సప్తవర్ణాల కరచాలనం

వ్యాసకర్త: సూరంపూడి పవన్ సంతోష్
******

తెలుగువారిలో ఏ లలిత కళలోనైనా మంచి కళాకారులకులోటు లేదు. రసజ్ఞుల కొరత మాత్రం ఉంది. అంటే దాని అర్థం తెలుగువారు కళను ఆస్వాదించలేరని కాదు. ఉత్తమ కళారూపాలకు దూరంగా ఉన్నారు. అందుకే రసజ్ఞత అంటడం లేదు. నిజానికి ప్రతి వ్యక్తీ ఉత్తమ కళారూపాల్ని ఆస్వాదించగలిగే స్థితిలోనే ఉంటారు. మా స్నేహితులు ఎందరో కవిత్వం అంతగా పడదన్నట్టు మాట్లాడేవారు సిరివెన్నెల సాహిత్యాన్ని అభిమానించడం, కేవలం సినిమాల్లో ‘మాస్ పాటల’నబడే వాటినే వినే మా చెల్లి రెండేళ్ళ క్రిందట ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, కెజె.ఏసుదాసు వంటి విద్వాంసులు పాడిన కృతులు రెండు విని కర్నాటక సంగీత సాగరంలో మునిగి తేలడం వంటివి దాన్ని సమర్థిస్తాయి. ఇలా చెప్పాలంటే చాలా ఉదాహరణలు ప్రతివారికీ ఉంటాయి.
సారాంశం ఏమింటంటే మనలో చాలామంది కేవలం పరిచయం కాకనే అద్భుతమైన వాజ్మయం, అమృతతుల్యమైన సంగీతం(శాస్త్రీయమో, జానపదమూను), అజరామరమైన చిత్రకళ వంటివి ఆస్వాదించలేకున్నారు. అటువంటి పరిచయం తల్లిదండ్రులు, బంధుమిత్రులు కానీ, పత్రికలు, సినిమాలు వంటి మాధ్యమాలు కానీ చెయాలి. అయినా ఆ ప్రయత్నాలు చాలా తక్కువగానే జరుగుతున్నాయి.

తెలుగులో హిందుస్తానీ సంగీతం గురించి సామల సదాశివ, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ వంటివారు, కర్నాటక సంగీతం గురించి సినిమాల ద్వారా కె.విశ్వనాథ్, బాపు తదితరులు పరిచయం, ప్రచారం, విశ్లేషణలు చేసి కొంతవరకూ రసజ్ఞ లోకాన్ని సృజించే ప్రయత్నాలు చెసారు. అయితే చిత్రకళకు సంబంధించి అటువంటి ప్రయత్నాలు చాలా చాలా అరుదు. ఆ లోటును తీర్చడానికి, మనల్ని రంగుల కలలలోకి తీసుకువెళ్ళడానికి వచ్చిన పుస్తకం – సప్తపర్ణి.

రసజ్ఞులు, రచయిత కాండ్రేగుల నాగేశ్వరరావు మిసిమి పత్రికలో చిత్రకళ గురించి, ఈ భూమిలో సినిమాల గురించి రాసిన వ్యాసాలూ, ఫోటోగ్రఫీ గురించి, శిల్పకళ గురించిన చెరో వ్యాసంతో రూపుదిద్దుకున్న సంకలనం ‘సప్తపర్ణి’. పుస్తకంలోని 68 వ్యాసాల్లో 47కు పైగా వ్యాసాలతో చిత్ర కళకు సంబంధించిన వ్యాసాలది అతిపెద్ద వాటా. చిత్రకళలో అతిరథ మహారథుల గురించీ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పికాసో గుయెర్నికా లాంటి కళాఖండాల గురించి, క్యూబిజం, డాడాయిజం వంటి ధోరణులు, చిత్ర శిల్ప కళల్లో నగ్నత్వం లాంటి అంశాలపై వ్యాసాలున్నాయి. ఇందులో వ్యాసాల్లో పరిచయం, లోచూపు, విశ్లేషణ, విమర్శలు, వివరణలు ఇస్తూ చిత్రకళపై పాఠకులకు ఆసక్తి, కొంత అవగాహన కలిగిస్తారు.

