నన్ను మార్చిన పుస్తకం!

వ్యాసం రాసినవారు: జె. యు. బి. వి. ప్రసాద్
*******

నేను ‘రామాయణ విషవృక్షం’ చదవడం మొదటి సారి ఎలా జరిగిందో చెప్పాలని వుంది. అప్పటికి రంగనాయకమ్మ గారి పుస్తకాలు స్వీట్‌ హోం, కూలిన గోడలు, బలిపీఠం, వగైరాల్ని పత్రికల్లో సీరియల్సుగా వచ్చినప్పుడు చదివాను, పక్కింటి వాళ్ళ పత్రికలు తెచ్చుకుని. కాకినాడలో వుండే వాళ్ళం ఆ రోజుల్లో. పత్రికలు కొనడానికి డబ్బు లేదు. బీయస్సీకి హైదరాబాదు వచ్చేశాము. పరిస్థితుల వల్ల దేముడిని అయిష్టపడుతున్న రోజులు. ఆ అయిష్టం కొద్దీ నాస్తికుడిగా అవ్వాలనే కోరిక. అక్కడా, ఇక్కడా శ్రీశ్రీ కవిత్వం చూడడం, ఏమీ తెలియకుండా వుద్రేకపడ్డం. అలాంటి అయోమయ పరిస్థితిలో వుండేవాడిని. హైదరాబాదు వచ్చిన యేణ్ణర్థం వరకూ పుస్తకాలు ఏమీ చదవలేదు. చిక్కడపల్లి లైబ్రరీకి వెళ్ళి టెక్స్ట్ పుస్తకాలు చదవడమే తెలుసు. ఇంటికి పుస్తకాలు తెచ్చుకోవాలంటే, పది రూపాయలో ఎంతో కట్టాలి. ఆ డబ్బు లేదు. నవలల సెక్షనుకి వెళ్ళే వాడిని కాను. పొద్దుణ్ణించీ సాయంకాలం వరకూ రిఫరెన్సు సెక్షనులో కూర్చుని నోట్సు రాసుకునే వాడిని. బీయస్సీ ఫైనలియర్‌ లోకి వచ్చాను. నల్లకుంటలో రామాలయం వెనకాల వుండే వాళ్ళం. సెంట్రల్ ఎక్సైజ్ కాలనీలో నరసింహ అని ఒక రాయలసీమ క్లాసుమేటు వున్నాడు. వాళ్ళక్కకి తిలక్‌నగర్‌ లైబ్రరీలో మెంబరు షిప్ వుంది. నిజానికి ఆమె అతని అక్క కూతురు. అతని కంటే పెద్దది. కూతురికి బిడ్డ పుట్టిన కొన్నేళ్ళ తర్వాత తల్లికి అతను పుట్టాడు. సిగ్గు పడేవాడు ఆ విషయం చెప్పుకోవడానికి. అక్క కూతురిని కూడా అక్క అనే చెప్పేవాడు ఫ్రెండ్సుతో. అతను అలా సిగ్గుపడ్డం సహజమే అనుకునే వాడిని. తర్వాత కాలంలో, రంగనాయకమ్మ గారి కథ, “అమ్మ” చదివాక, అర్థం అయింది అదెంత తప్పు విషయమో. అయినా అంత పెద్ద వయసులో పిల్లాడిని కని పెంచాలా అనిపించింది.

