ఆరుద్ర గారి మరో అపురూపమైన నవల ‘ఆనకట్ట మీద హత్య’

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు
********
“మీరు డిటెక్టివు నవలలను ఎందుకు వ్రాస్తారు?” అని అడిగితే చాలా మంది రచయితలు, “కావ్యం యశసేఽర్థకృతే వ్యవహారవిదే శివేతరక్షతయే” అని మమ్మటుడు కావ్యప్రకాశంలో అన్నట్లు కీర్తికోసం, డబ్బుకోసం, వ్యవహారజ్ఞానాన్ని నేర్పేందుకోసం, అమంగళాన్ని పరిహరించేందుకోసం అని సమాధానం చెబుతారని నేను ఊహించగలను కాని, “మీరు డిటెక్టివు నవలలను ఎందుకు చదువుతారు?” అని అడిగితే పాఠకులు ఏమంటారో నాకు తెలియదు. క్షణికోద్రేకంలోనో, స్వలాభంకోసం కుట్ర పన్నో వ్యక్తులు చేసే ఒక్కొక్క హత్య, ఒక్కొక్క నేరం ఎన్నెన్ని జీవితాలలో ఎంతెంత కల్లోలాన్ని చెలరేపుతుందో, నేరస్తులకు ఎన్ని తెలివితేటలున్నా నేరపరిశోధకులు, పోలీసుల కృషి ఫలితంగా న్యాయవ్యవస్థ ఎంత పటిష్ఠంగా శిక్షాస్మృతిని అమలుచేయగలదో, నేరస్తులను నేరాలకు ప్రేరేచిన మనఃస్థితి స్వరూపస్వభావాలు ఎటువంటివో, మన చుట్టూ అలముకొని ఉన్న నేరవాతావరణాన్ని పటాపంచలు చేయటానికి తాముకూడా ఆ పరిశోధకుని తార్కికతను అలవరచుకొని నవలలో చిత్రితమయే సన్నివేశాలను పరిశీలిస్తూ తామే నేరపరిశోధకుల మనుకొని చదువుతారో, క్షణక్షణం మలుపులు తిరుగుతూ ఉక్కిరిబిక్కిరి చేసే కథాకథనవేగంలో లగ్నమనస్కులై ఆ ఉత్తేజంకోసం చదువుతారో నేను చెప్పలేను కాని, మహామహుడు ఎర్ల్ స్టాన్లీ గార్డ్‌నర్,

“Generally speaking people are plagued with problems that they are unable to solve. To escape them they pick up a detective story, become completely absorbed, help bring the investigation to a successful completion, switch off the light and go to sleep”

అన్న మాటలు మాత్రం నాకు నిజమనిపిస్తాయి. ఆ విధంగా కథాంతర్లీనపరిశోధనాంశాలతో తాదాత్మ్యం చెందిన చదువరులపై డిటెక్టివు నవలలలో చిత్రీకృతమయే సామాజికస్వరూపం, మానవసంబంధాలు అపరోక్షంగా నెరపే ప్రభావాన్ని సైతం తక్కువగా అంచనా వేయలేము. ఎర్ల్ స్టాన్లీ గార్డ్‌నర్ నవలలను నా చిన్ననాడు తొలిసారి చదివినప్పుడు అమెరికన్ న్యాయస్థానాలలో జరిగే వాదప్రతివాదాల క్రమపరిణామం, సామాన్యుల హక్కుల పరిరక్షణకోసం అక్కడి వ్యవస్థ రూపొందించుకొన్న పటిష్ఠమైన శిక్షాస్మృతి వివరాలు, మనస్తత్త్వపరిశీలన, పోలీసు అధికారుల అంకితభావం, క్రమశిక్షణ, వార్తాపత్రికల విలేఖరులను ప్రభుత్వయంత్రాంగమూ డిఫెన్సు పక్షమూ తమతమ వాదాలకు అనుకూలంగా ప్రభావితం చేయాలనుకొనే ఎత్తులకు పైయెత్తులు, పత్రికలు ప్రజాప్రయోజనాలకోసం అహమహమికతో వ్యవహరించే తీరు, న్యాయమూర్తులు వ్యాజ్యాలు నిరవధికంగా వాయిదాలు పడే అవకాశం లేకుండా సత్వరం తీర్పును ప్రకటించటానికి చూపే చొరవ నాకెంత ఉత్ప్రేరకంగా ఉండేవో నేనిప్పుడు మాటలలో చెప్పలేను. నేరానికి, నేరపరిశోధనకు; నీతికి, అవినీతికి ఉండే సూక్ష్మవిభాజకరేఖ అంచుల మీద నిల్చుని సత్యసాధనకోసం ఎంతటి సాహసానికైనా వెనుదీయని కథానాయకుడైన న్యాయవాది పెర్రీ మేసన్ పాత్రను ఆదర్శాకృతంగా ఆయన మలిచిన తీరును ఎంత మెచ్చుకొన్నా తక్కువే అనిపిస్తుంది. ఆ కథాకథనంలో గార్డ్‌నర్ ప్రవేశపెట్టిన సన్నివేశాల ప్రభావశీలిత సమ్మోహకంగా ఉంటుంది.

1950ల నాటి ఒక నవలలో పెర్రీ మేసన్ మరునాటి ఉదయం న్యాయస్థానంలో ముద్దాయిగా ఉన్న యువతి పక్షాన చిట్టచివరి రోజు వాదింపవలసి ఉంటుంది. డెట్రాయిట్ నుంచి అతనెంతగానో ఎదురుచూస్తున్న ఒకామె సాయంకాలం ఫోనుచేసి సాక్ష్యం నిమిత్తం స్వయంగా రావాలంటే రాగలనని చెబుతుంది. ఎలా వస్తారు? అని పెర్రీ మేసన్ అడుగుతాడు. విమానాలు కదిలే సూచనలు లేవు; ఉదయాన్నే బయలుదేరి ఛార్టర్డ్ ప్లేనులో రమ్మంటే రాగలను – ఆమెకోసం, మీ కోసం! అని ఆమె అంటుంది. వద్దు, వద్దు, ఇక్కడా మంచు కురుస్తున్నది, పొద్దున్నకు రాలేరు అంటాడు మేసన్. ఏం చెయ్యటం? ఆమె సాక్ష్యం వల్ల కేసు జయమో అపజయమో తేలిపోయే స్థితి. మంచు, వర్షం ముసురు వల్ల ఆమె ఏ మాత్రం కోర్టుకు రాలేని పరిస్థితి. పాల్ డ్రేక్ ద్వారా ఎవరినైనా పంపించినా లాభం లేదు. వాళ్ళూ సమయానికి రాలేరు. కచ్చితంగా ఆమె సాక్ష్యం తనకు కావాలి. మీరు అఫిడవిట్ తయారుచేసి వెంటనే ఆర్డినరీ పోస్టులో నాకు వెయ్యండి. తెల్లవారు జామున అందుతుంది. తప్పే అవకాశం ఉండదు – అంటాడు మేసన్.

