2013 – నా పుస్తక పఠనం

నాకు చిన్నప్పుడు (1997లో అనుకుంటాను) మా నాన్నగారు ఒక డైరీ ఇచ్చారు, నువ్వు చదివిన పుస్తకాలు ఇక్కడ లిస్టు చేయి, ఏం చదివావో ఒక సారాంశం రాసుకో అని. అప్పుడు మొదటిసారి అలవాటైంది నాకు ఇలా లిస్టు చేయడం. ఆ‌డైరీ ఇంకా నా వద్ద ఉంది – దాన్నిండా మా స్కూలు లైబ్రరీలో ఉన్న పిల్లల పుస్తకాల పేర్లు ఉంటాయి. మరీ తారీకులతో సహా రాసుకోలేదు కానీ, ఆ అలవాటు అలా ఒక రెండు మూడేళ్ళ పాటు సాగింది. తరువాత బుద్ధి పుట్టినపుడు ఆర్నెల్లకో, ఏడాదికో ఆ పుస్తకం తెరిచి ఏదో కెలుకుతూ ఉండేదాన్ని. 2006లో బ్లాగు రాయడం మొదలుపెట్టాక ఆ‌డైరీ వాడకం ఆగిపోయింది ..ఎందుకంటే‌ అదంతా బ్లాగులో రాయడం మొదలుపెట్టాను. 2008 నుండి ఇలా ఫలానా ఏడాదిలో చదివిన పుస్తకాలు అనుకుంటూ‌ జాబితాలు రాసుకోవడం మొదలుపెట్టాను. ఈ ఉపోధ్ఘాతం అంతా ఎందుకంటే, దీనివల్ల ఉపయోగాలున్నాయని చెప్పేందుకు. ఏమిటవి? అంటే – నా అభిప్రాయంలో అన్నింటికంటే ముఖ్యమైన లాభం: మనలో మనకి కొంచెం క్లారిటీ వస్తుంది, మనం ఏం‌ చదివాము, ఎందుకు చదివాము, ఏం తెలుసుకున్నాము అన్న విషయాల మీద. రెండోది-అది తక్కినవారికి ఉపయోగపడే అవకాశాలను పూర్తిగా తోసిపుచ్చలేము. మూడోది – అది చూసి ఇంకొందరు “అవును, నేనూ ఇలాంటి లిస్టు రాసుకోవచ్చు కదా” అనుకునో, “బోడి, ఈవిడ చదివిన పుస్తకాలకే ఒక వ్యాసం రాస్తే, మనం చదివిన దానికి మనం రాయలేమా?” అనుకునో వాళ్ళ జాబితాలు రిలీజు చేయొచ్చు. మనకి కొత్త విషయాలు తెలియొచ్చు.

అదనమాట నేపథ్యం. ఇక విషయానికొస్తే, ఈ‌ఏడాది నేను చదివిన పుస్తకాల జాబితా ఇదీ:

తెలుగు

కథలు:
* ప్రళయకావేరి కథలు – స.వెం.రమేశ్: పులికాట్ సరసు ప్రాంతంలోని బాల్యం, జీవితాల చుట్టూ‌ అల్లిన కథలు. కథ, కథనం పరంగా exceptional గా అనిపించిన కథలు తక్కువే కాని, ఆ భాషలోని సొగసు కోసం, అప్పటి జీవితం గురించి తెలుసుకోడానికి మాత్రం ఈ పుస్తకం తప్పకుండా చదవాలి. నేను బాగా ఇష్టంగా మళ్ళీ మళ్ళీ చదివాను కొన్ని కథలని.
* గాలి రథం – ఆర్.వసుంధరాదేవి కథలు
* నెమ్లీక – తెలిదేవర భానుమూర్తి: ఇదివరలో రెండు మూడేళ్ళ క్రితం చదివినా, రెండోసారి కూడా ఫ్రెష్గా అనిపించాయి. తెలంగాణ మాండలికం బాగుంది.
* “అసంగత సంగతాలు” – ఎ.వి.రెడ్డిశాస్త్రి. absurd fiction అన్న genre కథలు. ఒకట్రెండు కథలు తప్పిస్తే, కథా-కథనం రెండూ పెద్ద ఆకట్టుకోలేదు.

