను.” అంటాడు రాజు. రాణి నివ్వెరపోతుంది. ఒక హఠాత్స్ఫురణగా తనకే తెలియకుండా అనాలోచితంగా “నువ్వెవరు?” అని ప్రశ్నిస్తుంది. “నేను జయద్రథుడిని” అంటాడు రాజు. అంతే. ఆ జవాబు తర్వాత ఇంక రాణి ఎన్ని ప్రశ్నలు వేసినా జవాబు చెప్పడు. నగరంలో పరాశరశాస్త్రి అనే వృద్ధ పండితుడు ఉంటాడు. నిత్య తపస్వి. యోగానిష్టాపరుడు. జ్యోతిష్యము, సాముద్రికము తెలిసిన వాడు. చిత్రశిఖండి ఆ పరాశరశాస్త్రిని కలిసి, ఆయన్ని తీసుకుని తాను శిశునాగుడిని చూసిన ప్రదేశానికి తీసుకువెళ్తాడు. ఆయన ఆ ప్రదేశాన్ని పరీక్షిస్తాడు. ఆ దుబ్బులలో ఏదో రహస్యముందని గ్రహిస్తాడు. అక్కడ వున్న నాలుగు దుబ్బులను త్రవ్వించి, రోటిలో రుబ్బించి ఆ పిండిని గంగానదిలో కలిపిస్తాడు. రాణి కూడా ఆయనతో సంప్రదిస్తుంది. రాజుని జయద్రథుడు ఆవహించాడని అర్థం చేసుకుంటారు.

ఆంధ్రరాజు కుమార్తెతో శిశునాగుడి వివాహం చేయాలనుకుంటారు. కాశీనగరం నుంచి ఆంధ్రదేశం వెళ్ళి మాట్లాడి రావడానికి ఒక నెల రోజుల పైనే పడుతుందనీ, అయినా తను వెళ్ళి మాట్లాడి వస్తాననీ అంటాడు పరాశర శాస్త్రి. ఆ తర్వాత ఆయన జపంలో కూర్చుంటే వింధ్య పర్వత శ్రేణుల్లో ఇదంతా మొదలయిందని అర్థమవుతుంది. అక్కడ కూడా అలాంటి దుబ్బులు వుండడం, వాటి క్రింద వున్న కాష్ఠములను చేత బూని నల్లని దుస్తులు ధరించిన ఒక పురుషుడు అక్కడినుంచి ఏదో దూరదేశానికి ప్రయాణించడం, అక్కడ ఒక రాజసౌధం, తోట, తోటలో రాకుమారి కనిపిస్తారు. ఆమె శిశునాగుడికి ఇచ్చి వివాహం చేయాలనుకున్న ఆంధ్ర రాజదుహిత అనీ అర్ధమవుతుంది. ఆమె తోటలో నిద్రిస్తుండడం, ఆ పురుషుడు తన చేతిలోని కాష్ఠములకు నిప్పు ముట్టించి, ఆ పొగ అంతా ఆమె చేత ఒక వేయిసార్లు పీల్పించడం కనిపిస్తుంది. అదంతా నిద్రలో వున్న ఆమెకు తెలియకుండానే జరుగుతుంది. ఆ ఆంధ్ర రాజకుమార్తె పేరు వంకజాబిల్లి. అమిత సౌందర్యవతి.
తర్వాత పరాశర శాస్త్రి ఒక సందర్భంలో ఆమెతో ఇలా చెప్తాడు.

“ఓ తల్లీ! నీ సౌందర్య మేమి? నీ గర్భము నందా దుష్టుడు ప్రవేశపెట్టిన ధూమ రజ్జు సంతానమేమి? నీవు నిదురపోవుచుండగా – నిన్నింకొక రీతిగా తన వైపునకు త్రిప్పుకోలేని వాడై – వాడు నీ గర్భమునందొక నాస్తిక ధూమరేఖా రజ్జు సంతానమును ప్రవేశ పెట్టినాడు. నీకా సంగతి తెలియదు. నిదుర లేచిన తర్వాత నీకు వానిని కాదను శక్తి పోయినది. అనగా వాడు నిన్ను శరీరము నందు బంధించినాడు. నీ మనస్సునకు, నీ శరీరము మీద నధికారము లేకుండ చేసినాడు. నీ మనస్స్వాతంత్ర్యము నపహరింప లేక పోయినాడు. నీ తండ్రి యొక్కయు, నీ భర్త యొక్కయు మనస్స్వాతంత్ర్యములను కూడ హరించినాడు. వారి జీవులకంటె నీ జీవుడుత్తముడు. అధిక స్వచ్ఛత కలవాడు. ఎక్కువ వెలుగు కలవాడు. అందుచే నీ మనస్సు వానికి స్వాధీనము కాలేదు. కాకపోవుటవలన నొక లాభమున్నది. నీ సంతానము వాడనుకొన్నంత తుచ్ఛమైనది కాదు. నీకు కుమారుడుదయించును. వానికి కుమారుడుదయించును.

