వేనరాజు, ఖూనీ

వ్యాసకర్త: Halley
***********
ఈ వ్యాసం వేనరాజు గురించీ, ఖూనీ గురించీ. “వేనరాజు” విశ్వనాథ వారు రాసిన నాటిక, అప్పట్లో దీని మీద పెద్ద దుమారమే రేగి కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారు దీనికి ప్రతిగా “ఖూనీ” రాసారట. నేను వేనరాజు చదివి కొన్ని నెలలు కావొస్తోంది. ఆ నాటిక నేను చదవటానికి కారణం పోయిన సంవత్సరం “అభ్యుదయ చలన చిత్ర రథ సారథి – గూడవల్లి రామబ్రహ్మం” అన్న పుస్తకం చదవటం. అందులో ఒక చోట విశ్వనాథ వారు మద్రాసులో వేనరాజు నాటికను ప్రదర్శించారనీ అప్పట్లో ఆ నాటిక పైన చాలా రభస జరిగిందనీ దానితో విశ్వనాథ వారు చాలా కలత చెందారనీ రాసారు. ఎంతగా బాధ పడ్డారంటే వారి బాధని చూసిన చాలా మంది అయన ఆ వ్యాకులతతోనే సముద్రంలోకి దూకి చచ్చిపోతారని అనుకున్నారట అప్పట్లో. ఈ గొడవ జరిగిన మూడో రోజున మానసిక సాంత్వన కోసం విశ్వనాథ వారు రామబ్రహ్మం గారిని కలవటానికి వెళ్లారట. ఈ విషయం గురించి రాసారు ఆ పుస్తకంలో. ఈ పిట్టకథ చదివిన వెంటనే వేనరాజు చదివేసా నేను అదొక క్యూరియాసిటీ తో. గొడవలు రేపటానికి కావలసినంత సరుకు ఉంది ఈ నాటకంలో. మంచి పసందైన వాద ప్రతివాదనలు ఉన్నాయి. ఆలోచించుకోటానికి కావలసినన్ని విషయాలు ఉన్నాయి. ఈ మధ్యనే కవిరాజు గారి “ఖూనీ” చదవటం జరిగింది. దెబ్బకి మళ్ళీ వేనరాజు గుర్తొచ్చాడు.

భాగవతం ఆధారమట ఈ ఇరువురు రచయితల వేనరాజుకు. భాగవతం ప్రకారం అంగరాజు కుమారుడైన వేనుడు పాషండుడు, నాస్తికుడు అన్న ప్రాతిపదికనే ఇద్దరు రచన చేసినట్టు నాకు అనిపించింది. రాజైన వేనుడికి ముని (బ్రాహ్మణుడు) అయిన గౌతముడికి మధ్య నడిచేది ప్రధాన కథ. అయితే కవిరాజు గారు తమ పీఠికలో చెప్పినట్టు తేడా కూడా అక్కడే వస్తుంది. పాషండుడు అంటే వేదబాహ్యుడు. ఇందులో పెద్ద దోషమేముంది? ఈ కాలంలో వేదాల్లో విశ్వాసం ఉండి ధర్మాన్ని అనుసరించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? వేనుడు నాస్తికుడు అయినంత మాత్రాన దుర్మార్గుడు అవ్వనక్కర్లేదే? అని ఎదురు ప్రశ్నిస్తారు కవిరాజు గారు. ప్రపంచంలో 150 కోట్ల మంది ఉంటే (1935 నాటి మాట) అందులో 90 కోట్ల మంది నాస్తికులేననీ పేరుకి జన్మతః వచ్చిన మతం ఉన్నపటికీ చాలా వరకు జనాలకు భగవంతుడి మీద విశ్వాసం లేదనీ అంటారు కవిరాజు గారు. అంతటితో ఆగక “మతము అనునది ప్రతి దేశము నందు సౌజన్యము, సౌభ్రాతృత్వము, సమానత్వమును చిందర వందర చేసి, మానవుల నల్లకల్లొలము చేసి, ప్రపంచ శాంతి లేకుండా చేయుటయే కాకుండా మహాపురుషులని తన పొట్టన పెట్టుకుందని” అంటారు. భగవంతుడు అంటే మూఢ మానవ ప్రతిపాదితుడు అని అంటారు కవిరాజు గారు. “ఆస్తికత్వము ప్రపంచ పరిణామానికి ఆటంకం కలుగ జేసింది కానీ తోడ్పడలేదని గట్టిగా చెప్పవచ్చును” అని అంటారు ఆయన. ఇక విశ్వనాథ వారి గురించి ఈ విషయంలో వేరే చెప్పుకోనక్కరలేదు అనుకుంటాను. అయన సనాతన ధర్మమూ, వర్ణ వ్యవస్థా, భగవంతుడు వగైరాలను సమర్థిస్తూ ఒక నిశ్చితాభిప్రాయంతో ప్రతీ రచనలోనూ ఈ విషయాలనే పాఠకులతో పంచుకున్నారు. ఇలా భిన్న ధ్రువాలు అయినటువంటి ఇద్దరు రచయితలు ఈ “వేనరాజు” అనే పాత్రను ఎలా చిత్రీకరించారో తెలియాలి అంటే ఆ రెండు నాటికలూ చదివి తీరాల్సిందే! అసలు ఈ కాలంలో ఈ నాటకాలని బ్యాక్ టు బ్యాక్ ఎవరన్నా స్టేజి మీద ప్రదర్శిస్తే “ఆహా నా రాజా” అనట్టు ఎంత బాగుంటుందో! పోనీ సినిమాగా తీసినా పర్లేదు. ఫస్ట్ హాఫ్ విశ్వనాథ సెకండ్ హాఫ్ కవిరాజు!

