ఎండలో ద్రాక్షపండు – A Raisin in the Sun

వాయిదా పడ్డ కల ఏమవుతుంది?

అది మగ్గిపోయి సుక్కిపోతుందా
ఎండలో ద్రాక్షలా?
లేక వ్రణంలా పుచ్చిపోయి
రసి కారుతుందా?
కుళ్ళిన మాంసపు కంపు కొడుతుందా
లేక చక్కెరపెచ్చు కట్టిన మిఠాయి అవుతుందా?

బహుశా మితిమీరిన బరువులా
కృంగిపోతుందేమో?

కాక, అది ఫెటిల్లుమని పేలుతుందా

(Langston Hughes – ల్యాంగ్స్టన్ హ్యూస్ కవిత)

ఇరుకుగా, చీకటిగా ఉన్న అద్దెకొంపలో జీవిస్తున్న ఐదుగురు.  పిల్లలకోసం అప్పటివరకూ గానుగెద్దులా శ్రమించిన ఇంటాయన చనిపోయాడు. ఆయన భార్య అప్పటివరకూ నడుము విరగ్గొట్టుకునేలా పని చేసి విశ్రాంతికి సిద్ధమౌతూ ఉంది. ఎప్పటికైనా తనదంటూ ఒక ఇంట్లో, పుష్కలంగా గాలీ వెలుతురూ ఉండే ఇంట్లో, ఉండాలని ఆమె కోరిక. డాక్టర్ చదువు చదివి ప్రపంచాన్ని మార్చేయాలని కలలుగంటూ ఉంటుంది ఆమె కూతురు.  ఒక షావుకారువద్ద డ్రైవరుగా పనిచేస్తున్న కొడుకుని జీవితంలో పైమెట్టుకెక్కలేకపోతున్నానన్న బాధ నిరంతరం నిలువునా తొలిచేస్తూంటుంది. ఇళ్ళలో ఊడిగం చేస్తూ, బతుకు బండి లాగటానికి కష్టపడి తాను చేయగలిగింది తాను చేస్తున్నా, అశాంతితో అతలాకుతలమౌతున్న భర్త తనకు దూరమౌతూ ఉంటే ఏం చేయాలో తెలియక బాధపడ్తున్న కోడలు. ఉన్న కష్టాలకు తోడు తాను మళ్ళీ తల్లి కాబోతున్నానని కోడలి అనుమానం. ఎట్లా పెంచటం ఆ రాబోతున్న పసికందుని?  ఇంకా ఆటపాటలాడుకునే వయసులో ఉన్న చిన్ని మనవడు.

ఈ కుటుంబాన్ని ఇంతకు ముందు చూసినట్టో, లేక ఎక్కడో విన్నట్టో, చదివినట్టో అనిపిస్తుందా? చదివే ఉండొచ్చు, తెలుగు  కథల్లోనో, ఇంగ్లీషు నవలల్లోనో, రష్యన్ అనువాదాలలోనో, సినిమాల్లోనో జీవితంలోనో. అచ్చంగా ఇదే కాకపోయినా, ఇలాంటిదే ఒక కుటుంబం మనకు కనిపించే ఉంటుంది.

ఇప్పుడు నేను చెప్పిన కుటుంబం మాత్రం, ఎ రెయిజిన్ ఇన్ ది సన్, అనే ఆంగ్లనాటకంలో కుటుంబం. 1950లలో నల్లవారు ఎక్కువగా నివసించే చికాగో దక్షిణ ప్రాంతంలో నివసిస్తున్న ఒక నల్లజాతీయుల కుటుంబం. యంగర్ కుటుంబం. లొర్రెయిన్ హ్యాన్స్‌బెర్రీ అనే నల్లజాతి రచయిత్రి ఈ నాటకాన్ని వ్రాసింది. పైన ఉదహరించిన ప్రఖ్యాత కవిత నుంచి ఈ నాటకం పేరు ఎన్నుకుంది రచయిత్రి.

