పుస్తకం
All about booksపుస్తకాలు

July 30, 2013

మంటో సమగ్ర సాహిత్యం – మొదటి భాగం

More articles by »
Written by: Purnima
Tags: ,

మంటో – ఇదో ప్రముఖ ఉర్దూ రచయిత పేరు అని తెల్సుకున్న కొన్ని క్షణాలకే ఇదో వివాదాస్పద రచయిత పేరని తెల్సిపోవాలి. అలా తెలియకపోతే బహుశా ఆ పేరు స-అదత్ హసన్ మంటోది అయ్యుండకపోవచ్చు. మంటోతో నా పరిచయం ఎలా జరిగిందో “సియా హాషియే”ను పరిచయం చేసేటప్పుడు చెప్పాను. ఆ రచన చదివాక, మంటో ఏం రాసినా చదవాలని నిశ్చయించుకున్నాను. ఫలితంగా, ఆయన రచనా సర్వసంలోని ఐదు భాగాలనూ కొన్నాను. అందులో మొదటి భాగం గురించి ప్రస్తుత వ్యాసం. ఇందులో ఆయన రాసిన కథలు మాత్రమే ఉన్నాయి.

ఒకానొక పాత హింది సినిమాలో విధవరాలికి పునర్వివాహం పై కొందరి మధ్య వేడివేడిగా వాదనలు జరుగుతుంటాయి. అందులో ఒకరు “పునర్వివాహం తప్పే అయితే అలనాడు రాముడు ఎందుకు లంకలో రావణ స్త్రీలకు ….?” అని ప్రశ్నిస్తాడు. దానికింకెవరో ఇంకేదో అంటారు. ఈ లోపు ఒకావిడొచ్చి, “మనం భయపడాల్సింది మతానికి, దేవుళ్ళకి, పురాణాలకి కాదు. మనకు హద్దులు పెట్టేది, గీతలు దాటితే వాతలు పెట్టేది సమాజం!” అన్న అర్థం ఉన్న ఒక డైలాగు వదులుతుంది. మంటోని, ఆయన రచనల్ని, ఆయన ఎదుర్కొన్న వివాదాలని అర్థం చేసుకోవాలంటే “సమాజాన్ని” విస్మరించలేం అని నా గట్టి నమ్మకం.

ఇప్పుడూ.. ఒక సమాజం ఉంది అనుకుందాం. దాని ప్రకారం, హోటెల్లో దోశ తినడం మర్యాదస్తుల లక్షణం కాదనుకుందాం. సమాజం ఆమోదించలేదని అందులో హోటెళ్ళూ, హోటెళ్ళో దోశలూ లేకుండా పోతాయా? పోవు. ఎందుకంటే? బహుశా, హోటెళ్ళో దోశలు తినేవారు ఉన్నందుకేమో?! కస్టమర్లు ఉన్నప్పుడు బిజినెస్‍లు అవే పుట్టుకొస్తాయి. దొంగచాటుగా దోశ తినేవాడితో పాటు, దోశలు తయారుచేసేవాడు, అందించేవాడు, తయారు చేసి అమ్మడానికి ఓ స్థలాన్ని ఏర్పర్చినవాడు – ఇలా ఎంతోమంది ఉంటారా ఈక్వేషన్లో. ఇహ, దోశలూ, వాటి డిమాండ్ గురించి చెప్పనక్కరే లేదు. కరకరలాడే దోశలు, దూదిపుంజిలాంటి దోశలు నుండి మాడిపోయిన దోశలు వరకూ అన్ని రేట్లలోనూ లభ్యం. “అబ్బబ్బ.. ఫలానా చోట సూపర్ అబ్బ దోశ” అని బహాటంగా చెప్పుకోకుండా, చెవులు కొరుక్కుంటూ చెప్పుకుంటూనే ఉంటారు, తినేవాళ్ళు తింటూనే ఉంటారు, వినలేని వాళ్ళు చెవులు మూసుకుంటూనే ఉంటారు. తాము చూడాలనుకుంటున్నదే ప్రపంచం, తక్కినది కాదు అని అనుకునే వాళ్ళూ ఉంటారు.

