Yuganta – An Unorthodox Analysis of Mahabharata

మరలనిదేల మహాభారతమన్నచో…

భారతాన్నో, రామాయణాన్నో మనబోటి మనుషుల కథలుగా పరిగణించి ఆనాటి సామాజిక పరిస్థితులను, చారిత్రిక సందర్భాన్ని వివరిస్తూ విశ్లేషించే రచనలంటే నాకు చాలా ఇష్టం. ఇరావతి కర్వే రచించిన “యుగాంత” అనే వ్యాస సంకలనం ఆ తరహా విశ్లేషణకి చక్కని ఉదాహరణ. ఏ కొందరికైనా దీని గురించి తెలియకుండా/తెలుసుకోవాలని ఉంటే వారికి ఈ పరిచయం ఉపయోగపడుతుందేమోనని ఆశ.

***

1905 – 1970 మధ్య కాలంలో జీవించిన ఇరావతీ కర్వే మానవ శాస్త్రం (Anthropology)లో డాక్టరేటు చేసారు. పూణేలోని దక్కన్ కళాశాలలో మానవ, సామాజిక శాస్త్రాల విభాగానికి అధ్యక్షురాలిగా చాలాకాలం పని చేసారు. ఈ పుస్తకపు మరాఠీ మూలాన్ని 1967లో ప్రచురించారు. 1968లో ఉత్తమ మరాఠీ గ్రంథంగా కేంద్ర సాహిత్య అకాడమీ బహుమానాన్ని పొందిన ఈ పుస్తకాన్ని రచయిత్రే ఆంగ్లంలోకి అనువదించారు. (1990ల్లో కాబోలు ఈ వ్యాసాల తెలుగు అనువాదాలను మిసిమి మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించారు)

తన బాల్యంలో ఇరావతి కర్వే చదివిన మొదటి పుస్తకం పేరే “పాండవ ప్రతాప”! తన తల్లిదండ్రులకు మహాభారత కథా, అందులోని ధార్మిక, తాత్త్విక విషయాలు కరతలామలకాలు. పరంపరాగతంగా తనకందిన ఈ జ్ఞాన వారసత్వమే మిగతా వాళ్ళందరికీ అంది ఉండి ఉంటుందని భావించేదట ఆవిడ, ఒకరోజున ఒక యువకుడు “గాంధారి ఎవరు?” అనే ప్రశ్న వేసేదాకా.

ఆ ప్రశ్న వినగానే కలిగిన ప్రథమకోపం కాస్త చల్లారాక…ఇప్పటి తరం వాళ్ళకి తన జీవితకాలపు నేస్తం అయిన మహాభారతాన్ని పరిచయం చేయాలని సంకల్పించిందట, ఇరావతి కర్వే. గాంధారి అంటే ఎవరో తెలియని “దేశీ” యువకులే కాదు, మహాభారతము అనగా “ఒక ప్రెట్టీ స్టోరీ” అని మాత్రమే తలచే విదేశీ స్నేహితులూ తన పుస్తకానికి లక్షిత పాఠకవర్గంలో భాగమే.

గత శతాబ్దిలో సుఖ్తంకర్ (V. S. Sukhtankar) ప్రభృత పండితులు యాభయ్యేళ్ళ పరిశ్రమతో రూపొందించిన 19 సంపుటాల మహాభారత సంశోధిత ప్రతి ఈ వ్యాసాలకి ప్రధాన ఆకరం.

***

మొట్టమొదట, ఓ పరిచయవ్యాసం (పైన చెప్పుకొన్న గ్రంథరచనా నేపథ్య వివరాలు ఈ పరిచయ వ్యాసంలోనివే).

సరికొత్త పాఠకులకు ప్రాథమిక పరిజ్ఞానం కలిగించేందుకు రాసినదే అయినప్పటికీ, మహాభారతంతో పూర్వపరిచయం ఉన్నవారికి కూడా కొన్ని కొత్త విశేషాలు తెలుస్తాయి ఈ వ్యాసం చదువుతున్నప్పుడు.

