ఆరుద్ర గారి అపురూపమైన నవల “ఆడదాని భార్య”

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు
**************
మహాకవి ఆరుద్ర సినిమా రంగప్రవేశం చేసి డిటెక్టివు కథారచన పట్ల ఆసక్తి చూపిన పందొమ్మిదివందల యాభై దశకం నాటికే తెలుగు అపరాధ పరిశోధక నవలల రాజధాని వేంకట పార్వతీశ్వర కవుల పిఠాపురం నుంచి టెంపోరావ్, కొమ్మూరి సాంబశివరావు గారల చెన్నపట్నానికి తరలివచ్చింది. అప్పటికే ఇంగ్లీషు, బెంగాలీ, రష్యన్ భాషల గ్రంథానువాదయుగం ముగిసి పూర్తిగా స్వతంత్రస్థాయిలో రచనలు వెలువడటం మొదలయింది. తొలినాటి రచనలలో లాగా గరళగ్రాంథికంలో రాయటం మాని రచయితలు సరళమైన వ్యావహారికాన్ని అభిమానింపసాగారు. క్రౌను కంటె చిన్నగా చేతికి అనువైన పోట్ ఆక్టెవో పాకెట్ బుక్ సైజులో న్యూసుప్రింటు కాగితం మీద జైహింద్ వారి స్పష్టమైన 10 పాయింటు, 12 పాయింటు ఇంగ్లీషు బాడీ ఫాంటులో 22 పాయింటు గ్రేట్ ప్రైమర్ శీర్షికలతో, త్రివర్ణ ముఖచిత్రంతో అందంగా అచ్చయి అందుబాటులోకి వచ్చిన ఆ నవలల కేర్పడిన ప్రచారం ఆ రోజుల్లో అంతా ఇంతా కాదు. అందులో కొన్ని అంచులకు ఎర్రరంగు అద్ది, చూడగానే ఇది అపరాధ పరిశోధక నవల అని గుర్తుపట్టడానికి వీలుగా ఉండేవి. ఆంధ్రాంగ్లాలలో నిష్ణాతులై అప్పటికే సృజనరంగంలో పదిలమైన స్థానాన్ని సంపాదించుకొన్న కొవ్వలి లక్ష్మీనరసింహారావు, టెంపోరావ్, వై.వి. రావు, కొమ్మూరి సాంబశివరావు, కనకమేడల వెంకటేశ్వరరావు, విశ్వప్రసాద్, శ్రీభగవాన్, విజయా బాపినీడు, కొమ్మిరెడ్డి వంటి రచయితలు పుంఖానుపుంఖంగా రచిస్తున్న రోజులలోనే రచయితలుగా చెప్పుకోదగిన ప్రసిద్ధికి రాని వి.ఎస్. అవధాని ‘ఇంటిదొంగ’, ‘సినిమారంగం’ పత్రిక ఉపసంపాదకులు గడియారం వెంకట గోపాలకృష్ణ (జి.వి.జి) గారి ‘తేనెపూసిన కత్తి’, ‘ముగ్గురు కుంటివాళ్ళు’, ఉషాకిరణ్ ‘దేవతా? దెయ్యమా?’, డి. మనోహరి ‘లేడీ కిల్లర్’, నరేంద్ర ‘మొండిచెయ్యి’, కృష్ణమోహన్ ‘నలిగిన నల్లగులాబి’, డాక్టర్ మల్లికార్జునరావు ‘శవం రాసిన వుత్తరం’, గుత్తా బాపినీడు ‘చంపు చూద్దాం’, తారా రామమూర్తి ‘పెళ్ళిరోజు ప్రమాదం’, ముక్కామల ‘జేబుదొంగ జగ్గూ’ వంటి నవలలన్నీ మూడేసి నాలుగేసి పునర్ముద్రణలకు కూడా నోచుకొన్నాయి.

కొమ్మూరి నవలల సంగతి చెప్పనక్కరలేదు. ఆయన ‘ఆధునిక గ్రంథమాల’ను స్థాపించి అచ్చువేసిన డిటెక్టివు నవలలు ఆంగ్ల విద్యాధికుల ఇండ్లలో సైతం గౌరవార్హమైన చోట పుస్తకాల బీరువాలలో దర్శనమిచ్చేవి. వై.వి. రావు గారి ‘డిటెక్టివ్’ మాసపత్రిక, చక్రపాణి గారి ప్రోద్బలంతో వెలువడిన ‘ఆంధ్రజ్యోతి’, ’యువ’ పత్రికల మూలాన పాంచకడీదేవు, రమేశ చంద్ర దత్తు, నీహార రంజన్ గుప్తా తెలుగిళ్ళలోకి చొచ్చుకొని వచ్చారు. ఆ ప్రాచుర్యానికి ప్రాతిపదికగా చందమామ పబ్లికేషన్స్ వారు ‘నేరపరిశోధన’ సంపుటాలను వెలువరించారు. కొమ్మూరి సాంబశివరావు గారి ‘మంజూష’ పత్రికలో ఆయన కథలే గాక సుప్రసిద్ధ భాషాంతర రచనల అనువాదాలు, ధారావాహికాలు, ఆరుద్ర వంటి ప్రఖ్యాతకవుల రచనలు కూడా వెలువడుతుండేవి. ఆర్థర్ కానన్ డయల్ సృష్టించిన షెర్లాక్ హోమ్సు, ఎర్ల్ స్టాన్లీ గార్డ్నర్ కల్పించిన లాయర్ పెర్రీ మేసన్ పాత్రలకు దీటుగా పాంచకడీదేవు ప్రచారంలోకి తెచ్చిన డిటెక్టివు అరిందముడు, నీహార్ రంజన్ గుప్తా సృష్టించిన డిటెక్టివు కిరీటి రాయ్ ల లాగానే టెంపోరావ్ గారి డిటెక్టివు పరశురామ్, కొమ్మూరి సాంబశివరావు గారి డిటెక్టివు యుగంధర్, అసిస్టెంటు రాజు, అప్పుడప్పుడు అసిస్టెంటు కాత్యా, ఇన్‌స్పెక్టరు స్వరాజ్యరావు ఆంధ్రుల అభిమానపాత్ర లయ్యారు. ఉషాకిరణ్ రచనల్లో డిటెక్టివు సుధాకర్, భార్య సుధ; విశ్వప్రసాద్ డిటెక్టివు భగవాన్ (కథలలో “భగవాన్ గారు” అని వ్యవహరించేవారు); ఆదనేని ఈశ్వర్ డిటెక్టివు సవ్యసాచి; మనోహరి డిటెక్టివు రవీంద్రుడు; గిరిజశ్రీ భగవాన్ డిటెక్టివు నర్సన్, అసిస్టెంటు కృపాల్, చక్రధర్ డిటెక్టివు శోభన్ తెలుగిళ్ళలోని ఆత్మీయవ్యక్తులైన రోజులవి. కొడవటిగంటి కుటుంబరావు ‘కెయాస్ ఆనంద్ కథలు” చెప్పుకోదగినవి. కనకమేడల వెంకటేశ్వరరావు వంటి విద్వాంసుడు, సత్కవి పద్యరచన మానివేసి, సినిమాలలోకి దిగి హీరో కాంతారావు గారితో “విజయ ఢంకా” అని విడుదలకు నోచుకోని విఫలచిత్రాన్ని తీసి చేతులు కాల్చుకొని, సొంతంగా ఇంటి వెనకే చిన్ని ట్డ్రెడిల్ ప్రెస్సును పెట్టుకొని డిటెక్టివు కిషోర్ నాయకుడుగా ‘ఒంటికంటి రహస్యం’, ‘మోసగించిన వీలునామా’ వంటి నవలలను రాసి, మళ్ళీ నిలదొక్కుకోగలిగారు. పాలగుమ్మి పద్మరాజు ‘చచ్చి సాధించేడు’ కూడా అప్పట్లో పేరెన్నిక గన్న అపరాధ పరిశోధక నవల. టెంపోరావ్ గారు ‘టెంపో’ అని ఇంగ్లీషు పత్రికను స్థాపించి డిటెక్టివు వాలి, అసిస్టెంటు గిరి పాత్రలను ప్రకల్పించి తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ కూడా ఆ నవలలను ప్రకటించేవారు. వాటి ప్రాచుర్యాన్ని, ఆ రచయితలకు సమాజంలో ఏర్పడిన గౌరవాన్ని ఈ రోజు ఊహించటం కూడా సాధ్యం కాదు.

