భగవంతుని మీది పగ- కవిసమ్రాట్ శ్రీ విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: టి. శ్రీవల్లీ రాధిక
(రాబోయే రోజుల్లో పురాణవైర గ్రంథమాలపై శ్రీవల్లీరాధిక గారి వ్యాసాలు వరుసగా ప్రచురింపబడతాయి – పుస్తకం.నెట్)
*******
పురాణవైర గ్రంథమాలలో ఇది మొదటి నవల. ఇందులో భారత యుద్ధమైన తర్వాత వంద ఏళ్ళు గడిచిన నాటి కథ వ్రాయబడింది. అప్పుడు జనమేజయ మహారాజు తుంగభద్ర ఒడ్డున కొందరు మునులకు కొంత స్థలము దానం చేశాడట. ఆ దానశాసనం వుందట. అంతకన్నా ప్రమాణమేమి కావాలి? అంటారు విశ్వనాథ ఈ నవల పీఠికలో.

ఈ మొదటి నవలలో ప్రధానంగా ఆంధ్ర దేశమే వర్ణింప బడింది. ఆంధ్ర రాజు రోమపాదుడికి ముగ్గురు కొడుకులు – శ్రీముఖుడు, విజయసింహుడు, నాగార్జునుడు. శ్రీముఖుడు యువరాజు. విజయసింహుడు ఖడ్గవిద్యలో మహా నిపుణుడు.

కాళింది, భామ, నీల ఈ రాకుమారుల భార్యలు. ముగ్గురు రాకుమారులవీ, వారి భార్యలవీ కూడా మూడు రకాల స్వరూపాలు, స్వభావాలు. నిరంకుశుడు, జయద్రథుడు అనేవి మరో రెండు ముఖ్యమైన పాత్రలు.

నిరంకుశుడు రాజబంధువు. నిరంకుశుడి తండ్రి ముగ్గురు రాకుమారులకూ, నిరంకుశుడికీ, అతని చెల్లెలు జాంబవతికీ కూడా ఖడ్గ విద్య నేర్పిన గురువు. ఖడ్గవిద్య విషయంలో నిరంకుశుడి మనసులో విజయసింహుడి పట్ల మొదటి నుండీ కొంత స్పర్ధ వుంటుంది. అది ఆ తర్వాతి కాలంలో విజయసింహుడు జాంబవతితో వివాహేతర సంబంధాన్ని ఏర్పరచుకోవడంతో ద్వేషంగా మారుతుంది. విజయసింహుడిని సంహరించే ధ్యేయంతోనే అతడు గంగు అనే గొల్లవాని వద్ద ఒక క్షుద్రవిద్యను సైతం అభ్యసిస్తాడు. ఇక జయద్రథుడి గురించి.

మహాభారత యుద్ధ సమయంలో సింధు దేశపు రాజయిన జయద్రథుడు (సైంధవుడు) అర్జునుడి చేతిలో మరణిస్తాడు. దానికి సంబంధించిన పథక రచన అంతా శ్రీకృష్ణుడిది. అయితే ఈ విషయంగా సైంధవుని భార్య అయిన దుస్సలకి గాని, ఆమె కొడుకుకి కాని పగ లేదు. యుద్ధం తర్వాత ధర్మరాజు అశ్వమేధయాగం చేసిన సందర్భంలో అర్జునుడు దిగ్విజయం చేయడానికి వెళ్ళినపుడు దుస్సల తన చిన్నకొడుకుని తెచ్చి అర్జునుడి పాదాల మీద వుంచి ప్రాణదానం కోరుతుందట. ఆ కుమారుడు పెద్దవాడయ్యి సింధుదేశాన్ని పాలిస్తాడట. ఆ తర్వాత, అంటే ఈ కథా కాలం నాటికి సైంధవుడి మనుమడూ పాలిస్తుంటాడట.

వారెవ్వరికీ లేని పగ సైంధవుడి మేనల్లుడయిన కనకసింహుడికి వుంటుంది. ఆ కనక సింహుడికి ఒక కూతురు వుంది. ఆమెకు తన మేనమామ భార్య అయిన దుస్సల పేరు పెడతాడతను. మ్లేచ్ఛ సంఘాచారములందు అతనికి పరమాభిమానము. వైదిక ధర్మము మీద పగ.

