పుస్తకం
All about booksపుస్తకలోకం

September 4, 2013

సహస్ర దళపద్మం-హైద్రాబాద్ నగరం

More articles by »
Written by: అతిథి
Tags: ,

(గమనిక: ఇది పరవస్తు లోకేశ్వర్ వ్రాసిన సలాం హైద్రాబాద్ నవలలోని భాగం. పుస్తకం.నెట్లో ప్రచురించడానికి మాత్రమే ఆయన నుంచి నేను అనుమతి తీసుకున్నాను – పవన్ సంతోష్ సూరంపూడి)
******
కుతుబ్షాహీల కాలంల ‘శివాజీ మహరాజా’తో ఉన్న సఖ్యత కారణంగ సర్దేశ్ ముఖి, చౌత్ పన్నుల వసూళ్లకు శివాజీ మహారాష్ట్రులను హైద్రాబాద్, తెలంగాణాలలోని ముఖ్యపట్టణాలకు తన ప్రతినిధులుగ నియమించినాడు. కుతుబ్షాహీలకు, మహారాష్ట్రులకు ఇద్దరికీ ఔరంగజేబు ఉమ్మడి శత్రువు. అతడి దండయాత్రలను ఎదిరించడానికి కుతుబ్షాహీ రాజులు మహారాష్ట్రుల సైనిక సహాయం పొందేవారు. ప్రతిఫలంగ మహారాష్ట్రులు చౌత్ పన్నుల వసూళ్లకు తెలంగాణాలోని అనేక పట్టణాలలో స్థిరపడినారు. తర్వాత నైజాం కాలంల మరాఠా ప్రాంతాలకు ఔరంగాబాద్, పర్బనీ, భీడ్, నాందేడ్, హైద్రాబాద్ సంస్థానంల భాగం కాబట్టి మహారాష్ట్రులు పెద్ద సంఖ్యలో స్థిరపడినారు.

కర్ణాటక ప్రాంతాలైన బీదర్, గుల్బర్గా, రాయ్ చూర్లు నైజాం సంస్థానంల అంతర్భాగాలు కావున కన్నడిగులు కూడా పెద్ద సంఖ్యలో హైద్రాబాద్ల నివాసాలు ఏర్పాటు చేసుకున్నరు. ముచికుందానది దక్షిణ భాగంలోని నేటి పాతనగరం నైజాం పరిపాలకుల ముఖ్యకేంద్రం కావున దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వాళ్లందరూ నేటి పాతనగరంల స్థిరపడినారు. నేటి హైద్రాబాద్ నగరం మూసీకి దక్షిణం నుండి మూసీకి ఇవతల ఉన్న ఖైర్తాబాద్, అమీర్ పెట్, సుల్తాన్ బజార్ దిక్కు వ్యాపించింది.

కుతుబ్ షాహీల పాలన అంతమొంది ఆసఫ్ జాహీ నైజం రాజుల పరిపాలన ప్రారంభం కాంగనే వారి వెంబడి ఉత్తర భారతదేశం నుండి కాయస్థుల వలస వచ్చినారు. వీరు యమధర్మరాజు వద్ద ‘చిట్టాలు-ఆవర్జాలూ’ రాసే చిత్రగుప్తుని సంతానమని సగర్వంగా చెప్పుకుంటరు. వీరి ఉనికి చరిత్రల మొదటిసారిగ పృథ్వీరాజ్ చౌహానుల కాలంల వెలుగులకు వచ్చింది. బానిస ప్రభువులు, ఖిల్జీలు, లోడీల కాలం నుండి మొగల్ పరిపాలకుల కాలం వరకూ వాళ్లందరి ఆస్థానాలల్ల వీళ్లు గుమస్తాలుగ పని చేసెటోళ్లు. లెక్కపత్రాలు, మహాజర్లు(వినతిపత్రాలు), మిసాళ్లు(ఫైళ్లు) రాయడమే వీరి వృత్తి, ప్రవృత్తి, బతుకనేర్చి బాగుపడడం వీరి స్వభావం. తమకు సంబంధం లేని విషయాలల్ల తలదూర్చడం, ప్రధాన స్రవంతికి వ్యతిరేకంగ వెళ్లడం వీరు కనీసం కలల కూడ చేయరు. భారత ప్రజలంత ముస్లిం విదేశీ పాలకులను ఎదిరించే రోజులల్ల కూడ వీళ్లు ఆ రాజుల అడుగులకు మడుగులొత్తే ఉద్యోగలు చేసెటోళ్లు. ‘కాయస్థ్’ అంటే శరీరానికి లేదా భౌతిక విషయ వాంఛలకే అధిక ప్రాధాన్యత ఇచ్చేవాళ్లని కూడా అర్థం.