ఉదాహరణకు, సూతుల గురించి, భార్గవుల గురించి నేనేం తెలుసుకున్నానంటే –

సూతులు – క్షత్రియుల అక్రమ సంతానంగా మొదలై, సజాతి వివాహాలతో వృద్ధి చెందిన ఒక ప్రజా సమూహం. సూతులు రాజులకు సారథులుగా, స్నేహితులుగా, సలహాదారులుగా, రాజ వంశ చరిత్రలను గానం చేసే గాయకులుగా  (bards) పలు బాధ్యతలను నిర్వహించేవారు. వీరిలో కొందరు సంచార కథకులు. ప్రజలు గుమిగూడే ప్రాంతాలను వెదుక్కుంటూ వెళ్ళి శ్రోతలు దొరికిన చోట మజిలీలు చేసి ఆనాటి/వెనకటి రాజుల/యువరాజుల సాహస కృత్యాలను, ప్రణయ వృత్తాంతాలను వినిపిస్తూ ఉండేవారు. రామాయణ మహాభారతాలూ, పురాణాలూ సూతుల కథనంలోనే నిలదొక్కుకున్నాయని అంటారు ఇరావతి కర్వే.

 నైమిశారణ్యంలో సత్రయాగం చేస్తున్న శౌనకాది మునులకు మహాభారత కథను వినిపించినాయన ఉగ్రశ్రవుడు. అతడు “సౌతి” (సూతపుత్రుడు).

 కాలక్రమేణా, మహాభారతాన్ని పరిరక్షించే బాధ్యత సూతుల చేయిజారి భృగువంశీయ బ్రాహ్మణుల హస్తగతమయ్యిందట. మహాభారతం తమ ఆధీనంలోకి వచ్చాక భార్గవులు అందులో తమ వంశస్థుల కథలను చొప్పించారట. కర్ణుడు పరశురాముడికి శిష్యరికం చేయటం, అంబ కారణంగా భీష్ముడూ, పరశురాముడూ యుద్ధం చేయటం ఇలాంటి చొప్పించబడిన కథలకి ఉదాహరణలనీ, వీటినీ, తదనంతర కాలంలో సకల పురాణాల సంరక్షణ బాధ్యత వహిస్తూ వచ్చిన బ్రాహ్మణులు చేసిన మిగతా మార్పులను తొలగిస్తే, “నిజమైన మహాభారతం” మాత్రమే మిగిలి, కథనంలో వేగం పెరిగి మరింత పఠనీయతను సంతరించుకుంటుంది అంటారు, ఇరావతి కర్వే.

 మహాభారతంలో లక్ష శ్లోకాలున్నాయని ఎన్నోసార్లు విన్నాను కాని ఏ పర్వంలో ఎన్ని శ్లోకాలున్నాయన్న లెక్క ఈ పరిచయ వ్యాసంలోనే తొలిసారి చూసాను నేను. అన్ని పర్వాలలో కలిపి 82564 శ్లోకాలున్నాయట. అతి ఎక్కువ శ్లోకాలున్న పర్వం శాంతి పర్వం (14525). ఇంత “సీను” ఉన్న శాంతిపర్వంలో కథ ఏమిటా అని బుర్ర గోక్కొని, భీష్ముడు యుధిష్టిరుడికి చెప్పిన రాజనీతి పాఠాల వల్ల ఇంత సైజుకి ఈ పర్వం పెరిగి ఉంటుందేమోనని సర్దుకున్నాను. ఇంతా చేస్తే, శాంతిపర్వం అంతా అసలు మహాభారతానికి తరువాతి తరాలవారు చేసిన జోడింపు అని ఇరావతి కర్వే చెబితే, “ఔరా!” అనాలనిపించింది.

***

పరిచయాన్ని దాటేసాక మహాభారత పాత్రల గురించి ఆసక్తిదాయకమైన తొమ్మిది వ్యాసాలు కనబడతాయి ఈ పుస్తకంలో. ఈ వ్యాసాల గురించి ప్రస్తావిస్తూ పరిచయంలో ఇలా అంటారు ఇరావతి కర్వే:

The Mahabharata is an extensive record of the intimate life and thought of scores of people. Each character and each of its actions lend themselves to different  interpretations. Mine is only one possible interpretation. I do not claim this to be the only legitimate or possible one. A literary interpretation is as much a reflection of the person who interprets as of the matter he interprets. My only claim is that I have presented the data faithfully adhering to the text as presented in the critical edition. Wherever I have gone beyond the text I have mentioned the fact. I do not wish so much that people agree with me in what I have said as that people’s interest is roused enough for them to read the old texts to find out what they are about.

