పుస్తకం
All about booksపుస్తకభాష

November 26, 2013

మాలతీ చందూర్ గారి “సద్యోగం” నవలిక

More articles by »
Written by: అతిథి
Tags: ,

వ్యాసకర్త: దేవినేని జయశ్రీ
**********
1976 లో మాలతి చందూర్ గారు రాసిన “సద్యోగం” నవల మొదటి పేజీ నుండి చివరి పేజీ దాకా కథ మంచి పట్టు లో సాగి, పుస్తకము మూసిన తరువాతే రచయిత్రి గుర్తుకి వస్తారు. కథ లో ముఖ్య పాత్రలు ఇద్దరే. ఒకరు వెంకటరామన్ సీనియర్ లాయర్, రెండవది అప్పుడే లా పాస్ అయిన సుమిత్ర. సుమిత్ర అన్న రాఘవరావు కేసు వెంకటరామన్ డీల్ చేసిన తీరు చూసి, చెల్లల్ని, ఆయన దగ్గర జూనియర్ లాయర్ గా జాయిన్ చేయటానికి తీసుకు వస్తాడు.

మొట్ట మొదటి సారి వెంకట్రామన్ ని కనుబొమ్మల మధ్య కుంకుమతో చూసినప్పుడు సుమిత్ర, ఈయనకు పూజా పునస్కారాలు ఉన్నాయి కాబోలు అనుకుంటుంది. పరిచయాలవుతూనే ఆయన తన వంక తీక్షణంగా చూస్తూ వరుస ప్రశ్నలడిగి నప్పుడు, బోనులో నిలబడిన ముద్దాయిని ప్రశ్నించినట్లుగా ఫీల్ అవుతుంది. సుమిత్ర ని వదిలి మీరు వెళ్ళండని తన అన్నకి చెప్పి నప్పుడు, ఓహో ఈయనకు తనని జూనియర్ గా తీసుకునేందుకు అభ్యంతరం లేదు కానీ తనకు అభ్యంతరం ఉందో లేదో అడగడేం అనుకుంటుంది. ఆ వెంటనే కాఫీ ఇచ్చి తీసుకో అన్నప్పటికి, సుమిత్ర కి వొళ్ళు తగలడు తున్నట్లుగా ఉంటుంది.

అప్పట్నుండి కథ రస పట్టు లో పడుతుంది. మొదట పిల్లి ఎలుక చెలగాటము లా సాగుతాయి వారిద్దరి మధ్య సంభాషణలు. తరువాత సుమిత్ర మెల్లగా ఆయన కఠినమైన బాస్, ఒక నిఖార్సైన లాయర్ అని తెలుసుకుంటుంది. మొదటి రోజే సుమిత్ర ఆలోచనల్ని కనిపెట్టిన వెంకట్రామన్ అంటాడు, “కేసు స్టడీ చేస్తున్నప్పుడు కేసు గురించి ఆలోచించాలి గాని, క్లయింట్ గురించి కాదు. క్లయింట్ ని మర్చిపోయి కేసు లోని న్యాయా, న్యాయాలు పరిశీలంచాలి. ఎదుటి ప్లీడర్ ని ఎలా పడగొట్టాలో అన్న ఆలోచన ఉండాలి. అంతే గాని క్లయింట్ ని గురించి అనవసర విషయాలు ఆలోచించకూడదు.”

“మై గాడ్” ఈ సీనియర్ దగ్గర ఉండటం అసంభవం, పనిచేయ కూడదు, చేయ లేను అనుకున్న ఈ అమ్మాయి వెంకట్రామన్ కి సమాధానం చెప్పే ధ్యైర్యం లేక ఆయన క్రింద పని చేసి మూడు నెలలవుతుంది అప్పుడే. ఈ మూడు నెలలో ఆమెకి సీనియర్ పట్ల పెద్ద సదభిప్రాయం కుదర లేదు గాని, అతను బ్రిలియంట్ లాయర్ అని, వచ్చిన కేసులన్నీ గ్రీడీగా తీసుకోడనీ, తీసుకున్న కేసు గెలిచేదాక నిద్ర పోడనీ ఇలా చాలా విషయాలు తెలుసుకుంటుంది.