కుతుబ్ షాహీల రాజ్యం గోల్కొండను గెలిచిన తర్వత ఔరంగజేబు ఢిల్లీ నుంచి సుబేదరుగ చిన్ ఖులిచ్ ఖాన్ కు అసఫ్ జాహీ బిరుదునిచ్చి 1724ల దక్కన్ కు పంపినాడు. ఇతనే మొదటి నైజాం రాజు ఇతని వెంబడే కాయస్థులు ఉద్యోగస్థులుగ ఔరంగాబాద్, హైద్రాబాద్ లకు తరలి వచ్చినారు. తర్వాత కాలంల నైజాముల ఆస్థానంల వీళ్లు పేష్కార్లుగా(ఆర్థికమంత్రులు), దివాన్లుగా(ప్రధానమంత్రులు) పనిచేసినారు. ఉన్నతోద్యోగులుగా కూడా పనిచేసినారు. మహారాజా చందూలాల్, మహరాజా కిషన్ పర్షాద్ వీళ్లల్ల ప్రముఖులు. అట్ల హైద్రబాద్ ల కాయస్థుల సంతతి తామరతంపరగ పెరిగింది. హైద్రాబాద్ పాతనగరంల ఉన్న ఉప్పుగుడా కందికల్ గేట్ వద్ద చిత్ర్గుప్తుని దేవాలయం వీళ్లు కట్టించిందే. భారతదేశం మొత్తంగ చిత్రగుప్తునికున్న ఏకైక ఆలయం ఇదొక్కటే. దీనితో హైద్రాబాద్ నగరంల కాయస్థుల పాత్రను, ప్రాధాన్యాన్ని గమనించవచ్చు.

వీళ్లే కాక వర్తక, వాణిజ్యాల కోసం వచ్చినవాళ్లు మార్వాడీలు, అగర్వాల్ లు, జైన్ లు, పార్సీలు, కచ్ ముస్లింలు, బోహ్రా ముస్లింలు, నేటి జైన్, మార్వాడీ వెండి, బంగారం, ముత్యాల వ్యాపారులందరూ ఒకప్పుడు రాజస్థాన్, గుజరాత్ ల నుండి ‘అన్నమో రామచంద్రా’ అంటూ ఉత్త చేతులతో కాలినడకన వలస వచ్చినవాళ్లే. అక్కడి కరువులను, విదేశీ దండయాత్రలను తట్టుకోలేక ఇక్కడికి కాందిశీకులుగ వచ్చినారు. కుతుబ్ షాహీల రాజ్యంల గోల్కొండ వజ్రాలగనులకు ప్రసిద్ధి. కార్వాన్, పురానాపూల్ లు ముత్యాలు, వజ్రాల వ్యాపారానికి ముఖ్యమైన బజార్లు. మార్వాడీలు, జైనులంతా వీటితో పాటు బంగారం, వెండి ఆభరణాల వ్యాపారాన్ని చేసేవాళ్లు. వీరు మొదట గోల్కొండ కోటలో, తర్వాత కార్వాన్, పురానాపూల్ లకు వ్యాపారాలను విస్తరించినారు. కార్వాన్ బజార్లలో ముత్యాలు, రత్నాలని రాశులుగ పోసి కూరగాయల వోలె అమ్మేవాళ్లు.

ఆసఫ్ జాహీ నైజాంల పరిపాలన గోల్కొండ నుండి నేటి పాతనగరంలకు మారి ప్రారంభం కాంగనే వీరందరూ చార్మినార్, గుల్జార్ హౌజ్, పత్తర్గట్టిలకు చేరుకొని కొత్తగ దుకాణలు తెరిచినారు. తర్వాత కాలంల నైజాం పాలన అంతమయ్యి ఆంధ్రప్రదేశ్ ఏర్పడంగనే వీళ్లందరు న్యూసిటీకి అంటే కోఠీ, ఆబిడ్స్, అమీర్ పేటలకు చేరుకొని షాపింగ్ కాంప్లెక్సులు, షాపింగ్ మాల్ లు ప్రారంభించినారు. ఎంక్లేవ్ లలో, ఎస్టేట్ లల్ల నివాసాలు ఏర్పరుచుకున్నరు.

పోలీస్ యాక్షన్ జరిగి నైజాం రాజ్యం అంతం కాంగనే వాళ్ల వారసుల వద్ద ‘అడ్డికి పావుసేరు’గ వజ్రాలు, ఆభరణాలు, విలువైన పురాతన అపురూపమైన వస్తువులు కొని విదేశాలకు దొంగతనంగ ఎగుమతి చేసి ఈ వ్యాపారస్థులందరూ కోట్లకు పడగలెత్తినారు. నైజాం భవనాలల్ల పనిచేసే నౌకర్లు చాకర్లు దొంగతనంగ ఎత్తుకొచ్చిన సామానులను కూడా వాళ్లు అతి తక్కువకు కొని మారుబేరాలు చేసేవాళ్లు. జైన్ వ్యాపారస్థుల ఇళ్లల్ల భోషాణాలల్ల, త్రిజోడీలల్ల ఇప్పట్టికీ వాళ్ల పూర్వీకులు రాసిన చేతిరాత ప్రతులు ఉన్నై. అండ్ల వారు రాజస్థాన్, గుజరాత్ ప్రాంతాల నుండీ తాము కాలినడకన ఎట్ల వచ్చినారో, వారి అనుభవాలేమిటో, అప్పటి సామాజిక స్థితిగతులేమిటో గ్రంథస్థం చేసినారు. ఇప్పటి తరం వారు ఆ గ్రంథాలను పవిత్ర మతగ్రంథాలుగ పూజాగదులల్ల పెట్టుకుని పూజిస్తరు గని చరిత్రను గ్రంథస్థం చేయడంల వాటి ప్రాముఖ్యతను గుర్తించరు.

