పుస్తకం
All about booksఅనువాదాలు

January 23, 2014

If On a Winter’s night A Traveler – Italo Calvino

More articles by »
Written by: అతిథి
Tags:
వ్యాసకర్త: మాధవ్ మాౘవరం

మీరు ఎంతో అభిమానించే రచయిత ఇటాలో కాల్వీనో, చాలా కాలం తర్వాత ఒక నవల రాశాడు. మీరు పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ నవల కొనుక్కొని తెచ్చేసుకున్నారు. ఇంటికి రాగానే సోఫాలో కూర్చుని షాల్ కాళ్ళ మీద కప్పుకునో, లేకుంటే కాళ్ళు పైకెత్తి మడత వేసుకునో, మేడ మీద పిట్టగోడకు ఆనుకునో, పక్క మీద అడ్డంగా వెల్లకిలా, లేకుంటే బోర్లా పడుకొనో, గోడకు దిండు చేరేసి దానికి తలానించో, మీకు వీలైనంత సౌకర్యంగా, మీకు అమితంగా నచ్చే ఏదో ఒక భంగిమలో, టీవి, ఇంకెవరి గోల వినిపించకుండా ఒక్కరే గదిలో తలుపేసుకునో, పక్కనే చిరుతిండి పెట్టుకునో, — నవల చదవడం మొదలు పెడతారు, (వెనక అట్ట మీద రాసింది ముందు చదివిన తర్వాతే సుమా.)

ఇలాగండీ, ఇటాలో కాల్వీనో If On a Winter’s Night a Traveler (1979) అన్న నవలలో మిమ్మల్ని పలకరించేది.

రెండో చాప్టరు దగ్గరికొచ్చేటప్పటికి అది ఇంతకుముందే చదివినట్టు మీకు అనిపిస్తుంది. మీ అనుమానం నిజమే. బైండింగులో పొరపాటు వల్ల మీరు కొన్న నవల ప్రతిలో అన్ని చాప్టర్లు మొదటి చాప్టర్లే. మళ్ళీ మళ్ళీ అవే పేజీలు. ఇప్పుడేం చేయబోతున్నారు మీరు?

*****

“…I do not believe totality can be contained in language; my problem is what remains outside, the unwritten, the unwritable.” – Italo Calvino, If On a Winter’s Night a Traveler.

బర్కిలీలో పనిచేసే రోజుల్లో మా లేబరేటరీకి శాంపుల్స్ ఎనలైజ్ చేసుకోవడం కోసం ఒక డాక్టరల్ స్టూడెంట్ వచ్చేవాడు. ఇది అతని ఈ-మెయిల్ సిగ్నేచర్ లైను. అప్పటికి కాల్వీనో పేరు మాత్రం తెలుసు. ఈ వాక్యం ఇక నన్ను ఇక నిలవనీయలేదు. అలా, ఈ నవల ద్వారా కాల్వీనోని మొదటి సారి కనుక్కున్నాను సుమారు పదిహేనేళ్ళ క్రితం. ఆపకుండా చదివించిన పుస్తకం ఇది. ఆపైన చదివిన ప్రతీ కాల్వీనో పుస్తకమూ నన్ను మరింతగా ఆయన అభిమానిని చేసింది. కాస్మికామిక్స్, ఇన్విజిబుల్ సిటీస్, డిఫికల్ట్ లవ్స్, నంబర్స్ ఇన్ ది డార్క్ అండ్ అదర్ స్టోరీస్, మిస్టర్ పాలోమార్, ది రోడ్ టు శాన్ జియోవాని, వై రీడ్ ది క్లాసిక్స్ … ఇంకా చదవాల్సినవీ ఉన్నాయి: ది యూజెస్ ఆఫ్ లిటరేచర్, ఏన్సిస్టర్స్ ట్రైలజీ, టి జీరో, ఇటాలియన్ ఫోక్‌టేల్స్… ఇలా. కాల్వీనో విస్తృతంగా రాసిన రచయిత. ఆయన గురించి నెట్లో బోల్డంత సమాచారం దొరుకుతుంది. కాల్వీనో పుస్తకాలు ఎన్నో అనువాదం చేసిన విలియం వీవర్ ఆయనతో జరిపిన ముఖాముఖీ పారిస్ రివ్యూలో వచ్చింది. గోర్ విడాల్ రాసిన , ‘కాల్వీనో లేఖల’ని సమీక్షిస్తూ జానథన్ గలాసీ రాసిన , అలాగే వై రీడ్ ది క్లాసిక్స్ అనే ఒక చక్కటి , కాల్వీనో రాసినదే — న్యూయార్క్ రివ్యూ ఆఫ్ బుక్స్‌ వెబ్సైట్లో ఉన్నాయి. ఇవి చాలనుకుంటాను ఇటాలో కాల్వీనో గురించి ఒక అవగాహన రావడానికి.