అలా మొదలయిన సుమిత్ర ఉద్యోగ పర్వం కొన్ని సార్లు ఖంగారు, మరి కొన్నిసార్లు ఆశ్చర్యం తోనూ, కొన్నిసార్లు ఆవేశంతో కడుపు ఉడికిపోతూనూ సాగుతుంది. 1976 లో రాసినా కుడా ఈ కథ ఇప్పటి లాయర్స్ చదివితే లాయర్ ఎలా ఉండాలి, దేని పైన దృష్టి పెట్టాలి, ప్రిజుడిస్ గా లేకుండా ఉండటం ఎంత ముఖ్యమో లాటి ప్రొఫెషన్ లోని ప్రథమ పాఠాలు నేర్చుకొంటారు. నా మట్టుకయితే ఈ పుస్తకం ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసి లా సిలబస్ లో పెడితే బాగుంటుందనిపించింది. లా నే కాదు, డాక్టర్స్ ఇంకా ఎలాంటి ప్రొఫెషన్ లో ఉన్న వారయినా సరే చదవాల్సిన నవలిక ఇది.

నిఖార్సైన లాయర్ కింద ట్రైనింగ్ అయిన జూనియర్ లాయర్ సుమిత్ర చే పట్టిన ఈ కేసు చూస్తే తెలుస్తుంది, క్షుణ్ణంగా పరిశీలించట మంటే ఏంటో.

ఒక మనోవర్తి కేసు లో సుమిత్ర సీనియర్ లేకుండా వాదించి గెలుస్తుంది. కోయమ్ బత్తూర్ దగ్గర ఒక పల్లెటూరులో పుట్టిన ఒక అమ్మాయికి ఐదు వేలు కట్నమిచ్చి పెళ్లి చేస్తాడు వాళ్ళ నాన్న. అట్టే చదువుకోలేదు, అనాకారి కూడా. ఈ పెళ్లి అయినాక భర్త కట్నం తీసుకుని వెళ్లి పోతాడు. ఎన్ని సార్లు రాసినా ఇదిగో అదిగో అంటూ కాపరానికి తీసుకెళ్లడు. అతను బాగా చదువుకుని స్కాలర్షిప్ తో ఫారెన్ వెళ్లొచ్చాక, మద్రాస్ లో మంచి ఉద్యోగం నెలకు రెండువేలు సంపాయించుకుంటున్నాడు. ఇంకో పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలు, కారు, బంగ్లా, చదువుకున్న భార్య తో హై సోసిటీ లో తిరుగుతుంటాడు. మొదటి భార్య పెళ్లి అయి ఎనిమిదేళ్ళు గడిచినా ఇంకా ఆశతోనే ఉంటుంది. తండ్రికి ఒక్కత్తే కూతురు. చిన్న ఇల్లు తప్పితే ఏ ఆధారం లేని ఈ అమ్మాయిని తండ్రి చనిపోవటంతో ఇద్దరు పెద్ద మనుషులు పల్లె నుండి వెంటపెట్టుకు వస్తారు మద్రాస్ కు. “నెలకు యాభై పంపుతాను. దాంతో నీ బతుకు నువ్వు బతుకు” అని ఈ భర్త ఆ ఇద్దరు పెద్ద మనుషులు దగ్గర ఒప్పుకుని, ఆ ప్రకారం ఒక రెండేళ్ళు నెల నెలా పంపుతూ వచ్చాడు డబ్బు. అతని వైభవం చూసిన ఈ స్త్రీ కి ఎంతో బాధ కలుగుతుంది. పక్క వాళ్ళ మాటలు విని ఈ అమ్మాయి కేసు ఫైల్ చేయాలనుకుని మద్రాస్ వస్తుంది. సుమిత్ర తనకు ఒప్ప చెప్పిన ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించి క్లైంట్ తో ఇలా అంటుంది.

