పుస్తకం
All about booksపుస్తకభాష

November 13, 2013

దేవతల యుద్ధం – విశ్వనాథ సత్యనారాయణ

వ్యాసకర్త: Halley
*****

కొన్ని నెలల క్రితం పుస్తకమ్.నెట్ ద్వారా పరిచయం అయిన ఒక పెద్దాయన పుణ్యమా అని విశ్వనాథ వారి “దేవతల యుద్ధం” చదవటం జరిగింది . నేను ఒక మోస్తరు ఫ్యాన్ ని విశ్వనాథ నవలా సాహిత్యం లో చర్చించే విషయాలకి. కాబట్టి నా ఈ పరిచయంలో కొంచెం అభిమానం కనపడచ్చు. “జీవుని చిత్త వృత్తి ఎలా ఉంటే ఆ కావ్య కథ అలాగే అర్థం అవుతుంది” అని అన్నారట విశ్వనాథవారు రామాయణం గురించి (రంగనాయకమ్మ గారి ‘రామాయణ విషవృక్షం’ లో చూసాను ఈ మాట). ‘చిత్తవృత్తులు’ లాంటి పెద్ద మాటలు వాడే అర్హత నాకు లేదు కానీ over a period of time నేను తెల్సుకున్నది ఏమిటి అంటే విశ్వనాథ వారి పుస్తకాలు వాటిలో ఉండే రక రకాల విషయాలు కొంత కొంతమందికి నచ్చుతాయి కొంతమందికి కోపాన్నీ అసహ్యాన్నీ తెప్పిస్తాయి. మనం ఏమీ చేయలేము. కాబట్టి arguments అనవసరం ఏమో!

గత కొన్ని నెలలలో నాకు నచ్చిన కొన్ని పేజీలు మళ్ళీ మళ్ళీ చదవటం జరిగింది. ప్రధానంగా వాటి గురించే ఈ పరిచయం. ఇది literary aspects గురించి కాదు. అవేంటో వాటిని ఎలా విశ్లేషించాలో నాకు తెలీదు.

“ఇది ఒక రాజ కుటుంబంలో జరిగిన కథ. క్రొత్త దేవతలు ప్రాత దేవతలు మనుష్యుల విశ్వాసాల వలన పరిస్థితులు యెట్లా మారి సంఘంలో కొందరు బలి అవుతారో ఆ కథ. ఇక చదవండి” అని మొదలైంది ఈ పుస్తకం.

ఆ ఊరి జమిందారు గారి మతాన్ని గురించి వివరిస్తూ ఒక మాట అన్నారు. నాకెంతో నచ్చింది. “మనమేదో వ్యామోహపడినంత మాత్రాన ఈ మనసు వశమయిపొయేదయితే ఈ వేదాలెందుకు? ఈ ఉపనిషత్తులెందుకు? ఈ తపస్సులెందుకు?”. మరో చోట ఆ మతం గురించే చెబుతూ “దొరగారి మతం ఉపనిషన్మతం. వాళ్ళ ఉపనిషత్తులలో జ్ఞానభాగం అంతా ఒప్పుకుంటారు. అందులో చాలా మందికి ఉపనిషత్తులలో రెండు భాగాలుంటాయని అందులో ఒక భాగం ఉపసనాభాగం అనీ, రెండోది జ్ఞాన భాగం అనీ తెలియనే తెలియదు. ఉపాసన భాగం ఒప్పుకుంటే వాళ్ళ మతమే చెడిపోతుంది” అని అన్నారు. మరొక చోట “దొరగారి మతంలో నిజానికి ఆధ్యాత్మిక ఛాయలు ఏమి లేవు. కొన్ని నైతిక ఛాయలు మాత్రం ఉన్నవి. ఆ మతం యొక్క నిజమైన స్వరూపం సంఘ సంస్కారం” అని అన్నారు. ఇది కాకుండా ఈ నవలలో ఒక దీవాను గారి మతము గురించి కూడా రాసారు. అది ఇంకొక variant అనుకోండి. ఇలాంటి themes విశ్వనాథ వారి నవలలో explore చేసినంతగా నాకు తెలిసి తెలుగులో వేరే ఎవరు చేయలేదు అనుకుంటాను.

