కాళికాంబా సప్తశతి

వ్యాసకర్త: కాదంబరి
***********
“ముడుమాల” ఒక మారుమూల పల్లెటూరు. ఐతే ఆ చిన్ని కుగ్రామం గొప్ప అదృష్టం చేసుకున్నదనే చెప్పాలి. ముడుమాలలో ఉన్నది “సిద్ధప్ప మఠము”. ముడుమాల లో అపూర్వ తాళపత్ర గ్రంథములు కొన్ని ఉన్నవి. “కాళికాంబా సప్తశతి” అట్టి మహత్తర గ్రంథము.

కడప జిల్లాలోని కందిమల్లయ్యపల్లె- ఈ పేరు చెవినబడగానే స్ఫురణకు వచ్చే పేరు “జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి”. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారికి – సిద్ధప్ప అనే భక్తుడు శిష్యుడై తరించిన చోటు “కందిమల్లయ్యపల్లె”.

***************************,
“కాలజ్ఞానము” గురించి ఆంధ్రదేశములోని ఆబాలగోపాలమునకూ తెలుసును అంటే అతిశయోక్తి కాదు. పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి తత్వములు, గేయభణితి- ప్రజల నాలుకలపై ఆడుతూండేవి. “పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి” తత్వములను ఆశువులుగా చెప్పిన నుడువులు జనుల డెందములను భిత్తికలుగా చేసుకున్నవి. భవిష్యత్ కాలమున ఈ ప్రపంచ వేదికలో రాబోతూన్న అనేక మార్పులను గూర్చి వాక్రుచ్చిన దీర్ఘ దర్శి ఆయన.
*******************,

చరిత్రలో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాలజ్ఞానము రచయితగా ప్రసిద్ధి కెక్కారు. ఐతే వీరబ్రహ్మేంద్ర స్వామి విరచిత గ్రంథము ఇంకొకటి సైతం ఉన్నది. “కాళికాంబా సప్తశతి” అనే పద్యసంపుటి- జగద్గురు శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఘంటము నుండి విస్తృతమై ఉన్నది. 700 చిట్టి పద్దెముల పొత్తము – అని పేరును బట్టే బోధ పడ్తూన్నది. సి.పి. బ్రౌన్ గారు పూనిక చేతనే ఈ కాలజ్ఞానము భద్రపరచబడి, ఈ నాటికి మనకు లభించినవి.

***************************,
“కాళికాంబాసప్తశతి” లో అనేక అంశాలు అనుకోకుండ పరిశీలనలోనికి వస్తూ ఉన్నవి. జగద్గురు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, వేమన- సమకాలీనులే! అందుచేతనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు – వేమనను గూర్చి, తన పద్యాల్లో తలిచి, మెచ్చుకున్నారు కూడా;

“వేదవిద్యలెల్ల బాధాకరమ్ములు;
ఎంగిలింత మ్రింగ హేమమాయె;
హేమమైన బ్రహ్మ వేమన్న ఒక్కడే!…………. .” {59}

ఈ రీతిలో బ్రహ్మం గారు రచనాపరంగా ఎలాంటి భేషజాలు లేని నిగర్వి- అనే విశేషం పాఠకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది.
*******************,

ఇద్దరు కవులకు ; సంఘ సంస్కరణ ముఖ్య గమ్యం. ప్రాథమికముగా వీరు ఇరువురూ మూఢాచారములను నిరసించినారు. తమ నిరసనలను తెలిపే వారధికి వలె -వాక్కు లనూ, పద్యరచనలనూ ఉపయోగించారు. వేమనకు వలెనే “ఆటవెలది” ఛందస్సులో రచన చేసారు. ఇద్దరూ “అచలయోగులు, స్వరయోగులు”. వేమన మూఢాచారాల్ని తీవ్రంగా దూషించాడు. జగద్గురు శ్రీశ్రీశ్రీ శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి కూడా అంతే, కానీ, ఆయన తత్వములను బోధించే ‘యోగిపుంగవుని’గా ప్రసిద్ధికెక్కాడు.

*******************,

జ్ఞాన నేత్రమునకు యోగశాస్త్రములో అగ్రస్థానం ఉన్నది. ఇడ, పింగళ, సుషుమ్న – అనే మూడు నాడులు ప్రథమ గణ్యాలైనవి. ఆ త్రయాన – భ్రుకుటీ స్థానం
(ఫాలము, కనుబొమ్మల నడుమ, అనగా బొట్టు పెట్టుకునే ప్రాంతాన ఆజ్ఞాచక్రము ఉన్నది. ఆజ్ఞాచక్రము తెరుచుకుంటే అపారమైన కాంతి, తేజో పారావారము గోచరము ఔతుంది.