ఒక్కో వ్యాసానికి ఒక్కో మహాభారత పాత్ర కేంద్రబిందువు. కథలో ఆ పాత్ర ప్రమేయమున్న ముఖ్య ఘట్టాలన్నింటినీ పరామర్శిస్తూ,  ఆ పాత్ర స్వభావంలోని  కీలకాంశాలను వివరిస్తూ, మూలగ్రంథంలోని విశేషాలను స్పృశిస్తూ, ప్రశ్నలను రేకెత్తిస్తూ జవాబులు చెప్పుకుంటూ సాగిపోతుంది ప్రతి వ్యాసం.

ఇరావతి కర్వే అంచనాలో –

* భీష్ముడు తనది కాని బరువును తలకెత్తుకొని జీవితాంతం మోసిన అభిశప్తుడు. పరులకొరకు జీవించేవారికి సామాన్య సూత్రాలు వర్తించవనే అభిప్రాయమో అహంకారమో ఉన్నవాడు. స్వార్థాన్ని త్యజించినా అహాన్ని జయించలేకపోయినవాడు. భీషణమైన తన ప్రతిజ్ఞా, కఠోరమైన తన ధ్యేయనిష్ఠా ఎందరినో బాధించి, ఇంత కథకూ కారణమై కట్టకడపటికి తనకూ తీవ్ర దుఃఖాన్నే కలిగించాయి గానీ ఏ రకమైన తృప్తినీ ఇవ్వలేదు.

* తనకి జరిగిన అన్యాయానికి శిక్షగానే గాంధారి కళ్ళకు గంతలు కట్టుకొన్నది. లోకం ఆ నిర్ణయాన్ని పాతివ్రత్యమని కొనియాడినా, నిజం తెలిసిన ధృతరాష్ట్రుడిని మాత్రం పశ్చాత్తపమూ, కోపమూ జీవితాంతం బాధించేవి. దుష్టులైన కుమారులను నియంత్రించలేక నిస్సహాయులుగా మిగిలిపోయిన మంచివారిలాగే ప్రపంచానికి కనబడ్డా, ఆ దంపతులిద్దరి మనస్సుల్లో ఏదో విధంగా పాండవుల పీడ విరగడైతే బావుణ్ణు అనే ఉండేది (గాంధారి అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు మూలగ్రంథం కన్నా తన ఊహల మీదే ఎక్కువగా ఆధారపడ్డారు, ఇరావతి  కర్వే)

* కుంతిభోజుడి ఆజ్ఞ మేరకు ఏడాదిపాటు దుర్వాసుడికి కుంతి చేసిన సేవల్లో తన కామావసరాలను తీర్చడం కూడా ఒకటి. కర్ణుడి జన్మకి కర్త దుర్వాసుడే అయి ఉంటాడనే ఊహ తర్కవిరుద్ధమేమీ కాదు. తరువాతి తరాలవాళ్ళు తమ సెన్సిబిలిటీస్‌కి అనుకూలంగా “వరమూ-సూర్యుడి అనుగ్రహమూ”అంటూ అద్భుతీకరించుకున్నారు, అంతే.  అదేవిధంగా, పాండవుల పుట్టుకలోనూ అలౌకికమైనదేమీ లేదు.

(ఇంకా ఒక అడుగు ముందుకు వేసి, యుధిష్టిరుడి తండ్రి విదురుడై ఉండవచ్చునని ఊహిస్తారు, ఇరావతి కర్వే  Reading between the lines కాస్త ఎక్కువైందనిపించే Father and Son అనే వ్యాసంలో.)

* “నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా?” అని కురుసభలో ప్రశ్నించినప్పుడు ద్రౌపది ప్రదర్శించింది ఉట్ఠి అతితెలివిని మాత్రమే. ఆ లా పాయింటు ప్రశ్నకి సమాధానమేదైనా అది తన పరిస్థితిని మరింత హీనపరిచేదే కానీ తనకి ఉపయోగపడేది కాదు.

యుద్ధం జరగాలన్న తీవ్రంగా కోరుకున్న మాట నిజమే కానీ, యుద్ధానికి కారణం ద్రౌపది కాదు. పితృస్వామిక సమాజానికి చెందిన పాండవులు భార్యల మాట విని యుద్ధాలకి దిగే వాళ్ళు కానే కాదు. ద్రౌపది మాటకు విలువ ఎంత తక్కువో గ్రహించటానికి ఓ మంచి ఉదాహరణ – కర్ణుడిని ప్రలోభపెట్టేందుకు ద్రౌపదిని ఎరగా వాడుకోవటం. తుచ్ఛమైన ఈ ప్రతిపాదన గురించి ద్రౌపదికి తెలియనే తెలియదు. ద్రౌపదికి కర్ణుడి మీద రహస్య ప్రేమ ఉండేదనటానికి మహాభారతంలో ఏ సాక్ష్యమూ లేదు. ఆ కథ తరువాత్తరువాత రోజుల్లోని జైన పురాణాలలోంచి పుట్టుకువచ్చింది.