బాల్య వివాహం, రజస్వలాంతర వివాహం, విధవా వివాహం, సంఘ సంస్కారం వివాహం ఇలా కొన్ని వివాహాల మీద కొన్ని పాత్రల మధ్యన కొన్ని చర్చలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ విషయాలన్నీ ఒకలాగా అర్థం అయ్యేవి నాకు. అయితే ఈ మధ్యన Sarda bill, Hindu code bill, Devadasi abolition bill వీటి చుట్టుతా ఆయా కాలాలలో జరిగిన వాదప్రతివాదాలు వగైరా చదివాక ఇవి నేను అనుకున్నంత ఈజీ బ్లాకు అండ్ వైటు నిర్ణయాలు కావని అర్థం అయింది. కాబట్టి ఆ పార్ట్ గురించి నేను judgements చేయను. అవి అలా వదిలేద్దాం ఇప్పటికి.

ఇక ఈ నవలలో ఈ లైను ఉంది చూసారూ, ఈ లైను ముందు ఎన్ని పంచు డైలాగులు అయిన కూడా దిగదుడుపే! “ఇదేమి రోజులో, అన్ని ధర్మాలు పోయి ఇష్టమనే ధర్మం చాలా పైకి వచ్చింది”. అర్థం చేసుకుంటే పుస్తకాలే రాసేయచ్చేమో ఈ లైను మీద. ఈ విషయం గురించే చెబుతూ “ధర్మ కాలం నుంచి సిద్ధాంతాల కాలంలోకి” మారిన మానవుడి గురించి ఇలా అన్నారు. “తనకేది సిద్ధాంతమో అదే ధర్మం ; అదే మానవ ప్రకృతి ; అదే సంఘం; అదే రాజనీతి, ఇక అన్నీ అదే”. అదనమాట! మన కాలం వారంతా ఈ ఇష్టం పార్టీనే కదా మరి!

ఇంకొక చోట కర్మకాండల గురించి కొన్ని లైనులు ఉన్నాయి . ఆలోచింపజేసేవే! “కర్మకాండ పెరిగిందంటారు. ఎందుకు పెరగదు? పెరగటం అనేది మనుష్య సహజం. ఒక చిన్న ఉపన్యాసం ఏర్పాటు చేశారనుకోటానికి కార్యదర్శి లేచి నేను ఫలానా వారిని అధ్యక్షుడిగా ఎన్నుకొనుచున్నాను అని చెప్పటం, అధ్యక్షుడు కూర్చోటం, ప్రార్థన, అయన తొలిపలుకు, తర్వాత ఉపన్యాసకుడు మాట్లాడటం, అధ్యక్షుని తుది పలుకు, తర్వాత కార్యదర్శి వందనములు ఇదంతా ఏమైంది? ఒక కార్యక్రమంగా నడవలేదా ? స్థూలంగా చూస్తే కర్మ కాండ ఇలాగంటిదే”. ఈ విషయంలో మనకి గొడవలొద్దు అదలా వదిలేద్దాం ఇప్పటికి.

మరొక చోట మంత్రాల గురించీ, మాట వెనుక ఉన్న భావం, అది చేయించే పనులు వగైరాల గురించీ, మంత్రం శక్తి గురించీ, మంత్రాలకీ పాంచభౌతిక జగత్తుకీ ఉన్న సంబంధం గురించీ కొన్ని తర్కాలు ఉన్నాయి. ఈ వాదనా క్రమంలో భాగంగా Marconiని శబ్ద తరంగాలని కూడా తెచ్చి అదొక రకం తర్కం తెచ్చారు విశ్వనాథ వారు. Mind block అయిపోయే తరహా తర్కమే అది అర్థం చేసుకొని ఆలోచించే ఓపిక ఉంటే. లేకపోతే “అంతా Trash” అని కొట్టిపారేయచ్చు. అది ఈజీ కుడానూ. ఈ మాటలు అంటూ “నాస్తికత్వం అంటే ఊహశక్తి లేకపోవటం, సరియైన పద్దతిగా విచారణ చేయకపోవటం” అని ఒక మాటన్నారు. నాస్తికత్వానికి poverty of imagination కి పెట్టిన లంకె నాకు ఎందుకనో బాగా నచ్చింది. నాకు సిద్ధాంత మార్పిడి మత మార్పిడి చేసే ఉద్ధేశాలేమీ లేవు. కాబట్టి మీకు ఓపిక ఉంటే పుస్తకం చదువుకొనుడి.