” భర్త జీతాన్ని బట్టి భార్య మైంటేనన్స్ కి డబ్బొస్తుంది. మీకు జరుగుబాటుకి కష్టంగా ఉందనీ, వేరే ఆధారం లేదని, నోటిసు ఇవ్వండి. నెలకి రెండొందలదాక ఇప్పించాడినికి వీలవుతుంది” అంది సుమిత్ర. ఆయినా ఆ అమ్మాయికి ఆశ వదలదు. తన స్థానంలో మరొక అమ్మాయి భోగ భాగ్యాలు అనుభవిస్తున్నదని కచ్చ. సుమిత్ర కి తెలుసు ఇది జరగదనీ, ఈ అమ్మాయి ఆ ఇంట్లో వంట మనిషి కన్నా నాసి గా ఉందని. అయితే ఆ అమ్మాయి అడిగిన అన్ని ప్రశ్నలన్నిటికీ వాస్తవికం గా ఆలోచించ వలసిన అవసరం, నెలకు రెండొందలు దాకా వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూర్చున్న కొమ్మను నరుక్కోవద్దని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేయించుతుంది. దాంతో కేసు గెలిచి క్లయింట్ కి నెలకు నూట ఎనభై రూపాయలు జీవనభ్రుతి గా మరియు వెనుకటి సంవత్సరాల బాకీ, మిగులు కూడా కలిపి మూడువేలు మొత్తంగాను ఇచ్చిన తీర్పుకి క్లయింట్ చాలా సంతోషిస్తుంది.

ఈ కేసు నిర్వహించిన తీరు చూసి వెంకట్రామన్ సుమిత్ర ని చాలా మెచ్చుకొంటాడు. సుమిత్ర కి వెంకట్రామన్ మెచ్చుకోలు, కేసు గెలిచిన దాని కన్నా సంతోషాన్నిస్తుంది. అన్యాయం అని, రెండో పెళ్లి చేసుకొన్నాడు మొదటి భార్య ఉండగా అని కేసు వేసి ఉండొచ్చు. కోర్ట్ కూడా ముందు అతన్ని ఉద్యోగంలో నుండి పీకించి, మొదటి భార్యను ఏలుకొమ్మని చెప్పి ఉండవచ్చు. అలా జరిగి ఉండి ఉంటె, అతను ఎలాగు ఈ అమ్మాయిని ఇష్టంగా చూసుకోవటం, కావాలని చేసుకున్న రెండో భార్యను, పిల్లలను వదిలి వేయటం జరగక పోను. కొంత డబ్బు, బాధ్యత, రెండో భార్యకు పిల్లల కోసమని ఇప్పించినా కూడా. వాస్తవంగా ఏం జరగొచ్చు, దాని వల్ల కుటుంబాలు ఏ విధంగా కిందా మీదా పడ వలసి వస్తుంది మళ్లా ఒక దారిలోకి రావటానికి? ఎన్ని సార్లు కోర్ట్ ని ఆశ్రయించ వలసి వచ్చేది? వెంకట్రామన్ లాంటి చిత్తశుద్ధి కల లాయర్లే మనకుంటే కోర్ట్ లకు ఎంత తక్కువ పని ఉండేది?

సహజంగా మనందరమూ మిక్స్ అప్ చేస్తుంటాము రిలేషన్స్ లో. అందులో బాగా పరిచయాలు అయినాక, కంఫర్ట్ లెవెల్ పెరిగినాక ఇంకాను. ప్రొఫెషన్ లో వున్న ఒక జూనియర్ అమ్మాయి, పెళ్లి అయి, పిల్లలున్నతన సీనియర్ ని చేసుకోవటం లాంటివి ఎన్ని చూడటం లేదు మనం? ఆడయినా, మగయినా స్పష్టమైన ఆలోచనల అవసరం పైన ఒక సందర్భంలో వెంకట్రామన్ తోటి లాయర్ మధురం పెళ్లి గురించి సుమిత్ర తో ఇలా అంటాడు. “మనం ప్రొఫెషనల్ ఎటికేట్ ని మర్చిపోకూడదు. డాక్టర్ పేషెంట్ తో ప్రేమసల్లాపాలు ఎలా పెట్టుకోకూడదో, సీనియర్ జూనియర్స్ తో ఇలాంటి గొడవలు పెట్టు కోకూడదు. అది సక్సెస్స్ ఫుల్ లాయర్ నేర్చు కోవాల్సిన మొదటి పాఠం. రామస్వామికి ఆరుగురు పిల్లలు, భార్య ఉన్నారు. అలాంటివాడిని, తను జూనియర్ గా వచ్చి పెళ్లి చేసుకుంది అంటే, ఆ అమ్మాయి ‘వృత్తి ధర్మం’ లోని తొలి పాఠం మర్చిపోయింది.”

