ముంబై మాఫియా చరిత్ర: Dongri to Dubai

ముంబై – ఒక్కప్పటి బోంబే! – అవకాశాలకు పుట్టినిల్లు. కన్న కలలు సాకారం చేసుకోవడానికి ఇంతకు మించిన నగరం భారతదేశంలో లేదంటారు. స్వాతంత్ర్యానికి పూర్వం నుండి ఎందరెందరినో తన ఒడిలో చేర్చుకొని జీవితాన్నిచ్చిన బొంబాయి, 12 మార్చి 1993న వరుస బాంబు పేలుళ్ళతో కంపించిపోయింది. మతకల్లోలాలు, రాజకీయ గొడవలతో ఎప్పుడూ సతమతమయ్యే నగరం ఆ పేలుళ్ళతో  ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ పేలుళ్ళ వెనుక దావూద్ ఇబ్రహీం కస్కర్ చేయి ఉందని తెలియడానికి అట్టే సమయం పట్టలేదు. కానీ అతడింకా పట్టుపడలేదు, ఈనాటికీ. ప్రపంచంలో “మోస్ట్ వాంటెడ్” జాబితాలో ఉన్న దావూద్ చరిత్రే కాకుండా అసలు ముంబై మాఫియా పుట్టి, పెరిగి, పాతుకుపోయిన తీరును కళ్ళకు కట్టినట్టు రాసిన పుస్తకం “Dongri to Dubai.” రచయిత ఎస్.హుస్సేన్ జైది ప్రముఖ ముంబై క్రైం రిపోర్టర్. ఎన్నో ఏళ్ళ రిసెర్చిని ఆద్యంతం ఆసక్తికరంగా రాశారు.

పుస్తకం “విక్రమ్ చంద్ర” రాసిన ముందుమాటలో “And as much as we like to distance ourselves by pretending that the underworld exists quite literally under us, beneath us, the truth — as Hussain shows — is that we mingle with it every day. The influence of organised crime reaches into the economy, our polity, and everyday life.” అని అంటారు. నిజంగానే, ఎప్పుడో వార్తల్లో ఆ పేర్లూ, వారి నిర్వాకాలూ చదివి ముక్కున వేలేసుకొని పక్కకు తప్పిపోయే నాబోటి వారి కళ్ళు తెరిపించే పుస్తకం ఇది.

మొదలవ్వడమే దావూద్ ఇబ్రహీంతో రచయిత 1997లో నెరిపిన ఇంటర్వ్యూతో పుస్తకం మొదలవ్వుతుంది. దావూద్ మీడియాకు ఇచ్చిన ఆఖరి ఇంటర్వ్యూ అదే! దావూద్ ప్రస్తుతం (అంటే, ఈ పుస్తకం విడుదలయ్యే సమయం, 2012) ఉన్న పరిస్థితులు, అతడి చుట్టూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ పుస్తకం ముగుస్తుంది. ఆరంభానికి, ముగింపుకి మధ్యలో ముంబై మాఫియా చరిత్రనంతా రెండు భాగాల్లో చెప్పుకొస్తారు రచయిత.

మొదటి భాగంలో:

1950, 60లలో ముంబై నగరాన్ని శాసించిన నేరస్థులలో మస్తాన్ హైదర్ మిర్జా (ఓ రెండేళ్ళ క్రితం విడుదలైన Once upon a time in mumbai ఇతడి కథే), వరదరాజన్ ముదలియార్ ( మణిరత్నం ’నాయగన్’ సినిమాలో ’కమల్ హాసన్’ పోషించిన పాత్ర), అబ్దుల్ కరీమ్ లాలా అలియాస్ కరీం లాలా ఇంకా, బాషూ దాదా ప్రముఖంగా చెప్పుకోవాలి. మామూలు వసూళ్ళ నుండి స్మగ్లింగ్ వరకూ నేర కార్యకలాపాలు కొనసాగించారు. వీళ్ళందరి మధ్య నిజాయితీకి మారుపేరైన ముంబై పోలీస్ కానిస్టేబుల్ ఇబ్రహీం కస్కర్. ఇతడి రెండో కొడుకే దావూద్ ఇబ్రహీం కస్కర్. చదువు వంటబట్టని దావూద్, పెడదోవ పట్టాడు. అంతలో అతని తండ్రి ఉద్యోగం కూడా పోవడంతో చదువుకు పూర్తిగా స్వస్తి చెప్పి ఊళ్ళో గొడవల్లో తలదూర్చాడు. ఇంట్లో వారికి తెల్సి వద్దని ఎంత వారించినా వినలేదు. చిన్నాచితకా గొడవలు మొదలకొని అప్పటికే వేళ్ళూనుకుపోయిన డాన్ల మీద దాడులు చేసేంత వరకూ ఎదిగాడు. అతడి ధైర్యసాహసాలను గమనిస్తున్న పోలీసులు నగరంలో పేట్రేగిపోతున్న డాన్ల పనిపట్టడానికి దావూద్‍ను ఉపయోగించుకోవాలనుకుని, ’చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకోకుండా పక్కనుండి మా పని చేసిపెట్టమ’ని దావూద్‍ను అడిగారు. పనిచేయించుకున్నారు. కానీ తమ చేతిలోని ఆయుధం చేయిదాటిపోతుండడం గమనించుకోలేదు. అలా ముంబై పోలీస్ ప్రోత్సాహంతో, తన సొంత శక్తిసామర్థ్యాలతో, తన గాంగ్‍లోని వారి ధైర్యసాహసాలతో అంచెలంచెలుగా ఎదిగిన దావూద్ ఆఖరికి ముంబై పోలీస్‍లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళూ తాగించాడు. తాగిస్తున్నాడు. భారతదేశంలో ఉండడం తనకు క్షేమంకాదని దుబాయ్‍కు పారిపోయాడు.

