Annihilation of Caste – Ambedkar

వ్యాసకర్త: కోడూరి గోపాలకృష్ణ
********
మన చరిత్ర పాఠ్య పుస్తకాలు ఎంత చరిత్ర విహీనమైనవో, వాటి వల్ల పిల్లలకి తెలిసే మన చరిత్ర ఎంత నిరుపయోగమైందో, పాఠ్యపుస్తకాల్లో మచ్చుక్కి కూడా కనబడని ఇలాంటి పుస్తకాలు చదివినప్పుడల్లా అనిపిస్తుంది. ప్రస్తుత సమాజంలోని కులాల వల్ల కలిగే హాని గురించి కూడా (అంటరానితనం అనే ఒక్కగానొక్క అంశం మినహాయించి) చర్చించలేని ఒక దగుల్బాచీ విషయసూచికతో, ఉందా అంటే ఆ ఏదో ఉందిలే అనిపించేట్టుగా ఉండే సామాజిక శాస్త్రం ఇలాంటి పుస్తకాలకి ఎందుకు స్థానం కల్పించదో.

కులం మీద ఎంతోమంది కత్తిగట్టి వ్యాసాలు రాసి పోరాటాలు కూడా చేసుండొచ్చు. కాని అంబేద్కర్ శైలిలో ఉన్న స్పష్టత అందరిలోనూ కనబడదు. ఇప్పటి సమాజంలో పలానా కులం వాళ్ళు పలానా దుర్మార్గానికి పాలుపడ్డారని/పడుతున్నారని బాహాటంగా చెప్పడానికి కూడా లక్షసార్లు తచ్చాడాల్సివస్తుంది. అలాంటిది తను అప్పట్లో అగ్రవర్ణాల్ని, హిందూధర్మం ముసుగు కప్పుకుని దేశం నలుమూలలా సాగిస్తున్న నీచాతినీచ, అమానవీయ చర్యలని పేరుపేరునా తూర్పారబట్టడానికి ఏమాత్రం వెనకాడలేదు.

కుల నిర్మూలనకై పాటుబడుతున్న ఒకానొక జాట్ పట్ తోడక్ మండలి (Jat-Pat-Todak Mandal) ఆహ్వానంపై ఇవ్వాల్సిన ప్రసంగాన్ని “Annihilation of Caste” గా అచ్చువేశారు. ఇందులో ఆయన స్పృశించిన ప్రధానమైన అంశాలు:

* రాజకీయంగా, ఆర్థికంగా దేశం ముందుకి వెళ్ళాలంటే సామాజిక పరివర్తన ఏ విధంగా అవసరం, అప్పటి కాంగ్రెస్ పెద్దలు దాన్ని ఎలా తోసిపుచ్చారు?
* పని విభజనకి, పని వాళ్ళ విభజనకి మధ్య వ్యత్యాసం – ఈ విషయంలో కులవ్యవస్థ తీరు
* హిందూ సమాజ ప్రగతిలో కులం ఏ విధంగా అవరోధమై కూర్చుంది?
* హిందూ మతంలో చోటుచేసుకోవల్సిన ఘనమైన మార్పులు
* కులం వల్ల కలిగే అరిష్టాలని నిరసిస్తూనే సనాతన ధర్మం అని గాంధీలాంటి వారు ఇంకా పట్టుకుని వేళ్ళాడుతున్న సంప్రదాయాల్లో ఉన్న కపటం (hypocrisy)
* కుల నిర్మూలనకై జరుగుతున్న పోరాటల్లో వైఫల్యాలకి గల కారణాల అన్వేషణ

స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయంగా, ఆర్థికంగా తెచ్చుకునే మార్పుగా భావిస్తే దానికి మూల్యం మరికొన్ని తరాలు చెల్లించాల్సి ఉంటుందని అప్పటి కాంగ్రెస్ నాయకుల్ని, దేశాన్ని హెచ్చరించాడు అంబేద్కర్. సామాజిక పరివర్తన లేకుండా తెచ్చుకునే రాజకీయ, ఆర్థిక మార్పులు అధిక భాగం జనాభాకు చేరవనీ, దానికి తార్కాణంగానే కులవ్యవస్థ సమాజాన్ని చీల్చి దీనికి ఎలా కారణమవుతుందో హేతుబద్దంగా వివరించాడు.