మొదట అన్నీ సుగుణాల లాగానే కనిపిస్తాయి తరువాత తనే భార్య స్థానం లోకి రాగానే నెమ్మది గా ఒకప్పుడు సర్వ స్వతంత్రరాలు అనుకున్న ఆ మనిషే రాజీ పడి బ్రతకటం మొదలవుతుంది. మనం మోసపోము అన్న ధీమా ఉన్నంత వరకూ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

జీవితం నిదానంగా సాఫీగా గడుస్తోందని సుమిత్ర అనుకొన్న కొద్ది రోజులకే ఒక క్రిమినల్ కేసు వస్తుంది. కథ ఇక్కడ నుండి థ్రిల్లర్ లా సాగి పోతుంది.

మొహమ్మద్ భాషా అనే నేరస్తుడు వాచీ దొంగతనంలో పట్టుబడటం, వెంకట్రామన్ సరదాగా ఆ కేసు తీసుకోవటం చకా చకా జరిగిపోతాయి. ముద్దాయిని ఇంటర్వ్యూ చేయటానికి వెళ్ళిన సుమిత్ర కి కటకటాల వెనుక నున్న వ్యక్తిని చూడటం, అతను ‘నువ్వా’ అనటం తో కథ ఇక్కడ నుండీ సుమిత్ర జీవితం పైకి మళ్ళుతుంది. ‘నువ్వా’ అని తనను ఏక వచనంతో పిలిచిన పిలుపికి సుమిత్రకి కలిగిన స్పందన సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న ఏ స్త్రీ కైనా కలుగుతుంది.

ఒక మామూలు మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన సుమిత్ర, ఎక్కువ మంది ఆడపిల్లల లాగానే చవకబారు కథలు చదివి ఏ మాత్రం వాస్తవానికి దగ్గర లేని కొలమానాలు పెట్టుకుని, ఎలా పెడ తోవపట్టి ఎలా మోసపోయిందో అన్నీ పూస గుచ్చినట్లు నిర్భయంగా చెప్పుకి వెళ్తుంది, తన సీనియర్ తో. ఆ తరువాత వాళ్ళ నాన్న విజయవాడ నుండి మద్రాసుకి మొత్తం కుటుంబాన్ని మార్చటం నుండి సీనియర్ దగ్గర తన అన్న చేర్చటం వరకు చెప్పు కొస్తుంది. మరి ఇదంతా విన్నాక వెంకట్రామన్ ఈ కేసుని సుమిత్ర ను తీసుకోమంటాడా లేదా అన్న విషయం మీరు పుస్తకం చదివి తెలుసుకోవలసిందే. తప్పదు మరి.

” నేను ఆడదాన్ని, నేను అబలని అని స్త్రీ అనుకున్నన్నాళ్ళు మీకు విముక్తి లేదు.”, అని ఒకప్పుడన్న అదే సీనియర్ కథాంతం లో తన జూనియర్ తో “లెట్ అస్ షేక్ హాండ్స్, మనిద్దరం సమానస్తులం, భాగస్తులం.” అనటం జరుగుతుంది.

ఇలా ఒకటీ రెండూ విషయాలు కాదు, జీవితం లో మనకి తటస్థ పడే ఎన్నో రకాల సందర్భాలను ఈ చిన్న నవలిక మనసులో ముద్ర పడిపోయేట్లు గా చేసిన మాలతీ చందూర్ గారు సామాన్యురాలు కాదు. ఎన్ని సార్లయినా చదవొచ్చు. ప్రతి సారీ కొత్త విషయాలు కనపడుతూనే ఉంటాయి. అరె, కొన్ని నెలల ముందు చదివుంటే ఆవిడతో పంచుకునేదాన్ని కదా ఎంత గొప్ప పుస్తకం తెలుగు పాఠకులకు అంద చేసారని! ఇప్పుడు ఆవిడ మనకి లేరు కాని మనకి మంచి సంపద నిచ్చి వెళ్లారు.