“మూర్తి రూపురేఖ భ్రూమధ్యమున నిల్ప;
దివ్యమైన వెలుగు తేజరిల్లు;
మూర్తి లేని రాయి ముఖ్యమ్ము గాబోదు
కాళికాంబ! హంస! కాళికాంబ!” {77}

కొన్ని చోట్ల వేమనకూ, బ్రహ్మం గారికీ కొన్ని కొన్ని భావాలలో విభిన్నత కనిపిస్తుంది.

*******************

యోగము, ప్రాణాయామము, నిష్ఠ, క్రమశిక్షణలలో గొప్ప పట్టు కలిగిన సాధువు వీరబ్రహ్మేంద్ర స్వామి.
“కాళికాంబా సప్తశతి” లో ఉపబలకములు ఐన నుడువులు అగుపిస్తూన్నవి.
“కండ, కుండలించి; కుండలి నాడించి; జమిలి మోత నాగసరము నూద ..”
“దృష్టి మధ్యమందు; దేవుడెప్పుడు నుండు; కష్టమేమి లేక కాంచ వచ్చు ;తుష్టి గూర్చి గురుడు తోవలు చూపించు: కాళికాంబ! హంస! కాళికాంబ!”

*******************,
“రాజయోగము” అనే సిద్ధాంతము (మౌంట్ ఆబూ) ఆ నాటికే నాటుకున్నదని 361 పద్యమువలన తెలుస్తున్నది.

“సాంఖ్యయోగములను సాధింపవచ్చును:
బ్రహ్మపదము చేరవచ్చు దాన:
రాజయోగులకును రాచబాటది కదా!
కాళికాంబ! హంస! కాళికాంబ!” {361}

“నాద,బిందు,కళల నయముగ గుర్తించి;
వాద భేదములను వంచి గురుడు;
సమయజేయు దేహ సందేహ దాహమ్ము
కాళికాంబ! హంస! కాళికాంబ!” (91)

“తన్ను తా గ్రహింప తారకయోగమౌ:
రాయి కొయ్య గొలువ- రాదు ముక్తి; …
కాళికాంబ! హంస! కాళికాంబ!” (112)

*******************
“భారతీయుడు” – పద ప్రయోగము:-

“భారతీయుడు” అనే పదవ్యుత్పత్తి ఏనాటి నుంచి ప్రయోగములో ఉన్నదో – అనే అంశముపై- భాషా, చారిత్రకుల మీమాంసలు ఉన్నవి. 298 లో ఈ పదప్రయోగం ఉంది.

“మంత్ర తంత్ర యంత్ర మాహాత్మ్య గాథలు:
భారతీయులకును- భారమాయె: …”

ప్రపంచములోని ఇతర మతాలలోనూ, ఇతర సంఘాలలోనూ – ఇన్ని కట్టుబాట్లూ- మూఢనమ్మకములూ- తద్వారా ఏర్పడిన- మనకు గోచరించుట లేదు. అలాటి ఆచారములు, సాధారణప్రజల నిత్యజీవన వ్యవహారములకు పెను అడ్డంకిలు ఐనవనీ-అలాటి విపరిణామాలను గుర్తించిన మహనీయుడు పోతులూరి. ఈ పైన ఉదహరించిన పద్యంతో పాటు అనేక సోదాహరణములు ఉన్నవి.

“మంత్ర తంత్ర యంత్ర మాహాత్మ్య గాథలు:
భారతీయులకును భారమాయె: …”
జనులపాలికివియె శాపనార్థము లాయె:
కాళికాంబ! హంస! కాళికాంబ!”

“తెట్ట గట్ట బూది, తిరుమణి, తిరుచూర్ణ;
ములు మొగాన బూయ ముక్తి రాదు;
చిత్తశుద్ధి లేని చేష్టలు దుష్టాలు;
కాళికాంబ! హంస! కాళికాంబ!” (309)

“తళుకుబెళుకు వస్త్రములు దాల్చువారలు;
వ్రేళ్ళ నుంగరములు పెట్టువారు;
వాని విలువ తప్ప వారికి వెల లేదు……” (364)

*******************,
జగద్గురువు “యోగశాస్త్రము, ప్రాణాయామము, తపస్సు” లను అభిమానించి, సాధన చేసి వానిలో ప్రావీణ్యతలను సాధించారు. బ్రహ్మము, తేజస్సు, నాడులు, ఇత్యాది పదాలను అలవోకగా వాడగలిగారు.