ఆంగ్లవిద్యాధికులైన పెద్దలకు మాత్రమే పరిచితమైన దేశకాలపరిస్థితులు ఈ పుస్తకాల మూలాన అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఎన్నో అస్తిత్వసమస్యలతో, చీకాకులతో నిత్యం వ్యాకులితులై ఉండే సామాన్యులు ఈ రచయితలు సృష్టించిన అపూర్వమైన కాల్పనికజగత్తులో సంచరిస్తూ దైనందినజీవితంలో పరిష్కరించలేకపోతున్న అంశాలను తమకెంతో అభిమానపాత్రుడైన పరిశోధకునితోపాటు కథాగతంగా తామూ భాగస్వామ్యాన్ని వహించి పరిష్కరించినప్పటి వారి ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించటం సాధ్యం కాదు. అందువల్లనే ఈ నవలలను అంత తాదాత్మ్యంతో మనసుపెట్టి చదవటం జరిగేది. వాటి అసాధారణమైన ప్రభావశీలిత వల్ల పుస్తకాలను అద్దెకిచ్చే కొన్ని వేల ఇంటింటి గ్రంథాలయాలు తెలుగుదేశ మంతటా వెలిశాయి. అక్షరాస్యతావృద్ధికి దోహదం చేశాయి. క్రమంగా విద్యాధికులు సైతం ఈ ప్రక్రియను అభిమానింపసాగారు. దేవరాజు వెంకట కృష్ణారావు గారి ‘వాడే వీడు’, ‘నేనే’, ‘కాలూ రాయ్’; అబ్బూరి రామకృష్ణారావు గారి ‘మంగళసూత్రము’, ‘దుర్గాప్రసాద విజయము’ నవలలను చదివి ప్రభావితులై శ్రీశ్రీ ‘వాడే వీడు’ రాశారట. అటువంటి సాహిత్యవాతావరణంలో పెరిగిన ఆరుద్ర ఆధునికతకు మారుపేరయిన ఈ డిటెక్టివు నవలా సాహిత్యం పట్ల ఆకర్షితులు కావటం వింతేమీ కాదు.

Arudra‘పలకల వెండి గ్లాసు’, ‘అణాకో బేడ స్టాంపు’, ‘అహింసా రౌడీ’, ‘రెండు రెళ్ళు ఆరు’, ‘ఆనకట్ట మీద ఆత్మహత్య’, ‘త్రిశూలం’, ‘కొండచిలువ’ అన్నవి ఇప్పటికి తెలిసిన ఆరుద్ర గారి డిటెక్టివు నవలలు. ఇవి గాక ‘పందిట్లో పెళ్ళవుతుంది’, ‘జ్వాలాముఖి’, ‘ఎర్రని ఆకుపచ్చ సైకిల్’, ‘నేరం ఎందుకొప్పుకొన్నాడు’, ‘సరియైన పరిష్కారం’, ‘వారిజాక్షులందు …’, ‘చెలియా కనరావా’ అన్నవి ఏడు డిటెక్టివు కథలు దొరికాయి.

1950లో ఆరుద్ర ‘పలకల వెండి గ్లాసు’ వెలువడింది. ఆ తర్వాత ‘అణాకో బేడ స్టాంపు’, ‘రెండు రెళ్ళు ఆరు’ వెలువడ్డాయి. మే 1956లో ఎం.వి.యస్ పబ్లికేషన్స్ వారి ప్రచురణగా ‘ఆనకట్ట మీద ఆత్మహత్య’ తొలిముద్రణ అచ్చయింది. వీటికేర్పడిన ప్రాచుర్యం వల్ల ఆయన 1957లో ‘ఆరుద్ర ప్రచురణలు’ సంస్థను స్థాపించి తన నవలలతోపాటు మరికొన్నింటిని పంపిణీకి తీసుకొన్నట్లు కనబడుతుంది. ఈ వ్యాసంగం ఎంతకాలం సాగిందో తెలియదు. డిటెక్టివులే గాక సాహిత్యగ్రంథాలేవైనా అచ్చువేశారో లేదో తెలియదు. టెంపోరావ్ గారి ‘మంచి మనిషికి మంచిరోజులు’, ‘మిస్టర్ వై’ లాంటి పుస్తకాల మీద కూడా ప్రచురణకర్తగా ఆరుద్ర పేరు కనబడుతుంది. ఆ పుస్తకాలకు ఉత్కంఠాపాదకంగా విడుదల ముందు నెలకే మంచి ప్రకటన వెలువడేది. 1957 ఫిబ్రవరిలో ఈ సంస్థ పక్షాన ‘అహింసా రౌడీ’ అచ్చయింది.