జీవనమరణసంశయావస్థలోనూ తమ వ్యవస్థ అంటే ఎంత తిరుగులేని నమ్మకం ఆ దేశపౌరులకు! పోస్టల్ వ్యవస్థ విశ్వసనీయతకు ఇంతకంటె అమెరికాకు ఇంకేం ప్రచారసాధనం కావాలి! మనదేశంలో ముఖ్యమైన డాక్యుమెంట్లను స్పీడుపోస్టు చేయాలన్నా, అధికమూల్యం చెల్లించి కొరియర్ చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచించే మనము ఆ మాటను ఎప్పటికన్నా అనగలుగుతామా? అనిపించింది – చదువుతున్నప్పుడు. ఆ సమాజాభ్యున్నతిపై గౌరవం కలిగింది.

డిటెక్టివు నవల అని చులకనగా అనుకొంటాము గాని, దాని ప్రభావశీలిత అంత బలవత్తరం.

తెలుగులో విల్కీ కోలిన్‌స్, ఆర్థర్ కానన్ డాయల్, డాషియల్ హామెట్, అగాథా క్రిస్టీ, డొరోతీ ఎల్ సాయర్స్, మార్గరే ఆలింఘామ్, ఎర్ల్ స్టాన్లీ గార్డ్‌నర్ వంటి మేధావి రచయితల విజ్ఞాన వినోదాలను మేళవించిన గొప్ప అపరాధ పరిశోధక నవలలు లేకపోవచ్చును గాని అప్పుడప్పుడే అక్షరాస్యత ఫలితంగా కనువిప్పు కలిగి ఆధునికసమాజంలో వస్తున్న మార్పులను తెలుసుకోవటానికి పుస్తకపఠనాన్ని అలవరచుకొంటున్న సరిక్రొత్త తరం యువతీయౌవన పాఠకలోకానికి వారి పరిభాషలో కథ చెప్పటానికి కలం పట్టిన కొవ్వలి, టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు, ఆరుద్ర, కనకమేడల వంటి రచయితల సేవాహేవాకం తక్కువేమీ కాదు. అందులోనూ స్వయంగా ఆధునికతా దృష్టి కలిగిన మహాకవి, మంచి పండితుడు, పరిశోధకుడు అయిన ఆరుద్ర వంటి మేటి రచయితను ఆహ్లాదోల్లసనాల ఈ నవ్యప్రక్రియ ఆకర్షించి ఉండటంలో వింతేముంటుంది?

0413 ఆరుద్ర గారి మరో అపురూపమైన నవల ‘ఆనకట్ట మీద హత్య’ 1956 మే నెలలో వెలువడింది. ఎం.వి.యస్. పబ్లికేషన్స్ వారు తమ సొంత ముద్రణాలయంలో ముద్రించారు. ఆ రోజుల్లో కాకతాళీయంగా జరిగిన ఒక వింత: ఎం.వి.యస్. వాళ్ళు ఎం.వి.యస్. ప్రెస్సును, ఎం.వి.యస్. పబ్లికేషన్స్ సంస్థను ప్రారంభించారు. అదే రోజుల్లో విఖ్యాత కథకులు శ్రీ ధనికొండ హనుమంతరావు గారు క్రాంతి పబ్లికేషన్స్ సంస్థను, క్రాంతి ప్రెస్సును మొదలుపెట్టారు. ఇద్దరికీ పని ఒత్తిడి ఎక్కువై ఎం.వి.యస్. వాళ్ళు ప్రచురణాలయం అమ్మివేసి, పబ్లికేషన్స్ అట్టేపెట్టుకొన్నారు. హనుమంతరావు గారు పబ్లికేషన్స్ వదిలించుకొని, ప్రెస్సును కొనసాగించారు. డిటెక్టివు నవలలకు గల అనూహ్యమైన ఆదరణ వల్ల ఎం.వి.యస్. వాళ్ళు క్షణాలలో కోట్లకు పడగలెత్తారట. చలనచిత్రాలలో నిర్మాత తన కథను తీసుకొని తన పేరును వెయ్యలేదని, తన కథను తీసుకొని తనకు పైకాన్ని చెల్లించక మోసం చేశాడని రచయితలు కోర్టుకెక్కుతున్నట్లే, ఆ రోజుల్లో డిటెక్టివు కథను పబ్లిషరుకు తను ముందు చెప్పి, రచన మొదలుపెట్టానని, ఆ నవలను ప్రకటించే హక్కు తనకు తప్ప ఆ వేరే రచయితకు లేదని, ఆ వేరే రచయిత తన పుస్తకంలో వ్రాసుకొన్న మాటలన్నీ అబద్ధాలని – ప్రసిద్ధులైన వ్యక్తులు వివాదపడి ఆ హెచ్చరికలను, వివాదచరిత్రను తమతమ నవలలలో పీఠికలు గానూ, ప్రకటనలుగానూ ప్రచురించటాన్ని ఈ రోజు చదువుతుంటే – వాటికి గల ఆశ్చర్యకరమైన ప్రచారప్రభావాలు, ఆ గొడవలకు మూలకారణమైన ఆర్థికవిజయం మనకెంతో ముచ్చటగా ఉంటుంది. ఎం.వి.యస్. వాళ్ళకు పుస్తకాలను వ్రాసిన చాలా మంది రచయితలు స్వయంగా ముద్రాపకులు, పంపిణీదారులు కావటానికి కారణం అదేనని మనము సులభంగానే ఊహింపవచ్చును. ఆరుద్ర గారు పంపిణీరంగంలో అడుగుపెట్టడానికి ప్రాతిపదికగా అమరిన అనువైన కాలం ఈ నవలల ఆర్థికవిజయమే.