అయితే ఇక్కడ ఒక విషయం గమనించుకోవాలి. పరస్పర విరుద్ధ భావాలు ఎన్ని ఉన్నపటికినీ నేటికి మల్లే బహాబాహీలకి వచ్చి అమ్మనా బూతులు తిట్టుకునే సంస్కృతి అప్పటికి ఉన్నట్టుగా లేదు మన తెలుగు దేశంలో. విశ్వనాథ వారి గురించీ వారి వేనరాజు గురించీ రాస్తూ ఇలా అన్నారు కవిరాజు చౌదరి గారు- “సత్యనారాయణ గారు Versatile Genius కావచ్చును, కాకపోవచ్చును. దానితో మాకు సంబంధం లేదు. వారు వ్రాసిన గ్రంథం తోడను, నందలి అభిప్రాయము తోడను మాత్రమే మాకు సంబంధము” అని. ఏమైనా ఆ కాలంలో ఒక పద్ధతి పాడు ఉన్నట్టు ఉంది గొడవ పడటానికి కూడా! చలం “మైదానం” రాస్తే విశ్వనాథ “చెలియలి కట్ట”. విశ్వనాథ “వేనరాజు” వస్తే కవిరాజు “ఖూనీ”!

నిజానికి ఇద్దరినీ పోల్చుకుంటే విశ్వనాథ వారి వేనరాజే పెద్ద నాస్తికుడు. అంటే ఓర్నాయనో నాస్తికత్వం అంటే ఇదా అని నాస్తికులు కూడా భయపడేలా ఉంటాడు వారి వేనరాజు. నాస్తికులలో కూడా మంచివారు ఉంటారు. Atheists have morals too అనట్టు ఉంటాడు కవిరాజు గారి వేనరాజు. కాబట్టి కొంచెం సాఫ్ట్ ఐపోయాడు అయన వేనరాజు. విశ్వనాథ వేనరాజు దగ్గరకి వచ్చేసరికి అసలు నాస్తికత్వంలో కూడా తిరుగు లేదు ఆ పాత్రకి. నాటిక మొదలు లోనే “నా రాజ్యంలో ఎవరు వివాహం చేసుకోరాదు” , “వివాహం సంతానార్థం కాదు. ప్రేమించుటకు మాత్రమే” అని అంటూ, స్వలింగ వివాహాల గురించి ప్రస్తావిస్తాడు వారి వేనుడు. అసలు విశ్వనాథ వారి వేనరాజులో ఈ స్వలింగ ప్రేమ ప్రస్తావన గురించి చదివిన మొదటి సారి నేను షాక్ తిన్నాను. ఇదేమిటి విశ్వనాథ వారి నాటకమేనా లేక ఇంకా ఏమైనానా అని. ఇది కాక మరో చోట విశ్వనాథ వారి వేనుడు “ఏక గర్భ జనితులైన స్త్రీ పురుషులు వివాహమాడినచో అస్తి విషయమున భేదమే రాదు కదా” అని అంటాడు! ఇది మరో విపరీతం! ఇది కాక విశ్వనాథ వారి వేనుడు తనకి స్త్రీ సౌందర్యం కంటే పురుష సౌందర్యమే గొప్పగా అనిపిస్తుందని అంటాడు. ఈ విధంగా ప్రత్యక్ష ప్రమాణాన్ని మాత్రమే నమ్ముతూ సంప్రదాయాన్ని వ్యతిరేకిస్తూ నాస్తికుడైన వేనుడి విపరీతాలు చాలానే ఉంటాయి విశ్వనాథ వారి వేనరాజులో. అంటే మతం+దైవం+ధర్మం వగైరాల వంటిది ఒక moral compass అన్నది రాజుకి లేనప్పుడు సమాజం ఎంత విపరీతంగా ఉండచ్చో అవన్నీ కనపడతాయి విశ్వనాథ వారి వేనుడిలో. ఇవేవి కవిరాజు గారి వేనుడికి ఉండవు. ఇది కాక ఈ నాటిక లో పృథువు మొదట వేనుడికి చెల్లిగా తర్వాత తమ్ముడిగా కనిపిస్తాడు విశ్వనాథ వారి వర్షన్ లో. అసలు ఈ పాత్రకి తాను జన్మతః పురుషుడనని స్త్రీని కానని తెలియటానికి చాలా సమయం పడుతుంది నాటకంలో. కవిరాజు గారి నాటిక లో పృథువు వేనుడి కొడుకు. ఇలా చాలానే తేడాలు ఉన్నాయి రెంటిలో.