* ఖాండవ దహనం పైకి అడవినీ, జంతువులనూ కాల్చిన కథలా కనబడుతుంది కానీ అది నిజానికి ఆ అడవిలో నివసించిన నాగ జాతి ప్రజలను ఇతర ఆటవిక జాతుల వారినీ నిర్దాక్షిణ్యంగా పరిమార్చిన మారణహోమం. పశుపాలకులైన ఆర్యులు వ్యావసాయిక సమాజంగా మారుతున్న పరిణామదశకి ఈ కథ సంకేతం కావచ్చును అంటారు, ఇరావతి కర్వే. తన విశ్లేషణను ఇంకాస్త పొడిగించి ఇలా అంటారు:

Many an Aryan kings must have acquired new lands by burning or cutting parts of a virgin forest not owned by anyone. However, in the Khandava fire it appears that Krishna and Arjuna had a more audacious plan to possess an entire forest in a part of which happened to be the kingdom of the Takshakas. This plan, it seems, did not go counter to the Kshatriya code. The code applied only to the Aryan Kshatriyas and not to outsiders.

 *  మహాభారతం ప్రధానంగా క్షత్రియుల కథ. ఈ కథలో ప్రధాన పాత్రను పోషించిన బ్రాహ్మణులిద్దరూ – ద్రోణుడూ, అశ్వత్థామా – వృత్తి, ప్రవృత్తుల రీత్యా క్షత్రియుల వంటివారే. క్షమ శమ దమాది  సుగుణాలు ద్రోణుడిలో కనబడవు. అశ్వత్థామ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

క్షత్రియోచితమైన యుద్ధవిద్యల్లో నిష్ణాతుడైన ద్రోణుడు క్షత్రియ మర్యాదలను మాత్రం లెక్కచేయలేదంటారు ఇరావతి కర్వే. అందుకు ఉదాహరణగా ద్రుపదుడిని (తన శిష్యుల ద్వారా) ఓడించాక ఉత్తర పాంచాలాన్ని స్వాధీనపరచుకోవటాన్ని ప్రస్తావిస్తారు. ఆనాటి క్షత్రియ సంప్రదాయానికి విరుద్ధంగా యుద్ధంలో ఓడిపోయిన రాజు దగ్గర నుంచి మొత్తమో, కొంతో రాజ్యాన్ని లాగుకున్న వారిద్దరే మహాభారతంలో: జరాసంధుడు, ద్రోణుడు.

అశ్వత్థామ హతుడయ్యాడన్న నిర్వేదంలోనూ విజృంభించి పోరాడుతున్న ద్రోణుడి రథచక్రాన్ని గట్టిగా పట్టుకొని అతి పరుషంగా నిందించిన భీముడి మాటల్లోని అసహనపు మంటను గమనించండి:

“We Kshatriyas would have a chance to survive if you Brahmins minded your own profession and did not take up arms. Non-violence to all creatures is the duty of Brahmins, and you are supposed to be a great Brahmin. For the sake of your own son you have killed many men of the warrior tribe of Mlechh. They were following their own dharma. But you abandoned yours and butchered them. Have you no shame?”

* మహాభారతంలోని ప్రధాన పాత్రలన్నీ కొద్దో గొప్పో జీవితంలో ఓటమిని చవి చూసాయి. పాపం, కర్ణుడు మాత్రం జీవితపోరాటంలో చిత్తుగా ఓడిపోయాడు. సూతుడిగా సమాజంలో తన స్థానాన్ని అంగీకరించిన విదురుడిలా కర్ణుడు రాజీ పడలేకపోయాడు. అయితే, ప్రతిభకు జన్మతో సంబంధం లేదనే సూత్రం కోసం కాదు తన పోరాటం. తాను మిగతా సూతులకన్నా విభిన్నమని, తానూ క్షత్రియులకు తీసిపోనని రుజువు చేయటమే కర్ణుడి పరిమిత లక్ష్యం.

