కథల్లో కథగా కథై – Pamuk’s My Name is Red.

ఒర్హాన్ పాముక్ పుస్తకాలేవీ చదవకముందే ఆయన వీరాభిమానిని అయ్యాను. అందుకు కారణం ఆయన నోబెల్ ప్రైజ్ అందుకునేడప్పుడు ఇచ్చిన ఉపన్యాసం. ఆయణ్ణి నాకు పరిచయం చేసినవారు ముందుగా ఈ లింక్ పంపారు. అది చదివిన మొదటిసారి నుండి ఇప్పటివరకూ నాకదో పాఠ్యపుస్తకం. అందులో ఆయన తాను రచయితగా ఎదగడానికి గల నేపథ్యాన్ని, అందుకు పడిన శ్రమని, ముఖ్యంగా తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని చాలా చక్కగా చెప్పుకొచ్చారు. నన్నడిగితే అదో అందమైన కథ. సాహిత్యం, రచనలు చేయడంపై ఆసక్తి ఉన్నవారే కాదు, కళాకారులు, కళారాధకులు చదవాల్సిన లెక్చర్ అది.

ఇప్పుడు నేను పరిచయం చేయబోతున్న పుస్తకం అర్థం అవ్వాలన్నా, దాన్ని ఆస్వాదించగలగాలన్నా పైన ప్రస్తావించిన లెక్చర్ చాలా ఉపయోగపడుతుందనుకుంటాను. ఓ రచనను చదవడానికి ఆ రచయిత నేపథ్యం తెలియకపోవటం వల్ల కొన్ని లాభాలుంటాయి. ఉదాహరణకు రచయిత వ్యక్తిగతంగా ఎలాంటి ఒత్తిళ్ళకు లోనై రచనను చేశాడు, పాత్రలపై ఎలాంటి అభిప్రాయాలను రుద్దాడు అన్నవి విస్మరించి చదవటం వల్ల కొన్ని రచనలు బాగననిపించచ్చు. అలానే, రచయిత నేపథ్యం తెలియటం వల్ల కొన్ని రచనల నుండి ఏం ఆశించచ్చు, లేక రచనలో కొన్ని అలానే ఉండడానికి కారణాలు ఎలాంటివి అన్న బోధపడ్డం రచనను మరింత ఆస్వాదించచ్చు.

ఒర్హాన్ పాముక్ నవలలో విపరీతమైన జనాదరణ పొందిన నవల, ఓ రకంగా ఆయనకు నోబెల్ ఇప్పించిన పుస్తకం – My Name is Red. ఆరువందల అరవై ఆరు పేజీల సుధీర్ఘ నవల ఇది. టర్కిష్‍లో రాసిన ఈ నవలకు ఆంగ్లానువాదం 2001లో వచ్చింది.

ఇదో హిస్టారికల్ నవల. ఒట్టామాన్ రాజ్యం నాటి కథ. అప్పటికి టర్కీ సంధికాలంలో ఉంది. యుగయుగాలుగా వస్తున్న పరంపర, కొత్తకొత్తగా తెలిసివస్తున్న యూరపీయన్ టెక్నిక్కుల మధ్య అప్పటి miniaturists ఎలాంటి dilemmasను ఎదుర్కున్నారు? అవి ఏ యుద్ధాలకు దారితీసాయి? చివరకు ఎవరు లేక ఏవి గెలిచాయి? అన్నదే ఈ సుధీర్ఘ నవల కథాంశం. కళాకారులు – ముఖ్యంగా, తమ స్వంత సృష్టి కాకుండా ఎన్నో ఏళ్ళ పరంపరను తమ భుజాలపై జాగ్రత్తగా మోసి, తర్వాతి తరాలవారికి అందించాల్సిన బాధ్యతను మోసే కళాకారుల జీవితం ఎంతటి దుర్భరమో ఈ నవల చదివితే అర్థమవుతుంది. ఓ కళాకారుడు సృష్టించిన కళలో అతడి ముద్ర కనిపించాలా? లేక అతడే కనుమరుగయ్యేంతగా కళలో కలసిపోవాలా? ఓ పరంపరను యధాతథంగా కాపడ్డం ఉత్తమమా? లేక కొత్తదనాన్ని జతజేస్తూ దాన్ని నిత్యనూతనంగా ముందు తరాలవారికి అందించాలా? అన్న ప్రశ్నలు లేవదీస్తుంది ఈ నవల.