*****

“I, too, feel the need to reread the books I have already read. But at every rereading I seem to be reading a new book, for the first time. Is it I who keep changing and seeing new things of which I was not previously aware? … The conclusion I have reached is that reading is an operation without object; or that its true object is itself. The book is an accessory aid, or even a pretext.”

నవలలో మీరు, మీరు చదివే నవల(లు) పాత్రధారులు. కాల్వీనో మీతో మాట్లాడుతుంటాడు:

“అలా అని ప్రత్యేకించి ఈ పుస్తకం నుంచి మీరేదో ప్రత్యేకంగా ఆశించటం లేదు. మీరు అలాంటి మనిషి కాదు. అసలు దేనినుంచీ ఏదీ ఆశించరు మీరు. మీకు ఆమాత్రం జాగ్రత్త ఉంది. మీకంటే చిన్నవాళ్ళో పెద్దవాళ్ళో చాలామందే ఉన్నారు అద్భుతమైన అనుభవాలను ఆశిస్తూ, వాటికోసం వెతుక్కుంటూ; పుస్తకాల నుంచి, మనుషుల నుంచి, ప్రయాణాల నుంచి, ప్రదేశాల నుంచి, సంఘటనల నుంచి, రేపు జరగబోయేదాని నుంచి. కానీ మీరు కాదు… ఒకవేళ మీరు కొనబోయే నవల మీకు నచ్చకపోతే మరీ అంత నిరాశ ఉండదు కదా. అందుకని ఈ పుస్తకం విషయంలో మాత్రం కొంచెం మీకు మీరు సర్దిచెప్పుకుంటారు, నవల బాగుంటుందనే ఆశతో.

పుస్తకాల షాపులోకి పోగానే మీకు మిగతా పుస్తకాలు అడ్డం పడతాయి. మీ చూపు తిప్పడానికి ప్రయత్నం చేస్తాయి. ఎంతోకాలంగా మీరు చదవాలనుకున్నవి, ఎప్పట్నుంచో మీరు వెతుకుతున్నవి, ప్రస్తుతం మీరు చేస్తున్న పనికి అవసరమైనవి, అందుబాటులో ఉండడం కోసం మీరు కొనుక్కోదల్చుకున్నవి, ఈ వేసవి శెలవల్లో మీరు చదవాలనుకున్నవి, ఏ కారణమూ లేకుండా మీకు నచ్చి మీరు కొనుక్కునేవి. కానీ ఇవన్నీ దాటుకుని మరీ మీరు వెళ్ళి కాల్వీనో రాసిన ఇఫ్ ఆన్ ఎ వింటర్స్ నైట్ ఎ ట్రావలర్ అన్న పుస్తకం ఒక కాపీ చేతబట్టుకొని కౌంటర్ దగ్గరికొస్తారు, దాన్ని సొంతం చేసుకోడానికి… ఆ నవల మీరు అక్కడే కొంచెం చదవబోతారేమో. వస్తూ వస్తూ సిటీ బస్ లోనో కార్ లోనో ప్రయత్నిస్తారేమో. ఆఫీసులో చాటుగా తెరవబోతారేమో. కోరిక ఎలానో అణచుకొని ఇంటికి వచ్చేదాకా ఆగుతారు.”

