రాధారాణీ చచ్చిపోయింది – అక్కినేని కుటుంబరావు గారి కథ

రాసి పంపిన వారు: అరి సీతారామయ్య

ఈ మధ్య ఆటోగ్రాఫ్ అని ఒక సినిమా వచ్చింది. కథానాయకుడు పెళ్ళిచేసుకోబోతున్నాడు. తన స్నేహితులందరినీ పెళ్ళికి పిలవాలి. చిన్నప్పుడు తను ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్న రోజుల్లో స్వగ్రామంలో ఉండేవాడు. ఆ వూరెళ్ళి అక్కడ ఒక చిన్ననాటి స్నేహితుణ్ణి కలిసి, ఒరే, మనతో చదువుకున్న కమల ఉందే, ఆ అమ్మాయిని కూడా పిలవాలరా, ఆ అమ్మాయి ఇప్పుడెక్కదుంటుందో తెలుసా? అని అడుగుతాడు. అతనికి తెలుసు. పెళ్ళయింది. ఇక్కడ దగ్గరలోనే ఒక వూళ్ళో ఉంది అని చెప్తాడు. ఇద్దరూ కలిసి కమలకు పెళ్ళిపత్రిక ఇవ్వటానికి బయల్దేరతారు.

కమలను చూసిన కథానాయకుడికి షాక్ కొట్టినట్లవుతుంది. ఇదేంటీ? కమల ఇలా ఉండేంటీ? కడిగిన ముత్యంలా ఉండే కమల ఇలా మాసిపోయిన బట్టల్లో ఉందేంటీ? తలదువ్వుకోలేదేంటీ? పిచ్చిదానిలా ఉండేంటీ? కమలకు అప్పటికే ఇద్దరు పిల్లలు. పెళ్ళయ్యి పల్లెటూళ్ళో ఉంటున్న అమ్మాయి, ఒకప్పుడు ఎంత అందగత్తె అయినా, ఇలాగే మారుతుంది అని చెప్పకుండానే చెప్తాడు దర్శకుడు చేరన్‌. ఈ సినిమా చూసింతర్వాత క్రెడిట్స్ జాగ్రత్తగా చూశాను. అక్కినేని కుటుంబరావుగారి పేరు ఎక్కడా లేదు. అన్యాయం అనిపించింది. కుటుంబరావు గారు 1972 లో రాధారాణీ చచ్చిపోయింది అని ఒక కధ రాశారు (ఆంధ్రజ్యోతి). పెళ్ళయిన అమ్మాయిలో వచ్చే మార్పులు మర్చిపోలేని విధంగా చిత్రించారు. పెళ్ళికాకముందు రాధారాణి పుస్తకాలు చదివేది, పాటలు పాడేది, నవ్వేది. పెళ్ళయిన తర్వాత ఆ రాధారాణి చచ్చిపోతుంది. ఇప్పుడున్న రాధారాణికీ అప్పటి రాధారాణికీ పోలికలేలేవు. “చిన్న జీవితాల్ని చేర్చి బంధించి, బిగించి, రాక్షసపు ముళ్ళు వేస్తారు. అవి బిగిసి, బిగిసి, స్వేచ్చ అంతా హరించి రెక్కలన్నీ విరగదీసి ప్రాణాపాయం కలిగించినా అశక్తులై, అసమర్థులై ఆ నిర్బంధాన్నే జన్మజన్మల అనుబంధం అనుకుంటూ, ఆ తాళ్ళనే పూలమాలలనుకుంటూ, ఆత్మ వంచనతో మూలుగుతూ, కుళ్ళుతూ ఏడుస్తూ మళ్ళీ జన్మ మీద విరక్తి పుట్టి జీవితాలు చాలిస్తారు.” అని రాశారు కుటుంబరావు గారు, పెళ్ళి గురించి.

ఈ కథ “పనివాడితనం” అన్న పేరుతో వచ్చిన సంకలనంలో ఉంది.
*
మానవ సంబంధాల గురించి, ప్రత్యేకించి స్త్రీపురుష సంబంధాల గురించి, కుటుంబరావు గారు రాసే కథలు చదివింతర్వాత చాలాకాలం మనసులో ఉండిపోతాయి. ఒక కథ గురించి చెప్తాను వినండి. ఒక బస్ లో ముందుసీట్లో కూర్చోనున్న ఒక జంట గురించి వెనకసీట్లో కూర్చోని ఉన్నవారి సంభాషణ. “ఆ ముందు సీట్లో ఇట్లాగే ఇద్దరు భార్యాభర్తలు … భార్యాభర్తలే అనుకుంటాలే – ఇద్దరూ నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు…”
“ఇంకా నయం. భార్యాభర్తలయితే నవ్వులు కూడానా! ఆళ్ళు ఎవరో ఇంటికాడ చెప్పకుండా ఎగిరెళ్ళే బాపతు” అన్నాడు ఒకాయన నవ్వుతూ.
“బాగా చెప్పారు అన్నయ్య గారూ! పెళ్ళాం పక్కనుంటే ఏ మొగుడి మొకానయినా నవ్వు మొలుస్తుందా – ఏడుపుగొట్టు మొకాలూ – ఏడుపుగొట్టు మొగుళ్ళూనూ…” బసెక్కిన కాణ్ణించీ చిరచిరలాడుతున్న మొగుడివంక ఓరగా చూస్తూ అందొకావిడ.
– ఇది “దొరకదండీ బాబూ!” కథలోనుంచి. ఇది కూడా “పనివాడితనం” సంకలనం నుంచే.

ఈ కథ చదివినప్పటినుంచీ ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్ లో ఒక జంట కనిపిస్తే వాళ్ళు మాట్లాడుకుంటున్నారా లేదా? నవ్వుకుంటున్నారా లేదా? అని గమనించటం అలవాటయింది.
నవ్వుకుంటూ కనపడేవాళ్ళు భార్యాభర్తలు కారు. నామాట మీద నమ్మకం లేకపోతే మీరు గమనించి చూడండి. అన్నట్టు, కుటుంబరావు గారి పుస్తకాలు ఏ పుస్తకాల షాపులోనైనా దొరుకుతాయి. కథలేకాకుండా, కుటుంబరావు గారు కొన్ని నవలలు రాశారు. బాలల చిత్రాలు తీశారు (భద్రం కొడుకో; గులాబీలు). ఫీచర్ ఫిల్మ్స్ కూడా తీశారు (తోడు).

You Might Also Like

One Comment

  1. కత్తి మహేష్ కుమార్

    ఆటోగ్రాఫ్ సినిమా తమిళ్ లో అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం అందరూ తమని తాము ఆ నాయకుడి పాత్రలో చూసుకోవడం. తమ జీవితాల్లో తరచిచూసుకుని అలాంటి అనుభవాల్ని ఆ సినిమా ద్వారా మళ్ళీ జీవించడం. ఇలాంటి “అనుభవాలకు” క్రెడిట్స్ ఉండవు.

    మంచి సినిమాని గుర్తుచెయ్యడంతో పాటూ ఒక తెలియని కథను పరిచయం చేశారు. ధన్యవాదాలు.

Leave a Reply