ఆ రోజుల్లో నరసింహ నాకు ఒక రోజు, “రామాయణ విషవృక్షం” మొదటి భాగం ఇచ్చాడు. ఒక్క రోజు మాత్రమే టైం ఇచ్చాడు. మర్నాడు లైబ్రరీలో తిరిగి ఇచ్చెయ్యాలన్నాడు.ఆ రోజుల్లో దేముడికి వ్యతిరేకంగా, వ్యక్తిగత సమస్యల వల్ల, ఏదో తెలివితక్కువగా మాట్టాడుతూ వుండేవాడిని. అలా మాట్టాడతానని ఆ పుస్తకం ఒక్క రోజు కోసం ఇచ్చాడు నాకు. చదవడం మొదలు పెట్టాను. నాకు తెలియని విషయాలూ, వూహకి అందని విషయాలూ, చాలా వున్నాయని అర్థం అయింది. పుస్తకం లోని తర్కం హత్తుకుపోయింది మనసుకి. పీఠిక 90% అర్థం కాలేదు. కొత్త కొత్త పదాలు. అయినా సరే, చదువుతున్నంత సేపూ, దేనికో తిరగబడుతున్నాననే ఒక సంతోషం, వుత్సాహం, ఏదో వుత్కంఠ. అప్పుడే పూజ చేసుకుని, బయ టికి వెళుతున్న మా నాన్న, “అలాంటి పిచ్చి పుస్తకాలు చదవకపోతే, మంచివి చదువుకోకూడదూ?” అనేసి వెళ్ళిపోయాడు. మా నాన్నంటే చాలా అయిష్టం వుండేది. ఆయన కుటుంబం గురించి ఏ బాధ్యతలూ పట్టించుకోవడం లేదని, పూజలు చేసుకోవడం తప్ప. ఆయన అలా అన్నాడంటే, ఆ పుస్తకం నిజంగా గొప్పదని గాఢ విశ్వాసం కలిగింది. వదలకుండా చిన్న పడక కుర్చీలో కూర్చుని చదువుతున్నాను. మర్నాటికి కూడా పూర్తవలేదు. చదువుతూ, చదువుతూ గట్టిగా నవ్వేవాడిని హాస్యానికి. వ్యంగ్యం, వెటకారం, చాలా నచ్చాయి. బోలెడు విషయాలు తెలియడం లేదు. అయినా వదల బుద్ధి కావడం లేదు కూడా. ఆ పుస్తకం చదువుతూ అనుభవించిన ఆనందం ఇప్పటికీ గుర్తే.

ఇక్కడ మా నాన్న గురించి ఒక చిన్న విషయం. ఆ రోజుల్లో మా నాన్న, “చంద్రుడికీ, సూర్యుడికీ మధ్య హిమాలయా పర్వతాలు అడ్డు రావడం వల్లే గ్రహణాలు ఏర్పడ తాయని” గట్టిగా చెప్పేవాడు. బీయస్సీ చదువుతున్న నేను కాదని, సైన్సు చెబితే, నన్ను తిట్టాడు బాగా. “నీ మొహం” అని తీసి పారేసేవాడు. “నీ చదువు దండగ” అని తిట్టేవాడు. అప్పట్లో మా అమ్మ, “నాన్ననే ఎదిరించి మాట్లాడుతావా?” అని నన్ను తిట్టి, తన పాతివ్రత్యాన్ని బయట పెట్టుకునేది. అలాంటి కుటుంబం లోంచి బయట పడ్డానంటే, నాకు ఇప్పటికీ ఆశ్చర్యమే. అంతా ఆ పుస్తకాల వల్లే. లేకపోతే, మా అక్క లాగే పూజల్లో మునిగి తేలే వాడి లాగా తయారయ్యే వాడిని ఆ వాతావరణంలో.

నరసింహ వచ్చేశాడు లైబ్రరీకి వెళ్ళడానికి. ఇంకా చాలా పేజీలున్నాయి చదవడానికి. వాడిని కూర్చోబెట్టి మరి కొన్ని పేజీలు చదివాను. ఇంక టైం లేకపోవడం వల్ల పుస్తకం వాడికిచ్చేశాను. ఎంత యేడుపొచ్చిందో ఆ రోజు. చాలా బాధ కలిగింది పూర్తిగా చదవలేక పోయినందుకు.

తర్వాత ఎమ్మెస్సీకి వైజాగ్‌లో చేరాను. పుస్తకాలంటే ఇష్టం వున్నా, వాటికి దూరంగానే వున్నాను. ఏదో కాస్త పత్రికల వరకే వుండేది పఠనం. యూనివర్సిటీ లైబ్రరీ వున్నా, పుస్తకాలు తెచ్చుకోవడం, చదవడం, లేదు. ఎంతసేపూ పరీక్షల చదువు భయమే. టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే తెచ్చుకునే వాడిని.

