బ్రదకడానికీ, జీవించడానికీ తేడా చెప్పిన ఆధునిక నవలిక

వ్యాసకర్త: రాయదుర్గం విజయలక్ష్మి

తల్లావజ్ఝల పతంజలిశాస్త్రిగారు తెలుగు కథను పరిపుష్టం చేసిన కథకులలో ఎన్నదగిన వారు. “వడ్లచిలుకలు” నుండి నేటి “నలుపెరుపు” దాకా కథా సంపుటులను వెలువరించిన వారి కలం నుండి వెలువడినదే “వీరనాయకుడు” అన్న నవలిక. చినుకు మాస పత్రికలో ధారావాహికంగా వెలువడి పుస్తక రూపం దాల్చిన ఈ “వీరనాయకుడు” ఆద్యంతం వ్యంజనాత్మకంగా, ధ్వనిపూరితంగా వ్రాయబడిన వ్యంగ్యరచన!

వీరనాయకుడి కథను చెప్పడంలో రచయిత ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ను ఎన్నుకున్నారు. ఎక్కడో దూరతీరాల నుండి యాత్రలు చేసుకుంటూ వచ్చిన ఒకానొక ఆశ్వికుడు, వేంగి రాజ్యంలో జనపదాలనుండి నగరాల దాకా పెక్కు చోట్ల ప్రతిష్టించబడి, జీర్ణావస్థలోనున్న వీరనాయకుడి శిలాఫలకాలను, శిలా విగ్రహాలను చూశాడట! వీరనయకుడెవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో ప్రయాణించిన ఆ ఆశ్వికుడు, తనకు ఆతిథ్యమిచ్చిన గ్రామాధికారి ఇంట యాదృచ్ఛికం గా పరిచయమైన ఆసారి పెద్దియ ద్వారా నాయకుని కథను తెలుసుకున్నాడు. “భౌతిక ప్రపంచం గోదావరి దాటి విస్తరించకున్నా, ఆ ప్రాంతపు నదీనదాలూ, సెలయేర్ల దాహం పుచ్చుకున్నట్లు, పూల పరీమళాన్ని వెదుక్కుంటూ వచ్చే సీతాకోకచిలుకల్లా కథలూ, గాథలూ ఆశ్రయించినట్లు, బెల్లం తేగెలాంటి మధురమైన మాటలతో సాగే” పెద్దియ కథ చెప్పే విధానానికి ఆకర్షితుడైన ఆ ఆశ్వికుడు, వీరనాయకుడెవరని అడిగాడు. “…..సేపం తగిలి నాయకుడు మట్టిలో కలిసినాడు. ఈ సేమకొచ్చి సేపం నెత్తిన బెట్టుకొని మోసినాడు” అంటూ సాగిన నాయకుని కథ ప్రారంభం, గొప్ప చారిత్రిక ఇతివృత్తాన్ని గూర్చి తెలిసికోబోతున్న అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.

పరదేశీయులుగా ముప్ఫైమంది సాయుధులైన అనుచరులతో, నమ్మినబంటు బేతప్పతో బాటు కోట బయట కొలువైయున్న మూల్లగూరమ్మ దేవతను దర్శించడంతో ప్రారంభమైన కథ ఆద్యంతం ఉత్కంఠతతో సాగుతుంది.గొప్ప చారిత్రిక నేపథ్యంతో, రాజకీయ వాతావరణంతో, శైవమఠాల ప్రాబల్యం, శైవ మఠాధిపతుల పరపతిని వివరిస్తూ కొనసాగిన ఈ నవలిక చదువుతున్నంతసేపూ వీరనాయకుడెవరు?, ఏ కాలానికి సంబంధించినవాడు? అన్న ప్రశ్నలు సమాంతరంగా మనలో ప్రవహిస్తూనే ఉంటాయి.

కొండంత మనిషి వీరనాయకుడు అందగాడు కాదుగాని, కళ్ళతో ఏమైనా చెయ్యగలడట! పెదాలు నవ్వినా కళ్ళు నవ్వవట! కొండవీటి సీమనుండి రేవు దాటి ముల్లగూరమ్మ దర్శనం కోసం వచ్చామని చెప్పుకున్న నయకుని కారణం గా, రేవు దగ్గరున్న ఇద్దరు వేగులు ప్రభుత్వోద్యోగాలనుండి తొలగింపబడినారట! గోదావరిలో స్నానం, ముల్లగూరమ్మ దర్శనంతో కాలం గడుపుతున్న వీరనాయకుడు, చివరికి వేంగీ వేంగీ రాజ్యంలోని ప్రజలకు సైనిక శిక్షణ ఇచ్చే పనిలో కుదురుకొని సమీపంలోనికోరుకొండలో అనుచరులు బేతప్పతో సహా నివాసమేర్పరచుకున్నాడు.