ఇక విశ్వనాథ వారి నవల అనగానే వర్ణాశ్రమ ధర్మాల గురించి ఏదో ఒక మాట లేకుండా పోదు. ఇందులోనూ ఉన్నాయి. ఎవరికి నచ్చినట్టు వారు దీనిని అర్థం చేసుకొని యుద్ధములు చేసుకొనవచ్చును!

“మనుష్యుని మనసు అనేక పొరలు కదా! ఒక పొరలో తాను బ్రాహ్మణుడైనచో బ్రాహ్మణుడని , కానిచో కాదని ఉండును. ఆ పొరలోని భావమే పైకి తీసి ఆ ప్రకారం నడిస్తే సంఘం కొంత గగ్గోలు పడటానికి వీలుగా వుంటుంది . ఆ భావాన్ని మరుగు పరచి ప్రతివాడికి ఏదో వర్ణం లేకుండా ఉండదు గదా అని గ్రహించి, వర్ణం అనేది స్వంతం, మనుష్యుడు సంఘానికి సంబంధించిన వాడు అని ప్రవర్తిస్తే లోకంలో సంఘ విప్లవం, వర్ణ విప్లవం, ధర్మ విప్లవం, సాంప్రదాయ విప్లవం జరగదు.”

ఇంకొక చోట ఇటువంటివే మరి కొన్ని వాక్యాలు ఉన్నాయి. సాధారణంగా క్లైమాక్స్ కి దగ్గరకు వచ్చేసరికి విశ్వనాథ వారి నవలలో వాదనల density తారా స్థాయికి చేరుతుంది. ఈ నవలలో కూడా అంతే. ఈ పారాగ్రాఫు అందుకు శాంపిల్ మాత్రమే.

“అరేరే! ఈ దేశాన్ని ఏదో ఒక చిత్రమైన ఆర్థిక వ్యూహం చుట్టుకుంది. పూర్వ సంప్రదాయం అంటే, పూర్వాచారాలంటే, పూర్వసంస్థలంటే, పూర్వదేవతలంటే ఒక లెక్కలేని తనం. అవన్నీ దోషభూయిష్టాలనటం, పూర్వపు సంఘవ్యవస్థ అంటే ఒక నిరాదారణ, ఒక తిరస్కారం, ఒక నింద, ఒక విప్లవం. ఆ సంఘవ్యవస్థలో ఉన్న భిన్నైక దేశాలను ముక్కలు ముక్కలుగా చేయుట. ఈ సృష్టి లో నీవెంత కొత్తదైనా తీసుకురా మంచి ఉంటుంది; చెడ్డా ఉంటుంది. గుణాలు ఉంటవి, దోషాలు ఉంటవి . ఈ దోషాలు ఆదర్శాలలో ఉండవు. అసలు మూల సూత్రలలో ఉంటవి. ఆ మూలసుత్రాలు చాలా ఆలోచించి లోక కళ్యాణము కొరకు చేసినవే. కాని అవి ఆచరణలోకి వచ్చేటప్పటికి ఆ ఆచరణ కొన్ని వందలయేండ్లు సాగేటప్పటికి మనుష్య స్వభావంలో ఉన్న దోషాలు ఆ సూత్రాలను ఆ ఆదర్శాలను ఆవరించినట్లు కనిపిస్తుంది. సర్వ దోషము మానవ ప్రకృతిలో ఉంది” .

ఈ మాటలు చెప్పాక స్వధర్మం, గుణం, రేతశ్షుద్దీ, పర ధర్మం పైన అభిమానం ఇలా కొన్ని విషయాల మీదా కొంచెం straight talk ఉంది. కానీ ఆవేశ పడకుండా అది అర్థం చేసుకోవాలీ అంటే మనం కొన్ని biasలను గుమ్మం బయట పెట్టి చదవటం ప్రారంభించాలి, లేదంటే మొదటికే మోసం.