ఇప్పుడిదే సమాజం నుండి పుట్టుకొచ్చిన రచయితలూ ఉంటారు. (నేను చదివిన సాహిత్యాన్ని బట్టి వాళ్ళని ఈ కిందిగా విభజించవచ్చని అనుకుంటాను. ఇదేం థీసిస్ కాదు, నా అభిప్రాయం మాత్రమే!)

(1) అందులో కొందరు అసలు ఈ వ్యవహారం జోలికే పోరు.

(2)కొందరు రాస్తారు వీటి గురించి, ఎలాగంటే – కేవలం దోశ, దోశ తినేవాడూ మాత్రమే ఉంటారు. దోశ ఎంత దోరగా కాలింది, ఏ రంగులో ఉంది, ఎలా తుంపుకొని  ఎలా నోట్లో పెట్టుకున్నది, అది నోట్లో ఎలా కరుగుతూ గొంతులోకి జారింది – తదితర విషయాలను తమతమ అక్షరశక్తికి లోబడి సవివరంగా రాస్తూ ఉంటారు. దీనివల్ల ఇంకేం అయినా, కాకున్నా వెంటనే దోశ తినాలనిపించేంతగా హార్మోన్లు డాన్సులు చేస్తాయి.

(3) ఇంకొందరు – “ఈ దోశకు నా చేత తినబడాలనే కోరిక బలంగా ఉందన్నది. ఆ కోరికను అది బయటకు చెప్పుకోలేక అల్లల్లాడిపోతోంది.” అంటూ దోశ పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రాస్తారు. ఇందులో ఎంచుమించు (2)లో ఉండే హార్మోన్ల డాన్సు ఇక్కడా ఉంటుంది. కాకపోతే, ఈ దోశోద్దారకులకు దోశలే ఫానులు అవుతాయన్న మాట.

(4)వీళ్ళు ఆయా హోటెళ్ళకు ఓ కెమరా తీసుకొని ఉన్నది ఉన్నట్టు షూటింగ్ తీసినట్టు రాస్తారు. అలా రాసినప్పుడు కేవలం దోశ, దాన్ని ఆరగించడం పైనే కాక, అనేకానేక ఇతర అంశాల మీద కూడా దృష్టి పడచ్చు. ఉదా: దోశను తయారుచేసేవాడి అవసరం, దోశను సప్లై చేసేవాడి అగత్యం, వీళ్ళకీ దోశతో ఉన్న సంబంధం.. ఇలాంటివి ఎన్నో కోణాలు ఈ రచనల్లో బయటకొస్తాయి. అయితే, అవి అందంగా, రుచికరంగా ఉండవు. జుగుప్సాకరంగా, అసహ్యంగా ఉండచ్చు. ఎలా ఉన్నా సమాజంలో ఇవో భాగమే అన్నది ఈ రచనల పాయింట్.

మంటో నాలుగో కోవకు చెందిన రచయిత. ఈయన కేవలం వేశ్యల మీద, వారి జీవితాల మీదే కథలు రాశాడని ఒక అపవాదు ఉంది. ఆయన అత్యధికంగా వాటిని గురించి రాసుండచ్చేమో గానీ అవి మాత్రమే రాయలేదు. ఆ సంగతి తెల్సుకోడానికి మంటో  సాహిత్యాన్ని పూర్తిగా చదవనవసరం కూడా లేదు. మొదటి సంపుటిలోనే వైవిధ్య భరితమైన కథలు ఉన్నాయి. ఆయన రాసిన వేశ్య-ప్రధాన-కథల్లో కూడా ఒక్కో కథలో రచయిత కెమరా ఒక్కో వైపు నుండి పనిజేస్తుంది. అందుకని ఆ కథలన్నింటిలో ప్రధాన పాత్రలు వేశ్యలే అయినా, కథలన్నీ భిన్నంగా ఉంటాయి. వేశ్యలలోనూ, వేశ్యా ప్రపంచంలోనూ ఉండే మానవీయతను కళ్ళకు కట్టగల రచయిత మంటో.

