The Call of the Wild – Jack London

వ్యాసకర్త: రానారె
*******
తోడేలు జన్యులక్షణాలు కలిగిన ఒక పెంపుడు కుక్క జీవితాన్ని నిర్దేశించిన పరిణామాల క్రమాన్ని అరుదైన రీతిలో చిత్రిక పట్టిన రచన.

చుట్టూ విధి కల్పించే కఠినమైన మార్పులవల్ల అప్పటికి ఓడిపోయినా, స్థైర్యాన్ని కూడగట్టుకోగలిగి, సంప్రాప్తించిన ఆ మార్పును అర్థం చేసుకోగలిగి, అనుభవాల నుంచి నేర్చుకోగలిగి, అలవాటు పడగలగటమే ప్రకృతిలో మమేకం కావడమంటే. ఇంతా చేసీ, జీవితం క్షణభంగురమేననే ఎరుకను కలిగించే రచన ఇది.

కఠినమైన ఆటవిక వాస్తవికత చవిచూపించే చలి, ఆకలి, పస్తులవంటి కాఠిన్యాలను ఓర్చి, శారీరకంగా ఆధ్యాత్మికంగా పరివర్తనం చెందుతూ, చివరికి తన పూర్వీకులలాగ ప్రకృతిలో మమేకమవడమే తన జన్మరహస్యంగా, అదే తనకు విధి నిర్దేశించినట్లుగా కథానాయకుడైన బక్ అని పిలువబడే కుక్క అడవిలోకి వెళ్లిపోవడం ఈ నవలలోని ముఖ్యాంశం.

అలాస్కా ప్రాంతంలో ఒక పసుపుపచ్చని ఖనిజం (బంగారం) బయటపడి, పందొమ్మిదో శతాబ్దపు చివరి సంవత్సరాలలో మనుషులకు వెఱ్ఱెక్కించిన వైనాన్ని మనకు పరిచయం చేస్తూ కథ ఆరంభంలో మనకు విడిగా క(వి)నిపించే కథకుడు, క్రమంగా బక్ మెదడులోనూ హృదయంలోనూ శరీరంలోనూ చేరిపోయి దాని భావతీవ్రతను నేరుగా అక్కడి లోతుల్లోనుంచి మనకు ప్రత్యక్ష ప్రసారం చేయడంలోని వైదుష్యం ఈ నవల చదివినవారికి మాత్రమే అనుభవైక వేద్యం, కథ చివర్లో విధి నిర్దేశించిన గమ్యానికి బక్ చేరుకున్నాక మళ్లీ మనకు విడిగా కనబడతాడు కథకుడు. మధ్య మధ్యలో చాలా తక్కువ చోట్ల మాత్రమే ఇలా విడిగా కనబడతాడు.

ఇదొక సాహసగాథ. యాత్రా కథనం. బక్ మానసిక పరిపక్వతను, శారీరక పరిణామాలనూ కళ్లకు కట్టే రచన. ఇదొక ప్రేమ కథ. రక్తాన్ని ఉరకలెత్తించే పోరాటగాథ. దవడ బిగుసుకుపోయేలా చేసే హింస కూడా ఇందులో చోటుంది. హృదయాన్ని ద్రవింపజేసే ఘటనలూ వున్నాయి. తమ జీవనగమనంపై తమ ప్రాణాలపై జీవులకు వున్నట్టు కనిపించే అధికారపు పెళుసుదనాన్ని ఎత్తి చూపే ఆధ్యాత్మిక రచన. తప్పక చదవాల్సిన పుస్తకం.

బంగారాన్ని అన్వేషించే వేలంవెఱ్ఱిలో, అలాస్కాలో అర్థాకలితో అనారోగ్యంపాలై అలమటిస్తూ తిరిగాడు గనక, ఆ ప్రాంతపు వర్ణన క్లుప్తంగానైనా ఇంత బాగా చేయగలిగాడేమో, రచయిత జాక్ లండన్. ఇందులోని కుక్కల్లోని, మనుషుల్లోని మంచిచెడ్డలను పక్షపాతరహితంగా మన ముందుంచుతాడు లండన్. భాష కఠినంగా ఏమీ వుండదు. కథనంలోని బిగువువల్ల కాబోలు, అలుపులేకుండానే ఆఖరిపేజీకి చేరుకున్నాను.

నవల చదివేముందు లేదా చదువుతున్నప్పుడు కథాప్రదేశపు నకషను చూస్తే బాగుంటుంది.

***
పుస్తకం గురించిన వికీపేజీ.
ఈ పుస్తకం ప్రాజెక్ట్ గూటెన్ బర్గ్ లో ఉచితంగా చదివేందుకు లభ్యం.

The Call of the Wild
Jack London

You Might Also Like

One Comment

  1. Vikram

    మీ కృషి అభినందనీయం.

Leave a Reply