ఆరుద్ర సృష్టించిన అసమాన సజీవపాత్ర
ఇన్స్పక్టర్ వేణు విజయం సాధించిన మరొక పరిశోధన
అహింసా రౌడీ
వేణు ఒక రౌడీని విశ్వసించాడు. అందమైన ఒక యువతిని ఆ రౌడీ హత్య చేశాడని అందరూ భావించారు. సబ్ ఇన్‌స్పెక్టర్ చంద్రం సాక్ష్యం కూడా సేకరించాడు. రౌడీ కూడా ఒప్పుకొన్నాడు. గాని వేణు నిర్ణయం ఏమిటి?
త్రివర్ణ ముఖచిత్రం * వెల 75 నయా పైసలు

అని చిన్న కరపత్రాన్ని విడుదల చేశారు. 1957లో సెప్టెంబరులో ‘ఆడదాని భార్య’ వెలువడింది.

ఆ తర్వాత ‘ఆరుద్ర ప్రచురణలు’ కొనసాగినట్లు లేదు. ఆరుద్ర రచనలపై పరిశోధన చేసినవారికి కూడా ‘ఆడదాని భార్య’ నవల ఆచూకీ గాని, ‘ఆరుద్ర ప్రచురణలు’ సంస్థ వివరాలు గాని తెలియలేదంటే ఆశ్చర్యమే.

‘ఆడదాని భార్య’ దర్శకుడు ఆర్. జగన్నాథ్ కు అంకితమైంది. కథాక్రమపరిగతి అప్పట్లో చలనచిత్రాలకు వస్తువును సమకూరుస్తున్న ఆరుద్ర కృతిత్వానికి అనుగుణంగానే ఉన్నది. ఆరుద్ర రచన అనుకోకపోతే దీనినింతగా పట్టించుకొనేవాళ్ళు ఉండరేమో! కెమెరా ఏంగిల్సుతో సహా కొంత స్క్రీన్ ప్లే రచన, కొంత అతినాటకీయ చిత్రణ, పాత్రలకు ఊత పదాలు, వింత వింత పేర్లు, ట్రెయినుతో పోటీగా టాక్సీ పరుగులు, బాహాబాహీలు, ఎత్తులకు పైయెత్తులు సినిమాటిక్ గా ఉన్నప్పటికీ ఆరుద్ర మార్కు దేశీయత, తెలుగిళ్ళలోని ఆత్మీయతలు, చమత్కార సంభాషణలు మురిపిస్తూనే ఉంటాయి.

స్థూలంగా కథ ఇది: ఇన్‌స్పెక్టరు వేణు రైల్వే స్టేషను దగ్గరొక భయంకరవ్యక్తిని చూస్తాడు. అతని మొల నుంచి రక్తసిక్తమైన కత్తి జారి పట్టాల మీద పడుతుంది. అతను రైలెక్కి పారిపోతాడు. వేణు అతనొక జమిలి హత్యల కేసులో నిందితుడని గుర్తుపట్టి, ముందు స్టేషనుకు హెచ్చరిక చేయించి, కత్తిని రైల్వే ఆఫీసరయిన తన బావమరిదికి అప్పజెప్పి, టాక్సీలో బయలుదేరి ఆ రైలును వెంబడిస్తాడు. భయంకరవ్యక్తి అంతకు ముందే ఔటర్లో దిగిపోయాడని తెలుసుకొని, ఆ దారిని గుర్తుపట్టి వెంబడిస్తాడు. ఊరి చివర విచారంలో ఉన్న నాగయ్య అనే యువకుడు, ఒక దొరసాని వేషంలో ఉన్న లీలమ్మ కనిపిస్తారు. ఎంతటికైనా తెగించి ప్రేమను దక్కించుకోమని ఆమె అతనికి పిస్తోలును ఇస్తుంది. వేణు స్పందించే లోపునే ఆ స్త్రీని బెదిరిస్తూ భయంకరవ్యక్తి అక్కడికి వస్తాడు. అతను, వేణు ఘర్షణ పడతారు. ఆ పోరాటంలో భయంకరవ్యక్తికి స్పృహ తప్పుతుంది. వేణు దిగుడుబావిలో పడిపోతాడు. లీలమ్మ అతనిని కాపాడుతుంది. భయంకరవ్యక్తి మాయమైపోతాడు. టాక్సీ డ్రయివరు వచ్చి వేణును ఇంటికి తీసుకొనివెళ్తాడు. ఎవరో పొట్టి వ్యక్తి ఒకరు టాక్సీలో ఇంటికి వచ్చి కత్తిని తీసుకొనివెళ్ళారని తెలుస్తుంది. బయటి వెళ్ళి చూస్తే టాక్సీ ఉండదు. వేణు గూడ్సు రైల్లో మళ్ళీ పక్క స్టేషనుకు బయలుదేరుతాడు. ఆ వెంటనే ఆ ఊరి పోలీసులు వచ్చి వేణు పోలీసు అధికారి అని భార్య చెబుతున్నా వినక అతని దుస్తులను జప్తుచేస్తారు. హత్య కేసులో వేణు అనుమానితుడని చెప్తారు. చిన్న బావమరిది ద్వారా వేణుకు తను లేనప్పుడు జరిగిన విషయాలు తెలిసివస్తాయి.

వేణు ఆలోచిస్తాడు. ఎవరి హత్య జరిగి ఉంటుంది? తనపై అనుమానం ఎందుకు కలిగింది? అని. లీలమ్మను కలుసుకొంటే నిజం తెలుస్తుందని అనుకొంటాడు. ఆమె పిచ్చిదని, ప్రేమలో మోసపోయిందని, అప్పటినుంచి భగ్నప్రేమికులకు సహాయపడుతుంటుందని స్టేషను మాస్టరు చెప్తాడు. వేణు ఆమె ఇంటికి వెళ్తాడు. ఆమె మాట్లాడుతూనే వేణును గదిలో తాళంవేసి బంధించి, పోలీసులను పిలవమని నౌకరును పంపిస్తుంది. భయంకరవ్యక్తి పేరు పోలయ్య అని, అతను మరణించాడని, అతనిని చంపినది వేణు అని, శవం ఇంకా బావి దగ్గరే ఉన్నదని అంటుంది. అంతలో నాగయ్య అక్కడికి వస్తాడు. తను ప్రేమించిన సుబ్బులుకు పరదేశితో పెళ్ళయిపోయిందని, వాళ్ళను చంపేందుకు చేతులు రాక పిస్తోలును తిరిగి ఇవ్వటానికి వచ్చానని చెబుతాడు. నీలాంటి ఆడదానికి భార్య కావడం కంటె చావటం మేలని లీలమ్మ అంటుంది. నాగయ్య పిస్తోలు తీసుకొని మళ్ళీ పరిగెడతాడు. వేణు గదినుంచి బయటపడి అతనిని వెంబడిస్తాడు. అతను సుబ్బులు ఉన్నచోటికి వెళ్తాడు. ఇద్దరూ మళ్ళీ వాదించుకొన్నా నాగయ్య సుబ్బుల్ని చంపలేక, పిస్తోలును పారవేసి అక్కడినుంచి వెళ్ళిపోతాడు. ఆమె ఇంట్లోకి వెళ్ళి, అంతలోనే భయపడి బైటికి పారిపోతుంది. అంతలో ఒక టాక్సీ అక్కడికి వస్తుంది. ఒక ఆజానుబాహువు దిగుతాడు. ఇంట్లోంచి పెళ్ళిదుస్తులతో ఒక యువకుడు బయటికి వచ్చి, అందరూ కారెక్కి వెళ్ళిపోతారు. అంతలో ఊళ్ళోవాళ్ళు వస్తారు. వెయ్యి రూపాయలు కట్నం తీసుకొని సుబ్బుల్ని ఏలుకోకుండా మగపెళ్ళివాళ్ళు పారిపోయారని తెలుస్తుంది. వేణు నాగయ్య పారేసిన పిస్తోలుకోసం వెతుకుతాడు. అది మాయమైపోయింది.