రేమండ్ షాన్డ్లర్ గొప్ప డిటెక్టివు నవల నిర్మాణానికి చెప్పిన పది అంతఃసూత్రాలివి: నేరం జరిగేందుకు బలమైన కారణం, వ్యక్తుల మధ్య సంఘర్షణ కథలో సమర్థంగా చిత్రింపబడాలి. నేరం ఎంత పకడ్బందీగా జరిగిందో, నేరపరిశోధన కూడా అంతే ప్రణాళికాబద్ధంగా ఉండాలి. కథంతా కాల్పనికజగత్తులో అవాస్తవికం అనిపించేట్లుగా కాక, నిజజీవితంలో కళ్ళముందు జరుగుతున్నంత స్వభావసిద్ధంగా, సహజపరిణామాలతో సాగాలి. నేరం జరిగిన తీరు, నేరపరిశోధన తీరు చదివే పాఠకుడికి ఒక కొత్త విషయాన్ని నేర్చుకొన్న సంతృప్తిని మిగల్చాలి. పరిశోధకుడు కథాంతంలో జరిగిన ఉదంతాన్ని వివరించేటప్పుడు అంతా అసంభావ్యంగా కాక పాఠకునికి ఆ పరిష్కారంలో తనకూ భాగస్వామ్యం ఉన్నదనిపించాలి. నేరపరిశోధనలో ప్రావీణ్యాన్ని పొందదలచిన పాఠకుని పరిజ్ఞానం, విజ్ఞానసంపద పెరిగేందుకు ఆవశ్యకమైన నైపథ్యానుసంజన అవసరం. కథ ముగింపు, నేరస్తుని నిర్ణయం తర్కసంగతి మూలకంగా సిద్ధించి, దీనికి మరో విధమైన పరిష్కారం కూడా సాధ్యమే అన్న విమర్శకు తావుండకూడదు. ఒకదాని తర్వాత ఒకటిగా పరస్పరసంబంధం లేకుండా జరిగిన పెక్కు నేరాలకు వేర్వేరు కారణాలు, వేర్వేరు నేరస్తులు ఉండటం వల్ల కథలో ఏకసూత్రతను పాటించే వీలుండదు. నేరానికి శిక్ష, కథకు ముగింపు అన్నవి లేకుండా రచన అపరిష్కృతాంశాలతో మిగిలిపోకూడదు. కథంతా కళ్ళముందు జరుగుతున్నట్లే క్రమానుప్రాప్తసంగతుల ప్రత్యక్షీకరణకౌశలంతో నిర్వహింపబడాలి.

దీనికి తోడు ఎచ్.ఆర్.ఎఫ్.కీటింగ్ Whodunit? లోని పాత్ర రోనాల్డ్ నాక్స్ అన్నట్లు, కథాంతంలో పట్టుబడే నేరస్తుని పరిచయం కొంత పాఠకుడికి ముందునుంచి కలుగుతుంటే మరీ మంచిది. నేరం, దాని పరిష్కారం మానవాతీతశక్తులకు వదిలివేయటం సమాజం తిర్యగ్గమనానికి దారితీస్తుంది కనుక అటువంటి ఘట్టాలు కథనక్రమంలో ఉండకూడదు. నేరానికి పరిష్కారం పరిశోధకుని తెలివితేటల మూలాన గాక యదృచ్ఛాఘటితంగా జరిగినట్లు చిత్రింపబడకూడదు. లోకంలో లేని కనీ వినీ యెరుగని వస్తువులు నేరం జరగటానికి, తత్పరిష్కారానికి వినియుక్తాలు కాకూడదు. కథలో పాఠకుడికి పరిచయం లేని వస్తుజాతం నేరపరిష్కారానికి నిమిత్తం కాకూడదు. కథలో ముందుగా చెప్పకుండా కవలపిల్లలను, వేషధారులను పాత్రలుగా ప్రవేశపెట్టి అయిందనిపించటం శిల్పసంవిధానానికి అసహజంగా ఉంటుంది.

ఇదంతా ఆరుద్ర గారికి ప్రాగ్విహితం కాకపోయినా, ఇన్ని దత్తపదులను పాటిస్తూ నిషేధాక్షరులను అతిగమించి ఆయన గొప్ప కవి గనుక జాజిపువ్వుల పొట్లాన్ని విప్పగానే పరిమళం పదిదిక్కుల గుప్పుమనేట్లు కథను ఎలా విడమరచి చెబుతారో చూద్దామని నాకెంతో కుతూహలాస్పదంగా ఉండింది, ఈ నవలను అక్షరాక్షరం చదివేటప్పుడు.