కులాన్ని సమర్థించే వాళ్ళకి, సనాతులమని చెప్పుకుంటూ కులానికి వక్రభాష్యం ఇచ్చే ఎంతోమందికి సమాధానమే తన వ్యాసంగంలో రెండో భాగం. కులవ్యవస్థ మనుగడ కోసం బ్రాహ్మణులు, అగ్రకులాలు సంధించే పాశుపతాశ్త్రం: అది సమాజంలో అన్ని పనులనీ అమలుపరిచడానికి మన పూర్వీకులు ఏర్పరచిన ఒక గొప్ప వ్యవస్థగా అభివర్ణించడం. ఈ కల్పనని చేదించడానికి తను ఎంచుకున్న మార్గం: వివిధ దేశాల సామాజిక వ్యవస్థలను అధ్యయనం చేసి పనులని విభజించడం ప్రతి నాగరికతలోనూ ఉన్నదేననీ చెప్తూ, కులం అంతకుమించి పనివాళ్ళను కూడా విభజిస్తుందనీ, తద్వారా అగ్రవర్ణాలు తమతమ ఆధిపత్యాలు వందల ఏళ్ళుగా నిలుపుకోగలిగాయని వివరించి చెప్పడం.

హైందవ సంస్కృతికి, మిగతా మతాలకి మధ్య తేటతెల్లంగా కనబడే తేడాల్లో కులం పాత్ర గురించి, మన మనుగడకి హైందవ సంస్కృతిలో సమూలంగా రావాల్సిన మార్పుల గురించింది తర్వాతి భాగం. ఆ మార్పులకోసం అప్పటికే ఎన్నో సంస్థలు పోరాడుతున్నాయి. అయితే వాటి సిధ్ధాంతాల ప్రభావం జనబాహుళ్యానికి చేరిందిలేదు. దానికి కారణాలు విశ్లేషిస్తూ ఏం చేస్తే ప్రయోజనం పొందొచ్చో చెప్తారు.

కులానికి వ్యతిరేకమంటూ, లౌకికవాదులమంటూ, సామరస్యానికి పెట్టని పేరు మేమని చెప్పుకునే దేశం తన సొంతబిడ్డలకి ఈ బుద్ధులు అబ్బకూడదనుకుందో ఏమో, మన రాజ్యంగ కర్త తన జీవితాంతం చేసిన కృషి ఈరోజు కేవలం రిజర్వేన్లనే చిన్న నలుసుకి పరిమితం చేసి చూస్తున్నామంతా. రోత పుట్టించే “మనమే గొప్ప, మన సంస్కృతే సంస్కృతి” అంటూ చేసే స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసాల స్థానంలోనైనా ప్రతి విద్యార్థికీ ఈ పాఠాలు చేరితే బావుణ్ణు.

భారతీయ పౌరులందరూ ఈ వ్యాసంగం చదివి తీరాల్సిందే.

వివరాలు:
వ్యాసకర్త: భీమ్‌రావ్ రామ్‌జీ అంబేద్కర్.
వ్యాస శీర్షిక: Annihilation of Caste (కుల నిర్మూలనం). ఈ కింది లింకుల్లో వ్యాసం మొత్తం చదవచ్చు.

Annihilation of Caste
B. R. Ambedkar

You Might Also Like

3 Comments

  1. Srinivas Vuruputuri

    ఇటీవలే నవయాన అనే ప్రచురణ సంస్థ అరుంధతి రాయ్ ముందుమాటతో, Annihilation of Casteను క్రిటీకా సహితంగా ప్రచురించిందట.

    ఈ వారం ఔట్‌లుక్ పత్రిక నుంచి:

    1.(Annotated) Annihilation of Castes నుంచి కొంత
    2. The Doctor and the Saint (ముందు మాట) నుంచి కొంత
    3. ఇవాళ్టి హిందూ దినపత్రికలోంచి ఇంకొంత “రాయ్ రాత”
    3. అరుంధతి రాయ్ ఇంటర్వ్యూ

    1. Srinivas Vuruputuri

      A longer extract of The Doctor and the Saint from Caravan.

      వ్యాసాంతంలో “అయిపోయింది” అని రాయలేదు కానీ చాలా పెద్ద excerpt ఇది.

  2. varaprasad

    అంబేద్కర్ మన దేశానికీ ఒక దస దిశ చూపించిన గొప్ప నాయకుడు ,

Leave a Reply