రెండో భాగంలో:

దుబాయిలో దావూద్ సామ్రాజ్య విస్తరణ, అతడికి అడ్డువచ్చిన వారినందరిని మట్టుపెట్టడం, ప్రతీకారచర్యలు, బాలీవుడ్‍లో అండర్‍వరల్డ్ హంగామా, బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత జరిగిన మారణహోమం, ఆపై జరిగిన బొంబే స్టాక్ ఎక్స్-చేంజ్ పేలుళ్ళూ, దావూద్ లొంగిపోతాననటం, కానీ అతడు పెట్టిన షరతులకు మన ప్రభుత్వం ఒప్పుకోకపోవటం, దావూద్ కరాచికి మకాం మార్చటం, చోటా రాజన్‍కు దావూద్ కు మధ్య చెలరేగిన విద్వేషాలు, ఆ విద్వేషాలను అవకాశంగా అందిపుచ్చుకొని మనవాళ్ళు రాజన్‍కు సహాయసహకారాలు అందించటం, 9/11 తర్వాతి ప్రపంచంలో దావూద్ “మోస్ట్ వాంటెడ్”గా గుర్తించబడడం లాంటి ఎన్నో అంశాలుంటాయి. ఇప్పటికీ ఇంటర్‍పోల్ వారు ఈ డాన్ కోసం ముప్పుతిప్పలు పడ్డం, పట్టుపబడకుండా తన రాజ్యంలో రారాజల్లే వెలుగుతూ ఉన్నాడని, లాడెన్ దొరికిపోయినట్టు ఎనాడో ఓ నాడు దావూద్ కూడా మట్టికరవడం ఖాయమన్న నమ్మకంతో పుస్తకం ముగుస్తుంది.

ఆసక్తికరమైన అంశాలు:

  • అండర్-వరల్డ్ భాషలో వాడే కొన్ని పదాల నేపథ్యం కూడా వివరించారు ఈ పుస్తకం. “సుపారి” అన్న పదం ఎప్పటిది, ఇప్పుడెలా వాడకంలోకి వచ్చింది?, “రామ్‍పూరి” చాకును గురించిన విశేషాలు లాంటివి చెప్పుకొచ్చారు.

  • మందాకిని-దావూద్‍ల గురించి మీడియాలో చేసిన పుకార్లూ, టి-సీరిస్ అధినేత గుల్షన్ కుమార్ దారుణ హత్య, “చోరి చోరి చుప్కే చుప్కే” సినిమాను అండర్ వరల్డ్ వాళ్ళు నిర్మించటం లాంటి అనేక సంఘటనలు వీలైనంత వివరంగా చెప్పుకురావటం, ఆయా సంఘటనల గురించి విని ఉండని వారు కూడా చక్కగా అర్థంచేసుకునే వీలుంది.

  • మనదేశంలో మొట్టమొదటి పోలీస్ ఎన్‍కౌంటర్ విశేషాలను కళ్ళకు కట్టినట్టు చెప్తారు రచయిత. దీన్ని ఆధారంగా చేసుకునే ఇటీవల “Shootout at Wadala” అనే హింది చిత్రం వచ్చింది.

  • దావూద్ లొంగిపోవాలనుకొని రాం జేఠ్మలానికి ఫోన్ చేసి చెప్పటం, దావూద్ పెట్టిన షరతులకు తలొగ్గే సమస్యే లేదని చెప్తూ అతణ్ణి చేయిదాటినిచ్చేసి, ఇప్పుడు పాకిస్థాన్‍ను అడుగుతూ కూర్చున్న మనవాళ్ళను చూస్తే వాళ్ళకున్న చిత్తశుద్ధి ఇట్టే తెల్సిపోతుంది.

కేవలం మాఫియాపైన మాత్రమే ఫోకస్ చేయకుండా వీలైనంత వరకూ వారి ప్రతి చర్యకూ గల నేపథ్యం చెప్పుకురావటం వల్ల ఈ రచన multi-dimensionalగా ఉంటుంది. ఒకవైపునుండే కాకుండా అన్ని వైపులా ఆలోచింపజేస్తుంది.  అక్కడక్కడా కొంత నాటకీయత జతచేసినా అది పఠనీయతను పెంపొందిస్తుందేగానీ వాస్తవానికి దూరంగా జరిగిపోదు. చాలా రిసెర్చి చేసిన పుస్తకం. అటు మాఫియావారితోనూ, ఇటు పోలీసులతోనూ అనేక ఇంటర్వ్యూలు చేసి రాసిన పుస్తకం. 

తీరిక, ఆసక్తి ఉంటే తప్పక చదవాల్సిన పుస్తకం. ఎందుకంటే అండర్ వరల్డ్ అక్కడెక్కడో లేదు. మన చుట్టూనే ఉంది!

మిడ్-డే లో ఈ పుస్తకం పై వచ్చిన రివ్యూ.

You Might Also Like

3 Comments

  1. Jayaprakash Ankam

    Good riview

  2. budugoy

    ఈ పుస్తకం amazon.in లో ఇవాళ(6/14) ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

  3. Nagini

    రివ్యూ చాలా బాగుందండీ..చదవాలనే ఆసక్తి కలుగుతోంది.Thank you..:-)

Leave a Reply