నవలలు:
*‌ పులుల సత్యాగ్రహం – విశ్వనాథ సత్యనారాయణ: మళ్ళీ‌మళ్ళీ చదవాలి అనుకున్నాను మొదటిసారి చదవగానే!
* మునెమ్మ – డా. కేశవరెడ్డి : ఆపకుండా చదివించింది. ఆసక్తికరమైన నవల
*‌ మృణాళిని – బంకించంద్ర ఛటర్జీ (దండమూడి మహీధర్ తెలుగు అనువాదం): పర్వాలేదు.
*‌ ముచికుంద్ – తీపి అంటే ఎంత ఇష్టమో: మాధవ గాడ్గిల్ (తురగా జానకీరాణి తెలుగు అనువాదం) – మంచి పిల్లల పుస్తకం. పెద్దలనీ ఆకట్టుకుంటుంది.
* పునర్జన్మ – విశ్వనాథ సత్యనారాయణ : ఆపకుండా చదివించింది.

ఆత్మకథలు, జీవిత చరిత్రలు, యాత్రాకథనాలు వగైరా:
*‌ తెలంగాణ పోరాట స్మృతులు – ఆరుట్ల రామచంద్రారెడ్డి : ఆసక్తికరమైన పుస్తకం. మంచి సంపాదకుడు దొరికుంటే ఇంకా బాగుండేది.
* మనకి తెలియని మనచరిత్ర – తెలంగాణా రైతాంగపోరాటంలో స్త్రీలు: గొప్ప కలెక్షన్. స్ఫూర్తివంతమైన జీవితాలు!
* చలం ఆత్మకథ – చలం: పుస్తకంలో శైలి అయోమయం కలిగించినా, ఈ ఆత్మకథ చదివి కొన్నాళ్ళు అలా ఆశ్చర్యంలో, షాక్లో ఉండిపోయాను – ఏమిటి, ఇలాంటి మనిషి తెలుగు దేశంలో తిరిగాడా? ఎలా ఉండగలిగాడు ఇలా? అని. అలాగని చలంపైన నాకేదో అవ్యాజమైన అనురాగం, అచంచలమైన గౌరవం కలిగిందని కాదు. కానీ, ఇలాంటి ఓ ఆత్మకథ రాసాడంటే, ఎంత ధైర్యం కావాలి!
* నవ్విపోదురుగాక! – కాట్రగడ్ద మురారి : పుస్తకం ఎంత ఆసక్తికరంగా ఉందో, అంత బోరూ కొట్టించింది, చిరాకూ పుట్టించింది!
* ఆత్మకథ – విశ్వనాథ సత్యనారాయణ : ఆసక్తికరమైన పుస్తకం! ఇంకా కొనసాగి ఉంటే చాలా బాగుండేది!
* చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర – పరవస్తు లోకేశ్వర్: ఆసక్తికరమైన పుస్తకం

వ్యాసాలు:
* వోడ్కా విత్ వర్మ – సిరాశ్రీ : మరీ భజన ఎక్కువైపోయింది ఒకట్రెండు వ్యాసాలు మినహాయిస్తే
*‌ తిరగబడ్డ తెలంగాణ – ఇనుకొండ తిరుమలి: చాలా ఆసక్తికరమైన చరిత్ర పుస్తకం.
* తొలినాటి తెలుగు కథానికలు – మొదటి నుంచి 1930 వరకు : కె.కె.రంగనాథాచార్యులు – చాలా మంచి పుస్తకం. వీరిపుణ్యమా అని నేను చాలా ఆసక్తికరమైన పాత తెలుగు కథలు చదివాను.
* సుస్వరాల పాలగుమ్మి – పాలగుమ్మి విశ్వనాథం గురించి వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాలు. ఆయనే రాసిన వ్యాసం తప్ప వేరేది నన్ను ఆకట్టుకోలేదు.
* మా కుటుంబం:‌కవనశర్మ, ఆయన కుటుంబసభ్యులు : ఒకే మనిషి వేర్వేరు పేర్లతో రాసినట్ల్లుంది! కానీ, చదవడానికి ఆసక్తికరంగానే ఉంది.
* ఆరడుగుల నేల: చలసాని ప్రసాదరావు – ఆట్టే‌ ఆకట్టుకోలేదు.

ఆంగ్లం

కథలు:
* The incredible adventures of Professor Shonku – Satyajit Ray: ఇదివరలో కొన్నేళ్ళ క్రితం చదివిన కథలే చాలామటుకు. కాలక్షేపానికి చదూకోడానికి బాగున్నాయి.
*‌ Rashomon and Seventeen other stories – Ryunosuke Akutagawa : జపనీస్ కథలకి ఆంగ్లానువాదం. కథలు బాగున్నాయి. అన్నీ కాకపోయినా, కొన్ని కథలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను.
* The story of my environment – K.P.Purnachandra Tejaswi : కన్నడ కథలకి ఆంగ్లానువాదం. కొన్ని కథలు బాగున్నాయి. తక్కినవి సాధారణంగా ఉన్నాయి.