దేశ విభజన కాంగనే వాయువ్య భారతదేశం నుండి పంజాబీలు, సిక్కులు కట్టుబట్టలతోటి హైద్రాబాద్ చేరుకుని కాలక్రమంల వ్యాపారాలల్ల, పరిశ్రమలల్ల స్థిరపడినారు. తమ శ్రమ, సాహసాలతో వాళ్లు శూన్యం నుండి అద్భుతాలను సృష్టించుకున్నరు. మొజాంజాహీ మార్కెట్టుల కరాచీ బేకరీ, నాంపల్లి డన్ లప్ టైర్స్ వీళ్లవే. గౌలిగూడా, బహద్దూర్ పురాలలో పెద్ద పెద్ద గురుద్వారాలను నిర్మించుకున్నరు. పంజాబీ దాబాలల్ల భోజనాన్ని ఇష్టపడని వాళ్లు ఎవ్రూ ఉండరు. పంజాబీలు, సిక్కులు హైద్రాబాద్ సంస్కృతిల పాలల్ల నీళ్లలాగా కలిసిపోయినారు.

బెంగాలీలు కూడా అంతే. వీళ్ల ముద్దుబిడ్డలే ‘నైటింగేల్ ఆఫ్ హైద్రాబాద్’ సరోజినీ నాయుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాకారుడు, కవి హరీంద్రనాథ చటోపాధ్యాయ్. వీళ్లిద్దరివల్ల హైద్రబాద్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది. బ్రిటీష్ రెసిడెన్సీ కాలంల తమిళులు సికింద్రాబాద్ ల స్థిరపడి ఉద్యోగాలల్ల, న్యాయవాద వృత్తిల రాణించినారు. రైల్వేలు బ్రిటిష్ పరిపాలనల ఉన్నందున సికింద్రాబాద్ రైల్వే ఆఫీసులల్ల వీళ్లు అత్యధిక ఉద్యోగాలను ఆక్రమించుకున్నరు. స్థానిక హైద్రాబాదీయులకు ఉర్దూ అధికారభాష కావున వాళ్లకు ఇంగ్లీషు భాష వచ్చేది కాదు. ఈ కారణం వల్ల తమిళులు రైల్వేలో ఉద్యోగాలు సంపాదించి సికింద్రాబాద్ ప్రాంతంల ఎక్కువగ స్థిరపడినారు.

వీళ్లే గాక చిన్న చిన్న జాతులవాళ్లు కూడా వున్నరు. రూహేల్ ఖండ్ నుండి వచ్చినవారే రోహిల్లాలు. వీరు నైజాం సైన్యంల ఒక ప్రత్యేకమైన పటాలం. 1857 సిపాయిల తిరుగుబాటు హైద్రాబాద్ ల కూడా జరిగినప్పుడు కోఠీలోని బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసిన తిరుగుబాటు నాయకుడు తుర్రేబాజ్ ఖాన్ ఈ రోహిల్లా జాతికి చెందినవాడు. కోఠీ ఆంధ్రాబాంకు నుండి సుల్తాన్ బజార్ కు పోయే గల్లీకి తుర్రేబాజ్ ఖాన్ రోడ్ అని పేరు.

మధ్యప్రదేశ్ బుందేల్ ఖండ్ నుండి వచ్చినవారే బోందీలు. వీళ్లను బొందిలోళ్లు అని కూడా పిలుస్తరు. వీళ్ల సంఖ్య చాలా స్వల్పం. అట్లనే ఆంగ్లో ఇండియన్స్. ఖాజీపేట, సికింద్రాబాద్ రైల్వేలల్ల ఇంజన్ డ్రైవర్స్ గా, గార్డ్స్ గా వీళ్లు పెద్దసంఖ్యలో పనిచేసెటోళ్లు. సికింద్రాబద్ లోని చిలకలగూడా, మారేడ్ పల్లిలలో ఆంగ్లో ఇండియన్స్ సంస్కృతి బాగా కనపడుతది.

కేవలం హైద్రాబాద్ పట్టణంలనే స్థిరపడిన లోథ్, పార్థీల గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలె. గోల్కొండకోట మీద ఔరంగజేబు దండయాత్రకు వచ్చినప్పుడు వెంటవచ్చిన సైనికులల్ల ఒక జాతి లోథ్ రాజపూత్ క్షత్రియులు. బహుశా వీరి మూలాలు గుజరాత్ ల ‘లోథాల్ ‘ ప్రాంతానివి కావచ్చు. హరప్ప, మొహెంజదారో నాగరికత అనవాళ్లు, అవశేషాలు ఈ లోథాల్ ప్రాంతంల కూడా లభించినాయి. ఔరంగజేబు సైన్యం విజయం సాధించి వెనుకకు పోయినా ఈ లోథ్ లు మాత్రం ఇక్కడే పురానాపూల్, ధూల్ పేటలల్ల స్థిరపడినారు. కాలక్రమంగా వీళ్లను లోథోళ్లని పిలువసాగినారు.