 శాప ప్రభావమూ, కృష్ణుడి చాకచక్యమూ, ఇంద్రుడి మోసమూ లాంటి “పాపం, కర్ణుడు” కథలను పక్కనబెట్టి అర్జునుడి కన్నా పరాక్రమంలో కర్ణుడి స్థాయి చాలా తక్కువ అని తీర్మానిస్తారు, ఇరావతి కర్వే. క్షత్రియ సహజమైన దుడుకుతనమే కానీ వారికుండాల్సిన ఉదాత్తత కర్ణుడిలో కనపడదు. ”He had acquired the skills of a kshatriya but he could never master their value frame.” అంటారు.

Yet, she concedes that Karna was, indeed, very noble, in his spurning the offer from the Pandava camp. The offer was a final vindication and a point of redemption for him, though it came a little too late in his life.

*  తనకంటూ లక్ష్యాలు, ఆశయాలు ఏవీ లేవని భగవద్గీతలో ప్రకటించినా, కృష్ణుడికి నిజజీవితంలోనూ, సాంఘిక రాజనైతిక రంగాలలోనూ సాధించాల్సిన లక్ష్యాలు కొన్ని ఉండేవి. కంసుడిని సంహరించటం, భీముడి సహాయంతో జరాసంధుడిని అంతమొందించటం, పాండవులతో నెయ్యమందటం – ఇవన్నీ కృష్ణుడి స్వార్థ పరార్థ సాధనా యజ్ఞంలో భాగమే. అన్నింటికి మించి, వాసుదేవత్వాన్ని సాధించాలన్నది కృష్ణుడికున్న పెద్ద కోరిక, అంటారు ఇరావతి కర్వే. (“వాసుదేవత్వం” అనేది యుగకర్తృత్వం వంటి ఓ పెద్ద బిరుదట. ఈ వాసుదేవత్వాన్ని నిర్వచించటానికి జైన పురాణాల మీదా, కృష్ణుడికి వాసుదేవత్వం మీద ఉన్న ప్రీతినీ, పట్టుదలనూ నిరూపించటానికి పౌండ్రక వాసుదేవుడి ఉదంతం మీదా ఆధారపడతారు ఇరావతి కర్వే.)

***

“యుగాంత”

తొమ్మిది కొసలుగా సాగిపోయిన విశ్లేషణా దారాలను ముడివేసి కథను కంచికి పంపేసిన ముగింపు వ్యాసానికి “యుగాంత” అని పేరు పెట్టారు, ఇరావతి కర్వే. ఇక్కడ “యుగం” అన్న మాటను గుర్తుంచుకోదగ్గ కాలఖండం  (epoch = an extended period of time usually characterized by a distinctive development or by a memorable series of events) అనే అర్థంలో వాడారు.

మహాభారతంలోని విలక్షణత ఏమిటి? మహాభారతానికీ, తదనంతర సాహిత్యానికీ ఉన్న ప్రధానమైన వ్యత్యాసం ఏమిటి?

మహాభారతం వాస్తవానికి చేరువగా ఉంటుంది. మహాభారతం మనముందు నిలిపిన స్త్రీ పురుషులందరూ సుఖదుఃఖాలతో, మానావమానాలతో నిండిన జీవితాలను గడిపారు. తమకు చేతనైన విధంగా జీవితంతో పోరాడారు, త్యాగాలు చేసారు. ఈలోకంలోనో, పైలోకంలోనో లభించగల ప్రతిఫలాల గురించి అపేక్ష లేకుండా, (పుట్టుకను బట్టి, సమాజంలో/కుటుంబంలో తమకున్న స్థానాన్ని బట్టి సంక్రమించిన) విలువలకు కట్టుబడి జీవించారు. ఇహలోక జీవితానికుండే పరిమితులను అధిగమించగల స్వాప్నిక ప్రపంచమేదీ మహాభారతంలో మనకు కనిపించదు. అద్భుతాలు జరగవు. తలరాతలను మార్చేసి కష్టాలను తీర్చేందుకు ఏ దేవుళ్ళు దిగిరారు.

ఈ కఠిన జీవిత యథార్థాన్ని నిరాకరించిన తరువాతి తరాల సాహిత్యం మోతాదు దాటి జీవితాన్ని ఆదర్శీకరించి, ఉదాత్తీకరించి చూపసాగింది. ఈ కొత్త ప్రాపంచిక దృక్పథం ప్రకారం – కష్టాలన్నీ తాత్కాలికమే. కష్టాలొచ్చాయి కదా అని ఆదర్శాలని వదిలిపెట్టేయకూడదు. ఆ కష్టాలు వాటంతకవే తేలిపోతాయి. దేవతలో మరొకరో పెట్టే పరీక్ష పాసైనప్పుడు హరిశ్చంద్రుడు మళ్ళీ రాజవుతాడు, శంభూకుడు సుందరాకారుడిగా పునర్జన్మనెత్తుతాడు.