ఇంటికి వచ్చి మీకిష్టమైనట్టుగా నవల చదవడం మొదలు పెడతారు, ఈ పరిచయం మొదట్లో కాల్వీనో మీతో చెప్పిన మీకు నచ్చిన భంగిమలో. అలా మిమ్మల్ని సిద్ధం చేసి, ఏ నవలైతే (కాల్వీనో రాశాడని మీరు నమ్మి, కొని తెచ్చుకొని) చదవడానికి కూర్చున్నారో, ఆ నవల మొదలుపెడతాడు, మీ చేతిలోని పుస్తకపు పేజీల లోకి నవల ఒక సినీమా సీన్‌లాగా.

నవల ఒక రైల్వే స్టేషన్లో మొదలవుతుంది. స్టీమ్ ఇంజన్ పిస్టన్ల నుంచి ఆవిరి మొదటి పేజీ మీద పరుచుకుంటుంది. ఒక పొగ మొదటి పేరా కనిపించకుండా కాసేపు అడ్డం పడుతుంది. స్టేషన్ వాసనలలోంచి కాఫే వాసన తనని వేరు చేసుకుంటుంది. ఆవిరి పట్టిన కాఫే అద్దాలకవతల ఎవరో తలుపు తీసుకుని లోపలికొస్తున్నాడు. రెయిన్‌కోటు విప్పి బార్ స్టూల్ మీద పడేసి పబ్లిక్ టెలిఫోన్ బూత్ వైపు నడుస్తున్నాడు. లోపల కూడా తడి తడిగా, చీకటిగా, చెమ్మ నిండి… అది ముసురుపట్టి వాన పడుతున్న సాయంకాలపు చీకటి. వానలో కనుచూపు మేరకూ మెరుస్తున్న రైలు పట్టాల మీద ఒక రైలు కూత క్రమంగా మాయమైపోతుంది… అలాంటి ఆవిరే ఎస్‌ప్రెసో మెషీన్ నుంచి వస్తుంది ఏదో రహస్యం చెప్తున్నట్టు, పోనీ రెండవ పేరాలో వాక్యాలు మనకు సూచించబోయినట్టు… ఈ తడిలో, ఈ పొగలో, ఈ చీకటిలో ఏముందో చూపించడం కంటే మరుగు పరచడమే తమ కర్తవ్యంగా ఉంటాయి స్టేషనులోని దీపాలు, ఈ పేజీలలో వాక్యాలు. పబ్లిక్ టెలిఫోనుకీ బార్ కౌంటర్‌కీ మధ్య తిరుగుతున్నది నేను. నేను కాదు. ఆ తిరుగుతున్నది ‘నేను’ అని పిలవబడే మనిషి. అతని గురించి మీకింకేమీ తెలియదు ఎలా అయితే ‘స్టేషన్’ అని పిలవబడుతున్న ఈ స్టేషన్ గురించి కూడా మీకింకేమీ తెలియదో..”

క్రమక్రమంగా ‘నవల’ స్పష్టమై, కాల్వీనోతో పాటు మీరూ అస్పష్టమైపోతూ ఇలా ఆ నవలలోని మొదటి చాప్టర్ చదువుతారు. రెండవ చాప్టరు చదవబోయే ముందు మళ్ళీ కాల్వీనో నేరుగా మీతో సంభాషణ మొదలు పెడతాడు:

“ఇంచుమించు ముప్ఫై పేజీలు చదివారు. ఇప్పుడిప్పుడే కథలో లీనమవుతున్నారు. “అరే, ఈ వాక్యం ఇంతకు ముందు చదివినట్టుందే. నిజానికి ఈ పేరా మొత్తం,” అనుకుంటారు ఒకచోట. మీరు చాలా సునిశితమైన పాఠకులు, రచయిత ఉద్దేశ్యాన్ని ఠక్కున పట్టేసుకోగలరు. ఈ కొత్త రకం రచయితల ట్రిక్కులు మిమ్మల్ని ఏమార్చలేవు. ఎందుకిలా అదే పేరా, అక్షరం పొల్లుపోకుండా మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం రచయితకు ఏమొచ్చిందో అని ఆలోచిస్తారు. ఉన్నట్టుండి పేజి నంబరు చూస్తారు. పదిహేడు! 32వ పేజి నుంచి మళ్ళీ 17వ పేజికొచ్చారు. ఇది రచయిత చూపించిన తెలివి కాదు. నవల బైండింగులో ప్రింటరు చేసిన తప్పు. ఒక చాప్టరు పోతే పోయింది. కనీసం తరువాత కథైనా చదవచ్చు గదా! అని మీరు ఆశగా ముప్ఫైమూడో పేజీ కోసం చూస్తారు. ఊహూఁ, 32 తర్వాత మళ్ళీ 17 నుంచి 32 తర్వాత మళ్ళీ 17 నుంచి 32 తర్వాత మళ్ళీ…