ధూల్ పేట అసలు పేరు ‘ధూళిపేట’. నైజాం కాలంల లోథ్ క్షత్రియుల సైనిక కవాతులతో, ఏనుగులు, ఒంటెలు, గుర్రాల డెక్కల చప్పుళ్లతో, ధూళితో పరిసరాలు నిండి ఉండేవి కావున ధూళిపేట ధూల్ పేటగ మారింది. ఆ రోజులలో సైనికులు శరీర బడలికను తీర్చేందుకు ద్రాక్షసారాయిని తయారుచేసి విక్రయించే వృత్తిలో వీళ్లలో కొందరు స్థిరపడినారు. మరికొంతమంది సహజంగ కళాకారులు కావున పతంగులు తయారు చేసే వృత్తి చేపట్టినారు. పతంగుల ఆట, సంస్కృతి ఉత్తర భారతదేశానికి సంబంధించింది. యూరప్ నుండి వచ్చిన జిప్సీలు, దేశద్రిమ్మరులు మనదేశానికి పతంగులను పరిచయం చేసినారు. తిరిగి హైద్రాబాద్ కు పతంగులను, మాంజాదారాన్ని పరిచయం చేసినవాళ్లు ఈ లోథ్ క్షత్రియులు. కాలక్రమేణా నగరంల విశాలమైన ఆటస్థలాలు, మైదాన్ లు రియల్ ఎస్టేట్లకు, అపార్ట్మెంట్లకు బలైన తర్వాత ఈ పతంగుల ఆట క్రమక్రమంగ కనుమరుగవుతుంది. ఎన్నిరకాల పతంగులో! ఎన్నిరకాల మాంజాలో!! అవన్నీ ఇంద్రధనస్సులోని రంగుల్లాగ మాయమైనాయి.

ఆటపాటలతో, శారీరిక వ్యాయామంతోటి పువ్వులాగ వికసించవలసిన బాల్యం, హరివిల్లులాగ మెరియవలసిన బాల్యాన్ని కంప్యూటర్ గేములకు, టీవీలోని భూతప్రేత పిశాచాల సీరియళ్లకు అప్పగిస్తున్నరు. ఒక తరం మరుగుజ్జుల తరంగ మారే ప్రమాదం ముంచుకొస్తుంది.

పతంగులు, మాంజాల తయారీలనే గాక మరికొంత మంది వినాయకులు, దుర్గామాత, కాళీమాత మొదలగు దేవతల, దేవుళ్ల విగ్రహాలను తయారుచేసే వృత్తిల స్థిరపడినారు. అయితే అవి సీజనల్ వృత్తుల కావున నికర ఆదాయానికి వీలు లేదు. పుట్టుక రీత్యా క్షత్రియులు కావున సాముగరిడీలు, మల్లయుద్దాలు, తాలీం ఖానాలల్ల ప్రవేశించి మరికొంతమంది పహిల్వాన్లుగ ప్రసిద్ధి గాంచినారు.

నైజాం వ్యతిరేక పోరాటంల నేపథ్యంగ ప్రధాన భూమికలు వహించినవి గ్రంథాలయాలు, తాలింఖానాలు. ఈ రెండు రంగాల నుండి అనేకమంది వీరులు సృష్టించబడినారు. సమరశీల తత్వం కలిగిన లోథ్ లు తాలీంఖానాల నుండి ఆర్యసమాజం ఉద్యమంలకు, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమంలకు ప్రవేశించి నైజాంకు వ్యతిరేకంగ పోరాడినారు. ఈ ధూల్ పేట పేరు వింటే రజాకారుల గుండెలల్ల గుబులు పుట్టేది. 1939ల హైద్రాబాద్ పట్టణంల మొదటిసారిగా మతకల్లోలాలు జరిగినప్పుడు ఈ ధూల్ పేట యోధులు వాళ్లకు వ్యతిరేకంగా పోరాడినారు.

కాలక్రమేణా వృత్తులన్నీ మట్టికొట్టుకపోయి, సృజనాత్మకత, కళాత్మకత మూలబడి, బతుకులన్నీ బజారున పడిన తర్వాత ఒకప్పుడు మేలిమి ద్రాక్షసారాయి తయారుచేసి ప్రభువులచేత, సైనికులచేత శభాష్ అనిపించుకున్న వీళ్లే చివరికి గతి లేక దొంగగుడుంబాను సారాయి బట్టీలల్ల రహస్యంగ తయారుచేసి విక్రయించే వృత్తిని స్వీకరించి రౌడీలుగ, మాఫియాలుగ ముద్రపడి, పాలకులు, ఎక్సైజ్ అధికారులు కోటీశ్వరులుగ, లక్షాధికారులుగ మార్చేందుకు నిచ్చెనమెట్లయినారు. తమ బతుకులను గుడుంబ బట్టీలల్ల కాల్చేసుకున్నారు. ధూల్ పేట దుమ్ముల ధూళిగ మారుతున్నరు. ‘లోథాల్ ‘ మొహెంజదారో నుండి మొదలైన వారి మహాప్రస్థానం పురానాపూల్ స్మశానవాటికల చరమగీతం పాడుతున్నది.