ఈ పుస్తకం నాకు ఇచ్చి తప్పక చదవాల్సిందేనని నా పామర్రు స్నేహితురాలు డా. భార్గవి ఇవ్వక పొతే నేను చదివుండేదానిని కాదు. తనతో చర్చ పెట్టక పోయుంటే ఈ రివ్యూ రాసే దాన్నీ కాదు.

ఈ పుస్తకం దురదృష్టం కొద్దీ మార్కెట్ లో దొరకటం లేదు. మీ స్నేహితుల దగ్గర వుంటే కానీ లేదా మీ దగ్గరే ఉన్నట్లయితే చదవండి, చదివించండి.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.13 Comments


 1. CHVLN MURTHY

  నేను ఈ బుక్ 30 సంవత్స్తరాల బ్యాక్ చదివాను ఆత్మ సంతృప్తి ఇచే పుస్తకం ఒక వంద సార్లు చదివానేమో విజయవాడ లో అన్ని బుక్ స్టాల్స్ వెతికాను దొరకలేదు ప్రతివాళ్ళు చదవాల్సిన పుస్తకం


 2. Maistry Koosraj

  చివరికి ఎం అయింది?


 3. Jyothi Kommuri

  Excellent review….loved it! Please keep writing….to open our world to great books.


 4. supriya sakamuri

  Dear Jayasree garu, Mee sameeksha vidhanamu chalabhavundi. Meeru inthakumunupu kuda emaina navala samikshalu vrasara? Malthi Chandurgari EE Navala dorikithe thapakunda chaduvuthanu.


 5. Koppula Hemadri

  దేవినేని జయశ్రీ గారి ‘సద్యోగం’ సమీక్ష బాగుంది. కథలో ప్రస్తావించిన సంఘటనలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి! కించిత్తయినా మార్పు లేదు! మరి తప్పెవరిది? మార్చుకునేందుకు మార్గాలు లేకపోతే అలాంటి విషయాలపై కథలూ, కథానికలు రాయవలసిన అవసరమేలేదు! సమీక్షలూ అవసరం లేదు!
  పోతే, నచ్చిన పుస్తకాలను ఎలాగోలాగ సేకరించి, తెలిసినవారికి పంచిపెట్టి చదివించడం దేవినేని మధుసూదనరావు, జయశ్రీ దంపతులకు మహా సరదా! ఈ పుస్తకం కోసం కూడ యెదురు చూస్తూ… — హేమాద్రి


 6. ముత్తేవి రవీంద్రనాథ్

  జయశ్రీ గారూ !
  మొదటి ప్రయత్నంలోనే మంచి నవలికను పరిచయం చేశారు. మీరు పరిచయం చేసిన తీరు కూడా అందరినీ చదివి౦పజేసేదిగా ఉంది. మీ భావాన్ని అక్షరీకరించడంలో చిన్నపాటి దోషాలున్నా, అవి ముందు ముందు క్రమంగా సర్దుకుంటాయి. సాహిత్యానికి ఉండితీరాల్సిన సామాజిక బాధ్యత ఈ నవలికలో పుష్కలంగా కనుపిస్తుంది. మాలతి గారి రచనలు చాలమేరకు కొ.కు. వంటివారి రచనలలాగే ఒక సామాజిక ప్రయోజనం ఉద్దేశించి రాసినవే.
  మంచి రివ్యూ పంపినందుకు ధన్యవాదాలు.
  — ముత్తేవి రవీంద్రనాథ్.


 7. ” నేను ఆడదాన్ని, నేను అబలని అని స్త్రీ అనుకున్నన్నాళ్ళు మీకు విముక్తి లేదు.”,

  పై వాక్యం వ్యాకరణం ప్రకారం తప్పు అనుకుంటాను. ఇక్కడ థర్డ్ పర్శన్, సెకండ్ పర్శన్ రెండు కలిసి పొయాయి. మొత్తం వాక్యం ఒకే పర్శన్‌లో వుండాలి.