‘ఆనకట్ట మీద హత్య’ ప్రథమ ముద్రణ 1956 మే నెలలో జరిగింది. దీని తర్వాత 1957 ఫిబ్రవరిలో ‘అహింసారౌడీ’, సెప్టెంబరులో ‘ఆడదాని భార్య’ వెలువడ్డాయి. 1955లో ‘పలకల వెండిగ్లాసు’ ముద్రణ జరిగిందని ప్రముఖ కథారచయిత, ఆరుద్ర గారి సాహిత్యాన్ని అధికరించి విశేషాభిమానంతో సాధికారమైన కృషిచేసిన డా. చిఱ్ఱావూరి శ్యామ్ (మెడికో శ్యామ్) గారి జ్ఞాపకం. పుస్తకం.నెట్ లో ప్రకాశితమైన ‘ఆడదాని భార్య’ సమీక్షను చదివి, వారప్పుడు తమ లేఖలో తెలియజేసిన ‘దెయ్యాలకొంప’ నవలను కూడా దయతో నాకు పంపించారు. ఇది ‘పలకల వెండిగ్లాసు’కు అనంతరీయరచన. ‘దెయ్యాలకొంప’ నవల వెనుక అట్టమీద కొమ్మూరి సాంబశివరావు గారి ‘ఉరితాడు’ ప్రకటన ఉండటం వల్ల 1958లో ‘ఆధునిక గ్రంథమాల’ ప్రచురణగా సాంబశివరావు గారు దానిని విడుదలచేయటానికి మునుపు బహుశః ఆరుద్ర గారి పంపిణీలో ఒక సంయుక్తముద్రణ వచ్చి ఉండాలి. ఆ ప్రకారం ‘పలకల వెండిగ్లాసు’, ‘దెయ్యాలకొంప’, ‘ఆనకట్ట మీద హత్య’, ‘అహింసారౌడీ’, ‘ఆడదాని భార్య’, ‘త్రిశూలం’, ‘కొండచిలువ’, ‘అణాకో బేడ స్టాంపు’ ఆరుద్ర రచించిన డిటెక్టివు నవలల క్రమం. ‘రెండు రెళ్ళు ఆరు’ నవలలో విషప్రయోగం జరిగి ఇన్స్‌పెక్టర్ వేణు మరణం సంభవించినట్లు చిత్రింపబడటం వల్ల అదే ఆయన పార్యంతికకృతి అని; అక్కడితో ఆయనకు డిటెక్టివు నవలానురక్తి ముగిసి వ్యాసంగం ఇతరప్రక్రియలకు మళ్ళిందని ఊహింపవచ్చును.

ఇన్స్‌పెక్టర్ వేణు, భార్య రుక్కు, చంద్రం, వామనరావు మొదలైన ఆరుద్ర గారి నవలలలోని పాత్రలతోనూ, టూటౌను పోలీసు స్టేషను, ఎర్రగుర్రం వంటి సుపరిచితకల్పనలతోనూ తుల్యసంవిధానంతో రచితమై ‘కె. హన్ను’ అన్న రచయిత పేరుతో వెలువడిన ‘డైమండ్ రింగ్’ కూడా ఆరుద్ర గారిదే అని భావిస్తే అవి మొత్తం పది అపరాధ పరిశోధకనవలలు అవుతాయి.

ఆ కాలంలో ఆరుద్ర గారు ఏమేమి కలం పేర్లతో ఇంకా ఏయే రచనలు చేశారో భావిపరిశోధకులు జాగ్రత్తగా పరిశీలించి తేల్చిచెప్పవలసిన అంశం. ఇంతవఱకు వారి కృతులను అధికరించి విశ్వవిద్యాలయాలలో జరిగిన కృషిలో ఆ పని జరగలేదు.

ఈ నవలాకృతులు కాక ‘పందిట్లో పెళ్ళవుతుంది’, ‘జ్వాలాముఖి’, ‘ఎర్రని ఆకుపచ్చ సైకిల్’, ‘నేరం ఎందుకొప్పుకొన్నాడు’, ‘సరియైన పరిష్కారం’, ‘వారిజాక్షులందు …’, ‘చెలియా కనరావా’ అన్నవాటితోపాటు వై.వి. రావు గారి ‘డిటెక్టివు’ పత్రికలో వెలువడిన ‘ఇంద్రధనుస్సు రంగుల చీర’ కథతో కలుపుకొని ఆరుద్ర రచించినవి ఎనిమిది డిటెక్టివు కథలు. వీటిని సంపుటీకరించి పునఃప్రకటించాలి. తెలుగు అపరాధపరిశోధక సాహిత్యాన్ని గురించి ఆయన ‘సమగ్రాంధ్రసాహిత్యం’లోనూ; ‘డిటెక్టివు’, ‘ఆంధ్రప్రభ’ పత్రికలలో గచ్ఛద్వ్యాఖ్యగానూ ప్రకటించిన వ్యాసాలలోని సారాంశాన్ని సమన్వయింపవలసిన ఆవశ్యకత కూడా ఉన్నది.

‘ఆనకట్ట మీద హత్య’ ఆరుద్ర గారి ‘సాహిత్యిక నవల’ అని చెప్పవచ్చును. ఆ సంగతిని తర్వాత వివరిస్తాను. సినిమాటోగ్రఫీ రంగంలో విశేషకృషి చేసిన కమల్ ఘోష్ గారికి ఇది వారిద్దరి వర్ధిష్ణుమైత్రీచిహ్నంగా అంకితమైంది.

లాయరు వాసు దగ్గరికి మాణిక్యాలరావు అనే క్లయంటు తన భార్యమీద అయిదు రూపాయల ఆరణాలు దొంగతనం చేసి పక్కింటి మాధవరావుకు ఇచ్చిందని కేసు పెట్టాలని వస్తాడు. భార్యను అదుపులో పెట్టుకోలేక ఇటువంటి కేసు పెడితే న్యాయస్థానంలో వీగిపోతుందని అన్నందుకు వాసుమీది కోపంతో వెళ్ళిపోతాడు. వాసు మేనకోడలు వసంత విషయమంతా అడిగి కేసు భావ్యాభావ్యాలను తెలుసుకొంటుంది.