ఇటువంటి ఇంకో విషాదగాథే పార్థీలది. వాళ్ల గోస పిట్టగోస. వీరిని పార్థీలు, పిట్టలోళ్లు అని కూడ అంటరు. వీరు నైజాంల కాలంలనే హైద్రాబాద్ కు దేశద్రిమ్మరులుగ వచ్చినారు. లంబాడీల మాదిరిగనే వీరు కూడా మహారాణా ప్రతాప్ వంశానికి చెందిన వారమని, ముస్లిం రాజులతో ఆయన యుద్ధంల ఓడిన తర్వాత తాము ప్రాణరక్షణతో దేశద్రిమ్మరులమైనామని చెప్పుకుంటరు. వీరి భాష ప్రత్యేకం కాని లిపి మాత్రం లేదు. తొలుత హైద్రాబాద్ వచ్చినప్పుడు వీరిని నగరంలకు రానీయకుండ నగర దర్వాజాలకు అవుతలనే అడివిల దూరంగ వుంచినారు. ఆ రోజులల్ల నగరం చుట్టూ రక్షణగా ఒక ఫసీల్ (నగర ప్రాకారం) 13 దర్వాజాలు, 13 కిటికీలు ఉండేవి. ప్రస్తుతం రెండు దర్వాజాలు మాత్రమే మిగిలి ఉన్నయి. శాంతిభద్రతల కారణంతోటి కోత్వాలు(పోలీస్ కమీషనర్) వీరికి ప్రవేశానుమతిని ఇవ్వలేదు. కొన్ని నెలల పాటు నగరం వెలుపల అడవిలనే నివశించినారు. పిట్టల్ని, పక్షుల్ని వేటాడెటోళ్లు కావున పిట్టలోళ్లు అని పేరు వచ్చింది. వేట తమ వృత్తి కావున తాము ఏకలవ్యుని సంతానమని కూడా చెప్పుకుంటరు. అట్ల కొన్ని నెలలు గడచిన తర్వాత తమలోని ఒక అందమైన కన్యను ఒక అధికారికి అలవాటు చేసినారు. ఆ అధికారి ఆమె అందానికి లొంగిపోయి వారి నగర ప్రవేశం కోసం నైజాం నవాబు వద్ద అనుమతి పొందినాడు.

ఫలక్ నుమా గుట్ట వెనుక దిక్కున్న జల్ పల్లి గ్రామాన్ని నిజాం వారికి దత్తతనిచ్చినాడు. అట్ల వాళ్లు తొలుత జల్ పల్లిలో నివాసాలు ఏర్పాటు చేసుకొని క్రమక్రమంగ నగరంల ఉన్న అలియాబాద్, శక్కర్ గంజ్, గాజీబండలకు వ్యాపించినారు. కొండజాతి ప్రజలు కావున మాతృస్వామ్య సంఘం ఆచారాల ప్రకారం ఆ అందమైన కన్యనే తమ వంశానికి మూలమని భావించి ఆమె మరణించంగనే జల్ పల్లి గ్రామంలనే ఆమెను సమాధి చేసినారు. అట్ల ఆమె అమ్మలగన్న అమ్మ, మూలపుటమ్మగ అవతరించింది. పార్థీలు నేటికి కూడా తమ వాళ్లు నగరంల ఏ మూలల చనిపోయినా ఆ జల్ పల్లి శ్మశానంలనే ఖననం చేస్తరు. ఆ కన్యను దేవతగ కొలుస్తూ ప్రతి సంవత్సరం హోలీ, కాముని పున్నమి పండుగ అయిన మూడో నాడు జల్ పల్లి గ్రామంల ఒక పెద్ద జాతర చేస్తరు. వారం రోజుల పాటు ఈ జాతర ఘనంగ సాగుతది. సారా, బ్రాందీలు ఏరులై పారుతయి. తెగిన యాటల తలలతోటి, కారిన రక్తంతోటి దేవతకు అభిషేకాలు జరుగుతయి. స్త్రీలను అమ్మవారు పూనుతది. జోస్యాలు, వరాలు, దీవెనలతో పాటు బగ్గ తాగిన స్త్రీపురుషుల కొట్లాటలతో జాతర ఘనంగ ముగుస్తది.

వీరి ప్రధాన వృత్తి పండ్లు, పూలు, కూరగాయలు అమ్ముకొనటం. పురుషులతో పాటు స్త్రీలు సమానంగ వ్యాపారాలు చేసి డబ్బులు సంపాదిస్తరు. వీరి స్త్రీలకు స్వాతంత్ర్యం ఎక్కువ. తమలో తాము గాని, పరాయివాళ్లతోటి గాని తన్నులాటలు, కొట్లాటలు వస్తే పురుషుల కన్నా స్త్రీలే సివంగులుగ మారుతరు. కూరగాయల బేరం చేసేటప్పుడు వీరితో కొసరి కొసరి బేరం చేయడానికి చాలామంది భయపడతరు. పాతనగరంలోని షక్కర్ గంజ్, గాజీబండ, పురానాపూల్ లలో వీరి నివాసాలు ఎక్కువ. మతకల్లోలాలల్ల వీళ్లకు అధికంగ ప్రాణనష్టం, ఆస్తి నష్టం సంభవించి వీళ్ల ఇళ్లను అగ్గువగ్గువకు కొని, ఆక్రమించుకున్న తర్వాత ఈ పిట్టలోళ్లు గూడు చెదిరిన పక్షుల వోలె పుట్టకొకరు చెట్టుకొకరు మాదిరిగ నగరంలోని ఇతర ప్రాంతాలకు తరలిపోయినారు.