ప్రముఖ చిత్రకారుల గురించిన వ్యాసాల్లో వారి చిత్రాల్లో ప్రాముఖ్యత పొందిన కళాఖండాలు ఆస్వాదించేందుకు వీలుగా అందంగా ప్రచురించారు. ఆయా చిత్రాల గురించి కొన్నిచోట్ల విశ్లేషణలు, సూచనలు ఇచ్చారు. మిగిలినవి ఎవరికివారు ఆస్వాదించేందుకు వీలుగా వదిలేశారు. ఈ క్రమంలో పుస్తకమంతా అపురూపమైన కళాఖండాలతో అందంగా తయారయ్యింది. చివరి అట్టలోపల సిస్టెయిన్ చాపెల్ (బహుశా చర్చిలోని కుడ్యచిత్రం అనుకుంటా) మైకెలాంజిలో వేసిన కుడ్యచిత్రం, మొదటి అట్టలోపల చిత్రకారిణి బ్రిడెట్ రిలే డిజైన్ లతో అలంకరించారు. వివిధ సైజుల్లో, నాణ్యంగా అచ్చొత్తిన చిత్రాలు మూడంకెల సంఖ్యను దాటేసాయి. పైగా వాటిని ఏళ్ల తరబడి చెక్కుచెదరని స్థితిలో కాపాడుకోవడానికి తడి తగలని, చల్లని ప్రదేశంలో పుస్తకం దాచుకోవాలని జాగ్రత్త కూడా ఇచ్చారు ప్రారంభంలో. నేను జోడించే జాగ్రత్త ఏమిటంటే ఎవరడిగినా ఈ పుస్తకం ఇవ్వకోడదు. లేదంటే తిరిగిరాదు. ఈ చిత్రాలన్నీ పుస్తకాన్ని కొని ‘భద్రంగా’ దాచుకోవాల్సిన పుస్తకంగా చేశాయి.

ఈ వ్యాసాల్లో ప్రముఖంగా డాడాయిజం, ఇంప్రెషనిజం, అధివాస్తవికత(సర్రియలిజం), విశిష్ట వాదం(క్లాసిక్) వంటి వివిధ చిత్రకళా శైలులు, తాత్త్వికతలలో, తెలుపు రంగు, భారతీయ సంప్రదాయ రంగులు వంటి వివిధ వర్ణాల్లో ప్రయోగాలు చేసి వాటికి ప్రతినిధులుగా నిలిచిన పాశ్చాత్య, భారతీయ వైతాళికులను ఎన్నుకున్నారు. తద్వారా వివిధ శైలులు ఏ చారిత్రిక, సామాజిక స్థితిగతుల నడుమ ఏర్పడ్డాయో, ఆయా శైలుల చిత్రాల విశిష్టత ఏమిటో వారి జీవితాలను గురించి చెప్తూ పడుగుపేకల శైలిలో చెప్పగలిగారు. ఇక మరికొన్ని వ్యాసాల్లో పై ప్రణాళికలో ఇమడని మరికొందరు భారతీయ, తెలుగు చిత్రకారుల గురించి వివరించారు. మిగిలిన వ్యాసాల్లో కొన్ని డాడాయిజం, సర్రియలిజం(అధివాస్తవికత), చిత్ర శిల్ప కళల్లో నగ్నత్వం వంటివి పూర్తిగా స్పృశించగా, మిగిలినవి హిట్లర్ కళాతృష్ణ, ప్రపంచంలోకెల్లా అతిపెద్ద చిత్రం, చిత్రాల వెనుక కథలు వంటి అంశాలతో అలరిస్తాయి. ఒకట్రెండు చాయాచిత్రకళ (ఆర్ట్ ఆఫ్ ఫోటోగ్రఫీ)కు సంబంధించిన వ్యాసాలూ ఉన్నాయి. వ్యాసం రాసిన నాటికీ నేటికీ ఏమైనా మార్పులు వచ్చినా, కొత్త విశేషాలు చేర్చదలిచినా తాజాకలం పేరుతో బాక్స్ కట్టి సంబంధిత వ్యాసం దగ్గరే వేశారు.

పికాసో “గుయెర్నికా” చిత్రం విశ్లేషించే వ్యాసంలో బాక్స్ కట్టి గుయెర్నికాలో కనీకనిపించని మెడవిరిగిన బాతు బొమ్మ ఇచ్చి, పక్కనే “మెడ విరిగిన బాతు కలలో కొచ్చి కలవరపెట్టు నన్ను” అని అమృతం కురిసిన రాత్రి సంకలనం నుంచి తిలక్ కవితా ఖండికను ఇచ్చారు. 1936ప్రాంతంలో గుయెర్నికా చిత్రీకరిస్తే 1941లో తిలక్ పై కవిత రాశారు. చిన్నతనం నుంచి అమృతం కురిసిన రాత్రి కవితా సంకలనం చదివీ చదివీ ఆనందించే నేను సప్తపర్ణిలో పై విశేషం చదువుతూనే ఆనందంతో చప్పట్లు కొట్టాను. గుయెర్నికాలోని యుద్ధబీభత్సం తిలక్ లాంటి సున్నిత హృదయుణ్ణి ఎంత కరుణారసవిప్లావితుణ్ణి చేసిఉంటుందో అనిపించింది. ఇటువంటి రసగుళికలు ఈ పుస్తకంలో కోకొల్లలు.