“మెరపు లాంటి ఆలోచనలు, చేనేత లాంతి వ్యూహంతో” అనుక్షణం మసిలే వీరనాయకుడు, ఒకవైపు ప్రజలకు మల్లయుద్ధం, విలువిద్య వంటి విద్యల్లో శిక్షణనిస్తూ, కశ్మలం, తుప్పు ఒదిలిన బాకుల్లా వారిని తయారు చేస్తూనే, మరోవైపు కోరుకొండ దండనాయకులతో బాటు, రాచనగరు రాజమండ్రిలో కూడా రాజమాత ప్రాపకాన్ని సంపాదించుకున్నాడు. పద్ధతి ప్రకారం అడవులను నరికి సాగు చేసుకునే వారి పద్ధతులను, గమనిస్తూనే, ప్రజలలో అంటీ ముట్టనట్లుగా ఉంటున్న ఆదివాసీ తెగతో స్నేహంచేసి, వారందరికీ యుద్ధవిద్యలను నేర్పించాడు. వేట వ్యూహంతో కోరుకొడ దండనాయకుణ్ణి చంపించి, కోరుకొండ దుర్గాధిపతిగా ప్రభువులచే నియమింపబడినాడు.

“రాజనీతిలో విధేయత ఎంత మనిషినైనా లొంగదీస్తుందని”, ఎరిగిన నాయకుడు, అత్యంత విధేయతతో, ప్రభువులను, రాజమాతను, మహాదండనాయకులను ఆకర్షించగలిగినాడు. తనదైన వ్యూహంతో దూసుకుపోతూ, మహాదండనాయకుల తర్వాత అంతటి వారైన పోతారెడ్డి తో, వాణిజ్యపన్నులు మున్నగు వ్యవహారాలలో ఉన్నతాధికారి అయిన భూపాలరెడ్డితో, లోకజ్ఞతలో వీరిరువురికీ సన్నిహితుడైన ఇనుగంటివారి శర్మతో మంచి స్నేహాన్ని సంపాదించుకున్నాడు. వృద్ధులూ, అస్వస్థులూ అయిన మహాదండనాయకులవారిని, రాజధాని నుండి సగౌరంగా కొలను వీటికి సాగనంపి, ఓతారెడ్డికి మహాదండనాయక పదవి రావడంలో సహకరించాడు. వర్తకమూ, అటవీ వనరులు, మొదలుగాగల రాజ్యసంపదలన్నింటా తన వాటాలు సంపాదించుకుంటూ, ఆయా అధికారులకూ తినడం నేర్పాడట వీరనాయకుడు! ఒక్క మాటలో చెప్పాలంటే తిరుగులేని నాయకునిగా ఎదిగినాడు.కాని అతని దృష్టిమాత్రం రాజమండ్రి పైనే! ఒకరికి తెలియకుండా మరొకరితో స్నేహాన్ని కూడా రహస్యంగానే నడిపించే నాయకుడు, అనుకోకుండా ఒకరోజు గోదావరిలో ఈదాలన్న కోరికను అణచుకోలేక, గోదావరిలో ఈదుతూ మొసలికి ఆహారమై పోయాడు.

నిజంగా చెప్పాలంటే వీరనాయకుడి కథ విషాదాంతముగింపుతో ఇక్కడితో అయిపోయింది. ఈ నవలిక కూడా ఇక్కడితో ఆగిపోవాలి. కాని మిగతా సగం కథను అతని అనుచరుడు బేతప్ప నడిపిస్తాడు. నాయకుడంటే ఉన్న విపరీతమైన అభిమానం, “స్నానం చేసివచ్చి నువ్వు బిత్తరపోయే విషయం చెబుత”నన్న నాయకుని చివరి పలుకులూ బేతప్పను నిలువనేయలేదు. వేట నెపంతో మరణించిన కోరుకొండ దండనాయకుని పేర శివాలయాన్ని నిర్మించినట్లుగానే నాయకుని పేరు మీద కూడా శివాలయాన్ని నిర్మించాలని ప్రయత్నించాడు, బేతప్ప. కాని కాలం సమీపిస్తే తాడే పామై కరుస్తుందన్నట్లు, శివాలయ నిర్మాణానికిగాని, చివరికి రాచనగరులో నాయకుని విగ్రహ ప్రతిష్టాపనకుగాని బేతప్పకు అనుమతి లభించలేదు. రాజదర్శనం కూదా అలభ్యమే అయ్యింది.