వేసంకాలం శలవుల్లో హైదరాబాద్ వెళ్ళాను. అప్పుడు అడిక్‌మెట్‌లో లైబ్రరీ కనబడింది. అక్కడే కూర్చుని విషవృక్షం మూడు భాగాలూ చదివేశాను. చాలా రోజులు పట్టింది. రోజూ సాయంకాలం వెళ్ళి రెండు, మూడు గంటలు కూర్చుని చదివే వాడిని. గట్టిగా నవ్వడానికి వీల్లేకుండా వుండేది. ఫక్కున నవ్వి, మూతి నలుపుకునే వాడిని. అప్పుడు బాగా ఒంట పట్టింది ఆ పుస్తకాల లోని హాస్యం. ముఖ్యంగా వెటకారం. ఆ తర్వాత, విషయాలని వేరేగా పరిశీలిస్తూ చూడాలనీ, అర్థం చేసుకోవాలనీ, లీలగా అర్థం అయింది. వేరే మానవమాత్రుడు లేడు దగ్గర్లో ఆ విషయాలు మాట్టాడ్డానికి. అప్పుడే సరైన సాంగత్యం వుంటే, ఇప్పుడు ఎలా వుండేవాడినో కదా అనిపిస్తుంది.

ఒక రోజు లైబ్రరీ నించి వస్తూ వుంటే, తెలిసున్న కాకినాడ వాడు ఒకడు అక్కడ కూరల మార్కెట్ దగ్గర కనబడ్డాడు. మాటల్లో, “రంగనాయకమ్మ అనే చెడ్డావిడ రామాయణ విషవృక్షం అనే పుస్తకం రాసింది. అందులో రాముడికి కుష్టురోగం వుంది అని రాసింది” అన్నాడు. వెంటనే, నేను గంభీరంగా, “నేనా పుస్తకాలు చదివాను. అలా రాయలేదు” అన్నాను. వాడు తెల్లబోయి నోర్మూసుకున్నాడు.

మద్రాసులో వుండే రోజుల్లో, పాండీబజార్లో ఒక తెలుగు పుస్తకాల షాపుండేది. దాని యజమానురాలు, “రాముణ్ణి తిట్టడం వల్ల రంగనాయకమ్మకి కళ్ళు పోయాయి. తాటి కాయంత అక్షరాలు రాస్తేనే గానీ కనబడవు. అందుకే ఏ పబ్లిషరూ ఆవిడ పుస్తకాలు వేసుకోవడం లేదు ఇప్పుడు” అని చెప్పేది షాపుకి వచ్చిన వాళ్ళతో. వెళ్ళడం మానేశాను అక్కడకి.

తర్వాత రోజుల్లో నల్లకుంటలో ఒక అద్దె పుస్తకాల షాపు పట్టుకున్నాను. పావలా ఇస్తే ఒక నవల రెండు రోజులుంచు కోనిచ్చేవాడు. రంగనాయకమ్మ గారి పుస్తకాలు ఎక్కువగా అక్కడే చదివాను. ఎం.ఫిల్‌ చదివే రోజుల్లో వున్న ఫ్రెండ్స్ సర్కిల్‌లో పుస్తకాలు ఒక్క పిసర చదివేది నేను మాత్రమే. అందువల్లే అప్పుడు అంత కూపస్థ మండూకంలా వుండి పోయానని అనుకుంటూ వుంటాను. అంటే అర్థం ఇప్పుడేదో పూర్తిగా జ్ఞానం వచ్చినట్టు కాదు. ఎటొచ్చీ అప్పుడున్నంత అజ్ఞానంలో మాత్రం లేను.