“వేదాలను, ఉపనిషత్తులను, మహాభారతాన్ని సృజించిన మన సమాజం,  కఠిన జీవిత సత్యాలను నిర్భయంగా ఎదుర్కొన్న మన సమాజం –  భక్తి పేరిట పలాయనవాదంలోకి, వీరారాధనలోకి  ఎందుకు జారుకుంది? గోమాంసంతో సహా అన్ని రకాల మాంసాలను తిన్న సమాజం గోమూత్ర పానాన్ని, గోమయ భక్షణాన్ని కర్మకాండలో భాగంగా చేసుకొని ఎలా సంతృప్తి చెందగలిగింది?”

తన స్నేహితుడడిగిన పై ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు చెప్పలేకపోయినా, “మూడు వేల ఏళ్ళనాటి “జయ” మహాభారతాన్ని ఇప్పటికీ చదువుకుంటూ నన్ను నేను తెలుసుకోగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను” అంటూ ఈ వ్యాసాన్ని ముగిస్తారు, ఇరావతి కర్వే.

***

అదనపు వివరాలు:

1. ఇరావతి కర్వే రాసిన ఈ వ్యాస సంకలనాన్ని 2006లో ఓరియెంట్ బ్లాక్‌స్వాన్ వారు పునర్ముద్రించారు.   (ఫ్లిప్‌కార్ట్‌ లింకు; అమెజాన్.కాం లింకు)

2.  నాకు కనబడ్డ సమీక్షల్లో ఒకట్రెండు: (1, 2)

3. రోమిల్లా థాపర్ వ్యాసం

4. డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవాలనుకొనే వారికో లింకు

You Might Also Like

8 Comments

  1. ఫణీన్ద్ర పురాణపణ్డ

    ద్రౌపది మాటకు విలువ ఎంత తక్కువో గ్రహించటానికి ఓ మంచి ఉదాహరణ – కర్ణుడిని ప్రలోభపెట్టేందుకు ద్రౌపదిని ఎరగా వాడుకోవటం. —

    నా పరిమిత జ్ఞానంలో ద్రౌపదిని కర్ణుడిని ప్రలోభపెట్టేందుకు ఎరగా వాడుకోలేదు. పాండవులకు వ్యతిరేకంగా యుద్దం చేయవద్దంటూ కర్ణుడికి హితబోధ చేసే సందర్బంలో కృష్ణుడు ద్రౌపదిని ఎరగా వాడాడని చెబుతారు. అయితే ఆ ఘట్టంలో వ్యాసభారతంలోని శ్లోకాలు ఎక్కడా అలాంటి సూచన ఇవ్వవు. ”నీవే తమకు పెద్దన్న అని ధర్మరాజుకు తెలిస్తే తన కర్ణుడికే పట్టం కట్టి తన సోదరులు, భార్యతో సహా నీ సింహాసనం పక్క నిలబడి వింజామరలు వీస్తూ సపర్యలు చేస్తాడు” అని కృష్ణుడు కర్ణుడిని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ ఘట్టానికి వ్యాఖ్యానాల్లో కాలక్రమంలో ద్రౌపదిని ఎరగా వేయడం అన్న అంశం వచ్చి చేరింది.

    1. Srinivas Vuruputuri

      ఫణీన్ద్ర గారికి

      మీరు రాసింది చదివినప్పుడు ఎప్పుడో దూరదర్శన్‌లో చూసిన మల్లాది చంద్రశేఖరశాస్త్రిగారి ఇంటర్వ్యూ గుర్తుకు వచ్చింది. అందులో బాగా గుర్తుండిపోయిన మాటొక్కటున్నది: మూలంలోని “షష్టే కాలే” అనే ముక్క తెలుగులోకి వచ్చేసరికి ఆరో భర్తగా అపార్థానికి దారి తీసింది అన్నారాయన. “తిక్కన గారు మహానుభావులు. ఆయన పొరబాటు చేసారని అనను. ఆయనకి లభించిన సంస్కృత మూలపు ప్రతిలో పొరబాటు ఉండి ఉండవచ్చునేమో…” అన్నారు. మల్లాది వారు ఆ ఆరో కాలానికి “ఆరో ఘడియ అని అర్థం చెప్పినట్లు జ్ఞాపకం.