ఇక రామారావు గారి భాష సూటిగా, సరళంగా ఉంది. గతంలో చెదురుమదురుగా తెలుగులో చిత్రకళ గురించి కొందరు దిగ్దంతులే ప్రయత్నాలు చేసినా అవి పూర్తిగా పాఠకులకు సరిగా అర్థంకాని భాషలో ఉండడంతో ఉద్దేశించిన ప్రయోజనం సిద్ధించక ప్రయత్నాల్లా మిగిలిపోయాయి. ఈ నేపథ్యంలో నాగేశ్వరరావు చిత్రకళకు చెందిన సాంకేతికాంశాలను కూడా విషయంలోని స్పష్టత కోల్పోకుండా వీలైనంత తేలికగా అర్థమయ్యే వాడుక భాషలోనే రాశారు. మరీ క్లిష్టమైన అంశాలే తీసుకోకుండా వైవిధ్యమైన, వినోదభరితమైన విశేషాలు, అభిరుచిని పెంపొందించే అంశాలు తీసుకుని ఆసక్తికరంగా రాశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది కేవలం చిత్రకళ విద్యార్థులకో, చిత్రకారులకో పరిమితమైన అకడమిక్ గ్రంథం కాదు. అందరూ చదివి అభిరుచి పెంచుకునేందుకు వీలు కల్పించే చక్కని పుస్తకం.

ఇక మిగిలిన సినిమా వ్యాసాలూ, సాహితీ వ్యాసాలలో మంచివి, గొప్పవి ఉన్నాయి. ఐతే అవన్నీ ఇక్కడ ప్రస్తావించను. ఎందుకంటే- నేడు సినిమాల గురించి పుంఖానుపుంఖాలుగా సాహిత్యం వస్తోంది. ఆ మాత్రానికి కాండ్రేగుల రాయకూడదు అని కాదు కానీ ఇక్కడ వేయడంలో ఔచిత్యం కనపడదు. అవి ఎంత ఉత్తమాభిరుచితో ఉన్న వ్యాసాలైనా అపురూపమైన కళాఖండాలు, చిత్రకళాంశాలపై అద్భుతమైన వ్యాసాల మిరుమిట్ల నడుమ అవి ఆనవు. అవి వేరే సంకలనంగా వేసి ఉంటే “సప్తపర్ణి” ఖరీదు, బరువూ కాస్తయినా తగ్గి సాంద్రత పెరిగేది.

పుస్తకాన్ని అందంగా ముద్రించేందుకు తీసుకున్న వ్యయ ప్రయాసలు నాణ్యమైన ప్రతి రూపుదిద్దుకోవడంలో ఫలించాయి. రంగుల ఎంపిక, కాగితం నాణ్యత, ముద్రణ నాణ్యత ఉన్నతస్థాయిలో ఉన్నాయి. ఐతే ఇంత చక్కని చందమామకు మచ్చల్లా అచ్చుతప్పులు కనిపిస్తాయి.

ఈ సప్తపర్ణికి కొనసాగింపుగా సప్తపర్ణి-2 రానున్నట్టు చివరిపేజీలో ప్రకతించారు. దామెర్ల రామారావు, బాపు, ఆనంద కుమారస్వామి వంటి వైతాళికులను మొదలుకొని నేటి ప్రతిభాశాలి గిరిధర్ గౌడ్ వరకూ పలువురు చిత్రకారులు, సాలార్ జంగ్ మ్యూజియం చిత్రాలు, చిత్రకళలో నగ్నత్వం రెండవ భాగం లాంటి కళాంశాలపై వ్యాసాలూ ఉంటాయని ఉంది. దీన్నిబట్టి చూస్తే అదీ మంచి పుస్తకం అవగలదు.

చిత్ర కళాభిమానులకు తాయిలంలా, ఔత్సాహిక చిత్రకారులకు కరదీపికలా, చిత్రకళా విద్యార్థులకు పాఠ్యగ్రంథంలా, చిత్రకళ గురించి ఏమీ తెలియనివారికి ఉత్తమాభిరుచి గల స్నేహితునిలా భాసిస్తుంది ఈ సప్తపర్ణి. కొసరు: ఈ పుస్తకాన్ని 4.9.2013న హైదరాబాద్ స్టడీ సర్కిల్లో ఆవిష్కరించినపుడు నేనే తొలిప్రతి (అలా అని తెలియకుండానే) కొన్నాను. బహుశా ఇప్పుడు ఇది ఈ పుస్తకంపై వచ్చిన తొలి సమీక్ష కావొచ్చు.

***
సప్తపర్ణి
రచన: కాండ్రేగుల నాగేశ్వరరావు
వెల: రూ.777 (డీలక్స్ కాపీ)

****
సప్తపర్ణి పుస్తకంలోని కొన్ని చిత్రాలు (పెద్ద చిత్రం కావాలంటే చిత్రంపై క్లిక్ చేయండి):
డేవిడ్ “సోక్రటీస్ మరణం“.
david2

మైకెలాంజిలో చిత్రించిన ప్రఖ్యాత సిస్టేయిన్ చాపెల్ కుడ్యచిత్రం
inner pasting painting back

You Might Also Like

2 Comments

  1. mythili

    మంచి పరిచయం.పుస్తకం సంపాదించాలనే ఆసక్తిని కలిగించింది.

    1. pavan santhosh surampudi

      Thank you madam

Leave a Reply