నవలలు:
* The Pregnant King- Devdutt Patnaik: మహాభారతంలోని యువనాశ్వుడి కథ ఆధారంగా రాయబడ్డ mythological novel. భారతీయ పురాణగాథల ఆధారంగా వస్తున్న ఫిక్షన్ మీద నాకున్న ఆసక్తి కారణంగా చదివాను. నాకు నచ్చింది.
* The Krishna Key-Ashwin Sanghi: డాన్ బ్రౌన్ రాసిన డావింసీ కోడ్ నవలకి దేశీ రీమేక్. సంఘీ పరిశోధనా పటిమకి నా జోహార్లు, ఎప్పట్లాగే. కానీ, ఇకనైనా ఈ రీమేక్ బాట వీడి ఒక ఒరిజినల్ రాస్తే చదవాలని కోరిగ్గా ఉంది. అలాగని నాకిది నచ్చలేదని కాదు. రీమేక్ గా బాగుంది.

ఆత్మకథలు, జీవిత చరిత్రలు, యాత్రాకథనాలు వగైరా:
* Change – Mo Yan: పుస్తకంలో చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం కింద జీవితం గురించి మోయాన్ వ్యాఖ్యానం ఉంటుంది. అసలు వ్యాఖ్యానం కంటే మోయాన్ శైలే నన్ను ఆకట్టుకుందీ పుస్తకంలో.
* My Stroke of Insight: A brain scientist’s personal journey: Jill Bolte Taylor
* Take me to your umlauts-David Bergmann: ఒక జర్మన్ మూలాలుగల అమెరికన్ తన తాతల దేశంలో ఉండి, ఆ భాష నేర్చుకోవాలి అన్న తాపత్రేయంతో జర్మనీకి వస్తాడు. అక్కడ జర్మనులతో, వారి భాషతో అతనికి కలిగిన అనుభవాల గురించి. కొన్ని ఆసక్తికరమైన పరిశీలనలు ఉన్నాయి, కొంచెం బోరు కొడుతుంది కూడా.
* Shakespeare – the world as stage by Bill Bryson: షేక్స్పియర్ జీవితం గురించి, అతని కాలంలోని సామాజిక జీవితం గురించీ Bill Bryson తన ఆసక్తికరమైన శైలిలో, అనేక historical nuggets చెబుతూ చెప్పిన కథ. బాగుంది.

వ్యాసాలు:
* Agastya in the Tamil Land – Sivaraja Pillai, K.Narayanan: తమిళ నాట అగస్త్య ముని పేరిట చెలామణీ అవుతున్న కథలను గురించి, వాటిలోని నిజానిజాలు బేరీజు వేస్తూ రాయబడ్డ పుస్తకం. పర్వాలేదు. పుస్తకం ఉచితంగా ఆర్కైవ్.ఆర్గ్ సైట్లో లభ్యం. తమిళ సినిమా అగత్తియార్ తో పాటు ఈ పుస్తకం చదివితే అదో అనుభవం 🙂
*‌ Rahul Dravid – Timeless steel by ESPN cricinfo: క్రిక్ ఇంఫో వెబ్సైటులో వివిధ వ్యక్తులు వివిధ సందర్భాల్లో ద్రవిడ్ గురించి రాసిన వ్యాసాలు, చేసిన ఇంటర్వ్యూలు ఉన్నాయి. నాకు చాలా నచ్చిందీ పుస్తకం.

నాటకాలు, స్క్రీన్ ప్లే వగైరా:
* Ingmar Bergman – The Fifth Act : బెర్గ్మాన్ రాసిన మూడు నాటకాల సంకలనం. నాకు చాలా నచ్చింది. బెర్గ్మాన్ రచనలు మరిన్ని చదివేలా పురికొల్పింది.
* Fanny and Alexander – Ingmar Bergman
* Autumn Sonata – Ingmar Bergman
* Face to Face – Ingmar Bergman
* Seventh Seal – Ingmar Bergman
-ఈ నాలుగూ సినిమా స్క్రిప్టులు. చాలా ఆసక్తికరంగా, ఆపకుండా చదివించాయి. సినిమాలు నేను చూడలేదు ఇంకా. తక్కిన రెండు సినిమాలూ నాకు నచ్చినా, స్క్రిప్టులు ఇంకా నచ్చాయి. ప్రస్తుతం Face to Face మళ్ళీ చదువుతున్నాను. Seventh Seal ఈ ఏడాది కాలంలో రెండు మూడు సార్లు చదివాను.