వేణు వెనక్కి తిరిగి ఊళ్ళోకి వచ్చేసరికి సబ్ ఇన్‌స్పెక్టరు సత్యం పోలయ్య హత్యకేసులో శవపంచాయితీ జరుపుతుంటాడు. పరాంకుశం అన్నతను పోలయ్యను చివరిసారిగా చూసినది తానేనని చెబుతూ, హంతకుని పోలికలు చెప్పమంటే వేణును వర్ణిస్తుంటాడు. దెబ్బతిన్న పోలయ్యను బుజాన వేసుకొని నడిచినా అతని దుస్తులకు నెత్తురంటలేదని సత్యం అనగానే పరాంకుశం తెల్లపోతాడు. పోలీసులు అతనిని అదుపులోకి తీసుకొంటారు. వేణు, సత్యం శవాన్ని చూడటానికి ఆసుపత్రికి వచ్చి వెళ్తారు. అది భయంకరవ్యక్తి పోలయ్య శవం కాదని వేణు గుర్తిస్తాడు. కేసు మళ్ళీ మొదటికి వస్తుంది. చనిపోయినది రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి తప్పించుకొన్న గజదొంగ అని తెలుస్తుంది. శవం వెన్నులో కత్తిపోటును చూసి వేణు తనకు మొదట దొరికిన కత్తి ఇతని హత్యాసాధనం అని గ్రహిస్తాడు. ఇంతలో కోటమ్మ కోనేరులో ఎవరో ఆత్మహత్య చేసుకొన్నారని వర్తమానం వస్తుంది. వెళ్ళి చూసేసరికి, అది సుబ్బులు శవం.

వేణు సుబ్బులు శవాన్ని చూసి అది ఆత్మహత్య కాదని నిర్ధారిస్తాడు. సుబ్బులు తండ్రి రామయ్య నాగయ్యే హత్య చేశాడని ఆరోపిస్తాడు. అంతలో వేణు ఆ పరిసరాలలో ఒక లేఖను గుర్తిస్తాడు. పెళ్ళిపందిట్లో జరిగిన అవమానాన్ని భరించలేక, సుబ్బులు నాగయ్య సలహాపై ఈ పని చేస్తున్నట్లు, “ఇంతవరకు నిర్భాగ్యురాలైనా ఇకమీదట సౌభాగ్యవతి కానున్న మీ కూతురు సుబ్బులు” అని అందులో వ్రాసి ఉంటుంది. వేణు నాగయ్యను అడిగి అసలు విషయం తెలుసుకొంటాడు. సుబ్బులుకు పెళ్ళికొడుకని చెప్పి ఆడపిల్లనిచ్చి చేసినట్లు తెలుస్తుంది. తామిద్దరమూ పారిపోవాలని నిర్ణయించుకొన్నామని, సుబ్బులు మాత్రం సమయానికి రాలేదని, నాగయ్య చెబుతాడు. సుబ్బులుకు ఈ సంబంధం తెచ్చినది పరాంకుశమే అని తెలుస్తుంది.

వేణు మళ్ళీ సుబ్బులును చివరిసారి చూసిన చోటికి వెళ్తాడు. కురులపేట కుండల వీధికి రమ్మని పైడయ్య అనే అతను ఎవరికో రాసిన ఉత్తరం ముక్కలు అక్కడ కనబడతాయి. కోటమ్మ కోనేరులో సుబ్బులుతోపాటు ఒక ఆజానుబాహువు ఉన్నాడని తెలుస్తుంది. తను సుబ్బులు ఇంటిముందు చూసినది హంతకుడినే అని వేణు గ్రహిస్తాడు. వెంటనే కురులపేట కుండల వీధికి వెళ్ళి, మొత్తానికి నిందితుల ఇంటిని కనుగొంటాడు. అక్కడ మరొక పెళ్ళి సంబంధం కుదురుస్తున్న ఆజానుబాహుడు, ఇతరులు ఉంటారు. వేణు ఇంట్లోకి జొరబడి వెళ్తాడు. మూతికి మీసాలున్న ఒక అందమైన అమ్మాయి కనబడుతుంది. అంతలో వెనుకనుంచి తలపై దెబ్బ తగిలి పడిపోతాడు. స్పృహ తెలిసేసరికి వేణు పక్కనే భయంకరవ్యక్తి శవం ఉంటుంది.

పారిపోయేముందు హంతకులు బయట తన జీపును పాడుచేసి వెళ్ళారని తెలుస్తుంది. ఇంతలో మొదట తను బాడుగకు తీసుకొన్న టాక్సీ అక్కడికి వస్తుంది. వేణు ఆ డ్రయివరుకు చెప్పి, ఆ దొంగలను వెంబడించాలనుకొంటాడు.

హత్య చేసినది ఎవరు? ఎందుకు హత్య చేసినట్లు? భయంకరవ్యక్తి (అతను తర్వాత హత్య చేయబడ్డాడు), నాగయ్య (నిరపరాధి కావచ్చు), లీలమ్మ (మతి స్తిమితం లేక చేసిందా?), పరాంకుశం (ఆడపెళ్ళివాళ్ళకు మోసపు సంబంధాలను తెచ్చి కుదురుస్తున్నది ఇతనే; పైగా పచ్చి అబద్ధాలకోరు), బ్లేజరు సూటు పెళ్ళికొడుకు (ఇతనిని ఏకాంతంగా చూసిన వెంటనే సుబ్బులు మనసు మార్చుకొని ఆత్మహత్యకు సిద్ధపడింది), ఒక పొట్టి వ్యక్తి (వేణు లేనప్పుడు ఇంటికి వెళ్ళి కత్తిని అపహరించినవాడు), ఆజానుబాహుడు (తప్పక అనుమానింపదగినవాడు), మీసాల యువతి (ఈమె కథేమిటో తెలియదు) మొత్తానికి అనుమానితుల జాబితాలో తేలినవాళ్ళు.