      ఈ షష్ఠకాలాన్ని పట్టుకొని గూగుల్ వేటకెళితే నాకు దొరికిన సంగతులు మీతో పంచుకుంటానీ దిగువన:

      ఉద్యోగపర్వంలోని శ్లోకాలు:

      హిరణ్మయాంశ్చ తే కుంభాన్రాజతాన్పార్థివాంస్తథా |
      ఓషధ్యః సర్వబీజాని సర్వరత్నాని వీరుధః ||

      రాజన్యా రాజకన్యాశ్చాప్యానయంత్వభిషేచనం |
      షష్ఠే చ త్వాం తథా కాలే ద్రౌపద్యుపగమిష్యతి ||

      పై శ్లోకాలకు ప్రతాప చంద్ర రాయ్ (1897) అనువాదం:

      Let queens and princesses bring golden and silver and earthen jars (full of water) and delicious herbs and all kinds of seeds and gems, and creepers, for thy installation. During the sixth period, Draupadi also will come to thee (as a wife).

      షష్ఠకాల అనే మాటకు the sixth meal-time (on the evening of the third day అని అర్థం చెప్పారు నిఘంటువులో. “ఉపగమిష్యతి” అనే మాటకు will come near/approach/arrive at/visit… అనే అర్థాలు కనిపించాయి.)

      “నీవే తమకు పెద్దన్న అని ధర్మరాజుకు తెలిస్తే తన కర్ణుడికే పట్టం కట్టి తన సోదరులు, భార్యతో సహా నీ సింహాసనం పక్క నిలబడి వింజామరలు వీస్తూ సపర్యలు చేస్తాడు.”

      ఇలాంటి ఊహాచిత్రాన్ని కృష్ణుడు కర్ణుడికి చూపించిన మాత నిజమే కానీ ఆ శ్లోకాల్లో ద్రౌపది కనబడలేదు (ఉద్యోగపర్వం (కర్ణోపనివాదపర్వ 18-23)

      శ్రీనివాస్

  2. Srinivas Vuruputuri

    >> అతి పరుషంగా నిందించిన భీముడి మాటల్లోని అసహనపు మంట…

    ఆసక్తి ఉన్నవారికోసం మూలం నుంచి శ్లోకాలు, సుమారైన తెలుగు అనువాదం (ద్రోణపర్వం సాఫ్ట్ కాపీ ఇచ్చిన కొలిచాల సురేశ్ గారికి కృతజ్ఞతలతో):

    యది నామ న యుధ్యేరఞ్శిక్షితా బ్రహ్మబంధవః
    స్వకర్మభిరసంతుష్టా న స్మ క్షత్రం క్షయం వ్రజేత్

    స్వకర్మాచరణంతో తృప్తి చెందక క్షాత్రవిద్యలు నేర్చుకొన్న బ్రాహ్మణాధములు యుద్ధంలోకి దిగకుండా ఉంటే క్షత్రియులకు వినాశనం ప్రాప్తించేది కాదు.

    అహింసా సర్వభూతేషు ధర్మం జ్యాయస్తరం విదుః
    తస్య చ బ్రాహ్మణో మూలం భవాంశ్చ బ్రహ్మవిత్తమః

    ఏ ప్రాణినీ హింసించకపోవటమే పరమధర్మమని, ఆ ధర్మానికి బ్రాహ్మణుడే మూలమని అంటారు. నీవా, బ్రహ్మజ్ఞానులలో శ్రేష్ఠుడివి!

    శ్వపాకవన్మ్లేచ్ఛగణాన్హత్వా చాన్యాన్పృథగ్విధాన్
    అజ్ఞానాన్మూఢవద్బ్రహ్మన్పుత్రదారధనేప్సయా

    ఏకస్యార్థే బహూన్హత్వా పుత్రస్యాధర్మవిద్యథా
    స్వకర్మస్థాన్వికర్మస్థో న వ్యపత్రపసే కథం

    ఓ బ్రాహ్మణా, భార్యా పుత్రులపై, ధనంపై ప్రీతితో, నీకున్న ఒక్క కొడుకు కోసం…, వికర్మివై, ధర్మమేమిటో తెలియనివాడిలా, అజ్ఞానంతో, చండాలుడిలాగా, మూర్ఖుడిలాగా… స్వకర్మానువర్తులైన మ్లేచ్ఛగణాలను, ఇతర యోధులననేకులను వధించిన నీకు… సిగ్గు కలగటం లేదా?