ఒక శుక్రవారం ఉదయాన నాటకం మొదటి రంగం మొదలౌతుంది. నెమ్మదిగా మనకు యంగర్ కుటుంబం పరిచయమౌతుంది. పొద్దున్నే raisin4కొడుకును తయారుచేసి బడికి, భర్తకు నాస్తా పెట్టి పనికి పంపించటానికి హైరానా పడుతుంటుంది కోడలు రూత్. పొద్దున్నే భార్యాభర్తల మధ్య వాదన మొదలౌతుంది. స్నేహితులతో తాగి, పోసుకోలు కబుర్లతో గడిపి రాత్రి ఇంటికి ఆలస్యంగా వచ్చాడని ఆమెకు చిరాకు. కుటుంబం బంగారు భవిష్యత్తుకోసం తాను ప్లానులు వేస్తుంటే తనకెవరూ సహకరించట్లేదని అతనికి కోపం. ఇంతకుముందెప్పుడో ఎవరితోనో కలసి లాండ్రీ బిజినెస్ చేస్తానంటే కుదరనియ్యలేదు. ఆ బిజినెస్ మొదలెట్టిన స్నేహితుడిప్పుడు కోటీశ్వరుడు. భార్యభర్తలు ఘర్షణ పడుతుండగా మనకొక సంగతి తెలుస్తుంది.

చనిపోయేముందెప్పుడో యంగర్ కుటుంబం  పెద్దాయన బీమా చేశాట్ట. వ్యవహారాలన్నీ పూర్తై చివరికి ఇన్సూరెన్సు డబ్బు, చెక్కు రూపంలో, ఆ మర్నాడు రాబోతుంది. కొడుకు వాల్టర్ లీ యంగర్ (బ్రదర్ అని కూడా పిలుస్తారు ఇంట్లో)కి ఆ డబ్బును పెట్టుబడిగా పెట్టి ఒక బారును తెరిచి, అంచలంచెలుగా పెరిగి ధనవంతుడు కావాలని కల. అతని  భార్య రూత్, చెల్లెలు బెనీతా మాత్రం ఆ డబ్బు తల్లి (అసలు పేరు లీనా యంగర్, మామా – అమ్మా- అని పిలుస్తారు)కి చెందుతుందని ఆవిడ ఇష్టప్రకారం ఏమైనా చేసుకోవచ్చు అన్న అభిప్రాయం వ్యక్తపరుస్తారు. ఆ కుటుంబానికి తల్లే యజమాని. ఆమెకు పిల్లలన్నా, కోడలన్నా ప్రేమ. కష్టపడే కోడలంటే సానుభూతి.

మామా, రూత్ మాట్లాడుతూండగా రూథ్ సొమ్మసిలి పడిపోతుంది. ఆమె గర్భవతి

అని మామాకు అర్థమౌతుంది. ఆ బిడ్డ పుట్టకుండా గర్భస్రావం చేయించుకుందామని రూథ్ ఆలోచన. అది మామా కుటుంబ విలువలకు వ్యతిరేకం. ఆమెకి సుతరామూ ఇష్టం లేదు.

శనివారం టపాలో ఇన్సూరెన్సు చెక్కు వచ్చింది. తాను చేద్దామనుకుంటున్న వ్యాపారానికి ఆ డబ్బును పెట్టుబడిగా ఇమ్మని అడుగుతున్న కొడుకుతో చెక్కు విషయం గురించి మాట్లాడడానికి మామా నిరాకరిస్తుంది. రూత్ గర్భనివారణ చేయించుకోవడానికి ఆలోచిస్తుందన్న విషయం కుమారుడికి చెప్తుంది. అతని తండ్రి ఎంత కష్టానికైనా ఓర్చి పిల్లలను పెంచాడని, తాను అలాగే పిల్లలని పెంచగలనని భార్యకు చెప్పమంటుంది. వాల్టర్ ఆమెకు జవాబు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాడు.

పిల్లలకు చెప్పకుండా మామా ఎక్కడికో వెళ్ళి వచ్చింది. ఇన్సూరెన్సు డబ్బుతో తాను ఒక ఇంటిని కొన్నానని రూత్‌కు చెప్తుంది. ఆ వార్త విన్న రూత్ చాలా ఆనందిస్తుంది. ఐతే మామా కొన్న ఇల్లు ఎక్కడ ఉందో తెలియగానే ఆమె ఉత్సాహం చప్పగా చలారిపోతుంది. ఆ ఇల్లు తెల్లవాళ్ళు నివసించే ప్రాంతంలో ఉంది. “ఎందుకొచ్చిన గొడవ. ఆ మాత్రం ఇల్లు నల్లవాళ్ళ చోట్లో దొరకకపోయిందా” అని అడుగుతుంది. తనకు కావలసిన సౌకర్యాలతో తాము పెట్టగల ధరకు అక్కడే దొరికిందని సమాధానం చెప్తుంది మామా.

