దీపతోరణం – సమీక్ష

వ్యాసకర్త: యు. సారిక, సూర్యాపేట
*******

దీపతోరణం అనే ఈ కథానికల సంకలనంలో వంద మంది రచయిత్రుల కథలున్నాయి. ప్రస్తుతం కథలు రాస్తున్న దాదాపు రచయిత్రులందరూ ఈ దీపాలంకరణలో పాలు పంచుకున్నారు. నవరసాలూ ఒలికినప్పటికీ…..ఈ సంపుటి లో ఎన్నదగిన కథలు తక్కువే ఉన్నాయని చెప్పక తప్పదు.

వీటిలో సమస్యలు చర్చించినవీ, అభ్యుదయ భావాలున్నవీ, పురోగామి దృక్పథం తో కూడుకున్నవీ,మానవత్వానికి వన్నె తెచ్చేవీ ఉన్నాయి. ఇంకా హాస్య కథలూ, సందేశాత్మక కథలూ చోటు చేసుకున్నాయి. స్త్రీల సమస్యల్ని నిజాయితీ’గా చూపించినవి, కరుణ రసాన్ని పండించినవి కూడా కనబడతాయి. ఈ కథలని ప్రచురించిన పత్రికల పేర్లూ,తేదీలూ, రచయిత్రుల చిరునామాలూ కనీసం కాంటాక్ట్ ఫోన్ నంబర్లూ లేకపోవడం ప్రధాన లోపంగా చెప్పాలి.

లబ్ద ప్రతిష్టులైన సీనియర్ రచయిత్రులు తాము రాసిన వాటిల్లో మరి కొంత నాణ్యమైన కథల్ని పంపడంలో నిర్లక్ష్యం వహించారని పించింది. నూరు కథల సంపుటి అనేది ఒక రికార్డు కాబట్టి దీనిలోని కథలు ఒకదానితో మరొకటి పోటీ పడే స్థాయిలో ఉంటే బావుండేది.

ఇక కథల విషయానికొస్తే టి.శ్రీవల్లీ రాధిక గారి “సత్యానికి చేరువగా” అత్యుత్తమంగా ఉంది. నిజాయితీతో సంపూర్ణ సత్యాన్ని శోధించి పట్టుకున్న స్వచ్ఛమైన కథ ఇది. చక్కని మనో వికాస వాక్యాలతో కూడిన ఈ కథలో జీవన సత్యం ఉంది. హాస్యం చిందిస్తూనే, వంటింట్లో ఒక స్త్రీ శ్రమని ఆమె భర్త చక్కగా అర్థం చేసుకున్నట్టుగా రాసిన కథ పొత్తూరి విజయలక్ష్మి గారి “ప్రసాద రావూ – వంట సరస్వతీ” అద్భుతంగా ఉంది. ఆధునిక బిజీ జీవన శైలి గురించి చిత్రిస్తూ “అమ్మలేక పొతే అంతా కరువే!” అంటూ కంట నీరు తెప్పించిన కథ సోమరాజు సుశీల గారి “కరువు” చక్కని కథ. మరో మంచి కథ “పొడిచే పొద్దు”, రచయిత్రి కన్నెగంటి అనసూయ. దోపిడీ నుంచి బయట పడి ఎదిగిన కుర్రాడి గురించి బాగా రాసారు. ఈమె కథ చెప్పడంలో ఇంకొంచెం పరిణతి సాధించవలసి ఉంది. “దోపిడీ” అనే ముదిగంటి సుజాతరెడ్డి కథలో భాష, నేటివిటీ బాగా వచ్చాయి.

అల్లూరి గౌరీలక్ష్మి “మూగవోయిన కోయిల” కథ, భావుకత్వంతో కూడి సహజంగా లలితంగా ఉంది. వాడ్రేవు వీరలక్ష్మి గారు “ఒక రాత్రి గడవాలి” కథలో మానవిగా మిగలడం కోసం స్వేచ్ఛ ని ఉపయోగించుకున్నాననడం చాలా బావుంది. కొండవీటి సత్యవతి గారి “ధరణి” కథ, జాజుల గౌరి వివక్షకి గురయిన వర్గం గురించి రాసిన “భూమి తల్లి” కథ రెండూ రైటర్ చెప్పబోయిన పాయింట్ కి వ్యతిరేక దిశలో ఫలితాన్ని ఇచ్చాయి.