లంబాడోళ్లు అనగా బంజారాలది ఇంచుమించు ఇట్లాంటి కథే. వీరు కూడ రాజస్థాన్ నుండి దేశద్రిమ్మరులుగ బయలుదేరినవాళ్లే. రాణా ప్రతాప్ అనుచరులమని చెప్పుకుంటరు. రాజపుత్రుల పతనం తర్వాత వీరు ఉప్పు అమ్ముకుంటూ దేశసంచారం చేస్తూ హైద్రాబాద్ కు వచ్చినారు. నేటి బంజారాహిల్స్ ప్రాంతాలు వీరి తొలి నివాసాలు. వ్యవసాయంల ప్రవేశించి స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నందున సాంఘికంగ, ఆర్థికంగ పార్థీలకంటే మెరుగైన స్థితిలో వున్నరు.

దేశంలోని ఇతర జాతులవాళ్లు, ఇతర ప్రాంతాలవాళ్లు గాక మధ్య ఆసియా, ఆఫ్రికా నుంచి వచిన విదేశీయులెందరో హైద్రాబాద్ ల స్థిరపడినారు. బహమనీ సుల్తాన్లు, కుతుబ్ షాహీల కాలంలనే ఇరాన్, ఇరాక్, అరబ్, టర్కీ దేశాల నుండి ఎందరో దక్కను చేరుకొని స్థిరపడినారు. వీళ్లందరినీ ‘అపకీలు’ అనగా విదేశీయులు అనేవారు. స్థానికులను ‘ముల్కీ’లనేవాళ్లు. ముల్క్ అనగా దేశం. ముల్కీలనగా దేశీయులు అని కూడా అర్థం.

నైజాం రాజుల కాలంల పఠానులు, ఆఫ్ఘనులు, టర్కీలు, అరబ్బులు, చావూష్ లు హైద్రాబాద్ పాతనగరంల స్థిరపడినారు. పఠాన్లు ఆఫ్ఘనిస్థాన్ నుండి వచ్చిన కొండజాతి వాళ్లు, సమరశీల పోరాట యోధులు కావున నైజాం సైన్యంల చేరినారు. పాతనగరంల పఠాన్ వాడీ అనే బస్తీ కూడ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ నుండి వచ్చినవాళ్లే కాబూలీవాలాలు. వీళ్లు సైన్యంల కాక వడ్డీ వ్యాపారాలల్ల ఇతర వ్యాపారాలల్ల స్థిరపడినారు. అరబ్బులు కూడా పోరాటయోధులే కావున నైజాం వారికి ఒక ప్రత్యేక సైనిక పటాలాన్ని ఏర్పాటు చేసినాడు. పాతనగరంల చాంద్రాయణగుట్ట దాటిన తర్వాత ‘బార్కాస్ ‘ వీరి స్థావరాలు. బారకాసులు అంటే సైనిక స్థావరాలు అని అర్థం. బహుశా మక్కా మదీనాల నుండి వచ్చారని కాబోలు, నైజాం వారికి ఒక ప్రత్యేక సైనిక పటాలాన్ని ఏర్పాటు చేయడమే గాక సైన్యంలోని కీలక స్థానాలల్ల వీళ్లను నియమించినారు. పఠానులు, అరబ్బులు, చావూష్ లు వేరువేరు దేశాలకు చెందిన వేరువేరు జాతులు కావున వారి మధ్య వైరం తలెత్తకుండ ప్రత్యేక సైనిక పటాలాలను ఏర్పాటు చేసినాడు. అరబ్బుల్ని ప్రత్యేకంగా ఖజానాల వద్ద కాపలాకు నియమించేవారు. వీరికి కామతృష్ణ అధికం కావున జనానాఖానాల వద్ద మాత్రం వీరిని నియమించక కొజ్జాలను కాపలాకు నియమించేవారు.
టర్కీ పాత పేరు తుర్కెస్తాన్. ఇక్కడ్నుంచి వచ్చినవాళ్లనే తెలుగులో తురకలు లేదా తుర్కోళ్లు అన్నరు. వీళ్లు మాట్లాడే భాషను “తురకం” అన్నరు. ఇందులో నుండి దక్కనీ ఉర్దూ ఆవిర్భవించింది.

ఇక చావూష్ ల గురించి ప్రత్యేకంగనే చెప్పుకోవాలె. వీళ్లందరూ ఆఫ్రికాకు సంబంధించిన ముస్లింలు. వీరు ప్రధానంగ రెండు దేశాలకు ఎమెన్, అబిసీనియాలకు చెందినవాళ్లు. అబిసీనియా కొత్త పేరు ఇథియోపియా. అబిసీనియా వాళ్లను “హబ్సీ”లు అని కూఒడ అంటరు. నగరంలోని హబ్సిగుడా వీళ్లకు సంబంధించినదే. వీళ్లను చూడంగనే నీగ్రోలని సులభంగ గుర్తించవచ్చు. ఈ హబ్సీలు, చావూష్ లు హైద్రాబాద్ నగరానికి చేరుకున్న వైనం ఒక ఇతిహాస గాథ.