“మేళమెంతొ చేసి మెప్పులు గనెనయా:
మేళజతలు పదియు మెఱపు నొకటి;
పదిని మించి ఎంచ బ్రహ్మంబు లేదయా ….. ” (421)

“ఎట్లు నిస్సరణమొ? (=ముక్తి)
ఏమొకొ మహిమమ్ము? :
శివుని మాయ యేమొ? చెప్పరాదు:
అనుచు బ్రహ్మవిదులు కనుగొనిరా జ్యోతి ……” (428)

“అడవిలోన గురుడు పడి యాకటం బడి;
అడవి నెల్ల తినెదమంచు జూడ;
పరికెలోన గచ్చపొదలు బలిసియున్నవి కదా! ……” (436)

{పరికె= నాలుగు రోడ్ల కూడలి/ జంక్షన్/ శృంగాటకము}

“కిటికి నుండి సూర్యకిరణమ్ము గను రీతి;
ఆత్మలోన మోక్ష మరయవలయు:
ఆత్మ యనెడి కిటికి కవి యెన్ని మూతలో
కాళికాంబ! హంస! కాళికాంబ!” (441)

********************,

మున్ముందు తాను రాసే “కాలజ్ఞానము” నకు పునాదులు ఐన తేట తేట ఆశు కవితలు ఇక్కడు గోచరిస్తున్నవి.

“ఆకసమ్ము పైన అంత శూన్యమ్మని;
పలుకు నరులకెల్ల బ్రహ్మ సాక్షి;
పిండమండమైన పృధివి బ్రహ్మాండమౌ; ………” (586);

*******************,
పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి సమాజపరముగా ఆటుపోట్లు, మిట్ట పల్లాలు చూసారు, కాళికాంబాసప్తశతి లో వానిని చిత్రించారు.

“సెలవొసంగు టెట్టు లిల దేవుడైనాడు;
సుకృతకర్మతోడ జూచె నన్ను;
అజ్ఞతయును దీఱె నలజడులును మాఱె; …………..” (593) అన్నారు.

“నాల్గుజాతులకును నాగేటి మొనలోన;
ప్రాణమున్నదంచు పలికినారు;
ఇలను దున్నువారు బలభద్రులగుదురు” (622)

“ఉపనిషత్తులందు నుపదేశికులయందు;
శ్రుతులయందు శ్రద్ధ చూపవలయు;
శ్రద్ధ లేక ముక్తి సాధింప శక్యమా?” (649)

“పుస్తకములు చదువ పూర్ణత్వమబ్బదు;
హృదయసంపుటముల చదువవలయు;
పారిశుధ్యమొకటె పరమాత్మ చేర్చును ………..” (658)

*******************,

“కన్నులకును పొరలు కడకు వీడితె కదా:
జ్ఞానమనెడి జ్యోతి కానవచ్చు:
కన్నులకును మాయ మబ్బు (=చీకటి)న వేసె; ……” (461)

“మనసు బుద్ధులకును మరసీల గొన్నట్లు;
గురుని పాదచింత గూడదాయె;
ఎఱుకయనెడి సుత్తె నెగురగొట్టగవలె; ……… “(416)

“గళమునందు నిలువ గాయత్రి మంత్రంబు;
బడవ మాంత్రికులతొ గొడవ యేల?;
సూత్రధారి ముక్తి చూపగా నోపడు;
కాళికాంబ! హంస! కాళికాంబ!” (493)

****************************

“మంత్రతంత్రములకు మాతృకామూర్తివి:
పదములకును జ్ఞాన పథము నీవు;
శూన్యజాలమునకు శూన్యసాక్షిణి నీవు:
కాళికాంబ! హంస! కాళికాంబ!” (506)

“సర్వశుభము లీయ శాంకరి వౌదువు;
భవ్యవాక్కులీయ వాణివీవ;
కోరుకుల నొసంగు నారాయణి నీవ:
కాళికాంబ! హంస! కాళికాంబ!” (513)

“ఈశు జూచి కూడ నిది’నిబద్దనలేరు (=నిజము);
వాసి లేని యొడలు పాసిపోయె;
మోసపోయి నరులు మూర్ఖులైపోయిరి;
కాళికాంబ! హంస! కాళికాంబ!” (562)

“మేకలెల్ల గూడి యాకు మేసెడి తావు;
తోకచాలు, పిల్లమేక వచ్చు;
అట్టి తీరు భక్తులా హరి వెనకుంద్రు; ….” (578)