  ఈ వాక్యం ఈ కింద రకాలుగా వుండొచ్చు అని అనుకుంటున్నాను:

  1. ” ‘నేను ఆడదాన్నీ, నేను అబలనూ’ అని స్త్రీ అనుకునన్నాళ్ళూ, ఆమెకి విముక్తి లేదు.” — మొత్తం థర్డ్ పర్శన్‌లో వుంది.
  2. ” ‘నేను ఆడదాన్నీ, నేను అబలనూ’ అని మీ స్త్రీలంతా అనుకున్నన్నాళ్ళూ, మీకు విముక్తి లేదు.” — మొత్తం సెకండ్ పర్శన్‌లో వుంది.

  ప్రసాద్


  • Jayasree Devineni

   రచయిత్రి రాసిన వాక్యాన్ని యథాతథంగా వాడానిక్కడ. Oct 1976 లో ఎం శేషాచలం & కో page no, 139 లో ఉంది.


 8. మంజరి లక్ష్మి

  నేను ఈ నవల చదివాను. నాకూ బాగా నచ్చింది అప్పట్లో. ఐతే నాకు ఈ నవల, ఎన్నిమెట్లెక్కిన అనే నవల చందూర్ గారు రాసారేమోనని అనుమానం. ఈ రెండిటికీ మిగతా మాలతీ చందూర్ గారు రాసిన నవలల శైలికీ ఎక్కడో ఏదో భేదం(మగవాళ్ళు రాసే శైలిలో) ఉన్నట్లుగా నా కనిపిస్తుంది.


 9. Jampala Chowdary

  జయశ్రీ గారూ
  పుస్తకానికి స్వాగతం. మంచి పుస్తకంతో మొదలుపెట్టారు.
  జనవరిలో విజయవాడ పుస్తకప్రదర్శనలో మాలతీచందూర్ గారి పుస్తకాలు చాలా కనిపించాయి. వాటిలో ఈ పుస్తకం కూడా ఉందేమో గుర్తు లేదు.


  • Jayasree Devineni

   కృతజ్ఞతలండి చౌదరి గారు. ఇది మార్కెట్ లో దొరకటం లేదని డాక్టర్ భార్గవి చెప్పినప్పటి నుండి చూస్తున్నాను మార్కెట్లో. ఇంతవరకు కనపడలేదు మరి.


 10. మీరు మాలతమ్మగారి సద్యోగం‌ నవలను పరిచయం చేసినందుకు చాలా సంతోషం. అది ఒక గొప్పనవల. అదనంగా నేను మరేమి చెప్పినా అధికప్రసంగం అవుతుంది.

  నాకు ఇతరభాషలవారి సంగతి తెలియదు. తెలుగువారికి మాత్రం నాకు తెలిసి కాలక్షేపం ముఖ్యం. కాలక్షేపం నవలలు చదివారు అప్పట్లో. సద్యోగంలాంటి సాహిత్యాన్ని కాదు. కాలక్షేపం ధారావాహికలు చూస్తున్నారు నేటి టీవీల్లో. చవకబారువినోదం కాక మంచి కార్యక్రమాలూ వస్తాయి కాని వాటిని చూడరు. చాలా విచారించవలసిన సంగతి.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

స్ఫూర్తిదాయని, జ్ఞానదాయని, సలహాదాయని, సన్నిహిత సఖి – మాలతీచందూర్

ఈ వారం Time పత్రికలో మార్టిన్ లూథర్ కింగ్ Civil Rights March on Washington/ I Have a Dream ప్రసంగం 50వ వార్షికోత్సవం సం...
by Jampala Chowdary
16

 
 
శతాబ్ది సూరీడు

శతాబ్ది సూరీడు

రాసిన వారు: సుజాత *********************** మాలతీ చందూర్ గారి నవలలు నాకు నచ్చుతాయి. పాత్రలన్నీ సాదా సీ...
by అతిథి
4