ఎం.ఫిల్ అయ్యాక మొట్ట మొదటి ఉద్యోగం ఢిల్లీలో వచ్చింది. ఇంకొకతనూ, నేనూ కలిసి, డాబా మీద, మూడో అంతస్థులో ఒక్కటంటే ఒక్క గది అద్దెకి తీసుకుని వుండేవాళ్ళం. ఆ గదిలో నిలువెత్తు గూడు, రెండు, మూడు అరలతో వుండేది. అదే మా వంటిల్లు. రోజూ వంట చేసుకునే వాళ్ళం. కరోల్‌బాగులో వుండే వాళ్ళం. ఆ పేటలో ఒక కిళ్ళీ కొట్టుండేది. అక్కడ అన్ని హిందీ పేపర్లూ, రెండు వారాల ఆలస్యంతో ఆంధ్రజ్యోతి వార పత్రికా దొరికేవి విచిత్రంగా. ఆలస్యం అయినా, నాకు ప్రతీ మంగళ వారం ఒక కొత్త పత్రిక దొరికేది. కొనుక్కునే వాడిని. అందులో ‘జానకి విముక్తి-2’ సీరియల్‌గా వచ్చేది. అప్పటికి జానకి విముక్తి మొదటి భాగం చదవలేదు. కాస్త వూహించుకున్నాను. జానక్కి విముక్తి వచ్చినప్పుడే, నాక్కూడా విముక్తి కలిగి, ఢిల్లీ వదిలి హైదరాబాద్‌కి దగ్గర్లో వేరే వుద్యోగానికి వెళ్ళి, అమ్మా నాన్నలకి దగ్గరగా వుంటానని అనుకుంటూ వుండే వాడిని. ఆ నవలలో సత్యం చెల్లెలికి రాసిన వుత్తరాలు చాలా వరకూ అర్థం అయ్యేవి కావు. మనుషులు నాస్తికులైతే చాలు అని అనుకునే వాడిని. జానకి విముక్తి రెండవ భాగం అయిపోయింది. అదే జానక్కి ‘విముక్తి’ అనుకుని, బోలెడు సంతోషించాను. అది జరిగిన కొన్ని నెల్లకి మద్రాసులో వుద్యోగానికి ఢిల్లీ వదిలి పెట్టాను. నాక్కూడా “విముక్తి” కలిగిందని సంతోషించాను.

మద్రాసులో వుద్యోగంలో చేరాక రంగనాయకమ్మ గారి పుస్తకాలన్నీ కొనడం మొదలుపెట్టాను. ఒక సారి బాస్కరన్ అనే కొలీగ్ ఏమన్నా గిఫ్ట్ ఇస్తానన్నాడు, అతనికి ఏదో చిన్న సహాయం చేశానని. గిఫ్టు వద్దన్నా వినలేదు. “నీ కిష్టమైంది చెప్పు” అని పట్టుకున్నాడు. ‘సరే’ అని పుస్తకాల షాపుకి తీసుకువెళ్ళాను. అప్పుడు అతని చేత “రామాయణ విషవృక్షం” మూడు భాగాలూ కొనిపించాను నాకు గిఫ్ట్‌గా ఇవ్వడానికి. ఇప్పుడు, ‘విషవృక్షం’ అంతా ఒకే సంపుటంగా వుంది. మళ్ళీ కొన్నాను. నేనే దాన్ని గిఫ్టులు ఇస్తాను.

 

You Might Also Like

17 Comments

  1. lokesh

    బాగా రాశారు .
    పుస్తకం మీద నేనింకా ఒక అభిప్రాయానికి రాలేదు కానీ మీ వ్యాసం నచ్చింది .

  2. పి. మోహన్

    వ్యాసం బావుంది. అసంపూర్ణంగా అనిపించినా ప్రాసెస్ చెప్పారు కనక అర్థం చేసుకోవచ్చు. ఈ పుస్తకం నన్ను కూడా మార్చింది. ఇంటర్ ఫస్టియర్ 1994 ప్రాంతంలో చదివాను. మైండ్ బ్లోయింగ్. నాస్తికుడిగా , తర్వాత, రంనా మిగతా పుస్తకాలు చదివి ఇంకా చాలా మారిపోయాను.
    ఆ రోజులను మళ్లీ గుర్తుకు తెచ్చినందుకు థ్యాంక్స్.