కార్టూన్లు, ఇతర బొమ్మల పుస్తకాలు:
*‌ Everybody is stupid except for me and other astute observations -Peter Bagge: అమెరికన్ కాంటెక్స్ట్ ఉంటే నేనింకా బాగా enjoy చేయగలిగేదాన్నేమో కానీ, కొన్ని కథనాలు ఆ నేపథ్యం లేకపోయినా‌ కూడా నాకు నచ్చాయి.
*‌ American Born Chinese by Jene Luen Yang : నాకు నచ్చింది. రెండు మూడు సార్లు చదివాను.

భాషాశాస్త్రం గురించినవి:
* Language Change: Progress or Decay? – Jean Aitchison : కాలనుగుణంగా, వివిధ కారణాల వల్ల మారుతున్న భాష గురించి, దాని పర్యవసానాల గురించి రాసిన పరిశోధనా వ్యాసాలు. చాలా ఆసక్తికరంగా, సులభగ్రాహ్యంగా ఉన్నాయి.
* Semantic Universals in Indian Languages – Anvita Abbi: భారతీయ భాషల్లో అన్నింటిలోనూ కనబడే కొన్ని Linguistic phenomenon గురించిన వ్యాసాలు. పుస్తకం రాసిన విధానం కొంచెం క్లిష్టంగా ఉంది కానీ, విషయాలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ పుస్తకంపై నా బ్లాగులో రాసుకున్న రన్నింగ్ నోట్సు ఇక్కడ.
*‌ Reduplication and Onomatopoeia in Telugu – Peri Bhaskararao: భాస్కరరావు గారిచ్చిన లెక్చర్ ఐదేళ్ళ క్రితం ఓసారి విన్నాను. ఆయన ఉపన్యాసంలాగానే, పుస్తకం కూడా క్లియర్ గా‌ఉంది. నామట్టుకు నాకైతే బాగా ఉపయోగ పడింది.
* A Grammar of modern Telugu- భద్రిరాజు కృష్ణమూర్తి, జె.పి.ఎల్.గ్విన్ : కొన్ని విషయాలు అర్థం చేసుకునేందుకు ఉపయోగపడింది.
* ధ్వన్యనుకరణ పదకోశం – ఎ.ఉషాదేవి : చాలా ఆసక్తికరమైన నిఘంటువు. తప్పకుండా దగ్గర ఉంచుకోవాల్సినది.

ఆహారం, veganism వగైరా:
గత ఆర్నెల్లలో ఈ అంశాలమీద అనేక జాల వ్యాసాలు, ఒకటీ అరా పుస్తకాలూ చదవడం జరిగింది.
*‌ Eating Animals – Jonathan Safron Foer
* Why We Love Dogs, Eat Pigs, and Wear Cows: An Introduction to Carnism: The Belief System That Enables Us to Eat Some Animals and Not Others by Melanie Joy – కొంతవరకు ఆకట్టుకుని, ఆసక్తికరమైన విషయాలు తెలియజేసి, ఆలోచింపజేసింది. clear గా ఉంది, ఎక్కడా అయోమయం లేకుండా.
* The Omnivore’s Dilemma – Michael Pollan : చాలా విషయాలు తెలిశాయి ఈ పుస్తకం వల్ల!

సాంకేతికం:
* Ubuntu for non-geeks: Rickford Grant – కొత్తగా ఉబుంటూ‌కి మారినవారికి చాలా ఉపయోగపడుతుంది.
* The Linux Command Line – William E.Shotts Jr. : ఇది కూడా ఉపయోగకరమైన పుస్తకం, లినక్స్ వాడుకరులకి.
-వేరెవరికో రిఫర్ చేయడానికి పనికొస్తాయేమో అనే చదివినా కూడా, నాకూ పనికొచ్చాయి – కొన్నేళ్ళుగా లినక్స్ వాడుకరిని అయినప్పటికీ.

(ఈ జాబితాలు తయారు చేసేందుకు goodreads.com లో నా యూజర్ లాగ్, “మీరేం చదువుతున్నారు?” పేజీలో రాసిన నా వ్యాఖ్యల మీద ఆధారపడ్డాను.)

నా సొంత డబ్బా: 2008,2009 పుస్తక పఠనం, 2010, 2011-ఆంగ్లం, 2011-తెలుగు, 2012 జాబితాలు.

ఇక, పుస్తకం.నెట్లో 2009, 2010, 2011, 2012 సంవత్సరాల్లో చదివిన పుస్తకాల గురించి వివిధ వ్యక్తులు రాసిన వ్యాసాలు.

You Might Also Like

One Comment

  1. మంజరి లక్ష్మి

    చదివిన పుస్తకాలు డైరీలో రాసుకోవటం బాగుంది. మీరు చెప్పినట్లు నేను కూడా అలా చెయ్యాలి.

Leave a Reply