చివరికి వేణు తెలివిగా దొంగలను వెంటాడి ఒక్కొక్కరినీ బంధించటం ‘ఆడదాని హత్య’లో కొసమలుపు.

ఆజానుబాహువు ఒక మీసాలున్న యువతిని పెళ్ళికొడుకుగా పరిచయం చేసి, కట్నం డబ్బులు తీసుకొని, అమాయకులను మోసం చేస్తుంటాడు. పరాంకుశం అతనికి తోడు. భయంకరవ్యక్తి పోలయ్య వీళ్ళ ఆచూకీ కనుక్కొంటాడు. అతన్ని వదిలించుకోడానికి గజదొంగ పైడయ్యను వాడుకొంటారు. టాక్సీ డ్రైవరు రత్తయ్య డబ్బుకు ఆశపడి వీళ్ళకు సహాయపడతాడు.

లీలమ్మ నాగయ్యతో నీలాంటి ఆడదానికి భార్య కావటం కంటె సుబ్బులు చావటమే మేలని అంటుంది. కాని, సుబ్బులు నిజంగా తండ్రి కుదిర్చిన ఆడదానికి భార్యనయ్యానని ఆత్మహత్య చేసుకోవాలనుకొంటుంది. కాని, నాగయ్య ప్రేమను గుర్తించి అతనితో వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. అంతలో ఆజానుబాహువు చేతిలో హత్యకు గురవుతుంది. ఆ క్రమంలో నవలకు ‘ఆడదాని భార్య’ అన్న శీర్షిక అర్థవంతంగా అమరింది.

కథ అంతటా ఆరుద్ర ప్రవేశపెట్టిన దేశీయవాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అధ్యాయాలకు తెలుగు అంకెలను వేయటం ఆరుద్ర ప్రత్యేకతే. భయంకరవ్యక్తిని వెంబడించినప్పుడు వేణు కాలికి పంచె అడ్డుతగిలి ముందుకు పరిగెత్తలేకపోతాడు. అతని ఆహార్యంలోని తెలుగుతనం అప్పటిదాకా పాఠకుల మనోనేత్రం ముందు ప్రత్యక్షం కాదు. ఇన్‌స్పెక్టరు వేణు, భార్య రుక్కు, బావమరిది ఆనందరావు అంతకు మునుపు పాఠకులకు పరిచితులైనవాళ్లే. మనఃస్తిమితం లేని లీలమ్మ తన పేరును పదే పదే ‘లీలా వనలతా స్వదేశీ ఖాదీ దొరసాని’ అని చెబుతుండటమూ, ఆమె తీరుతెన్నులూ సినిమా ఫక్కీలోనే ఉంటాయి. కథాంతంలో హత్యారహస్యం పొరలు విప్పి మలుపులన్నిటినీ వేణు ఛేదించిన విధం కొంత హఠాత్తుగా కనిపించి ముగింపును చివరి రీలులో తొందర తొందరగా లాగించివేసినట్లు అనిపిస్తుంది. కథాపాత్రల పేర్లను చెప్పక ఆజానుబాహువు, పొట్టి మనిషి, భయంకరవ్యక్తి అంటూ కథను నడిపించటం మొదట కుతూహలజనకంగానే ఉన్నప్పటికీ చివరిలో కథ పట్టుతప్పిన తర్వాత వాళ్ళ వ్యవహారం విసుగనిపిస్తుంది. కథానైపథ్యానుసంజనమంతా విరులపాలెం చుట్టుప్రక్కల పల్లెపట్టుల్లో జరుగుతుంది. ఎస్.ఐ సత్యం వేణును అనుమానించినా, కొంత సహకారిగానూ, మరొక ఎస్.ఐ పానకాలరావు వేణును కేవలం అనుమానితునిగానూ చూడటం పెర్రీ మేసన్ కథలను గుర్తుకు తెస్తుంది. కథాసంవిధానానికంటె కథ చెప్పటంలోని హుందాతనం పాఠకులను ఆకట్టుకొంటుంది.

ఆరుద్ర గారు రచించి, దురదృష్టవశాన మరుగున పడిపోయిన నవల ఇది.

You Might Also Like

18 Comments

  1. సుంకర వి హనుమంత రావు rao

    సర్ నాపేరు సుంకర వి హనుమంత రావు, స్వాతి,జ్యోతి వంటి పత్రికల్లో కధలు రాశాను. ఇప్పుడు ప్రతిలిపి వెబ్ మేగజైన్లో డిటెక్టివ్ బాలి పేరున డిటెక్టివ్ కధలు రాస్తున్నాను. చాలా కధలు పబ్లిష్ చేశాను. నాకు స్ఫూర్తి శ్రీ కొమ్మూరి,భగవాన్,విశ్వప్రసాద్ గార్లే.

  2. D Suryanarayana

    Dear Muralidhara rao garu,
    I have written earlier also , to you in this forum . I have read all the articles ,you have posted in this site regarding history of evolution of detective literature in Telugu.I thank you also about the information regrading website where detective novels of kommuri sambasiva rao are available.
    As I said in my earlier letter I have read the following detective novels during my high school days in Bhimavaram.(1955-60)
    1 palakala vendi glasu
    2 vinduku vellina vimala
    3 rendu rellu aaru
    4 A Novel of Bhayankar where a medical student gets murdered. title not known
    5Chira vidichina veera vanita
    All my efforts to get them either in soft or hard copy form are of no avail.
    I stay in visakapatnam.Since I served in central service mostly out side AP ,I have very limited contacts.
    I will be highly grateful if you can inform me, from where I can get these books.In case they are available in your personal collection ,I can approach you and read them.This will also give me an opportunity to have personal discussion on this topic.

    with regards
    D.Suryanarayana
    Tel NO 8374377832

  3. ఏల్చూరి మురళీధరరావు

    శ్రీ రాఘవేంద్ర గారు వ్యాసాన్ని ఇంత శ్రద్ధగా చదివినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. లేఖను ఎంతో ఆలస్యంగా చూసి ఈనాడు సమాధానిస్తున్నందుకు క్షమార్పణలు.

    శ్రీ కొమ్మూరి సాంబశివరావు గారు స్థాపించిన సంస్థ పేరు నవీన నూలగమే. నా వ్రాత పొరపాటును కృతజ్ఞతాపూర్వకంగా సరిదిద్దుకొంటున్నాను.

