రెండు Bill Bryson పుస్తకాలు

Bill Bryson బాగా ఎంటర్టైన్ చేస్తూనే చాలా ఆసక్తికరమైన విషయాలు చెబుతాడని నేను చదివిన కాస్తలో నేను ఏర్పరుచుకున్న అభిప్రాయం.
(ఇంతా చేసి నేనేదో ఎక్కువ చదివేశా అనుకునేరు – ఒక పుస్తకం పూర్తి చేశాను, రెండు పుస్తకాలు మధ్య మధ్యలో తిరగేశాను, ఒకటీ అరా వ్యాసాలు చదివానంతే మొన్న మొన్నటివరకూ. ఈ డిస్-క్లోజర్ దేనికంటే, రేప్పొద్దున నేనేదో gospel చెప్పినట్లు ఫీలై, ఎవరన్నా వెళ్ళి ఆయన రచనలు చదివేసి, “నాకు నచ్చలేదు. నీ వల్లే నా సమయం వృథాగా పోయింది” అనకుండా ఉండేందుకు.)

విషయానికొస్తే, ఇటీవలి కాలంలో రెండు పుస్తకాలు చదివాను ఈయనవి. మొదటిది – Neither here, nor there – ఆయన తొంభైలలో ఒంటరిగా చేసిన ఐరోపా దేశాల పర్యటన గురించిన యాత్రా స్మృతి. రెండవది – Notes from a Big Country అని బ్రిటన్లోనూ, I’m a stranger here myself అని అమెరికాలోనూ పిలవబడే వ్యాస సంకలనం. మొదటిది చదివి, ఆ చిరాకుని మర్చిపోడానికి రెండోది చదవాల్సి వచ్చింది. చివరికి మటుకు తరువాత చదవాల్సిన Bryson పుస్తకం ఏదీ అన్న దశలోకి వచ్చేశాను మళ్ళీ 🙂 ఈ రెండు పుస్తకాల గురించి నా అభిప్రాయాలు:

మొదటి పుస్తకం: Neither here, nor there
రచయిత తొంభైలలో ఒంటరిగా చేసిన ఐరోపా పర్యటన అనుభవాలు ఈ పుస్తకంలో వ్యాసాలుగా కనిపిస్తాయి. మధ్యలో అయన తన చిన్నతనంలో ఒక స్నేహితుడితో కలిసి చేసిన పర్యటనని తలచుకుంటూ ఆ దారిని మళ్ళీ ట్రేస్ చేస్తాడు ఈ ప్రయాణంలో. ఉత్తరాన నార్వే మొదలుకుని అనేక ఐరోపా దేశాలు చుడుతూ, చివ్వర్న టర్కీ దేశంలో ఇస్తాన్బుల్ నగరం దగ్గర ఆయన ప్రయాణం ఆగుతుంది.

నాకు నచ్చే యాత్రాకథనాల్లో – కొన్ని చాలా informativeగా అనిపిస్తే, కొన్ని పూర్తి వైయక్తికమైనవే అయినా ఆ రచయితల కళ్ళతో మనం ఆ ప్రాంతాలని చూసేంత బాగా ఉంటాయి. బ్రైసన్ నుండి నా expectation ఈ రెంటికి మధ్యా ఉండింది – అంటే తన కళ్ళతో ఆయా ప్రదేశాలు మనకి చూపెడుతూనే వాటి గురించి ఆసక్తికరమైన trivia, historical anecdotes చెప్పుకుంటూ పోతాడని. ఈ trivia విషయంలో దాదాపుగా ఏ వ్యాసమూ నన్ను ఆకట్టుకోలేదనే చెప్పాలి. పైగా, కొన్ని వ్యాఖ్యానాలు మరీ racist గా అనిపించాయి. అలాగే కొన్ని చోట్ల హాస్యం శృతి మించి arroganceలా కనబడ్డది నాకు. మొదటి నాలుగైదు వ్యాసాలూ దాటాక అదొక మూసలో పడిపోయాయి వ్యాసాలన్నీ -తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా…అన్న చందంలో. అంత వివరంగా ఆయనేం తిన్నాడు, ఏ హోటెల్ కి వెళ్ళాడు…ఇవన్నీ మనకెందుకు? అనిపించింది చాలా చోట్ల. (ఆ విధమైన వివరాలు రాయడం గురించి నాకేం అభ్యంతరం లేదు. నేనూ కొంతమంది అలాంటివి రాస్తే ఆసక్తికరంగా చదూతాను…నేనూ అలా రాసుకుంటాను నా బ్లాగులో. కానీ, ఈ రచయిత నుండి అది ఊహించలేదంతే.)