అన్నిటిలోకి అతి పెద్ద కథ ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి “ఇంటర్నెట్ పెళ్ళిచూపులు”. ఈ కథలో ఆదర్శ యువకుడైన హీరో వెతికి వెతికి తన కన్నా అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లను పెళ్ళాడి తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. తర్వాతి పెద్ద కథ యద్దనపూడి గారి “జ్యోతి”. ఈ కథ అసహజంగా ఉంది విషాదాన్ని వెలిగించింది.

ఆర్. వసుంధరాదేవి “గాలి రథం” లో ముస్లిం జీవిత చిత్రణ బాగా చేసారు. కానీ వారు చెప్పిన ఆధ్యాత్మిక భావన రక్తి కట్టలేదు. గోవిందరాజుల సీతాదేవి “గతానికి ఘడియ పెట్టు” బావుంది, కథనం ఇంకా బావుండొచ్చు. అణగారిన వర్గం వారి వెతలు చెబుతూ జూపాక సుభద్ర గారి కథ “మాన్యం” హృద్యంగా ఉంది. ఆకెళ్ళ వెంకట మహాలక్ష్మి గారు “గుప్పిటలో గోదారి ” కథలో భర్తలో లోపం పట్టుకోలేక పోయారు.

సందేశాన్నిచ్చిన కథలు పోల్కంపల్లి శాంతాదేవి గారి స్వేద బిందువులు, వావిలకొలను రాజ్యలక్ష్మి గారి “తొలి వెలుగులు”, గోగినేని మణి గారి “ఎడారిలో వసంతం”.

మానవత్వాన్ని తట్టినవి పోడూరు కృష్ణకుమారి గారి “ఇదం శరీరం”, పింగళి బాలాదేవి గారి “మొగ్గ నవ్వింది”, సమ్మెట ఉమాదేవి గారి “బతుకమ్మా…” , విశ్వనాథ రమ గారి “బ్రతుకు తీపి”.

జొన్నలగడ్డ రామలక్ష్మి గారు “అవుట్ సోర్సింగ్ ” పేరుతో ఆ విధానం మీద ఊహిస్తూ, హాస్య కథ రాసి నవ్వించారు. “పిన్నీసు” కూడా హస్యంగానే రాసారు రచయిత్రి పెయ్యేటి శ్రీదేవి.

పురుషాధిక్యాన్ని చక్కగా ప్రశ్నించిన కథ ఇంద్రగంటి జానకీబాల గారి “నిర్ణయానికి అటూ ఇటూ”. విజయలక్ష్మి రామకృష్ణన్ గారి “సంగమం” లో పాత్రల ఎలివేషన్ బాగా వచ్చింది. వింధ్యవాసిని గారి “మానవత్వం వోడిపోలేదు” కథ బావుంది కానీ టైటిల్ సూట్ కాలేదు. జలంధర గారి “ఉపాసన” లో కొంత కన్ఫ్యూజన్ ఉంది. డ్రామా ఎక్కువయ్యింది. కుప్పిలి పద్మ “చెట్టు నీడలో పరిమళాల పాట” లో క్లారిటీ లేదు. బలభద్ర పాత్రుని రమణి గారు, భార్యా భర్తలు మొదట్లో “అపరిచితులు” అంటూ చెప్పిన ఆపేరు గల కథ బాగానే వచ్చింది. వారణాసి నాగలక్ష్మి కథ “అమృతాన్ని సాధించు” లో టాపిక్స్ ఎక్కువయ్యాయి. శీర్షిక నప్పలేదు.

డి. సుజాతాదేవి గారు “ఎటు చూస్తే అటు”గా స్వార్థం కనబడుతుందని రాసిన కథ ఒప్పించింది. ఒక తమ్ముడి స్వార్థం చూపిస్తూ రాసిన కే.వరలక్ష్మి గారి “ఖాళీ సంచులు” కథ వాస్తవానికి ప్రతిరూపం. ఈవిడ దాన్ని బాగా రాసారు. అయితే కథకి అవసరం లేకపోయినా ఒక సామాజిక వర్గం వారిపై విసిరిన రెండు విసుర్లు ఈ కథ స్థాయిని తగ్గించాయి.