మీరు కోపంగా పుస్తకం నేలకేసి కొడతారు. బైటికి విసిరేయబోతారు కానీ తమాయించుకుంటారు. పుస్తకం నేలమీంచి తీసుకుని దాన్ని సవరిస్తారు. రేపు షాపుకెళ్ళి ఈ పుస్తకం తిరిగి ఇచ్చేసి ఇంకో కాపీ తీసుకోవాలి. మీలాంటి వాళ్ళే చాలామంది కంప్లైంట్ చేశారట. పుస్తకాల షాపు ఓనరు పిచ్చెత్తిపోతుంటాడు. కాల్వీనో నవల బైండింగులో తప్పులున్నాయటండీ. సర్క్యులేషన్ నుంచి తీసేయమని పబ్లిషర్లు పొద్దునే చెప్పారు. ఔట్‌సైడ్ ది టౌన్ ఆఫ్ మాల్బోర్క్ అని తాజియో బౙక్బల్ రాసిన పుస్తకంలో చాప్టర్లు ఇందులో కలిసిపోయాయిట. మా దగ్గిర కాపీలన్ని పేజి పేజి పట్టి చూశాం. తప్పుల్లేని కాల్వీనో కాపీలున్నాయి మాదగ్గిర. ఒకటి మీకిప్పుడే ఇస్తాను, తీసికెళ్దురు గాని.

మీరు ఇప్పటిదాకా కాల్వీనో నవల అని చదువుతున్నది కాల్వీనో రాసింది కాదా! కాల్వీనో నవల గురించి ఇక మీకు అనవసరం. ఆ ఉచ్చులో మీరు పడరు. బౙక్బల్ పుస్తకం కాపీలున్నాయా అని అడుగుతారు. అదిగో ఒకటి తీస్కోండి అని ఆయన దగ్గర్లో టేబుల్‌పై పేర్చిన ఒక దొంతర చూపిస్తాడు మీకు. ఈ కాపీ సరిగ్గానే ఉంటుందంటారా? అలా ఎలా చెప్పగలనండీ, ఇంతకు ముందే ఆవిడెవరో ఇలానే అడిగారు. ఆవిడ కూడా బౙక్బల్ పుస్తకమే తీసుకున్నారు. షాపు ఓనరు మీకు లోపల పుస్తకాల అరల మధ్యగా ఉన్న ఒక అమ్మాయిని చూపిస్తాడు. మీరు ఆ అమ్మాయితో మాటలు కలుపుతారు. ఆ తరువాత ఆ పుస్తకం తీసుకుని ఇంటికి వస్తారు.”

Don’t believe that the book is losing sight of you, Reader. The you that was shifted to the Other Reader can, at any sentence, be addressed to you again. You are always a possible you. Who would dare sentence you to loss of the you, a catastrophe as terrible as the loss of the I. For a second-person discourse to become a novel, at least two you’s are required, distinct and concomitant, which stand out from the crowd of he’s, she’s, and they’s.

అలా మొదలవుతుంది రెండవ నవల – ఔట్‌సైడ్ ది టౌన్ ఆఫ్ మాల్బోర్క్. అయితే ఆ నవల మాత్రం మీరు సజావుగా చదవగలుగుతారా? అలా ఒక నవలతో మొదలైన మీ ఒంటరి ప్రయాణం ఆ అమ్మాయితో కలిసి మరింతగా పెరుగుతుంది. మీరిద్దరూ సాహిత్య పరిశోధకులుగా — ఇతర పాఠకులు, నవలపై చర్చలు, అభిప్రాయాలు, విశ్లేషణలు, పరిశోధనలు ఇలా — సాగిపోతుంది, ఒక పూర్తి నవల కోసం వెతుక్కుంటూ ప్రపంచాన్ని చుట్టుకుంటూ, మిమ్మల్ని తనతోపాటే తీసుకెళుతూ. నవలలో వచ్చే ఆఖరి నవల: “What Story Down There Awaits Its End?”