ఇక నవల మొత్తంలోనూ నేను మళ్ళీ మళ్ళీ చదువుకున్న వాక్యాలు ఇవి. ఇది కూడా చాలా ఆలోచింపజేసే మాటలే, ఎటొచ్చీ అయన ఏం చెబుతున్నాడో ఓపికగా ఆలోచించటానికి మనం రెడీ అవ్వాలి అంతే. ఇదొక రకం education అనమాట.

“నాటకం వాడికి రూపాయి ఇచ్చి టికెట్టు కొంటే వాడు సంతోషిస్తాడా? దానం అనుకుంటాడా? ఇవన్నీ నీ సంతోషం కోసం చేసే పనులు. నీ వనుభవించే ఆ సంతోషం ఒక దర్జా కోసం, ఒక ఠీవి కోసం, ఒక బడాయి కోసం కలిగే సంతోషం. ఈ డబ్బు పేదవాళ్ళకి ఇస్తే వాళ్ళ మనసు ఎలా ఉంటుంది? వాళ్ళ మనసంతా ద్రవీభూతం అవుతుంది. వాని సంసారం పరిస్థితి ఎట్లంటిది అంటే వాడికి నీవిచ్చిన నాలుగు రూపాయలకు వాడి వళ్ళు కోసి ఇచ్చినా నీ యందలి కృతజ్ఞత తీర్చుకోలేనేమో అనిపించేది. అప్పుడు వాడి మనసులో కలిగే ఆర్ద్రత లౌకికమైనది కాదు. నీకు ప్రత్యుపకారం చేద్దాం అనేది కాదు. ఇది ఐహికమైనది కాదు. ఆధ్యాత్మికమైనది. నీవు ఉద్యోగస్తులకి డబ్బిస్తే వాళ్ళు నీకు ఐహికంగా యెట్లా ఉపయోగపడతారో ఆ ఉపయోగాన్ని ఎలా వాంఛిస్తావో అల్లా అధ్యాత్మికమైనది ఒకటి ఉంది అని నీవు విశ్వసించి దాన్ని వాంఛిస్తే ఈ పేదవాళ్ళకు ఆ డబ్బు ఇస్తావు”

“ఇదిగో చూడండి ఒకటి ఐహికం; రెండు ఆముష్మికం. ఈ రెండు చెరి సగంగా మానవుడిలో ఉంటుంది. పూర్వ సంఘ వ్యవస్థ ఐహికానికి జీవయత్రకు కావలసిన వెల కట్టి ఆముష్మికానికి ఎక్కువ వెల కట్టింది. ఇప్పటి సంఘం ఆముష్మికం లేనే లేదంటోంది. ఆముష్మికం అనేది ఎక్కడో ఉందనుకోటంలో ఉంది. పైన చెప్పిన ఉద్యోగస్తుల యొక్కయు పేదవాళ్ళ యొక్కయు తృప్తి లక్షణం విచారిస్తే ఆముష్మికం ఈ సృష్టిలోనే, ఈ మానవులలోనే ఉంది అని తెలుస్తుంది. ఆ అముష్మికానికి గంత బొంత తొడిగి పసుపు పెట్టి, కుంకుమ పెట్టి, దానిని దేవుడని, క్షేత్రాలని, వ్రతాలని, చేసారు. అట్టా చేయకపోతే నీవు దాని వంక చూడవని. ఈ ఐహికం కన్నా ఆ ఆముష్మికం ఎంతో బలమైనది. ఐహికం యొక్క బలం ప్రత్యక్షంగా కనిపిస్తుంది. నీవు ఉద్యోగస్తుడికి నిజంగా ఇచ్చేది లంచం. ఆ లంచానికి మర్యాదా చొక్కా వేసి ఇస్తావు. పేదవాడికి ఇచ్చేది దానం. దానికి మర్యాదా చొక్కా లేదు. దయ అనేది నీ గుండెలో పుట్టాలి. పుడితే ఏది దైవం అని అంటున్నామో ఆ ఆముష్మికానికి సంబంధించిన బతుకు బతుకుతావు. ఉద్యోగస్తుడికి లంచం ఇవ్వవు. ప్రత్యక్షంగా నీ పని పాడవుతుంది. వాడికి నువ్విచ్చే లంచం; వాడు నీకు చేసే ఉపకారం, దాని వల్ల నీ ఆస్తిపాస్తులు సురక్షితంగా ఉండటం ఇది ఒక లోకం. పేద వాడికి నీవిచ్చే దానం వాడు పొందే తృప్తి. ఆ తృప్తి వల్ల వాడు నీకు మేలు కలుగవలెనని కోరటం, దాని వల్ల ఈ దయాలోకాలలో కలిగే సంచలనం. ఆ సంచలనం నీకు ఈ దానానికి ప్రతి ఫలంగా ఏదో చెప్పరాని ఒక సుఖ హేతువుగా ప్రకాశించటం. ఇదంతా ఒక లోకం. ఉద్యోగస్తుడికి డబ్బు ఇవ్వవు. వాడు నీకు అపకారం చేస్తాడు. పేదవాళ్ళయందు దయ చూపించవు. దానికి నీకపకారం జరుగుతుంది. నీకప్పుడు అపకారం, ఇప్పుడు అపకారం జరుగుతుంది. ఆ అపకారం ఎవడో చేసినట్టు కనిపిస్తుంది, తెలుస్తుంది. ఈ అపకారం చేసినవాడు కనిపించడు. ఇది దాని ఫలితమని తెలియదు”