ఇట్లు పదితరములు సాగును. … రెండు మూడు తరముల వరకు నష్టము లేదు. తరువాతివారు నాస్తికులగుదురు. నాస్తికులయినను నీ ఈ మనోలక్షణము చేత వారి నాస్తికత్వము నీ గురువు వాంఛించిన నాస్తికత్వము కాదు. .. వాని పని సగము మేర ఫలించును. వైదిక మతమునకు వాడు విరోధి. వైదిక కర్మమునకు వాడు విరోధి. ఆ విరోధము మాత్రము సాగును. వాడాత్మలక్షణములను నిర్మూలింపలేడు. దయ, అహింస, శమ దమములు, వైరాగ్యము మొదలయిన యాత్మ లక్షణములను వాడు చెరపలేక పోవుచున్నాడు. దానికి కారణము నీ మనస్స్వచ్ఛత. నీ జీవ సంస్కార విశేషము. శ్రౌత కర్మాభిరతి. వేద కర్మాభిమానము. ఇవి తత్సాధకములైన బహిరంగములు. వానిని వాడు, నీ గర్భ కోశమునందు తద్దుష్ట ధూమమును వ్యాపింపజేసి నీ సంతానమునందు లోపించెడునట్లు చేసినాడు…”
అదీ విషయం. అలా శిశునాగుడికీ ఆంధ్రరాజ పుత్రిక వంకజాబిల్లికీ వివాహం జరుగుతుంది.

మరొకప్రక్కన అక్కడ వేదమరీచి రాజ్యంలో వృద్ధరాజు నందివర్ధనుడు, వృద్ధ మంత్రి మయూరశర్మ, అజాతశత్రుడనే పేరు గల వీరుడు – వీరిని గురించిన కథ కొంత.
అజాతశత్రుడు మాళవ రాజకుమారుడు. సుక్షత్రియ వంశీయుడు. తల్లిదండ్రులు చిన్నతనం లోనే చనిపోగా జ్ఞాతులు అతని సిరిసంపదలు కైవశం చేసుకుని అతన్ని దేశం నుంచి వెళ్ళగొట్టగా అతను మగధకు వచ్చి అక్కడ రాజోద్యోగిగా వుంటాడు. రాజుకీ, మంత్రికీ అత్యంత సన్నిహితుడు. వేదమరీచితో అతని వివాహం జరిపించి అతనినే మగధకు రాజును చేస్తారేమోననేంత సాన్నిహిత్యం. అయితే కాశీ నుంచి తిరిగి వచ్చిన వేదమరీచి ఆ ముగ్గురితోను తన రహస్యం చెప్పేస్తుంది. ముగ్గురూ నిశ్చేష్టులవుతారు. రాజు వేదమరీచితో పాటు తానూ దుఃఖించి ఆమె వివాహానికి సుముఖంగా లేదన్న విషయం మాత్రం ప్రజలకు తెలియచేసి ఊరుకుంటాడు.
అయితే శిశునాగుడి వివాహం జరిగాక కొన్నాళ్ళకి వృద్ధమంత్రి, రాజు మరణిస్తారు. ఆ తర్వాత కొంత ఆలోచించి వేదమరీచి, అజాతశత్రువు వివాహం చేసుకుంటారు.
అప్పటికి వంకజాబిల్లికీ శిశునాగుడికీ పుట్టిన కొడుకు కాకవర్ణుడు ఆరేళ్ళ వాడు.

వేదమరీచి వివాహ వార్త విని రగిలిపోతున్న శిశునాగుడితో వంకజాబిల్లి మీ పగ నేను సాధించిపెడతానంటుంది. అన్నంత పనీ చేస్తుంది కూడా. మగధతో యుద్ధం చేస్తే గెలవలేని చిన్న రాజ్యమైన కాశీరాజ్యపు రాజు శిశునాగుడు మగధకు రాజయ్యేలా చేస్తుంది. చుట్టరికం ఆధారంగా శిశునాగుడు, చంద్రమతీ దేవి, వంకజాబిల్లి మగధలో అడుగుపెడతారు. అలా అడుగుపెట్టడానికి కావలసిన పరిస్థితులు కల్పించ బడతాయి. అందుకు పరాశర శాస్త్రి కొంత ఉపయోగపడితే, కాశీరాజుని ఆవహించిన జయద్రథుడు – అతనికి కావల్సిందీ అదే కనుక – మరికొంత ఉపయోగపడతాడు. వేదమరీచిని హత్య చేసి, ఆ నేరం అజాతశత్రువుపై మోపి అతన్నీ హత్య చేసి, మగధ ప్రజల దృష్టిలో అతన్ని నేరస్తుడిని చేసి, శిశునాగుడు మగధకి రాజవుతాడు. అదీ నవలకి ముగింపు.

