అంధా యుగ్ – ధరమ్‍వీర్ భారతి.

మొన్నటి ఆదివారం, నా ఫ్రెండ్ లిస్ట్ లో ఒకరు, ఈ రచనలోని కొన్ని వాక్యాలను తమ స్టేటస్‍గా పెట్టారు. ఆ వాక్యాలలో నన్ను ఎక్కువగా ఆకర్షించిన రెండు విషయాలు: ౧) ఇది మహాభారతానికి సంబంధించిన నాటకమని. ౨) ధృతరాష్ట్రుడు తన  జ్ఞానానికి , అంధత్వానికి ఉన్న సంబంధం గురించి ఈ కింది విధంగా మాట్లాడ్డం.

“My knowledge is born out of my blindness. I discovered the world through my blindness. Worldly virtues and values become obsolete in my blindness except what I feel in pain and pleasure, that are extremely personal to me. I am the birth-giver of Kauravas and loving them is the only dharma and nyaya I know of. That is the only ultimate truth that my blind knowledge provided me with”.

గత ఏడాది నేను చదివిన పుస్తకాల్లో Sophocles రచించిన “Oedipus the King” ఒకటి. ఇందులో కూడా “అంధత్వం” ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అడిపస్ అంధుడు కాడు. అతడు అన్నీ చూడగలడు. అతడికి అని తెల్సు అని అనుకున్నాడు. కానీ తానే తన తండ్రిని చంపి, తన తల్లితో కాపురముంటున్నాడని అతడికి తెలీలేదు. తెల్సిన మరుక్షణం అతడు తన కళ్ళను తానే పొడిచేసుకుంటాడు. అంధుడైనా, ఇప్పుడే అతడికి తనను గురించి సంపూర్ణ జ్ఞానం కలుగుతుంది. ఈ నాటకంలో “దృష్టి”కి, జ్ఞానానికి మధ్యన సంబంధాలను విశ్లేషించుకునే అవకాశం ఎక్కువ. ఏది నిజమైన దృష్టి? కళ్ళు చూపించేవి, వాటితో మనం చూసేవీ మాత్రమే నిజాలా? అవి చూపలేని నిజాలను చూడ్డమెలాగ? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు లేవదీస్తుందీ నాటకం.

“అంధా యుగ్”లో పై వాక్యాలు చదివి, అడిపస్ కథకు వ్యతిరేక దిశలో ధృతరాష్ట్రుని పాత్ర కల్పించబడిందా? అని అనుమానం కలిగింది నాకు. మహాభారతాన్ని నేను శ్రద్ధగా చదివింది లేదు. టివి సీరియళ్ళూ, సినిమాలూ చూసి, ఏదైనా అనుమానం దొలిచినప్పుడు వికిపీడియా లింకులు చదవడం తప్పించి నాకు దాని గురించి తెల్సింది లేదు. అందుకని, “మహాభారతంలో ధృతరాష్ట్రుని పుట్టిగుడ్డితనం దేనికి ప్రతీక? గాంధారి తెచ్చిపెట్టుకున్న అంధత్వం ఏమి సూచిస్తుంది? వీరి సంతానంలో అంధులు లేకపోయినా, వారిలో ఎలాంటి అంధత్వం ఉంది?” లాంటి ప్రశ్నలు, బహుశా నేను నా అరకొర  జ్ఞానంతో అడగకూడదు అనుకుంటాను.

ఏది ఏమైనా, ధరమ్ వీర్ భారతి రాసిన నాటకాన్ని చదవడానికి నాకీ ప్రశ్నలు సరిపోయాయి. ఆయన నాటకానికి ఈ పేరు కాకుండా మరే పేరు పెట్టినా నేను చదివుండేదాన్ని కాదేమో! అది అప్రస్తుతం. యుద్ధానంతర భీకర పరిస్థితులను హైలైట్ చేస్తూ సాగే ఈ పద్యనాటకంలోని కాలం ద్వాపరయుగం నాటిదే అయినా, అది నేటి పరిస్థితులనూ ప్రతిబింబిస్తోంది. దేశవిభజన అయిన వెంటనే చేసిన రచన ఇది అట. యుద్ధంలో ఎవడో ఒకడు గెలుస్తాడు. ఒకడు ఓడిపోతాడు. కానీ గెల్చినవారు, ఓడినవారు సమానంగా కోల్పోతారు – తమవారిని, తమని కూడా! అదే ఈ నాటకంలో ప్రముఖంగా స్పష్టం చేశారు.

