Saramago’s The Gospel According to Jesus Christ

కథ ఎవరిది? దాన్ని ఎవరు చెప్తున్నారు? అన్న రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానల బట్టి ఇంకెన్నో కథలు పుట్టే అవకాశం ఉంటుందని నాకనిపిస్తోంది. కథ దేవుడిది అయ్యి, దాన్ని అచంచల విశ్వాసంగల భక్తుడు చెప్పుకొస్తే అదో అందమైన, నమ్మాలనిపించేంతటి కథ అవుతుంది. ఊహైనా నిజమనిమనిపిస్తుంది. అదే ఒక మైథలాజికల్ కథలో దేవుణ్ణి మనిషిగా మలచి, అతడికి మనిషికున్న అన్ని నియమనిబంధనలు పెట్టి, దేవుణ్ణే ప్రశ్నిస్తూ ఓ దేవుని-పై-నమ్మకం-పెట్టాలో-లేదో-తెలీనివాడు రాస్తే  అది మరో హృద్యమైన కథ పుట్టుకొస్తుంది. అయితే అప్పటిదాకా దేవుణి కథను  భక్తిశ్రద్ధలతో వింటూ, ఎప్పుడన్నా ఎవరన్నా తెల్సో, తెలియకో ప్రశ్నలు వేస్తే “అదంతే! వితండవాదం చేయక!” అని నోరుకట్టేసే అలవాటున్న వారికి  ఈ రెండో కోవకు చెందిన కథలు చిర్రెత్తుకొస్తాయి. అంతే కాదు. ఇంతా శ్రమపడి  చెప్పబడ్డ కథను ఓ కొత్త కోణం నుండి మళ్ళీ చెప్పటంలో మనిషి మనుగుడుకి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు చూపించకపోయినా, కనీసం సరైన ప్రశ్నలు లేవనెత్తకపోతే ఇలాంటి కథల వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. ఏదో కాలక్షేపానికి చదువుకొని, అప్పటికీ తీరిక ఉందనిపిస్తే ఏవో కొన్ని వాదవివాదాల్లో పాల్గొనడానికి తప్ప ఇవి పనికి రావు.

సరమగో ఏసు క్రీస్తు కథ మళ్ళీ కొత్తగా చెప్పుకొచ్చారు. టైటిల్ సూచించినట్టు ఇది The Gospel According to Jesus Christ. యేసు చెప్తాడని కాదు. యేసు పాయింట్ ఆఫ్ వ్యూ నుండి చెప్పిన కథ అనుకోవచ్చు. ఇందులో యేసుకి జన్మనిచ్చిన జోసెఫ్, మేరీ మామూలు మనుషులు. వారి జీవితాల్లోకి దేవదూతలు వచ్చి పోతుంటారు. దేవుదూతలు బిచ్చగాళ్ళగానో, సిపాయిలగానో మారు వేషాల్లో వస్తుంటారు. మేరికి కనిపిస్తే జోసెఫ్‍కు కనిపించరు. సరే, మేరి గర్భవతి అవుతుంది నాజరెత్‍లో. ఆమెకు నెలలు నిండుతుండగా బెత్లహాంకు చేరుకుంటారు దంపతులిద్దరు. అక్కడే యేసు జన్మిస్తాడు, ఒక గుహలో – కాన్పు చేయడానికి ఓ మంత్రసాని, గొర్రెలకాపరి వేషంలో దేవదూతల సమక్షంలో. బిడ్డ పుట్టిన కొన్నాళ్ళ వరకూ తల్లి ఊరు దాటకూడదు. ముప్ఫై మూడు రోజుల విశ్రాంతి తర్వాత గుడిలో పశుబలి ఇచ్చాకే వాళ్ళిద్దరూ ఆ ఊరి వదిలి ఇంటికి చేరుకుంటారు. అన్ని రోజుల తిండితిప్పలకు వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవుగనుక జోసెఫ్ గుడిపనులలో తన వృత్తి అయిన వడ్రంగి పనిలో చేరుతాడు. ఓ రోజున అతడు పనిజేస్తున్న దగ్గరే కొందరు సిపాయిలు చేరి, ఆ పూట వాళ్ళు మూడేళ్ళ లోపు పసివాళ్ళని చంపబోతున్నారని, అది ఆ రాజ్యపు రాజుగారి ఆదేశమని చెప్పుకుంటుంటే విని, కొడుకుని కాపాడుకోవాలనే ఆతృతలో ఇంకేం పట్టించుకోకుండా గుహకు చేరుకుంటాడు. ఊరవతల ఎక్కడో గుహలో పసివాడు ఉండగలడని ఊహించలేని సిపాయిలు అక్కడికి రాకపోవడంతో యేసు క్షేమంగానే ఉంటాడు. బదులుగా మాత్రం పాతిక మంది చిన్నారులను పొట్టనుబెట్టుకుంటారు వాళ్ళు. తన కొడుకును గురించి ఆలోచిస్తూ, తనకు సిపాయిలు పిల్లల్ని చంపడానికి వస్తున్నారన్న వార్తను ఎవరికి అందించలేకపోయినందుకు పట్టరానంత అపరాధభావాన్ని మోస్తూ, పీడకలల బారిన పడతాడు.  తన కొడుకును చంపడానికి తానే సిపాయిలతో కలిసి వెళ్తున్నట్టు ప్రతి రాత్రి కలగంటాడు. చిత్రవధకు గురవుతాడు.