నవల చివరాఖరున ఈ మాట కూడా అన్నారు.

“నీవెంతైనా భగవంతుడు లేడూ అనూ. వాడు లేడు అనటానికి కారణం ఇంకేదో ఉంది అన్న బలం. ఆ ఏదో వీటిలో ఏదైనా కావచ్చు. ఒకటి ధనం రెండు సంఘ బలం. ఇవి రెండు చాలా ప్రధానం. ఈ రెంటిలో ఏదీ లేకపోతే అప్పుడు దేవుడున్నాడు”

అదనమాట! వంద పేజీల నవలలో ఇన్ని విషయాలు దాగి ఉన్నాయి మరి. ఇటువంటి నవలలో కథ ఏంటి అని అడిగితే చెప్పటానికి పెద్దగా ఏమి కనపడక పోవచ్చు. కానీ లోతుకి దిగాము అంటే కొన్ని రోజుల కొద్దీ ఆలొచించుకోటానికి కావలసినంత ముడి సరుకు ఉంటుంది. నాలోని “స్వ” అనే భావాన్ని విశ్వనాథ వారి రచనలు తాకినంతగా మరే ఇతర రచయిత రచనలు తాకలేదు ఇప్పటి దాకా. ఈ విషయాలు ఆలోచించటానికీ సహేతుకంగా విమర్శించటానికీ జంకి ఇటువంటి పుస్తకాల పైనా ఈ రచయితల పైనా ఒక ముద్ర వేసేసి పెట్టెలో వేసి తాళం వేసి ఈ సాహిత్యాన్ని ఈ ఆలోచనలనూ ఒక తరానికి దూరం చేసేసారేమో అని అపుడపుడు అనిపిస్తుంది నాకు. మనం గర్వించదగ్గ రచయితలలో ఒకరు విశ్వనాథ సత్యనారాయణ వారు (నాకు కేవలం నవలా రచయితగా మాత్రమే తెలుసును కనుక అంత వరకే మాట్లాడుతున్నాను). ఈ నవల చదివాక వారి మీద ఉన్న గౌరవం ఇంకా పెరిగింది. colonization of mind, rootlessness, subaltern studies, post colonialism ఇలాంటి పెద్ద పెద్ద మాటలన్నీ వాడేసి ఇంగ్లీషులో రక రకాల రచయితలూ రిసర్చర్లూ బాగా పాపులర్ ఐపొతున్న ఈ రోజుల్లో విశ్వనాథ వారికి ఈ తరం పాఠకుల్లో రావల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది ఇటువంటి నవలలు చదివినప్పుడు. చదివేవాళ్ళు లేకనో, చెప్పేవాళ్ళు లేకనో, లేక పుస్తకాలు దొరకకనో, లేక ఈ ఆలోచనా స్రవంతిని కొత్త తరానికి తీసుకు వెళ్ళే కొత్త రచయితలు లేకనో ఏమో నాకు తెలియదు మరి..About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.10 Comments