స్పూర్తి నిచ్చే కథల కోవలోకి కే.కే.భాగ్యశ్రీ గారి” జీవని” వస్తుంది. పిండ దశ నుండీ లింగ వివక్ష ఉంటుంది అన్న సంగతి “చీకటి” అన్న పేరు తో ఒక వాస్తవ ఫోటో లాంటి కథ చెప్పారు డా. పెళ్లకూరు జయప్రద. అలాగే కౌమార ఆడపిల్లలున్న ఇంటి స్థితిని ఒక డిస్ ప్లే లాంటి కథలో మల్లీశ్వరి చెప్పారు “నాన్న కూతురు” పేరుతో. “సహజీవనం” అంటే సహగమనం అని చెప్పిన గీతిక గారి కథ అర్ధం కాలేదు. అభ్యుదయ భావాలతో రాసిన పుట్ల హేమలత గారి కథ “రేపటి కోసం” నచ్చేట్టుగా ఉంది.

ఇక మిగిలిన కథల విషయానికొస్తే, కొన్ని రూపకాల్లా, నిలబడి అర్జెంటుగా రాసినట్టున్నాయి. కొన్ని స్కెచ్ ల్లా ఉంటే మరి కొన్ని ఆస్థాయిని కూడా చేరుకోలేక చతికిల పడ్డాయి. కొందరు సక్సెస్ స్టోరీలని కథలనుకున్నారు. మరి కొందరు హాఫ్ బేకేడ్ కేక్ లు వడ్డించారు. కొన్ని చిన్న పిల్లలు రాసినట్టున్నాయి. తలా తోకా లేని కథలు కూడా ఎలాగో మెల్లగా చేరాయి. కొందరు రచయిత్రులు మొదట్లో చెప్పదలుచుకున్న పాయింట్ ని మధ్యలో పారేసుకుని మరో పాయింట్ తో చివరికి చేరారు. మరి కొన్ని కథల్లో రైటర్లు జొరబడిపోయి ప్రసంగాలు చెయ్యడం కూడా సంభవించింది.

ఈ సంపుటిని శ్రీ వేదగిరి కమ్యూనికేషన్స్ వారు ప్రచురించారు. సంపాదక వర్గం లో రచయిత్రులు డా.వాసా ప్రభావతి, పొత్తూరి విజయ లక్ష్మి, స్వాతి శ్రీపాద, తమిరిశ జానకి గార్లున్నారు. ఈ కథానికా సంకలనాన్ని తీసుకు రావాలని సంకల్పించినవారూ, ఇందునిమిత్తమై శ్రమ పడిన ప్రతి ఒక్కరూ అభినందనీయులే. వంద మంది రచయిత్రుల మనో భావాలను నా అల్మైరా లో దాచుకునే అదృష్టం కలిగించిన మహిళా రైటర్ లందరికీ నా అభివాదాలు.

***
పుస్తకం వివరాలు ఇక్కడ. ఈ పుస్తకంలో ఉన్న కథలు రాసిన రచయిత్రుల జాబితా ఇక్కడ.

You Might Also Like

9 Comments

  1. V. ముత్యాల రావ్

    యు.సారిక గారి రివ్యూ చూసి దీపతోరణం బుక్ తెప్పించుకున్నాను.

    “దీపతోరణం” చాలా బావుంది. వందమంది రచయిత్రుల కథల సంకలనం అంటే నిజంగా రికార్డే. వంద వైవిధ్యమైన కథా సుమాల్ని తోరణంగా అందించిన వేదగిరి రాంబాబుగారి ప్రయత్నం అభినందనీయం.