 ఇది మాహాభారత యుద్ధం పద్దెనిమిదో రోజు సంధ్యాసమయం నుండి కృష్ణుని వేటగాడు చంపేంత వరకూ నడుస్తుందీ కథ. రాబందులకు నిలయమవుతున్న కౌరవుల రాచనగరంలో కథ మొదలవుతుంది. దృతరాష్ట్రుడు, గాంధారి తమ మందిరంలో సంజయుడు తెచ్చే యుద్ధసమాచారానికై వేచి చూస్తుంటారు. వారికి కాపలాగా ఇద్దరు కాపలాదారులు అక్కడే తిరుగుతూ ఉంటారు. సంజయుడి ఎంతకీ రాడు. దుర్యోధుని ఘోర పరాజయాన్ని ఎలా చెప్పాలో తెలీక మదనపడుతూ, దారి తప్పి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాడు. నిరాయుధుడైన తన తండ్రిని చంపినందుకు అశ్వద్ధామ రగిలిపోతుంటాడు. తక్కిన కౌరవులలా కాకుండా, ధర్మాన్ని ఎంచుకున్న యుయుత్సు, యుద్ధం గెలిచినా, తన ఇంటే పరాయివాడవుతాడు. పుత్రశోకంతో గాంధారి విలవిల్లాడిపోతుంది. కృష్ణుణ్ణి ఆడిపోసుకుంటుంది. యుద్ధం గెల్చిన పాండవులు ఆ తర్వాత ఏమయ్యారు? అశ్వద్ధామ తన ప్రతీకారాన్ని తీర్చుకున్నాడా? కృష్ణుడు పోయి పోయి వేటగాని చేతిలో చనిపోవటమేమిటి? అన్న ప్రశ్నలకు మహాభారతంలోని  సమాధానాలే ఉంటాయి.

అయినా ఈ రచన సొంతంగా లేవనెత్తే ప్రశ్నలూ ఉంటాయి. కాకపోతే అవి పాఠకునికీ పాఠకునీకి మారుతూ ఉంటాయనుకుంటాను. లేక ఒకే పాఠకుని moods and sensibilities బట్టి కూడా మారుతుండచ్చు. ఈ రచన చదివినప్పుడు గాంధారికి జాలి చూపిస్తూ, ఆమెతో పాటు కృష్ణుడిని బోనులో మనం కూడా నిలబెట్టచ్చు. చేసేదీ, చేయించేదీ నువ్వే అయ్యినప్పుడు, ఇదంతా జరగకుండా ఆపి ఉండచ్చు కదా? అని నిలదీయనూ వచ్చు. కానీ చేయగలిగీ, చేయకుండా, చేయించడానికి కూడా ఎంతటి శక్తి కావాలి? యుద్ధం చేయటానికే కాదు, యుద్దాన్ని నివారించటానికి ఎంత ధైర్యం కావాలి?  – ఇవ్వన్నీ అంతులేని ఆలోచనలు. అలా కొనసాగుతూనే ఉంటాయి.

ఈ నాటకంలో ఆసక్తికరమైనవి, నా మట్టుకు నాకు —  నిజం కా(లే)ని భవిష్యత్తు హస్తినలో గాంధారి, ధృతరాష్ట్రుల ముందు వృద్ధ యాచకునిగా దర్శనమిచ్చి వెళ్తుండగా, ఒళ్ళు తెలియని ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఆశ్వద్ధామ అతడిని చంపేయడంతో అతడు ప్రేతాత్మగా మారతాడు. ఆ తర్వాత వేటగాడిగా పుట్టి కృష్ణుణ్ణి చంపుతాడు. తన పూర్వజన్మల గురించి ప్రేతలోకాలలో ఉన్న అశ్వద్ధామతో..

“గాంధారి ఇచ్చిన శాపానికి సమయమొచ్చింది. తీయి నీ ధనస్సును, వేయి బాణాన్ని” అని కృష్ణుడే నాకు చెప్పాడు. నేను భయపడ్డాను గానీ ఆయనే అన్నాడు “నిన్ను చంపింది అశ్వద్ధామ. అది అతడు చేసిన పాపము. దానికి నేను దండన తీసుకుంటాను. నా మరణంతో నువ్వు ప్రేతాత్మ నుండి ముక్తి చెందుతావు.”