యేసు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ, తండ్రి దగ్గర కులవృత్తిలో మెలకువలు తెలుసుకుంటూ పెరుగుతాడు. అతడికి తోబుట్టువులు పుడతారు. ఓ యుద్ధంలో తోటివాడికి సాయపడబోయి జోసెఫ్ శత్రువుల చేతికి జిక్కి మరణిస్తాడు, కొడుకు కళ్ళముందే. జోసెఫ్ పోయిననాటినుండి అతడి పీడకల యేసుకు వస్తుంటుంది, అదేదో ఆస్తి లభించినట్టు. యేసు తన ప్రశ్నలకు జవాబులు వెతుక్కోడానికి తల్లిని, తోబుట్టువులను వదిలేసి తన జన్మస్థానానికి వెళ్తాడు. ఆ ప్రయాణంలో ఎన్నో తెల్సుకుంటాడు. తాను పుట్టినప్పుడు సాయంజేసిన మంత్రసానిని కలుస్తాడు. అప్పటి గొర్రెలకాపరి దగ్గరే శిష్యుడుగా జేరతాడు. ఒకానొక పూట దేవుడి అతడితో “నువ్వు నా బిడ్డవు.” అని చెప్తాడు. ఆపై యేసు జీవితంలో కలిగే మార్పులు ఏమిటి? దేవుని బిడ్డగా తన పాత్రను పోషించడానికి అతడు సిద్ధమేనా? మనిషిగా పుట్టి దైవకార్యాలు నిర్వహించడానికి అంతర్గతంగా యేసు ఎలాంటి ప్రశ్నలు ఎదుర్కొన్నాడు? దానికి దేవుడు ఎలా సమాధానపరిచాడు? వీటిన్నింటిలో దేవుడు-సైతాను-మనుషుల త్రికోణంలో ఎవరికి ఎంత పాత్రని తెల్సుకున్నాడు? లాంటి ప్రశ్నలతో తక్కిన కథంతా నడిపిస్తారు సరమగో.