    సారిక గారు ఇక్కడ ఒకటి గమనించాలి. ఒక కథాసంకలనాన్ని ఆయా రచయిత్రులు స్వంతంగా తీసుకొస్తున్నప్పుడు కథలని ప్రచురించిన పత్రికల పేర్లూ, తేదీలూ, వివరాలూ,.. ప్రచురించుకుంటారు. కానీ, వందమంది కథల్ని ఏర్చి కూర్చి ఒకచోట చేర్చుతున్నప్పుడు ఆ వివరాలన్నీ సేకరించి పర్ఫెక్ట్‌గ ఇవ్వడమంటే చాలా కష్టమైన పనే. అయితే ఫోన్ నెంబర్ అనేది రచయిత్రుల వ్యక్తిగత విషయం కాబట్టి కొందరు ఇవ్వొచ్చు, మరికొందరు ఇవ్వలేకపోవచ్చు. అందువల్ల మొత్తానికీ ప్రచురించలేకపోయారేమో.

    “దీపతోరణం”లోని కథలు చదివి సారిక గారు సమీక్ష బానే చేశారుకానీ.. ఎంతో కష్టపడి ఒక భావాన్ని అక్షరాల్లో పెట్టే రచయిత్రుల్ని ఒక తేలికపదంతో, చులకనాభావంతో, జడ్జ్ చేస్తున్నట్టుగా చెప్పడమే బాలేదు.

    __ నూరు కథల సంపుటి అనేది ఒక రికార్డు కాబట్టి దీనిలోని కథలు ఒకదానితో మరొకటి పోటీ పడే స్థాయిలో ఉంటే బావుండేది __
    వంద కథల సంకలనం తీసుకొస్తున్నాం మీ కథ ఇవ్వండి అని అడిగినప్పుడు ఏ రచయిత్రీ ఇందులో ఎవరెవరి కథలు ఉంటున్నాయి అని అడిగి ఆ కథలకి ధీటుగా ఉండే కథలని పంపాలి అనుకోరు. వారు వ్రాసిన వాటిలో లేటెస్టువో, వారికి నచ్చినవో ఇస్తారు. రెండుమూడో, పదో పన్నెండో అయితే పోటీ పడే స్థాయి అనుకోవచ్చు. వంద కథలూ పోటీపడే స్థాయి అంటే అది అసాధ్యం.
    ఎందుకంటే మీకు నచ్చని కథ మరొకరికి అద్భుతం అనిపించొచ్చు.

    __ ఇక కథల విషయానికొస్తే టి.శ్రీవల్లీ రాధిక గారి “సత్యానికి చేరువగా” అత్యుత్తమంగా ఉంది __
    వంద కథలు చదివి ఒకేఒక్క కథ అత్యుత్తమంగా ఉంది- అనడం పక్షపాతధోరణిలో ఉంది తప్ప నిజాయితీ సమీక్షలా లేదు. ఎందుకంటే సారిక గారు విమర్శించిన రచయిత్రుల కథలూ అంతకంటే చాలా బావున్నాయి.

    __ ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి “ఇంటర్నెట్ పెళ్ళిచూపులు”. ఈ కథలో ఆదర్శ యువకుడైన హీరో వెతికి వెతికి తన కన్నా అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లను పెళ్ళాడి తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది __
    రంగనాయకమ్మ గారి కథలో కథానాయకుడికి లేని లక్షణాల్ని ఆపాదించి; “అహం” అంటూ, “వెతికి వెతికీ తక్కువ స్థాయిలో ఉన్న పిల్లను పెళ్ళాడి” అంటూ, వ్రాశారు. రచయిత/త్రులు కథానాయికా/నాయకుని మనసుని చూస్తారు తప్ప సారికగారిలా స్థాయిలు కాదు.
    నిజానికి ఈ కథలోని రాంబాబు తన అభిరుచులకి తగ్గ పెళ్ళాం కోసం వెదికాడుగానీ, తక్కువ స్థాయి అమ్మాయికోసం వెదకలేదు. అసలు అహం అనదగ్గ కథానాయకుని లక్షణాలు ఈ కథలో ఏవీ లేవు.