ముందుగా కవిరాజు త్రిపురనేని రామస్వామి చౌదరి గారి “ఖూనీ” గురించి.

ఈ నాటిక మొదలు యజ్ఞాల గురించిన చర్చతో. వేనుడు గౌతముడిని యజ్ఞ యాగాదులు లోక కళ్యాణము కొరకే అని రుజువు పరచమంటాడు. తన పూర్వికులు పూర్వాచార పరాయణులు అయినంత మాత్రాన తానూ కూడా వారికి లాగే యజ్ఞాలు చేయాలనీ లేదనీ, యజ్ఞాలలో జరిగే జీవ హింసకు తాను వ్యతిరేకి ననీ అంటాడు వేనుడు. “ఋషి తిరస్కారము నరక లోకమునకు దారి తీయును” అని గౌతముడు అంటే “ఎక్కడ ఉంది ఆ లోకము? మీరు కానీ మీ గురు పరంపరలో ఎవరైనా గానీ చూసి వచ్చారా? మాటి మాటికి ఆ ప్రస్తావన తెస్తున్నారు” అని ఎదురు ప్రశ్న వేస్తాడు వేనుడు. మరొక చోట “భగవంతుడంటే ఎవడు? నా రాజ్యంలో నాకు ఎపుడూ కనపడలేదే? అయన ఉద్యోగమేమి?” అని సూటిగా అడుగుతాడు వేనుడు. ఈ విషయంపై గౌతముడికీ వేనుడికి వాగ్వివాదము అవుతుంది. “పుట్టినది గిట్టకున్నదేది? ఇందులో భగవంతునకు పెత్తన మేల?” అని ప్రశ్నిస్తాడు వేనుడు. అయితే కవిరాజు వారు వేనుడు మత వ్యతిరేకి అని కూడా అనలేము. మీరు జపం చేసుకోండి తపం చేసుకోండి మీ విజ్ఞాన ధనమును లోకమంతా వెదజల్లండి కానీ ప్రాణి హింస మాత్రం చేయకండి అని అంటాడు” ఒక చోట.

ఇలా కాసేపయ్యాక సైన్యాధిపతి దృష్ట వర్మ మరియు గౌతముడు కలిసి వైదిక ధర్మ విరోధి అయిన వేనుడి పాలన అంతమవ్వాలనీ అతని కుమారుడైన పృథు కుమారుడిని రాజు చేయాలనీ తీర్మానిస్తారు. అయితే ఈ విషయాలన్నీ ముందుగానే తెల్సినా కూడా వేనుడు నింపాదిగా తన తల్లితో తాను ప్రజలని అభ్యుదయ పథాన తీసుకొని వెళ్ళటానికి ఎంతో తాపత్రయ పడ్డాననీ అయినను ప్రజలు మేల్కొన లేదనీ వారు మునుల చేతిలో కీలు బొమ్మలైనారనీ అంటాడు. ఇంత తెలిసి కూడా తాను ఎవరి పైనా యుద్ధము చెయననీ ఆత్మ రక్షణ కోసం కూడా ప్రతి దాడి చేయననీ, తన కార్యము ముగిసినదనీ తాను చావుకి సిద్ధమనీ అంటాడు తన తల్లితో. తన తదనంతరం ఏ బుద్ధుడో అవతరించి ఈ ప్రజలను బాగు చేస్తాడు అని ఆశ వ్యక్తం చేస్తాడు వేనుడు.

