యాది – జ్ఞాపకాల నిండుకుండ

“వారీ కార్తీకా! ఇగ పట్టు” అంటూ అంకితమిచ్చారీ పుస్తకాన్ని సామల సదాశివగారు, తన యాదిలోంచి ముచ్చట్లు చెప్పమని చిన్నప్పటినుంచీ గారాలు పోయిన తన మనవడికి.

 వెనకటితరం పెద్దమనుషులు చెప్పే ముచ్చట్లు వినముచ్చటగా ఉంటాయి. ఆ చెప్పేవారు తనకాలపు సాంస్కృతిక, సామాజిక రంగాలతో ప్రగాఢానుభవమూ, అవగాహనా ఉండిన సదాశివగారైతే, వేరే చెప్పాలా? శంఖాన్ని చెవికి ఆనించుకుంటే సముద్రపు హోరు వినిపించినట్లు – కాలంనాటి కథలన్నీ కళ్ళముందు కదలాడుతాయి.

ఆరాంకుర్చీలో కూర్చొని ఆత్మీయులతో సంభాషిస్తున్నట్లు సాగే ఈ వ్యాసాలకి ప్రణాళిక అంటూ అట్టే ఉండదు. సంగీతం, సాహిత్యం, పాత పరిచయాలను నెమరేసుకోవడం…ఉఠి కోతి కొమ్మచ్చి  అన్నమాట!

***

“జరా ఉమ్రె-రఫ్తాకో ఆవాజ్ దేనా”  అన్న ఉర్దూ కవితా పంక్తి తొలి వ్యాసపు శీర్షికగా మొదలవుతుంది సదాశివగారి యాది.

 “గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా” అని వేడుకుంటున్నాడు ఉర్దూ కవి సఫీ లఖ్నవీ. పిలిస్తే మాత్రం గడిచిపోయిన జీవితం తిరిగి వస్తుందా? రాదు. ఆ సంగతి కవికి తెలుసు – మనకు తెలుసు. కాబట్టి మనమే గతంలోకి వెళ్ళి, కొన్ని తీయని జ్ఞాపకాలు పట్టి తెచ్చి పాఠకుల ముందు పరిస్తే మంచిది. వినేవాళ్ళు వింటారు, విననివాళ్ళు వినరు. ఉర్దూలో ఒక మాటున్నది – జో సునా ఉస్కా భలా – జో న సునా ఉస్కా భలా” అంటే ఎవరు విన్నారో వాళ్ళకు మేలగుగాక – ఎవరు వినలేదో వాళ్ళకూ మేలగుగాక.

ముప్పయ్యేళ్ళనాడు ఆదిలాబాదలో దుర్గా నవరాత్రులప్పుడు జరిగిన పండిట్‌ జస్‌రాజ్‌గారి హిందుస్తానీ గాత్ర కచేరీ కబుర్లు చెబుతారీ మొదటి వ్యాసంలో. ఎక్కడో విన్న మంచి పాటని సొంత ఊళ్ళో రసికులకు వినిపించాలని తపించే గొట్టుముక్కల శంకరరావుగారు, “తబలా వాయించే పొల్లగాని పాట కచేరీ”తో మెహఫిల్ ఎట్ల జమాయిస్తుందోనని కచేరీకి ముందు భయపడ్డా, చెరుకు రసంవంటి గాత్రమాధుర్యానికి పరవశించి, “ఏమి రియాజ్, ఏమి తయారీ” అని పొగడిన దాజీ వామనరావుగారు, సభా భవనంలో కూర్చొనో, ప్రాంగణంలో నించునో గంటల తరబడి నిశ్శబ్దంగా సంగీతాన్ని ఆస్వాదించే శ్రోతలు, పరిచయ ప్రసంగాలు అనుచిత అధికప్రసంగాలు కాకుండా జాగ్రత్త పడే నిర్వాహకులు … ఆనాటి ఉజ్వల సాంస్కృతిక వాతావరణాన్ని కొద్ది మాటలతో కళ్ళకి కట్టేలా రాసుకొస్తారు సదాశివగారు. రూపాయి బిళ్ళకోసం జేబులోని పావలాను వదులుకోవడానికి ఇచ్చగించని పండిట్‌జీ వ్యకిత్వ పరిచయం కూడా మనకు కలుగుతుంది – ఈ అయిదు పేజీల యాదిలో.

***

అహ్మద్ హుసేన్ అమ్జద్ అని ఉండేవారు – హైదరాబాదలో ఏజీ ఆఫీసులో ఓ చిరుద్యోగి. సూఫీ కవి. అమ్జద్ హైదరాబాదీగా సాహితీప్రపంచంలో సుప్రసిద్ధుడు. అమ్జద్ సభలో నిజాము సైతం అదబ్[మర్యాద]తో కూర్చునేవాడట. ఒకసారి అమ్జద్ ప్రసంగిస్తున్న సభలో ప్రత్యేకాసనంలో కూర్చున్న నిజాము ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూసిన అమ్జద్ “రాచకార్యాలున్నవారు ఈలాటి సభలకు రావలిసిన అవసరం  ఏమిటి?” అని గట్టిగానే ప్రశ్నించాడట. అప్పటికి మౌనం వహించిన నిజాము ఆ మరునాడు అమ్జద్ గురించి తెలుసుకొని – “హజ్రత్ అమ్జద్ మహనీయుడు. అతడు ఆఫీసుకు రావలసిన అవసరం లేదు. నెలనెలా అతని జీతం అతనింటికే పంపండి” అని అకౌంటెంట్ జనరల్‌కి చిట్టీ పంపినాడట. “పని చేయకుండా తీసుకునేది ఖైరాత్ [దానం/భిక్ష]. నేను ఖైరాతీని కాను. ఉద్యోగిని. శక్తివంచన లేకుండా ఉద్యోగధర్మం నిర్వర్తించేవాన్ని. ఉద్యోగం చేయనిస్తేనే జీతం తీసుకుంటాను” అని రాసి పంపినాడట అమ్జద్!