 1. ఏల్చూరి మురళీధరరావు

  విశ్వనాథ నవలాచక్రంలో ధ్వన్యాత్మకతను అవలంబింపక వర్తమాన పరిస్థితులలోని లోపాలను ఇంత స్పష్టంగా అభివ్యక్తీకరింపబూనిన నవల వేఱొకటి లేదు. ‘దేవతల యుద్ధము’ ఒక సమ్మోహకమైన విశిష్ట కథనశిల్పంతో సాగిన ఉపన్యాసప్రవాహం. దేవతల యుద్ధం అనగానే స్ఫురించే వైదికకథలు నిర్నిమిత్తంగా విశ్వనాథ ఆ శీర్షికకు ఒక కొత్త న్యాయాన్ని ఉపకల్పించారు. ఎంతో వ్యంజకమైన ఈ నవలను మళ్ళీ తవ్వి తలకెత్తి హేలీ గారు ఒక కొత్తచూపుతో చూడగలగటం అభినందనీయంగా ఉన్నది.

  ఈ వ్యాసంలో ఉదాహృతాలైన విశ్వనాథ వాక్యాలను అదే క్రమంలో ఆయనకు వ్యతిరేకంగా వాదించి, వాటిలోని తిర్యగ్గమనశీలాన్ని విమర్శించటం కూడా సాధ్యమే. హేలీ గారు విమర్శలలోని అటువంటి ద్వైరూప్యాన్ని చూచి ఉండరని అనుకోలేము. ఒక ప్రభావశీలి రచనను రచయిత భావాలతోడి సమానహృదయంతో చదివిన తర్వాత సహృదయంతో స్పందించిన ఒక నవయువకుని వ్యాసంగా దీనిని చదివినప్పుడు ఎంతో ముచ్చటగా ఉన్నది.

  హేలీ గారి శైలీ బావుంది. భావుకత ఉట్టిపడుతున్నది. మంచి మనసుతో మనస్వితను గురించి మంచి వ్యాసాలను వ్రాస్తున్నారు!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు


 2. SIVARAMAPRASAD KAPPAGANTU

  “…విశ్వనాథ వారికి ఈ తరం పాఠకుల్లో రావల్సినంత గుర్తింపు రాలేదేమో అనిపిస్తుంది ఇటువంటి నవలలు చదివినప్పుడు. చదివేవాళ్ళు లేకనో, చెప్పేవాళ్ళు లేకనో, లేక పుస్తకాలు దొరకకనో, లేక ఈ ఆలోచనా స్రవంతిని కొత్త తరానికి తీసుకు వెళ్ళే కొత్త రచయితలు లేకనో ఏమో నాకు తెలియదు మరి…”

  ముఖ్యంగా 1950 దశకం నుండి 1970 దశకం చివరి వరకూ తెలుగు సాహిత్యం వామపక్ష వాదుల చెరలో ఉన్నది. ఆ చెర విడిపించిన ఘనత మహిళా రచయితలదే. ఆ రెండు దశాబ్దాలలోనూ విశ్వనాథ వారిమీద ఒక “ఎజెండా” పెట్టుకుని విమర్శ చేయటం జరిగింది అనే కంటే చేయించటం జరిగింది అనటం సముచితం. అటువంటి దుష్ప్రచారం వల్లనే, విశ్వనాథ వారి రచనలు మరుగున పడటానికి కారణం.