చివరి ఘట్టంలో వేనుడిని చంపేసాక స్వామి హత్య చేసిన సైన్యాధిపతి దృష్ట వర్మ పితృ హత్య చేసిన పృథు కుమారుడికి మధ్యన పశ్చాత్తాపంతో నిండిన ఒక సంభాషణ జరుగుతుంది. స్వామి హత్య చేసిన బాధతో దృష్ట వర్మకు పిచ్చి పడుతుంది. ఎక్కడ తమ కుట్ర బయట పెడతాడో అని గౌతముడి ఆజ్ఞ మేరకు పృథు కుమారుడు దృష్ట వర్మను హతమారుస్తాడు. మొత్తానికి తమ ప్రాబల్యం నిలుపోకోవటం కోసం మునులు(బ్రాహ్మణులు) తెలివిగా పృథు కుమారుడిని వలలో వేసుకొని మాయ మాటలతో దృష్ట వర్మ ను స్వామి ద్రోహానికి ఉసిగొల్పి పవిత్ర హృదయుడైన ఎంతో ఔదార్యం గల వాడైన వేనుడి మృతికి కారణమయ్యారు అన్నట్టుగా ముగుస్తుంది నాటిక. అయితే ఈ నాటికలో “నిషాదుడు” అనే పాత్ర నాకు సరిగ్గా అర్థమవలేదు. కాబట్టి ఆ పాత్ర గురించి ఈ పరిచయంలో ప్రస్తావించట్లేదు.

ఇక విశ్వనాథ వారి వేనరాజు గురించి. నేను ఒక రెండు మూడు సార్లు చదివాను ఈ నాటకం లోని భాగాలని గత సంవత్సర కాలం లో. చాలా పదునైన సంభాషణలు ఉన్నాయి ఈ నాటికలో.

ఈ నాటికలో వేనుడి తండ్రి అయిన అంగరాజు బతికే ఉంటాడు. విశ్వనాథ వారి వేనుడు భగవంతుడు ఉన్నాడా లేడా అని గౌతముడితో వాదులాడటంతో మొదలవుతుంది నాటిక. “ఈ పాత భావాలన్నీ మనలను పిశాచముల వలె పట్టుకున్నాయనీ అవి వదిలితే గానీ మనం బాగు పడమనీ” అంటాడు వేనుడు. ఇది ఇలా జరుగుతూ ఉండగానే వినీత భట్టు మనవడు అయిన కుర్రవందిని చంపివేయమని ఆజ్ఞాపిస్తాడు వేనుడు. వినీత భట్టు ఒక పక్కన తన మనవడిని క్షమించమని వేడుకుంటూ ఉంటాడు, అయినా వేనుడు చలించక “చెల్లెలు” అయిన పృథువుతో పూవుల గురించి సంభాషిస్తూ ఉంటాడు. వినీత భట్టు మరియు అతని మనవడు కుర్రవంది మరణంతో ఈ అంకం ముగుస్తుంది.

వేనుడి పాలనలో దివ్యమైన పూర్వ మత నాశనము జరగటం గురించీ ఆచారాలు మంటగలిసి పోవటం గురించీ గౌతముడు వేనుడితో చర్చిస్తాడు. ఈ చర్చ ముదిరి పాకన పడి వారి మధ్యన వైరం స్థిరపడుతుంది.