    __ యద్దనపూడి గారి “జ్యోతి”. ఈ కథ అసహజంగా ఉంది __
    ఈ కథ అసహజంగా ఉండడానికి అందులో జరగరానంత విడ్డూరమేమీ లేదే.
    అభిమానవతి ఐన జ్యోతి వలచిన వాడి మోసాన్ని పెళ్ళయ్యాక గ్రహించి, అన్నయ్య వద్దనుంచి లేచిపోయి వచ్చినందుకు ఫలితంగా అన్నయ్యకి మొహం చూపించలేక, తన తప్పుకి శుష్కించిపోతూ చివరికి అన్నయ్య తనని వెతుక్కుంటూ వచ్చాక, ప్రాణాలు వదిలేస్తుంది. తన చితి తంతంతా అన్ననే చెయ్యమంటుంది.
    ఇందులో అసహజం ఏముంది..?

    అలాగే __ “సహజీవనం” అంటే సహగమనం అని చెప్పిన గీతిక గారి కథ అర్ధం కాలేదు __ అన్నారు.
    సహజీవనం కథని సహగమనంగా రచయిత్రి ఎక్కడా చెప్పలేదే.
    సతీసహగమనం అంటే భర్త చితిమీద బ్రతికున్న భార్యని కాల్చడం.
    ‘అరవై ఏళ్ళు కాపురం చేసి, ప్రేమానురాగాలతో ఇద్దరు ఒక్కరుగ మారిన జంట.. ఒకరి మరణాన్ని చూశాక, రెండోవారూ తమకు తెలీకుండానే ప్రాణాలు వదిలేశారు..’ అనే సంఘటన- ‘భర్త చితిపై భార్యని బలవంతాన పడేసి కాల్చే సహగమనం’ ఎలా అవుతుంది..!..?
    ఒక పని లేదా సంఘటన మనకి నచ్చినప్పుడు ఎలా ఉంటుందో, అదే పని(సంఘటన) మనకి ఇష్టంలేనప్పుడు ఎంత ప్రతిఘటిస్తామో, ఆ తేడా సారికగారికి తెలిస్తే ఈ కథ అర్థమై ఉండేది.

    ఇలా ప్రతిదానిగురించీ చెప్పుకుంటూ వెళితే ఈ కామెంట్ మరో సమీక్ష అవుతుంది. మొత్తంమీద సారిక గారు కథల్లో సున్నితత్వాన్ని పట్టుకోలేకపోతున్నారు.

    ఆడవాళ్ళకు ఆడవాళ్ళే శత్రువులన్నట్టు వందమంది రచయిత్రుల కథల పుస్తకం “దీపతోరణం”మీద సారిక గారి విమర్శ సున్నితంగా కాక చాలా హార్ష్‌గ {అంటే_ తక్కువ స్థాయి, అహాన్ని తృప్తి పరుచుకోవడం, అసహజం, చతికిలపడ్డాయి, సహగమనం..} ఉంది.

    “దీపతోరణం” పుస్తకంలోని కొన్ని మిస్టేక్స్‌నీ ఇక్కడ ప్రస్తావించడం అవసరం అనుకుంటున్నాను.

    వాలి హిరణ్మయీ దేవిగారి పేరుని అట్ట వెనుక పేర్కొన్నారు గానీ, వారి కథ ఇందులో ఎక్కడా కనిపించలేదు. బహుశ ఆ కథ వేరే ఎవరి పేరుతోనైనా వచ్చి ఉండవచ్చేమో.
    జొన్నలగడ్డ రామలక్ష్మి, చంద్రలత, కె.కె.భాగ్యశ్రీ, ఆచంట హైమావతి గుర్తింపు పొందిన వారి పేర్లనీ వెనక అట్టపై ప్రస్తావించకపోవడం; అలాగే మరికొందరి కథల్ని వారికి తెలియబరచకుండానే వేయడం, ఇలాంటివి పబ్లికేషన్స్ వారు గమనించాలి.

    1. u.sarika

      మిత్రులు సమీక్షని.. సమీక్షించా లన్నఉత్సాహంతోనైనా దీపతోరణం చదవడం ముదావహం.
      అయితే కధల కోసం ఈ కధా సంకలనాన్ని చదివితే ఇంకా బాగుండేది. సంకలన కర్తల ఆశయం నెరవేరేది.