సరమగో – by any stretch of imagination is far from being an ordinary writer. He is a genius, by all means. దాన్ని వర్ణించటం నాబోటి వారికి సాధ్యంగాని పని. ఆయన రాసేది ఏదైనా ఎంత authoritativeగా రాస్తారంటే ఆ విషయంతో పాఠకులు ఎంత విభేధించాలనుకుంటున్నా,  ఆయన చెప్పేది ఏంటో ఒకసారైనా వినితీరుతారు. ఆయన కథనం, ఆయన వచనం అలా ఉంటాయి మరి. కట్టిపడేస్తాయి. దేవుని మీద కోపంతోనో, అసహనంతోనో లేవదీసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి ఈ రచనలో.  అయితే ఇందులో కేవలం కోపం, అసహనం మాత్రమే ఉన్నాయనుకుంటే పొరపాటే. ఇందులో అంతర్లీనంగా హాస్యమూ ఉంటుంది. ఆలోచనా ఉంటుంది. ఈ నవలలో యేసు-దేవుడు-సైతాను మధ్య జరిగే ఓ సుధీర్ఘ సంభాషణ చదివి తీరాల్సిందే!

ఇంతకు ముందు సరమగో రచనలు పరిచయం చేసినప్పుడు చెప్పిన విషయాలు ఈ రచనకూ వర్తిస్తాయి. ఆయన వచనం చదవడం అంత తేలికకాదు. కానీ చదువుతున్న కొద్దీ ఆయన పదాలతో, మాటమాటల్లో చేసే గమ్మత్తు భలే గమ్మత్తుగా ఉంటుంది. కథ రాసినట్టు ఉండకుండా, చెప్తున్నట్టు ఉంటుంది ఆయన శైలి. ఈయన మొదటిసారిగా చదువుతున్నవారు ఈయన రచనలని పైకి గట్టిగా చదివితే కొంచెం తేలిగ్గా, అంతే ఆసక్తికరంగా ఉంటుందని నా అనుభవం. అసలు గాస్పెల్స్ నేనెప్పుడూ చదవలేదు. ఏదో పైపైన తెలుసుకున్నదే! అయినా కూడా ఈ రచనను చదువుకోవడం పెద్ద ఇబ్బందులు కలగలేదు. కాకపోతే ఒరిజినల్స్ మీద కూడా కొంత ఐడియా ఉంటే సరమగో చేసిన literary experiments and excursions బాగా తెలుస్తాయి.

మనుషులకి జవాబులు దొరకనప్పుడల్లా అందుకు అనుకూలమైన కథలు చెప్పుకున్నారనుకుంటాను. వాటిలో నిజానిజాల జోలికి పోకుండా దాన్ని నమ్ముతూ వచ్చారు. అలాంటి కథల్లోనూ కొన్ని ప్రశ్నలు పుట్టుకొచ్చాయి. వాటిని లేవదీసినప్పుడల్లా గోలజేసే వారున్నా ఆ ప్రశ్నలను లేపే కథలు ముఖ్యం. ఎందుకంటే ఊయలలో పిల్లవాడిని లాలించినట్టు దేవుడి మనిషిని పాలిస్తున్నాడని అనుకుంటే మనిషికి ఎందుకింత కష్టం? ఎందుకింత అశ్శాంతి? ఆ ప్రశ్నలకు ఎవరి సమాధానాలు వారికి ఉండచ్చు. సరమగో సమాధానం ఈ నవల. నచ్చినవాళ్ళు చక్కగా చదువుకోవచ్చు. నవ్వుకోవచ్చు. ఆలోచించుకోవచ్చు. నచ్చనివాళ్ళు ఈ పుస్తకం జోలికే పోకుండా దైవస్మరణలో నిమగ్నైపోవచ్చు. 🙂

 

The Gospel According to Jesus Christ
Jose Saramago
Fiction
Paperback
333

You Might Also Like

2 Comments

  1. Nagini

    సరమాగోను నాకు పరిచయం చేసింది మీరే..తప్పకుండా చదివి తీరాలన్న ఆసక్తి కలిగించారు.. థాంక్ యు 🙂

  2. Halley

    Have added Saramago to my to-read list. Thanks for the review! 🙂

Leave a Reply