ఇన్సూరెన్సు డబ్బుతో వ్యాపారం చేద్దామనుకున్న వాల్టర్‌కు మామా ఆ డబ్బుతో ఇల్లు కొనడం కోపం తెప్పిస్తుంది. అతను ఇల్లు విడచిపెట్టి బార్లో తప్పతాగుతూ కూర్చుంటాడు. రెండురోజులు గడచాక, మామా అతన్ని బార్లోనే కలుస్తుంది. తనదగ్గర మిగిలిన డబ్బంతా వాల్టర్‌కి ఇస్తుంది. దానిలో కొంత డబ్బు బెనీతా పేర ఆమె చదువుకోసం బ్యాంకులో వేసి, మిగతా డబ్బును వాల్టర్ ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చని చెప్తుంది. ఆ రోజు నుంచి తమ కుటుంబానికి వాల్టరే పెద్ద అని, తన పెద్దరికాన్ని వాల్టర్‌కు అప్పచెప్పేస్తుంది.

ఒక వారం తర్వాత ఆఖరు అంకం ప్రారంభమౌతుంది. యంగర్ కుటుంబం తాము ఉంటున్న అపార్ట్‌మెంట్ ఖాళీ చేసి కొత్త ఇంటికి మారే ప్రయత్నంలో ఉంటారు. ఆ సమయంలో వాళ్ళింటికి ఒక తెల్లాయన వచ్చాడు. వాళ్ళు కొత్తగా కొనుక్కున్న ఇల్లు ఉన్న కాలనీ అస్సోసియేషన్ అధ్యక్షుడట. కాసేపు అటూ ఇటూ నాన్చి ఆయన చెప్పిందేమిటంటే ఆ కాలనీలోకి కొత్తగా ఒక నల్ల కుటుంబం వస్తే లేనిపోని గొడవలు వస్తాయని, ఆస్తి విలువలు పడిపోతాయని, అవన్నీ జరగకుండా ఉండాలంటే యంగర్ కుటుంబం తమ కాలనీలోకి రాకుండా ఉండాలనీ. వాళ్ళకేం నష్టం లేకుండా, ఆ ఇంటిని, యంగర్ల దగ్గర్నుంచి కాలనీ వాళ్ళు కొనుక్కుని, అదనంగా నష్టపరిహారం కూడా కొంత ఇస్తారని చెప్తాడు ఆయన. ఆ మాటలు విన్న వాల్టర్, కోపంగా అతన్ని ఇంట్లోచి గెంటినంత పని చేసి పంపించేశాడు.

కాసేపటి తర్వాత వాల్టర్ పెట్టబోతున్న బారులో భాగస్వామి బోబో ఒక పాడు కబురు తీసుకొచ్చాడు. మరో భాగస్వామి విల్లీ డబ్బంతా తీసుకుని మాయమయ్యాడు. వాల్టర్ తన దగ్గరున్న డబ్బంతా, బెనీతాకోసం బ్యాంకులో వేయాల్సిన డబ్బుతో సహా, మొత్తం విల్లీకి అప్పచెప్పాడు. ఆ డబ్బంతా పోయినట్టే. ఉద్యోగం మానేసి వ్యాపారం చేద్దామని వాల్టర్ కంటున్న కలలు, డాక్టర్ చదువుదామని బెనీతా కంటున్న కలలు ఇక కల్లలే. పైపెచ్చు మామా తనపై పెట్టిన నమ్మకాన్ని వాల్టర్ నిలబెట్టుకోలేకపోయాడు. ఈ దెబ్బతో వాల్టర్ పూర్తిగా నిర్వీర్యుడైపోయాడు.