అతడు తన కూతురయిన దుస్సలకి ఆ పగ సాధించడమే జీవిత పరమావధిగా నిర్ణయిస్తాడు. అతడు చేసిన నిర్ణయమేమిటంటే తన కూతురయిన దుస్సల, ఆమె సంతానము వైదిక మతాన్ని వదిలిపెట్టరు. అందులోనే వుండి లోపలినుంచి ఆ మతానికి ఎంత అపకారం చేయాలో అదంతా చేస్తారు. ఆ కనకసింహుని కూతురయిన దుస్సల భర్త పేరు రామఠుడు. పగ తీర్చుకోవడానికి వాళ్ళు ఒక సంప్రదాయమేర్పరుస్తారు. రామఠుడికీ, దుస్సలకీ ఒక కొడుకు పుడతాడు. వాడి పేరు జయద్రథుడు. వాడు పెళ్ళి చేసుకుంటాడు. ఆ పెళ్ళి చేసుకున్న స్త్రీ పేరుని దుస్సల గా మారుస్తారు. ఆ దుస్సలకి ఒక కొడుకు పుడితే వాడి పేరు మళ్ళీ జయద్రథుడే. వాడి భార్య పేరు మళ్ళీ దుస్సలే. ఇలా పగ కొనసాగుతుంది.

కథాకాలం నాటికి అలాంటి దుస్సలా జయద్రథుల తరాలు మూడు గడిచి వుంటాయి. ఈ కథలోని జయద్రథుడు మూడవవాడు. ఇతనికీ భార్య, కొడుకు (నాల్గవ తరము జయద్రథుడు) వుంటారు. భార్యని ఆమె పుట్టింటిలోనే వుంచి జయద్రథుడు, అతని తల్లి దుస్సలా ఆంధ్ర రాజ్యం చేరతారు. దుస్సల అంతఃపురంలోకి ప్రవేశించి మొదట నీలనీ, ఆమె సహాయంతో యువరాజు భార్య అయిన కాళిందినీ తనకి అనుకూలంగా మార్చుకోవాలనీ, తన లక్ష్యసాధనకు ఉపయోగించుకోవాలనీ ప్రయత్నిస్తుంది. మరొక ప్రక్కన జయద్రథుడు రాజకుమారులయిన శ్రీముఖునితో, నాగార్జునుడితో రహస్యంగా స్నేహం చేయడం ద్వారా వాళ్ళని ప్రభావితులను చేస్తుంటాడు.

శ్రీముఖుడూ, విజయ సింహుడూ – యిద్దరూ ఒకేసారి ప్రాణాలు కోల్పోయేలా ఒక పథకాన్నీ రచిస్తాడు. కానీ చివరి క్షణంలో అది విఫలమవుతుంది.
జయద్రథుడు కొరత వేయబడతాడు. అతని భార్యనీ, కొడుకునీ కూడా గ్రహించే ప్రయత్నం చేస్తారు కానీ వారు తప్పించుకుని తపతీ నదినీ, నిషాద దేశాలనీ దాటి వింధ్యారణ్యాలలోని ఒక రహస్య ప్రదేశంలో తల దాచుకుంటారు. కొరత వేయబడిన జయద్రథుడి తలని అతికష్టం మీద రహస్యంగా వారున్న చోటికి తెప్పించుకుంటారు. సంవత్సరం పైన పడుతుంది ఆ శిరస్సుని చేర్చడానికి. అప్పుడు దానిని అందుకున్న జయద్రథుడి భార్య తన కొడుకు చేయి ఆ శిరస్సు మీద పెట్టించి ప్రతిజ్ఞ చేయిస్తుంది. తన శరీరం మీద కాని, తన జీవితం మీద కాని, తన సంతానం మీద కాని తనకి హక్కు లేదనీ, అన్నీ కనక సింహుని పగకే అంకితమనీ అతడు ప్రతిజ్ఞ చేయడంతో నవల పూర్తవుతుంది.

ఈ నవలలో ఆకట్టుకునే అంశాలు, విశ్లేషణలు చాలా వున్నాయి.