అమ్జద్ రుబాయీలను తెలుగులోకి అనువదించారు సదాశివగారు. ఆ అనువాదానికి అనుమతి కోసం సిఫారసు చేసిన వారి కథా, అనుమతిని పొందినా అమ్జద్ ఆతిథ్యాన్ని పొందలేకపోయిన కథా – మీతో పంచుకోవాలని ఉన్నా… మీరే చదివి చూడండి సదాశివగారి మాటల్లో.

***

ఇంకా చాలా చెప్పారు సదాశివగారు.

విశ్వనాథవారి పెళుసు మాటా-మంచి మనసు, వేలూరి శివరామశాస్త్రిగారి వద్ద తన ఏకలవ్య శిష్యరికం,  ఎంతోకాలానికి కలుసుకున్న శిష్యుడు ఎమ్మే పాసయ్యాడని తెలిసి డీయీవో ఆఫీసులో వాళ్ళందరి నోళ్ళు తీయ చేసిన తన చిన్నప్పటి లెక్కల మాస్టారు, ఋషులుగా “పేన్”లు(దేవుళ్ళు)లుగా ఆదివాసులచే పిలవబడ్డ ITDA (Integrated Tribal Development Agency) అధికారులు, హేమండార్ఫ్ దంపతులు, కళాశ్రమం రవి శర్మ, కడుపు నిండా అన్నం పెట్టే బడీ ఆంటీ…

 

ఇవన్నీ ఒక ఎత్తు – కాళోజీ సోదరుల సంస్మరణ ఇంకో ఎత్తు. హనుమకొండకు ఎప్పుడు వెళ్ళినా కాళోజీల ఇంటికి తప్పక వెళ్ళేంత సాన్నిహిత్యమూ, ఆదరభావమూ ఉండేవి సదాశివగారికి. ఆ సోదరుల పరస్పరానురాగం, అందరినీ తమవారిగా భావించే ఔన్నత్యం, మంచి ఎక్కడ కనబడ్డా ప్రోత్సహించే తత్వం, వారి సంవేదనాశీలత, దొడ్డదైన వారి “బతుకాస” గురించి ఎంతో ఆర్ద్రంగా ఆత్మీయంగా రాసారు, సదాశివగారు.

***

సదాశివగారి వ్యక్తిత్వం పూలదండలో దారంలా ఉంటుంది – ఈ వ్యాసాల్లో. ఇంత చదివినా, ఇంత తెలిసినా ఎంత నిరాడంబరంగా ఎంత నిగర్వంగా ఉండగలిగారు! తన కష్టాల గురించి రాసుకోవాల్సి వచ్చినప్పుడు – క్లుప్తంగా, నిర్మమత్వంతో, సెల్ఫ్-పిటీకి లోనుగాకుండా రాసుకున్నారు. నొచ్చుకున్న సందర్భాల గురించి నిజాయితీగా రాస్తారు, ఆ వెంటనే తనను నొప్పించిన వారిలో తను చూసిన సుగుణాలను ప్రస్తావిస్తారు. పెద్దల పట్ల గౌరవం. పిన్నల పట్ల వాత్సల్యం. నిండు గోదావరిని స్ఫురింపజేసే హుందాతనం, యాది సదాశివగారిది.

***

సామల సదాశివ గారి ‘యాది” ఇప్పుడు మార్కెట్టులో దొరకడం లేదు. (ప్రచురణ వివరాలు తెలిసిన వాళ్ళు, దయచేసి తెలుపగలరు)

***

కొసరు

1. సదాశివగారిపై హిందూ పత్రికలో వచ్చిన వ్యాసం

2. హంస్ ఇండియా వ్యాసం (ఈ వ్యాసం రాసింది ఎవరో?)

You Might Also Like

4 Comments

  1. Prashanth

    Please send pdf my mail sir

  2. డింగు

    “యాది- జ్ఞాపకాల నిండుకుండ” అని శీర్షిక ఉంటే బాగుండేది. సాధారణంగా పుస్తకం.నెట్ వ్యాసం శీర్షికలో పుస్తకం పేరు ఉంటుంది. ఇలా అన్ని వ్యాసాల్లో ఉంటే “ఖజానా”లో చూసేటప్పుడు పాఠకుడికి సౌలభ్యంగా ఉంటుందని నా ఉద్దేశ్యం.

    1. Srinivas Vuruputuri

      ప్రశాంత్‌గారికి

      బాగున్నారా? హైదరాబాదులోని విశాలాంధ్ర, నవోదయ షాపుల్లో వాకబు చేసినప్పుడు ఈ పుస్తకం దొరకడం లేదని చెప్పారు. “బుక్ ఫెయిర్ సందర్భంలో పునర్ముద్రించవచ్చునేమో” అన్నారు. మరికొన్ని వివరాలు జోడించినందుకు మీకు నా కృతజ్ఞతలు.

      డింగుగారికి

      మీరు చెప్పింది రైటు. శీర్షిక మార్చేస్తాను.

      శ్రీనివాస్

  3. tprashanth

    “namaskaram srinivas garu,Vishalandhra vizag branch lo chusina gurtu.HYD book fair lo kuda chusina gnapakam……….oka mahaneeyudini smaranaki techharu.”jayanthi masapatrika varu sadasiva garipai oka sanchika veluvarincharu,geeturai patrika kuda veluvarincharani vinnanu.”sadasiva smruthi” ani ee madhye oka pustakam veluvadindi.NAVODAYA kachigudalo labhinche avakasalu unnayi.

Leave a Reply