మూడు రోజులయ్యాక మాణిక్యాలరావు వాసుకు ఫోనుచేసి భార్య మళ్ళీ సిగరెట్ కేసును కొట్టెయ్యబోయిందని, రిస్టువాచీని చోరీచేసి మాధవరావుకు ఇచ్చినందుకు పోలీసు స్టేషన్లో రిపోర్టిస్తే వాళ్ళిద్దరిని అరెస్టుచేసి జామీనుమీద విడుదల చేశారని, తను వెంటనే రాదారి లాంచీలో గాక కారులో బయలుదేరి గంటలో వస్తానని చెబుతాడు. మాణిక్యాలరావుకు ఇద్దరు భార్యలున్నారని తెలుస్తుంది. కొంతసేపటికి అతను మళ్ళీ ఫోనుచేసి వాచీ రిపేరు దుకాణానికి వెళ్ళి మాధవరావు వాడికిచ్చిన తన వాచీని బలవంతగా లాక్కోబోతే తనను పోలీసులు అరెస్టుచేశారని, లాయరే వచ్చి విడిపించాలని అడుగుతాడు. ఆ రోజు వసంత పుట్టినరోజు. సినిమాకు తీసుకెళ్తానని మాటయిచ్చి, వాసు ఆమెను కారులో వెంటబెట్టుకొని ఆనకట్ట మీదుగా వెళ్తాడు. జరిగిన సంభాషణను బట్టి వాచీ షాపువాడికి ‘లా’ పరిజ్ఞానం ఉన్నదని వాసు ఆలోచిస్తుంటాడు. ఆనకట్ట అవతల పొదల్లో వారికి సన్నిహితంగా ఉన్న ఒక జంట లీలగా కనబడుతుంది. రాజుపాలెం పోలీసు స్టేషనుకు వెళ్ళాక మాణిక్యాలరావు అక్కడ అరెస్టు కాలేదని, గొల్లపేట స్టేషనులో ఉన్నాడేమో చూడమని సబ్ ఇన్స్‌పెక్టర్ అంటాడు. రిపేరు షాపు మధుసూదనరావుతో ఘర్షణ పడినందుకు అరెస్టు చేశామని అక్కడి పోలీసు, హెడ్డు చెబుతారు. అరెస్టు చెల్లదన్న వాసు వాదనకు ఫలితం లేక వెనుదిరుగుతాడు. తనను విడిపింపలేకపోయినందుకు మాణిక్యాలరావు నిష్ఠూరాలాడుతాడు. ఇంతలో వాసు స్నేహితుడు సబ్ ఇన్స్‌పెక్టర్ సత్యం వస్తాడు. వాచీ మధుసూదనరావు షాపుకు వెళ్ళిన సంగతి మాణిక్యాలరావుకు తన అన్నయ్య ద్వారా తెలిసిందని కొత్త విషయం బయటపడుతుంది.

వాసు, వసంత సినిమాకని బయలుదేరి ఆనకట్ట దగ్గరికి వస్తారు. ఇరుకుదారి కావటం మూలాన ఒకసారికి ఎటునుంచైనా ఒక్క వాహనం వెళ్ళేందుకే అనుమతి ఇస్తారు. అందువల్ల వారు వేచి ఉండవలసివస్తుంది. అక్కడ వారికి మాధవరావు కనిపించి, మాణిక్యాలరావు తనపై వివాహితుల వ్యభిచారం ఆరోపణతో ఐపిసి 497 కింద కేసు పెట్టాలని చూస్తున్నాడని, నిజానికి తానే 494 పెట్టవచ్చునని, లాయరు కేసునుంచి తప్పుకోవటం మంచిదని అంటాడు. అతను మాట్లాడుతుండగా వెనుక చెట్టుచాటున ఒక యువతి దాక్కొని ఉన్నదని, ఆమె మాణిక్యాలరావు భార్య కావచ్చునని వసంత అంటుంది. ఇద్దరి బట్టలమీద బురద మరకలున్నాయని గుర్తుచేసుకొంటారు.

మాణిక్యాలరావు వాసు ఇంటికి ఫోనుచేసి, అతనెంత విసుక్కొన్నా, తను వెంటనే బయలుదేరి ఎనిమిదింటికల్లా వస్తున్నానని, వచ్చి అన్నీ వివరిస్తానని అంటాడు. అతను తొమ్మిదైనా రాకపోయేసరికి వాసు గొల్లపేటకు ఫోనుచేసి పోలీసు స్టేషను నుంచి అతను తనయింటికే బయలుదేరాడని తెలుసుకొంటాడు. ఆనకట్టకు ఫోనుచేస్తే ఎనిమిది గంటలకే అతని కారు వచ్చిందని తెలుస్తుంది. బట్టతలవాడు అంటే మాణిక్యాలరావే.

వాసు, వసంత సినిమాకి వెళ్తారు. తాము ఆనకట్ట దాటిన వెంటనే పొదలలో చూసిన ఆకృతులు మాధవరావు, మాణిక్యాలరావు భార్య కావచ్చునని వాసుకు అనిపిస్తుంది. సినిమా హాలునుంచి వాసు ఆనకట్ట ఇవతలివైపుకు ఫోనుచేసి ఆ సమయంలో ఒక ముప్ఫైయేళ్ళ ఉంగరాల జుట్టు అతను కారులో ఉన్నాడని తెలుసుకొంటాడు. అటునుంచి మాణిక్యాలరావు బయలుదేరి ఇటువైపుకు మాధవరావు చేరాడన్నమాట. అంతే గాక కేసులో ప్రతివాడికీ అంతో ఇంతో ‘లా’ పాయింట్లు తెలుసునని కూడా వాసు గుర్తిస్తాడు.

సినిమా నుంచి ఇంటికి తిరిగివెళ్తుండగా వారికి ఒక ఇంటిముందు మాణిక్యాలరావు కారు కనిపిస్తుంది. నిర్జనగృహంలో ఒక ఆడదాని శవం ఉంటుంది. ఆ ఇంట్లో ఒక నలభైయేళ్ళ స్త్రీ, ఒక ఇరవైయేళ్ళ యువకుడు ఉండేవాళ్ళని పోలీసులు వచ్చి వాకబుచేస్తారు. వాసు, వసంత ఆనకట్ట దగ్గరికి వెళ్ళి లాంచీ మీద కారెక్కి, పొదల దగ్గరికి వెళ్తారు. ఇన్స్‌పెక్టర్ కుమార్ వారిని వెంబడిస్తాడు. రాజుపాలెంలో మాణిక్యాలరావు అన్నను కలుసుకొంటాడు. వాళ్ళది స్వర్ణకోట. అక్కడ మాణిక్యాలరావు మూడేళ్ళ క్రితం అనుమానం కొద్దీ మొదటి భార్య ప్రమీలను వదిలేసి ఇక్కడికి వచ్చి సుశీలను చేసుకొన్నాడని, మొదటి భార్య తనను పట్టిస్తుందన్న కోపంతో చంపుతానని వెళ్ళాడని తెలుస్తుంది. మాధవరావును గురించిన తమ్ముడి అనుమానాలు తను చూసి చెప్పినవే అని అతనంటాడు. ఆపైని ప్రశ్నలకు జవాబులు చెప్పడు. వాసు ఇన్స్‌పెక్టర్ సత్యాన్ని స్వర్ణకోటలో అపరిష్కృతంగా ఉన్న కేసుల వివరాలు తెలుసుకోమని చెప్పి, సుశీల ఇంటికి వెళ్తాడు. ఆనకట్ట దగ్గర లంకలో తాము చూసినది ఆమెనే అని గ్రహిస్తాడు. మాధవరావు డాబామీద నిద్రపోతున్నాడని ఆమె అంటుంది. అక్కడ అతనుండడు. మాణిక్యాలరావు అన్న మల్లయ్య సొంత అన్న కాడని సుశీల చెబుతుంది. పెళ్ళయిన కొత్తలో భర్త వంద తులాల బంగారం పెట్టి, లేనిపోని అనుమానం పెరిగాక పదిహేను రోజుల మునుపు తీసేసుకొన్నాడని చెబుతుంది. మాణిక్యాలరావు ఇంటిలో ఎవరో మాట్లాడుకొంటూ ఉండటం వాసు చూస్తాడు.