రెండువందల సంవత్సరాల క్రింద వనపర్తి సంస్థానం నైజాం సంస్థానంల ఒక ముఖ్యమైన ఉపసంస్థానం. దీని మొదటి రాజు “రాజా రామేశ్వర్రావ్” తన సంస్థానం పకడ్బందీ రక్షణ కోసం పటిష్టమైన సైన్యాన్ని రూపొందించుకోవాలని బొంబాయి బానిసల సంత నుండి కొంత మంది స్త్రీ పురుష నీగ్రో బానిసలను కొనుగోలు చేసి వనపర్తికి బందీలుగ పట్టుకొచ్చి వారితో ప్రత్యేక సైనిక పటాలాన్ని తయారు చేసినాడు. ఆ నీగ్రో బానిసలంత ఆఫ్రికా అశ్వాల వలె బలిష్ఠులు, ఆఫ్రికా సింహాల వలె ధైర్యవంతులు. కాలక్రమంల వారి సంతతి తామరతంపరగ అభివృద్ధి చెంది వారి జనాభా కొన్ని వందలకు చేరుకున్నది. మొదటి దశల సంస్థాన రక్షణకు వాళ్లు బాగా ఉపయోగపడినా తర్వాత కాలంల వాళ్లు తలనొప్పిగా మారినారు. ఆ చిన్న సంస్థానంల వారిని పోషించడం, అదుపుల పెట్టడం తర్వాత వచ్చిన సంస్థానాధీశులకు తలకు మించిన భారమయ్యింది. గుర్రాల వలె బలిష్టులైన వారికి కామతృష్ణ హెచ్చు కావున స్థానికులకు వారు ప్రమాదంగ పరిణమించినారు. చివరికి విధిలేక వనపర్తి రాజావారు వాళ్లందరినీ ఒక శుభముహూర్తంల నైజాంకు నజరానాగ సమర్పించుకుని చేతులు దులుపుకున్నడు. నైజాం వాళ్లందరితోటి ప్రత్యేకమైన ఆశ్వికదళాన్ని రూపొందించినాడు. వాళ్లనే తరువాత ఆఫ్రికన్ కావల్రీ గార్డ్స్ అన్నరు. వాళ్ల కోసం నైజాం ప్రత్యేక నివాసస్థలాన్ని ఏర్పాటు చేసినాడు. అదే ఈనాటి ఎ.సి. గార్డ్స్ ఏరియా. మాసాబ్ టాంక్ లోని మహావీర్ హాస్పిటల్స్ వెనుక భాగమే ఈ ఎ.సి.గార్డ్స్ బస్తీ. వారి సంతతి ఇప్పటికీ అక్కడనే నివసిస్తున్నరు.

ఈ చావూష్ లు హైద్రాబాద్ నగరానికి అందించిన తమదైన విలక్షణ సంస్కృతిల ముఖ్యమైంది “తీన్ మార్ వాయిద్య సంగీతం”. అది ఒక రకమైన డప్పు. ఆఫ్రికాకు మాత్రమే పరిమితమైన వాయిద్య పరికరం. ఇప్పటికీ పెండ్లిండ్లలో ఉత్సవాలలో, శుభసంతోష సందర్భాలలో ఈ “టుంకీ”ని బజాయిస్తుంటరు. దీని శబ్దం భీకరంగ, ఉత్తేజంగ ఉంటది. వినేవారిని పరవశుల్ని గావించి వారిచే చిందులు వేయిస్తది. హిందువులు కూడా ఈ తీన్ మార్ వాయిద్యాన్ని ఆరాధిస్తరు. దీపావళి పండుగ తెల్లారి యాదవుల “సదర్”(యాదవుల కులసభ) మేళాను జరిపే సందర్భంల ఈ తీన్ మార్ డప్పులకు అనుగుణంగ తలలకు శంలాలు చుట్టుకుని, చేతులల్ల పొడుగైన లాఠీలను పట్టుకొని రకరకాల సాముగరిడీలు, విన్యాసాలు చేసుకుంట చిందులు తొక్కుకుంట అందంగ అడుగులు వేసుకుంట “దద్దడ్ కీ దద్దడా, దద్దడ్ కీ దద్దడా” అని నాట్యం చేస్తరు. హిందీ సినిమాలకు కూడా ఈ తీన్ మార్ సంగీతం ప్రాకడం విశేషం.

ఎక్కడి ఆఫ్రికా? ఎక్కడి బొంబాయి బానిసల సంత? ఎక్కడి వనపర్తి సన్స్థానం? ఎక్కడి హైద్రాబాద్? చావూష్ లు హైద్రాబాద్ నగర సంస్కృతిలో పాన్ సుపారీ లాగ కలిసిపోయినారు.

ఢిల్లీ మీద అహమ్మద్ షా అబ్దాలీ, నాదిర్ షాలు దండెత్తి నగరాన్ని నేలమట్టం చేసి జనజీవనాన్ని అల్లకల్లోలం చేసినప్పుడు, 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైనప్పుడు అనేకమంది ప్రజలు కాందిశీకులుగ వింధ్య పర్వతాలు, నర్మదానదిని దాటి దక్షిణ ముఖద్వారంలో ఉన్న హైద్రాబాద్ నగరానికి చేరుకుని ఆశ్రయం పొందినారు. హైద్రాబాద్ లోని శాంతిసుస్థిరతలు వారిని ఆకర్షించినాయి.