      కధ ఏ కాలం లో రాశారు? అన్నది కొన్ని కధా వస్తువుల విషయంలో కీలక మవుతుంది. ఒకే రైటర్
      రాసిన కధ ల సంపుటిలో కన్నా ఇటువంటి రికార్డ్స్ లో ప్రచురణ తేదీలు మరీ అవసరం వీలయితే పత్రిక పేరుతో సహా.

      సంకలనంలో తోటి రచయితలెవరెవరున్నారు? అని చూసి ఎవరూ కధలివ్వక పోవచ్చు. 100 కధలంటే
      దాదాపు సమ కాలీన రచయిత్రులందరూ ఉంటారని వారికి తెలుస్తుంది.

      ఒక రివ్యూ ని చేత్తో పట్టుకుని జడ్జ్ చేస్తూ తన భావాలని సమీక్షకురాలికి ఆపాదిస్తూ స్త్రీ కి శత్రువు స్త్రీ కాదని నిరూపించారు మిత్రులు ఎందుకంటే శ్రీ వల్లి రాధిక గారు కూడా స్త్రీయే, పొత్తూరి, సోమరాజు, కన్నెగంటి వారితో పాటు.

      నేను చెప్పింది నా అభిప్రాయం మాత్రమే. అందరి తరఫునా రాయలేదు. రచయితలెవరైనా.. వారు రాసిన కధ బాలేదు అని సమీక్షలో వస్తే వారు తమ కధ,కధనాల పరంగా ఒకసారి తప్పక ఆలోచిస్తారు అంతే కానీ క్రుంగి కృశించి పోతారనుకోను. సమీక్షించిన వారిపై అసహనపడతారనుకోను. గౌరవ మిత్రులే సెలవిచ్చినట్టు నాకు నచ్చని కధ, అర్ధం కాని కధ మరొకరికి అర్ధమై అద్భుతంగా ఉందనిపించవచ్చు. మరొకరికి నచ్చని కధ వస్తువు పరంగా, శైలి పరంగా నాకు ఉత్తమంగా తోచవచ్చు.

      గౌరవ రచయిత్రుల మీద నాకు పక్ష పాతమూ లేదు. ద్వేషమూ లేదు. సహృదయులైన రైటర్ లందరూ నా సమీక్ష ని ఆర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను.

      మిత్రులు మరొకరి అభిప్రాయం మీద ఆధార పడి కాకుండా… కధలన్నీ ఓపికగా చదివి, తనకు తానుగా ఆలోచించి, సున్నితత్వాల్ని వివరిస్తూ మరో సమీక్ష రాసి ఉంటే రచయిత్రులంతా ఆనందించేవారేమో కదా !

  2. satyavati kondaveeti

    ఇందు మూలంగా తెలియచేయునది ఏమనగా “ధరణి” కధ నాది కాదు.సంపాదకుల తప్పిదం వల్ల నేను రాయని కధని నాకు అంటగట్టారు.
    నేను వెంటనే ఈ విషయం వారికి తెలియచేసాను.ధరణి కధ ఎవరిదో నాకూ తెలియదు.
    ఈ పుస్తక సంపాదకులు చేసిన పొరపాటుకు ధరణి కధా రచయిత్రికి నేను పుస్తకం నెట్ ద్వారా క్షమాపణలు చెప్పుకుంటున్నాను.

    సత్యవతి కొండవీటి

  3. ఊసుపోక – సంకలించడం ఓ శ్రమ | తెలుగు తూలిక

    […] చూసినతరవాత, పుస్తకం.నెట్‌లో దీపతోరణం వందమంది రచయిత్రులకథానికలు సంకనలంమీద సారికగారి సమీక్ష […]

  4. దీపతోరణం – సమీక్ష | Bagunnaraa Blogs

    […] అతిథి వ్యాసకర్త: యు. సారిక, సూర్యాపేట ******* […]

  5. ప్రసాద్

    “అన్నిటిలోకి అతి పెద్ద కథ ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారి ‘ఇంటర్నెట్ పెళ్ళిచూపులు’. ఈ కథలో ఆదర్శ యువకుడైన హీరో వెతికి వెతికి తన కన్నా అన్ని విధాలా తక్కువ స్థాయిలో ఉన్న పిల్లను పెళ్ళాడి తన అహాన్ని సంతృప్తి పరుచుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.” అని సమీక్షకురాలు రాశారు.

