తొలి తెలుగు డిటెక్టివు నవల ఏది?

వ్యాసకర్త: ఏల్చూరి మురళీధరరావు
(మురళీధరరావు గారి ఫేస్బుక్ గోడపై వెలిబుచ్చిన అభిప్రాయాన్ని వారి సూచన మేరకు ఇక్కడ ప్రచురిస్తున్నాము, సాహిత్య సంబంధమైనది కనుక)
****

శ్రీ కృష్ణశ్రీ గారు తమ బ్లాగులో , తెలుగులో మొదటి అపరాధ పరిశోధన నవల అంటూ 1929లో ఒక ప్రకటనగా వచ్చిన పుస్తక పరిచయాన్ని పొందుపరిచారు.

పేటికాంతర శవము.
పెరమల రామచౌదరీ గారిచే రచియించబడిన అత్యద్భుతాపరాధ పరిశోధక నవల.

ప్రస్తుతము మన ఆంధ్ర వాఙ్మయమునందుగల అపరాధక నవలలోనెల్ల నియ్యదియే మిన్నయని చెప్పకతప్పదు. ఇందుగల ప్రతివిషయమును అత్యద్భుతాశ్చర్యజనకమై నీతిబోధాత్మకమై, విరాజిల్లుచుండును. ఆనంద విషాదముల కునికిపట్టగు నీనవల చదువ మొదలుపెట్టినచో ముందేమిజరుగునో యను తహతహ వొడముచుండును. వేరొకచో జదువరుల గుండెలవిచ్చన్నముగా నుండవేమో యనునంత భయము పుట్టజేయును. ఇంకొక్కచోట నాహా! ఎంతయాశ్చర్యమని నొచ్చుకొనకపోరు. ఎట్టియద్భుతములు—యెంతలేసి చమత్కారములు—ఇందు—సత్ప్రవర్తనుడగు రమేశదత్తుపైబడిన నేరము—ఆయనను అరెస్టు చేయుట, ఇందిరానరేంద్రుల స్నేహవాత్సల్యము—రమాసుందరి విజయుల బద్ధానురాగము—పాపము!—నీలకంఠుని ఘోరమరణము—దివాకరజీగారి యపరాధపరిశోధనానైపుణ్యము—నరేంద్రవిజయుల గూఢచర్యలు—దాదుచెందుపై ననుమానము—అపరాధపరిశోధనయందుగల రమాసుందరి బుధ్ధికుశలత—మలయాకరజీ గారి మాయానటన (రక్షకభటోద్యోగము) ఎత్తుపైఎత్తులు, వింతలు పై వింతలు—ఘోరహత్యలు—యుక్తిప్రదర్శనములు—శక్తిసామర్ధ్యములు—కపటానురాగములు మాయవేషములు మోసములు చదివితీరవలెనేగాని వ్రాయనలవికావు. ఇంతయేల ఇట్టినవల ఇదివరకు మీరు చదివి యుండరనియే చెప్పవచ్చును. ఛక్కని కాగితములపై డెమ్మీసైజున 250 పేజీలు గలిగియుండును. మృదుమధురములగు పదములతో తేలిక శైలిలో నతిచక్కగా వ్రాయబడినది. వెంటనే పుస్తకములకు వ్రాయుడు. ఆలస్యమైనచో నాశాభంగమే.

వెల రు. 1—0—0.
శ్రీ బాలకృష్ణా బుక్ డిపో., బుక్సెల్లర్సు, రాజమండ్రి.

దీనిని గుఱించి ఆసక్తి కలిగి, ప్రయత్నింపగా నాకు “పేటికాంతర శవము” 1927 నాటి ముద్రణ దొరికింది. తెలుగు అకాడమీ వారి “తెలుగు సాహిత్య కోశము” ఇది అనంతపురం జిల్లా శింగవరపు గడియారం రామాశాస్త్రులు గారి రచన అని, 1874లో వెలువడినదని పేర్కొన్నది. దానిని చూసి తెలుగు దినపత్రికలలో “పరిశోధకులు” ఇదే తొలి తెలుగు డిటెక్టివు నవలా రచన అని వ్రాశారు. ఆ పేరుతో ఇంకొక ప్రతి ఉన్నదేమో! అని ప్రయత్నిస్తున్నాను. ఇప్పటికింకా దొరకలేదు. ఎప్పటికైనా తొలి తెలుగు డిటెక్టివు నవల ఏదో బయటపడాలి కదా!