స్వర్ణకోటలో మూడేళ్ళ క్రితం బంగారం చోరీలు భారీగానే జరిగాయని సత్యం వివరాలను సేకరిస్తాడు. వాసు, వసంత సత్యాన్ని, లంక పోలీసు ఇన్స్‌పెక్టర్ సులేమానును వెంట తీసుకొని ఆనకట్ట దగ్గరికి వెళ్తారు. అక్కడ ఒక లోతుగా తవ్విన కుప్ప వారను మాణిక్యాలరావు శవం, ప్రక్కనే ‘ఎం’ అన్న అక్షరంతో రుమాలు ఉంటాయి. అక్కడ పడివున్న ఎర్ర గాజుముక్క సుశీల చేతికి ఉన్నదని వసంత గుర్తుపడుతుంది. వాసు వద్దన్నా వినక పోలీసులు సుశీలను, మాధవరావును అరెస్టు చేస్తారు. వాసు స్టేషన్లో వాళ్ళతో విడివిడిగా మాట్లాడి, వాళ్ళు హంతకులు కారని గ్రహిస్తాడు. వాస్తవాన్ని గ్రహించేందుకు వాచీ షాపు మధుసూదనం దగ్గరికి వెళ్తాడు. అక్కడి నుంచి మల్లయ్య ఇంటికి వెళ్ళి ముగ్గురు మనుషులు ‘లా’ గురించి మాట్లాడుకొంటుండటం చూస్తాడు. వాసు ప్రశ్నలకు మల్లయ్య జవాబులు చెప్పలేక నీళ్ళు నములుతాడు. మాణిక్యాలరావు స్వర్ణకోటలో బంగారం దొంగతనం చేశాడని, ఆ సమయంలో అడ్వొకేటు వద్ద క్లార్కుగా పనిచేస్తుండిన తను జైలులో ఉన్నానని చెబుతాడు. వాసు రాజుపాలెం పోలీసు స్టేషనుకు వెళ్ళి తన రిస్టువాచీనీ మల్లయ్య అపహరించాడని, అరెస్టు చెయ్యమని హెడ్డుకు పురమాయించి, గొల్లపేట స్టేషనుకు వెళ్ళి తన రిస్టువాచీ పోయిందని, మధుసూదనం దొంగ అని, అరెస్టు చేయించమని ఫిర్యాదు చేస్తాడు. ప్రమీల శవం దొరికిన ఇంటిలో ఉండినది ఆమె అక్క కొడుకు రైల్వే ఉద్యోగి మోహనరావు అని వసంత సమాచారం సేకరిస్తుంది. తను సుశీలతో మాట్లాడుతున్నపుడు డాబా మీదినుంచి మాయమై మాధవరావు పక్కింటి మల్లయ్య దగ్గరికి వెళ్ళి ఉండవచ్చునని వాసు అనుమానిస్తాడు. మాధవరావు, సుశీల లంకకు వెళ్ళి ఇంటికి తిరిగివచ్చాక మాధవరావు మళ్ళీ లంకకు వెళ్ళాడని లాంచీ తండేలు ద్వారా వాసు వివరాలు సేకరిస్తాడు. రుమాలు మాణిక్యాలరావుదే అని చాకలి గుర్తును బట్టి నిర్ధారిస్తాడు. ప్రమీల హత్య జరిగిన రోజు మల్లయ్య ఇంటిలో లేడని వాసు సాక్ష్యాన్ని సేకరిస్తాడు.

చివరికి పోలీసులకు జరిగిన కథను వాసు వివరిస్తాడు. మధుసూదనం, మల్లయ్య, మాణిక్యాలరావు ఒక ముఠా అని, వాళ్ళు స్వర్ణకోటలో చేసిన నేరాల సంగతి తెలుసుకొన్నదని మధుసూదనం ఆనకట్ట అవతలి ఒడ్డుకి వెళ్ళి ప్రమీలను హత్య చేశాడని, మల్లయ్య మధుసూదనరావులే మాణిక్యాలరావును వదిలించుకొన్నారని, పాతు విషయం విని ఆ నగలకోసం మాధవరావు ప్రయత్నించి ఉండవచ్చును కాని అతనికి హత్యలతో సంబంధం లేదని వివరిస్తాడు. వాచీ దొంగతనం అభియోగం మీద మల్లయ్య, మధుసూదనం లాకప్పులో ఉన్నారని తెలిసి పోలీసులు ఊపిరి పీల్చుకొంటారు. మాణిక్యాలరావు హత్య జరిగేందుకు బలమైన కారణం ముఠాలోని తక్కిన ఇద్దరి దురాశేనని వెల్లడవుతుంది. వారి మధ్య సంఘర్షణ కథలో చిత్రింపబడకపోయినా, చిత్రితపరిణామాలను బట్టి అనూహ్యమేమీ కాదు. నేరం ఎంత పకడ్బందీగా జరిగిందో, నేరపరిశోధన కూడా అంతే ప్రణాళికాబద్ధంగా ఉన్నదని పాఠకులకు నమ్మకం కలుగుతుంది. కథంతా కాల్పనికజగత్తులో అవాస్తవికం అనిపించేట్లుగా కాక, నిజజీవితంలో కళ్ళముందు జరుగుతున్నంత స్వభావసిద్ధంగా, సహజపరిణామాలతో సాగుతుంది. కథాంతంలో వాసు నేరం పరిష్కరించిన కీర్తిని పోలీసులకే దక్కేట్లు చేస్తాడు.