“రహస్యం రాజనీతి” అని తెలిసిన నాయకునికీ, “దుఃఖం గడ్డకట్టి కసిగా మార్చుకున్న బేతప్పకీ గల తేడాను గుర్తించిన రాచనగరు ప్రముఖులు బేతప్ప తలపెట్టిన ఏ పనినీ అనుమతించలేదు. బేతప్ప లోని కసి ప్రతీకారంగా మారింది. ఎనలేని ధిక్కార స్వరంతో కూడిన సాహసాన్ని అతడిలో నెలకొలింది. ఫలితంగా వీరనాయకునికి అనుకూలంగా ఉన్న కొలను వీడు లో శిలా ఫలకాలపై నాయకుడి శిల్పాలను చెక్కించాడు. ఒక్కో ఫలకంగా ప్రతిష్టించుకుంటూ వచ్చాడు.విషయం తెలిసిన రాచనగరు ప్రముఖులు ఈ ధిక్కారాన్ని సహింపలేకపోయారు. “రాజదండం పయోగించడం, సముదాయించడం, లేదా తొలగించడం అన్న మూడు రకాలైన రాజనీతిలో దేనిని అమలు పరచాలా” అని వ్యూహాలు పన్నారు. ఈ నేపథ్యంలో, “సాహసంలో తొందరపాటు ఎక్కువ. అది అతని పతనానికి దారితీస్తుంది” అన్నట్లు, విచక్షణ కోల్పోయిన బేతప్ప, తాగిన మైకంలో ప్రియురాలు కలువపువ్వు (నాగమణి) దగ్గర, రాజ్యంలోని ప్రముఖుల అధికారుల అక్రమ సంపాదనల గురించి ఏకరువు పెట్టాడు.

“రహస్యం విత్తనం వంటిది. భూమిలో ఉన్నంతసేపూ నిశ్శబ్దంగా సూక్ష్మ రూపంలో ఉంటుంది. బయటపడిన తర్వాత చెట్టువలె శాఖోపశాఖలుగా విస్తరిల్లుతుంది”.. అన్న సత్యానికి నిదర్శనంగా శైవమఠందాకా పాకిన రాజోద్యోగుల అవినీతి రాజధానిని కుదిపి వేసింది. తత్ఫలితంగా రాజనీతిలో మూడవ శిక్షకు నిశ్శబ్దంగా బలైపోయాడు బేతప్ప. నిశ్శబ్దంగా మొదలైన ఒక విధ్వంసం, రాచనగరును అతలాకుతలం చేసి ముగిసింది.

ఈ కథను చెప్పడంలో రచయిత ఎన్నుకున్న చారిత్రిక, రాజకీయ వాతావరణం, కథకు చారిత్రాత్మకతను చేకూర్చాయి. బేతప్ప మరణం తర్వాత భూమిలోంచీ, విగ్రహాలకిందనుంచీ, నేల యీనినట్లు, పుట్టుకొచ్చిన పాములు, ఒక విష ఋతువును ప్రసారం చేశాయని.. జానపదాత్మకతను నాయకుని కథకు కలిగించడం కొస మెరుపు! నానా బీభత్సానికి కారకమైన ఆ పాములు ఎలా వచ్చాయో అలాగే అంతమయ్యాయని చెప్తూ, “స్థలకాలాదులతో నిమిత్తం లేని కథ ముగిసింది. ఆంతరిక లొకంలో కథ మొదలై ముగిసింది”…. అంటూ వీరనాయకుడి కథను ముగించాడు ఆసారి పెద్దియ. కాని అసలు కథ యిప్పుడే ప్రారంభమవ్తుంది మన మనస్సులలో! ఎవరీ వీరనాయకుడు? ఏ కాలానికి చెందినవాడు? ఏ రాజ్యానికి సంబంధించిన వాడు/.. అన్న ప్రశ్నలకు జవాబులను అన్వేషిస్తుంటే, హఠాత్తుగా మెరపు మెరసినట్లు ఒక ఊహ పొడసూపింది. స్థలకాలాదులకు నిమిత్తం లేని లోకంలో వెలసి, స్వార్థం కోసం రాజ్యాన్ని అవినీతిమయం చేయగలిగిన నాయకులున్న ఏ దేశానికైనా వీరనాయకుడు సొంతదారే!