ఇల్లు మారకుండా ఉండటానికే మామా నిశ్చయించుకుంటుంది. కానీ, కాలనీ ప్రెసిడెంటును పిలచి ఇల్లు మారకుండా ఉంటున్నందుకు నష్టపరిహారం తీసుకుంటానని వాల్టర్ చెబుతాడు. అది తమ కుటుంబానికి తలవంపులు పని అని మిగతా అందరూ చెప్తున్నా వాల్టర్ వినడు. ఇవి మడిగట్టుకుని కూర్చునే రోజులు కావనీ, అందినంతవరకూ లాక్కోవడమే జీవితానికి ముఖ్యమనీ వాదిస్తాడు. బెనీతా అతన్ని పురుగులా చూస్తుంది. నష్టపరిహారం సంగతి మాట్లాడడానికి ప్రెసిడెంటు వాళ్ళింటికి వచ్చాడు. అతనితో మాట్లాడేముందు, వాల్టర్ అక్కడే ఉన్న తన కొడుకును బయటకి వెళ్ళమంటాడు. అతను చేయదలచుకున్నదేదో కొడుకు ముందే చేసి, తాను ఏం చేశాడో కొడుకుకు అర్థమయ్యేలా చెప్పాలని మామా పట్టు పడుతుంది. వాల్టర్ ప్రెసిడెంటుతో ఏం మాట్లాడుతాడు? ఏం బేరం పెడతాడు? ఆ బేరం ఎలా సాగుతుంది అన్నది నాటకం పతాకసన్నివేశం.

ఈ నాటకాన్ని వ్రాసినప్పుడు రచయిత్రి లొర్రెయిన్ హాన్స్‌బెర్రీకి ఇరవయ్యారేళ్ళు. మూడేళ్ళ తర్వాత (1959లో) ఈ నాటకం న్యూయార్క్ నగరం బ్రాడ్వేలో ప్రదర్శించబడినప్పుడు చరిత్రను సృష్టించింది. ఒక నల్లజాతి రచయిత్రి రచించిన నాటకం బ్రాడ్వేలో ప్రదర్శించబడటం అదే మొదటిసారి. నటీనటులందరూ నల్లవాళ్ళే. వాల్టర్‌గా సిడ్నీ పోయిటర్, మామాగా క్లాడియా మెక్‌నీల్, రూత్‌గా రూబీ డీ, బెనీతాగా డయానా శాండ్స్ నటించారు. ఎ రెయిజిన్ ఇన్ ద సన్ నాటకం బ్రాడ్వేలో అపూర్వమైన విజయాన్ని పొందింది. 19 నెలల పాటు ప్రదర్శించబడింది. న్యూయార్క్ డ్రామా క్రిటిక్స్ సర్కిల్ ఉత్తమ నాటకంగా సత్కరించింది. లొర్రెయిన్ హాన్స్‌బెర్రీ ఆ సత్కారాన్ని అందుకున్న వారందరిలోకీ పిన్న వయస్కురాలు, మొదటి నల్ల జాతి వ్యక్తి.

రెండేళ్ళ తర్వాత ఎ రైజిన్ ఇన్ ద సన్, నాటకంలో వేసిన నటీనటులతోనే, చలనచిత్రంగా విడుదలై కాన్ (Cannes) చలన చిత్రోత్సవంలో బహుమతి గెలుచుకుంది. నాటకంలాగే సినిమా కూడా విజయవంతమయ్యింది.

రచయిత్రి లొర్రెయిన్ హాన్స్‌బెర్రీ ఆ తరవాత ఇంకొన్ని నాటకాలు కూడా రాసింది. కానీ తన ముప్పైనాలుగో ఏట, 1965లో, కేన్సర్ వ్యాధితో మరణించింది. కేన్సర్‌తో మంచాన పడ్డాక కూడా ఆమె ఒక నాటకం రాస్తే, అదీ బ్రాడ్వేలో ప్రదర్శించబడింది. నిస్సందేహంగా ఒక గొప్ప రచయిత్రి పూర్తిగా తన సృజనను అందించే అవకాశాన్ని కేన్సర్ అకాలంగా పొట్టనబెట్టుకుంది. ఆమె చనిపోయాక కూడా ఆమె నాటకాలు రెండు బ్రాడ్వేలో ప్రదర్శించబడ్డాయి. 1974లో మళ్ళీ బ్రాడ్వేలో ఎ రైజిన్ ఇన్ ద సంగీతాత్మక నాటకం (మ్యూజికల్)గా ప్రదర్శించబడి, విజయవంతమవ్వటమే కాక ఆ యేడాది ఉత్తమ మ్యూజికల్‌గా టోనీ అవార్డు గెలుచుకుంది.