నవలారచనలోని కథనవేగం, రౌచికత మెచ్చదగినవి. ఇంతా చేసి ఆరేడు రోజుల వ్యవధిలో జరిగిన ఘటనాక్రమం ఊపిరి సలుపనీయని శీఘ్రగతితో సాగిపోవటం ప్రశంసనీయం. కల్పనలోని సంభావనీయత, కథావాతావరణంలోని తెలుగుదనం ఆకట్టుకొంటాయి.

కథలో ఎక్కడ చూసినా కథకునికంటె కవి ఆరుద్ర విశ్వరూపం మనకు కనబడుతుంటుంది. వాక్యాలన్నీ కవితాబంధురంగా పాఠకులను అలరిస్తాయి. రెండవ సన్నివేశంలో వాసు, వసంత కౌగిలించికొన్నపుడు ఇద్దరి గుండెలూ గోదావరిమీద కలకత్తా మెయిలు లాగ ధ్వనించుతూ కొట్టుకొన్నాయన్న వర్ణనలో ఆ తర్వాత 1960లో ‘ఉయ్యాల జంపాల’కు ఆరుద్ర రచించిన “కొండగాలి తిరిగింది, గుండె ఊసులాడింది, గోదావరి వరదలాగ, కోరిక చెలరేగింది” అన్న అజరామరమైన మధురగీతికకు తొలిరూపం వినిపిస్తుంది. రిస్టువాచీకి రెండు కేసులతో సంబంధం ఉండి ఉంటుందని చెప్పటానికి వాసు సత్యంతో కన్యాశుల్కంలో బైరాగి పాత్ర ఒకే సమయంలో రెండుచోట్ల ఉండినప్పటి సంభాషణను గుర్తుచేస్తాడు. మల్లయ్య “నేరం గల ప్రవేశమవుతుంది” అని వాసుతో అన్నప్పుడు గిరీశం అగ్నిహోత్రావధాన్లుతో అన్న మాట జ్ఞాపకానికి రాక మానదు. మాణిక్యాలరావు తనను నిష్ఠూరాలాడినప్పుడు వాసు “చంపదగినయట్టి శత్రువు తనచేత, చిక్కెనేని కీడు చేయరాదు, పొసగ మేలు చేసి పొమ్మనుటయె చాలు, విశ్వదాభిరామ వినుర వేమ” అనుకొంటాడు. ఒక డిటెక్టివు నవలలో ఇంత సాహిత్యసమాచారం నిండి ఉండటం ఆశ్చర్యాస్పదమే.

“ఆనకట్ట మీద హత్య’ నవలలో శృంగారచిత్రణ కొంత అతివేలంగా ఉన్నది. ఎంత మేనరికం ఉన్నప్పటికీ వాసు, వసంతల వివాహాత్పూర్వబంధంలోని భౌతికత విశృంఖలంగానే కనబడుతుంది. వారి ప్రేమలోని భావబంధం అంత దైహికం కావటానికి నైపథ్యమేదీ కథాముఖంగా ఆవిష్కృతం కాలేదు. అదే కాలంలో వెలువడిన కొమ్మూరి సాంబశివరావు గారి సాంఘికనవలలు ‘మంజరి’, ‘నువ్వే కావాలి’ మొదలైనవాటిలో శృంగారమే ఇతివృత్తం అయినప్పటికీ అది మనోనేత్రానికి గోచరించే చిత్రీకరణమే కాని, ప్రత్యక్షీకరణను కోరదు. ఆరుద్ర గారు దానిని దృశ్యగోచరం చేయాలనుకోవటం వల్ల కథ వారిద్దరి చుట్టూ తిరుగుతూ సన్నివేశాలలోకి మనను కుతూహలంతో నడిపించే విషయాన్ని మాత్రం కాదనలేము. వాసు, వసంతల ప్రేమకు మాధవరావు, సుశీలల ప్రేమకు తులనీయత ఎక్కడా ప్రస్తావనకు రాకపోవటం కూడా కథనకౌశలంలో రచయిత సాధించిన పరిణతికి, ఔదాత్యానికి చిహ్నపతాకగా అమరింది.

సంస్కృతసమాసగతం అయినప్పుడు ‘హన్’ ధాతువుతో హననార్థంలో గోహత్య, బ్రహ్మహత్య, భ్రూణహత్య వంటి పదబంధాలు ఏర్పడుతాయి. అంతే కాని ‘హత్య’ అనే పదం విడిగా నిఘంటువులలో ఉన్నప్పటికీ పూర్వకవుల ప్రయోగాలలో వ్యస్తంగా కనబడదు. అది ఆధునికకాలంలో తెలుగువాళ్ళు మాత్రమే వాడుకలోకి తెచ్చిన రూపం. ఆరుద్ర గారు దానిని శీర్షికలోకి ప్రవేశపెట్టడం కాలప్రభావమే.

ఆరుద్ర గారి మరో అవిస్మరణీయమైన రచన అజ్ఞేయమైన విస్మృతిపథంలో అంతర్హితం కాకమునుపే పునర్ముద్రణకు నోచుకోగలిగితే సాహిత్యాభిమానులకు స్మరణోత్సవం కాగలుగుతుంది.

You Might Also Like

7 Comments

  1. nareskkumar tankala

    తెలుగులో మొదటి అపరాధ పరిశోధన నవల

  2. శాంతాదేవి

    మురళీధర రావు గారూ,
    మీకు జోహార్లు.ఆరుద్ర గారు డిటెక్టివు నవలలు వ్రాసినట్లే నేను వినలేదు. మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది. మిగతావి కూడా చదువుతాను. తెలుగులో మంచి డిటెక్టివ్ సాహిత్యం లేదని నేను అనుకునే దాన్ని. ఈ పుటకాలు మనకి నెట్ లో దొరుకుతాయా?