మొదటి సంపుటిలో దాదాపు నలభై కథలున్నాయి. వాటిని మూడు విభాగాలుగా విభజించారు; “పాతాళ్”, “నయా కానూన్” మరియు “బరాయె-నామ్”.

“పాతాళ్”లో సమాజం ఆమోదించనివారి కథలుంటాయి. అందులో మచ్చుకు కొన్ని:

పుస్తకంలో మొదటి కథ “లైసెంస్”లో భర్త చనిపోయాక, అతడు నడిపే గుర్రబ్బండిని వేరేవారికి అద్దెకిస్తుంది భార్య. బండిని అద్దెకు తీసుకున్న ప్రతి ఒక్కడూ ఆమెను కోరుకుంటాడు. విసిగిపోయి, ఆమే బండి నడపడానికి నిశ్చయించుకుంటుంది. ఆడది అలా నడివీధుల్లో బండి తిప్పటం కుదరదంటూ బండినీ, గుర్రాన్నీ జప్తు చేస్తారు. “మరి నేనెలా బతకనూ?” అని ఆమె అడిగితే, “పోయి బజారులో కూర్చో, అక్కడే సంపాదన ఎక్కువ వస్తుంది” అని చెప్తారు. “మర్నాడు ఆమె నగరంలోని కమిటికి తన అర్జీ పంపుకుంది. అలా ఆమెకు ఒళ్ళు అమ్ముకోటానికి లైసెంస్ దొరికేసింది.” అంటూ కథను ముగిస్తారు మంటో. “దస్ రూపయె”లో హైదరాబాదు నుండి వచ్చిన ముగ్గురు కుర్రవాళ్ళు పది రూపాయల అద్దెకు ఓ పధ్నాలుగేళ్ళ అమ్మాయిని తెచ్చుకుంటారు. కారులో షికారుకు వెళ్తూ, ముంబయి బీచ్ లో సరదాగా ఆడుతూ పాడుతూ గడుపుతారు. రాత్రికి ఆమెను ఇంటి దగ్గర వదిలేసేటప్పుడు, ఆమెకు ఇవ్వాల్సిన పది రూపాయలు ఇస్తే ఆమె తిరిగి ఇచ్చేస్తుంది. ఎందుకు? అన్నది పాఠకుడు నిశ్చయించుకోవాలి. “బర్మీ లడికీ” కథలో ఎక్కడి నుంచో ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఆమెతో కొన్నాళ్ళ పాటు అన్ని రకాల పనులూ చేయించుకొని, ఆమెకు డబ్బు ఇచ్చే స్థోమతలేక ఆమెను పంపిచేస్తాడు ఆ ఆసామి. అన్ని నాళ్ళల్లో ఆమె పేరు కూడా కనుక్కోడు. వేశ్య తన కస్టమర్ తోనే ప్రేమలో పడే కథ “శారద”. ఆమె శరీరాన్ని తప్ప అతడికి మరేం పట్టదు. తీరా ఆమె ప్రేమ-దోమ అంటుంటే తలపట్టుకుంటాడు. ఆమె పక్కకు తప్పుకుంటుంది. ఒకప్పుడు అందంగా, అందర్నీ ఆకర్షిస్తూ కాలం గడిపే ఒక వేశ్య కొడుకు చనిపోయాక పిచ్చిదై ఎలా రోడ్డున పడిందన్న కథ “ఫోభా బాయి”. “పెహచాన్” కథలో ఓ రాత్రివేళ ముగ్గురు కల్సి విస్కీ కన్నా కిక్ ఇచ్చే అమ్మాయి కోసం వీధీ వీధీ తిరగటం ఉంటుంది.  