You Might Also Like

8 Comments

  1. సూర్యుడు

    ఇప్పుడు మాయావి, మాయావిని పుస్తకాలు ఎక్కడైనా దొరుకుతాయా?

    1. YVG Krishna Rao

      I also want these novels

  2. varaprasad

    అయ్యారే బలే బలే ప్రాచీన రత్న మాణిక్యాలు,మరకతాలు,పచ్చలు,కెంపులు, వంటి పుస్తక రాజాల్ని గుర్తు చేసి మరో ప్రపంచం లోకి తీసుకు వెళ్తున్నారు.సంతోషం.

  3. మాలతి

    పరుచూరి శ్రీనివాస్ గారూ. ఏల్చూరి మురళీధరరావుగారూ అందించిన సమాచారానికి ధన్యవాదాలు

  4. మాలతి

    సమగ్రాంధ్రచరిత్ర 3వ సంపుటంలో ఆరుద్ర గారు చిత్రలేఖ అనే నవలని తొలి అపరాధపరిశోధకనవలగా పేర్కొన్నారు. చింతా దీక్షితులుగారు, చింతా భీమశంకరంగారు (దూరపుబంధువులుట) కలిసి చింతా శంకర దీక్షితులు అన్న కలంపేరుతో 1914లో ప్రచురించేరుట. (సమగ్రాంధ్రసాహిత్యం సం. 3. పుట 461).

    1. malathi

      నావ్యాఖ్యలో పొరపాటు – నేను కొట్ చేసిన అంశం 3వ సంపుటం కాదు 4వ సంపుటంలో ఉంది. తెలుగు ఎకాడమీ ప్రచురణ అది. ఏల్చూరి మురళీధరరావుగారు రెండు రోజులక్రితం మెయిలిచ్చేవరకూ నేను చూసుకోలేదు.
      నా పొరపాటుకి చింతిస్తున్నాను.

  5. Sreeni@gmx.de

    A few thoughts and some data …

    1. http://groups.yahoo.com/…/conversations/topics/9495 (a small list of detective novels published in Telugu, mostly based on Bengali books)
    2. We definitively know that వేంకట-పార్వతీశ కవులు (ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల) published published some “detective” books by late 1910s.
    3. I am not sure if the publishing year of 1874 given in “తెలుగు సాహిత్య కోశము” is reliable. I believe its following “Saalivaahana” calendar?! In fact, I doubt that this genre made it to Telugu by 1870s.
    4. aarudra has a long essay on this subject. If my memory serves right, published in Andhraprabha weekly in early 1990s.
    5. few more pre-1927 detective novels that were not earlier listed by me:
    a. మాధవసేనుడు – కె.బి. శ్రీకంఠశాస్త్రి – నిడదవోలు – ఆంధ్ర ప్రచారిణీ గ్రంథమాల – 1916 (probably earlier!)
    b. “కాలురాయి అను నిరుపమాన నిరూపక నవల” – దేవరాజు వెంకటకృష్ణారావు పంతులు, వేగుచుక్క గ్రంథమాల, బరంపురం, 1922
    c. “కోటీశు తనయ అను అద్భుత నిరూపక నవల” – తాతా కృష్ణమూర్తి – same publisher, year as above. It is partly adapted from A. B. Reeve’s “The Exploits of Elaine, or the clutching hand”.
    d. పరమరహస్యము (translated from Marathi) – వాసుదేవరావు — 1917
    There are a few more from 1910s. But at this point I can not say which is the *first* detective novel published in Telugu. Does anyone have access to Arudra’s essay on this subect?

    Regards,
    Sreenivas

  6. ఏల్చూరి మురళీధరరావు

    1874లో గడియారం రామాశాస్త్రులు గారి ‘పేటికాంతర శవము’ అనంతపురం నుంచి వెలువడిందని తెలుగు అకాడమీ వారి ‘తెలుగు సాహిత్య కోశము’లో ఉన్నది. అయితే, ఆ “అత్యద్భుత నిరూపక నవల” ‘పేటికాంతర శవము’ గ్రంథకర్త చిత్తూరు జిల్లా మదనపల్లె వాస్తవ్యులైన పెరమల రామచౌదరి గారని; అది 1927లో అచ్చయిందని ఇప్పుడు దొరికిన ప్రతిని బట్టి తెలుస్తున్నది. మాన్యులు, ప్రముఖ సాహితీవేత్త శ్రీ బందా లక్ష్మీనరసింహారావు గారు దీనిని గుర్తించి, ఆచూకీ తెలియజేసి నాకెంతో తోడ్పడారు.