ఆ ప్రశ్నలను ఏదో లెక్చర్లలాగా లేవదీయదు. ఆయా కళాకారులు పడే అంతర్మధనంగా మనముందుకు తీసుకొస్తారు రచయిత. ఈ నవలలోని అన్ని కీలక పాత్రలూ తమ కథను తామే చెప్పుకుంటాయి, ఒక్కో చాఫ్టర్లో. అసలు నవల మొదలవ్వడమే ఓ శవం మనతో మాట్లాడ్డంతో మొదలవుతుంది. అవును, ఇందులో పాఠకులైన మనం కథలో అంతర్భాగం. ఏదో కథ ఉంది, అది చెప్పాలి, అందుకని చెప్తున్నాం, వింటే విను, లేకుంటే లేదు – అన్న చందాన కథ నడిపిస్తే ఇది పాముక్ నవల అవ్వదు కదా! ఆయన పాఠకునితోనే ఆటలు ఆడుకుంటారు. ఇందులోని పాత్రలన్నీ పాఠకుని నమ్మి తమ రహస్యాలను పంచుకుంటారు. తమ నిగూఢ ఆలోచనలను నిర్మొహమాటంగా చెప్తారు. ప్రశ్నలు గుప్పిస్తారు. అనుమానాలు రేకెత్తిస్తారు. పొడుపు కథల్లాంటి కథలు చెప్పి, “ఎవరో చెప్పుకో చూద్దాం?” అన్న సవాలు విసురుతారు. ఇన్నింటి మధ్య పాఠకునిగా ఊపిరి పీల్చుకోడానికి సమయం ఉండదు. వీటికి తోడు కథలో కీలక పాత్ర వహించే వస్తువులు, జంతువులు, రంగులు కూడా తమ వంతుగా కథను చెప్పుకుంటూ పోతాయి. నాకైతే, మంచుదుప్పటి కప్పుకున్న టర్కీలో అటూ-ఇటూ తిరుగుతూ కనిపించిన, కనిపించన వారందరి నుండి కథలు విన్న కలిగింది. కథలు చెప్పించుకునే వయసుదాటిపోయాక ఇంతకన్నా నేను అడిగేది ఏముంటుంది?

ఆ వాగ్ఝరిలో కొట్టుకుపోకుండా సమర్థవంతంగా ఎదురు ఈదగల పాఠకునికే ఈ నవలలోని మర్మం తెలుస్తుందని నా నమ్మకం. అది ఒక్కసారి చదవడంతో రాకపోవచ్చు. కానీ, బేసికల్లీ ఈ నవల మనం చిన్నప్పుడు చదివిన జానపద కథల్లా ఉంటుంది. ఆ కథలు చిన్నప్పుడు విన్నప్పుడు ఒకలా ఉంటాయి. పిల్లలు పుట్టాక వాళ్ళకి చెప్పేటప్పుడు మనకి కొత్త అర్థాలు స్ఫురిస్తాయి. అవే కథలను జీవితాన్ని చూశాక, మనవలకు చెప్పేటప్పుడు ఒక పూర్తి చక్రం తిరిగిన భావన కలిగిస్తాయి. ఈ నవల్లో కూడా అలాంటి కథలు కూర్చారు రచయిత. అవి ఒక లేయర్లో, నవలకు మూలాధారమైన “హంతకుడెవరో?” అన్న ప్రశ్నకు హింట్స్ గా మలిచినా, మరో లేయర్లో ఆ ప్రశ్నకు మించిన ప్రశ్నలకు సమాధానాలు నిక్షిప్తం చేసున్నారని నాకనిపించింది. ఒక వేళ అలాంటి కథలూ, ఆ కథలలోని మార్మికత మీకు నచ్చనవి అయితే ఈ రచన కూడా నచ్చకపోవచ్చు.

ఇహ ఒక్కప్పటి miniaturists ల జీవితాన్ని, వారి కళనూ అర్థం చేసుకోడానికి ఈ నవలో మంచి సాధనం. అలానే అప్పటి కాలానికి, ఆ స్థలానికి చెందినవారు పవిత్రంగా భావించే పుస్తకాల ప్రస్తావన కూడా ఇందులో అధికంగా ఉంటుంది. పైగా ఇది ఇస్లామ్ మతస్థుల కథ. వీటితో అంతగా పరిచయంలేని నాలాంటి ఆ పదాలను, వాటి నేపథ్యాలను అర్థంజేసుకోవడంలో తడబడడం ఖాయం. కాకపోతే, ఆ సింబిల్స్ ను దాటవేయించి, కథను అర్థంచేసుకునే అవకాశం రచయిత ఇస్తూనే ఉంటారు. ఈ నవలకు ఈ పేరే ఎందుకు పెట్టారో నాకు అర్థంకాలేదు. అలానే, హంతకుడు తనని గురించి ఎన్ని హింట్స్ ఇస్తున్నానని చెప్పినా కూడా నేను అతణ్ణి గుర్తించలేకపోయాను. అసలే థ్రిల్లర్లు చదివేటప్పుడు, చూసేటప్పుడు నేను అనుమానించినవాడు ఎప్పుడూ దొంగకాడు! బహుశా, నాలాంటి వారే అత్యధికులుగా ఉంటారన్న నమ్మకంతో “థ్రిల్లర్” ఒక జాన్రేగా నడుస్తుందేమో!

అనువాదమే అయినా My Name is Red చక్కగా చదివిస్తుంది. కథలంటే చెవి కోసుకునేవారు తప్పక చదవాల్సిన పుస్తకం.

My Name is Red
Orhan Pamuk
faber n faber
666

You Might Also Like

3 Comments

  1. kameswari yaddanapudi

    పుర్ణిమగారు
    మీరు చెప్పిన వ్యాసం ఎక్కడ దొరుకుతుంది, ఆన్ లైన్లో దొరుకుతుందా. లింకు పంపగలరా? మంచి పుస్తకాన్ని పరిచయం చేసారూ మీ పరిచయం కూడా కొత్తగా చక్కగా ఉంది.

    1. Purnima

      కామేశ్వరి గారు,

      లింక్ ఇదిగో..

      http://www.nobelprize.org/nobel_prizes/literature/laureates/2006/pamuk-lecture_en.html

      థాంక్స్.

  2. Halley

    Years ago, i tried reading both “My name is red” and “Snow”, i found the narrative style very complex. It was anything but readable for me. But i like the turkish flavour in his novels. Got to know a lot about turkey’s tryst with Secularism after reading Snow.

Leave a Reply to kameswari yaddanapudi Cancel