  3. SIVRAMAPRASAD KAPPAGANTU

    జి కె చెస్టర్టన్ నవలలు అనేకం ఇంటర్నెట్లో దొరుకుతున్నయి. గూటెన్‌బర్గ్ ప్రాజెక్ట్‌లో భాగంగా, ఆయన పుస్తకాలు రకరకాల ఫార్మాట్లల్లోకి మార్చి వారి వెబ్సైటులో ఉంచారు. ఈ కింది లింకు నొక్కి ఆ పుస్తకాలు చూడవచ్చు:

    http://www.gutenberg.org/ebooks/search/?query=Chesterton

    మనకు తెలుగులో కూడా గూటెన్‌బర్గ్ ప్రాజెక్ట్‌ వంటి సంస్థ ఒకటి ఏర్పడి (ఆ సంస్థ ఔత్సాహికులైన సాహితీ ప్రేమికులు కలిసి ఏర్పదినదే) మన తెలుగులో మరుగునపడిపోయిన పుస్తకాలను, నవలలను, కథా సంపుటులను, పత్రికలను స్కాన్ చేసి మళ్ళి అందరికీ అందుబాటులోకి తీసుకురాగలిగితే చాలా బాగుంటుంది.

    అదే గూటెన్‌బర్గ్ ప్రాజెక్ట్‌లో ఉన్న ఏకైక తెలుగు రచయిత శ్రీ మహీధర రాంమోహనరావుగారు. ఆయన వ్రాసిన 5 నవలలు, ఆ వెబ్ సైటులో ఉంచారు. ఈ కింది లింకు నొక్కి చూడవచ్చు.

    http://www.gutenberg.org/ebooks/search/?query=mahidhara

    అదే వెబ్ సైటులోకి పాత పుస్తకాలు సాఫ్ట్ కాపీగా చేసి వారికి పంపితె (ఆ పుస్తకం గురించి, రచయిత గురించి వివరణతో) వారు ఆ వెబ్సైటులో ఉంచుతారనుకుంటాను

  4. ఏల్చూరి మురళీధరరావు

    మెహర్ గారికి నమస్కారములు!
    అపరాధ పరిశోధక నవలానిర్మితికి, అధ్యయనకు ఉపకరించే మంచి వ్యాసాన్ని సూచించినందుకు మీకు ధన్యవాదాలు! నాకెన్నో కొత్త సంగతులు తెలిశాయి.

    నిడుదవోలు మాలతి గారికి నమస్కృతులతో,
    వ్యాసాన్ని ఆసాంతం చదివి దయతో స్పందించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ‘రెండు రెళ్ళు ఆరు’ ముగింపు మీ స్మృతిపథంలో ఇంత పదిలంగా ఉండటం మరింత సంతోషకరంగా ఉన్నది!

    శ్రీ రమణ గారికి నమస్కారములు!
    మీ ఆదృతికి ధన్యవాదాలు. ‘త్రిశూలం’ నవల కూడా ఇప్పుడు దుర్లభమే. మీరు దానిని గురించి ఒక వ్యాసం ప్రకటిస్తే మళ్ళీ అభిమానులకు సుపరిచితం కాగలుగుతుంది.

    పైని వ్యాసంలో వివరంగా చెప్పలేకపోయిన విషయం:

    కర్మవాచకం ఉపపదంగా ఉన్నప్పుడు ‘హన’ ధాతువుకు భావార్థంలో య (క్యప్) ప్రత్యయం వచ్చి, నకారానికి తకారాదేశం వల్ల గో+హన్+య=గోహత్యా వంటి రూపాలేర్పడుతాయి. కేవలం ‘హన’కు య ప్రత్యయం, నకారానికి తకారాదేశం వచ్చి ‘హత్యా’ అని ఏర్పడటం సబబే కాని, అందుకు తెలుగులో పూర్వకవుల ప్రయోగాలు కనబడలేదు.

    కాగా, ‘హంతకుడు’ అన్న ప్రయోగం కూడా తెలుగులో ఎప్పటినుంచి వాడుకలో ఉన్నదో స్పష్టంగా తెలియరాలేదు. ‘హన’ ధాతువుకు అక ప్రత్యయం వచ్చినపుడు ‘ఘత్’ ఆదేశం వల్ల ఘత్+అక=ఘాతక అవుతుంది. కులఘాతకుడు, శిశుఘాతకుడు అన్నట్లు. అంతే కాని, కులహంతకుడు, శిశుహంతకుడు వంటి రూపాలేర్పడవు. ‘అంతక’ శబ్దానికి ‘అంతమొందించేవాడు’ అన్న అర్థం తెలిసినదే. దాని పోలిక వల్ల ఎవరో ‘హంతకుడు’ అనే రూపాన్ని కల్పించినట్లుంది. హన్+తృ=హంతృ ఉన్నది కాని, ‘హంతక’ శబ్దం వ్యాకరణరీత్యా అసాధువు. దీనిని Murderer అనే అర్థంలో తెలుగులో మొదటిసారి ఎవరు వాడారో తెలుసుకోవలసి ఉన్నది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  5. ramana

    bagundi article.. arudra maro rachana-THRISOOLAM -naku nachina maropusthkam modern robinhood with andhra back drop…

  6. మాలతి

    మురళీధరరావుగారూ, చాలా విపులంగా హత్యాసాహిత్య చరిత్ర వివరించారు. రెండు రెళ్ళు ఆరు నవలలో చివరివాక్యం రుక్కు నుదుట బొట్టు పెట్టుకోబోతే, బొట్టు నిలువ … అని అసంపూర్తిగా వదిలేసేరని గుర్తు. హన్ ధాతువుగురించి చెప్పినవాక్యాలు బాగున్నాయి. గుర్తుంచుకోవలసిన సంగతులు చాలా ఉన్నాయి మీవ్యాసంలో యథాప్రకారం. ధన్యవాదములు.

  7. Meher

    About the first part of the review, here are some more reasons from GK Chesterton, creator of Father Brown:

    http://www.chesterton.org/discover-chesterton/selected-works/the-detective/a-defence-of-detective-stories/

Leave a Reply