  3. Sreenivas Paruchuri

    ఈ పుస్తకం తెలుగులో కూడా బాగా ప్రాచుర్యం పొందినది. నేను తెలుగులోనే చదివాను. మా ఇంట్లో చాలా మందిని ప్రభావితం చేసిన పుస్తకం. బాలచంద్ర ఆప్టే (Bhalchandra Apte, సాహిత్య అకాడమీ, 1979) గారి అనువాదం బాగుంటుంది. తరువాత అన్నపురెడ్డి వెంకటేశ్వరరెడ్డిగారు మిసిమి పత్రికకు సంపాదకుడిగా ఉన్న కాలంలో అక్కడ మరల ప్రచురించారు. AVR గారి పేరు వచ్చింది కాబట్టి … కార్వే గారు మరాఠీలో రామాయణం పైన కూడా వ్యాసాలూ రాసారని, అవెక్కదైనా దొరుకుతాయేమోనని ఆయన చాలాకాలం ప్రయత్నించారు.

    1. vyas

      సర్..ఈ తెలుగు అనువాదం చేసిన పుస్తకం ఎక్కడ దొరుకుతుంది తెలుపగలరు ???

  4. IM

    నన్నోడి తన్నోడెనా, తన్నోడి నన్నోడెనా?” అని కురుసభలో ప్రశ్నించినప్పుడు ద్రౌపది ప్రదర్శించింది ఉట్ఠి అతితెలివిని మాత్రమే. ఆ లా పాయింటు ప్రశ్నకి సమాధానమేదైనా అది తన పరిస్థితిని మరింత హీనపరిచేదే కానీ తనకి ఉపయోగపడేది కాదు.

    ఇంతిహాసం అనే పుస్తకంలో మృణాళినిగారు ద్రౌపది వేసిన ప్రశ్న సరైనదని అభిప్రాయపడతారు. ఈవిషయంలో కర్వేగారి అభిప్రాయం నాకు నచ్చలేదు.

    Karna’s Wife: The Outcast’s Queen పుస్తకం చదివారా? కెవలం కర్ణుడు, అతని భార్య వృశాలిల కోణంలోంచి భారతాన్ని ఆవిష్కరించారు.

    1. Srinivas Vuruputuri

      IM గారికి

      “Karna’s Wife: The Outcast’s ్వీన్” చదవలేదు. వీలున్నప్పుడు చదువుతాను. ఇంతిహాసం కూడా చదవలేదు. ద్రౌపది లాజిక్ ఏమై ఉంటుందా అని ఆలోచిస్తే నాకు తట్టింది ఇది (కొత్త కాకపోవచ్చును):

      1. తనను తాను ఓడిపోక మునుపు ధర్మరాజు ద్రౌపదిని పణంగా ఒడ్డి ఉంటే – ధర్మరాజుకు ఆ హక్కు ఉన్నా అది అధర్మం అయ్యేది.

      2. తను ఓడిపోయాక స్వతంత్రురాలైన ద్రౌపదిని పణంగా పెట్టేందుకు తనకి హక్కు లేదు.

      ఇరావతి కర్వే విశ్లేషణలోంచి కొంత: “What Draupadi was contending was that once Dharma had become a slave he
      had lost his freedom and had no right to claim anything as his own; a slave has nothing he can stake. Then how could Dharma stake her freedom? Although her argument seems plausible from one point of view, even a slave has a wife, and the fact of his slavery does not destroy his authority over her…The question was thus a tangled one, involving the rights of a master over a slave and a slave over his wife.”

      శ్రీనివాస్

  5. Halley

    మీరు లింక్ చేసిన రెండు సమీక్షలలో మొదటిది మా మేస్టారు హిమాంశు రాయ్ గారిది అవటం నాకు ఆనందాన్ని కలిగించింది . ఆ సమీక్షలో అయన పేర్కొన్న “Leadership through Literature” అన్న కోర్సు నేను కూడా తీసుకున్నాను. ఆ కోర్సు పుణ్యమా అని Irawati Karve గారి గురించీ Yuganta గురించీ తెల్సుకున్నాను అప్పట్లో .

Leave a Reply to Halley Cancel