  తరువాత, విశ్వనాథ వారు తన రచనలను ఒక పధ్ధతి ప్రకారం ప్రచురించే పథక రచన చెయ్యలేదు. వ్రాసినప్పుడు చూపిన పటిమ ప్రచురణలో ఆయనెప్పుడూ చూపలేదు. అందువలన ఏ నవల హక్కులు ఎవరిదగ్గర ఉన్నాయో ఆయనకే తెలియనంత చిక్కిరిబిక్కిరి అయిపోయింది. తరువాత్తరువాత ఫారి కుమారుడు పావని శాస్త్రి గారు ఈ చిక్కుముళ్ళు అన్ని విప్పి, విశ్వనాథ రచనా సాగరం ప్రచురించేవరకూ, విశ్వనాథ వారి గురించి మునుపు తెలిసిన వాళ్ళు చదివగలిగారు కాని, కొత్త తరానికి తెలియదు. విచిత్రం ఏమంటే ఎవరైతే విశ్వనాథ రచనలను దుమ్మెత్తిపోశారో వారి ఇజాలు ఇప్పుడు మరుగున పడిపోయి, ఇప్పటివారు విశ్వనాథ రచనలను “రి-డిస్కవర్” చేసి చదవటం ఎంతైనా ఆనందాన్నిచ్చే సాహిత్య పరిణామం.


 3. pavan santhosh surampudi

  మేటి ఆటగాడి చదరంగపు టెత్తుల్లాంటి ఎత్తుగడలు, అపారమైన లోకఙ్ఞత నిండిన అపురూపమైన పరిశీలనలు, మధ్యలో అద్భుతమైన పదచిత్రాలు, సన్నివేశ వైచిత్రి ఇలా ఎన్నో అపారమైన నిధులున్న విశ్వనాథ సాహితిని కేవలం ఆ వస్తువులు తమకు పడవేమోనన్న భావంతో పక్కన పెట్టినవారిని చూస్తే జాలేస్తుంది.
  ఒక గొప్ప బహుభాషా పండితుడు, కరాటే కిరీటి, అధ్యయన పరుడు, సంపాదకులు, చారిత్రిక రచయిత, కవి ఐన ఓ ఆంగ్లాధ్యాపకులున్నారు. ఆయన బైబిల్ గురించి మాట్లాడుతూ,”ఐ రీడ్ బైబిల్ ఫొర్ ఇట్స్ లిరికల్ బ్యూటీ అండ్ నాట్ ఫర్ రిలిజియన్. బికాజ్ ఐ హావ్ ఎనఫ్ ఆఫ్ రిలిజియస్ థాట్ ఇన్ అవర్ లిటరేచర్ అండ్ దే ఆర్ మోర్ రిలవెంట్ టూ మీ దాన్ బైబిల్” అంటూంటారు. కనీసం అలా చదవడానికీ తగడా విశ్వనాథ వీళ్ల లెక్కల్లో అనిపిస్తూంటుంది అప్పుడప్పుడూ.


 4. mythili abbaraju

  ఆముష్మికం గురించి విశ్వనాథ చెప్పినట్లు ఆయన మాత్రమే చెప్పగలరేమో. ఆ వాక్యాలను మీరు ప్రస్తావించిన తీరు చాలా బావుంది. లాభాపేక్ష ని అదుపులో పెట్టటానికొకవైపు, మనసు ని ఉత్థానంవైపుకి మరల్చేందుకు మరొకవైపు ఆ మాటలు మళ్లీ మళ్లీ చదువుకోవలసినవి. ఆయన నవలలు చదవటం ఇప్పటి సాహితీ అవసరాలలో అతి ప్రధానమైనది . మీ వంటి తరుణవయస్కులు ఇలాగ రాస్తూ ఉండటం తలచుకున్న కొద్దీ మురిపెంగా ఉంది. మనః పూర్వకమైన ఆశీస్సులు !


 5. Ananya K

  మీ సమీక్ష చదివాక వెంటనే నవల చదవాలనిపించింది. ముగింపు పేరాలో ప్రతీ వాక్యం అక్షర సత్యం. అభినందనలు.


 6. బాగా వ్రాశారు.విశ్వనాథవారితో అనేకవిషయాల్లో మనం ఏకీభవించలేము.కాని ఆయన మేధాశక్తి అమోఘం.ఆయన వ్రాసింది అర్థం చేసుకోడం కష్టం.నవల,కవిత్వం రెండిట్లోను ఆయనకు విశిష్ట స్థానం ఉంది.