ప్రతీకారమనే చట్రంలో ఇరుక్కొనిపోయాక దాన్ని నుండి బయటపడ్డం కష్టం. అందులోనుండి బయటపడేసే మార్గాన్ని సూచించడానికి ఇలా రాశారేమో. “నిజం కాలేని భవిష్యత్తు” అనేది నాకు గమ్మత్తుగా అనిపించింది. ఈ నాటకంలోనే ఒక చోట “ప్రతి క్షణం చరిత్ర మార్చగల క్షణమే”, మనం ఏ నిర్ణయం తీసుకున్నామన్న దాన్ని బట్టి మన తలరాత అప్పటికప్పుడు  తయారవుతుందన్న అర్థంలో కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అవి ఓ రకంగా, “అంతా ముందే రాసిపెట్టుంది. నువ్వలా ఆచరిస్తూ పో..” అన్న థియరీ నుండి దూరంగా జరిగి, మనిషి తన భవిష్యత్తు ఎలా సవరించుకోగలడు అన్న విషయమై కొత్త ఆశలు పుట్టేలా చేస్తుంది. అన్నట్టు, ఈ నాటకంలో కృష్ణుడు నేరుగా కనిపించడు, వినిపించడు. అచ్చు దేవుడిలానే! 🙂

ఈ నాటకంలో ఇద్దరు కాపలాదారులూ ఉంటారు. యుద్ధం ఎందుకు జరుగుతుందో? దాని ప్రయోజనాలేమిటో? లాంటి వివరాలేవీ తెలియవు వాళ్ళకి. వాళ్ళు కాపలా కాయాలి. అలా కాస్తూ ఉంటారు. యుద్ధమైపోయి కొత్త రాజ్యం వచ్చాకా కూడా వాళ్ళే కాపలా ఉంటారు. అప్పటికి, ఇప్పటికి వాళ్ళకేం పెద్ద తేడా కనిపించదు. రాజులు సింహాసనం కోసం చేసే పోరులో సామాన్యుని స్వగతాన్ని వీళ్ళ ద్వారా వినిపించారని అనిపించింది నాకు. మరి మహాభారతంలో ఒక సగటు మనిషికి ఎంత పాత్ర ఉందో తెలీదుగానీ, ఇందులో మాత్రం ఆ అవకాశం కల్పించారు. బహుశా, మన కాలాల్లో, సైనికులకన్నా సామాన్య ప్రజానికమే ఎక్కువ క్షతగాత్రులు అవుతున్నారేమో కదా!

ఇంకో చిన్న సీన్ నన్ను బాగా హత్తుకుంది. యుయుత్సు యుద్ధం నుండి తిరిగొచ్చాక, తనకా ఇంట్లో ఆదరాభిమానాలు దక్కవన్న సంగతి స్పష్టమవుతుంది. ఆ దుఃఖం నుండి బయటపడ్డానికి క్షతగాత్రుడైన ఓ మూగ సైనికుడు దప్పికతో అలమటిస్తుంటే, మంచినీళ్ళు పట్టించబోతాడు. కానీ ఆ సైనికుడు భయంతో విలవిల్లాడిపోతాడు. కారణం? అతడి దుఃస్థితి కారణం యుయుత్సే కారణం. తీవ్ర మానసిక క్షోభకు గురైన యుయిత్సు ఆత్మహత్య చేసుకుంటాడు. ఇది చదువుతున్నప్పుడు నాకు అమెరికా సైనికులు యుద్ధానంతరం గురయ్యే మానసిక రోగాల గురించి చదివిన కథలు గుర్తొచ్చాయి.

నేను ఈ నాటకాన్ని చదివాను, కానీ చూడలేదు. దీన్నో గొప్ప నాటకంగా పరిగణించబడ్డానికి ఎన్నెన్నో క్వాలిటీస్ దీనికి ఉన్నాయని విన్నాను. నాటకాలుగా రాయబడ్డ వాటిని చదువుకోవడం కన్నా, చూస్తేనే వాటిలో నిగూఢ విషయాలు బాగా తెలుస్తాయని, ఈ మధ్యే తెల్సింది నాకు. ఈ నాటకం ఎక్కడైనా ప్రదర్శితమవుతుంటే తప్పనిసరిగా వెళ్ళాలి. ఆ లోపు దీన్ని మళ్ళీ మళ్ళీ చదువుకోవాలి.  

హింది నాటకంలో కొన్ని భాగాలు ఇక్కడ చదువుకోవచ్చును.

నాటకానికి ఆంగ్లానువాదం చేసిన ఆలోక్ భల్లా రాసిన వ్యాసం ఇక్కడ.