*****

ఈ నవల మీద వివరణలున్నాయి, విశ్లేషణలున్నాయి. నవలను కాకుండా నవల గురించి చదువుతారని వాటిని వేటినీ ప్రస్తావించలేదు. నాకు ఇంకా ఎంతో చెప్పాలని ఉన్నా ఈ పరిచయం చాలనుకుంటాను, ఈ నవల మీరు చదివేలా చేయడానికి, మీకు కాల్వీనోని పరిచయం చేయడానికి. అందువల్ల ఒకటి రెండు మాటలు చెప్పి ఆపేస్తాను. ఈ నవలలో ఉంది కేవలం చమత్కార కథనం కాదు. రచయిత, నవల, పాఠకుడు అంతా పాత్రధారులైన ఒక అద్భుత ప్రపంచం ఇది. చదివేకొద్దీ మనల్ని ఆపి, ఆలోచింపజేసి, అబ్బురపరిచే ఎన్నో విషయాలున్నాయి; రచయితకీ పాఠకుడికీ పుస్తకానికీ ఉన్న సంబంధాన్ని చూపిస్తూ, ప్రశ్నిస్తూ, చెరిపేస్తూ;

“Reading, is always this: there is a thing that is there, a thing made of writing, a solid, material object, which cannot be changed, and through this thing we measure ourselves against something else that is not present, something else that belongs to the immaterial, invisible world, because it can only be thought, imagined, or because it was once and is no longer, past, lost, unattainable, in the land of the dead….”

ఇటాలో కాల్వీనో రాసిన పుస్తకం కదా మరి!
If On a Winter's night A Traveler

Italo Calvino

FictionAbout the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.3 Comments


  1. చాల బాగుంది మీ పరిచయం నేను ఇది వరకు పేరు విన్నానో ,లేదో తెలియదు ..కానీ ఇపుడు చదవాలని వుంది.అలాగే మీకు ధన్యవాదములు …_/\_


  2. varaprasad

    ఈ పుస్తకం గురించి జంపాల చౌదరి గారి కామెంట్ చదవాలని వుంది.విమర్శ కైన ప్రశంస అయినా అయన శైలి బావుంటుంది,


  3. varaprasad

    చాలా బావుంది,వీలైతే మిగాతా పుస్తకాల్ని కూడా పరిచయం చెయ్యండి.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngugi Wa Thingio’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Nguigi Wa Thiongio) రాసిన Education for a national culture అన్న వ్యాసం గు...
by అతిథి
0

 
 

నీల :: కె. ఎన్. మల్లీశ్వరీ

వ్యాసకర్త : జయశ్రీ నాయుడు దాదాపుగా ఆరు వందల పేజీల కథా గమనాన్ని సమీక్ష గా కుదించాలంటే ...
by అతిథి
0

 
 

గడ్డి పూలు – గుండె సందుక

వ్యాసకర్త: ఎ.కె.ప్రభాకర్ ************** పూల మనసుల్లోకి … శాంతి ప్రబోధ కథా సంపుటి “గడ్డి పూల...
by అతిథి
1

 

 

On Writing: Stephen King

Written by: K.S.M Phanindra Books that teach writing are often very dry and I deliberately avoid them. I have read a couple of them and liked some of them a lot. Two of my favorites are “Telling Writing” by Ken Macr...
by అతిథి
1

 
 

నా 2017 పుస్తక పఠనం

మరో ఏడాది ముగుస్తోంది. ఈ ఏడాదిలో చదివిన పుస్తకాల గురించి రెండు ముక్కలు చెప్పుకోవడాన...
by సౌమ్య
1

 
 

పుస్తకం.నెట్ తొమ్మిదో వార్షికోత్సవం

ఇవ్వాళ్టితో పుస్తకం.నెట్ మొదలుపెట్టి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది. ముచ్చటగా పదో ఏట అడ...
by పుస్తకం.నెట్
0