Brave New World

వ్యాసకర్త: కోడూరి గోపాలకృష్ణ
*********
ఒకానొక సాయంత్రం పూట పీఎచ్‌డీ చేయడానికి వచ్చిన మన దేశం వాళ్ళంతా ఒకచోట చేరి మాట్లాడుకునేప్పుడు, “ప్రతి ఒక్కరికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు కావాలి” అంటూ వెళ్ళబెట్టిన చర్చలో, “అసలు నిజానికి మనం స్వేచ్ఛగా తీస్కుంటున్నాం అనుకునే నిర్ణయాల్లో ఉండే స్వేచ్ఛ ఏ మేరకు నిజమైన స్వేచ్ఛ?” అన్న ప్రశ్న వచ్చింది. దానిమీద కొంత చర్చ జరిగాక “పూర్తి స్వేచ్ఛ అనేది ఒక భ్రమ” అంటూ విరమించాం. ఉదాహరణకి, ఏ కులంలో పుడితే ఆ కులంలోనే పెళ్ళి చేస్కోవాలని వాదించేవాళ్ళనే తీస్కుందాం. ఆ ఆచారానికి వాళ్ళు చూపించే నిబద్దతలో ఎంతవరకు వాళ్ళ సొంత ఆలోచన ఉందో, ఎంతవరకు condition అయ్యుండబట్టి అలా ప్రవర్తిస్తున్నారో ఆలోచిస్తే ఈ విషయం అవగతమవుతుంది. ఈ వాదన తర్వాత కొన్ని నెలలకి ‘Brave new world’ అనే ఈ పుస్తకం చదవడం జరిగింది. మా చర్చని ఒక కథ రూపంలో బలంగా వ్యక్తీకరించగలిగితే ఇంచుమించుగా ఇలాగే ఉంటుందేమో అనిపించింది. ఈ పుస్తకం పరిధి ఇంకా పెద్దది, చదివాక మిగిలే ప్రశ్నలు కూడా ఎన్నో.

రెండో ప్రపంచయుద్దం వెనువెంటనే రాయబడిన పుస్తకమిది. ఎటువంటి గొడవలూ లేకుండా సంతోషంగా బ్రతకడానికీ, కష్టాలని భరిస్తూ పూర్తి స్వేచ్ఛతో బ్రతకడానికీ మధ్య ప్రపంచం నలిగి నలిగి, చివరికి ఒకానొక దారిన పడుతుంది. ఆ భవిష్యత్తు ప్రపంచం మొత్తం చాలా కొద్ది మంది నియంత్రకుల (controllers) కనుసన్నల్లో నడుస్తుండడాన్ని కళ్ళకి కట్టినట్టు చెప్తూ కథ మొదలుపెడతాడు రచయిత. ఆ నియంత్రకులు, ఇదివరకటి నియంతల్లా (dictators) బలం-బలగాలతో పీడనే పరమావధిగా ప్రజల్ని పాలించడం కాకుండా, మరో దారి కనుగొన్నారు. దానికి పునాది మనుషుల మధ్య ఘర్షణలకి ముఖ్య కారణాలైన ప్రేమ, ఈర్ష్య, అసూయలను అరికట్టడం. దీనికి గాను పెను మార్పులతో సరికొత్త సంఘాన్ని నిర్మిస్తారు. ఉదాహరణకి, ఆడ-మగల ఆకర్షణ సర్వ సాధారణంగా పరిగణిస్తూ, ‘ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరికి సొంతం’ అనే నినాదంతో, పెళ్ళి-దాని అనుబంధ బంధాల్ని పూర్తిగా నిర్మూలించి, ప్రేమ అనే భావన పరమ హాస్యాస్పదంగా తోచేటట్టు చేస్తారు. దీనివల్ల మోహం వల్ల కలిగే విరహం, తాపం, అసూయ వంటి బాధాకరమైన భావనలు కలగడానికి అవకాశమే లేక, జనం సంతోషంగా ఉంటారు. ఇంకో ఉదాహరణ: పిల్లల్ని కంటే వాళ్ళ మీద మమకారం ఏర్పడి తద్వారా మరిన్ని సమస్యలొస్తాయని దాన్ని కూడా పూర్తిగా అరికట్టడానికి, అసలు ప్రకృతిసిద్దంగా పిల్లల్ని కనడం, వారిని సాకడం అత్యంత వికృత చేష్టలుగా, అనాగరిక చర్యలుగా అందరూ బావించేలా జాగ్రత్తపడతారు. పిల్లలందరూ టెస్ట్‌ట్యూబుల్లోనే పెరగుతారు. వాళ్ళు తయారయ్యేసరికి వాళ్ళు ఏ కులం వారో (అంటే ఏం పని చేస్తారో) నిర్ణయించబడి ఉంటుంది. ఏ కులానికి ఆ కులంవారు వారి వారి పనులు తక్కువ/ఎక్కువ/ఏహ్య భావనలు లేకుండా/ఉండేలా చేయడానికి తగిన conditioning పిండరూపంలో ఉండగానే ఇస్తారు. పుట్టాక కూడా కొన్నాళ్ళపాటు ఇలాంటి subconscious conditioning జరుగుతుంది. ఈ నూతన ప్రపంచానికి దూరంగా ఇంకో ‘అనాగరిక’ సమాజం ఉంటుంది. ఆ సమాజం నుంచి యాదృచ్ఛికంగా వచ్చిన ఒక మనిషి ఈ కొత్త సమాజాన్ని ఎలా పరిగణిస్తాడన్నదే మిగతా కథ. చివర్లో ఒక నియంత్రకుడికి, ఈ మనిషికి మధ్య జరిగిన సంభాషణ సంప్రదాయాలు, ఆచారాల పేరులో మనం సాగిస్తున్న ఎన్నో నడవడికలపై ప్రశ్నలు లేవదీస్తుంది.

తప్పకుండా చదవాల్సిన పుస్తకం!

పుస్తకం వివరాలు:
శీర్షిక: Brave new world
రచయిత: Aldous Huxley
goodreads.com page

You Might Also Like

Leave a Reply