కడప పిల్లోళ్ళ కథలు

వ్యాసం రాసిపంపినవారు: త్రివిక్రమ్

కడప జిల్లాలో ప్రాచుర్యంలో ఉన్న పిల్లల కథలను సేకరించి సంకలించి గ్రంథస్థం చేసే ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక వాళ్ళు కడప జిల్లా బడి పిల్లలను కథలు రాయమని పురమాయించారు. ఏమని? “మీ జేజెలనూ, అబ్బలనూ, మీ అవ్వలనూ, తాతలనూ, మీ అయ్యవార్లనూ, మీ అమ్మయ్యలనూ అడిగి కతలను చెప్పించుకుని మీకిష్టమొచ్చిన కతలు మీకిష్టమొచ్చినట్లు రాయండ్రా పిల్లలూ” అని (జేజె = paternal grandmother, అబ్బ = paternal grandfather, అవ్వ = maternal grandmother, తాత = maternal grandfather, అమ్మయ్య = lady teacher). దానికి స్పందించి 13065 మంది కడప పిల్లోళ్ళు కథలు రాశారు. వాటిలోంచి రెండు వడబోతల అనంతరం 102 కథలను ప్రచురణ కోసం ఎంపిక చేశారు. ఇది జరిగింది నిరుడు ఎండాకాలంలో. 2012 నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా పుస్తకాన్ని తేవాలనుకున్నారు. ఐతే అది అలా అలా సాగి సాగి మొన్న 2013 జూన్ లో తేగలిగారు.

ఈ పుస్తకంలో ఎలాంటి కథలున్నాయి? – నా చిన్నప్పుడు మా జేజ మాకు కొన్ని కథలు చెప్పింది. అవేవీ గుర్తులేవుగానీ వాటిలోని ఒక కథలో అత్రాసాల (అరిసెల) వాన కురిస్తే ఊళ్ళో అందరూ “అత్రాసాల వాన గురిసెరో…!” అని పరుగులు తీయడమొక్కటే గుర్తుంది. అలా పెద్దవాళ్లు చెప్పే గమ్మత్తైన కథలే కాకుండా పిల్లలు తమ తోటి పిల్లల నుంచి వినే కథలు కొన్ని ఉంటాయి. “కడప పిల్లోళ్ళ కథలు” పేరిట పుస్తకాన్ని ప్రచురించే ప్రయత్నం ఒకటి జరుగుతోందని తెలిసినప్పుడు పెద్దవాళ్ళు అలాంటి కథలను గుర్తుకు తెచ్చుకుని పిల్లలకు చెప్తారని, డోరేమాన్లు, వీడియో గేంలతో పోటీపడలేక మరుగున పడిపోతున్న అలాంటి నూరు కథలను ఒకేచోట చదవొచ్చని ఆశించిన నాకు పూర్తిగా కాదుగానీ కొద్దిగా నిరాశే ఎదురైంది.

ఎలాగూ ఇవి పిల్లలు సొంతంగా రాసే కథలు కానక్ఖర్లేదు కాబట్టి చాలామంది పెద్దవాళ్లు తాము “విన్న” కథలను కాకుండా అక్కడా ఇక్కడా “చదివిన” కథలనే పిల్లలకు చెప్పినట్లున్నారు. అది సులభోపాయమేగానీ ఇలాంటి ప్రయత్నాలకు తగిన ప్రతిఫలాన్ని ఇవ్వదని నా అభిప్రాయం. ఐతే ఒక సంతోషకరమైన అంశమేమిటంటే కొందరు పిల్లలు తమ స్వంత అనుభవాలు, అవి తమలో కలిగించిన భావాలకు కథారూపమివ్వవచ్చుననే అంశాన్ని గుర్తించడమే గాక వాటిని మంచి కథలుగా మలచడంలో చక్కటి ప్రతిభను కనబర్చారు. ఉత్తమ పురుషలో ఉన్న కొన్ని కథలను చూస్తే ఈ విషయం స్పష్టమౌతుంది. వాటిలో కొన్ని కరుణ రసాత్మకంగానూ, ఆలోచింపజేసేవిగానూ ఉన్నాయి. ఈ పుస్తకం ద్వారా కలిగిన ప్రయోజనాల్లో ఇది అతి ముఖ్యమైనది.