పూర్వాచారాలను పూర్వపు ఆలోచనలను స్మృతులను త్యజించాలంటూ వేనుడు పృథువుని “మీరందరూ స్వంతంగా ఎందుకు ఆలోచించరు ” అని అడుగుతాడు. అపుడు పృథువు ఇచ్చిన జవాబు నాకు నచ్చింది. కొయ్యకు కొయ్యకు రాపిడి వలన అగ్ని పుట్టునని పూర్వులు చూపారనీ ఆ విషయ జ్ఞానాన్ని మనము వాడుకుంటూ సర్వ సిద్ధముగా ఉన్న ఆ అగ్నినే వాడుకుంటున్నామనీ అంతే కానీ తిరిగి ఆ విషయం కనిపెట్టే ప్రయత్నం చేయట్లేదనీ అలా చేయటం వలన మానవ జాతి అభివృద్ధి చెందదనీ అలానే సంఘ విషయమున కూడా పూర్వులు కొన్ని నియమాలు చేసారనీ అంటాడు పృథువు. అయితే అగ్ని ప్రత్యక్షం కాబట్టి దానిని నమ్ముతాడనీ ఈ నియమాల తాలూకా వ్యవహారం అప్రత్యక్షం కాబట్టి వేనుడు నమ్మడనీ అంటాడు పృథువు. అంతట తండ్రి అయిన అంగరాజు ప్రవేశించి “నువ్వు నమ్మనిది అప్రత్యక్షాన్ని కాదు నీకు ఇష్టము లేని దానిని” అని అంటాడు వేనుడితో. “నువ్వు సునీథ (అంగరాజు భార్య, వేనుడి తల్లి) కడుపున పుట్టావు అన్నది కూడా అప్రత్యక్షమే కానీ దాని వల్ల నీకు రాజ్యం సిద్ధిస్తోంది కాబట్టి దానిని నమ్ముతావు. ధన విషయంలో అధికారం విషయంలో అన్నీ నమ్ముతావు. నీతి ధర్మం విషయంలో ఏదీ నమ్మవు” అని అంటాడు. ఇలా సాగుతుంది అంగరాజు వాదన. వేనుడి రాజ్యంలో జరిగే state sanctioned murders గురించి ఒక ప్రస్తావన వస్తుంది. అప్పుడు అంగరాజు వేనుడిని ఉద్దేశిస్తూ “అందరు మానవులు ఒకటే ఎక్కువ తక్కువలు లేవని మీ సిద్ధాంతము. మేము మాత్రమూ రాజులము. మేమెవరిని చంపిననూ తప్పులేదు అనే కదా నీ అభిప్రాయము” అని అంటాడు. ఇలా ఇంచు మంచు ప్రతి పాత్రా వేనుడిని ఎదురు ప్రశ్నించేదే!

ఒక చోట “అస్తి” వాదము “అస్థికల వాదము” గురించి ఒక ప్రస్తావన ఉంది. నిష్కర్షగా ప్రజలని ఊచకోత చేయించే వేనుడు చేసే వాదనల వలననే ఆ చనిపోయినవారు అస్థికలైనారనీ అంటాడు పృథువు. ఈ తరహా మారణహోమాలు చేసే వేనుడు మనకి కవిరాజు గారి దగ్గర కనపడడు. ఆ ఊహ విశ్వనాథ వారికే సొంతం!

విశ్వనాథ వారి రచనలో వేనుడికి గౌతముడికి ఒక love-hate బంధం ఉంటుంది. అపుడపుడూ వారి మధ్య ప్రేమానురాగాలు పొంగి పొరలుతాయి వెను వెంటనే బద్ధ వైరాలు! నాటకాంతమున కూడా ఇద్దరి మధ్యనా ఒంటరి యుద్ధం జరుగుతుంది.

ఇక పృథువు కూడా అంతే. పైన చెప్పినట్టుగా సగం నాటకం అతను వేనుడి చెల్లి అయితే మిగిలిన సగం అతని తమ్ముడు. పృథువుడి ఆడ పుట్టుక కాదు అతను మగ వాడు అని తెలిస్తే వేనుడు అతనిని చంపేస్తాడని అంగరాజు ఇలా ఆడపిల్లలా పెంచాడనీ అంటారు ఒక చోట. మరో చోట “స్త్రీలు నన్ను కామించుచుండగా నేను మగవాడను అవుతాను కానీ స్త్రీని కాను కదా” అని అంటాడు పృథువు వేనుడితో. “నిన్ను కామించుచున్న ఆ స్త్రీ పురుషుడేమో” అని అంటాడు వేనుడు. ఇలా చిత్రాతి చిత్రంగా ఉంటాయి వారి మధ్యన సంభాషణలు.