పుస్తకంలో కొన్ని వ్యాసాలు బాగున్నాయి. సోఫియా (బల్గేరియా దేశ రాజధాని) నగరం గురించి రాసిన వ్యాసం చాలా ఆసక్తికరంగా అనిపించింది. 1990లలో ఆయన చూసిన సోఫియాకి, 2013లో నేను చూసిన సోఫియాకి చాలా తేడా ఉన్నట్లు అనిపించింది. అలాగే, ఆయన యుగోస్లావియా గురించి రాసిన వ్యాసం మొదట్లో స్ప్లిట్ అన్న నగరాన్ని ప్రస్తావిస్తారు..అది చూడగానే మరొకసారి కాలం తెచ్చిన మార్పు కొట్టొచ్చినట్లు కనబడ్డది. కారణం – ఇప్పుడా దేశం లేదు, స్ప్లిట్ క్రొయేషియా లో భాగం. Hammerfest లో రచయిత అనుభవాలు నాకు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. కొన్నాళ్ళక్రితం మా ప్రొఫెసర్ గారు ఇలాగే నార్వేలో అతి ఉత్తరాన ఉన్న నగరంలో రెండు వారాలుండి వచ్చాక దాదాపు ఇలాంటి అనుభవాలే పంచుకున్నారు. ఆ Hammerfest అనుభవాలు చదివాక ఇదివరలో ఏ యాత్రాకథనమూ, ఏ వ్యాసమూ, ఏ ఫొటో కలిగించనంత కుతూహలం కలిగింది నాకు Northern Lights చూడ్డంపైన. ఒక టూరిస్టు అనుభవాలుగా చదవడానికి కొన్ని వ్యాసాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఉదా: Hammerfest, Norway; Germany; Liechtenstein; ఇటలీలోని వివిధ ప్రదేశాల గురించిన వ్యాసాలు.

మొత్తానికైతే పుస్తకం నా దృస్టిలో – average.

రెండో పుస్తకం: Notes from a big country
Bill Bryson అమెరికా దేశస్థుడు. అక్కడే పుట్టి పెరిగాడు. కానీ, యువకుడిగా బ్రిటన్ వెళ్ళాక, ఒక బ్రిటిష్ వనితను పెళ్ళాడి అక్కడే స్థిరపడ్డాడు. ఆ తరువాత దాదాపు ఇరవై ఏళ్ళకి తొంభైలలో మళ్ళీ అమెరికాకి కుటుంబంతో సహా వలస వెళ్ళాడు. ఇలా వెళ్ళి అమెరికాలోని New Hampshire ప్రాంతంలో ఇల్లూ అదీ అమర్చుకుని స్థిరపడ్డాక అతనికి ఒకప్పుడు తనకి చిరపరిచితమైన అమెరికా దేశం కొత్తగా అనిపించసాగింది. ఈ ఇరవై ఏళ్ళకాలంలో దేశంలో వచ్చిన మార్పులు ఒక ఎత్తు. ఒక adult గా ఇల్లు నిర్వహించడం అంతా అతను బ్రిటన్ లో చేయడం, అమెరికాలో అవన్నీ కూడా కొత్తగా కనబడ్డం ఒక ఎత్తు. ఈ అనుభవాలన్నీ “The Mail” అన్న బ్రిటిష్ పత్రికకు ఒక కాలం వ్యాసాలుగా రాయడం మొదలుపెట్టాడు. ఆ వ్యాసాల సంకలనమే ఈ పుస్తకం. బ్రిటంలో పై పేరుతోనూ, అమెరికాలో “I’m a Stranger Here Myself” అన్న పేరుతోనూ వచ్చింది.

వ్యాసాలన్నీ అమెరికన్ జీవనవిధానం గురించి చెణుకులతో ఆకట్టుకున్నాయి. అక్కడక్కడా ఆసక్తికరమైన trivia, ఎక్కడికక్కడ నవ్వించే వ్యంగ్య వ్యాఖ్యానాలు ఈ పుస్తకం నచ్చినందుకు ప్రధాన కారణాలు నాకు. సూపర్ మార్కెట్ల నుండి క్రిస్మస్ సంప్రదాయాల దాకా రకరకాల విషయాల మీద వ్యాఖ్యానం ఉంది. కొన్ని చోట్ల ఇతను మరీ అతిగా ఆలోచిస్తున్నాడు అనిపించిన వ్యాసాలు లేకపోలేదు (ఉదా: ఎయిర్ పోర్టులలో ఫొటో ఐడెంటిటీ అడగడం గురించి వ్యాఖ్యానం) కొన్ని వ్యాసాలు మట్టుకు చాలా విషయాలు తెలియజేశాయి. అన్నింటికంటే ముఖ్యంగా – ఈ పుస్తకం చదవడం వల్ల గత పుస్తకం తాలుకా చేదు అనుభవాన్ని మర్చిపోగలిగాను 🙂 ఇతని self-deprecating humor గత పుస్తకంలోని racism మీద వందరెట్లన్నా నయమనిపించింది. మొత్తానికైతే ఈ పుస్తకం మట్టుకు నేను అప్పుడప్పుడు కాలక్షేపానికి తెరిచి ఒకటీ అరా వ్యాసాలు చదివే జాబితాలోకి చేర్చుకుంటున్నాను.

అమెరికన్ జీవన విధానంలోని కొన్ని అంశాలు బయటి వ్యక్తులకి (ఇరవై ఏళ్ళు బయటున్నాడు కనుక ఇతనూ బయటవ్యక్తే అనమాట) ఎలా అనిపిస్తాయో చూడాలనుకుంటే ఈ పుస్తకం చదవొచ్చు. ఆయన ఏదో ఆయన అనుభవాలు మాత్రమే రాశాడన్న ఎరుక ఉండి, “ఆయ్, అమెరికాని విమర్శిస్తాడా! ఎంత ధైర్యం!” అనుకోకుండా చదవగలిగితే చాలు – ఈ పుస్తకం నచ్చవచ్చు.

నేను ఈ రెంటికీ ఈబుక్స్ చదివాను. ప్రయాణాల్లో చదూకోడానికి గొప్ప కాలక్షేపం అనే చెప్పాలి!

You Might Also Like

Leave a Reply