ఈ పుస్తకంలో నుంచి మచ్చుకు ఒక కథ సంక్షిప్తంగా:
గాడిద గుడ్డు – గుర్రం లడ్డు (నాలుగో తరగతి విద్యార్థిని ఝాన్సీ రాసిన కథ):
ఒకూర్లో ఇద్దరన్నదమ్ములు. వాళ్లకు తండ్రి నుంచి వారసత్వంగా మిగిలింది ఒక గాడిద, ఒక గుర్రం మాత్రమే. తండ్రి మరణించగానే తమ్ముణ్ని అమాయకుణ్ణిజేసి గుర్రాన్ని తనే కొట్టెయ్యాలన్న దుర్బుద్ధితో అన్న “గాడిద గుడ్డు పెడుతుంది, గుర్రం లడ్డు పెడుతుంది. గాడిద గుడ్డు చాలా ఖరీదు. గుర్రం లడ్డు ఒక రూపాయే.” అని తమ్ముణ్ణి నమ్మించి గుర్రాన్ని తను తీసుకుని ఊరొదిలి వెళ్ళిపోతాడు. తమ్ముడు ఆ గాడిదను మేపుతూ అది గుడ్డెప్పుడు పెడుతుందా అని ఎదురుచూస్తూంటాడు. తీరా అది గుడ్డు పెట్టకపోగా బిడ్డను కంటుంది. దాంతో డీలాపడినా అది గుడ్డు పెట్టేరోజు కోసం ఎదురుచూస్తూ గాడిదను, దాని బిడ్డను మేపుతూ ఉంటాడు. అదే సమయంలో రాణి గారికి ఏదో జబ్బు చేస్తే వైద్యులు గాడిదపాలతో వైద్యం చెయ్యాలంటారు. రాజభటులు పాలకోసం ఇతడి గాడిదను తోలుకుపోబోతే అతడు లబలబలాడుతూ “అయ్యా! నా గాడిద ఇప్పటివరకు ఒక గుడ్డైనా పెట్టలేదు. కనికరించండి.” అని వాళ్ళ వెంటబడి రాజు గారి దగ్గరికి పోతాడు. రాజు వాడొట్టి అమాయకుడని గ్రహించి “మాకు గాడిదపాలు కావాలి. గుడ్డు అవసరం లేదు. నీ గాడిద గుడ్డు పెడితే నీకే ఇచ్చేస్తాంలే. అంతవరకు నీ గాడిదను, దాని బిడ్డను మేమే పోషిస్తాం.” అని నచ్చజెప్పి పంపేస్తాడు. రాణి జబ్బు నయమయ్యాక “ఇదిగో నీ గాడిద ఈ గుడ్డు పెట్టింది” అని ఒక బంగారు గుడ్డును అతడికి పంపిస్తాడు :-).

ఇక ఈ కథల్లో వాడిన భాష విషయానికొస్తే కడప మాండలిక పదాలు చాలా తక్కువగా ఉన్నాయి. కథలన్నీ చాలా వరకు ప్రామాణిక భాషలోనే ఉన్నాయి. కడప పిల్లోళ్ళు వేసిన బొమ్మలనే ఈ పుస్తకానికి ముఖచిత్రంగానూ, అట్ట వెనుకా ప్రచురించడం ప్రశంసనీయం. 116 పేజీల్లో 102 కథలు గల ఈ పుస్తకం సంకలన కర్త, ప్రధాన సంపాదకుడు ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి. రెండు విడతలుగా జరిగిన కథల వడబోతలో జిల్లాకు చెందిన రచయితలు, సంపాదకులు, యోగి వేమన విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులు, రీసెర్చ్ స్కాలర్లు పాలుపంచుకున్నారు. పుస్తకం వెల రూ.80. ప్రతులకు సంప్రదించవలసిన చిరునామా:
ఎ. రఘునాథ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, జెవివి, కడప జిల్లా
బి-12/2, ఎల్.ఐ.సి. క్వార్టర్స్
కడప – 516004
ఫోన్: 97046 21122.

You Might Also Like

Leave a Reply