  3. Subramanyam Naidu

    జె. యు. బి. వి. ప్రసాద్ గారు .

    మీకు మీరు చదివిన రచనలు అర్ధం చాల వరకు అర్ధం కాన్నట్టె మాకు ఏమి అర్ధం కాలేదు ఇంతకీ ఏ పుస్తకం మిలో ఏ మార్పు తిసుకోచ్చిందో చెప్పనే లేదు…

  4. tejaswi

    జయశ్రీ, తిరుపాలు, శరత్ ల వ్యాఖ్యలలోని భావమే నాదీనూ. అందుకే అసంపూర్తిగా ఉందన్నానండి. పుస్తకం మీలో తెచ్చిన మార్పుపై వీలైతే మరో వ్యాసం రాయండి.

  5. Jayasree Devineni

    ఆసక్తి కరంగా రాసారు. టైటిల్ “నన్ను మార్చిన పుస్తకం” అని పెట్టి లోపలేమో ఎలా చదవటం మొదలుపెట్టారో రాసారు. అలాగే అప్పటి మీ భావాలు చివరికి మీ స్నేహితుడి కోరిక మీద మీరు రామాయణ విషవృక్షం మూదు భాగాలూ స్వంతం చేసుకోవటం వరకు బాగుంది. కానీ టైటిల్ కి తగ్గట్టుగా పుస్తకం మీలో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందో రాయలేదు.

  6. Thirupalu

    జె. యు. బి. వి. ప్రసాద్ గారు,
    మీరు ‘ రామాయణ విష వృక్షం ‘ పరిచయం చేసిన తీరు చాలా బాగుందండీ!
    సరిగ్గా మీరు ఆలోచించినట్లే ఆలోచెంచేవాడిని నేను కూడా. జానకి విముక్తి లోని కొన్ని అద్యయాలు చదివి( ఆంద్రజ్యోతిలో వస్తున్న సీరీయల్‌ లే లెండీ) నేను కూడా నాస్తికత్వమ్మీద అభి మానం పెంచుకొనే వాడీని. తిరుపతి కెళ్లి గుండు కొట్టించు కునే ఆడవాల్లంటే అసవ్యంగ చూసే వాడిని.
    అన్నట్టు మీరు మద్రాస్‌ పాండి బజార్‌ గురించి చెప్పారు కనుక నాకు గుర్తున్నవిషయం కూడా చెపుతాను. ఆ బుక్‌ షాప్‌ పేరు రాణి బుక్‌ సెంటర్‌. ఆమేకు ఇలాంటి పుస్తకాలంటే గిట్టేవి కాదు. అంతకు మునుపు నవోదయ వాల్లు బుక్‌ షాప్‌ నడుపుతూ మధ్యలో ఎందుకో తీసేశారు. ఆ తర్వాత ఈ షాప్‌ వెలసింది.
    తీరా చూస్తే మీరేమో పుస్తక పరిచయాన్నొదిలిపెట్టి మీ అను భూతులు నెమరు వేసుకున్నారులెండి!

  7. sarath

    idi pustakam gurinchaa? ee vyaasam raasina vaari gurincaa? pustaka rachayita gurinchaa?

  8. tejaswi

    అసంపూర్తిగా ఉంది మీ వ్యాసం.

    1. ప్రసాద్

      తేజస్వి గారూ,
      మీ వ్యాఖ్య కూడా “నా వ్యాసం లాగానే” అసంపూర్తిగా వుంది. 🙂 🙂
      మీకు వీలైతే, ఏమన్నా సలహాలు వుంటే చెప్పండి. వీలైతే, వాటితో అంగీకరించ గలిగితే, నా వ్యాసం దిద్దుకుంటాను. లేకపోయినా ఫరవాలేదు.
      – ప్రసాద్

  9. kv ramana

    మీరు రాసిన విధానం బాగుంది. ఆసక్తికరంగా ఉంది. పుస్తకాలు, అందులోనూ ఆసక్తి కలిగించే పుస్తకాలు చదవడానికి ఎంత తపన పడతామో బాగా రాశారు. పుస్తకంలో ఏం నచ్చిందన్నది తర్వాతి విషయం.