“నయా కానూన్”లో కథలు వేశ్యావృత్తిని గురించినవి కావు. దేశవిభజన, దేశ స్వాత్రంత్ర్యం నేపథ్యంలో సగటు ప్రజల కథలివి.  “నయా కానూన్” అనే కథలో దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చాక “కొత్త చట్టం” వల్ల తనకెంతో న్యాయం జరుగుతుందని నమ్మిన ఒక జటకాబండి వాడికి కలిగే భంగపాటు తెలిసివస్తుంది. Subtle satire on the system. “టెఢీ లకీర్”లో తిన్నగా, అందరూ నడిచే దారిలో నడవక కొత్త పుంతలు తొక్కేవాడి కథ. “ఖాలిద్ మియా ” కథలో పండంటి పసిపిల్లాడు ఉన్నపళాన రోగం బారినపడి చనిపోతాడు.

“బాసిత్” కథలో బాసిత్ అనే యువకుడికి ఇష్టంలేని పెళ్ళి అవుతుంది. కొత్త పెళ్ళికూతురు అతడికి దూరదూరంగా మసులుతూ ఉంటుంది. కారణం అంతుబట్టని అతడికి ఒకరోజు భార్య స్నానం చేస్తున్న బాత్రూం నాలాలో నుండి వస్తున్న రక్తం వల్ల నిజం తెలుస్తుంది. “బాద్షాహత్ కా ఖాత్మా” అనే కథలో ఒక నిరుపేద పట్నం వచ్చి స్నేహితుని ఆఫీసులో తలదాచుకుంటాడు. ఆఫీసులో టెలిఫోన్‍కు కాల్ వస్తే తీస్తాడు. అవతల నుండి ఒక అందమైన అమ్మాయి గొంతు. రోజూ ఫోన్ రావటం మొదలవుతుంది. పరిచయం, ప్రేమ అన్నీ ఫోనులోనే. ఆ నిరుపేద ఉన్నట్టుండి చనిపోతాడు, కథ అయిపోతుంది అకస్మాత్తుగా!

“బరాయె-నామ్”లో మంటో హడావుడిగా రాసిన కథలు, అంతగా బాగుండని కథలు అని సంపాదకీయం పేర్కొందిగానీ, నాకిందులోనూ కొన్ని రచనలు నచ్చాయి.

“Here lies Saadat Hasan Manto. In his breast are buried all the secrets and nuances of the art of short story writing. Even now, weighed down by earth, he is wondering if he is the great story writer or God!” – epitaph on Manto’s grave

మంటో రాసిన కథల్లో కొన్ని గొప్పవి ఉన్నాయి. కొన్ని మామూలువీ ఉన్నాయి. అయితే, మంటోని కేవలం ఓ వివాస్పద రచయితగానే గుర్తుపెట్టుకున్నవారు ఎక్కువగా ఉన్నట్టున్నారు. ఆయన రచనల్లో మాలిన్యం ఎక్కువని వాదించేవారూ ఉన్నారు. ఒక రచనలో మాలిన్యం ఏ ఉద్దేశ్యాన్ని నెరవేర్చడానికి ఉందో కూడా గమనించుకోవాలి కదా! మంటోకు సమకాలీన రచయిత్రి, స్నేహితురాలు, మంటో అంత కాకపోయినా ఎంతో కొంత వివాదాల్లో చిక్కుకున్న రచయిత్రి ఇస్మత్ చుగ్తాయి, తన ఆత్మకథ “కాగఝీ హై పైరహన్” లో లాహోర్ కోర్టు అప్పట్లో మంటో మీద, ఆమె మీద ఏకకాలంలో వేర్వేరు కేసులు బనాయించటం, దాన్ని వీళ్ళు సమర్థవంతంగా ఎదురుకోవటం గురించి రాశారు. కేసు నెగ్గేశాక, ఇస్మత్‍ను కోర్టు వెనుకకు పిల్చి,

“మీ కథలు చదివాను. “లిహాఫ్” కూడా చదివాను. వాటిలో మాలిన్యం లేదు. కానీ మంటో రాసే కథల్లో మాలిన్యం ఎక్కువగా ఉంటుంది.” అని జడ్జ్ అన్నారు.