  4. d suryanarayana

    I am very grateful to sri muralidhara rao garu for very informative article on telugu detective novels.I used to study them during 1956-60 when I was in high school.I want to read some of the novels of arudra,Kommuri sambasiva rao and tempo rao.Is it possible to scan and put the following novels in a website
    .Palakala vendi glasu and other novels of arudra
    laksdhikari hatya and other novels of kommuri sambasivarao
    novels of pekamedala and sri bhagavan.
    I also want to read vinduku vellina vimala.
    I have lost touch with telugu books as I was in a central service and served outside AP.I am now in visakapatnam and I will be thankful if you can tell me a source for these books in vizag.

    with regards
    D.Suryanarayana

    1. ఏల్చూరి మురళీధరరావు

      Dear Sri Suryanarayana gaaru,

      Thank you very much for your kind letter. You may see a few of Sri Kommuri Sambasiva Rao gaaru’s novels at (http://www.koumudi.net/library.html), in Koumudi magazine web site. I am sure several of his fans must have preserved them in Visakhapatnam also. I hope you would sure find them there in due course.

      With regards,

      Sincerely,
      Elchuri Muralidhara Rao

  5. తఃతః

    శ్రీ మురళీధర రావు గారు!
    మీరు రాసిన ఇన్నాళ్లకు ఈ రచన చదివాను. నా బాల్యాన్ని గుర్తుకు తెచ్చారు . 1957-8 లకు కొద్దిగా అటూఇటుగా కొమ్మూరి ‘చావుకేక ‘ తో మొదలు పెట్టి ఆరోజుల్లో అద్దె పుస్తకాల దుకాణాలలో దొరికిన సాంబశివరావు , విశ్వప్రసాద్ ,టెంపోరావు లను స్నేహితుల తో కాలిసి చదివాను కానీ మీరుచెప్పిన విషయాలేవీ తెలియవు. మీకు ధన్యవాదాలు ‘ పలకల వెండి గ్లాసు ‘ కూడా అప్పుడే చదివాను. ‘ ఆడదాని భార్య ‘ గురించి నాకు తెలియదు . విజయవాడ సత్యనారాయణ పురం లో మాఇంటికి దగ్గరగా ఉన్న మా బడి పక్కనే ఉన్న జిల్లా గ్రంథాలయం లో ఉన్న ‘వాడే వీడు ‘ కూడా . డిటెక్టివ్ జంబులింగం పాత్రను సృష్టించినదెవరో గుర్తు లేదు . మీకు గుర్తొస్తోందా! డిటెక్టివ్ భగవాన్ అసిస్టెంట్ రాంబాబును మీరు గుర్తుచేసుకోలేదేం? ‘చీరవిడిచిన వీరవనిత ‘ నుఇంటికి తీసుకెళ్లాలంటే భయం .
    నమస్కారాలు తో
    తఃతః

    1. ఏల్చూరి మురళీధరరావు

      మాన్యులు శ్రీ తః తః గారికి
      నమస్కారములతో,

      ఔదార్యపూర్ణమైన మీ లేఖకు ధన్యవాదాలు.

      డిటెక్టివ్ జంబులింగం పాత్రను శ్రీ టెంపోరావు గారే సృష్టించి, ఆపైని కొనసాగింపక విడిచివేసినట్లున్నది. శ్రీ రామవరపు గణేశ్వరరావు గారు కూడా ఇన్స్పెక్టర్ జంబులింగం ప్రధాన పరిశోధకునిగా కొన్ని కథలను వ్రాశారు.

      సప్రశ్రయంగా,
      ఏల్చూరి మురళీధరరావు

  6. shaikmehaboob

    ఈ నవల నాకు కవాలి

  7. Madhu

    అపరాధ పరిశోధన నవలలు అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు చాలా చదివాను. ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలరా?

  8. ఏల్చూరి మురళీధరరావు

    Respected Sri Jampala Chowdary gaaru,

    Thank you very much for reading the Article. You are most welcome to Raid this Lost Ark anytime, Sir! 🙂

    Initially I thought I would write on తెలుగులో అపరాధ పరిశోధక రచనలు for pustakam.net but ended up with this because unfortunately no authentic research material is available on the subject and one has to rely upon one’s own personal study and recollection. I could gather only a few cursory mentions in PhD works on Novel and Short Story. I remember a few Articles published in Sri YV Rao’s Detective monthly and Sri Shyam Damodar Reddy’s Aparadha Parisodhana. I remember a very valuable tribute Article on Sri Tempo Rao gaaru in అపన but could not take it out while writing this brief one on Arudra gaaru. There are a few more Articles by scholars in Commemorative Volumes, Felicitation Volumes and other Annual Issues that I remember but could not quote while writing this. I think I need to go and photocopy them from Sri Indraganti Srikanta Sarma gaaru’s personal library. After starting work, I also found that personally you, Sreenivas Paruchuri gaaru and Kiran Prabha gaaru were engaged in a dialogue long ago on this genre study.

    A vast collection of early Telugu detective novels (along with other publications) was preserved in Tamil Nadu Government Archives (Egmore) but later when it was transferred to Hyderabad, its fate is unknown now. The books are cataloged either as “lost in transit” or simply, “lost”. One can only explore if any novels are still preserved at Chennai.

    I used to see Sri Bapineedu gaaru in ‘70s, when he was actively writing and publishing popular detective and other novels and brought out magazines like రమణి (another disregarded branch of literature) before బొమ్మరిల్లు and నీలిమ and a hugely successful film magazine విజయ but lost touch afterwards. He became a film personality and possibly due to that reason did not publish much (or, anything) later. Someone should write on his contribution to modern Telugu literature.

    With regards,
    EMR

  9. ఏల్చూరి మురళీధరరావు

    మాన్యులు శ్రీ కొడిదెల హనుమంతరెడ్డి (హెచ్చార్కే) గారికి, శ్రీ గొర్తి బ్రహ్మానందం గారికి,
    నమస్కారములు!

