మాధవ్ గాడ్గిల్ గారి ముచికుందుడి కథ

మాధవ గాడ్గిల్ గారి పరిశోధన గురించి ఇదివరలో చాలా కొద్దిగా తెలుసు. ఆయన పిల్లల కోసం రాసిన పుస్తకం అనగానే కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఈ ఆశ్చర్యం వల్లనే పుస్తకం చదవడం మొదలుపెట్టాను. ఒక మామూలు పిల్లల కథలాగానే, ఏ చందమామలోనో ఉన్న ఫాంటసీ కథలాగానే చదువుతూ వెళ్ళాను. మధ్య మధ్య బాక్సుల్లో కథలోని చిత్రణ వెనుక కథలు కూడా రాస్తూ సాగడంతో, ఓహో, కథతో పాటు ఇతర విషయాలు కూడా బోధిస్తున్నారు కాబోలు అనుకున్నా. కానీ, చివరికి వచ్చేసరికి, అద్భుతం! అనుకున్నాను. తప్పకుండా నాకు తెల్సిన పది పన్నెండేళ్ళ వయసు పిల్లకాయలకి ఇది కానుకగా ఇవ్వాలి అనిపించింది. ఇంతకీ, ఏమిటి నన్ను ఇంతలా ఆకట్టుకుంది ఇందులో?

కథ: ముచికుంద్ అన్న తెలివైన యువ దయ్యం కథ ఇది. అతను మున్జియా అనే దయ్యం జాతి వాడు. ఆ దయ్యాలు కామరూపులు అనమాట. కాబట్టి అతను బుద్ధి పుట్టినప్పుడు పూణే విశ్వవిద్యాలయంలో విద్యార్థిగా మారి క్లాసులకి వెళ్తూ కాలక్షేపం చేస్తూ ఉండగా, వాళ్ళ మామ అతన్ని మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలోని అడవికి విహారయాత్రకి ఆహ్వానించాడు. దానితో ఇతనక్కడికి ఓ గెంతు గెంతి, అక్కడ ఇబ్బడి ముబ్బడిగా ఉన్న తేనెతుట్టెలని ఎలుగుబండి రూపంలోకి మారి చెట్లెక్కి ఆస్వాదించడం మొదలుపెట్టాడు. అయితే, ఒక సందర్భంలో.. “నాకు సరే సరదాగా బాగానే ఉంది. ఈ గొడవలో మనం చంపేసిన వేలాది తేనెటీగల సంగతేమిటి?” అన్న ఆలోచన కలిగింది. ఆ తరువాత, తామూ తేనె సేవించాలి, తేనెటీగలూ బతకాలి.. ఎలా? అని ఆలోచించి చాలా తెలివిగా ఎలుగుబండ్లకి, తేనెటీగలకీ మధ్య ఒక ఒప్పందం కుదిర్చి, తేనెటీగల్ని చంపకుండా ఎలుగులు అప్పుడప్పుడూ తేనె జుర్రుకునేలాగ; ఎలుగులని తేనెటీగలు కుట్టి కుట్టి పెట్టకుండా ఏర్పాటు చేసాడు చివరికి. ఎలా? అన్నది కథ.

నేను మొదటి నుండి అది ఏదో ఫాంటసీ కథ అనుకుంటూ‌ వచ్చాను, ఇందాక అన్నట్లు. కానీ, ఈ పుస్తకంలోని అసలు థీం – వార్ధా ప్రాంతంలో తేనెటీగలను పరిరక్షిస్తూ, సేంద్రియ పద్ధతుల్లో తేనె ఎలా సేకరిస్తున్నారో తెలుపడం. ఇందులో ఈ కథతో పాటు, మన పురాణకథల్లో ఉండే దయ్యాల్లో రకాల మొదలుకుని, సేంద్రీయ పద్ధతుల్లో సేకరించే తేనె వల్ల తేనెటీగల సంతతిని ఎలా మొత్తానికే నశించకుండా కాపాడుకోవచ్చు? అన్న విషయం దాకా అనేక విషయాలపై వివరాలు తెలియజేస్తారు – ఎక్కడా కథ నుండి పక్కదోవ పట్టకుండానే, ఎక్కడికక్కడ కనబడే డబ్బాల్లో.

పిల్లలతో సంభాషించి అవగాహన కలిగించడానికి ఈ కథనాన్ని ఎన్నుకోవడం, అదీ గాడ్గిల్ వంటి పూర్తి స్థాయి పరిశోధకుడు చేయడం నాకు నచ్చింది. సొంతంగా చదువుకోవడం చేతనయ్యే పిల్లలకి కానుకగా ఇవ్వడానికి సరిగ్గా సరిపోతుందీ పుస్తకం! తెలుగు అనువాదం పర్వాలేదు.

******
పుస్తకం వివరాలు:
మరాఠీ మూలం: మాధవ్ గాడ్గిల్
తెలుగు అనువాదం: తురగా జానకీరాణి
బొమ్మలు: మాయ రామస్వామి
ప్రథం బుక్స్ వారి ప్రచురణ, 2013
పేజీలు: 36
పుస్తకం కొనుగోలు వివరాలు ఇక్కడ.
ఉచితంగా చదవడానికి కూడా వారి నుండే లభ్యం. వివిధ భాషల్లో చదివేందుకు లంకెలు ఇక్కడ.

You Might Also Like

One Comment

  1. ఫ్రాంక్ఫర్ట్ బుక్ ఫెయిర్ 2014 – నా అనుభవం | పుస్తకం

    […] స్టాల్ లో మాధవ గాడ్గిల్ గారి Muchkund, అటువంటి మరికొన్ని కొత్తగా వచ్చిన […]

Leave a Reply