ఇక వేనుడి చేతిలో హతమయిన వారికి అంగరాజు ప్రాణం పోసి వారికీ పిశాచ రూపం కలిపిస్తాడు. ఆ పిశాచాలు వేనుడిని పట్టి పీడిస్తాయి. ఈ పిశాచాలతో సంభాషణలూ ఇవన్నీ ఒక తీరుగా ఉంటాయి. నాకైతే అక్కడక్కడా Macbeth and Three witches ని గుర్తు చేసింది ఈ ఘట్టం! విశ్వనాథ వారి పిశాచాలకి కూడా ‘పూర్వవాసన’లు ఉంటాయి వాటి పుణ్యమా అని కవిత్వము రమ్యమైన మాట తీరు వగైరాలు ఉంటాయి! ఈ పిశాచం వేనుడితో “ప్రత్యక్షం కానిది నమ్మను అనే వెర్రి ముఖం నీది. మనిషిని ఉరి తీసిన వెంటనే వాడు చచ్చేనని తలచే దేబెమొగము నీది” అని వాదిస్తుంది. అసలు ఈ పిశాచ సంభాషణల ఘట్టం ఘనంగా ఉంది. ఈ విషయంలో విశ్వనాథ వారి ఊహ కి జోహార్! ఇది విపరీతంగా అనిపించినా కూడా, ఊహ శక్తిని మెచ్చుకోవలసిందే కదా !

ఇక పృథువు లో రాజ్య కాంక్ష రగిలించుట కొరకూ ధర్మ పరిరక్షణ యొక్క ఆవశ్యకతను తెలియజేయుట కొరకూ వసుంధర అనే పేరు గల స్త్రీ మూర్తిగా భూదేవి అవతరించి పృథువు లో ప్రేమానురాగాలను రగులుస్తుంది. అయితే ఈ వసుంధర గోవు రూపంలో కూడా కనిపిస్తుంది పృథువుకు. ఈ వసుంధర రాజ్యలక్ష్మి అనీ పృథువు శ్రీమన్నారాయణుడనీ ఉంటుంది మరో చోట! ఇక్కడ కూడా విశ్వనాథ వారి ఊహ శక్తి నన్ను అబ్బుర పరచింది.

ఇక పిశాచాల విషయానికి తిరిగి వస్తే, పిశాచ నీతి, పిశాచాలలో కూడా భేదాలూ, పిశాచి రాజుకి జోల పాడటమూ ఇలా సాగిపోతుంది ఈ ఘట్టము.

చివరగా గౌతముడు ఒంటరి యుద్ధంలో ముందు అతని బహువును ఖండించి తర్వాత వేనుడిని హతమారుస్తాడు. అయితే ఈ ఘట్టం వెనకాల ఒక బ్రాహ్మణుని శాపము, పృథువు యొక్క పంతము వగైరాలు ఉంటాయి. వేనుడిని చంపడానికి సిద్ధపడినప్పటికినీ గౌతముడు వేనుడు తన అత్మబంధువనీ సత్కవి అనీ, మహా గాయకుడనీ, మహా శిల్పి అనీ అటువంటి మనిషిని చంపి తానూ లోక ద్రోహం చేస్తున్నాననీ బాధపడతాడు. చనిపోతూ చనిపోతూ వేనుడు తన నాస్తికత్వము లోని లోపాలను ఎత్తి చూపి తన పాపాలను అంగీకరించి నారాయణ తత్వమును తెలుపుతాడు. తత్వ దర్శనము చేసుకున్న వేనుడి జన్మ ధన్యమైనదనీ అంటాడు అంగరాజు. వేనరాజు మతము వంటి దుష్ట మతములు వచ్చుచునే ఉండుననీ పోవుచునే ఉండుననీ అయితే ఈ దేశములో నిత్యమైన పసిమి కల సనాతన ధర్మము యొక్క అంకురాలు చిగురుస్తూనే ఉంటాయనీ అంటుంది భూదేవి. గౌతముడు రాజైన పృథువు ఆజ్ఞ పొంది తపస్సుకు పోతాడు. అంగరాజు అడవులకు పోతాడు (వానప్రస్తాశ్రమము అని అనుకోవచును). పృథువు మహారాణి అయిన రాజ్యలక్ష్మీ రూపమైన భూదేవి తో కలిసి ఆకాశము వంక చూస్తూ అరుంధతి నక్షత్ర దర్శనము చేసుకొను చుండగా నాటకం ముగుస్తుంది.