అట్ల హైద్రాబాద్ నగరం ప్రపంచ నాగరికతల విభిన్న సమ్మేళనానికి చౌరస్తాగ నిలబడింది. చార్ మినార్ గ అవతరించింది. అందరికీ అమ్మగ, అన్నపూర్ణగ మారింది. అనేక జాతుల వారికి అనేక ప్రాంతాలవారికి ఆశ్రయమిచ్చింది. అక్కున చేర్చుకుంది. “సల్లగ బతుకుండ్రి బిడ్డా” అని దీవెనార్తెలు ఇచ్చింది. ఏ దేశమైతేనేం? ఏ జాతి ఏ మతమైతేనేం? “మానవుడా, మానవుడా” అంటూ అందరినీ తన చల్లని ఒడిలకు తీసుకుంది. హైద్రాబాద్ ఒక మినీ భారతంగ రూపొందింది. “జో జిస్సే మిలా సీఖా హం నే – గైరోంకో భీ అప్నాయా హం నే” (ఎవర్ని కలిసినా వారి నుండి నేర్చుకున్నం – పరాయివారిని కూడా మా వారిగా చేసుకున్నం)అని ఆనంద గీతికలు పాడింది. ఇది హైద్రాబాద్ గొప్పతనం!

ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ, లాహోర్, లక్నో నగరాల నుండి దక్కన్ నగరాలైన బీదర్, బీజాపుర్, అహమ్మద్ నగర్ లకు వచ్చే ముసాఫిర్లకు హైద్రాబాద్ నగరం ఒక ప్రవేశమార్గంగ, ప్రధాన గవాక్షంగ వెలసింది. నానా జాతులు వచ్చి స్థిరపడిన కారణంగ నూతన సంస్కృతి ఆవిర్భవించింది. జీవనవైవిధ్యంల హైద్రాబాద్ తన ప్రత్యేకతను నిలుపుకుంది.

షానే షహర్ హైద్రాబాద్ దక్కన్
ప్యారే షహర్ హైద్రాబాద్ దక్కన్
చార్ సౌ సాల్ పురానా షహర్
ఏ షహర్ హమారా, ఏ షౌకత్ హమారా
ఏ హమారా షహర్ హైద్రాబాద్ దక్కన్

పాఠకులకు విజ్ఞప్తి: పై వ్యాసమంతా సలాం హైద్రాబాద్ నవలలో 22 నుండి 31 పేజీల మధ్యనున్నభాగం. ఇవన్నీ సదరు నవల రచయిత శ్రీ లోకేశ్వర్ పరిశీలనలు, పరిశోధనలు తప్ప నా స్వంత భావనలు కాదు.(శీర్షిక మాత్రమే నేను పెట్టాను) పై వ్యాసంలో జాతులపైన వివరాల్లో, వ్యాఖ్యానాల్లో అభ్యంతరాలున్నా లేదా ఆ నవల కొనాలన్నా ఆయనను ఈ ఫోన్ నెంబరులో నేరుగా సంప్రదించవచ్చు.

పరవస్తు లోకేశ్వర్: 9160680847
పుస్తకం వివరాలు: సలాం హైద్రాబాద్(నవల)
రచన: పరవస్తు లోకేశ్వర్
పేజీలు: 239
ధర: రూ.100
***
ఈ పుస్తకం గురించి, లోకేశ్వర్ గారి ఇతర రచనల గురించీ పుస్తకం.నెట్లో వచ్చిన వ్యాసాలు ఇక్కడ చూడవచ్చు.About the Author(s)

అతిథి

పుస్తకం.నెట్ కు సభ్యులు కాని వారు పంపే వ్యాసాలు అతిథి గా ప్రచురింపబడతాయి.2 Comments


  1. Murali Potagani

    Its really nice to know about unspoken history of Hyderabad.


  2. Ramakoti Veeranki

    Great..
    Very glad to know the unspoken history of Bhagyanagar…
    Thank you.  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

“నల్లమల ఎర్రమల దారులలో… యాత్ర” పరిచయం

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ************** ఒక రచన మరికొన్ని రచనలకి కారణమవుతుందని మనం వింటూం...
by అతిథి
0

 
 

నగరానికి నిండు నమస్కారం – “షహర్ నామా”

వ్యాసకర్త: కొల్లూరి సోమశంకర్ ****************** ప్రతీ ఒక్కరికీ తాము పుట్టి పెరిగిన ఊరి పట్ల కాస...
by అతిథి
0

 
 

చత్తీస్‌ఘడ్ స్కూటర్ యాత్ర

హైదరాబాదు బుక్ ఫెయిర్ లో లోకేశ్వర్ గారి స్టాల్ ఒకటి చూశినప్పుడే అర్థమయింది – ఆయన R...
by సౌమ్య
4

 

 

సలాం హైదరాబాద్‌ కథలోని వ్యథ

రాసిన వారు: కాకరాల (ఈ వ్యాసం మొదట వీక్షణం పత్రిక జనవరి 2010 సంచిక లో ప్రచురితమైంది. పుస్త...
by అతిథి
2

 
 
సలాం హైదరాబాద్

సలాం హైదరాబాద్

సమీక్షకులు: మద్దిపాటి కృష్ణారావు, ఆరి సీతారామయ్య నవంబర్ 2008 లో జరిగిన డిట్రాయిట్ తెలు...
by DTLC
7