    1. ప్రసాద్

      శరత్‌ గారూ,
      🙂
      38 యేళ్ళ తర్వాత కూడా, ఈ నరసింహ ఇంకా స్నేహంగానే వున్నాడు. మొన్ననే మాట్టాడి, ఈ వ్యాసం గురించి చెప్పాను.
      – ప్రసాద్

    2. ప్రసాద్

      రమణ గారూ,
      మీరన్నది కరెక్టే. ఈ పుస్తకం వచ్చి 38 యేళ్ళు దాటింది. ఈ పుస్తకంలో వున్న విషయాలు చాలా మందికి తెలుసు.
      – ప్రసాద్

  10. Sarath

    “కూతురికి బిడ్డ పుట్టిన కొన్నేళ్ళ తర్వాత తల్లికి అతను పుట్టాడు.”
    ii vakyam bagundi.

  11. shyam

    బాగుంది. కానీ, ఆ కాలన్ని తెలియజేస్తూ రాస్తే మీ పరిణామ క్రమం తెలిసేది. ఇంకా బాగుండేది. ప్రిజుడిసులు అప్పుడూ, ఇప్పుడూ వున్నా, వుండడం తప్పు కాదేమో.బహుశా అందువల్లే రాయగలుస్తున్నరేమో. పోనీ, మరోసారి జీవితం చదువూ, పుస్తకాలూ, మార్పులూ రాయండి. అభినందనలు.

    1. ప్రసాద్

      శ్యాం గారూ,
      “కానీ, ఆ కాలన్ని తెలియజేస్తూ రాస్తే మీ పరిణామ క్రమం తెలిసేది” అని మీరు రాసింది, చాలా మంచి సలహా. నాకు తట్ట లేదు ఇంతకు ముందు. ఈ వ్యాసాన్ని మళ్ళీ ప్రచురించే ముందర, మీ సలహా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాను. కృతజ్ఞతలు.
      – ప్రసాద్

  12. kiran

    ఆ పుస్తకం మిమ్మల్ని ఎలా మార్చిందో మీరు రాయలేదు. అది చదవక ముందు కూడా మీరు నాస్తికులే అన్నారు కదా..బహుశా మీ నాస్తిక భావాలకు బాగా బలం ఇచ్చి ఉండొచ్చు. ఆ పుస్తకంలో మీకు అంతగా నచ్చిన విషయాలు ఏంటొ చెప్తే బావుండేది. ఆ పుస్తకం చదివిన తర్వాత మీ జీవితంలో వచ్చిన(ఆలోచనల్లో కాదు) గొప్ప మార్పులు చెప్తే మరింత సహేతుకంగా ఉండేది.

    1. ప్రసాద్

      కిరణ్‌ గారూ,
      బాగానే అర్థం అయ్యేటట్టు రాశాననుకున్నాను. అలా కాదన్న మాట.
      ఆ పుస్తకం చదవక ముందర నా మనఃస్థితి: దేముడికి వ్యతిరేకంగా (ఉనికిలో లేని వారికి వ్యతిరేకంగా – అంటే, దేముడి మంచి వాడు కాదని వాదించడం) మాట్టాడ్డం, నాస్తికత్వం మాత్రమే (ప్రకృతి గురించి మాత్రమే పట్టించుకోవడం) చాలనుకోవడం, పీఠిక 90% అర్థం కాని దశలో వుండటం, శ్రీశ్రీ కవిత్వం చదివి అయోమయంగా, అనవసరంగా ఉద్రేకపడ్డం, వగైరా.
      “ఆ పుస్తకం చదివి మారాను” అనంటే, దానర్థం, ఒక్క సారి మాత్రమే చదివేసి, మారిపోయానని కాదు. మళ్ళీ, మళ్ళీ చదవడం వల్ల, అదంతా ఒక ప్రోసెస్‌లో, కొన్నేళ్ళలో జరిగింది.
      ఇంకా స్పష్టంగా రాయాలన్న మాట.
      – ప్రసాద్

Leave a Reply