ఈ రెండు నాటకాలు చదివాక నాకు అనిపించినది ఇది నా bias లు నాకు ఉండనే ఉన్నవి ఎలాగూ. విశ్వనాథ వారు ఎలాగూ వర్ణాశ్రమ ధర్మాలను defend చేస్తారు కనుక అయన నాటకం అలా ముగియవలసిందే. నా మటుకు నాకు విశ్వనాథ వారి వేనరాజే నచ్చింది. భావజాలాలను పక్కన పెడితే వారి ఊహా శక్తి అమోఘం ఈ నాటకం లో. కేవలం entertainment quotient లెక్కన చూస్తే విశ్వనాథ వారి వేనరాజు బాగుంది. నాటకం పరంగా చూసినా కూడా విశ్వనాథ వారి వేనరాజులో ఒక నిండుతనం ఉంది. అయితే కవిరాజు వారి “ఖూనీ” కి అయన పీఠిక రాసి ఎంతో మేలు చేసారు అని చెప్పచ్చు పాఠకులకి. ఆయన చెప్పదల్చుకున్నది ఏమిటో స్పష్టంగా ఉంది ఆ పీఠికలో. ఆ పరంగా చూస్తే వారు చెప్పాలనుకున్నది బాగానే చెప్పారు. మొత్తానికి రెండు నాటికలు చదివితే మనకి కూడా అదో తుత్తి అనమాట.

అయితే అప్పట్లో ఈ స్థాయిలో వెలుగు వెలిగిన తెలుగు సాహితీ జగత్తు ఇప్పుడు ఎందుకు ఇలా డీలా పడిపోయిందో! కనీసం గొడవ పడే ఓపిక కూడా లేదో ఏమో ఈనాటి రచయితలకు! తెలుగు సాహితీ లోకంలో ఆ కాలం మళ్లీ వస్తుందని ఆశిస్తున్నాను.

***
ఈ నాటికలకి మూలమైన భాగవత కథ ఇక్కడ.

You Might Also Like

2 Comments

  1. pavan santhosh surampudi

    పరిచయాలు చాలా బాగా చేశారు. ఖూనీ ఎక్కడ దొరుకుతుందని అంతర్జాలంలో క్వైరీలు వేస్తున్నప్పుడే అనుకున్నాను ఈ ఫలం మాకు దక్కుతుందని. అభినందనలు.

  2. మైథిలి అబ్బరాజు

    మీతో ఏకీభవిస్తాను హేలీ గారూ. రామస్వామి చౌదరి గారు ‘ వేన రాజు ‘ దేని పైన ఆధారపడిందో ఆ వైదిక ధర్మానికి వ్యతిరేకి. ‘ ఖూనీ ‘ అలా రచించినది. విడిగా చూస్తే నా వరకూ అది కొంత ఉపజ్ఞ ఉన్న రచన-వేనుడి కొడుకు నిషాదుడి పాత్ర చిత్రణ ఖూనీ లో ఆర్ద్రంగా ఉంది. కాని వేనరాజు వెళ్లినన్ని లోతులకు ఖూనీ వెళ్లదు, ఇంచుమించు ‘ సింగిల్ లైన్ ‘ లో నడుస్తుంది . యజ్ఞాలలో జీవహింసను ఖండిచటం పైనే చాలా వరకు ఆధారపడుతుంది. అందులో మెచ్చదగిన జాగ్రత్త ఏమిటంటే ఆ తర్వాత రాబోయే ప్రశ్న ను పురస్కరించుకొని శాకాహారాన్ని పాటించవలసిన నియమంగా చెప్పటమూ ఖూనీ లో ఉంది. అది ఆ సమాజం లో ఏ మాత్రం సాధ్యమో ఊహించవచ్చు. ప్రాచీన రోమన్ సంస్కృతిలో స్వలింగ సంపర్కం కనిపిస్తుంది, ఈజిప్ట్ లో ఏకగర్భ జనితుల వివాహం- అక్కడినుంచి వెనక్కి వెళితే అటువంటివి ఇలాగ పుట్టి ఉండవచ్చునని విశ్వనాథ వారి ఊహ.
    ఖూనీ నాటకం తూలిక మాలతి గారి వలన చదవగలిగాను, వారికి ధన్యవాదాలు

Leave a Reply