“ప్రపంచం కూడా మాలిన్యంతో నిండి ఉంది కదా?” అని ఈవిడ అడిగారు.

“అందుకని? దాన్ని చెదరగొట్టడం అవసరమా?”

“చెదరగొట్టడం వల్ల అది ఉందని గ్రహిస్తాం. శుభ్రపరచడానికి ప్రయత్నిస్తాం.”  

మంటో చేసిన పని అదే! చెకోవ్ రచయిత కర్తవ్యం ఇలా రాశారు. అది అర్థమయితే, మంటోను అంగీకరించడం పెద్ద సమస్య కాదు.

“It is perfectly true that the world is ‘awash with men and women of the criminal class’. Human nature is flawed, so it would be surprising if the only people we come across in this world were to be the righteous. Those who think the task of literature is to extract a ‘pearl’ from a gang of villains deny its very essence. The justification for calling literature an art form is that it depicts life as it really is. It’s purpose is the honest and unconditional truth. To limit its function to nothing but the extraction of ‘pearls’ would threaten its very existence as much as insisting when Levitan paints a tree he should ignore its inconveniently grubby bark or its yellowing leaves. I agree that a ‘pearl’ is a lovely thing but the writer is surely not a confectioner or a beautician or an entertainer. The writer is a man bound by contract to his duty and to his conscience. In for a penny, in for a pound: however degrading he may find it, he has no choice but to overcome his squeamishness and soil his imagination with the filth of life.. the writer is no different from your average newspaper reporter. How could you regard a reporter who, from misplaced delicacy or a willingness to pander to his readers, never wrote about anyone but honest burghers, idealistic ladies or virtuous railwaymen?

To the chemist, there is no such thing on this earth as an impure substance. The writer must be as objective as chemist. He must turn his back on the subjective preferences of the world and recognize that dung heaps have a useful role to play in the countryside, that ignoble passions are every bit as much a part of life as noble ones.”

 

చివరిగా, రాజ్‍కమల్ ప్రకాశన్ వారు అచ్చువేసిన ఈ పుస్తకం గురించి కొన్ని వివరాలు:

 • ఓ రచయిత సమగ్ర రచనలన్నీ వేస్తున్నప్పుడు ఇంకొంచెం మంచి క్వాలిటి ఉండేలా చూసుకుంటే బాగుండేది. పేపర్-బాక్, హార్డ్ కవర్ రెండూ క్వాలిటీ పరంగా బాగోవు.

 • అక్షరాల ఫాంటు సైజు చాలా చిన్నగా ఉండడమే కాక, అక్కడక్కడా వత్తులు మాయమై చదవడానికి విసుగు  పుట్టిస్తాయి. అందులోనూ అంతంతమాత్రం హింది వచ్చిన నాకు చుక్కలు కనిపించాయి.

 • క్లిష్టమైన ఉర్దూ పదాలకు సరళమైన హింది సమానార్థాలు ఇచ్చారు. కాకపోతే, ఏ పేజికి ఆ పేజి ఇవ్వకుండా, ఒక్కో కథ చివర్న ఇచ్చారు. చదువుకోడానికి కొంచెం ఇబ్బంది అనిపించింది.

 • మంటో గురించి సంపాదకీయం, ఆయన రచనలు అర్థం చేసుకోడానికి వీలు కల్పించే వ్యాఖ్యానాలు పెద్ద ప్లస్! కథలను విభాగాలుగా చేసి ప్రచురించడం కూడా నాకు నచ్చింది.