రాజకీయ, సామాజిక వ్యవస్థలో అవినీతి పెచ్చుపెరిగిపోతున్న ఈ నాటి నేపథ్యంలో కావలసిన రచన యిది. “వీరనాయకుడు సుఖపడలేదు. సుఖాన్ని ఒదులుకొని, ఒక రకంగా జీవితాన్ని త్యాగం చేసి శక్తిమంతుడవడంవల్ల ప్రయోజనం ఏముంది?”…. అన్న రచయిత మాటలు గమనింపదగినవి. బ్రతకడానికీ, జీవించడానికీ ఉన్న తేడాను సుస్పష్టం చేసే వాక్యాలివి. తృప్తిగా జీవించే వాడు రాజు కన్న శక్తిమంతుడు. జీవితంలో తృప్తిని కోల్పోయి బ్రదికే వాడు రాజైనా, అతడు బలహీనుడే! ఏం సాధించాడు వీరనాయకుడు?… అని మనం పడే ఆవేదనకు యిదే సరైన జవాబనిపించింది.

“హితముతో కూడినది సాహిత్యము” అంటారు. వేదాలు, శాస్త్రాలు, కావ్యాలు…. ఏ మూటికీ ఉన్న తేడాను చెప్తూ, వేదాలు ప్రభువులా నిర్దేశించేవనీ, శాస్త్రాలు మిత్రునిలా బోధించేవనీ, కావ్యాలు ప్రియురాలిలా నచ్చచెప్పేవనీ వివరించారు ప్రాచీనాలంకారికులు! ఆధునిక యుగంలో కల్పిత రచనలన్నీ కావ్యాలు చేయవలసిన పనిని చేయగలవు. వ్యంజనాత్మకంగా సామాజిక శ్రేయస్సుకు కావలసిన నీతులను ఉపదేశించగలవు. ఈ నేపథ్యంలో … మితిమేరిన ఆశతో, స్వార్థంతో అరాచకత్వం సృష్టించి, దేశాన్ని అవినీతిమయం చేసే వారెవ్వరూ సుఖపడిన దాఖలాలు లేవని ఆధునిక పంథాలో, వ్యంగాత్మకంగా చెప్పిన ఈ నవలికా రచయిత తల్లావజ్ఝల పతంజలి శాస్త్రిగారు ధన్యులు.

You Might Also Like

6 Comments

  1. ANIL

    Very wonderful book Madem, currently i am staying in Bangalore, let me know where it is available.

    Thank you.
    Anil
    cell: 09986649334

  2. Dr.Rayadurgam Vijayalakshmi

    కృతజ్ఞతలు చంద్రహాస్ గారు,
    ఈపుస్తకం లభించు చోటు-
    చినుకుపబ్లికేషన్స్,
    దత్తాస్ నయా బజార్,
    రాజ్ యువరాజ్ థియేటర్స్ ఎదురుగా,
    గాంధీ నగర్,
    విజయవాడ – 520 003
    ఫోన్:9848132208

  3. చంద్రహాస్

    The review is top class. The book also appears to be great.
    Who’s the publisher? I tried Visaalaaandhra today. It’s not in that store.

  4. మణి వడ్లమాని

    పతంజలి శాస్త్రి గారు ఒక మహా ఙ్ఞాని, ,రాజమండ్రి లో మా పక్క వాటాలో వుండే వారు(ఆయన SKBR కాలేజీ,అమలాపురం లో అధ్యాపకు లు). వారి సతీమణి మా కాలేజీ లో హిస్టరీ చెప్పేవారు విజయలక్ష్మి గారు. ఈ నవలిక నేను చదవలేదు గాని,వారి బ్రహ్మకేశాలు మాత్రం ఇది వరలో ప్రతి నెలా చతుర పుస్తకం లో వచ్చేది.

    ఇంత మంచి నవలిక గురుంచి కళ్ళకు కట్టి నట్లు గ పరిచయం చేసి బాగా విసదీకరించైనా R విజయలక్ష్మి. గారికి ధన్యవాదాలు

  5. A.Surya Prakash

    వీరనాయకుడికధ మన రాజశేఖర రెడ్డి జీవితాన్ని గుర్తుకు తెస్తున్నది!బతకడానికి జీవించడానికి మధ్య గల తేడాను తేటతెల్లం చేసింది!ఈ తల్లావజ్జల సోదరులందరూ ప్రతిభావంతులే!నాకు శివాజిగారు బాగా తెలుసు!

  6. Kasturi

    The book review is descriptive and analytical. The last paragraph is most thought provoking. Thanks for introducing and reviewing the book and congratulations to R. Vijaya Lakshmi.
    Kasturi.

Leave a Reply to Kasturi Cancel