లొర్రెయిన్ హాన్స్‌బెర్రీ తండ్రి చికాగోలో స్థిరాస్తులు అమ్మే బ్రోకరుగా పనిచేసేవాడు. నల్లవారిపై వివక్షతకు వ్యతిరేకంగా పని చేసే NAACP (National Association of Advancement for Colored People) కార్యకర్త. నల్లవారికి ఆస్తులు అమ్మటంలో చూపే వివక్షకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు పోరాడి గెలచినవాడు. తల్లి కూడా రాజకీయాల్లో చాలా చురుకుగా పాల్గొనేది. లొర్రెయిన్ చిన్నతనంలో వారి ఇల్లు చాలా హడావిడిగా ఉండేది. పేరుగన్న రాజకీయ నాయకులు, కళాకారులు, రచయితలు (ల్యాంగ్స్టన్ హ్యూస్‌తో సహా) వారి ఇంటికి అతిథులుగా వచ్చేవారు. లొర్రెయిన్ హాన్స్‌బెర్రీపై వీరందరి ప్రభావమూ చిన్నతనంలోనే పడింది.

Raisin10001

ఈ నాటకం ఇంతగా విజయవంతమవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మొదటిది పైన చెప్పిన విశ్వజనీనత. ఇది ఒక్క కుటుంబానికి చెందిన ప్రత్యేక కథ మాత్రమే కాదు. ప్రపంచం నలుమూలలా వాస్తవానికీ – ఆశలకూ పొంతన కుదరక, కుదుర్చుకునే అవకాశాలు లేక అతలాకుతలమయ్యే కుటుంబాలు చాలా కుటుంబాలకు ఈ కుటుంబం ప్రతీక. రెండవది ఒక చారిత్రక సంధ్యలో నల్లవారికి అమెరికాలో జరుగుతున్న అన్యాయాన్ని బలంగా చూపి, ఎలుగెత్తి వివరించటం (అప్పటికింకా నల్లవారి పౌరహక్కుల పోరాటాలు ఊపందుకోలేదు). మూడవది పాత్రలనూ, పాత్రల మధ్య వైరుధ్యాలనూ, కుటుంబంలోనీ చలనాంశాలను వాస్తవాత్మకంగా చిత్రించిన తీరు. సంభాషణలు చాలా పదునుగా ఉంటాయి.

నాటకం నేను చూడలేదు కానీ, పుస్తకం చదువుతున్నా, సినిమా చూస్తున్నా ఉత్కంఠతో చాలాసార్లు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. పాత్రల మధ్య ఘర్షణలలో నిప్పు రాజుకుని వాతావరణం వేడిగా మారిపోవటం అనుభవమౌతుంది. ఆ మంటలను ఆ కుటుంబం ఎలా తట్టుకొంటుందో అన్న భయం మనకు కలుగుతుంది. తెరపై నటీనటులు జీవించారు.  చిన్న వేదికపై (నాటకం మొత్తం ఆ ఇరుకు అపార్ట్‌మెంట్ ముందుగదిలో జరుగుతుంది)  సిడ్నీ పోయిటర్,  క్లాడియా మెక్‌నీల్, రూబీ డీలు పోటాపోటీగా నటించి రక్తి కట్టించారు.

 “ఇది మనుషుల,  ముఖ్యంగా నల్లవారి, జీవితాల సత్యాన్ని ఆవిష్కరించే నాటకం. ఒక్క నల్లవారి కుటుంబంలోనే ఎన్ని చాయలు ఉంటాయో, పాత కొత్త విలువల మధ్య సంఘర్షణ ఎలా ఉంటుందో,  నల్లవారు ఎంత అసాధారణమైన, నమ్మశక్యం కాని సాహసంతో జీవిస్తున్నారో” చూపించటానికి ప్రయత్నించానని రచయిత్రి ఒకసారి చెప్పింది.

పైన పేర్కొన్న పాత్రలే కాక, బెనీతాకు ఇద్దరు మగ స్నేహితులు ఉంటారు. ఒకరు డబ్బున్న కుటుంబానికి చెందిన నల్ల యువకుడు. ఇంకొకరు చదువుకోసం అమెరికా వచ్చిన ఆఫ్రికన్ యువకుడు అసాగై.  బెనీతాకు తన మూలాలను తెల్సుకోవాలన్న ఆసక్తి. తన దేశానికి తిరిగి వెళ్ళి అక్కడ తనవారి జీవితాన్ని బాగు చేయాలన్న తపన అసాగైది. విభిన్న వ్యక్తిత్వాలు, పరిణతి ఉన్న  అసాగై, బెనీతాల మధ్య సంభాషణలు కూడా చాలా ఆసక్తికరంగా ఉండి నాటకానికి అదనపు పుష్టిని కలిగిస్తాయి.