నాగార్జునుడి భార్య అయిన నీల స్వభావాన్ని, శ్రీముఖుడి భార్య అయిన కాళింది స్వభావాన్ని వారిద్దరి మధ్య జరిగే సన్నివేశాలని వర్ణించే తీరు చాలా ఆకట్టుకుంటుంది.

నీల పెరిగిన పరిస్థితులు, తీరు భిన్నమైనవి. అందరు క్షత్రియ స్త్రీలలా అసూర్యంపస్యగా పెరగదామె. ఆమె భావాలు, ప్రవర్తనా కూడా మిగిలిన రాచకన్నెలకు భిన్నంగానే వుంటాయి. ఆమె భర్త నాగార్జునునితో చేసే ఒక సంభాషణ యిలా వుంటుంది.

“రాజవంశములలో అక్షరాభ్యాస మనునది అర్ధము లేని మాట. అక్షరములు వ్రాయింతురు. ఇంతకంటె వ్యర్ధమైనది మరి యొక్కటి లేదు. ఏ రాజపురుషుడు వ్రాయ గలుగును? అప్పుడు వ్రాయింతురు. దానితో సరి. వ్రాయసగాండ్రు దేశమునందుందురు. వారందరు బ్రాహ్మణులు…. వేద పండితులకు, శాస్త్ర పండితులకే చదువను, వ్రాయను రానపుడు రాజవంశ ములలోని బాలురకు అక్షరాభ్యాసము చేయుట ఎందులకు? కొన్ని విద్యలు ముఖమునందుండునవి. కొన్ని విద్యలు చేతిలో నుండునవి. ముఖములో వుండు విద్య పేరు చదువు. చేతిలోని విద్య పేరే విద్య. సాలెవాడు బట్టలు నేయుట, కుమ్మరి కుండలు నానుట, అగసాలి నగలు చేయుట, ఇవి విద్యలు. కత్తితో, ధనుస్సుతో, గదతో పోరాడగలుగుట విద్య. అక్షరాభ్యాసము చదువునకు సంబంధించినది. విద్యలకు సంబంధించినది కాదు. నాకు విద్య యందున్నంత గౌరవము చదువునందు లేదు…. ”

ఇదీ ఆమె ధోరణి. ఇటువంటి ధోరణి వున్న నీలను సులభంగా తన మార్గంలోకి తెచ్చుకోవచ్చుననీ, తద్వారా తాననుకున్నది సాధించ వచ్చుననీ అనుకుంటుంది దుస్సల. కొంతవరకూ ఆ ప్రయత్నంలో కృతకృత్యురాలవుతుంది కూడా. అయితే ఆ తర్వాత నీల ద్వారా యువరాజు శ్రీముఖుని భార్య అయిన కాళింది మనసు మార్చే ప్రయత్నం చేసినపుడు కథ అడ్డం తిరుగుతుంది. అక్కడ కాళింది వ్యక్తిత్వాన్నీ, ఆవులిస్తే పేగులు లెక్కపెట్టేయగల ఆమె తెలివితేటలనీ, తన తేజస్సుతో, గాంభీర్యంతో ఎదుటివారిని తన అధీనంలోకి తెచ్చుకోగల ఆమె మహారాజ్ఞీత్వ లక్షణాన్నీ చదువుతుంటే అద్భుతంగా వుంటుంది.

నీల అప్రయత్నంగానే దుస్సల ప్రభావం నుంచి బయటపడి కాళిందిని తన గురువుగా భావించడం.. తాను వినాలనుకున్న నలదమయంతుల కథ చెప్పమంటూ అక్కగారిని అడగడం.. వాళ్ళిద్దరూ ఆ కథ చెప్పుకునే సన్నివేశం.. అదంతా చాలా రమ్యంగా వుంటుంది. దానినిలా వర్ణిస్తారు విశ్వనాథ.