 

Andha Yug
Dharamveer Bharathi
Play

You Might Also Like

9 Comments

  1. ఫణీన్ద్ర పురాణపణ్డ

    చాలాకాలం క్రితం చదివిన రెండు మూడు పుస్తకాల్లో ఈడిపస్‌ కాంప్లెక్స్‌ అని చదివినట్టు గుర్తు. ఆ ఉచ్చారణను సాధికారంగా వివరించేంత ఆంగ్ల భాషా జ్ఞానం నాకు లేదు. మీ ప్రొఫెసర్‌గారు చెప్పారన్నాక ఇంక అప్పీలేముంది? ఓ పదపు అసలైన ఉచ్చారణ తెలవడం సంతోషకరం. థ్యాంక్‌యూ.

    1. Purnima

      లేదండి. మీరు చెప్పినదే సరైన ఉచ్చరణ అనుకుంటాను. కింద శ్రీనివాస్ గారి వ్యాఖ్య చూశాక, గూగుల్ చేస్తే ఈడిపస్ అనే ఉంది, ఎక్కువ చోట్ల. మరి మా ప్రొఫెసర్‍గారు ఎందుకలా పలికారో?! నా తోటి విద్యార్థులను కూడా అడిగి చూస్తాను. నేనే మీకు థాంక్స్ చెప్పాలి, తప్పును చూపినందుకు. థాంక్స్. 🙂

  2. Srinivas Vuruputuri

    A hurried reply:

    From Wikipedia – Oedipus (US /ˈɛdɨpəs/ or UK /ˈiːdɨpəs/;

    The bubble help text tells us that US “Oe” is pronounced as in bed and the UK “Oe” is pronounced as in “bead” 🙂

    1. Sreenivas Paruchuri

      When did American/British way of spelling old (!!) Greek names become the right way? Hm. In Old Greek it is: Οἰδίπους (Oidípous), in modern Greek it is Οιδίποδας (Idípodas). In German its Oedipus (యోడిపుస్), in French its: Œdipe, Prof. Modal named his 1988 Telugu play as: రాజా ఈడిపస్. Take what you want, but please don’t tell me that American/Britishonounciations of some old Greek words are the correct ones :).

      BTW, Prof. Modali did not translate “andhaa yug”. Right? His play is based on Greek myth. I liked his long (almost 50p) foreword, introducing the Greek theatre and the Oedipus myth.

      Regards, Sreenivas

  3. ఫణీన్ద్ర పురాణపణ్డ

    పిడకల వేట… ఒడిపస్ కాదు.. ఈడిపస్‌ అనుకుంటా.
    ఈ నాటకం గురించి గతంలోనూ ఎక్కడో చదివాను. అసలు పుస్తకం చదవాలింకా.

    1. Purnima

      అడిపస్ అని సవరించాను. మా ప్రొఫెసర్‍గారు అలానే పలికారు కాబట్టి.

      ఈడిపస్ అని నేను ఎక్కడా వినలేదు. మీరు సాధికారంగా ఆ pronunciation ఎందుకు సరైనదో చెప్తే సంతోషం.

  4. mythili abbaraju

    మంచి పరిచయం పూర్ణిమ గారూ. ధన్యవాదాలు .ఇంగ్లీష్ అనువాదం ఇక్కడ దొరుకుతుంది. ఇప్పుడే వెతుక్కున్నాను.

    http://www.economist.com/node/21558432?frsc=dg|a

    1. mythili abbaraju

      సారీ, ఇది సరైన లింక్

      http://www.infibeam.com/Books/search?q=Andha+Yug++OIP++++Translated++And+With+

  5. మహేష్ కత్తి

    ఈ నాటకాన్ని రాంగోపాల్ బజాజ్ దర్శకత్వంలో చూసే అదృష్టం కలిగింది నాకు. అప్పటి నుంచీ హాంట్ చేస్తూనే ఉంది. పీటర్ బ్రూక్స్ మహాభారతం తరహాలో ఒక సినిమాగా తియ్యదగ్గ మెటీరియల్ ఉంది నాటకంలో. చాలా బలమైన స్వరం,లోతైన ఆలోచన, పదునైన విమర్శ వివిధ పార్శాలలో చూపించేనాటకం ఇది. మొదలి నాగభూషణ శర్మగారు ఈ నాటకాన్ని తెనుగీకరించారు. వీలైతే తెలుగు వర్షన్ కూడా చదవండి.

Leave a Reply to Srinivas Vuruputuri Cancel