    ‘పేటికాంతర శవము’ అన్న అదే పేరుతో గడియారం రామాశాస్త్రులు గారి అపరాధ పరిశోధక నవల వేఱొకటి అంతకు మునుపే వెలువడిందేమో కనుగొనవలసి ఉన్నది.

    ఇప్పటి వఱకు లభించిన సమాచారాన్ని బట్టి దేవరాజు వెంకట కృష్ణారావు గారి ‘వాడే వీడు’ (1912), ‘నేనే’ (1918), ‘కాలూ రాయ్’ (1925) తొలితరం అపరాధ పరిశోధక నవలల శ్రేణిలో ఉన్నాయి.

    1915లో ఆంధ్ర ప్రచారిణి పక్షాన వేంకట పార్వతీశ కవుల ‘సాధన’, పాంచకడీ దేవు రచనల అనువాదాలు ‘మాయావి’, ‘మాయావిని’, ‘మనోరమ’ వెలువడ్డాయి (ఈ నాలుగు నవలల సంక్షిప్త వ్యావహారిక రూపాంతరాన్ని 1968 ప్రాంతాలలో ‘యువ’ మాస పత్రిక వెలువరించింది). 1915 నుంచి రాజమండ్రి, పిఠాపురం, కపిలేశ్వరపురం కేంద్రాలుగా అపరాధపరిశోధనేతివృత్తంతో నవలలు పుంఖానుపుంఖంగా అచ్చయాయి. అది గ్రాంథిక నవలా యుగం. 1936లో చింతా భీమశంకరం గారి తొలి తెలుగు స్వతంత్ర నవల ‘అగ్గిరాముడు’ సమకాలిక సంఘటనల వ్యంగ్యసమన్వయంతో జానపద-కాల్పనిక నైపథ్యానుసంజనతో అపరాధపరిశోధనేతివృత్తంతో ప్రజల ముందుకు వచ్చింది.

    1923లో వెలువడిన అబ్బూరి రామకృష్ణారావు గారి ‘మంగళసూత్రము’ ప్రతిని బూదరాజు రాధాకృష్ణ గారు మచిలీపట్నం నుంచి అత్యంత జీర్ణావస్థలో సంపాదింపగా దానికి నేను యథాతథంగా ఒక నకలు వ్రాశాను. అది 1995లో అబ్బూరి ట్రస్టు పక్షాన అచ్చయింది. ‘మంగళసూత్రము’ రెండవ భాగమైన ‘దుర్గాప్రసాద విజయము’ ఇప్పటిదాకా బయటపడలేదు.

    1924లో కేతవరపు వెంకటశాస్త్రి గారి ‘పరిణయ రహస్యము’ అచ్చయింది. చారిత్రక నవలలను, థ్రిల్లర్ రచనల అనువాదాలను అప్పటికే చేపట్టారు. వారి ‘ఐవాన్హో’ అనువాదం 1910 నాటికే వచ్చింది.

    వి. సన్యాసయ్య నాయుడు ‘దొంగతనము’, వాడ్రేవు మల్లపరాజు ‘భయంకర నారీపిశాచి’, ‘భయంకర చోరాగ్రేసర చక్రవర్తి’, జి. సుబ్రహ్మణ్యశర్మ ‘భూతగృహము’, కేతవరపు రామకృష్ణశాస్త్రి ‘భీషణ ప్రతిహింస’, ‘రహస్యభేదనము’, ములుగు వెంకటకృష్ణయ్య ‘హర లాలు’, కనకదండి సీతారామయ్య ‘వాడే దొంగ’, అవసరాల శేషగిరిరావు ‘ఆత్మహత్య’, గాడేపల్లి సూర్యనారాయణశర్మ ‘గజదొంగ’, అయ్యగారి నరసింహమూర్తి ‘చోరశోధకుడు’, మన్నన రామారావు ‘పాతాళగృహము’, జొన్నలగడ్డ వెంకట రాధాకృష్ణయ్య ‘అపరాధి ఎవరు?’ 1930కి మునుపు ప్రకాశితమైన రచనలు.

    తొలి తెలుగు అపరాధ పరిశోధక నవల ఆచూకీ ఇంకా బయటపడవలసే ఉన్నది.

    నా అభ్యర్థనను పురస్కరించికొని ఈ లఘుప్రస్తావికను ప్రకటించిన పుస్తకం.నెట్ సంపాదికలకు ధన్యవాదాలు!

Leave a Reply to సూర్యుడు Cancel