ఈ నవలలో కథకుడు నేరుగా చెప్పిన, పరాశర శాస్త్రితో సంభాషణల రూపంలో చెప్పించిన కొన్ని విషయాలు చాలా ఆసక్తికరంగా వుంటాయి.

ఒక ఉదాహరణ : “జీవలక్షణ పరిజ్ఞానము విచిత్రముగా నుండును. ఆ పరిజ్ఞానము కలవారు యోగులు కానక్కరలేదు. ఆ పరిజ్ఞానము తమకు కలదని వారికి వారికే తెలియును. వారి మాటల చేత, వారి క్రియల చేత వారి కా పరిజ్ఞానము కలిగినట్లు తెలియును. మానవులలో నెట్టి పరిస్థితులలోనైన నొకానొకడు సర్దుకొని పోవును. ఒకడు ప్రతి చిన్న విషయమునందు వివాదము పెంచుకొనును. ఆ సర్దుకొని పోయెడివానిని సత్పురుషుడందుము. సత్పురుషుడనగా జీవలక్షణ పరిజ్ఞానము కలవాడని అర్ధము. జీవలక్షణ మనగా నిత్యమైన వస్తువు యొక్క వస్తుత్వము.”

అలాగే వేదమరీచి శిశునాగుడితో తనకున్న సంబంధం గురించి చెప్పినపుడు తండ్రి నందివర్ధనుడి స్పందన, ఆమె దుఃఖం, ఆయన దుఃఖం, ఆమె బాధని ఒక తండ్రిలా కాక తల్లిలా ఆయన అర్థం చేసుకోవడం.. ఆ సన్నివేశం బాగా వ్రాస్తారు రచయిత. ఆతర్వాత మరణించే ముందు నందివర్ధనుడి మనసులో మెదిలే కొన్ని ఆలోచనలు ఇలా ఉంటాయి. “.. ఒక క్రియ జరుగుటలో జరుగుటకే ప్రాధాన్యము గాని అది ఎందుకు జరిగినదనుటకు ప్రాధాన్యము లేదు. ఆ క్రియకు కర్త వాడు. కర్తృత్వము వానియందున్నది. కర్తృత్వజ్ఞానము వానికున్నదా లేదా యన్న ప్రశ్న లేదు. వాడు పసివాడైనను, వాని నా కార్యమునకు కర్తగా లోకమెంచుట వలన తత్కర్తృత్వాభిమానము వాని జీవలక్షణము నందున్నదని లోకమంగీకరించుచున్నది. లోకము జీవునినంగీకరించుచున్నది. లోకజ్ఞానము క్రమముగా వచ్చును. రాదు! కర్తృత్వజ్ఞానము జీవనిష్టమై యున్నదన్నమాట! అయ్యో! వానికి లౌకికజ్ఞానము కుదురక ముందే వానియందీ కర్తృత్వము నారోపించుట న్యాయము కాదనగా, లోకజ్ఞానము కుదురకముందే వానియందు సౌఖ్యభావన దుఃఖభావనయు నున్నది గదా! వాడు భావించు సౌఖ్యము వానికి లోకజ్ఞానము రాకముందే భావించుచున్నాడు గదా! లోకమునందు చేసెడి కార్యములకు సుఖదుఃఖములు ఫలితములు. కార్యము నందలి కర్తృత్వాభిజ్ఞానము తెలియక ముందే తత్కార్యఫలితమైన సుఖాశ ఎట్లు కలిగినది? ఇది ప్రశ్న. అందుచేత జీవుడు తాను చేసెడి పనికి తాను బాధ్యుడు! వాడు తెలిసి చేయవచ్చును. తెలియక చేయవచ్చును. అనగా లోకమునందు కర్మకు ప్రాధాన్యమున్నదని అర్ధము. ఇట్టి స్థితిలో వేదమరీచి యందు దోషము లేదని చెప్పుట ఎట్లు? ఉన్నది. తత్కర్తృత్వము తజ్జీవగతమై యున్నది. అది బాల్యదశ. అందుచేత నామెను దూషింప రాదన్నచో బాల్య యౌవన కౌమారములు శరీరదశలు. శరీరమునకున్న ఈ దశలను బట్టి జీవుడు వర్తించునా? జీవుడు తానెప్పుడు శరీరమును స్వీకరించెనో దానికి సహజమైన దశలను, తత్తత్కాలముల యందు చేసిన కార్యములను సర్వము నంగీకరించెననియే యర్ధము.”

*****
తెలుగు వికిపీడియా పేజీ

విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

Dhooma Rekha
Purana Vaira Granthamala
Viswanatha Satyanarayana

You Might Also Like

Leave a Reply