    1. ఈ కధ రాసిన వారు, “ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు” కాదు. “రంగనాయకమ్మ గారు” మాత్రమే. “ముప్పాళ్ళ” అనే పేరునీ, ఆ పేరుతో సంబంధం గల మనిషినీ వదిలేసి, నలభై యేళ్ళు దాటింది. ఈ నలభై యేళ్ళలో వచ్చిన రచనల్లో, ప్రతీ చోటా, “రంగనాయకమ్మ” అనే వుంటుంది. ఇది చిన్న విషయం కాదు. తప్పు దిద్దు కోవాలి.

    2. ఈ కధ చదివి, అర్థం చేసుకున్న వాళ్ళెవరూ, ఆ యువకుడు, “తన అహాన్ని సంతృప్తి పరచడం కోసం”, పెళ్ళి చేసుకున్నాడని అనుకోరు. ఒక మనిషితో పరిచయం కలిగి, ఆ మనిషి ప్రవర్తనని గమనించే అవకాశాలు చాలా కలిగి, ఆ మనిషి మీద ప్రేమ ఏర్పడటం వల్ల మాత్రమే ఆ పెళ్ళి చేసుకున్నాడు. ఇదంతా కధలో చాలా వివరంగా వుంది. ఒక మనిషి మీద ప్రేమ కలిగినప్పుడు, ఆ మనిషి “కులం”, “ఆర్థిక పరిస్థితీ” (సమీక్షకురాలు అన్న “తక్కువ స్థాయి” అన్న పదాలకి అసలైన అర్థాలు ఇవీ), బుర్ర లోకి రావు ఎవరికీ, అంటే ప్రేమ తెలిసిన వాళ్ళకి. ఆ మనిషి చైతన్యం మాత్రమే ముఖ్యం.

    3. ఈ కధంతా, ఇంటర్నెట్ పెళ్ళి వెబ్ సైటుల మీదా, అందులో వున్న సభ్యుల మీదా ఉన్న విసుర్లతో, కబుర్లతో సాగుతుంది ముఖ్యంగా. చివరికి ఇంటికి వచ్చిన అమ్మాయి మీద ప్రేమ కలిగి, పెళ్ళి చేసుకుంటాననడంతో ముగుస్తుంది. పైపెచ్చు, ఆ యువకుడికి, ఆ అమ్మాయి “తక్కువ స్థాయి” అడ్డు రాదు తన ప్రేమ విషయంలో.

    ఇదీ సంగతి.
    ప్రసాద్

    1. u.sarika

      రంగ నాయకమ్మ గారి పేరు, ఆ ఇంటి పేరుతో సహా మా బాల్యపు మైండ్ లో
      రిజిస్టర్ అయ్యి ఉండడం వల్ల జరిగిన పొరపాటు మాత్రమే !

      యు. సారిక
      సమీక్ష కురాలు

  6. మాలతి

    మంచి సమీక్ష. అన్ని కథలు నిజంగా చదివి, విశ్లేషించినందుకు సంతోషం.
    ఇందులో ముఖ్యంగా ఒక వాక్యం నాదృష్టినాకట్టుకుంది. ఎవరు సంకలనాలు తలపెట్టినా, గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యవిషయం ఇది.
    :” రచయిత్రులు తాము రాసిన వాటిల్లో మరి కొంత నాణ్యమైన కథల్ని పంపడంలో నిర్లక్ష్యం వహించారని పించింది.” – ఇది రచయిత్రులే కాక, సంకలనకర్తలు కూడా గమనించవలసిన విషయం కనక మరోసారి చెప్తున్నాను. సంకనలకర్తలు రచయిత్రులని అడక్కుండా సంకలనాల్లో ప్రచురిస్తున్నారు. ఈ సంకనలం ప్రచురణ అయిపోయినతరవాతే నాకథ ఒకటి ఇందులో చేర్చేరని తెలిసింది.

    1. u.sarika

      నా శ్రమని గుర్తించినందుకు మాలతి గారికి ధన్యవాదాలు !

      యు. సారిక
      సమీక్ష కురాలు

Leave a Reply