“తరువాత రెండు మూడు ఘడియల కాలము నలచరిత్రమంతయు కాళింది నీలకు చెప్పెను. కథ యడ్డనడక నడచెను. మొదలుపెట్టి తుదివరకు రాలేదు. చిట్టచివర వరకు నీల ప్రశ్నలు వేయుచుండుటయే. ఆ ప్రశ్నలకు సమాధానములు చెప్పుట తోడనే కథయంతయు తిరిగెను. ఆ ప్రశ్నలలోని సొగసెంతయని చెప్పవలయును? ఆమె అడిగిన ప్రశ్నలను బట్టి యీమె సమాధానములను బట్టి కథ వ్రాసినచో, అది ఒక పరమ విలక్షణమైన కావ్యము కావచ్చును. ఆమెకెట్టి ప్రశ్నలు స్పురించుచుండెనో! …”
-ఇలా సాగుతుంది ఆ వర్ణన.

అలాగే తన సంగీతం విని పరవశుడయ్యే భర్త పట్ల విజయసింహుడి భార్య అయిన భామకి పట్టరానంత ప్రేమ వుందని చెప్తూ దానిని యిలా విశ్లేషిస్తారు విశ్వనాథ.
“విద్యలు ప్రదర్శించే వాడున్నపుడు దానినాస్వాదించే వాడు కూడా వుంటాడు. ఆస్వాదించే వాడికి విద్యా ప్రదర్శనము చేసే వాడి శక్తిలో కాస్త కూడా వుండదు. అయినా ఆస్వాదించే వాడు ప్రదర్శించే వాడికి పరమ బంధువుగా, గురు తుల్యుడిగా అనిపిస్తాడు. గురువునయినా దిక్కరిస్తాడు కానీ ఈ ఆస్వాదించే వాడిని ధిక్కరించ లేడు.”
-అందుకే భామ తన ఆత్మలో విజయసింహునికి దాసీ అయిపోయిందట!

ఒక కళాకారుడు, అభిమాని అన్న దృష్టితో చూసినా, భార్యాభర్తలు అన్న దృష్టితో చూసినా.. లేదు కేవలం యిద్దరు మనుషులు అన్న దృష్టితో చూసినా.. ఈ విషయాన్ని గమనించడం, అర్ధం చేసుకోవడం జీవితానికి ఎంత ఉపయుక్తమో కదా అనిపిస్తుంది.

ఇలాంటి పరిశీలనలు విశ్వనాథ వారి నవలలలో మాత్రమే చూడగలం.

****
ఈ పుస్తకం తెలుగు వికీపీడియా లంకె

విశ్వనాథ వారి రచనల కోసం :
Sri Viswanadha Publications
Vijayawada & Hyderabad…
8019000751/9246100751/9246100752/9246100753

(ముఖచిత్రం అందించినందుకు మాగంటి వంశీ గారికి ధన్యవాదాలు – పుస్తకం.నెట్)

You Might Also Like

2 Comments

  1. Radha

    రాధిక గారూ, చాలా బావుంది. మాలతీ చందూర్ గారు గుర్తొచ్చారు. దాదాపు పది ఇరవై పాత్రలున్న నవలని చక్కగా ఎంతో బాగా అర్థమయ్యేట్లుగా పరిచయం చేయడం నిజంగా గొప్పతనం. అభినందనలు. ( సౌమ్య గారన్నట్లు ఈసారి ఇంకొంచెం వివరంగా రాస్తారా – ఎందుకంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది 🙁 )

  2. సౌమ్య

    ఈ వ్యాసాలు మొదలుపెట్టినందుకు ధన్యవాదాలు. పురాణవైర గ్రంథమాలలోని మొదటి ఐదో ఆరో నవలలని ఐదారేళ్ళ క్రితం చదివాను. అంతలోతుగా సైద్ధాంతిక అంశాలు గమనించకపోయినా కూడా, నాకు చాలా క్రియేటివ్ గా అనిపించాయి. అక్కడక్కడా పేజీలకి పేజీలు వర్ణనలు కొంచెం బోరు కొట్టించినా కూడా, మొత్త్తానికి ఆ సిరీస్ నేను బాగా ఇష్టంగా చదివాను. మళ్ళీ ఎప్పుడో వీలు, ఆపుస్తకాలూ కలిసి చిక్కినపుడు మరొకసారి చదవాలి. మీ తదుపరి వ్యాసాల కోసం ఎదురుచూస్తాను 🙂 పరిచయాలు ఇంకాస్త వివరంగా రాయగలరేమో చూడండి.

Leave a Reply