“ఆకసమ్ము పైన అంత శూన్యమ్మని;
పలుకు నరులకెల్ల బ్రహ్మ సాక్షి;
పిండమండమైన పృధివి బ్రహ్మాండమౌ;
కాళికాంబ! హంస! కాళికాంబ!” (586)

*********************************,

“కన్యాశుల్కం” లాంటి ఆధునిక రచనలలోనూ, 19- వ శతాబ్దము తర్వాత సామాజిక వాడుకలో ఉన్న పదాలు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వ్రాతలలో కనిపిస్తూన్నవి. “కులము గోత్రమంచు కూసెడి మలపల్ని….”; నాలిముచ్చుల్ని, పోకిరిసన్నాసులు; దగుల్బాజీ వాళ్ళ పోకడలను ఏకిపెట్టాడు.

“మతము మత్తుమందు గూర్చు మార్గమ్ము కారాదు…… “- (694 ప||) అని ఎలుగెత్తి ఘోషించాడు.

*******************,
కడప మాండలికములు:-

కడప మాండలికములు:- విరివిగా స్వామి ఘంటము నుండి ముగ్గులో చుక్కల లాగా చమక్ మంటూ తారసిల్లుతూన్నవి.

కిటికి; {పరికె= నాలుగు రోడ్ల కూడలి/ జంక్షన్/ శృంగాటకము;
మరసీల; గడె, సంతకాయ, గడె= గడియ; తొఱ్ఱి;తుఱగలి= వెలుతురు;హుకుము (=హుకుం);

************************************;

700 ఆటవెలదులు మణులై ఉన్న ఈ అమూల్య పుస్తకము పునర్ముద్రణలు వెలువడినవి.

“కాళికాంబా సప్తశతి”
పేజీలు 176
వెల: రు. 20-00
సర్వస్వామ్యాలు శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠమునకు చెందినవి.

ప్రతులకు:
మేనేజరు,
శ్రీవీరబ్రహ్మేంద్రస్వాములవారి మఠం,
కంది మల్లయ్య పల్లె,
కడప జిల్లా – 516503 ఆంధ్రప్రదేశ్

You Might Also Like

10 Comments

  1. Dheeraj

    Website address Brahmam Gari Matam: http://www.svbmattam.org/info.html; Contact No: 9398605365, 08569 286023
    Please contact them for Books.

  2. Gadiyaram Nagaraju

    నాకు ఈ గ్రంధము కావాలి. ఇందుకోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వుంటే ఇవ్వగలరు. నా ఫోన్ నెంబర్ 9248085798. మరియు మెయిల్ nagarajuvnc@gmail.com

  3. వి.మధుసూదనాచారి

    కాళికాంబా సప్తశతి చాలపవిత్రం ఎక్కడ దొరుకుతుందో తెలుపగలరు

    1. వంగళ పోతులూరయ్యచారి

      శ్రీ బ్రహ్మంగారు రాసిన పుస్తకాలు మరియు విశ్వబ్రాహ్మణ సాహిత్యంపై రాసిన పుస్తకాల price list ఉంటే పంపించగలరు . మీరు పంపించే విధానం కూడా తెలుపగలరు

  4. Saikumar

    How to buy this book

    1. తోనంగి జోగారావు ఆచారి,

      కాళి కాంబ సప్తశతి పుస్తకం ఏవిధంగా మేము కొనుగోలు చేయగలమో దయతో తెలియజేయగలరు.ఈ మెయిల్కి సమాచారం పంపగలరని మనవి.

  5. Gopichand

    Sir e book ekkada dorukutundo.telapagalaru

  6. Vootukuri Pandu Rangadu

    ఈ పుస్తకము చాల బాగున్నది , ఈ పుస్తకములోని పద్యాలకు తాత్పర్యము కూడా వుంటే జనులు జపించుటకు చాలా బాగుంటది. కొన్ని పద్యాలు చదివే వారికీ అర్థము కావు , కనుక దయచేసి తాత్పర్యములు గల పుస్తకము వుంటే దయచేసి మా మెయిల్ కు మెయిల్ ఇవ్వండి. లేదా మా అడ్రస్ కి ఒక పుస్తకము పోస్ట్ ద్వార పంపండి.

    1. Gopichand

      9 1 7 7 9 0 4 1 1 8.

      Sir idhi naa what’s app no dayachesi e pustakam pdf unte pampa galaru e pustakam gurinchi yeppatinundo chustunnanu visalandra vijayawada book store lo kuda adiganu akkada kuda dorakaledu

  7. sarma p.

    good information!

Leave a Reply