మంటోను చదువుకోవాలన్న ఆసక్తి ఉన్నవారు పై మైనస్‍లను ఉపేక్షించి ఈ సంపుటాలను కొనుక్కోవడమే మేలు, అరకొర అనువాదాలపై ఆధారపడ్డం కన్నా!About the Author(s)

Purnima

Software engineer by profession, Hyderabadi at heart, laidback by choice, an introvert by default, schizophrenic at will etc. etc... so much so about her, to give you enough to guess what she might come up about the worlds of words she wanders.. keep guessing..6 Comments


 1. Rajesh Devabhaktuni

  మీ సమీక్ష / పుస్తక పరిచయం చాలా బాగుంది. చాలా చోట్ల ఈయన గురించి చదివాను. ప్రజాశక్తి వాళ్ళు వెసిన పుస్తకం చదివిన తరువాత ఆయన వ్రాసినవి మరిన్ని చదవాలనిపించింది. ఈ హిందీ సంపుటాల లింకు ఇవ్వగలరా…?

  నేను కుడా తెలుగంత వెగంగా చదవలెకపొయినా,నిదానంగా హిందీలొ చదివి అర్ధం చెసుకొగలను.


  • మంటో పుస్తకాలు నేను rajkamalprakashan.com లో కొన్నాను. పేపర్ బాక్ కొన్నాను. హార్డ్ బౌండ్ కొనుక్కోమని నా సలహా. నా పుస్తకాలు అప్పుడే దీనావస్థకు వచ్చేస్తున్నాయి, అంత పూర్ క్వాలిటి.

   పుస్తకాలు పంపడంలో కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పకుండా పంపిస్తారు. అందులో అనుమానాలక్కర్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ వి.పి.పి, కాష్ ఆన్ డెలివరీ తీసుకోకండి. అలా తీసుకోవటం వల్ల చాలా తలనొప్పి. ఏ కారణంచేతనైనా వాళ్ళకి కాల్ చేయాల్సిన అవసరం కలిగితే మాత్రం చుక్కలు చూపిస్తారు, సమాధానం ఇవ్వటంలో.

   లింక్ ఇక్కడ. వాళ్ళ వెబ్‍సైట్ కొంచెం buggy. సో, ఒకటికి రెండు సార్లు చూసుకొని ఆర్డర్ చేయండి. లేదా, ఏదైనా బుక్ ఫేర్ లో వాళ్ళ స్టాల్లో కొనుక్కోవడం సర్వోత్తమం. హైదరాబాద్ లో మిలింద్ పబ్లిషర్స్ వీళ్ళ పుస్తకాలు అమ్ముతారు. కానీ స్టాక్ లేకపోతే చాలా సమయం పడుతుంది.

   పుస్తకం వివరాలు:
   Manto Dastavej (Vol.1-5)
   Balraj Menra
   Year: 2004


 2. హిందీ పుస్తకం చదివి సమీక్ష రాశారా? Impressed.
  దోసెల ఎనాలజీ కేక!
  హోటల్లో దోసె తినడం మోరల్ గా ఎథికల్ గా సమర్ధనీయమా కాదా అని విశ్లేషించే కథకుల్ని మరిచారు 🙂


  • sahitya abhimani

   యండమూరి ఐతే దోశ తినడం కరెక్ట్ అని భావించి చేసే పాత్ర, కరెక్ట్ కాదని భావిస్తూనే తనను తాను మోసం చేసుకుంటూ తినే పాత్ర, కరెక్ట్ కాదని నమ్మి తినని పాత్రలతో ఓ నవల రాస్తారు. 🙂


 3. kvrn

  manto ye kaalam vaadu ? yeppadi nunchi yeppadi varaku bratikaaru ? atani etthara rachanalu yemiti. telugu anuvaadallu dorukutaayaaa ?  Type Comments in Telugu. (Press Ctrl+g to toggle between English and Telugu.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *
 
 

 

సాదత్ హసన్ మంటో కథలు

వ్యాసకర్త: వాడ్రేవు చినవీరభద్రుడు (ఈ వ్యాసాన్ని మొదట చినవీరభద్రుడు గారు 2013లో ఫేస్బు...
by అతిథి
1

 
 

దేశవిభజన గాయాలు: సియా హాషియే

లాంగ్ వీకెండ్‍గా కలిసొస్తే తప్ప ఆగష్టు పదిహేనును గురించి ప్రత్యేకంగా ఆలోచించటం మా...
by Purnima
5