వెలుతురు అంతగా రాని వంటగదిలో ఒక మొక్కని మామా పెంచుతుంటుంది. ఆ మొక్క పుష్టిగా పెరగదు కానీ మొండిగా బతుకుతూనే ఉంటుంది. దాన్ని ఎలాగైనా పెంచి పుష్పించేలా చేయాలని మామా ఆరాటపడుతూంటుంది. ఇటువంటి ప్రతీకలు నాటకంలో చాలా ఉంటాయి.

తెలుగులో మొదట్లో వచ్చిన నాటకాలతో నాకు కొద్దిగానైనా పరిచయం ఉన్నా, ఇప్పుడు తెలుగు నాటకరంగం పరిస్థితి ఎట్లా ఉందో నాకు అస్సలు తెలీదు.1998లో అమెరికన్ తెలుగు సంఘం (ఆటా) వారు నిర్వహించిన పోటీలలో గెలిచిన నాటకాల తర్వాత వచ్చిన నాటకాలేమీ నేను చదవలేదు.  నేను చూసిన, చదివిన చాలా తెలుగు నాటకాలలో వస్తువుకు ఇచ్చినంత ప్రాధాన్యం – పాత్రల మధ్య సంబంధాలలో ఉన్న చలనాత్మకత, బిగువులకు ఇవ్వటం అంతగా చూసిన గుర్తు లేదు. అమెరికన్ నాటకాలలో వస్తువుతో పాటు ఈ తన్యత కూడా ముఖ్యమే.

ఎ రైజిన్ ఇన్ ద సన్ చాలా ముద్రణలు పొందింది. నేను చదివిన ప్రచురణలో, లొర్రెయిన్ హాన్స్‌బెర్రీ ఒకప్పటి భర్త, ఆమె నాటకాల నిర్మాత రాబర్ట్ నెమిరాఫ్ వ్రాసిన విపులమైన పరిచయం ఉంది.

తప్పక చదవవలసిన పుస్తకం; చూడవలసిన నాటకం/ సినిమా.

raisin3 raisin5

 

A Raisin In The Sun
(Play)
Lorraine Hansberry
1959
1995 edition by The Modern Library
160 pages

You Might Also Like

5 Comments

  1. శ్రీధర్ బాబు పసునూరు

    చాలా హృద్యంగా రాశారు… మానవ సంబంధాల మధ్య చలనాత్మకత.. తన్యత ముఖ్యం అన్న మాట మరీ నచ్చింది. ఈ వ్యాసం ఇన్ని రోజులు ఎలా మిస్సయ్యానో..?

  2. sunita

    కాస్బీ షో లో చూసీ phylicia rashadఅంటే ఏర్పడిన అభిమానం తో ఈ సినిమా ఆమెకోసం చూసాను.బుక్ ఐతే చదవలేదు…

  3. paavankondapalli

    మంచి పుస్తకాన్ని పరిచయం చేసారు పరిచయం చేసిన పధ్ధతి విశ్లేషణ హృద్యంగా హత్తుకునేటట్టుగా ఉంది 1970 లో సిద్ద్నిపొఇతెర్ తో సర్ విత్ లవ్ చూసాను ఆతను స్టేజి యాక్టర్ అని మీద్వారానే తెలిసింది,మిత్ర ,వాసిరెడ్డి నవీన్ ,క్రాంతి శ్రీనివాసరావు గారల ద్వారా మీగురించి విన్నాను క్ఖమ్మమ్ ఎన్ అర్ ఐ సభలో కలిసాం,ఇట్లాంటి మంచి పుస్తకాలను దయచేసి నెలకు ఒకటయిన పరిచయం చెయ్యండి ప్రస్తుతం మార్కెట్లో దొరికెద్యితె అడ్రస్ తెలియజేస్తే బాగుంటుందేమో ఆలోచించగలరు

  4. padmavalli

    Due to the fantastic taste and appetite of my son’s Advanced English class teacher in high school, this year I had the fortune of reading a few forgotten classics along with him. This is one of them. Thanks for the nice introduction.

  5. జ్యోతి

    సిడ్నీ పోయిటర్ ని “గెస్ హూ ఈజ్ కమింగ్ టు డిన్నర్ ” మూవీలో చూసి, పెద్ద ఫాన్ అయ్యానండి. ఈ సినిమా కూడా తప్పక చూడాల్సిన సినిమాలాగ అనిపిస్తోంది. మంచి సినిమాని పరిచయం చేసినందుకు కృతఙ్ఞతలు.

Leave a Reply