  • SIVARAMAPRASAD KAPPAGANTU

   ఒక చోట “…ఆయన వ్రాసింది అర్థం చేసుకోడం కష్టం….”, మరొక చోట “…విశ్వనాథవారితో అనేకవిషయాల్లో మనం ఏకీభవించలేము…”

   రమణారావు గారూ, మనం అర్ధం చేసుకోలేని విషయాలతో మన ఏకీభవించటం, విబేధించటం అనేది సాధ్యమా.


 7. ధీర

  చాలా బాగా వ్రాశారు. నేను పుస్తకం చదవలేదు. మీ సమీక్ష చదవగానే పుస్తకం తీసి పెట్టుకున్నా. ఇప్పుడు చదివేస్తా. ఆ “ఇష్టం ధర్మం” గురించి చెప్పినది నిజంగా చాలా బావుంది. ఇక నాస్తికత్వానికి, భావనా శక్తి కీ వున్న లంకె.. ఈ విషయం నేనే కనిపెట్టాననీ, నేనే చెప్తూ ఉంటానేమోననీ అనుకున్నానిన్నాళ్ళు. విశ్వనాథ ఎప్పుడో చెప్పారనమాట! 🙂 తెలీదు నాకు. బావుంది. 🙂


 8. >నాకు కేవలం నవలా రచయితగా మాత్రమే తెలుసును కనుక అంత వరకే మాట్లాడుతున్నాను

  “నిజానికి నేను ‘వేయిపడగలు’, ‘మా బాబు’, ‘చెలియలికట్ట’, ‘ఏకవీర’ వ్రాసి నవలాకారుణ్ణి అయినాను. తత్పూర్వం నేను అచ్చంగా కవిని. ఇప్పుడు చాలామంది ‘ఆయన నవలాకారుడే కాని కవి కాదు’ అనేవా రున్నారు. ఇందులో భిన్నాభిప్రాయా లున్నాయి. తత్పూర్వం నేను వ్రాసిన కవిత్వం వారికి తెలియక పోవచ్చు. నేను వ్రాసిన కవిత్వం కవిత్వం కాదని కూడా అనుకోవచ్చు.”
  1947-1972 : నేనూ – నా సాహిత్య రచనలు : శ్రీ విశ్వనాథ సత్యనారాయణ


 9. D. Venu Gopal

  నేను కూడా విశ్వనాథ వారి పుస్తకాలు చాలా చదివాను.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

Ngũgĩ wa Thiong’o’s “Education for a national culture”

Article By: Halley ఈ పరిచయం ప్రసిద్ధ ఆఫ్రికా రచయిత గూగి (Ngũgĩ wa Thiong’o) రాసిన Education for a national culture అన్న వ్యాసం ...
by అతిథి
3

 
 

రాళ్ళపల్లి సాహిత్య సంగీత వ్యాసాలు

వ్యాసకర్త: Halley ******************* ఈ పరిచయ వ్యాసం ఎమెస్కో వారు ప్రచురించిన “రాళ్ళపల్లి సాహిత్య సం...
by అతిథి
2

 
 

విశ్వనాథునకు వివిధ కవి నాథుల పద్య నివాళి

వ్యాసకర్తలు: రవి భూషణ్ శర్మ కొండూరు, ఇందు కిరణ్ కొండూరు ****************** ముందు మాట ఈ నెల (అక్టోబ...
by అతిథి
0

 

 

శతపత్రము – గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ

వ్యాసకర్త: Halley *************** ఈ వ్యాసం గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ “శతపత్రం” గురించి. ...
by అతిథి
4

 
 

Douglas M Knight Jr’s “Balasaraswathi: Her art and life”

వ్యాసకర్త: Halley ************* ఈ పరిచయం ‘డగ్లస్ ఎం నైట్ Jr’ రాసిన “బాలసరస్వతి: హర్ ఆర్ట్ అండ్ ల...
by అతిథి
0

 
 

విశ్వనాథ చిన్న కథలు

విశ్వనాథ గారివి ఇదివరలో నవలలు కొన్ని, ఆత్మకథాత్మక వ్యాసాలు/ఇంటర్వ్యూలు చదివాను కాన...
by సౌమ్య
1