    వ్యాసాన్ని దయతో చదివి సహృదయంతో స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. శ్రీ జంపాల చౌదరి గారు, శ్రీ హెచ్చార్కే గారు అన్నట్లు ఆనాడు చాలా మందికి డిటెక్టివు నవలల అధ్యయనమే సర్వసాహిత్యాధ్యయనకు ప్రాతిపదిక. అంతే గాక, ఈ రోజులలో ఉన్నట్లు ఆ రోజుల్లో అపరాధ పరిశోధక నవలలంటే చులకన భావం అసలేమీ ఉండేది కాదు. క్రమంగా నిరాదరణ అనాసక్తిగా పరిణమించి ఇప్పుడు ఆ వాఙ్మయం అసలు అందుబాటులోనే లేని దుఃస్థితి వచ్చింది.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  10. Brahmanandam Gorti

    పొరపాటు జరిగింది. ఆరుద్ర రాసిన మరికొన్ని డిటెక్టివ్ నవలల్లో పాత్రలు – ఇన్స్పెక్టర్ వేణు, సబ్-ఇన్స్పెక్టర్ చంద్రం, ఎర్రగుర్రం, మోటర్ బైక్… ఇవి నవలలు కావు. రాసే కంగారులో చూసుకోలేదు.

    -బ్రహ్మానందం

  11. Brahmanandam Gorti

    కృష్ణ గూఢచారి-116 సినిమా రచన కూడా ఆరుద్రదే! అది ఒక నవలగా రాసి చివరకి సినిమా స్క్రిప్ట్ గా మలిచానని 1993లో చెన్నైలో ఆరుద్రని కలిసినప్పుడు చెప్పారు. ఆరుద్ర రాసిన మరికొన్ని డిటెక్టివ్ నవలలు – ఇన్స్పెక్టర్ వేణు, సబ్-ఇన్స్పెక్టర్ చంద్రం, ఎర్రగుర్రం, మోటర్ బైక్… మోసగాళ్ళకి మోసగాడు సినిమాకి కూడా ఆరుద్రే కథ, స్క్రీన్‌ప్లే!

    చాలామందికి తెలియకపోవచ్చు – చదరంగం ఆటమీద పుస్తకం రాసారు. మద్రాస్ చెస్ క్లబ్బుకి సెక్రటరీగా కూడా పనిచేసారు. ఇవన్నీ ఒకెత్తయితే, పేకాటలో ప్రాచుర్యమైన బ్రిడ్జ్ గేం మీదా కూడా పుస్తకం రాసారు. అప్పట్లో ఆరుద్ర కూర్చిన పదరంగం పుస్తకం వేయాలనుకున్నారని విన్నాను. ఎక్కడా ఆ పుస్తకం వచ్చినట్లు లేదు.

    ఓసారి మా వూళ్ళో ఆరుద్రమీద ఒక రేడియో ప్రోగ్రాం చేసాను. ఆరుద్ర గురించి చివర్లో నా వాక్యాలు:

    ఆంధ్ర చరిత్ర ఆధిపత్యం
    తేట తెనుగు స్వాతి ముత్యం
    సమగ్రారుద్ర సాహిత్యం
    ఓ కూనలమ్మా!

    మరలా ఆరుద్రని గుర్తు చేసారు, మురళీధర రావు గారూ, ధన్యవాదాలు.

  12. hrk

    Article is very good, full of interesting and thought provoking material. And it is put in such lovely language. (Sorry I am aunable to say all this in Telugu, at the moment).The Article helps to get rid of certain prejudices about writing and reading. There is none like ‘kshudra patakulu’. Personally I enjoyed reading as reading becauae of writers like Kommuri Sambasiva Rao, Krishna Mohan, Vijayathreya etc. I won’t have had the taste of reading and then won’t have got into book loving if I didn’t have those books at hand when I was in my teens. Thanks and Congrats to Sri Muralidhara Rao garu.

  13. ఏల్చూరి మురళీధరరావు

    మున్ముందుగా, ఈ పరిచాయకవ్యాసాన్ని దయతో ప్రచురించిన పుస్తకం.నెట్ సంపాదికలకు నా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు.

    ఆరుద్ర గారి వాఙ్మయాన్ని అధికరించి విశేషాభిమానంతో సాధికారమైన కృషిచేసిన ప్రముఖ కథకులు, అసాధారణమైన ధారణకు మారుపేరయిన నా మాన్యమిత్రులు డా. చిర్రావూరి శ్యామ్ (మెడికో శ్యామ్) గారు ‘పలకలు వెండిగ్లాసు’ ప్రచురణ సంవత్సరం 1955 అయివుండవచ్చునని ఈ వ్యాసాన్ని చదివి ఈ రోజు ఉదయం కొలంబియా నుంచి నాకు వ్రాసిన లేఖలో సూచించారు. నా ప్రతి ఇప్పుడు హైదరాబాదులో మా ఇంట సులభంగా వెతికితీసే పరిస్థితిలో లేదు. నేను వ్రాసినది ఒకనాడు చదివినప్పటి జ్ఞాపకాధారితమే కనుక వారిపైని ప్రామాణ్యభావంతో నా వ్యాసంలో ఆ నిర్దేశాన్ని సరిచూసిన వెంటనే సవరించుకొంటాను.

    డా. శ్యామ్ ఆరుద్ర గారు ప్రారంభించిన ‘కుబేర ప్రచురణలు’ గుఱించి ప్రస్తావించి ఉండవలసినదని కూడా సూచించారు. ‘పలకల వెండిగ్లాసు’ కుబేర ప్రచురణల వారిదని, కొమ్మూరి సాంబశివరావు గారి ‘ఉరితాడు’ ఆ సంస్థ వెలువరించిన రెండవ పుస్తకం కావచ్చునని సూచించారు. దాని సంగతిని నేను విని ఉండలేదు. నాకు పదకొండు పన్నెండేళ్ళ వయోవస్థ నాడు (1965-66 ప్రాంతాల) నేను మా నాన్నగారితో కలిసి వెళ్ళినపుడు మద్రాసులోని జార్జి టౌనులోని సుంకురామ చెట్టి వీథి వెనుక ఒక చిన్న దుకాణంలో ఆనాటి ప్రముఖ ప్రచురణకర్త శ్రీ ఉప్పులూరి కాళిదాసు, శ్రీ టెంపోరావ్ గారలతో మా నాన్నగారు మాట్లాడుతుండిన ఒకచోట ‘ఆర్యావర్త్ పబ్లికేషన్స్’, ‘కుబేరా ప్రింటర్స్’ అని సైనుబోర్డులను చూసిన గుర్తున్నది. ‘ఆర్యావర్త్ పబ్లికేషన్స్’ టెంపోరావ్ గారిదే. అలాగే, ‘కుబేరా ప్రింటర్స్’ కూడా టెంపోరావ్ గారిదని నేననుకొన్నాను. ఆరుద్ర గారు ప్రారంభించినదని నాకు తెలియదు. చిన్నప్పటి ఆ లీలాస్మృతిని ఇప్పుడు స్ఫుటంగా నెమరువేసుకోలేకపోతున్నాను. ‘కుబేరా ప్రచురణలు’ టెంపోరావ్ గారిదేనని, అది నష్టాలలో కూరుకొన్నాక దానిని టెంపోరావ్ గారు కె. ప్రకాశరావు గారికి అమ్మివేశారని ప్రఖ్యాత రచయిత, కొడవటిగంటి కుటుంబరావు గారి అల్లుడు శ్రీ రామవరపు గణేశ్వరరావు గారు కొద్దిసేపు క్రితం నేను టెలిఫోను చేసి అడిగినప్పుడు ఆ వివరాలను చెప్పారు. ఆ సంస్థ వ్యవహారాలతో ఆరుద్ర గారికి సంబంధం ఉండి ఉండకపోవచ్చును.

    కొమ్మూరి సాంబశివరావు గారి ‘ఉరితాడు’ 1958 ముద్రణ నా దగ్గరున్నది. అది వారిదే అయిన ‘ఆధునిక గ్రంథమాల’ ప్రచురణ. అంతకు మునుపు దానిని కుబేరా వాళ్ళు వేసి ఉండటం సాధ్యం కాకపోయినా, కుబేరా వారి ప్రతి బయటపడేంత వరకు ఏ సంగతి నిర్ధారించటం సులభం కాదు. 1959కి మునుపు కొమ్మూరి ‘ఆధునిక డిస్ట్రిబ్యూటర్స్’ అని ఒక పంపిణీ సంస్థను ప్రారంభించి, ‘వరూధినీ గ్రంథమాల’ పేరిట అచ్చయిన కొడవటిగంటి కుటుంబరావు గారి ‘ప్రేమించిన మనిషి’ని; శ్రీమతి ‘కె’ రామలక్ష్మి గారి ‘అవతలి గట్టు’ నవలను పంపిణీ చేశారు. అవి నా దగ్గరున్నాయి. కొమ్మూరికి, ఆరుద్రకు ‘ఆధునిక డిస్ట్రిబ్యూటర్స్’ ద్వారా ఉండిన పరిచయానికి పూర్వరంగం డా. శ్యామ్ గారు ఊహించినట్లు ‘ఉరితాడు’ నవల నాటికే ఉన్నదేమో కాని, ఇప్పుడు నా దగ్గరేమీ ఆధారాలు లేవు. అది కుబేర ప్రచురణల వారిది కాదేమో. ఐనా, శ్యామ్ గారు చెప్పారు కనుక అది తప్పక ప్రయత్నించి నిగ్గు తేల్చవలసిన అంశమే.

    ఆరుద్ర గారి మరొక నవల ‘దయ్యాలకొంప’ అని కూడా డా. శ్యామ్ గారు సూచించారు. ఆ విశేషాలు నాకు దొరకలేదు. దానికోసం కూడా అన్వేషించాలి.

    టెంపోరావ్ గారి డిటెక్టివు అశ్వత్థామ సృష్టి నా ప్రస్తావనలో లేని విషయాన్ని కూడా డా. శ్యామ్ గారు గుర్తుచేశారు. ఆ మాట నిజమే. నా దగ్గర డిటెక్టివు అశ్వత్థామ, సురేఖల పరిశోధన ‘ప్రాణం తీసిన ప్రేమ’ (1960) ఉన్నప్పటికీ, సమయానికి స్ఫురణలో లేకపోయింది.

    డా. శ్యామ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    మాన్య మిత్రులు శ్రీ వేణు గారన్నట్లు కుటుంబరావు గారి అధిక్షేప వ్యంగ్యాత్మక రచనావళి ‘కెయాస్ కథలు’ నేను పైని పేర్కొన్న కృతుల పట్టికలో పొందుపడని మాట నిజమే. అది పొరపాటే. ఎలాగూ ప్రసక్తి వచ్చింది కాబట్టి, వేణు గారు విన్నారో లేదో అని వ్రాస్తున్నాను:

    1957 ప్రాంతాల కొమ్మూరి మొట్టమొదట ‘నవీన మాలగం’ అని ఒక సంస్థను మొదలుపెట్టి, తన రచనల తమిళానువాదాలు ‘లక్షాదిపతి కొలై’ (లక్షాధికారి హత్య), ‘నిలై ఇళందవన్’ (మతిపోయిన మనిషి) వంటివాటిని ప్రకటించేవారు. ఆ తర్వాత అది ‘విదేశీ సాహితి’గా మారి, ‘క్రిజ్లర్ ఆత్మకథ’, ‘మేయో సోదరులు’ ఇత్యాది ప్రచురణలకు దారితీసింది. ఆ తర్వాత ‘ఆధునిక డిస్ట్రిబ్యూటర్స్’, ఆ తర్వాత ‘ఆధునిక గ్రంథమాల’ వెలిశాయి. ఆ రోజులలోనే వాటి అధిక్షేపాలుగా శ్రీ కొడవటిగంటి ‘కెయాస్ ఆనంద్ కథలు’ వెలువడటం, ‘టి.వి. శంకరం’ పాత్రసృష్టి జరిగాయి. ‘కెయాస్’ అంటే Chaos అని పైకి స్ఫురించే ఆంగ్లపదం. అది ‘KS’ అన్న సంక్షేపాలకు సూచకం. KS కొమ్మూరి సాంబశివరావు అన్నమాట. టి.వి. శంకరం కూడా తిక్క వెర్రి శంకరం అన్నమాట. శంకరం సాంబశివ పర్యాయమే కద! శ్రీ కుటుంబరావు గారి హాస్యదృష్టి అటువంటిది!

    శ్రీ వేణు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

    1. Jampala Chowdary

      Muralidhara Rao gaaru:

      Very interesting information. Thank you.
      I need to raid your library for these books, one day.
      Has there been any reasonable research into Telugu ‘detective’ literature?
      This was the gateway to Telugu reading for many people of the time.
      Incidentally, Gutta Bapineedu and Vijaya-Bapineedu are the same person.

    2. Raghavendra

      మాలగం కాదండీ, నూలగం. అనగా పుస్తకాల స్థావరం. లైబ్రరీ అన్నమాట.

  14. వేణు

    మురళీధరరావు గారూ! మీ వ్యాసం విలువైన సమాచారంతో ఆసక్తికరంగా ఉంది.
    ఆరుద్ర డిటెక్టివ్ నవలను పూర్తి వివరాలతో పరిచయం చేశారు.
    నాడు సాహిత్యరంగంలో డిటెక్టివ్ నవలల విజృంభణపై చురకలు వేయటానికి కొ.కు. ‘కేయాస్’ పాత్రను సృష్టించారు కాబట్టి మిగతా డిటెక్టివ్ పాత్రల జాబితాలో ఆ పాత్ర ఇమడదు. 🙂

Leave a Reply to ఏల్చూరి మురళీధరరావు Cancel